ఇంటర్లో ఎంపీసీ చదివిన అమ్మాయి బీటెక్ చేస్తుందనుకుంటే నాన్న కోసం న్యాయవిద్య అభ్యసించింది. చట్టాలతో ఆడవాళ్లకేం పని అని కొందరు హేళన చేసినా.. పట్టించుకోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది 24 ఏళ్ల బొడ్డు శ్రీవల్లి శైలజ. ఇటీవల ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో నెగ్గి జూనియర్ సివిల్ జడ్జిగా కొలువు సాధించింది ఈ యువతి. శ్రీవల్లి విజయగాథ ఆమె మాటల్లోనే..
మాది మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా. అమ్మానాన్నలిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే. మా నాన్న చదువుకునే రోజుల్లో ఎంతో ఇష్టంతో ఎల్ఎల్బీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రాక్టీస్ చేయలేకపోయారు. నా చిన్నతనంలో ఈ విషయాన్ని ఆయన తరచూ చెబుతూ బాధపడేవారు. తన కోరికను నేను నిజం చేయాలని అనుకునేదాన్ని. నా చదువంతా ప్రైవేట్‌లోనే సాగింది. ఇంటర్లో ఎంపీసీ తీసుకొని మరీ కష్టపడ్డాను. చాలామంది ఎంపీసీ తీసుకుని బీటెక్ వైపు వెళ్లాలని కోరుకుంటారు. కానీ, నా దృష్టంతా నల్లకోటు మీదే ఉండేది. అందుకే ఇంటర్లో మంచి మార్కులు వచ్చినా, ఎంసెట్ రాయలేదు. న్యాయవిద్య అభ్యసించాలని ఫిక్సయ్యాను.
ఇంటర్ తర్వాత లాసెట్ రాశాను. అందులో 107 స్టేట్ ర్యాంక్ వచ్చింది. అలా 2017లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బషీర్‌బాగ్ పీజీ లా కాలేజీలో ఐదేండ్ల ఎల్ఎల్బీలో చేరాను. మొదటి రెండేండ్లు అందరిలాగే చదువుకోవడం, అర్థం కాని విషయాలను ఫ్యాకల్టీని అడిగి తెలుసుకోవడం మాత్రమే చేసేదాన్ని. కోర్సు పూర్తయ్యాక ఏం చేయాలన్న అవగాహన అప్పటికైతే లేదు. కరోనా సమయంలో నా ఫోకస్ అంతా చదువుపైనే కేంద్రీకరించాను. ఇంటి పట్టునే ఉంటూ పుస్తకాలు చదువుతూ అసలు న్యాయవిద్య అంటే ఏంటో అర్థం చేసుకున్నాను. చాలా కసరత్తు తర్వాత లా పూర్తయ్యాక సివిల్ జడ్జి కావాలన్న బలమైన లక్ష్యం ఏర్పడింది.
2022లో లా కోర్సు పూర్తయింది. తర్వాత ఒకవైపు ఎల్ఎల్ఎం చదువుతూనే మరోవైపు తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యాను. నాతో ఎల్ఎల్బీ చేసిన కొందరు మిత్రులు కోచింగ్ తీసుకున్నారు. నేను మాత్రం ఇంటినే నా కోచింగ్ కేంద్రంగా మార్చుకున్నాను. నా ప్రిపరేషన్ కోసం అమ్మానాన్నలే ఫ్యాకల్టీగా మారారు. ప్రతిరోజూ గంటల తరబడి చదివేదాన్ని. చదివిన వాటిని అర్థం చేసుకొని, సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. రోజూ అమ్మతో ప్రశ్నలు అడిగించుకొని సమాధానాలు చెప్పేదాన్ని. ఇలా నా అంతట నేను ప్రిపేర్ అయ్యాను. పట్టుదలతో చదవడం వల్ల, కోచింగ్ లేకుండానే తొలి ప్రయత్నంలో విజయం సాధించగలిగాను.
తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్‌తోపాటు ఏపీ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యాను. ఆ పరీక్ష కూడా రాశాను. ఎల్ఎల్ఎం చివరి రోజు స్నేహితులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఏపీ ఫలితాలు వచ్చాయి. రెండు మార్కుల తేడాతో నేను ఎంపిక కాలేకపోయాను. నా దుఃఖం కట్టలు తెంచుకుంది. స్నేహితులు ఎంత ఓదార్చినా ఏడుపు ఆగలేదు. ఆ ఫలితం ప్రతికూలంగా రావడంతో, తెలంగాణ
రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్‌లో కూడా ఎంపిక కానేమోనన్న అపనమ్మకం ఏర్పడింది. కానీ, 2024 జూన్‌లో ప్రిలిమ్స్ పూర్తి చేశాను. అదే ఏడాది నవంబర్‌లో మెయిన్స్‌లో కూడా ఎంపిక కావడంతో చెప్పలేనంత ఆత్మవిశ్వాసం ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూకు కాస్త భయంగానే వెళ్లాను. కానీ, అక్కడి వాతావరణం నన్ను ప్రోత్సహించింది.
విజయంతో తిరిగి వచ్చాను. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై నాన్న కలను నిజం చేశాను. సమాజంలో ఆడపిల్లలకు చట్టాలు, న్యాయాలతో ఏం పనంటూ కొందరు ఎగతాలి చేస్తుంటారు. అదంతా వారి మూర్ఖత్వంగా నేను భావిస్తా. చట్టం గురించి భారత పౌరులందరికి తెలియాలి. అందుకోసం నా వంతు ప్రయత్నం చేయాలనుకుంటున్నా. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదుగుతూ.. న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించాలన్నది నా లక్ష్యం.
– రాజు పిల్లనగోయిన