మన చిన్నప్పుడు ఎవరైనా ‘పెద్దయ్యాక ఏమైతవ్ బిడ్డ?’ అని అడిగితే డాక్టర్ అనో, ఇంజినీర్ అనో చెప్పి అప్పటికి తప్పించుకునేవాళ్లం. కానీ, ఈ కుర్రాడు మాత్రం కాస్త డిఫరెంట్. నాన్న చెప్పిన బొమ్మలు గీసి, అన్న చేతిలో పెయింటింగ్ బ్రష్ చూసి.. ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు. లక్ష్యం చేరుకోవాలని పట్టుబట్టి ఫైన్ఆర్ట్స్ కోర్సు చేశాడు. శిల్ప కళాకారుడిగా ఎదిగి, ఢిల్లీ స్థాయిలో తన ఘనతను చాటుకున్నాడు డాక్టర్ హోతి బసవరాజు. శిలపై కళలు నిలుపుతూ, లోహాలతో ఊహాతీత విగ్రహాలు చేస్తూ వారెవ్వా అనిపించుకుంటున్న బసవరాజు ‘బతుకమ్మ’తో తన 20 ఏండ్ల శిల్పకళా ప్రస్థానాన్ని పంచుకున్నారు.
మాది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్. నేను శిల్పకళాకారుడిగా రాణిస్తున్నానంటే దానికి కారణం మా నాన్న, మా పెద్దన్న. నాన్న వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆయన పనిచేసే బడిలో అసైన్మెంట్ తాలుకా బొమ్మలన్నీ నా చిన్నతనంలో నాతోనే గీయించేవాడు. ఇక పెద్దన్న పెయింటింగ్ పనిచేసేవాడు. ఆయన గోడమీద రంగురంగుల బొమ్మలు వేస్తున్నప్పుడు కన్నార్పకుండా చూసేవాణ్ని. పొలానికి వెళ్లినప్పుడు పక్షులు, జంతువులను చూసి వాటి బొమ్మలు గీస్తుండేవాణ్ని. అలా నాకు తెలియకుండానే చిన్నప్పుడే ఆర్టిస్ట్ అవతారమెత్తాను. కళాకారుడిగా వినూత్నమైన బొమ్మలు గీయాలనేది నా కోరిక. అయితే, అదెలాగో తెలిసేది కాదు. బడిలో మా సార్లను అడిగితే ఫైన్ ఆర్ట్స్ కోర్సు గురించి చెప్పారు. ఇంటర్ పూర్తికాగానే ఇంట్లోవాళ్లను ఒప్పించి హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నా. అలా ఆర్టిస్ట్‌గా నా ప్రస్థానం మొదలైంది.

ఫైన్ ఆర్ట్స్ కోర్సులో చేరినప్పుడు ఇందులో ఏమేం ఉంటాయో కూడా తెలియదు. గొప్ప ఆర్టిస్ట్‌ను కావాలనే కోరికతో విజయవంతంగా కోర్సు పూర్తి చేశాను. గోల్డ్ మెడల్ కూడా సాధించాను. తర్వాత రెండేండ్లపాటు మైసూర్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. అది చేస్తూనే రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రదర్శనల్లో పాల్గొనేవాణ్ని. నేను చేసిన శిల్పాలను చూసి చాలామంది మెచ్చుకునేవాళ్లు. అలా అవకాశం ఉన్న చోటల్లా వాటిని ప్రదర్శనకు పెట్టేవాణ్ని. ఎక్కడైనా వర్క్‌షాప్‌లు, క్యాంపులు జరిగితే తప్పకుండా హాజరయ్యేవాణ్ని. ఆర్ట్ క్యాంపుల్లో కొత్త శిల్పాలను తయారు చేసేవాణ్ని.
అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న నాకు 2023లో మంచి గుర్తింపు వచ్చింది. 51 కిలోల పసుపుతో ఐదున్నర అడుగుల వినాయకుడి బొమ్మను మూడు రోజుల్లో పూర్తి చేసి విశ్వగురు వరల్డ్ రికార్డు అందుకున్నాను. 2024లో మొదటిసారి జాతీయస్థాయి అవకాశం లభించింది. అమృత్‌సర్‌లో జరిగిన 89వ ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నాను. వ్యవసాయం, పశువుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ నేను రూపొందించిన శిల్పానికి జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన 98వ ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ ప్రదర్శనలో ‘అమ్మ ఒడిలో భూమాత, పందెం గెలిచిన కోడి గర్వాన్ని’ వివరిస్తూ నేను తయారు చేసిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఒకవైపు ప్రదర్శనలు ఇస్తూనే మరోవైపు నా బతుకుదెరువు కోసం పంచలోహాలతో ఇతర శిల్పాలు తయారు చేస్తున్నా. నాకు గుర్తింపు తెచ్చిన విగ్రహాల్లో మొదటిది తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ది. ఆయన కన్నుమూసిన కొన్నాళ్లకు చర్లపల్లి ఇండస్ట్రీ ఏరియా ఉద్యోగులంతా కలిసి ఆ ప్రాంతంలో ఆయన విగ్రహం పెట్టేందుకు నన్ను సంప్రదించగా, సార్ విగ్రహం చేసిచ్చాను. తెలంగాణ ఏర్పాటయ్యాక ట్యాంకుబండ్‌పై నెలకొల్పిన బసవేశ్వరుడి విగ్రహం నేను చేసిందే. ఎప్పుడైనా అటువైపు వెళ్లినప్పుడు కాసేపు ఆగి ఆ విగ్రహాన్ని కండ్లారా చూసుకుంటా. ఆరు నెలల సమయం పట్టే ఆ విగ్రహాన్ని.. నేను నలభై రోజుల్లోనే పూర్తిచేశా. ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లిలో 12 అడుగుల భక్తరామదాసు విగ్రహం, ఆసిఫాబాద్‌లో కొమురం భీమ్ విగ్రహాలతోపాటు చాకలి ఐలమ్మ, శివాజీ, అంబేద్కర్ ఇలా ఎన్నో విగ్రహాలు తయారు చేశాను. శ్రీశైలంలో ఉన్న చెంచు ఆదిలక్ష్మి మ్యూజియం కోసం కొన్ని శిల్పాలు చేశాను.
ఒక ఆర్టిస్ట్‌గా నన్ను నేను కొత్తగా మలుచుకునేందుకు ముందుకుసాగుతుంటా. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు.. కండ్లకు గంతలు కట్టుకొని 57 నిమిషాల్లో మూడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేశాను. మొన్నటి దసరా నాడు కండ్లకు గంతలు కట్టుకొని 59 నిమిషాల్లో కనకదుర్గ అమ్మవారి విగ్రహం తయారు చేశాను. ఆర్టిస్టుగా తొలినాళ్లలో అవుట్డోర్ పనులు చేసేవాణ్ని. ఇప్పుడు ఇంటి దగ్గరే స్టూడియో ఏర్పాటు చేసుకున్నా. పదిమందికి ఉపాధి కల్పిస్తున్నా. నాకు ఇష్టమైన పనిచేస్తూ ఆదాయం కన్నా ఎక్కువ ఆత్మసంతృప్తి పొందుతున్నా. ఈ రంగంలోకి కొత్త తరం రావాలని కోరుకుంటున్నా.
తొమ్మిదో తరగతి చదువుతున్న నా కొడుకు ఇప్పటినుంచే ఈ రంగంపై ఆసక్తి చూపిస్తున్నాడు. నా పనుల్లో వాడు సహకరిస్తుండటం చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. నా భార్య తనకు ఇష్టమైన టీచర్ ఉద్యోగాన్ని వదిలి నా స్టూడియో బాధ్యతలు చూసుకుంటున్నది. ఇలా కుటుంబ సభ్యుల సహకారంతో నా శిల్పకళాయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నా!
– రాజు పిల్లనగోయిన