టార్గెట్… ఆటలో అయినా, జీవితంలో అయినా ఆమె గురి కేవలం దాని మీదే. అనుకున్న లక్ష్యం తప్ప చుట్టుపక్కల వాతావరణాన్ని ఎప్పుడూ ఆమె తలకెక్కించుకోలేదు. అలా చేస్తే రెంటిలోనూ ముందుకెళ్లలేం… అంటూ చిన్న వయసులోనే పెద్ద ఆలోచనతో దూసుకెళ్తున్నది తెలంగాణకు చెందిన పారా షూటర్ బాణోత్ పావని. పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని ఆమె ఎప్పుడూ లెక్కచేయలేదు. ఒక్క చేతితో అయినా సరే ఆమె గన్ పట్టి గురి పెడితే మెడల్ మెళ్లో పడాల్సిందే. మొన్న థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్
2025లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా ‘జిందగీ’ ఆమెను పలకరించింది. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
మనం ఎలా ఎక్కడ పుట్టినా సరే… మనలో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించగలిగి దాని మీద పనిచేయగలిగితే తప్పకుండా ఏదో ఒక రోజు విజయం సాధిస్తాం అని నేను నమ్ముతాను. మనలో ఉన్న లోపాన్ని అధిగమిస్తూ శ్రమించి ఎదగాలన్న తపన ఇందుకు ఉండాలి. అదే నన్ను ఈ షూటింగ్ వైపు నడిపించింది. కొన్ని విజయాలనూ అందించింది. ఆత్మవిశ్వాసమూ ఇక్కడ ముఖ్యమే. నా వరకు నేను మా అమ్మానాన్నల సాయంతో దీన్ని నిర్మించుకున్నాను. అక్కడి నుంచే.. మాది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములు తండా. నాన్న మోహన్, సుతారీ పని చేస్తారు. అమ్మ హిరాని, చేను పనికెళ్తుంది. ఒక తమ్ముడు. నేను ఖమ్మంలో జవహర్ నవోదయ స్కూల్లో ప్లస్ టూ వరకూ చదువుకున్నాను.
అక్కడ పదో తరగతి పూర్తవ్వగానే ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్లు సోషల్ మీడియాలో ఇచ్చిన ఒక ప్రకటన చూశాను. నేషనల్ టాలెంట్ ఐడింటిఫికేషన్ క్యాంప్ పేరిట ఇచ్చిన ప్రకటనలో నాలాగా వైకల్యం ఉన్న వాళ్లలో దాగిన ప్రతిభను గుర్తించి రకరకాల ఆటల్లో శిక్షణ ఇస్తారు. నాకు పుట్టుకతోనే ఎడమచేయి లేదు. కాబట్టి నేను కూడా దానికి దరఖాస్తు చేసుకున్నా. ఫౌండేషన్ వాళ్లు చెప్పిన సమయానికి హైదరాబాద్ వచ్చా.
ఇక్కడ వాళ్లు బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, షాట్‌పుట్, షూటింగ్… ఇలా అన్ని రకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో మనకు పరీక్ష పెడతారు. అంటే మనం ప్రతి ఆటలోనూ పాలుపంచుకోవాలి. అప్పుడు వాళ్లు మనలో సహజసిద్ధంగా ఉన్న టాలెంట్ ఏంటో కనిపెట్టి దాంట్లో శిక్షణనిస్తారు. ఈ ప్రక్రియ వారం రోజులపాటు సాగింది. ఇందులో నేను షూటింగ్ బాగా చేశాను. నిజానికి మొదటిసారి గన్ చప్పుడు విన్నప్పుడు గుండె జల్లుమన్నది. కానీ, నా గురి చాలా బాగుందని అక్కడి శిక్షకులు గుర్తించారు. దీంతో నన్ను ఎయిర్ రైఫిల్ షూటింగ్‌కి ఎంపిక చేశారు.
ఈ షూటింగ్ నేర్చుకోవడం 2023లో స్టార్ట్ చేశా. విజయ్ మోహన్ సింగం సర్… ఇక్కడ సీనియర్ కోచ్ నాకు శిక్షణ ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చి వారం అవ్వగానే ఢిల్లీలో జోనల్ పారా షూటింగ్ పోటీలు వచ్చాయి. నాకు కూడా ఒక అనుభవంగా ఉంటుంది కదా అని వాటిలో పాల్గొన్నా. ఆశ్చర్యంగా అందులో సిల్వర్ మెడల్ వచ్చింది. దాంతో నాలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది. షూటింగ్ చేసేప్పుడు గురి కచ్చితంగా ఉండేందుకు ఒక పద్ధతి ఉంటుంది. సార్ చెప్పినప్పుడు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నా. ఏకాగ్రత తెచ్చుకోవడం కూడా ముఖ్యమే. ఒక్కసారి అది కుదిరిందంటే ఇక లక్ష్యం తగిలినట్టే.
తర్వాత నేషనల్స్‌లో జూనియర్స్ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించాను. నిజానికి మొదట్లో ఈ ఆటల్లోకి వెళ్లినప్పుడు చదువు పక్కకు పోతుందని మా అమ్మానాన్నా వద్దన్నారు. కానీ చదువుకుంటూనే ఇందులోనూ రాణించగలననీ, అందరికీ నేనొక ఉదాహరణగా ఉండాలి అనుకుంటున్నాననీ చెప్పి వాళ్లని ఒప్పించా. మా నవోదయ వాళ్లు కూడా నన్ను ప్రోత్సహించారు. ప్లస్ టూలో కేవలం పరీక్షలకే అక్కడికి వెళ్లా. ఇటు ఫౌండేషన్ వాళ్లు కూడా నా ప్రతి అవసరాన్నీ చూసుకుంటూ, ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు.
ఇప్పటికి రెండున్నరేండ్లుగా షూటింగ్ సాధన చేస్తున్నా. ప్రపంచ స్థాయిలో… వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్స్ 2024 పోటీలు ఢిల్లీలో జరిగాయి. అందులోనూ పతకం కొట్టా. ఖేలో ఇండియా 2025లోనూ కాంస్యం సొంతం చేసుకున్నా. ఇప్పుడు వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్ గేమ్స్‌లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. మొదటిసారి వరల్డ్ షూటింగ్ పోటీల్లో ఢిల్లీలో మెడల్ తీసుకుని నేను ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న కళ్లలో చాలా ఆనందం చూశా. కాస్త గర్వం కూడా కనిపించింది.
అదెప్పుడూ నాకు ప్రోత్సాహాన్నిస్తూనే ఉంటుంది. నా స్ఫూర్తి ఏంటి అని అడిగినా… ఆ రోజు నేను చూసిన వెలుగే అని చెబుతా. చేయి లేదని నన్ను చాలా మంది జాలిగా చూసేవాళ్లు. కానీ మా అమ్మానాన్నా మాత్రం ఎప్పుడూ నాకు దన్నుగా ఉన్నారు. వాళ్లను సంతోషపెట్టడం కన్నా పెద్ద ఆనందం ఏముంటుంది. ఇక్కడ, మరో విషయం చెప్పాలి. నేను ప్రపంచ స్థాయి పోటీలకు వెళ్లినప్పుడు రెండు కాళ్లు, రెండు చేతులూ లేని ఆమె షూటింగ్లో పాల్గొనడం చూశా. నోటితో ట్రిగ్గర్ వదులుతున్నది. అప్పుడనుకున్నా, నేను ఇంకెంత ధైర్యంగా ఉండాలి అని.

ఆట పరంగా నా లక్ష్యాలు ఏమిటి అని అడిగితే ఒలింపిక్స్‌లో ఆడి దేశానికి పతకాన్ని తీసుకురావడం అని చెబుతా. దాని కోసమే మరింత కష్టపడుతున్నా. ఇక, వ్యక్తిగతంగా అయితే డాక్టర్ కావాలన్న ఆశ ఉండేది. నీట్ పరీక్ష కూడా రాశాను. కానీ రాలేదు. దాని ప్రిపరేషన్‌కి చాలా సమయం కేటాయించాలి. ఆటకు కూడా సమయం అవసరం. అందుకే ప్రస్తుతం డిగ్రీలో చేరా. బేగంపేట్‌లోని గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నా. దీని తర్వాత సివిల్ సర్వీసెస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నా. ఎందుకంటే నేను డాక్టర్ అవ్వాలనుకున్నది పేదల కోసమే.
పాపం… అత్యవసర సమయంలో వైద్యం కోసం ఇబ్బంది పడ్డ చాలా మందిని నేను చూశా. వాళ్లకు సాయం చేయాలనే ఇంటర్లో బైపీసీ తీసుకున్నా. కానీ, నా దారి కొంచెం మళ్లింది. కాబట్టి, దానికి సరిపోయేలా సేవ చేసే మరో మార్గం ఎంచుకున్నా. మా నాన్న సుతారీ పని చేసేటప్పుడు గంటల కొద్దీ నిలబడి ఆ పనిచేయాలి. నాకు చాలా బాధయ్యే విషయం అది. అందుకే, నేను మంచి స్థాయికి వచ్చాక వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటా. ఆడపిల్లనైనా సరే వాళ్లిచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోను.
షూటింగ్ విషయంలో ఎన్ని గంటల సాధన చేశామన్న దానికన్నా ఎంత ఏకాగ్రతతో చేశామన్నదానిమీదే శ్రద్ధ పెడతా. దివ్యాంగులం కదా… ముందుకెళ్లలేమేమో అని ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు. నా వరకూ ఆత్మవిశ్వాసం అన్నిటికన్నా ముఖ్యం. అలాగే ఏమన్నా చేయాలనుకుంటే ఆలోచించకుండా ముందుకెళ్లాలి. పనిలో షార్ట్ కట్స్ చూడొద్దు. అలా చేస్తే కొన్నే తెలుస్తాయి. అసలైన సమస్య వచ్చినప్పుడు మనం ఎదుర్కోలేం. ఏదైనా నేర్చుకునేప్పుడు సమయం పట్టినా సరే, పద్ధతి ప్రకారం వెళ్లడమే మంచిది.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి