‘గ్లోబల్ వార్మింగ్’కు ప్రపంచం భయపడుతున్నది. ఏ దేశాధినేతా.. దారి చూపని ఈ సమస్యకు తెలంగాణ ముద్దు బిడ్డ బడే శ్రీవిద్య కొత్త దారి చూపుతా నంటున్నది! అపాయాన్ని తప్పించేందుకు ఆమె చెప్పిన ఉపాయాన్ని ఐక్యరాజ్యసమితి మెచ్చింది. జీవశాస్త్ర విజ్ఞానం, మెకానికల్ ఇంజినీరింగ్ నైపుణ్యంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నది ఆమె ఆలోచన. అవార్డులు, స్కాలర్షిప్లు గెలిచిన ఆ ఆలోచన సాకారం చేసే ఆవిష్కరణ కోసం అడుగు ముందుకేసింది. దళిత కుటుంబంలో జన్మించిన ఈ పరిశోధకురాలిని మనవాళ్లు వద్దు పొమ్మన్నారు. అమెరికా వాళ్లు రారమ్మన్నారు. ఆ పిలుపును అందుకునేంత లక్ష్మీ కటాక్షం ఈ చదువులతల్లికి లేదు. నలుగురు సాయం చేస్తే పెద్ద ఆవిష్కరణ చేస్తానంటున్న సావిత్రీబాయి పూలే వారసురాలు బడె శ్రీవిద్య ప్రయాణమిది.
అమెరికాలో అవార్డుల పంట పండించిన శ్రీవిద్యది సికింద్రాబాద్‌లోని నేరెడ్మెట్. చదువుల్లో టాప్. తల్లి చదువు కోసం అమెరికా వెళ్లిన ఈ అమ్మాయి.. అక్కడ అద్భుతాలే చేసింది. శ్రీవిద్య తల్లిపేరు నమిత. బడి నుంచి వచ్చిన తన బిడ్డ పద్ధతిగా హోమ్‌వర్క్ చేసుకుంటుంటే, శ్రద్ధగా చదువుకుంటుంటే.. చూసి ముచ్చటపడేది. పెండ్లి, పిల్లల వల్ల నమిత చదువు మధ్యలోనే ఆగిపోయింది. బుద్ధిగా చదువుకుంటున్న కూతురుని చూసి తనకూ చదువుకునే అవకాశం వస్తే బాగుండు అనుకునేది నమిత. భార్య అంతరంగం గ్రహించాడు భర్త వినోద్. తాను అండగా ఉంటానన్నాడు. అమెరికాలో కమ్యూనిటీ హెల్త్‌లో మాస్టర్స్ చదివేందుకు దరఖాస్తు చేసుకుంది. మాస్టర్స్ ఇన్ కమ్యూనిటీ ప్లానింగ్ చదివేందుకు అమెరికాలో ఓ యూనివర్సిటీలో సీటొచ్చింది. భార్యను చదివించేందుకు ఆమెతోపాటు ఆయనా ఉద్యోగానికి సెలవుపెట్టి అమెరికా వెళ్లాడు. వెంట కూతురినీ తీసుకెళ్లారు.
పదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివిన శ్రీవిద్య డిపెండెంట్ వీసా మీద తల్లితో అమెరికా చేరింది. అక్కడ హైస్కూల్ డిప్లొమా (11, 12 తరగతులు)లో చేరింది. ఏక కాలంలో రెండు డిప్లొమా కోర్సులు చదివింది. ఈ కాలంలోనే సిన్సినాటీ నగరంలోని జంతు ప్రదర్శనశాలలో ఉన్న జూ అకాడమీలో అంతరించే జాతుల సంరక్షణపై అధ్యయనం చేసింది. ల్యాబ్‌లో పరిశోధనలు చేసేందుకు అనుమతులు సాధించింది. ఏడాదిలోనే జూ అకాడమీలో 450 పరిశోధనా గంటలు పూర్తి చేసిది ‘ఔరా!’ అనిపించుకుంది. ఇలాంటి ఘనత చాలా తక్కువమందికే దక్కుతుంది! శ్రీవిద్య చిన్న వయసులోనే ఈ రికార్డు సాధించింది.
అమెరికా విద్యలో కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్ తప్పనిసరి. ఆ ప్రోగ్రామ్‌లో చేరి, వలంటీర్‌గా పనిచేసింది శ్రీవిద్య. మెంటల్ సిక్నెస్ ఉన్న పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, బెస్ట్ వలంటీర్ అవార్డ్ గెలుచుకుంది. అమెరికా స్కూళ్లలో చెప్పిన పాఠ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. చాలా సెమినార్లలో పవర్ పాయింట్ ప్రజెంట్ చేసి ‘గుడ్ ఒరేటర్’ అనిపించుకుంది. ఒహాయో నావల్ అకాడమీ సైన్స్ ఫెయిర్‌లో బహుమతి గెలుచుకుంది. అక్కడి నేషనల్ సైన్స్ ఫెయిర్‌లోనూ తన ప్రతిభను చాటింది. ఎక్కడ పోటీ జరిగినా శ్రీవిద్య పాల్గొనేది. బహుమతి గెలుచుకునేది. అలా 52 అవార్డులు, ఇంటర్నేషనల్ ఔట్రీచ్ పురస్కారాలు సాధించింది. చదువు, పరిశోధన, కమ్యూనిటీ సర్వీస్ ఇలా ఏది చేసినా బెస్ట్ అనిపించుకున్న శ్రీవిద్య పరిశోధనపై దృష్టి పెట్టింది.
కనీసం సైంటిఫిక్ కాలిక్యులేటర్ లేకుండా పరిశోధన మొదలుపెట్టాను. సొంత ల్యాప్‌టాప్ లేకుండానే ఎన్నో వేదికలపై పేపర్ ప్రజెంటేషన్ చేశాను. పరిశోధనకు ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది. తెలంగాణ ప్రభుత్వం, దాతలు సాయం చేస్తే నా పరిశోధన ఫలవంతం అవుతుంది. ఫలితంగా కాలుష్యం నుంచి ఈ నేలతల్లిని కాపాడొచ్చు. సాయం చేయదలచిన వారు 99086 02695 (వాట్సాప్), +1 513 835 1431 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి.
ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే ఇంటర్నేషనల్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్ (యు.ఐ.ఎస్.డి.ఎన్) సంస్థ అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన పరిశోధనా పత్రాలు సమర్పించాలని పరిశోధక విద్యార్థులను కోరింది. చదివేది పాఠశాల విద్యే అయినా రీసెర్చ్ స్కాలర్స్‌తో పోటీపడుతూ శ్రీవిద్య కూడా తన ఆలోచనలతో పరిశోధనా పత్రం సమర్పించింది. ఈ విద్యార్థిని ఆలోచనలు యు.ఐ.ఎస్.డి.ఎన్కి, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్ జెఫ్రీ చాచెస్కి బాగా నచ్చాయి. కొలంబియా యూనివర్సిటీలో యు.ఐ.ఎస్.డి.ఎన్. నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణకు ఆమెను ఆయన ఎంపిక చేశారు.
‘నానో ఎన్హాన్స్డ్ బయోలూబ్రికెంట్స్’ అనే పత్ర సమర్పణలో సాధికారికంగా ప్రసంగించింది శ్రీవిద్య. యంత్రాల పనితీరు మెరుగుపరిచి, పర్యావరణానికి ఎలా మేలు చేయొచ్చో వివరించింది. కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించింది. ఆ గ్లోబల్ వేదికపై శ్రీవిద్య అంత చిన్న వయసులో పేపర్ ప్రజెంట్ చేసిన వాళ్లు లేరట! తన హైస్కూల్ గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీవిద్య తల్లి నమిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఏడాదిన్నర కిందట ముగ్గురూ మళ్లీ ఇండియాకు వచ్చేశారు.
నమిత ఇప్పుడు పీహెచ్డీ చేయాలనుకుంటున్నది. శ్రీవిద్య కూడా తన పరిశోధనలు కొనసాగించాలన్న భావనలో ఉంది. తన ప్రాజెక్ట్‌కి నిధుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకోసం ల్యాబ్ కావాలి. పరిశోధన సంస్థలో గానీ, యూనివర్సిటీలో గానీ ల్యాబ్ సౌకర్యం ఉంటుంది. అందుకే, వాటి తలుపు తట్టాలనే తలంపుతో ఉన్నది. మనదేశంలో ఏదైనా అవకాశం రాకపోతుందా అని ఆలోచించింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (గచ్చిబౌలి)కి వెళ్లింది.
అమెరికాలో తను చేసిన పరిశోధన, పేపర్ ప్రజెంటేషన్, వాటికి వచ్చిన ప్రశంసల గురించి అక్కడి అధికారులకు చెప్పింది. తనకేదైనా ప్రాజెక్టు ఇస్తారనీ, కొంత బడ్జెట్ వస్తుందని ఆశపడింది. కాలుష్య నియంత్రణపై శ్రీవిద్య చెప్పిన ఉపాయాలకు ఐక్యరాజ్యసమితి అభినందనలు దక్కాయి. కానీ, ఇక్కడ మాత్రం తిరస్కారమే ఎదురైందని శ్రీవిద్య వాపోయింది. ‘మా దగ్గర డబ్బుల్లేవ్.. ప్రాజెక్ట్‌లు లేవు. అసలు హైదరాబాద్‌లో కాలుష్యమే లేదు’ అని ఓ అధికారి అన్నారట. ఆ మాటలతో ఇక ఇక్కడేమీ చేయలేమని మళ్లీ అమెరికా ప్రయాణానికి సిద్ధమవ్వాలనుకుంది.
తన ఆలోచనలు ఆచరణలోకి తెచ్చేందుకు అండర్ గ్రాడ్యుయేషన్‌లో ఇంజినీరింగ్ చదవాలనుకుంది శ్రీవిద్య. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో అండర్ గ్రాడ్యుయేషన్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ విత్ సస్టెయినబిలిటీ చదివేందుకు దరఖాస్తు చేసింది. అప్పటికే అమెరికాలో అతి చిన్న వయసులో ఇంజినీరింగ్ చదివిన డార్విన్ టీ టర్నర్ పేరిట ఏర్పాటు చేసిన స్కాలర్షిప్కి ఎంపికైంది. ఈ స్కాలర్షిప్ అందుకున్న తొలి భారతీయురాలు శ్రీవిద్యేనట. ఇంటర్నేషనల్ ఔట్ రీచ్ అవార్దులు పద్దెనిమిది గెలుచుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. తానేదో సాధించాలనుకుంటుంది. మనమూ ఓ అవకాశం ఇద్దామనుకుని సిన్సినాటీ యూనివర్సిటీ అడ్మిషన్ ఇచ్చింది. దానితోపాటే ‘గ్రేటర్ సిన్సినాటీ ఆఫ్రికన్-అమెరికన్ స్కాలర్షిప్ ఫౌండేషన్ అవార్డ్’ కూడా వచ్చింది.
తన కలలు సాకారం చేసుకునేందుకు శ్రీవిద్య మరోసారి అమెరికాలో విద్యాభ్యాసానికి సన్నద్ధం అవుతున్నది. యూనివర్సిటీ స్కాలర్షిప్ కింద కోటి రూపాయల వరకు ఆమెకు రానున్నాయి. కానీ, తన పరిశోధన, ఐదేండ్ల చదువుకు రూ.కోటిన్నరకు పైగా ఖర్చు అయ్యేలా ఉన్నాయి. తన పరిశోధనలు నిర్విఘ్నంగా కొనసాగాలంటే.. నిధులు సమీకరించడం చాలా అవసరం. ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్లో క్లర్క్‌గా చేసిన శ్రీవిద్య తండ్రి వినోద్ పదోన్నతి పొంది అదే శాఖలో ఇప్పుడు అధికారిగా ఉన్నాడు. కానీ, తల్లీబిడ్డల చదువు కోసం రెండేండ్లు సెలవు (లాస్ ఆఫ్ పే)లో ఉన్నాడు. వాళ్ల చదువుల కోసం ఇల్లు తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఇన్నాళ్లూ నడిపించాడు.
ప్రస్తుతం రెండేండ్లు లాస్ ఆఫ్ పేలో ఉన్న కారణంగా వినోద్‌కు బ్యాంకు లోన్ కూడా దొరికే అవకాశాలు లేకుండా పోయాయి. తన కూతురి కల నెరవేర్చలేక పోతున్నానే అని ఆ తండ్రి ఆవేదన. దాతలు సహకరిస్తే.. ఐక్యరాజ్య సమితి మెచ్చిన ఆలోచనే కాదు ప్రపంచాన్ని కాపాడే ఆచరణకు దారులేస్తానంటున్నది శ్రీవిద్య. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు ప్రపంచ స్థాయి వేదికలపై తన ఆలోచనలను పంచుకున్న శ్రీవిద్య అనుకున్న లక్ష్యం సాధిస్తే.. తెలంగాణకే కాదు భారతదేశానికీ గర్వ కారణమే!
– నాగవర్ధన్ రాయల