Gandhi Nadikudikar | సినిమా ఇండస్ట్రీలో వెలిగిపోవాలంటే కలలు కంటే సరిపోదు. చీకట్లను దాటే నేర్పూ, కష్టాలకు తట్టుకునే ఓర్పుండాలి. అన్నప్రాశన నాడే ఆకలి బాధ తెలిసిన పాలమూరు బిడ్డకు ఈ గుణాలు జన్మతః వస్తాయేమో! ఆ మట్టి నేర్పిన మొండితనంతోనే హైదరాబాద్‌కు వలసొచ్చాడు గాంధీ నడికుడికార్. అన్నపూర్ణ స్టూడియో ముందు ఆకలి రాత్రులెన్నో గడిపాడు. కూలీగా పనిచేశాడు. సెట్ బాయ్‌గా కృషిచేశాడు. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా అవకాశాలు చేజిక్కించుకున్నాడు. వెండి తెరపై ‘ఆర్ట్ డైరెక్టర్… గాంధీ నడికుడికార్’గా ఎందరికో సుపరిచితుడయ్యాడు. ఆకలి రాజ్యంలో పుట్టి, పదిమంది ఆకలి తీరుస్తున్న గాంధీ ప్రస్థానం ఆయన మాటల్లో..
నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు మా నాయిన పోయారు. ఆర్ఎంపీ డాక్టరుగా పనిచేసిన మా నాయిన పెద్దగా సంపాదించలే. మా అమ్మ నన్ను చదివించలేకపోయింది. నాగర్ కర్నూల్ మా ఊరు. చదివించడం కోసం అదే ఊరిల ఉన్న బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్ల చేర్పిచ్చింది. నేను, తమ్ముడు హాస్టల్ల ఉండుకుంట జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ల చదివినం. నాకు సినిమాలంటె ఇష్టం. చిన్నప్పుడు నాగర్‌కర్నూల్ థియేటర్లకు వచ్చిన సినిమలన్నీ చూసేటోణ్ని. టికెట్ పైసలు మా పెద్దమ్మను అడుగుతుంటి. ఆమె కల్లు కాంపౌండ్ దగ్గర బజ్జీలు అమ్ముతుండేది. పెద్దమ్మకు పనిలో సాయపడేటోణ్ని. అడిగినప్పుడల్లా కాదనకుండ సినిమాకు డబ్బులిచ్చేది. నేను చిరంజీవి అభిమానిని. ఆయన సినిమాలకు బ్యానర్లు కట్టేటోడిని. పాటలకు డ్యాన్స్లేసేటోడిని. పెద్దయినంక సిన్మాలల్ల ఏదో ఒక పని చేయాలనుకునేటోణ్ని.
ముప్పై ఏండ్ల కింద.. పదో తరగతి పాసైన. ఇంటర్మీడియెట్ చదువుదామని ఉన్నా.. పైసల్లేవు! మా పాలమూరోళ్లందరి లెక్కనే వలసబాట పట్టిన. హైదరాబాద్ వచ్చిన. అన్నపూర్ణ స్టూడియోకు చేరిన. ‘సినిమాలో ఏదో ఒక పని దొరుకుతుందిలే’ అన్న ఆశతో స్టూడియో గేట్ ముందే నిలవడ్డ. వచ్చేటోళ్లు.. పోయేటోళ్లతో సంతలా అనిపించింది. ఎవరైనా ఆగితే ఏదైనా మాట్లాడుదం అనుకున్న! పొద్దుగుంకే దాకా ఎవరూ పట్టించుకోలే! స్టూడియో దగ్గర్ల ఓ చేతి పంపు ఉంది. ఆడ్నే నీళ్లు తాగి కడుపు నింపుకొన్న.
స్టూడియో గేటు ఎదురుంగనే ఇసుకల పండుకున్న. తెల్లారింది. మల్ల వచ్చేటోళ్లు వస్తున్నరు. పోయేటోళ్లు పోతున్నరు. నన్నెవరూ పట్టించుకోలే! పొద్దెక్కుతుందనగా.. ఒకాయన నన్ను జూసి ‘పని ఉంది. సెట్ బాయ్‌గా పనిచేస్తావా?’ అన్నడు. ఎమ్మటే.. అన్నపూర్ణ స్టూడియోల అడుగుపెట్టిన. థర్డ్ ఫ్లోర్ మొత్తం శుభ్రం చేయమన్నడు. ఆ పని అయ్యే సరికి రాత్రి తొమ్మిదైంది. యాభై రూపాయలు ఇచ్చిండు. అదే నా మొదటి సంపాదన. ఒళ్లంత దుమ్ము.
చేతి పంపు దగ్గరికి పోయిన. ఆడనే స్నానం చేశిన. కవర్ల ఇంకో జత అంగీ, ప్యాంట్ ఉంది. అయి తొడుక్కొని, ఇడిసినయి ఉతుక్కున్న. తెల్లారినంక లేచి ఆ బట్టలు.. అన్నపూర్ణ స్టూడియో గేటు ముందు టీ కొట్టుకి, ప్రహరీ గోడకు మధ్య సందుల దూర్చిన. మల్లా స్టూడియో గేటు ముందు పనికోసం నిలవడ్డ. అప్పట్ల తెలిసినోళ్లనే పనిల పెట్టుకునేది. ముక్కు ముఖం తెలియనోళ్లకు చాన్స్ ఇయ్యకపోతుండె. వస్తనన్న వాళ్లు పనిల చేరకపోతె ఆ చాన్స్ ఇస్తుండె.
పని దొరికితే కడుపునిండేది. దొరకని రోజు పస్తే! ఒక్కోసారి పనిచేసినా.. పైసలు ఇయ్యకపోయేది. రాత్రీ పగలు గొడ్డు చాకిరీ చేయించుకొని మోసం చేసిన వాళ్లను ఏమీ చేయలేం. గట్టిగ అడిగితే మల్లా పని ఇయ్యరని భయం. ఇట్ల ఎన్నిసార్లు మోసపోయిన్నో! అన్నపూర్ణ స్టూడియో దగ్గర్ల ఇసుక డంప్ చేసేటోళ్లు. రాత్రిపూట ఆ ఇసుక కుప్పలే నాకు పరుపు. వాటిమీద హాయిగా పడుకునేది. ఎట్లనైన సినిమాల్లో చేరాలన్న దాంతోని ఆడనే ఉండేటోన్ని. ఇట్ల ఆరు నెలలు గడిచినయి. స్టూడియో కాడ ఇంకో ముగ్గురు దోస్తులయిన్రు. ఆ నలుగురం కలిసి ఒక రూమ్ కిరాయికి తీసుకున్నం.
పిలగాళ్లు బాగా పని చేస్తరనే పేరొచ్చింది. పని కూడా మంచిగనే దొరుకుతుండె. రోజులు ఇలా సాగుతుండగా ‘అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకుంటే మీకు న్యాయం జరుగుతుంది. పేమెంట్ ఎక్కువ ఇస్తారు’ అని ఒక పెద్దాయన చెప్పిండు. సభ్యత్వం లేకపోతే యాభై రూపాయల కూలి. సభ్యులకు నూట పదిహేను రూపాయల కూలి. కొంత అప్పు జేసి యాభై వేలు కట్టి సభ్యత్వం తీసుకున్న. నాలుగేళ్లకు సెట్ అసిస్టెంట్ అసోసియేషన్ల చేరిన. గుర్తింపు వచ్చింది. ఆదాయం పెరిగింది.
అనుకోకుండ ఆర్ట్ డిపార్ట్మెంట్లోకి అచ్చిన. చిన్నప్పటి నుంచి బొమ్మలు మస్తు గీస్తుండె. అది నాకు కలిసొచ్చింది. ఆర్ట్ డైరెక్టర్లు తోట తరణి, జేకే మూర్తి, నాగేంద్రప్రసాద్, ఆనంద్ సాయి దగ్గర పనిచేశిన. వాళ్ల దగ్గర చేతి నిండా పని దొరికింది. అదే టైమ్‌ల ఆర్ట్ డైరెక్టర్ భూపేశ్ కలిసిండు. ఆయన దగ్గరా పనిచేశిన. ఆయన బాగా చదువుకున్నోడు. మంచోడు. ఆయన ఓసారి ‘బ్రదర్! నీ స్కిల్ గమనించిన. అంతా బాగుంది. కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఇంగ్లిష్ వస్తేనే ఫ్యూచర్ ఉంటుంద’ని చెప్పిండు. నేర్చుకోనికి తీరిక ఎక్కడిది? యూట్యూబ్‌ల వింటూ నేర్చకోవచ్చని ఆయనే చెప్పిండు. ‘కంప్యూటర్ ఇట్ల ఓపెన్ చేయాలి. ఇది గూగుల్. ఇది యూట్యూబ్’ అని చూపించిండు. ఇట్ల నేర్చుకోవాలని చెప్పిండు.
ఇంతల్నె రామోజీ ఫిల్మ్ సిటీల ఒక యాడ్ ఫిల్మ్‌కి సెట్ వేసే పనొకటి వచ్చింది. ఇద్దరికి కలిపి లక్ష రూపాయలు ఇచ్చిన్రు. భూపేశ్ గారు ఆ డబ్బులు నాకిచ్చి ‘వీటితో కంప్యూటర్ కొనుక్కో’ అన్నడు. ల్యాప్‌టాప్ కొన్న. ఆ టైమ్లనే శేఖర్ కమ్ముల, నగేశ్ కుకునూర్, రవిబాబు సినిమాలకు పనిచేశిన. వీళ్ల దగ్గర పనిచేస్తుంటే ఇంగ్లిష్ స్కూల్ల ఉన్నట్టు ఉండేది. ఇంగ్లిష్ అబ్బినంక ఆర్ట్ అసిస్టెంట్ పరీక్ష రాసి, పాసైన. తర్వాత తోట తరణి, ఆనంద్ సాయి, రవీందర్ లాంటి పెద్ద ఆర్ట్ డైరక్టర్ల దగ్గర పనిచేశిన. అరవై సినిమాల దాంక ఆర్ట్ అసిస్టెంట్ వర్క్ చేశి, నన్ను నేను మార్చుకున్న!
తమిళ సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ పరిచయం అయిండు. తన దర్శకత్వంలో ‘సెవెన్’ సినిమా కోసం నన్ను ఆర్ట్ డైరెక్టర్‌గా పెట్టుకున్నడు. ఆ సినిమాకు చేస్తున్నప్పుడె ‘జార్జి రెడ్డి’ సినిమా చాన్స్ వచ్చింది. ఈ సినిమా కథా నేపథ్యం ఉస్మానియా యూనివర్సిటీ.
అల్యూమినియం ఫ్యాక్టరీల ఆర్ట్స్ కాలేజ్ సెట్ వేశినం. అనుకోకుండ రాజమౌళి గారు అక్కడికి వచ్చిండు. పీవోపీ, ఫైబర్ వాడకుండ థర్మకోల్‌తో ఆర్ట్స్ కాలేజ్ సెట్ వేశినం. ‘ఇట్ల చేయొచ్చా?’ అని ఆయన ఆశ్చర్యపోయిండు. ‘బడ్జెట్ తక్కువ ఉన్నది సార్. దానికి తగ్గట్టు ఇట్ల ఎక్స్‌పెర్‌మెంట్ చేశిన’ అని చెబితే.. మెచ్చుకున్నడు. ‘జార్జి రెడ్డి’ విడుదల అయినంక ప్రొడ్యూసర్ సురేశ్ బాబు గారు ఫోన్ చేసిన్రు.
‘నారప్ప’ సినిమా కోసం చేయమన్నడు. వెంకటేశ్ లాంటి పెద్ద హీరో సినిమా కోసం చేసే చాన్స్ తొందర్నే వచ్చింది. ఆ సినిమా మొత్తం సెట్స్‌లోనే షూట్ చేశిన్రు. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత రాక్షసుడు, కిలాడీ, కోటబొమ్మాళి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా చేశిన. కల్యాణ్ రామ్ హీరోగా చేశిన పీరియాడిక్ సినిమా ‘డెవిల్’లో చాన్స్ వచ్చింది. ఇది స్వాతంత్య్రోద్యమ కాలం నాటిది. దానికి తగ్గట్టుగా సెట్స్ వేశినం. మంచి పేరొచ్చింది. ప్రొడక్షన్ డిజైనర్‌గా ఆ సినిమా నా పేరు నిలబెట్టింది. తర్వాత భజే వాయువేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డార్లింగ్ సినిమాలకు చేశిన. ప్రస్తుతం ‘ఎస్వైజీ’ మూవీ కోసం పనిచేస్తున్న. నా ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలైంది. సినిమాల్లోకి రావాలన్న నా కల నిజమైంది. మరిన్ని మంచి సినిమాలు చేశి.. నలుగురూ గుర్తుంచుకునే స్థాయికి చేరాలన్నదే నా సంకల్పం.
సెట్ బాయ్‌గా, సెట్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పుడు మా పక్కనే నాలాగే బతుకుదెరువుని వెదుక్కుంటూ వచ్చిన ఓ కుటుంబం ఉండేది. వాళ్లది గుంటూరు. ఆ ఇంట్లో పద్మ అనే అమ్మాయి ఇంటర్ చదివుతున్నది. ఆమెకూ నాన్న లేడు. వాళ్లమ్మ ఇళ్లల్లో పని మనిషిగా చేసేది. వాళ్ల మామయ్య సినిమా ఇండస్ట్రీల క్రేన్ ఆపరేటర్. మా పేదరికం, కష్టాలు మమ్మల్ని దగ్గర చేసినయ్. కులాలు వేరైనా ప్రేమ గొప్పదనుకుని ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలనుకున్నా. మా రెండు కుటుంబాలు ఒప్పుకొన్నయి. పల్లె నుంచి వచ్చిన నాకు పచ్చగా ఉండే మధురా నగర్ అంటే ఎంతో ఇష్టం. ఆ కాలనీలో ఉండాలని కోరిక. ఆర్ట్ డైరెక్టర్ అయినంక ఒక ఫ్లాట్ కొనుక్కున్న. మా అమ్మ, నేను, పిల్లలు అందరం సంతోషంగా ఉన్నం. సినిమా కథల్లో ఎంతోమంది కష్టపడి పేదరికాన్ని గెలిచినట్టే నేనూ ఆకలిని జయించిన.
– నాగవర్ధన్ రాయల