రైజింగ్ పంచ్‌లతో వాళ్ల ఉదయం మొదలవుతుంది. సైడ్ స్నాప్ కిక్‌తో రాత్రి పూర్తవుతుంది. అక్క వర్టికల్ పంచ్‌తో అదరగొడితే.. చెల్లి ఎల్బో స్ట్రయిక్‌తో ఎదుర్కొంటుంది. అడ్డాల నాడే ఆ బిడ్డలు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌లో ఆరితేరారు. ఎదిగే కొద్దీ.. విలక్షణ విన్యాసాలు చేస్తూ పిన్నవయసులోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. అక్కడితో ఆగిపోలేదు, జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో తమ పవర్ చూపించి పతకాలు గెలుచుకున్నారు. కిక్ ఇచ్చిన కాళ్లకే గజ్జెలు కట్టి.. సిరిసిరి మువ్వలు అనిపించుకున్నారు. చదువుల్లోనూ టాప్‌గా దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండేండ్లకు ఒకసారి నయా రికార్డులు నెలకొల్పుతున్న కరాటే క్వీన్స్ అమృత, ఘన సంతోషిణి పరిచయం ఇది.
డాక్టర్ జీఎస్ గోపాల్ రెడ్డి కరాటే మాస్టర్. హైదరాబాద్‌లోని నారాయణగూడలో జీవీఆర్ కరాటే అకాడమీలో ఔత్సాహిక క్రీడాకారులకు 32 ఏళ్ల నుంచి కరాటే నేర్పిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు. పొద్దునే లేచి కరాటే నేర్పేందుకు బయల్దేరే మాస్టారు చిటికెన వేళ్లు పట్టకుని ఆ అమ్మాయిలు మేమొస్తామంటూ మారాం చేసేవాళ్లు. ఇంటిపక్కనే కదా.. కాదనకుండా వాళ్లనూ అకాడమీకి తీసుకువెళ్లేవాడు. అక్కలు, అన్నలు ‘హు.. హా’ అంటూ బలమైన కిక్‌లు విసురుతుంటే… వాళ్లను చూస్తూ లేలేత చేతులు ఆడిస్తూ ఇద్దరూ సాధన చేయడం మొదలుపెట్టారు.
పెద్దమ్మాయి అమృత రెండేళ్ల వయసు నుంచి కరాటే నేర్చుకోవడం మొదలుపెట్టింది. నాలుగు ఏళ్లు వచ్చేసరికి టోర్నమెంట్స్‌లో పాల్గొనే స్థాయిలో పట్టు సాధించింది. అమృతకు అయిదేళ్లు ఉన్నప్పుడు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి కుమితే టోర్నమెంట్లో పాల్గొని కాంస్య పతకం గెలిచింది. బెంగళూరులో జరిగే ‘షటోకాన్ నేషనల్ కరాటే’ పోటీలకు ఏటా హాజరయ్యేది. పన్నెండేళ్లు ఆ పోటీల్లో పతకాలు సాధించింది. మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ షెటోలియో కరాటే టోర్నమెంట్, సింగపూర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ షటోకాన్ కరాటే టోర్నమెంట్లో బంగారు పతకాలు గెలిచి తండ్రికి పుత్రికోత్సాహాన్ని పంచింది అమృత.
చిన్నమ్మాయి ఘన సంతోషిణి కూడా రెండేళ్లు వచ్చినప్పటి నుంచే కిక్ ఇవ్వడం మొదలుపెట్టింది. అక్కను అనుకరిస్తూ మొదలైన ఆమె కరాటే విన్యాసాలు.. తండ్రి శిక్షణలో మరింత రాటుదేలాయి. తర్వాతి కాలంలో అద్భుత విజయాలతో తన అక్కనే మించిపోయింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందాన నాలుగేళ్ల వయసులో 39 నిమిషాల్లో 3,315 సార్లు నెక్ రొటేషన్ (మెడను కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి వేగంగా తిప్పడం) చేసింది. అయిదేళ్లలోపు బాలల్లో అత్యంత వేగంగా నెక్ రొటేషన్ చేసి ప్రపంచ రికార్డ్ (వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్) నెలకొల్పింది.
జీవీఆర్ కరాటే అకాడమీకి రాధిక అనే కూచిపూడి టీచర్ తన పిల్లల్ని పంపేది. ఆ పిల్లలకు కరాటే నేర్పిన తర్వాత వాళ్లతోపాటే తన బిడ్డలకు కూచిపూడి నేర్చుకునేందుకు వాళ్లింటికి పంపేవాడు తండ్రి. అలా వేసవి సెలవుల్లో అమృత, సంతోషిణి కూచిపూడి నేర్చుకున్నారు. ఇద్దరూ కూచిపూడిలో రంగప్రవేశం చేశారు. కరాటే అకాడమీలో మోహన్ రెడ్డి అనే విద్యార్థి ఉండేవాడు. ఆయన భరతనాట్యం నేర్పే గురువు కూడా. ఆయన దగ్గర అక్కాచెల్లెళ్లు ఇద్దరూ శిష్యరికం చేశారు. అమృత బేసిక్స్ నేర్చుకుని ఆపేస్తే. చిన్నమ్మాయి అరంగేట్రం చేసేదాక వదిలిపెట్టలేదు. కరాటే, కూచిపూడి, భరతనాట్యమే కాదు సంతోషిణి యోగా కూడా నేర్చుకుంది. ఇన్ని విద్యలు నేర్చిన సంతోషిణి రాష్ట్రస్థాయి పోటీల్లో కరాటే, యోగా, కూచిపూడి కేటగిరీల్లో బహుమతులు గెలచుకుంది. సంతోషిణి బహుముఖ ప్రజ్ఞను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు బాలసూర్య అవార్డు ప్రదానం చేసింది.
చిన్నప్పటినుంచి అక్కాచెల్లెళ్లకు ఉదయం లేవగానే గ్రౌండ్‌కు వెళ్లడం దినచర్య. ఎండకాలం, వానకాలం అనే తేడా లేదు. ఏ కాలమైనా.. ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి కరాటే ప్రాక్టీస్‌కు మైదానానికి పరుగు తీస్తారు. రెండు గంటలపాటు సాధన చేస్తారు. బడికి వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ సాయంత్రం కరాటే సాధన చేసేవారు. అలా కష్టపడి పన్నెండేళ్ల వయసుకే బ్లాక్ బెల్ట్ సాధించారు.
ఏ రోజూ కష్టం అన్న మాట వాళ్ల నోటి నుంచి రాలేదు. ఇష్టంగా అభ్యాసం చేశారు. మిగతా పిల్లలు క్రికెట్ ఆడినంత ఉత్సాహంగా కరాటే సాధన చేశారు. సినిమా చూసినంత ఇదిగా కరాటే కిక్స్ నేర్చుకునేవారు. అంత కష్టపడినా అలసటే ఎరగరు. బడికి పోతే… పిల్లలతో కోకో, కబడ్డీ ఆడేవాళ్లు. ఇవే కాకుండా జూడో కూడా నేర్చుకున్నారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌లో ఇద్దరూ వెండి పతకాలు సాధించారు. కరాటేను పోలి ఉండే టాంగ్షుడోలో అమృతకు బంగారు పతకం, వెండి పతకం వచ్చాయి. అమృత జూడోలోనూ రాష్ట్రస్థాయిలో పతకాలు గెలిచింది. ఇలా ఏది నేర్చినా అందరికన్నా మిన్నగా ఉండటం ఈ అక్కాచెల్లెళ్ల లక్ష్యం! అమృత ఇప్పుడు బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. సంతోషిణి బీకామ్ ఫస్ట్ ఇయర్లో చేరింది. ఇన్ని ఆటలు ఆడే సంతోషిణి ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చింది. ‘నాన్న కరాటే ఒక్కటే కాదు.. చదువుని, కరాటేని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా నేర్పించారు’ అని చెబుతున్న ఈ అక్కాచెల్లెళ్లు పెద్దయ్యాక సివిల్స్ సాధించడమే తమ లక్ష్యం అంటున్నారు. అడుగుపెట్టిన చోటల్లా గెలుస్తూ వస్తున్నట్టే సివిల్స్ కూడా సాధిస్తామనే ధీమాతో ఉన్నారు!
తెలంగాణ రాష్ట్రం పోరాట ఫలం. ఆ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఆవిర్భవించిన రోజున వేడుక జరుపుకొంటున్నాం. ఆ వేడుకను ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకొంటే అమృత, ఘన సంతోషిణి మాత్రం అందరికీ విభిన్నంగా జరుపుకొంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కరాటేలో ఏదో ఒక ప్రపంచ రికార్డ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండేళ్లకు ఒకసారి తమ రికార్డుని తామే తిరగరాయడమో, కొత్త రికార్డుని సృష్టించడమో చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
2015 అమృత తలతో 365 టైల్స్‌ని 365 సెకండ్స్లో పగులగొట్టి పాత రికార్డుని బ్రేక్ చేసింది.
2017 అమృత మేకుల మీద పడుకుంటే.. ఆమె కడుపుపై 120 కేజీలకు పైగా ఉన్న బండరాయిని ఉంచి, రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో 36 రాళ్లు బ్రేక్ చేశారు.
2019 మేకుల బల్లపై అమృత పడుకుంటే ఆమెపై మరో మేకుల బల్ల ఉంచారు. పైన ఉన్న మేకుల బల్లపై సంతోషిణి పడుకుంది. వాళ్లపై అరవై షాబాద్ రాళ్లు పెట్టారు. వాటిని గోపాల్ రెడ్డి సమ్మెట(గన్ను)తో పగులగొట్టారు.
2021 ఘన సంతోషిణి 84 సెరామిక్ టైల్స్‌ని 84 సెకన్లలో పిడికిలితో పగులగొట్టింది. ఒక చేత్తో టైల్ పట్టుకుని మరో చేతి పిడికిలితో పగులగొట్టి రికార్డ్ సాధించింది.a
2023 స్వీయ రక్షణపై దృష్టి పెట్టిన అక్కాచెల్లెళ్లు తొమ్మిది నిమిషాలు టార్గెట్ చాలాకాలం సాధన చేశారు. ప్రదర్శనలో భాగంగా కేవలం 6 నిమిషాల 14 సెకన్లలోనే 81 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్‌లు ప్రదర్శించి రికార్డ్ సాధించారు.
2025 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌లో మరో రికార్డ్ కోసం ప్రయత్నించారు. 11 నిమిషాలు టార్గెట్ పెట్టుకుని సాధన చేశారు. ప్రదర్శనలో 9 నిమిషాల 36 సెకన్లలో 121 స్వీయరక్షణ మెలకువలను విజయవంతంగా పూర్తిచేసి మరో రికార్డ్ సాధించారు. తెలంగాణ ఏర్పడి పదకొండేళ్లు కాబట్టి ఈ స్వీయ రక్షణ టెక్నిక్లను పదకొండు విభాగాలుగా విభజించి, ప్రతి విభాగంలో పదకొండు రకాల డిఫెన్స్ టెక్నిక్స్ ప్రదర్శించారు!
– నాగవర్ధన్ రాయల
– గడసంతల శ్రీనివాస్