దివ్యాంగులను చూసి మానవత్వం ఉన్నవారంతా జాలిపడటం సహజం. కానీ వారిలోని ప్రతిభను గుర్తించి ఉపాధి కల్పించడం మాత్రం అలీనాకే సాధ్యమైంది. దివ్యాంగులను ఉద్యోగులుగా, ఆంత్రప్రెన్యూర్లుగా చూడాలన్నది ఆమె సంకల్పం. అందుకోసం ‘మిట్టీ కేఫ్’ నెలకొల్పింది. ఒక్క కేఫ్‌తో ప్రారంభమైన ప్రయాణం దేశమంతటా విస్తరించి ఓ సామ్రాజ్యంగా ఎదిగింది. ఈ అద్భుత విజయానికి పునాదులు వేసింది బెంగళూరుకు చెందిన అలీనా ఆలమ్.
దివ్యాంగుల ప్రతిభకు పట్టం కట్టాలనే దృఢసంకల్పంతో మిట్టీ కేఫ్‌ని ప్రారంభించింది అలీనా. 2017లో ప్రారంభమైన మిట్టీ కేఫ్ దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఔట్లెట్లు, వందలాది ఉద్యోగులతో విజయవంతంగా కొనసాగుతున్నది. దివ్యాంగుల కోసం పనిచేసే బెంగళూరులోని ‘సమర్థన’ ట్రస్ట్‌లో అలీనా ఇంటర్న్‌షిప్ ప్రోగామ్ చేసింది. అదే సమయంలో ఆమెకు ‘మిట్టీ కేఫ్’ ఆలోచన వచ్చింది. సోషల్ ఆంత్రప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించాలని భావించింది. విషయం తెలిసి ఇంట్లోవాళ్లు ‘పెండ్లి చేసుకో లేదా ఉద్యోగం చెయ్’ అన్నారు. అలీనా మాత్రం వెనక్కి తగ్గలేదు. దాతల సహకారంతో హుబ్లీలో ఓ చిన్నషెడ్లో తొలి కేఫ్ మొదలుపెట్టింది. ఈ రెస్టారెంట్లో పనిచేసేవారంతా దివ్యాంగులే! దానికి ఊహించని స్పందన వచ్చింది. కాలక్రమంలో ‘మిట్టీ కేఫ్’లు పదుల సంఖ్యలో పుట్టుకొచ్చాయి.
విమానాశ్రయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, బ్యాంకు ప్రాంగణాల్లో వెలసిన కేఫ్‌లలో దివ్యాంగులు దివ్యంగా వండి పెడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 46 ‘మిట్టీ కేఫ్’లు నడుస్తున్నాయి. గత సంవత్సరం సుప్రీంకోర్టు ప్రాంగణం, రాష్ట్రపతి భవన్, ఐఐఎంబెంగళూరులో ‘మిట్టీ కేఫ్’లను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని కేఫ్‌లు ప్రారంభిస్తామని చెబుతున్నది అలీనా. ఆమె ఆలోచనను ప్రసిద్ధ పత్రిక ఫోర్బ్స్ కొనియాడింది. అండర్ 30 ఏషియన్ విమెన్ ఆంత్రప్రెన్యూర్ల జాబితాలో ఆమెకు చోటు కల్పించింది.