పేదరికంలో పుట్టింది. పెద్దబిడ్డగా.. పెండ్లికి ముందే కుటుంబ బాధ్యతలు మోసింది. వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నది. అక్కడితోనే ఆగిపోయి ఉంటే.. పికిల్ప్రెన్యూర్ ఆకుల కృష్ణకుమారి గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగిలేది కాదు. కానీ తనకంటూ ఓగుర్తింపు తెచ్చుకోవాలని ఆమె పరితపించింది. పచ్చళ్ల తయారీలో తన ప్రావీణ్యాన్ని వ్యాపార సూత్రంగా మలుచుకున్నది. ‘స్వాద్’ పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో ఆమె తయారుచేసిన ఇమ్యూనిటీ బూస్టర్ పచ్చడికి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తున్నది.
డైనింగ్ టేబుల్‌పై ఎన్నిరకాల కూరలున్నా.. పచ్చడి లేకపోవడం తీరని లోటు. ఇంట్లో పెట్టుకోవడానికి తీరిక, ఓపిక లేనివాళ్లంతా పచ్చళ్ల కోసం సూపర్ మార్కెట్లను ఆశ్రయించాల్సిందే. రుచి విషయంలోనూ ఎంతోకొంత రాజీ పడాల్సిందే! పచ్చళ్ల నిల్వ కోసం కొన్ని సంస్థలు హానికర రసాయనాలు కలుపుతుండటం కూడా ఆందోళన కలిగించే విషయమే! ఈ సమస్యను గుర్తించిన ఆకుల కృష్ణకుమారి.. తనకు కొట్టినపిండైన పచ్చళ్ల తయారీకి దిగింది. సేంద్రియ దినుసులతో పెడుతూ.. మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది.
సవాళ్లను దాటుకుని..
కృష్ణకుమారి స్వస్థలం భీమవరం. బాల్యంలోనే తల్లిదండ్రులతో కలిసి భాగ్యనగరానికి వలస వచ్చింది. తండ్రి టైలర్. చాలీచాలని సంపాదనతో కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితి. దీంతో కృష్ణకుమారి చదువు బీకాంతోనే ఆగిపోయింది. తనే పెద్ద కూతురు కావడంతో కుటుంబ బాధ్యతలను మోయాల్సి వచ్చింది. ఓ ప్రైవేటు స్కూల్లో పిల్లల హోంవర్క్ చేయించే పనికి కుదిరింది. అలా వచ్చిన కొద్దిపాటి వేతనంతో పదో తరగతి పూర్తిచేసింది. అక్కడే, కొద్దిరోజులు టీచర్‌గానూ పనిచేసింది. తర్వాత ప్రైవేటు దవాఖానలో కొలువు వెతుక్కుని.. ఇంటికి ఆసరాగా నిలిచింది. పెండ్లి అయినా.. భర్తతో విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటున్నది. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో ఓల్డ్ అల్వాల్‌లో నివాసం ఉంటూ పచ్చళ్ల వ్యాపారం చేస్తున్నది.
డాక్టరమ్మ సలహాతో.. ఆసుపత్రిలో పనిచేస్తున్న రోజుల్లో తాను పెట్టిన పచ్చళ్లను గీతాంజలి అనే డాక్టర్‌కు ఇచ్చింది కృష్ణకుమారి. వాటి రుచి డాక్టరమ్మకు చాలా నచ్చింది. దీంతో, కృష్ణకుమారిని పచ్చళ్ల వ్యాపారం వైపు ప్రోత్సహించింది. సాయానికి ఓ ఐదువేలు చేతిలో పెట్టింది. ఆ పెట్టుబడితో ‘స్వాద్’ పేరుతో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించింది కృష్ణకుమారి. నాణ్యత విషయంలో రాజీపడకుండా స్వయంగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి.. కూరగాయలు కొనుగోలు చేస్తుంది తను. కారం, పసుపు, ఇతర దినుసులు దగ్గరుండి సిద్ధం చేయిస్తుంది. అందుకే.. కృష్ణకుమారి పెట్టే పచ్చళ్లు ఎనిమిది నెలల నుంచి ఏడాది పాటు నిల్వ ఉంటాయి. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా.. ఆ తర్వాత క్రమంగా ఊపందు కున్న వ్యాపారం.. ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేసింది. అంతలోనే ‘కరోనా’ విజృభించింది.
పచ్చళ్ల వ్యాపారాన్ని కోలుకోలేనంత దెబ్బ తీసింది. అయినా కృష్ణకుమారి వెనుకడుగు వేయలేదు. సమస్యలోనే ఓ పరిష్కారం వెతికింది. కస్టమర్లలో పెరిగిన ‘ఆరోగ్య స్పృహ’ను వ్యాపార అభివృద్ధికి ఓ ఆయుధంగా మలుచుకుంది. మునగాకుతో పచ్చళ్లు తయారుచేసి.. ‘ఇమ్యూనిటీ బూస్టర్’ అనే ట్యాగ్‌లైన్ జోడించింది. అంతే, అమ్మకాలు జోరందుకున్నాయి. మిగతా పచ్చళ్ల విషయంలోనూ పోషకాలకు లోటు లేకుండా జాగ్రత్త పడతానని చెబుతుందామె. ఆ ప్రయోగం విజయవంతం కావడంతో.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మునగ పచ్చళ్లు, అల్లం మురబ్బా కరోనా సమయంలో మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత నాబార్డ్ ద్వారా ఢిల్లీ, కేరళ, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటుచేసి పచ్చళ్లు విక్రయించింది.
అమెరికా నుంచీ ఆర్డర్లు..
కృష్ణకుమారి ప్రస్తుతం మామూలు పచ్చళ్లతోపాటు కొత్తిమీర, పుదీనా, మునగ, కాకర వంటి శాకాహార రకాలు; మటన్, చికెన్, రొయ్యలు తదితర మాంసాహార రకాలు.. ఇలా 46 వెరైటీల పచ్చళ్లను తయారు చేస్తున్నది. అమెరికా నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. నెలకు రూ.1.50 లక్షల వరకూ గిట్టుబాటు అవుతున్నది. ఆర్డర్లు అంతగా లేని రోజుల్లోనూ నెలకు రూ.50 వేలకు తగ్గదు. ఓ పదిమందికి ఉపాధి లభిస్తున్నది కూడా. మొదట్లో తాను పచ్చళ్ల వ్యాపారం చేస్తుంటే ఎంతోమంది ఎగతాళి చేశారు. అయినా, కృష్ణకుమారి పట్టించుకోలేదు. ఆత్మవిశ్వాసంతో వ్యాపారాన్ని
లాభాల బాటలో నడిపించింది. ‘ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేస్తే ఏదీ అసాధ్యం కాదు’ అంటుందా పికిల్ప్రెన్యూర్.
వీహబ్తోనే గుర్తింపు..
మా నానమ్మ పద్మావతి రకరకాల పచ్చళ్లు పెట్టేది. బాల్యం నుంచే ఆమె ప్రభావం నాపై ఉంది. పెద్దయ్యాక నా వంటలను ఇంట్లో అందరూ మెచ్చుకునేవారు. ముఖ్యంగా నేను పెట్టే పచ్చళ్లకు మంచి ప్రశంసలు వచ్చేవి. ఈ నేపథ్యంలోనే పచ్చళ్ల తయారీని జీవనాధారం చేసుకున్నా. నా శ్రమకు వీహబ్ తోడైంది. ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చి ‘స్వాద్’ పేరుతో లోగో డిజైన్ చేసిచ్చింది. అన్నివిధాలా ప్రోత్సహించింది. నా పచ్చళ్లకు వీహబ్ ద్వారానే పరీక్షలు నిర్వహించి సర్టిఫై చేశారు. ఫుడ్ పార్సిల్, ఎంఎస్ఎంఈ లైసెన్స్ కూడా పొందాను. వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ఇంటర్నేషనల్ ట్రేడ్ లైసెన్స్ పొందే ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయాణంలో వీహబ్ అందించిన ప్రోత్సాహం మరువలేనిది.
ఆకుల కృష్ణకుమారి …?
గంజి ప్రదీప్ కుమార్
జి.భాస్కర్