అమ్మానాన్న ఒప్పుకోక పోయినా నటనపై ఉన్న అభిమానంతో బుల్లితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య వర్మ. కన్నడ, తెలుగు సీరియల్స్‌లో సపోర్టింగ్ రోల్స్‌తో అలరిస్తున్న ఐశ్వర్య సినిమాల్లోనూ నటించింది. భర్త ప్రోత్సాహంతో పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చింది ఈ కన్నడ బ్యూటీ. జీ తెలుగులో ప్రారంభమైన ‘చామంతి’ సీరియల్లో రోజాగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న ఐశ్వర్య వర్మ జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..
మా ఆయన అభినయ్ వర్మ. ఐటీ ఎక్స్పర్ట్. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా. ఒక స్టార్టప్ మొదలుపెట్టాం. కానీ అక్కడ పనిచేస్తుంటే ఏదో మిస్సయిన ఫీల్ ఉండేది. మా ఆయన ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాను. పెళ్లి తర్వాత కూడా కెరీర్, ఫ్యామిలీని మేనేజ్ చేయగలుగుతున్నానంటే అది కేవలం మా ఆయన సపోర్ట్‌తోనే. జీవితంలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నన్ను ఇంతగా అర్థం చేసుకుని ప్రోత్సహిస్తున్నందుకు మావారికే చెప్పాలి.
నేను పుట్టింది, పెరిగింది అంతా బెంగళూరులోనే! మాది సంప్రదాయ కుటుంబం. ఇల్లు, స్కూల్ తప్ప ఇంకేం తెలియదు. బడిలో సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనేదాన్ని కాదు. అలాంటి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేను నటిని అవుతానని కలలో కూడా ఊహించలేదు. పైగా మా ఫ్యామిలీలో, బంధువుల్లో ఎవరూ టీవీ, సినిమా ఇండస్ట్రీకి చెందినవారు లేరు. ఎప్పుడైనా ఫేస్బుక్లో నా ఫొటోలు పోస్టు చేసేదాన్ని. అవి చూసి తమ సీరియల్లో నటించమని చాలా ఆఫర్లే వచ్చాయి. యాక్టింగ్ అంటే మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు. కానీ, నా ఆసక్తిని గమనించి చివరికి ఒప్పుకొన్నారు. ఉదయ టీవీలో ప్రసారమైన ‘ఈ బంధన’ నా తొలి సీరియల్. తర్వాత చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, దుస్తుల విషయంలో సీరియల్స్‌లో ఉన్న కంఫర్ట్ సినిమాల్లో ఉండదని ఒప్పుకోలేదు. నాకు సరిపోతాయనిపించిన కొన్ని సినిమాల్లో నటించాను. కొన్ని సినిమాలు కారణాంతరాల వల్ల మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో ఇక సినిమాలు వద్దనుకొని సీరియల్స్‌లోనే కొనసాగుదామని నిర్ణయించుకున్నా!
తెలుగులో సీరియల్ ఆఫర్ వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. కన్నడలో నేను నటించిన ఓ సీరియల్ చూసి సంప్రదించారు. తెలుగులో నా మొదటి సీరియల్ ‘అత్తారింటికి దారేది’. అందులో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ‘మల్లీశ్వరి’, ‘అక్కమొగుడు’ సీరియల్స్‌లో కూడా నటించాను. ఇప్పుడు జీ తెలుగులో ‘చామంతి’ సీరియల్ చేస్తున్నా. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ పాజిటివ్ షేడ్స్ ఉన్నవే. కానీ, చామంతిలో నాది నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్. మొదట్లో ఈ పాత్ర చేయడం గురించి కొంచెం ఆలోచించాను. ప్రభాకర్‌గారు ఫోన్ చేసి మంచి పాత్ర ఒప్పుకోమని నచ్చజెప్పారు. ఆయన మాట కాదనలేక ఒప్పుకొన్నా. కానీ, సీరియల్ స్టార్ట్ అయ్యాక ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
తెలుగు రాక తొలినాళ్లలో కొంత ఇబ్బందిపడ్డా. అయితే తెలుగు భాష చాలావరకు కన్నడకు దగ్గరగా ఉండటంతో త్వరగా నేర్చుకోగలిగా. ఈ ప్రయాణంలో హైదరాబాద్‌తో ఎనలేని అనుబంధం ఏర్పడింది. ఇక్కడి ప్రజలు, పద్ధతులు.. ముఖ్యంగా ఫుడ్ అంటే చాలా ఇష్టం. సెట్స్‌లో కూడా అందరూ అండగా ఉంటారు. ప్రస్తుతం చామంతితోపాటు కన్నడలోనూ ఒక సీరియల్ చేస్తున్నా. సినిమాల్లోనూ మంచి పాత్రల్లో అవకాశం వస్తే నటించాలని ఉంది. ‘అరుంధతి’ సినిమాలో అనుష్క పోషించినటువంటి రోల్స్ చేయాలన్నది నా కల. యశ్ నా ఫేవరెట్ యాక్టర్.
– హరిణి