‘ఉరిమే ఉత్సాహానికి మనోబలం తోడైతే ఏదైనా సాధించగలవు’ ఇవే ఆ అమ్మాయికి అమ్మానాన్నలు చెప్పిన మాటలు. అలా చెప్పి ఊరుకోలేదు ఆ తండ్రి. కూతురు చేయి పట్టుకొని అడవులుతిప్పాడు. కొండలు ఎక్కించాడు. బడలికతో ఇంటికి వచ్చిన బిడ్డకు అలసట తీరే ఉపాయాలెన్నో నేర్పింది తల్లి. ఇంకేముంది ఆ అమ్మాయి ఆరోగ్యం, ఆనందం, సాహసమే కాదు కీర్తిని కూడా మూటగట్టుకుంది. పదిహేడేండ్లకే ఏడు ఖండాల్లోని ఎత్తయిన ఏడు శిఖరాలు అధిరోహించి శభాష్ అనిపించుకున్న కామ్య కార్తికేయన్ సాహస యాత్ర ఇది.
Kaamya Karthikeyan | సాహస క్రీడల్లో సత్తా చాటాలంటే శారీరక దారుఢ్యం మాత్రమే కాదు మనోబలం కూడా కావాలి. అమ్మానాన్నలు కామ్యకు ఆ రెండిటినీ ఉగ్గుపాలతో అందించారు. ఏడేండ్ల వయసులోనే సాహస యాత్ర మొదలుపెట్టింది. ఏడు శిఖరాలు అధిరోహించిన కామ్య ‘నా సాహస యాత్రలకు మా నాన్నే ప్రేరణ’ అని చెబుతుంది. వాళ్ల నాన్న కార్తికేయన్ నావికాదళంలో కమాండర్‌గా పనిచేసేవాడు. అప్పుడప్పుడూ అడవులు చుట్టొచ్చేవాడు. కొండలు, కోనలు తిరిగొచ్చేవాడు. తండ్రితోపాటు తనూ వెళ్లాలని ఉబలాటపడేది కామ్య. ఆమె ఆసక్తిని గమనించి ఆయన తనతోపాటు కూతురునీ వెంట తీసుకెళ్లేవాడు. కొండలు ఎక్కడం నేర్పించాడు. కొన్నాళ్ల తర్వాత తండ్రిని మించిన తనయ అనిపించుకుంది కామ్య.
ముంబయిలో ఉంటున్న కామ్య నేవీ చిల్డ్రన్ స్కూల్లో చదివింది. ఏడేండ్ల చిరుప్రాయంలోనే ఉత్తరాఖండ్‌లోని చంద్రశిల పర్వతాన్ని అధిరోహించింది. ‘ఆ పర్వతారోహణ నా జీవితంలో మరచిపోలేనిది. నా విజయాలకు అదే తొలిమెట్టు’ అని కామ్య గర్వంగా చెబుతుంది. దాదాపు మూడు కిలోమీటర్ల ఎత్తున ఉండే చంద్రశిల శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి సాహస యాత్రల్లో తన సామర్థ్యం ఎంతటిదో తెలుసుకుంది. ఆ తర్వాత ఆమె కిందికి చూడలేదు. ఎత్తయిన శిఖరాలపైనే దృష్టి సారించింది.
పర్వతాలు ఎక్కడం అంటే చెప్పినంత తేలికైన విషయం కాదు. ఆ గిరులపై కొన్ని రోజులు గడిపేందుకు కావాల్సిన సామగ్రిని మోయాలి. గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో పయనించడం శక్తికి మించిన పనే. పర్వతారోహణకు కావాల్సినంత సామర్థ్యం సాధించేందుకు ఇంట్లోనే సాధన మొదలుపెట్టింది. పాతిక కేజీల బరువు భుజాలకెత్తుకుని తాము ఉంటున్న 20 అంతస్తులు ఎక్కుతూ, దిగుతూ సాధన చేసింది. ఇలా ప్రతిరోజూ 15 నుంచి 20 సార్లు ప్రయత్నించేది. పర్వతారోహకులకు తెలివితేటలు కూడా చాలా అవసరం. అల్లంత ఎత్తులో ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. యుక్తితో ముందుకుసాగాలి.
ఇందుకోసం పర్వాతారోహకుల డాక్యుమెంటరీలు చూసేది కామ్య. వారి అనుభవాలనే పాఠాలుగా భావించింది. క్లిష్ట పరిస్థితులను వాళ్లు అధిగమించిన తీరు, ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆ డాక్యుమెంటరీల ద్వారా తెలుసుకుంది. తనపై తనకు నమ్మకం కుదిరిన తర్వాత ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన గిరులు చుట్టిరావడానికి బయల్దేరింది. కిలిమంజారో (ఆఫ్రికా), ఎల్బ్రస్ (యూరప్), కొస్కియుజ్కో (ఆస్ట్రేలియా), అకాన్కాగువా (దక్షిణ అమెరికా), డెనాలి (ఉత్తర అమెరికా), మౌంట్ విన్సన్ (అంటార్కిటికా), ఎవరెస్ట్ (ఆసియా) పర్వతాల అధిరోహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 2020లో మొదటగా దక్షిణ అమెరికాలో ఆండీస్ శ్రేణిలోని అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించింది కామ్య. దాదాపు ఏడువేల మీటర్ల ఎత్తున్న పర్వతాన్ని అధిరోహించి వారెవ్వా అనిపించుకుంది. అప్పటికి కామ్య వయసు 12 ఏండ్లే! తర్వాత ఒక్కో ఖండానికీ చేరుకుంటూ, అక్కడి ఎత్తయిన గిరిని అధిరోహిస్తూ జయకేతనం ఎగురవేసింది.
‘ఈ సాహస యాత్రల్లో ప్రతి అడుగులో నాన్న శిక్షణ, ప్రేరణ ఉంది. అలాగే అమ్మ అండగా ఉంది. వారిద్దరి ప్రోత్సాహం వల్లే నేను ఈ విజయాలన్నీ సాధించాను. పర్వతారోహణ చేసే క్రమంలో ఒక్కోసారి అడుగు వేయలేనంతగా అలసిపోతాం. అలాంటి సమయంలో కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ ముందుకుసాగేదాన్ని. అంతేకానీ, వెనక్కి రావాలన్న ఆలోచన ఎన్నడూ చేయలేదు’ అని చెబుతుంది కామ్య. సాహసంలోనే కాదు చదువులోనూ కామ్య టాప్ స్టూడెంట్. భరతనాట్యం నేర్చుకుంటున్నది. పాఠశాలలో ఎన్సీసీ క్యాడెట్‌గా శిక్షణ పొందుతున్నది. ముంబయి మారథాన్‌లో పతకాలు గెలిచి ఆల్‌రౌండర్ అనిపించుకుంది.
హిమగిరుల్లో మాత్రమే కాదు.. భూ మండలంపై అత్యంత ఎత్తయిన పర్వతం ఎవరెస్ట్. దట్టంగా కురిసే హిమపాతం, విసిరి కొట్టేసినట్టుండే భీకర గాలులు.. ఎవరెస్ట్ అధిరోహణను సంక్లిష్టం చేస్తాయి. ఇంతటి ప్రతికూలతలు ఉంటాయని తెలిసి కూడా సాహసయాత్రకు పూనుకుంది కామ్య. ఈ యాత్రలో ఆమెకు తండ్రి కూడా తోడుగా ఉన్నాడు. నేపాల్ నుంచి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా (16 ఏండ్లు) కామ్య రికార్డు నెలకొల్పింది. ‘మంచు దారుల్లో అగాధాలున్నా, విపత్తులు ఎదురైనా వెనుకంజ వేయలేదు. పట్టుదలతో ముందుకు కదిలాను. ఎవరెస్ట్ అధిరోహణ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సాహస యాత్ర. ‘ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆందోళనపడకుండా మౌనంగా ప్రయత్నాలు చేస్తూనే పోవాల’ని మా నాన్న అలవర్చిన మనోబలమే ఎవరెస్ట్ యాత్రను విజయవంతం చేసింద’ని చెబుతుంది కావ్య.
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఉత్సాహంతో చివరిగా అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ శిఖరం ఎక్కడానికి పూనుకుంది కామ్య. ఇది మిగతావాటికి భిన్నమైనది. రక్తం గడ్డ కట్టే చలిలో అత్యంత జాగ్రత్తగా ఉంటేనే ప్రాణాలతో తిరిగి వస్తారు. ఆ మంచు శిఖరంపైకి తండ్రీ కూతుళ్లిద్దరూ బయల్దేరారు. 2024 డిసెంబర్ 24న విజయవంతంగా మౌంట్ విన్సన్ శిఖరం చేరి కామ్య త్రివర్ణ పతాకం ఎగురవేసింది. అలా అత్యంత చిన్న వయసులో ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించింది!