Ramayanam | హైస్కూల్లో మాకు జనవరి 26కే ఆటలపోటీలు, ఇతర పోటీలూ ఉండేవి. ఆగస్టులో వర్షాలు పడతాయి కాబట్టి, గ్రౌండ్లో ఆటలు కుదిరేవి కాదు. అయితే, ఈ సమయంలో కొన్నిసార్లు కొత్తరకమైన పోటీలు పెట్టేవారు మా సార్లు.
జెండా వందనం ఓవారం రోజులు ఉందనగానే.. ఆఖరి పీరియడ్‌లో అమీనాబీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఓ నోటీసు తెచ్చేది. ఆఖరి పీరియడ్ ఎక్కువగా హిందీ గానీ, తెలుగు గానీ ఉండేవి. సారు దాన్ని చదివి సంతకం చేసి పంపాక.. “అరేయ్.. పంద్రాగస్టు వస్తున్నది. మీరందరూ మీ తరగతి గదులను శుభ్రంగ చేసి పెట్టుకొని, ఒక్కరోజు ముందుగాల మంచిగ అలంకరించి ఉంచాలె. హెడ్మాస్టర్ సారు, ఇంకొందరు జూసి మంచిగ ఉన్న క్లాసుకు ప్రైజు ఇస్తరట. అమ్మాయిలూ.. మీరు గూడ. ఏవన్న డిజైన్లు, కుట్లు, బొమ్మలు గీసుడు.. ఎవ్వున్నా అందంగ తీర్చిదిద్ది ప్రైజు కొట్టాలె. అర్థమైందా?!” అని చెప్పేవారు.
ఆ మర్నాటి నుంచీ గేమ్స్ పీరియడ్ బంద్. క్లాసులో పిల్లలందరం తలా రెండు రూపాయలు వసూలు చేసి ఒక దగ్గర పెట్టేవాళ్లం. మగపిల్లలు సున్నం కొనుక్కొచ్చి, బకెట్ తెచ్చి.. ఓ ఆదివారం బూజులు దులిపి సున్నం వేసేవాళ్లు. కిటికీలకు రంగులేసేంతగా మా దగ్గర డబ్బులుండేవి కావు. ఉన్నంతలో కిటికీ తలుపులు ఊడిపోకుండా మేకులు కొట్టడం, శుభ్రంగా ఉప్పు కాయితం (గరుకు పేపర్)తో తుడవడం చేసేవాళ్లు.
తల్లం బండయ్య దుకాణానికి వెళ్లి డ్రాయింగ్ పేపర్ కొనుక్కొచ్చేవాళ్లం. నా చేతిరాత బాగుండేది కనుక.. ఆ పేపర్ల మీద మంచిమంచి నీతివాక్యాలు, దేశభక్తి స్లోగన్లు రాసే పని నామీదే పడేది. మగపిల్లలు లైతో వాటిని గోడలకు అంటించేవారు. ముందురోజే ఆడపిల్లలం గది కడిగి చక్కటి ముగ్గులేసే వాళ్లం. మగపిల్లలు మామిడి తోరణం కట్టేవాళ్లు. వీలైనంత వరకూ పక్క తరగతుల వాళ్లు చూసి కాపీ కొట్టకుండా అత్యంత రహస్యంగా చేసేవాళ్లం.
ఇక మాకున్న కళలన్నీ ప్రదర్శించి కళాఖండాలు చేసేవాళ్లం. కొందరు కలర్ పెన్సిల్స్‌తో పెయింట్ వేసి తెచ్చేవారు. మరికొందరు నల్లటి బట్ట మీద తెల్లటి గుండీలు అతుకుపెట్టి లేదా దారంతో కుట్టి.. బాతునో, కుందేలునో తయారుచేసి ఫ్రేమ్ కట్టించి తెచ్చేవారు. కొందరు బట్టమీద చీపురుపుల్లలను నిలువుగా చీరి చిన్నముక్కలుగా అంటించి చిత్రాలను తయారు చేసేవారు. ఇంకొందరు ఏమీ చేయలేక ఇంట్లో ఉన్న సీనరీలు పట్టుకొచ్చి గోడలకు తగిలించేవారు.
నేనూ, అక్కా.. ఎవరి క్లాసుకోసం వాళ్లం యథోచితంగా అమ్మను సతాయించేవాళ్లం. అక్క మ్యాటీ బట్ట మీద తాజ్‌మహల్‌ను కుడితే.. అమ్మ కూడా సహాయం చేసేది. నాకూ కుట్లు వచ్చేవి. నేను ఒకసారి కుందేలునూ, జంట నెమళ్లనూ, ఇంకోసారి పూలకుండీనీ, తాజ్‌మహల్‌ను కూడా కుట్టిన జ్ఞాపకం ఉంది. చీపురుపుల్లలతో కూడా ఎన్నో సీనరీలు చేసేదాన్ని. అయితే, మేం తయారుచేసిన ఐటమ్స్ బాగున్నాయని స్కూల్లోనే ఉంచుకొని.. ఆఫీసు రూంలో, హెడ్ మాస్టర్ సీటు వెనుక గోడకు వాటిని వేలాడదీసేవారు. ఎవరు ఇన్స్పెక్షన్కు వచ్చినా మా విద్యార్థులే తయారుచేశారని గర్వంగా చెప్పేవారు.
ఒకసారైతే నాకున్న కళా పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక పూలచెట్టును తయారుచేశాను. మా నాన్నను పీచాపట్టి ఒక ఎండిపోయిన తుమ్మకొమ్మను తెప్పించాను. దానికి చాలా రెమ్మలున్నాయి. అవన్నీ కూడా ఎండిపోయినవే. దానిని ఒక మట్టి నింపిన తొట్టిలో నాటాను. మామూలు కలర్ పేపర్ కాకుండా ఒకపక్క తెల్లగా, మరోపక్క ముదురాకుపచ్చగా ఉండే క్రాఫ్ట్ పేపర్ కొన్నాను. దాన్ని చిన్నకాడతో ఉండే ఆకుల్లాగా కత్తిరించి రెమ్మలకు అంటించాను. గోధుమపిండి ఉడకబెట్టి లై తయారుచేశాను. ఇక రెమ్మలకు చివర్లో బొంగుపేలాలు (మరమరాలు) మొగ్గలుగా, మక్కజొన్న పేలాలు (పాప్‌కార్న్) పువ్వులుగా అంటించాను. ఆకుపచ్చని ఆకులతో, తెల్లని మొగ్గలతో, పూలతో అందమైన చెట్టు తయారైంది. దానిని తరగతి గదిలో ఓ స్టూల్ మీద పెట్టాను. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఈ ఐటమ్ వల్ల వ్యక్తిగత విభాగంలో నాకే మొదటి బహుమతి వచ్చింది. మా క్లాసుకు కూడా ఫస్ట్ ప్రైజ్ రావడంతో మా క్లాస్మేట్స్ ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. కొన్ని రోజులపాటు టెంత్ వాళ్లు మమ్మల్ని ‘ఓహో!’ అన్నట్టు చూస్తుంటే భలే బాగుండేది.
మరోసారి ఇలాగే అంతా అయినాక పక్క క్లాసుల వాళ్లకన్నా ఎక్కువగా ఏదైనా చేయాలని అనుకున్నాం. ఎవరికీ ఏ ఐడియా రావట్లేదు. చివరికి నేనే నుమాయిష్‌లో కొన్న గాజు ఫ్లవర్వాజ్ను ఇంట్లోంచి తెచ్చాను. “బడికి గదెందుకే?! పలిగితే ఎట్ల ?!” అన్నది అక్క. అమ్మ కూడా అక్కనే సమర్థించినా చివరికి.. “సరె తియ్యి.. తీసుకపోతె పోయినవు గానీ, పలగ్గొట్టకుండ తే!” అని పర్మిషన్ ఇచ్చింది. నేను ఎగిరి గంతేయబోయి ఫ్లవర్ వాజ్ పగులుతుందేమోనని ఊరుకున్నాను. మా ఇంట్లో పూసిన రంగురంగుల లక్ష్మీ నారాయణ పువ్వు (మెట్టతామర)లను తెంపి పట్టుకుపోయాను. టీచర్ కుర్చీ ముందుండే టేబుల్ మీద శ్యామల తెచ్చిన తెల్లటి బట్టను పరిచి, దాని మీద ఫ్లవర్‌వాజ్ పెట్టి నీళ్లు పోసి, అందులో కాడలతో సహా నేను తెచ్చిన పూలను పెట్టేసరికి భలే అందం వచ్చింది.
“మస్తు ఐడియా చేసినవోయ్ రమా!” అని మా క్లాసోళ్లు మెచ్చుకుంటుంటే.. ఒక లెవెల్లో ఫీల్ అయ్యాను. కాసేపటికి మా క్లాసు చూడటానికి టీం వస్తుందనగా.. రవీందర్ అనే అబ్బాయి “సారువాళ్లు ఎయిత్ క్లాసులకు పోయిన్రు. వాళ్లదేం బాగలే.. మనకే వస్తది ప్రైజు” అంటూ స్పీడుగా వచ్చి చెప్పి, తన బెంచీ వైపు వెళ్లబోతూ ఫ్లవర్ వాజ్‌కు చెయ్యి తాకించాడు. ఇంకేముందీ! వాజ్ కిందపడిపోయి ముక్కలై.. క్లాసు రూం నిండా నీళ్లూ, గాజుముక్కలూ పడి చెల్లాచెదురయ్యాయి.
“అరె.. చూసుకొని నడువవా?! ఇప్పుడు మల్ల ఏడికెల్లి తెస్తం?!” అని అందరూ రవీందర్‌ను తిట్టి, అవన్నీ ఎత్తి శుభ్రం చేశారు. చిన్న మట్టికూజా పట్టుకొచ్చి, మళ్లీ నీళ్లు పోసి అందులో పూలు పెట్టారు. రవీందర్ సంగతేమో కానీ.. ఇంటికెళ్లాక నా వాటా తిట్లు ఎన్నుంటాయోనని భయపడుతూనే ఉన్నాను. అక్క చెప్పగానే.. “నేను అంటనే ఉన్న.. అయినా ఇగ పోయినాంక ఏం చేస్తె మాత్రం ఒస్తదా?!” అన్నది అమ్మ. నేను నాన్న వైపు చూశాను. నాన్న చల్లగా నవ్వాడు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి