‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
డాక్టరేటు పట్టా సంపాదించడానికి వైవా వోసీ జరగబోతోంది ఆ పెద్ద హాలులో. పరిశోధన చేసిన విద్యార్థినిని చూసి జడుసుకున్నాడు వేరే ఊరి నుండి వచ్చిన నిపుణుడు. ఆమె దగ్గరగా లేనప్పుడు..
‘ఈ అమ్మాయేనా పోషణ మీద ఇంత మంచి సిద్ధాంత గ్రంథం రాసింది?’ అని, ముక్కుమీద వేలు వేసుకున్నాడు. మన దేశంలో ఇది మామూలేనని ఆ అమ్మాయి తాలూకు గైడ్ ఆ విషయం పట్టించుకోలేదు. అడిగిన ప్రశ్నలకి బ్రహ్మాండంగా జవాబులు చెప్పి, అందరి మన్ననలు అందుకున్న ఆ అమ్మాయి సాగరిక.. ఒకప్పటి ‘చేపల్లాంటి’ తన కంటి కొనల్లోంచి జారబోతున్న కన్నీటిని రుమాలుతో తుడిచేసింది. తనని చూసి జడుసుకోవడం, తనని వింత, వికృతమైన చూపులు చూడ్డం ఆమెకొక రొటీన్ అయిపోయింది. ఇంత అలవాటు పడినా, తన చర్మం మొద్దుబారిన విషయాన్ని ఇంకా తన మనసు అంగీకరించలేదేమో! అప్పుడప్పుడూ అందవిహీనమైన తన కళ్లు చిప్పిల్లుతూనే ఉంటాయి.
“డాక్టర్ సాగరికా! ఈ రెస్టారెంట్ గురించి మీరు ఎక్కడ తెలుసుకున్నారు?” అడిగింది ఒక ఆవిడ.
“న్యూస్ పేపర్లో మేడమ్” జవాబిచ్చింది ఆమె.. ఒక ఫైల్లోకి చూస్తూ.
“మీరు బాగా చదువుకున్న వారు. ఒక చిన్న రెస్టారెంట్లో పని చేద్దామని ఎందుకు వచ్చారు?” అడిగింది మరో స్త్రీ.
సాగరిక చిరునవ్వుతో..
“మేడమ్! ఎంత చదువుకున్నా, ఒక్క మంచి ఉద్యోగం కూడా సంపాదించలేక పోయాను. కారణం..” అంటూ, తన మొహం చుట్టూ వేలు తిప్పి, “ఈ మొహం! ఇది ఒక రెస్టారెంట్ కాబట్టి మీ చెఫ్‌లు రుచి గురించి ఆలోచిస్తే.. నేను ఆరోగ్యం, పోషకాహారాల గురించి జాగ్రత్త తీసుకుంటాను. వాల్యూ ఎడిషన్ అయినట్టే కదా మేడమ్!” అంది.
ఆవిడ తలూపుతూ..
“దీనితో మీ బాధ్యత పూర్తయిపోతుందా?” అని అడిగింది. సాగరిక నవ్వుతూ..
“ఈ స్థలం కేవలం ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ తిని వెళ్లిపోవడానికి కాదనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ తెరిచారు. మీ కల నిజమవ్వాలంటే మన ఈ చోటు.. స్త్రీలు నిర్భయంగా తమ కష్ట సుఖాలు పంచుకునే ఒక పవిత్రమైన ఆలయం కావాలి. ఈ కలను సాకారం చేయడానికి నాకో అవకాశం ఇస్తారా?” అని మర్యాదగా అడిగింది. ఇంటర్వ్యూ చేసినావిడ చిరునవ్వు నవ్వి, సాగరికను తమ బృందంలోనికి స్వాగతించింది.
గుండ్రటి టేబుల్లో కూర్చున్న అమ్మాయిలను పరిచయం చేసింది ఇంటర్వ్యూ చేసిన ప్రమీల.
“డియర్ ఫ్రెండ్స్! ఈరోజు మన ప్రయత్నంలో ఒక కొత్త భాగస్వామిని పరిచయం చేస్తాను. ఈమె పేరు డా. సాగరిక. మీ పరిచయాలు, కథా-కమామిషు మొదట కానివ్వండి. ఆవిడ గురించి ఆమే తరువాత చెప్తారు” అని ముగించింది.
మొదటి అమ్మాయి..
“నైస్! నా పేరు నర్మద. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీ పోకిరిగాడు నన్ను ప్రేమించమని వెంటపడే వాడు. నేను వాడికి నచ్చే జవాబు చెప్పలేదని ఒకరోజు క్యాంటీన్లో నా మొహంపై యాసిడ్ పోశాడు దరిద్రుడు. ఆ బాధ ఎలా భరించానో దేవుడికే తెలియాలి. మా ఇంట్లోవాళ్లు నా చదువుకు మంగళం పాడేశారు. నేను ఉద్యోగం చేసి, నా కాళ్ల మీద నేను నిలబడతానని.. ఒక వంట మనిషికి ఉద్యోగం ఇస్తానని తెగ గారాలు పోతూ, వంట నేర్చుకోలేదు. ఇక్కడ నేను ఆర్డర్స్ తీసుకుంటాను” అంది. ఆమె ఆ బాధను అధిగమించినట్టుంది. యాసిడ్ దాడి గురించి చెప్పినప్పుడు ఎటువంటి హావభావాలూ కనబరచలేదు అనుకుంది సాగరిక.
తరువాతి అమ్మాయి..
“నా పేరు మోనాలిసా. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా నాన్నగారు మోనాలిసా చిత్రాన్ని చూశారట. అందుకే, నాకు ఆ పేరు పెట్టారు. నా మానాన నేను చదువుకుంటుంటే.. ఒకరోజు మా కాలేజీలోకి ఒక తెలియని వ్యక్తి వచ్చి నా మొహంపై యాసిడ్ పోశాడు. చదివేది మెడికల్ కాలేజీలోనైనా నా కర్మని నేను అధిగమించలేను కదా! అందుకని నా మొహం ఇలా అయ్యింది. చివరికి తెలిసిందేమంటే.. మా అన్నయ్య రోడ్డు రోమియోలా ఎవరో అమ్మాయి వెంటపడితే, వాడికి బుద్ధి చెప్పడానికి ఆ అమ్మాయి వాళ్లన్నయ్య నాపై దాడి చేశాడు. అన్నయ్య ఉంటే నా వెంట మగాళ్లు పడరనుకున్నాను గానీ.. మా అన్న వల్లే నాకిలా నష్టం జరుగుతుందనుకోలేదు. కాలిన మొహంతో క్లాస్‌రూమ్‌కి వెళ్లడానికి అప్పట్లో ధైర్యం సరిపోక చదువు అటకెక్కింది. ఇక్కడికి వచ్చాక ధైర్యం వచ్చింది. సంతోషం వచ్చింది” అంది.
మరో అమ్మాయి..
“నా పేరు స్ఫూర్తి. నా బాయ్‌ఫ్రెండ్ నన్ను ప్రలోభపెట్టి, నన్ను వదిలించుకోడానికి ప్రయత్నించాడు. నేను స్త్రీల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తానన్నాను. వాడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి, నన్ను చంపే ఉద్దేశంతో నా మీద యాసిడ్ పోశాడు. నేను బతికిపోయాను గానీ, నా కడుపులో ఉన్న వాడి పాపం మాత్రం.. వాడు పోసిన యాసిడ్‌తోనే పోయింది. ఇక్కడకి వచ్చి తల ఎత్తుకు బతుకుతున్నాను” అంది.
ఈ అనుభవాలు పంచుకునే అమ్మాయిలు వాళ్ల వయసుకు మించిన పరిపక్వతను కనబరిచారు. అది చూసి సాగరికలో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన నిరాశ, నిస్పృహ వెంటనే మటుమాయమయ్యాయి. ఒకప్పటి చేపల్లాంటి కళ్లు మౌనంగా కన్నీరు కార్చడం మానేశాయి. వాళ్లను చూసి, తను నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్థమైంది. తరువాత తనను తాను నిర్భయంగా, నిబ్బరంగా పరిచయం చేసుకుంది. అనతి కాలంలోనే ఆమె వాళ్లకు తగ్గ ధైర్యవంతురాలయ్యింది.
కొన్నాళ్లు గడిచాక…
మరో కొత్త అమ్మాయి వీళ్ల బృందంలో సభ్యురాలిగా చేరింది. పేరు స్వీటీ! మోడల్‌గా ఎదగాలని అనుకుందట. గిట్టని వాళ్లెవరో యాసిడ్‌తో దాడి చేయించారట. ఒక చెంప మాత్రం కాలింది. కాస్మెటిక్ సర్జరీకి డబ్బులు లేక ఇక్కడికి వచ్చిందట. చిన్నపిల్ల అవడం వల్ల నిజమవని కోరికలు, నెరవేరని కలలు.. ఈ రెండిటినీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండేది. మిగతా అమ్మాయిలు ఆమెకు ఊరటనివ్వడానికి శాయశక్తులా ప్రయత్నించేవారు.
ముఖ్యంగా సాగరిక..
“నీలాంటి మంచి అమ్మాయి మీద దాడి చేయించారంటే వాళ్లు ఎంత కుళ్లుబోతులో అర్థం అవుతోంది. అలాంటి ఫీల్డ్ ఎందుకు? అది కాకపోతే వేరే ఉద్యోగాలే లేవా? ఏం.. ఇప్పుడు మనం చేస్తున్నది ఉద్యోగం కాదా? మనకి కావాల్సినంత తిన్నాక కూడా పొదుపు చేసుకోగలుగుతున్నాం. కొన్ని డబ్బులు పోగయ్యాక కావాల్సిన బట్టలూ, నగలూ కొనుక్కోవచ్చు. మనమందరం అందరి కోసం నిలబడి, తలెత్తుకుని బతుకుదాం. డోంట్ వర్రీ!” అని ధైర్యం చెప్పేది.
“ఈ మొహానికి ఖరీదైన బట్టలూ, నగలూ కూడానా? ప్చ్!” అని స్వీటీ నిట్టూర్చితే..
“నేనూ ఇలాగే ఉండేదాన్ని. మన సహచరులను చూడు.. వాళ్లు కూడా ఇదే బాధను అనుభవించి, పోటీపడి దాన్ని అధిగమించారు. రేపు నీకు ఒక చీటీలో ఎవరెవరు ఎంత కాలం తీసుకున్నారో రాసిస్తాను. నీతో నువ్వే పోటీ పడాలి. ఫ్యాషన్ పరేడ్ కన్నా ఇది ఇంకా వైవిధ్యంగా ఉంది కదూ!” అని ప్రోత్సహించేది సాగరిక.
ఆ రెస్టారెంట్లో పని చేసేవారికి తలలో నాలుకలా అయిన సాగరిక, ఊళ్లో గర్భిణులకు పోషకాహారం మీద ఒక ఉచిత శిబిరం ఏర్పాటు చేయించింది. తద్వారా పరోక్షంగా స్త్రీలలో తమబోటి వారి పట్ల అవగాహన పెంచి, వారిపట్ల న్యూనత తగ్గించే ప్రయత్నం చేసింది. దానికి మంచి స్పందన లభించడంతో చదువుకునే పిల్లలకు, వృద్ధులకు, స్థూలకాయులకు వేరువేరుగా ఉచితశిబిరాలు బ్రహ్మాండంగా నిర్వహించింది.
ఆ నోటా ఈ నోటా ఈ విషయం పెద్ద కార్పొరేట్ సంస్థలకు తెలిసి, వాళ్లు ఇటువంటి శిబిరాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. ఆ వనరులతో పేదవారికి కూడా శిబిరాలు ఏర్పాటు చేసి, ఉచితంగా పోషకాహారం ఇవ్వడం మొదలుపెట్టారు సాగరిక, తన అనుచరులు! ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా సాగరిక ఎంతో పేరు సంపాదించుకున్నది. వాళ్ల రెస్టారెంట్‌కి వచ్చే అతిథుల సంఖ్య కూడా పెరిగిపోయింది.
ఒకరోజు రష్ తగ్గే సమయానికి..
“అమ్మా! మీరు రెస్టారెంట్ మూసేసే సమయం అవుతోంది. ఇక్కడికి వస్తే నా మనసుకెంతో ప్రశాంతత దొరుకుతుంది. రేపు సాయంత్రం కోసం ఎదురు చూసి మళ్లీ వస్తా!” అంది ఒక నడివయస్కురాలు.
సాగరిక చేతులెత్తి నమస్కారం పెట్టి..
“తప్పకుండా మేడమ్!” అంది.
“వారంనుంచీ ఒక్కరోజూ వదలకుండా మీ రెస్టారెంట్‌కి వస్తున్నాను. ఇంకా ‘మేడమ్’ ఏమిటమ్మా? నన్ను మీరంతా ‘ఆంటీ’ అని పిలవండి. నాకు ఆత్మీయంగా ఉంటుంది. అన్నట్టు.. నా పేరు వనజ” అందామె. రోజులు నెలలుగా మారాయి. సాగరిక, వనజ మధ్య బంధం బలపడింది. తనకు సెలవున్న రోజుల్లో వనజ కూరగాయలు, పప్పులు-ఉప్పులు కొనేటప్పుడు ఆమెతో తోడు వెళ్లేది సాగరిక.
ఒక రోజు వనజ..
“నా స్నేహితురాలు కొత్త సంవత్సరం క్యాలెండర్ కోసం కొత్త మోడల్స్ కోసం వెతుకుతోంది. మీలో ఎవరైనా సాయం చేస్తారా?” అని అడిగింది. అందరూ యాసిడ్ దాడిలో అందం కోల్పోయిన వాళ్లు గనుక ఈవిడకి ఏమైందన్నట్టు వింతగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. స్వీటీ తన చెంపను నిమురుకుని కళ్లలో నీళ్లు నింపుకొంది.
వనజకు ఆ అపార్థం అర్థమై..
“అబ్బే! మా ఫ్రెండ్ సంకల్పం వేరు. యాసిడ్ దాడిని తట్టుకుని, ప్రపంచానికి ఎదురు నిలిచిన ధీరవనితలతో వచ్చే ఏడాది క్యాలెండర్ చేయాలనేది ఆమె ఉద్దేశం. మీరు సహకరిస్తారా?” అని అడిగింది.
స్వీటీ ప్రోత్సాహం వల్ల అందరూ మోడలింగ్ చేయడమే కాదు, తమ ధీరగాథలను టూకీగా చెప్పుకొన్నారు కూడా! ఒక ప్రఖ్యాత సంఘసేవిక ఈ క్యాలెండర్ గురించి ప్రస్తావించి, వీళ్ల పోరాట పటిమను మెచ్చుకుంటే.. కొన్నాళ్లు సోషల్ మీడియాలో విధిని ఎదురించిన ఈ వీరనారులు హల్చల్ చేశారు. స్వీటీకి ఇప్పుడు జ్ఞానోదయమైంది. శారీరక సౌందర్యం ఒక్కటే ముఖ్యం కాదనీ, బాహ్య సౌందర్య విహీనులైనా జీవితాన్ని దర్జాగా బతకవచ్చని!
అప్పుడప్పుడూ సాగరికని మాల్కి తీసుకుని వెళ్లమనీ, ఖరీదైన బట్టలు కొనివ్వాలని చూసేది వనజ. కానీ, సాగరిక సున్నితంగా తిరస్కరించేది. అప్పుడప్పుడూ ఏదైనా పార్క్‌కి వెళ్లి తాజా గాలి పీల్చుకునేవారు వాళ్లిద్దరూ.
కొన్నాళ్లకు వనజ అక్కడికి రావడం మానేసింది. అందరూ ఆవిడను మిస్సయ్యారు. ఆవిడ బాగోగుల గురించి సాగరికని అడిగారు. ఆమె అందరికన్నా ఎక్కువగానే వనజను తలచుకున్నా.. తన సెలవు రోజులు వనజకి అంకితం చేసినా, సాగరిక ఆమె గురించి ఏమీ తెలుసుకోలేదు. కనీసం ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా, వనజ రెస్టారెంట్లోనే చర్చించేది మరి! తమ సంస్థ నియమాల ప్రకారం అక్కడికి వచ్చే స్త్రీలకి ఊరటనివ్వడమే తమ బాధ్యత గానీ.. అవతలి వాళ్లని ఇబ్బంది పెట్టి వాళ్ల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదు. అలాగే తను నడుచుకుంటోంది. కానీ, అప్పుడప్పుడూ ఈవిడ తనపై మాత్రం ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తోందా? అని ఆలోచించేది సాగరిక. అంతు తోచేది కాదు, పాపం!
వనజని మిగిలినవాళ్లు మరచిపోయే సమయానికి.. ఒక సాయంత్రం ఒక యువకుడు, ఒక యువతితో కలిసి రెస్టారెంట్‌కి వచ్చాడు. సాగరిక గురించి అడిగి, అందరినీ పిలిచి ఇలా చెప్పాడు.
“నేను వనజగారి అబ్బాయిని. పేరు అభిజిత్. ఈమె నా భార్య భాషిణి. మా అమ్మగారు ఓ గంట క్రితం పోయారు” అన్నాడు. అందరూ బాధపడితే, సాగరిక బాధతో కన్నీరు మున్నీరయ్యింది. వెంటనే తేరుకుని, కన్నీటిని నియంత్రించుకుంది. అతను..
“మూడు రోజుల క్రితం ఆవిడకి గుండెపోటు వచ్చింది. తట్టుకుంటారనే అనుకున్నామండీ. కానీ..” అంటూ రుమాలుతో కళ్లు తుడుచుకున్నాడు. సాగరిక మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ల ముందు వనజ ఆంటీతో తను గడిపిన మధుర స్మృతులు మెదిలాయి.
“మా నాన్నగారు చాలా ఏళ్ల క్రితమే పోయారు. అప్పటినుండీ ఆవిడ నాతోనే ఉంది. కానీ, మా చెల్లి పోయాక మా సొంతూరైన ఈ ఊరికి వచ్చింది మా అమ్మ. ఇక్కడున్న వంట మనిషి, పని మనిషి ఆవిడకి కొన్ని దశాబ్దాల నుండీ తెలుసు. వాళ్ల సాయంతో బతికేస్తానంది. ఆవిడ ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన డైరీ తెమ్మని చెప్పారు. అందులో ముందుచూపుతో బుక్‌మార్క్ చేసిన తేదీలలో మీ రెస్టారెంట్ గురించి, మీ గురించి ఉన్నాయి. ఆవిడ చదవమంటే చదివాను.
మీరు వయోవృద్ధుల కోసం నిర్వహించిన పోషక విలువల శిబిరంలో మా అమ్మ కూడా పాల్గొన్నారట. అప్పుడు మీరు అమితంగా నచ్చారట. పైగా, మిగిలిన వారిలాగా కాకుండా మీరు ఎవరినో తప్పించబోతూ యాసిడ్ దాడికి గురయ్యారట కదా! దానివల్ల ఆవిడకు మీమీద ఉండే గౌరవం రెట్టింపయ్యిందట. అదికూడా ఆవిడ డైరీలోని వివరమే! మీ సెలవు రోజుల్లో ఆవిడకి సాయం చేశారట కదా! సహాయకులు ఇంట్లో ఉన్నా మీతో సమయం గడపడానికి ఆవిడ ఆ పని చేశారట. ఆవిడ మీకు ఏమైనా ఇవ్వజూస్తే మీరు మర్యాదగా వద్దనే వారటగా! మీ మంచితనానికి ఆవిడ ఫిదా అయిపోయారు.
మరి, పేజీల నిండా మిమ్మల్ని మెచ్చుకుంటూ, మా అమ్మ మీ ఔన్నత్యాన్ని చాటడంలో ఆశ్చర్యం లేదు కదా! మా చెల్లి పోయిన బాధను ఆవిడ మీవల్లే అధిగమించారని చెప్పగలను. ఆమె పోయాక.. తన చర్మాన్ని శరీరం కాలినవాళ్లకు ఇవ్వాలని చాలా రోజులుగా చెప్పేవారు. ఆవిడ కోరిక ప్రకారం ఆవిడ భౌతికకాయాన్ని ప్రభుత్వాసుపత్రిలో పొందుపరిచాం. ఆవిడ రాసుకున్న డైరీలో మీకు తన చర్మాన్ని ఇమ్మన్నట్టు ఉంది!” అంటూ ముగించాడు అభిజిత్. ఏం చెప్పాలో తెలియని అయోమయంలో మునిగిపోయింది సాగరిక.
“మీ చెల్లెలు.. పాపం చిన్నవయసులోనే పోయినట్టుంది” అని సంతాపం ప్రకటించింది స్వీటీ.
“ఆమె కూడా మీలాగా యాసిడ్ దాడి బాధితురాలే! అన్ని వనరులూ ఉండి, సమయానికి చర్మం దొరక్కపోవడంతో మేం ఆమెను కోల్పోయాం. అప్పటినుంచీ, అమ్మే కాదు.. నేనూ, నా భార్యా కూడా చనిపోయాక బతికున్నవాళ్లకి ఉపయోగపడాలని తీర్మానించుకున్నాం. అందుకని, సాగరికగారూ, మీరు వెంటనే వస్తే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకి వెళ్దాం. ఎంత తక్కువ సమయం తీసుకుంటే అంత మంచిది. అందుకే, ఆవిడ పోయిన గంటలోనే ఇటొచ్చాను. డాక్టర్ సర్జరీ తేదీ నిర్ణయిస్తారు” అన్నాడు అభిజిత్.
రెండు క్షణాలు మౌనంగా ఉన్న సాగరిక..
“సర్! నాకు ఆంటీ అంటే చాలా ప్రేమ. అందుకు ప్రతిఫలంగా నేను ఆమె చర్మంతో నా మొహాన్ని అందంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆవిడతో నేను గడిపిన సమయం ఒక నిష్కామకర్మ అనే అనుకున్నాను. దాన్ని ఇలా ఎక్స్చేంజ్లా మార్చడం తప్పు. మేమంతా యాసిడ్ బారినపడి, జీవితాన్ని పోగొట్టుకున్నవాళ్లమే! కానీ, అసలైన జీవితం అంటే ఏమిటో.. ఈ ‘ఛాఁవ్ స్వచ్ఛంద సంస్థ’ వాళ్లు మాకు నేర్పించారు. నాకు ఈ రూపం కూడా ఇష్టమే! అందరిలోనూ చిన్నపిల్ల, పెద్ద ఆశలు ఉన్న పిల్ల.. మా స్వీటీకి
ప్లాస్టిక్ సర్జరీ చేయించండి!”..
స్థిరమైన మనసుతో చెప్పింది సాగరిక. సాగరిక మాటలతో నివ్వెరపోయిన స్వీటీ.. ఆ తరువాత ఆనందబాష్పాలతో ఆమెను హత్తుకుని, ధన్యవాదాలు తెలిపింది.
యాసిడ్ దాడికి గురైన మహిళలకు నీడనిచ్చి, ఆత్మస్థయిర్యం పెంపొందించే ‘ఛాఁవ్ ఫౌండేషన్’కు, వారి ప్రేరణతో పెట్టిన రెస్టారెంట్లో ధైర్యంగా ఉద్యోగాలు చేసుకుంటున్న ‘షీరోస్’కూ ఈ కథను అంకితమిస్తున్నారు డా. చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి. వీరి స్వస్థలం విశాఖపట్నం. ఎంబీఏతోపాటు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని రైల్వే నిర్మాణ విభాగంలో ఫైనాన్షియల్ ఎడ్వయిజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. 2011 నుంచి రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.
తెలుగు, ఆంగ్లంలో కలిపి 130 వరకూ కథలు, రెండు నవలలు రాశారు. వీరి మొదటి కథ.. ఫెయిత్ ఇన్ అప్బ్రింగింగ్ (ఆంగ్లం), తెలుగులో రాసిన మొదటి కథ.. ఓ బలహీన క్షణాన. వీటితోపాటు అవగాహన, పిచ్చి డాక్టరమ్మ, తోడు, ఓ వర్షం కురిసిన రాత్రి, కత్తిలాంటమ్మాయి, యమలోకం వర్షన్ 2.0, ఆపన్నహస్తం, హస్తవాసి కథలు మంచి గుర్తింపు పొందాయి. వీరి మొదటి నవల ‘అపజయాలు కలిగిన చోటే..’ మహిళావాణి కార్యక్రమంలో ‘నవలా స్రవంతి’ పేరిట ప్రసారమైంది. ‘తెలుగు తల్లి కెనడా’ ఏటా నిర్వహించే పోటీల్లో ఆరుసార్లు బహుమతి గెలుచుకున్నారు. యాసిడ్ దాడి బాధితుల ఫొటోలతో రూపొందించిన ‘అన్యూజువల్ కాలెండర్’తో స్ఫూర్తిపొంది.. ఈ కథ రాసినట్లు రచయిత్రి చెబుతున్నారు.
– డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి, 94451 84363