మేమెప్పుడు హైదరాబాద్ వెళ్లినా.. మా కజిన్స్ హైమక్క, లక్ష్మి వాళ్ల ఇంట్లోనే ఉండేవాళ్లం. వాళ్లు ఏ కొత్త ఫ్యాషన్ వచ్చినా.. ఆ బట్టలు వేసుకునేవాళ్లు. లక్ష్మి అయితే.. మాక్సీలు, పంజాబీ డ్రెస్సులు, బెల్ బాటమ్ పాయింట్లు వేసుకునేది. మేము కూడా అప్పుడప్పుడూ వాటిని ఫాలో అయ్యేవాళ్లం.
మేం అయితే.. మా సమస్య ఏమిటంటే మేముండేది పల్లెటూళ్లో. లంగా, జాకెట్ తప్ప ఏ కొత్త డ్రెస్ వేసినా.. జనం వింతగా చూసేవాళ్లు. మాకు సపోర్ట్ ఒక నానమ్మ మాత్రమే! మేము ఏ డ్రెస్సు వేసినా.. “ముద్దుగున్నరు.. చిలుకలోలిగ!” అనేదామె. నాన్నేమో బట్టల రంగు, నాణ్యత చూసి బాగా సెలెక్ట్ చేసేవాడు. ఫ్రాకులు కొనుక్కురావడమో, పరికిణీల బట్టలు తేవడమో చేసేవాడు. మా చిన్నప్పుడు తనే తెచ్చినా ఆ తరువాతి రోజుల్లో ఎక్కువసార్లు మమ్మల్ని వెంట తీసుకెళ్లి కొనిచ్చేవాడు. అవి అందరికీ నచ్చేవి కూడా.
మాకు పన్నెండేళ్లు దాటినప్పటి నుంచీ.. మేము ఫ్రాకులు వేసుకోవడాన్ని అమ్మ ఇష్టపడకపోయేది. ఎందుకోగానీ కొన్ని విషయాలు చాలా వివరంగా చెప్పినా.. స్థిరంగా, కఠినంగా చెప్పేది. “కాళ్లు గట్ల బయటికి కనపడొద్దు. కావాల్నంటే ఇంట్ల వేసుకోండి. మీరు బయటికి పోయేటప్పుడు గౌన్లు వేసుకుంటె నేను ఒప్పుకోను” అనేది. ఆ తరువాత మేము పంజాబీ డ్రెస్సులు, చుడీదార్ పైజామాలు వేసుకుంటే అమ్మ కాస్త తేరిపార చూసి.. “ఏం బట్టలో ఎమ్మో! మంచిగ లంగా జాకెట్లు తొడుక్కోక.. ఎందుకవి?!” అనేది. మా కట్టూ బొట్టూ విషయంగా అమ్మ స్ట్రిక్టుగా ఉండేది. అందువల్ల టీనేజీలో కూడా అతిగా అలంకరించుకోవడం, బుట్టెడు పూలు పెట్టుకోవడం మాకెన్నడూ అలవాటు లేదు.
ఆ క్రమంలో నేనూ అక్కా ఓసారి పెద్దపెద్ద పువ్వులున్న మాక్సీలు కొనుక్కున్నాం. అప్పుడవి బాగా ట్రెండ్ కూడా. దేవానంద్ ‘హరేరామ హరేకృష్ణ’ సినిమాలో జీనత్ అమన్ మొదటిసారిగా వేసుకున్నాక బాగా పాపులర్ అయినట్టు గుర్తు. తీరా వాటిని వేసుకున్నాక అమ్మకు అస్సలు నచ్చలేదు. “అబ్బ.. గివ్వేం బట్టలే? గుంటూరు గురువుల గౌన్ల తీరుగ ఉన్నయి” అని వెక్కిరించడం మొదలుపెట్టింది. అంటే మతగురువులు వేసుకునే గౌన్లలా ఉన్నాయని. నిజానికి అవి ఒళ్లు కనిపించేలా ఏమీ ఉండవు. ఇప్పటి నైటీల్లాగా.. కాకపోతే ఇంకొంచెం అందంగా ఉండేవి. కానీ వేసుకునే బట్టలు ఫ్యాషన్ కోసం కాక, సౌకర్యంగా ఉండాలనీ, అసభ్యంగా ఉండొద్దనీ అమ్మ మాకు పదేపదే చెప్పేది.
ఒకట్రెండు సార్లు వాటిని వేసుకున్నప్పుడల్లా అమ్మ నవ్వుతూ.. “ఆఁ రాండి.. రాండి గురువుగారూ!” అని బాగా ర్యాగింగ్ చేసింది. చివరికి అక్కా, నేనూ ఓసారి ఏదో ఊరికి వెళ్లి వచ్చేసరికి వాటిని కట్‌చేసి కర్టెన్లుగా మార్చేసింది. మేము తిరిగొచ్చాక కొత్త కర్టెన్లను చూసి ఏమీ చేయలేక కాసేపు గులిగి ఊరుకున్నాం.
మరోసారి హైదరాబాద్‌కు వెళ్లినపుడు అక్కడ అమ్మాయిలందరూ బాగా వదులుగా ఉండే ప్యాంట్లు, రకరకాల షర్టులు వేసుకోవడం గమనించాం. మా లక్ష్మితోపాటు తన ఫ్రెండ్స్ కూడా ఆ డ్రెస్సులు వేసుకోవడం గమనించాం. “మనం మాత్రం ఎందుకు వేసుకోవొద్దు?! కొనుక్కుందాం” అని గట్టిగా నిర్ణయించుకున్నాం.
నాన్న దగ్గర చెరో పక్కా చేరి ఓ రెండు మూడు రోజుల అప్పీల్ తరువాత శాంక్షన్ చేయించుకున్నాం. “ఇప్పుడు పండుగా.. పబ్బమా? కొత ్తబట్టలెందుకు? సరే.. వొడ్లు ఒచ్చినాంక కొనిస్త” అన్నాడు నాన్న. మొత్తానికి వడ్లు అమ్మి డబ్బులొచ్చేదాకా ఫాలోఅప్ చేసి.. చివరికి నాన్నను తీసుకుని హన్మకొండకు వెళ్లాం. అప్పట్లో హన్మకొండ చౌరస్తా సెంటర్లో ప్రకాశ్ క్లోత్ స్టోర్స్‌కి నాన్న తీసుకెళ్లాడు. మా నాన్న ధోతి, కమీజు తొడుక్కునేవాడు. అందుకనో ఏమో అక్కడ ఒక ధోతి, అంగి తొడుక్కున్న సేల్స్‌మ్యాన్ మా దగ్గరికి వచ్చాడు. “ఆడి పిల్లగాండ్లకు ఇప్పుడు గవేవో ప్యాంట్లు, అంగీలు ఒస్తున్నయట గద! మా పిల్లలకు చూయించండి” అన్నాడు నాన్న. అదేదో మహాపరాధంలాగా.. మా నాన్నను మేమేదో సతాయించినట్టుగా ఆయన ఒక చూపుచూశాడు. ఎందుకోగానీ, మేము ప్యాంటూ – షర్టూ వేసుకోవడాన్ని ఆయన అసలే జీర్ణించుకోలేక పోయాడు అనిపించింది.
“అమ్మాయిలకు మాధవరం లంగాల బట్టలియ్యనా? వెంకటగిరి లంగాల బట్టలు చూపియ్యనా!?” అని ఆయన మా ఆలోచనలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశాడు. కానీ, మేము వినలేదు. చివరికి ఆయన ముదురు ఎరుపు రంగు, నారింజ రంగు ప్యాంటు బట్టలు మాకోసం సెలెక్టు చేశాడు. అవే రంగులున్న మెత్తటి చీజ్ కాటన్ షర్టు బట్టలు తీసి చూపించాడు. మాకెందుకో అంత ముదురు రంగులు.. పైగా పైకీ కిందికే ఒకటేలా నచ్చలేదు. “లైట్ కలర్స్ లేవా!?” అంటే.. “మీ అమ్మాయిలు మంచి రంగున్నరు. లైట్ కలర్స్ ఎందుకండీ?” అని అతనే నిర్ణయం చేసి.. గబగబా బట్ట కట్‌చేసి ఇచ్చాడు. బాంబే టైలర్ దగ్గర ఆ బట్టలు కుట్టించాడు నాన్న. పెద్దపెద్ద కుట్ల దారాలు పైకి కనిపించేలా.. కుక్క నాలుకల్లాంటి కాలర్స్ పెట్టి ఆ డ్రెస్సులు కుట్టి, “ఇదే లేటెస్ట్ ట్రెండ్!” అన్నాడు.
మొత్తానికి ఆ బెల్ బాటమ్ ప్యాంటూ, షర్టూ.. ఎర్రది అక్కా, నారింజ రంగుది నేనూ వేసుకోగానే.. మా అమ్మ నవ్వాపుకొంటూ “పోయిపోయి గీ రంగులేందే.. బెదురు పెట్టినట్టు! చెరొక హంటర్ కొనుక్కోకపోయిన్రు! అయితెమానె గాని, గొడ్లకు ఎదురుంగ పోకండి.. కుమ్మగల!” అన్నది. మాకు ఉక్రోషం వచ్చింది గానీ ఏం చేస్తాం?! మొత్తానికి అంత డబ్బు పెట్టి కొన్న ఆ బెల్ బాటమ్స్ ఓ రెండుసార్లు వేసుకున్నామో లేదో.. మా అమ్మ ఎవరో దూరం బంధువొకాయన.. రమేష్ మామ అనుకుంటా! ఆయనకు అక్క డ్రెస్ ఇచ్చేసింది. “అయ్యో! నాకెందుకు అక్కయ్యా! ఇవి ఆడపిల్లలు తొడుక్కునేవి” అన్నాట్ట ఆయన. “ఏం కాదు! బాగుంటే తొడుక్కో.. లేకపోతే ఎవరికైనా ఇచ్చేయ్! కండ్ల ముందర చూడలేకపోతున్న!” అన్నదట అమ్మ.
ఇక నా డ్రెస్ మా పశువులను కాసే ఎల్లయ్య కొడుక్కు ఇస్తే.. ఆ పిల్లగాడు అప్పుడప్పుడూ మా ఇంటికి వేసుకొచ్చేవాడు. బాగానే ఉండేది గానీ.. ఎక్కడో ఏదో తేడాగా ఉండేది. అది మా ఎంపిక కాదు గానీ, మా రాంగ్ సెలక్షన్ ఎదురుగా అంత ఘోరంగా కనిపిస్తుంటే.. ఆ కుర్రాణ్ని పిలిచి “నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్యాంటు, షర్టు వేసుకొస్తే ఊరుకోను!” అని బెదిరించా. మొత్తానికి వాడు భయపడ్డాడో, తనకు కూడా విరక్తి కలిగిందో గానీ.. ఆ తరువాత ఆ డ్రెస్సు వేసుకురాలేదు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి