మా చిన్నప్పుడు కొన్ని పెళ్లిళ్లలో ఓ వ్యక్తి అక్కడున్న వాళ్లందరికీ కాగితాలు పంచుతూ కనిపించేవాడు. మేమంతా ‘మాయాబజార్’లో కౌరవులు దస్తీల కోసం ఎగబడ్డట్టుగా.. ‘మాకు.. మాకు!’ అంటూ వెంట పడేవాళ్లం. కానీ, మాకివ్వకుండా.. “ఎహె! మీకెందుకు?” అని వెళ్లిపోయేవాడు.
పెళ్లి అవగానే ఆ కాగితాలు పంచేవ్యక్తి.. వధూవరులకు కట్నాలు పెట్టేవాళ్ల పేర్లు చదువుతున్నాయన దగ్గర్నుంచి మైకు గుంజుకుని.. తను తెచ్చిన పేపరులో ఉన్న విషయాన్ని పెద్దగా చదవడం మొదలు పెట్టేవాడు. ఇంతకూ అదేమిటంటే.. ఆ పెళ్లికొడుకు – పెళ్లికూతురును ఆశీర్వదిస్తూ ఆయన రాసిన కవిత్వం.
‘రవీందర్ – వనజల వివాహ మహోత్సవానికి అక్షరాల అక్షింతలు’ .. ఇలా ఉండేది టైటిల్. ఉదాహరణకు అమ్మాయి పుట్టింటివారి పేరు ‘కందుల’, వరుడి ఇంటి పేరు ‘వనం’ అనుకోండి. ‘కందుల వారింట పుట్టిన కన్యామణి – వనం వారింట మెట్టిన వధూమణి – జనం ఆశీస్సులు పొందిన ఈ జలజామణి – భోజనం పెట్టించే ఈ వనజామణి’.. అంటూ అంత్యప్రాసలతో మొదలై ఎన్నో చరణాలపాటు అలా సాగుతూనే ఉండేది. ‘మరి వరుడో.. ఆ మరుని మించిన వలపుల చెలికాడు – ఆ రవిని మించిన తేజస్సు కలవాడు! ఆ పట్టిని చేపట్ట తగినవాడు – ఈ వనజకు అన్నివిధాలా సరిజోడు – మన వనం రవీందరుడు’.. ‘చూడ చక్కని ఈ జంట – చూచు వారి కన్నుల పంట – అమ్మాయి నడుస్తుంది అబ్బాయి వెంట – ఆనంద బాష్పాలు అమ్మాయి తల్లిదండ్రుల కంట’.. ఇలా చెలిమెలో నీళ్లు ఊరినట్టుగా అలా చదువుతూనే ఉండేవాడు.
అంతా అయిపోయాక.. కిందకు దిగి కొంచెం తలెత్తి మిగతా వాళ్లందరి కేసి ‘చూశారా నా ప్రతాపం?’ అన్నట్టు చూసేవాడు. కొందరు ఆయన దగ్గరికి వెళ్లి.. “ఏం జెప్పినవ్ అన్నా! మస్తు కలిపినవ్ మాటలు” అనీ.. “అరె! నీకు గింత కవిత్వం వొస్తదని మాకు ఎర్కనే లేదు. ఎప్పడు జెప్పకనే పోతివి!” అనీ.. “ఇంకేంది.. ఇగ గిట్లాటివన్ని కలిపి ఒక బుక్కు తియ్యి! మంచిగుంటది” అనీ, “నువ్వు అసల్కు సిన్మలల్ల ట్రై జేసేటిది ఉండె!” అనీ అభినందిస్తుంటే.. ఆయన బుగ్గలు ఉబ్బించి మహదానంద పడిపోయేవాడు.
ఆయనటు వెళ్లగానే వాళ్లల్లో కొందరు.. ‘ఆ! ఏమున్నది!? అల్కటి పని. ఓ పైసలు జదివియ్యాల్నా.. కట్నం పెట్టాల్నా.. ఏమన్ననా? రెండు మాటలు రాసుకొస్తె అయిపాయె. అదటు.. ఇదిటు! పేరుకు పేరొచ్చె. పైస కర్చు లేకపాయె! మంచి ఉపాయం!” అనేవారు. ఇప్పుడు పుస్తకావిష్కరణల్లో కూడా ఇచ్చిన పుస్తకాలను కుర్చీల్లోనే వదిలేసి వెళ్తున్నారుగానీ.. అప్పట్లో చాలామంది “ఉండనీ తియ్యి! ఇంటికి పొయ్యినాక చూద్దాం!” అని వాటిని వెంట తీసుకెళ్లేవారు.
ఆ తరువాత రోజుల్లో నేను మా బడిలో ఎవరైనా జాతీయ నాయకులపైన గానీ, ప్రకృతిపైన గానీ, కొన్ని టాపిక్స్‌పైన గానీ రాయాల్సి వచ్చినప్పుడు ఇదే పద్ధతి పాటించేదాన్ని. అసలు కవిత్వం ఇలాగే రాస్తారేమోనని అనుకునేదాన్ని. దానికితోడు పెళ్లిళ్ల శుభాకాంక్షల కవిగారిని పొగిడినట్టే నన్ను కూడా మా ఫ్రెండ్స్.. “రమకైతె అన్నొచ్చు. మంచిగ కవిత్వం రాస్తది!” అని పొగిడి అంతటితో ఆగక.. “మా పెద్దక్క పెండ్లికి రాసియ్యవానోయ్! ప్లీజ్ ప్లీజ్!” అని బతిమిలాడేవారు. మనం మరీ బలి, శిబి, దధీచి వదాన్యవరులంత కాకపోయినా.. గట్టిగా ఎవరైనా అడిగితే వానలో ఉంచిన సబ్బులాగా కరిగిపోయే కేరెక్టర్ గదా! వెంటనే “ఎస్.. డన్! శుభలేఖ ఏదీ?” అనడిగేదాన్ని. ఇక.. నేను కొంచెం వెరైటీగా పెళ్లి పెళ్లికీ, మనిషి మనిషికీ కొత్తదనం చూపించడానికి ప్రయత్నించేదాన్ని. ‘తోట వారింట పూచిన మందారం.. కోట వారికి తెచ్చెను సింగారం.. బాట వేసిన మా రాజు బావ బంగారం.. పాట పాడే మా శోభక్క పాపిట సింధూరం’.. ఇలా రాసేదాన్ని.
ఆ నోటా ఈ నోటా ఈ శుభాకాంక్షల కవిత్వం సంగతి మా ఊర్లోని ఓ సేటుగారి కొడుక్కి తెలిసింది. ఆయన పేరు మూర్తి. ఆయన ఓరోజు పొద్దున్నే మా ఇంటికి వచ్చి ఓ శుభలేఖ ఇచ్చి.. “అమ్మాయిని పెండ్లి శుభాకాంక్షలు రాసియ్యమని అడుగుదామని ఒచ్చిన!” అని మా నాన్నకు చెప్పాడు. నాన్న వెంటనే నన్ను పిలిచి.. “ఇతను అడుగుతున్నదట రాసిస్తవా?” అని అడిగాడు. నా ప్రతిభ ఇంత తొందరగా ఈ దేశపు రాజుగారికి తెలిసినదా అనుకుని.. ఇంచుక కీర్తి కండూతికి లొంగినదానినై.. “ఎస్.. డన్!” అంటిని. ఏ బలహీన క్షణంలో ఒప్పుకొన్నానో గానీ, అది మొదలు.. ఆయన వాళ్ల సకుటుంబ సపరివార, బంధుమిత్ర సమూహంలో ఎవరి పెళ్లయినా, పొద్దున్నే నవ్వు మొహంతో, చేతిలో ఓ శుభలేఖతో మా ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేవాడు. అ తరువాత సీమంతాలకూ, పిల్లలు పుట్టాక ఊయలలో వేసేటప్పుడు, అమ్మాయిలు పెద్దమనుషులయినప్పుడూ.. ఇలా ఆయన పొద్దున్నే ఓ స్లిప్ మీద పేర్లూ, వంశకీర్తులూ రాసుకొచ్చాడంటేనే.. నాకు మూడిందన్నట్టే!
కొన్నాళ్లకు విశేషణాలూ, వర్ణనలూ రాసీరాసీ నాకే విసుగు పుట్టి.. “నాకు శానా పని ఉందండీ. కుదరదు!” అనేదాన్ని. “ఈ ఒక్కసారికి రాయమ్మా!” అని బతిమిలాడే వాడాయన. మా నాన్న అక్కడే ఉంటే నా బెట్టు ఏ మాత్రం పనిచేయకపోయేది. ‘ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు.. అది మంచి కోసమే అయినప్పుడు.. మనం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు చేయకుండా ఉండటం నేరం’ అనే మా ఇంటి సూక్తిని ఫ్రేమ్ కట్టి గుండెలో వేలాడదీసుకున్నాను గనుక ఏమనలేక పోయేదాన్ని. చివరికి నా పెళ్లయ్యాక మా ఇంటికి కూడా రావడం మొదలుపెట్టాడాయన. మరి కొన్నాళ్లకు ఎన్నో పరిణామాల తరువాత మూర్తి గారికి ఏమైందోగానీ రావడం మానేశాడు. కానీ, నన్ను గతం వెంటాడుతూనే ఉంది. బ్యాంకులో ఏ ఎగ్జిక్యూటివ్‌కు ట్రాన్స్ఫర్ అయినా ఏర్పాటుచేసే వీడ్కోలు సభలోనో, పదవీ విరమణ సన్మానానికో నా బాపతు శుభాకాంక్షల పర్వం ఉండాల్సిందే! అడిగి మరీ రాయించుకునేవారు. నాకు మొహమాటంతో తప్పేది కాదు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి