‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
శంకరయ్య ఈ మధ్య రెండు చేతులా బాగా సంపాదిస్తున్నాడు. బెల్లం చుట్టూ ఈగలన్నట్టు.. డబ్బుతోపాటు జనాల రాకడ కూడా చిన్నగా మొదలైంది. అప్పుల కోసమని వచ్చే పని పాటలోల్లు, ఎలక్షనొస్తే ఇంటిముందు తచ్చాడే కార్లు, తెల్ల చొక్కాలు.. నేలమిందున్న మనిషిని కాస్తా గాల్లోకి ఎక్కిస్తున్నాయి. అవన్నీ చూసి చూసి తనకు తెలియకుండా తనే ఒక గొప్ప వ్యక్తిలా, తనకు ఎదురెవరు వస్తార్లేననే ఒక రకమైన కుంచిత స్వభావంలోకి కూరుకుపోతున్నాడు రోజురోజుకూ. ఎవరూ ఎదురు తిరగనన్ని రోజులూ శంకరయ్య వీరత్వాలు బాగనే సాగినాయి గానీ.. ఒక దెబ్బ మాత్రం గట్టిగా తగిలింది. ఆ దెబ్బ కొట్టినోడు అతనికంటే బలవంతుడో.. లేకుంటే ఎక్కువ పలుకుబడున్నోడో అయ్యుంటే పెద్దగా పట్టించుకోకపోవును గానీ, అది ఒక ఆడామె కావడంతోనే వచ్చి పడింది చిక్కంతా.
మల్లన్నది చిన్న సంసారం. లోకం పోకడ ఒంటబట్టలేదు. మనిషి బాగా మెతక. నాయన పంచిచ్చిన తాతల కాలం నాటి కొంచెం భూమినే దున్నుకుంటూ, అందుబాటులో ఉన్న భూములు కౌలుకో, గుత్తకో చేసుకుంటూ రేయింబవళ్లు ఒళ్లు దాచుకోకుండా కష్టపడి.. ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేసినాడు సంవత్సరం అటు ఇటుగా. అంతా అయిన తర్వాత చూస్తే రెండు లక్షలు అప్పు తేలింది. దానికి తోడు కొడుకు చదువు ఉండనే ఉంది. ఒంట్లోని చెమట మొత్తం చిందించైనా కష్టపడి పని చేసేంత శక్తి ఉంది గానీ, ఆ శ్రమకు తగ్గ భూమే లేదు. కౌలుకు చేస్తూ ఎన్ని రోజులని అనుకుంటుండగా.. గంగన్న తన ఎకరా భూమి అమ్మాలని అనుకుంటున్నాడనే మాట మల్లన్న చెవిన పడింది. ఆలోచనల్లో పడ్డాడు మల్లన్న. ఎకరా ఎనభై వేలు. అది చదును చేసి తయారు చేపించడానికి ఇంకో ఇరవై ముప్పై వేలు అవుతుంది. మంచి పొలమే కాబట్టి కాలం కలిసొస్తే చేతినిండా పైరు తియ్యొచ్చులేనని కొనుక్కున్నడు. కొన్నడే గానీ అది మాన్యం భూములైందాన రిజిస్ట్రేషన్ కాలేదు కానీ, పొలం చేసుకోవడానికి ఏం ఇబ్బంది లేదు.
అలా గడిచిపోయి ఉంటే ఏ సమస్య లేకుండా అయిపోవును. గానీ కాలం ఊరకెక్కడ ఉండనిస్తుంది? గొడవంటే పెద్ద గొడవేమీ కాదు. గట్టిగా నాలుగు సెంట్ల నేల. మల్లన్న కొన్న పొలం కింద రెండెకరాల డీకేటీ భూమి (నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి)ని శంకరయ్య పట్టా చేయించుకున్నాడు. ఎంత కాదనుకున్నా మల్లన్న తన దాయాదే.. ‘నాలుగు సెంట్ల నేల పోతే పోయిందిలే! మల్లన్న డబ్బు పెట్టి కొనుక్కున్నాడు. నాది డీకేటీ గదా!’ అని శంకరయ్య అనుకుంటే సరిపోవును. గానీ ‘నాకు అడ్డ మెక్కడ వస్తార్లే!’ అని సర్వేయర్ ద్వారా కొలతలేపిచ్చి.. “నాకు అక్కడిదాంకా వస్తాది. మీ ఉద్ది అక్కడికి పెట్టుకోండి” అని రాయి పాతించాడు.దానికి మల్లన్న ఒప్పుకోలేదు.
“ఇప్పుడున్నెది పాత ఉద్ది కదా! దాన్ని కదిలిస్తే నా పొలం జేడెలు పడి నాశనమవుతుంది కదా” అన్నాడు. నువ్వెంతంటే నువ్వెంతని అర్సుకున్నారు. గొడవ పెద్దదైంది. ఈ గొడవలో మల్లన్న ఒంటరివాడిగా మిగిలితే.. తమ్ముళ్ల బలంతో శంకరయ్య మరింత బలవంతుడయ్యాడు. అప్పటివరకూ శంకరయ్యదే తప్పని మల్లన్న దగ్గర ఊదరగొట్టినోళ్లంతా.. తీరా గొడవ ముదిరాక ఏమీ తెలీనట్టు మౌనంగా జారుకున్నారు.పెద్ద గెట్టు తవ్వియ్యాలని మర్సటి రోజు మనుషుల్ని పిలుచుకొచ్చాడు శంకరయ్య. వెంట వాళ్ల నాయిన తమ్ముడు, ఇంగా కొంతమంది కూడా వచ్చినారు. ఇవతల పక్క మల్లన్న, మల్లన్న భార్య సంటెమ్మ మాత్రమే. తవ్వడం మొదలుపెట్టగానే వెళ్లి పని ఆపినాడు మల్లన్న.
“నా సర్వే నెంబరు ప్రకారం నాకు అక్కడివరకూ వస్తుంది. నువ్వెవరు నన్ను ఆపేదానికి” అని మల్లన్న మీదకొచ్చాడు శంకరయ్య.“నీదెట్ట ఐతది..! డీకేటీ భూమిని పట్టా చేపిచ్చుకున్నోడివి నువ్వు. లెక్కపెట్టి కొన్నోన్ని నేను. అదిగాక పాత గెట్టు పోతే పొలం నాశనం అవ్వదో”.. ఆవేశంగా అన్నాడే గానీ, వాళ్ల చుట్టూ ఉన్న జనబలం చూసి లోపల జంకుగానే ఉంది మల్లన్నకు.“వాటన్నిటితో నాకు పనిలేదు. నా సర్వే నెంబరు ఉన్న కాడికి నేను తీసుకుంటా” అని శంకరయ్య అనంగనే.. వచ్చినోళ్లంతా మల్లన్న చుట్టూ చేరారు. దిక్కు తెలీలేదు మల్లన్నకు. ఆ మాట ఈ మాట అనుకుంటాండగా.. గుంపులోంచి ఒకడు.. “రేయ్ ఏందిరా నీది.. నా కొడకా!” అంటూ ముసలాయన మల్లన్న చెంపమీద కొట్టాడు. ఆ దెబ్బకు అదిరి కిందపడ్డాడు మల్లన్న. పడినోడు లేచి తిరగబడుంటే ఇంకోలా ఉండేదేమో.. గానీ భయపడి నోటికొచ్చినట్టు గొనుక్కుంటూ గమ్ముగయి పొయ్యాడు మల్లన్న.
మొగున్ని తన కళ్ల ముందే కొట్టి కింద పడేసేసరికి కోపంతో రగిలిపోయింది సంటెమ్మ. ఒకపక్క మొగుని చేతగానితనాన్ని తిట్టుకుంటూనే వాళ్లమిందికి నోరు చేసుకునింది. తవ్వుతున్న కూలోల్లను ఆపించింది. ఒక ఆడదాని ముందు వెనక్కి తగ్గితే అవమానమని ఆవేశంతో ఊగిపోతున్నాడు శంకరయ్య కూడా. ఆమెను ఏమీ చెయ్యలేక ఆ అక్కసుతో మల్లన్న తన అన్న అనే విషయం కూడా మరిచి మల్లన్న మిందకు కాలి చెప్పు ఎత్తాడు. వెనక్కి తగ్గలేదు సంటెమ్మ. తనూ ఎత్తింది. ఆమె తెగువకు అదిరిపడ్డారు.. ఆ సంఘటన చూస్తున్న వాళ్లంతా. పరిస్థితి శ్రుతిమించేట్టుందని ఒకతను బలవంతంగా ఆపాడు. మనిషి మనిషిలా లేడు శంకరయ్య.
ఇంత బతుకూ బతికి ఒక ఆడదాని ముందు వెనక్కి తగ్గాల్నా.. అని కుతకుత ఉడికిపోతున్నాడు.“మీ అంతు చూస్తా! పైరు ఎట్ట పెడ్తారో మాన్యం భూమిని రిజిస్ట్రేసన్ ఎట్టా చేపిచ్చుకుంటారో చూస్తా” అని మీసం తిప్పి తొడగొట్టాడు అందరి ముందు.
“నీకిష్టమొచ్చింది చేసుకోపో. నీ కళ్ల ముందే పైరు పెడ్తా సూచ్చాండు”.. అంతే పౌరుషంగా సవాలు చేసింది సంటెమ్మ. ఆ క్షణం ఆమె ఒక సాధారణ ఆడ మనిషిలా కనిపించడం లేదు. ఈమేనా ఇన్ని రోజులు మనం చూసిన సంటెమ్మ అనిపిస్తున్నది అక్కడి వాళ్లకు.
రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు పొలం అనే దానికంటే పరువు సమస్య అయి కూర్చుంది. ఎక్కడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా సంటెమ్మ చేసిన సవాలే గుర్తొస్తున్నది శంకరయ్యకు. ‘ఇంత పలుకుబడుంది.. రాజకీయముంది! ఒక్క ఆడదాని దగ్గర జంకాల్నా!?’ అని శంకరయ్య మనసు తొలుస్తున్నది. ఎన్నెన్నో కుట్రలు అతని మనసులో మొలకెత్తుతున్నాయి. ఎమ్మార్వో ఆఫీసులో విచారిస్తే.. “డీకేటీ భూముల్లో మేం తలదూర్చలేం! వేరే దారిలో చూడు. అదీ గాక నాలుగైదు సెంట్ల నేల కోసం
ఎందుకుపో అంత గొడవ” అన్నాడు ఎమ్మార్వో.ఆ మాటలు రుచించలేదు శంకరయ్యకు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. విషయం చెప్తే.. “సివిల్ కేసుల్లోకి మేం రాకూడదు” అన్నాడు ఎస్సై.
ఏం చెయ్యాలో అర్థం కాలేదు శంకరయ్యకు. అయినా ఆశ తీరక.. “సరే అయితే కేసులు గీసులు ఏమొద్దు గానీ, ఊరికే అలా వచ్చి బెదిరిచ్చిపోండి సాలు” అన్నాడు పళ్లిగిలిస్తూ. ‘సరే’ అని ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిపించి.. “ఆ శంకరయ్య విషయం ఒక్కరవ్వ చూసిరాపోండి”.. ఆర్డర్ వేశాడు ఎస్సై.సాయంత్రం పది వెయ్యి రూపాయల నోట్లు వచ్చి చేరాయి ఎస్సై పర్సులోకి.
“మల్లన్నంటే నువ్వేనారా?”.. దబాయించాడు పోలీసు. “నేనే సార్” చేతులు కట్టుకొని, భయపడ్తా భయపడ్తా చెప్పాడు మల్లన్న.“ఏంటీ పొలం దగ్గర దౌర్జన్యం చేస్తున్నావంట?”. “నేనేం దౌర్జన్యం చెయ్యలేదు సార్. డీకేటీ భూములు రాపిచ్చుకోని.. మామిందికొచ్చి వాళ్లే చేస్తున్నారు”.“చ్చా ముయ్ నోరు. పద పొలం దగ్గరికి.. చూద్దాం నీ యవ్వారమేంటో”.. అని బండ్లో ఎక్కించుకుని పొయ్యారు ఇద్దరు కానిస్టేబుళ్లు.పొలం దగ్గరికి వెళ్లి చూసి.. “రేయ్! మీ పొలంల మీరుండకుండా ఆయన పొలంతో మీకేం పనిరా. మర్యాదగా ఉండకపోతే జైల్లో తన్నులు తింటావు కొడకా నువ్వు”.. గద్దించగానే వణికిపొయ్యాడు మల్లన్న. ఏమంటే ఏమవుతుందో అని భయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. పొలం దగ్గర పోలీసులు ఉండే సరికి.. ఏమైందో ఏమోనని అక్కడికి వచ్చింది సంటెమ్మ. ఆమెను చూసి.. “నువ్వేనామ్మా సంటెమ్మంటే?’ అడిగాడు పోలీసు.అవునన్నెట్టు తలూపింది సంటెమ్మ.
“ఏమ్మో.. నీ నోరు పెద్దదంట. మొగోళ్లని కూడా లెక్క చెయ్యవంట. ఒక్కరవ్వ తగ్గిచ్చుకో! పెద్దోళ్లతో యవ్వారాలు గాదు” మెత్తగా బెదిరిస్తున్నట్టుగా అన్నాడు.“వాళ్లాడిన ఆటలన్నీ చూస్తూ మేం గమ్ముగా కూర్చోవాల్నా”.. మాటల్లో బెరుకనేది లేకుండా చెప్పిందామె.ఆమె మాటల్లో కనపడుతున్న స్థిర చిత్తానికి అదిరిపడ్డాడు ఆ కానిస్టేబుల్.“ఎవర్తో మాట్లాడ్తాండావో గుర్తుపెట్టుకోమ్మోవ్ సంటెమ్మా! నీకు నీ కుటుంబానికి మంచిది” అన్నాడు.“దౌర్జన్యం చేసేవాళ్లను ఏమనలేక మా దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నారు. ఇదేం పద్ధతి సార్” అన్నది.“అన్ని అతి మాటల్తో నీకు పనిలేదు. ఎస్సై సారు చెప్పాడు.. చేలో పైరు పెట్టగాకండి” అన్నాడు.ఆ మాటలు సంటెమ్మను భయపెట్టకపోగా.. మరింత బలంగా తయారుచేశాయి.
“పైరు పెట్టేది పెట్టుడే! ఎవరొచ్చి ఆపుతారో నేనూ చూచ్చా” అన్నది.
నారు ఎదిగి వరి మడికి బురదపెట్టేసరికి దాదాపు నెల గడిచింది. ఇంకో పక్క ఎలాగైనా పైరు పెట్టకుండా ఆపాలని సతపోరాడుతున్నాడు శంకరయ్య. ఈ నెల రోజుల్లో పోలీసులు వచ్చారు, వీఆర్వో వచ్చాడు. రాజకీయాల్లో తిరిగే పెద్దమనుషులు వచ్చారు. ఎవరెన్ని చెప్పినా.. సంటెమ్మ దగ్గర నిలబడ్డం లేదు. “ఏం పొయ్యేకాలమో! ఆ నా కొడుకు దీన్నే పట్టుకుని ఊగుతున్నాడు. ఈసారికి పైరు వద్దులేయే. చాలిద్దాం”.. పోలీసులంటే ఉన్న భయంతో అన్నాడు మల్లన్న.
“ఏం పొడుచ్చరా వాళ్లంతా వచ్చి. నీకంత భయమైతే ఇంట్లోనే కూర్చో. నేనే నాటిచ్చా”.. మొగునిలోని భయాన్ని కసురుకున్నది సంటెమ్మ.
ఆమెకంత మొండి ధైర్యం, పట్టుదల ఎక్కణ్నుంచి వచ్చినాయో అర్థం కాలేదు మల్లన్నకు.నారు నాటడానికి కూలోళ్లను పిలిస్తే.. గొడవ గురించి తెలిసి ఊర్లో ఎవ్వరూ రాలేదు. ఎక్కువ డబ్బులిచ్చి వేరే ఊరోళ్లను గుత్తకు మాట్లాడింది. “సరేమ్మా! మొన్నాడొచ్చి నాటి పోతం! మధ్యాహ్నానికి అన్నం చేసిపెట్టు సాలు” అన్నారు కూలోళ్ల్లు.
పొద్దున ఎనిమిది గంటలకల్లా పన్నెండు మంది కూలోళ్లు వచ్చారు. నారుమడి చూపించి ఎకరాకు సరిపోయే నారు పీకమని చెప్పింది. ఇంగోపక్క శంకరయ్య భార్య వీళ్లు చేసే ప్రతిపనినీ దూరం నుంచి కనిపెట్టుకొని చూస్తున్నది. ఇంక కొద్దిసేపట్లో నారు పీకడం అయిపోతుంది అనంగా.. ఆ సమాచారం మొగునికి చేరవేసింది ఆమె. ఇలా జరుగుతుందని ముందే గ్రహించాడేమో.. పోలీసుల్ని పిలిపించాడు శంకరయ్య. పీకిన నారు కట్టలన్నిటినీ బాయి దగ్గర్నుంచి గంపలో పెట్టుకుని బురద మడి దగ్గరికి మోస్తున్నాడు మల్లన్న.
పోలీసులు వచ్చీ రాగానే.. “రేయ్! పైరు పెట్టకండని చెప్తే అర్థంగాలేదా నీకు. రా స్టేషన్‌కు ఎస్సై సారు పిలుచ్చాండు” అన్నాడు పోలీసు. ఆ మాట అనంగానే భయపడ్డ మల్లన్న.. భయపడి జీపు ఎక్కడానికి పోతుంటే, మొగున్ని ఆగమనింది సంటెమ్మ. పోలీసు దగ్గరికి వెళ్లి.. “ఎందుకు రావాల స్టేషనుకు?” అని అడిగింది. “ఎందుకో తెలీదా!?”.. వెటకారంగా అన్నాడు ఆ కానిస్టేబుల్.‘మా తప్పు లేనప్పుడు ఎందుకు భయపడ్డం?’ అనే తత్వం సంటెమ్మది. ‘మేమంటే లెక్కలేదా నీకు!’ అనే పంతం పోలీసులది.మాటా మాటా పెరిగింది. “తీసకపొయ్యేది తీసకపొయ్యేదే! మీరు నాటు ఎయ్యకండి. ఇంటికి పోండి!” అని కూలోళ్లను బెదిరిచ్చి, మల్లన్నను జీబులో ఎక్కించుకుని సక్కా పొయినారు వాళ్లు.
ఏం చెయ్యాలో తెలీలేదు సంటెమ్మకు. యట్ట తిరిగీ నాటియ్యాల. పొద్దు చూస్తే అప్పుటికే టైం పదకొండు కావొస్తున్నది. ఏం చేద్దామని కూలోల్లను అడిగితే.. “నీ ఇష్టమమ్మా! నాటుకు నారు ఎదిగిస్తే.. నాటిపోతాం” అన్నారు వాళ్లు. అప్పటికప్పుడు పరుగు పరుగున ఊళ్లోకొచ్చింది. నారు మోపీడానికని ఒకరిద్దర్ని పిలిస్తే.. ‘మాకెందుకులే లేనిపోని గొడవలు’ అనుకున్నెరేమో.. ఎవ్వురూ రాలేదు.మరోపక్క నాటు ఆపేదానికి లేదని గెట్టిగా తీర్మానించుకుని.. కోక రొండికి చెక్కుకుని, నారు వేసుకోవడానికి గోతం సంచి తీసుకుని బయల్దేరబోతుంటే.. “ఆడ కూతురివి! బురద గెనాలమ్మిటి అంతదూరం నుంచి యాడ మోసకొస్తవుమ్మా” అన్నారు కూలోళ్లు. ఆమె పరిస్థితిని చూసి.. జాలిగా! “నా గురించి వదిలెయ్యండి! మీరైతే మొదలు పెట్టండి. మీకు నారు ఎదిగిచ్చే బాధ్యత నాది” అని చెప్పి.. నారుమడి వైపు కదిలింది సంటెమ్మ.
పొద్దన లేచి తాగిన కొన్ని కాపీ నీళ్లు తప్ప.. కడుపులోకి ఏం పోలేదు. పళ్లు కూడా తోమింది లేదు. కడుపులో తిప్పినట్టుంది. దానికితోడు పన్నెండుమంది నాడ్తాంటే.. ఒక్క మనిషి నారు ఎదిగియ్యాలంటే సావు జంపలైతాంది. కానీ తప్పదు. ‘ఎందుకొచ్చిన తంటా! నిదానంగా నాటుకోవచ్చులే!’ అనుకున్న ప్రతిసారీ.. గతమంతా కండ్ల ముందు కదలాడుతున్నది. తమను ఒంటరి చేసి వాళ్లంతా ఆటలాడ్డం, మొగున్ని కొట్టడం, స్టేషను మొహం ఎరుగని భర్తను జీపులో ఎక్కించుకుపోవడం.. మరీ ముఖ్యంగా, “మీ అంతు చూస్తా!” అని పొగరుబట్టి శంకరయ్య కొట్టిన తొడ తాలూకు శబ్దం ఇంకా ఆమె చెవులు దాటిపోలేదు. అన్నీ ఒక్కటొక్కటే మరింత శక్తిని ఇస్తున్నాయి. ఆ ఊపులో పరుగు పరుగున పోవడం.. అరవై డబ్బు నారు కట్టలు సంచిలో కుక్కడం, భుజానికెత్తుకుని ఆ బురద గెనాలమ్మిటి జారకుండా అర్ధ కిలోమీటరు మాయిన నడవడం! అదొక యజ్ఞంలా సాగిపోతున్నది.
‘ఇదెక్కడి రాక్షసిరా నాయనా!’.. అనుకుంటున్నారు ఆమె పంతం చూసేవాళ్లు. పొలం దగ్గరికి వచ్చి చూస్తున్న శంకరయ్యకైతే.. మొహంల నెత్తురు చుక్క అనేదే లేదు.మధ్యాహ్నం సంగటేల దాటింది. అన్నం చేసే వాళ్లు ఎవురుండారు? ఎవ్వురూ లేరు ఇంటి దగ్గర. అన్నం లేకుంటే కూలోళ్లు బురదలో ఎక్కువసేపు పని చెయ్యలేరు.‘యట్టరా భగమంతుడా!? అనుకుంటూ.. “ఓబ్బీబ్బీ! అంగడికాడికి పొయి అన్నం పార్సల్లు తెచ్చవా!?”.. బతిమాలింది పక్క కయ్య వెంకట్రాముణ్ని. “సరేత్తా!” అని పొయి తెచ్చిచ్చాడు. ఆమె పడుతున్న నరకయాతన చూసి..
“నువ్వు అన్నం తిని రాపోత్తా! నారు నేను మోపిచ్చా” అని రెండు మూడు మూటెలు మోపిచ్చినాడు. అయినా గాని తిన్లేదు సంటెమ్మ. ‘నారెదిగయ్యాల! నారెదిగియ్యాల!’ అని ఖాళీ కడుపున అట్నే తిరుగుతాంది. మొగున్ని పోలీసులు తీసుకపొయ్యారే అనే దిగులొకపక్క! ముందల్లా అవీ ఇవీ బాగా మాట్లాడ్తారు.. ఇలా ఇరుకూ ఇబ్బందైనప్పడు మాత్రం ఒక్కరూ తోడురాని ఈ పల్లె జనాలమింద ఒక రకమైన విరక్తి భావం మరోపక్క.. పొద్దట్నుంచి ఏమీ తినందాన కడుపులో తిప్పుతున్నా కూడా అట్నే తిరిగింది కసిగా. తొందర తొందరగా నడ్సడం వల్ల బురద గెనాలమ్మిటి నడుచ్చా ఒకసారి కింద కూడా పడింది. అయినా ఆమె పయనం ఆగలేదు.
ఉదయం మొదలైన వరి నాటు అనే యజ్ఞాన్ని.. ఎంతమంది రాక్షసులు అడ్డుకున్నా అంతులేని ఆత్మ స్థయిర్యంతో తనే దగ్గరుండి పూర్తి చేయించింది సంటెమ్మ. అప్పటికి ఎండ గుర్రాలను తోలి తోలి అలసిన సూర్యుడు.. పడమటి కొండల్లోకి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గెట్టు మీదినుంచి చూడగానే.. పచ్చని గాలికి నవ్వుతూ కదలాడాయి అప్పుడే పడిన నాట్లు. వాటిని చూసి ఒక మహా సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో జయించిన వీర సైనికుని మందహాసంలా.. చిక్కటి చిరునవ్వు ఒకటి విరిసింది సంటెమ్మ మొహం మీద.
వివేకానంద రెడ్డి లోమాటి వివేకానంద రెడ్డి లోమాటి స్వస్థలం కడప జిల్లా బద్వేల్ మండలం నందిపల్లె గ్రామం. తల్లిదండ్రులు సత్య నారాయణమ్మ, బాలవీరారెడ్డి. బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్) చదివారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. పుస్తకాలు చదవడం, ట్రెక్కింగ్ అంటే విపరీతమైన ఆసక్తి. ఆ అనుభవాలనే.. ‘వివేక్ లంకమల’ కలంపేరుతో కథలుగా మలుస్తున్నారు. పుట్టి పెరిగిందంతా పల్లెటూళ్లోనే. అందుకే.. ఈయన రచనల్లో కుటుంబం, వ్యవసాయం, పశువులు, అడవి నేపథ్యాలుగా కనిపిస్తాయి. కరువు సీమ, ఓబుల్‌రెడ్డి ఎద్దులు, యామయ్య గుర్రం కథలు పాఠకుల మెప్పు పొందాయి. తొంభైల కాలంనాటి పల్లెటూరి ప్రేమ కథ నేపథ్యంలో తీసిన ‘అరణ్యవాసం’ సినిమాకు కథ, కథనం, మాటలు అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మనం చూసిన సంస్కృతిని అక్షరబద్ధం చేసి.. తర్వాతి తరాలకు కానుకగా అందించడమే కథ, నవల అంతిమ లక్ష్యమని వివేకానంద రెడ్డి విశ్వాసం.
-వివేకానంద రెడ్డి లోమాటి
95819 39039