‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో విశిష్ట బహుమతి పొందిన కథ.
ఫజర్ నమాజ్ అజాం మైకుల్లో వినిపిస్తున్నది. నల్గొండలోని ఘడియాల్ చౌరస్తాలో ముప్ఫై ఏళ్ల ఖలీల్.. కోల్పోయిన తన అస్తిత్వం కోసం నిరసనకు కూర్చున్నాడు. అతని వెనకాల.. ‘మా అమ్మీకి న్యాయం కావాలి’; ‘మేరా వతన్ నల్గొండ అని ఎలుగెత్తి చాటాలి’; ‘సాంప్రదాయిక దుర్మార్గం నశించాలి’ అని రాసి ఉన్న ప్లకార్డులు ఉన్నాయి.
అప్పుడప్పుడే ఆటోవాలాలు, వ్యాపారులు, నమాజుకు, వాకింగ్‌కు, జిమ్‌కు వెళ్తూ.. ఖలీల్‌ను చూసి, దగ్గరికి వచ్చి ఆరాలు తీస్తున్నారు. అతని పక్కనున్న మిత్రుడు సంతోష్ వాళ్లకు సమాధానం చెబుతున్నాడు.
“ఘరేలు మస్లా హైతో చారోమే బైఠ్కే బాత్ కర్లేనా.. మగర్ యే క్యా తరీఖా?” అంటూ.. కొందరు ముక్కువిరిస్తూ గబగబా నమాజుకు వెళ్తున్నారు.
“ఉన్కో అల్లా కభీ మాఫ్ నహీం కరేగా”.. సైకిల్ మీదున్న ఓ తెల్లగడ్డం పెద్దాయన విస్తుబోయాడు.
“అయ్యో.. ఇంత అన్యాయమా? మనుషులేనా వాళ్లు? నీకు అండగా మేముంటం బ్రదర్!” అంటూ ఖలీల్ భుజం చరిచాడు మానవ హక్కుల ఉద్యమనేత శంకర్. ఆయన మాట ఖలీల్‌కు నిట్టాడంత ఆదెరువిచ్చింది. నిరసన తెలుపుతున్న ఖలీల్ కళ్లు ఎర్ర గోర్జాల్లా ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల క్రితం తన తల్లికి జరిగిన అన్యాయం తాలూకు గతమంతా నిక్షిప్తమై, న్యాయంకోసం ఎదురు చూసీచూసీ అలసిపోయినట్టుగా కూడా ఉన్నాయి.
ఏ న్యాయశాస్త్రంతో అన్యాయం జరిగిందో దాంతోనే న్యాయం పొందాలని పట్టుదలగా వచ్చాడు. అలా కొయ్యబొమ్మలా శూన్యంలోకి చూస్తున్న అతని దృష్టి.. ఘడియాల్ చౌరస్తా నుంచి దక్షిణం వైపు కనిపిస్తున్న ఫీల్‌ఖానా వైపు మళ్లింది. ఆ ఫీల్‌ఖానా.. తనకెప్పటినుంచో ఫీలింగ్స్ అన్నీ బందీ అయిన ఖానాలా కనిపిస్తుంది! ఖలీల్ది నిజామాబాద్ జిల్లా గోపాల్పేట్ గ్రామం. నిన్నే నల్గొండకు వచ్చాడు.
‘ఇన్నేండ్లల్ల జరగని న్యాయం ఇప్పుడు జరుగుతదని అనుకుంటున్నవా? మనం ఎప్పుడన్న మాట మర్యాదకు నల్గొండకు పోతే కుక్కలను ఎలగొట్టినట్టు ఎలగొట్టిర్రు. అత్తమ్మకు, మీకు జరిగిన అవమానాలు సాలయా? వాళ్లు తేమలేని రాళ్లే! వాళ్లల్ల ఆ గురాతనం ఎప్పటికీ రాదు. పైసకోసం పియ్యి తినే మన్సులు. నా మాట ఇని రేషం మానుకో. వాళ్లతాన పైస ఉంది, పరపతి ఉంది. అంతకుమించిన దీన్వాలాలు వాళ్లు. మనం వాళ్లతోని ఎన్లగూడ పోటీవడలేం. మన రాత గింతే అనుకోరాదు.
మనకిద్దరు పిల్లలున్నరు. ఇంత ఎవుసం, టైలర్ దుకాణం ఉంది. గదే మనకు ప్రాప్తం అనుకో. ఇప్పుడు వోయి నువ్వాడ పోరాటం జేసినా ఏం కాదే. మిమ్ములను ఎన్నో అరిగోసలు వెట్టిన వాళ్లు ఎన్ని హజ్‌యాత్రలు చేసచ్చినా.. దోజఖ్కే పోతరు’ అన్న భార్య సమీనా మాటలు తన చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అయినా ఏదో ఆశ, గత ముప్ఫై ఏళ్లుగా తన మదిలో లార్వాలా మసలుతున్న సంకల్పం అది. అస్తిత్వం కోసం, న్యాయంకోసం సుదీర్ఘంగా అమ్మ ఎదురు చూసీచూసీ.. అలసిపోయి తనువు చాలించిన రాచపుండులాంటి సలపరం అది.
రెక్కల కష్టాన్ని తప్పితే దేన్నీ నమ్ముకోని ఆ తల్లికి అన్యాయం ఎట్లా జరుగుతది? ఆ తల్లి పిల్లలమైన తమ పక్షంగా న్యాయం నిలవాల్సిందే! న్యాయదేవతకు స్త్రీ రూపమే కదా!? అట్లాంటి సాటి స్త్రీకి ఇంత అన్యాయం జరిగినంక ఎట్లా ఊకుంటది?
ఇన్నేసి ప్రశ్నలు బట్టీమీద కడాయిలో బెల్లం పాకంలా అతని అంతరాన్ని కుతకుతా ఉడికిస్తున్నాయి. నాన్నను తలుచుకొని అమ్మ ఆకాశానికి ముఖం పెట్టుకొని గొడోమని ఏడ్చిన ఆ సందర్భాలను, కాయకష్టం చేసి బొబ్బలెక్కిన అరచేతులు, చెప్పుల్లేక నడిచి కాయలు కాసిన ఆ కాళ్లు, దూదిలాంటి మెత్తటి అమ్మ మనసును ఎన్నోసార్లు కత్తిగాట్లకు గురిచేసిన ఆ దుస్సంప్రదాయపు పైశాచికత్వం.. అన్నిటికీ ఇవాళ సమాధానం చెప్పాలనుకుంటున్న అతని మనసు నిండా మొక్కవోని ఆత్మవిశ్వాసం. తెల్లారింది. వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. అప్పుడే ఈవార్త నల్గొండ అంతా పాకిపోయింది. జనాలు అక్కడికి హోరెత్తడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
ఇంతలో..
“ఏందయ్యా.. ఏ ఊరు నీది? ఏంటి ఈ న్యూసెన్స్?” అక్కడికొచ్చిన సీఐ రవి ప్రశ్నించాడు.
“న్యాయం కావాలి సార్..” అంటూ, తనవద్ద ఉన్న అమ్మానాన్నల పెళ్లినాటి నిఖానామా ఎరుపురంగు పుస్తకాలు, కోర్టులో అమ్మ కేసు వేసిన కాగితాలను చూపించాడు.
“నువ్వు వెంటనే లాయర్‌ను కలవాలయ్యా. ఇది కరెక్ట్ కాదు” అన్నాడు సీఐ.
“సామాన్యుడికి నిరసన తప్పితే వేరే దారిలేదు సార్. మొండిగా మారిన న్యాయాలు, చట్టాలు నిరసనతోనైనా పదునెక్కుతాయనే నమ్మకంతో వచ్చిన సార్” నింపాదిగా అన్నాడు. అప్పటికే ఎండ ఖణఖణలాడుతున్నది. టిఫిన్ కూడా చెయ్యలేదు. సంతోష్ తెచ్చిన ఇడ్లీల ప్యాకెట్ మీద ఈగలు వాలుతున్నాయి. ఖలీల్ అనుకున్నట్టుగానే ఫీల్‌ఖానా నుంచి అతని నెంబర్‌కు కాల్స్ వస్తున్నాయి.
“మర్యాదగా ఎట్లా వచ్చినవో అట్లనే ఎల్లిపో! మానిన గాయాన్ని మల్ల గెల్కకు!” అంటూ గద్దిస్తున్నారు.
ఖలీల్ తన ఫోన్‌ను సైలెంట్లో పెట్టేశాడు. రెండోరోజు కూడా అతని నిరసన కొనసాగుతున్నదక్కడ. మహిళా మండలి సభ్యులు కూడా అతనికి మద్దతు తెలుపుతున్నారు. మీడియావాళ్లు వచ్చి వార్తలు కవర్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త తెలుగు రాష్ర్టాల్లోనే కాదు.. జాతీయస్థాయిలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. తమకు జరిగిన అన్యాయం గురించి మీడియాలో గొంతెత్తాడు ఖలీల్. పరదాల మాటున సాంప్రదాయిక రాక్షసత్వాన్ని దాచి.. అమ్మతోనే శాశ్వతంగా భూస్థాపితం చెయ్యొద్దని, ఏదైతే అమ్మ సమాధిపై ప్రతిన బూని వచ్చాడో.. దాన్ని ఇవాళ బహిర్గతం చేస్తున్నాడు.
“మా నాన్న పేరు ఖయ్యూం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ల ఏడీఏ. నల్గొండ నుంచి రెండువందల కిలోమీటర్ల దూరంల ఉన్న మా గోపాల్పేట్ ఫారంలకు నాన్నకు తబాద్ల అయింది. ఆ ఫారంలకు కూలీ పనులకు పోయే అందమైన మా అమ్మను జూశి మనసువడ్డడు. ఇద్దరూ ప్రేమించుకున్నరు. కొన్నిరోజులకు పెద్దమన్సులను ఒప్పిచ్చి నిఖా జేసుకున్నడు. నాలుగేండ్లల్లనే నేను, మా తమ్ముడు పుట్టేసినం.
నాన్నకు ఆల్రెడీ పెండ్లి అయి.. మాకన్నా పెద్దగ ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డె ఉందన్న విషయం అమ్మకు తెల్సి శానా బాధవడ్డదట. మా పెద్దమ్మ గూడ భర్తను రెండో స్త్రీతోని పంచుకునుడును అస్సలు యాక్సెప్ట్ చెయ్యలేదు. పల్లెటూర్ల పుట్టిపెరిగిన అమ్మకు సంప్రదాయాలు, ఆచారాలు అంతగనం తెల్వయి. పెద్దమ్మకు అన్నీ తెల్సు. ‘గోషాపర్దా, నమాజ్, జికర్ లేదు. థూ! ఏం ఆడిదమ్మ’ అని తిట్టేది. చిన్నప్పటిసంది అమ్మకేమో.. ‘కష్టవడితే గానీ కడుపులకు రాదు! తప్పు జేస్తే అల్లా మాఫ్ చెయ్యడు’ అనే తెల్సు.
శుక్రవారం తానం జేసి గా ఒక్క నమాజ్ సదువుడు, ఏవో కొన్ని సూరాలు.. గంతే తెల్సు. గా తెల్వనితనమే వాళ్లకు ఆయుధమైంది. మా మర్మన్న అన్నలు గూడ అమ్మను అసహ్యించుకునేటోళ్లు. సంప్రదాయాలకు మేము బ్రాండ్ అంబాసిడర్లం అన్నంత బిల్డప్ ఇచ్చేటోళ్లు. అట్లుండంగ.. అకస్మాత్తుగా ఒకరోజు నాన్న గుండెనొప్పితోని సచ్చిపోయిండు. సీతారాముల వనవాసం 14 ఏండ్లయితే.. అమ్మానాన్నల సహవాసం ఏడేండ్లే! అటెన్క అమ్మకు బతుకంతా వనవాసమే చేసిర్రు వాళ్లు! ప్రకృతి ఒడిల పుట్టిపెరిగిన అమ్మకు నాన్న పోయినంక సంప్రదాయాల కట్టడైన ఆ ఇంట్ల అస్సలు ఉండబుద్ధికాలేదు.
‘ఊరికి పోతా!’ అన్నది.
‘ఈడినుంచి వోయి ఎవనితోనో పోతవ్.. పోరగాండ్లను ఆగం జేస్తవ్. సప్పుడుదాంక ఈడనే ఉండు’.. పెద్దమ్మ మాట అమ్మ మనసును ఎల్తబొంగును ఒక్కపెట్టున కమ్మకత్తితోని చీల్చినట్టయ్యింది. కట్టుబొట్టు, తనకొచ్చే పల్లెయాస నుంచి.. ఇట్ల ప్రతీ విషయంల వాళ్లు తనకు ఆంక్షలు పెట్టుడు, ఎక్కిరిచ్చుడు, కొత్తగా ఏదో నేర్పుడు..
‘సువ్వర్దానా!’ అనుడు, పనిమనిషిలాగ ట్రీట్ చేసుడుతోని.. ‘పుల్సీరాత్ కా రాస్తా!’ అంటే ఇదేనేమో అన్న ఫీలింగ్ వచ్చిందక్కడ. ఊపిరి ఆడకుంటైంది. ఒకరోజు లారీడ్రైవర్ అయిన మా మామ వాళ్లకు మంచిగనే సంజాంచినా.. ‘రౌడీ లెక్కున్నడు’ అన్నరు.
వేషభాషలను సూశి మన్సులను డిసైడ్ చేసేటంత పైస, ఆచార సంప్రదాయాలకు తామే సొక్కమైన వారసులం అనుకునే అహంకారం.. పైపెచ్చు పెద్ద సదువులు సదువుకున్నం అనే పొగరు వాళ్ల నరనరాన ఇంకిపోయింది. అక్కడ మనలేనఓని కచ్చితంగా అనుకొని మమ్మల్ని తీసుకొని అమ్మ పుట్టింటికే వచ్చేసింది. ఏ సుట్టపక్కాలు గూడా ఏం జెయ్యలేకపోయిర్రు. మల్ల అమ్మ కూలీ అవతారమెత్తి మమ్మల్ని పోషించింది. తమ్ముడు టీచర్ జాబ్ జేస్తున్నడు.
నేను టైలర్. నాన్నకు రెండో భార్య అయిన అమ్మకు ఆస్తిల సగం వాటా న్యాయంగా రావాలి గదా? ఇయ్యుమని అడుగుతే ఇయ్యమన్నరు. నాన్న చేసిన ఉద్యోగాన్ని కూడా పెద్దమ్మనే మల్పుకొని పెన్షన్ల గూడా పాలు ఇయ్యలేదు. దీంతోని అమ్మ కోర్టుల కేసేసి రెండుమూడేండ్లు కోర్టుల సుట్టు తిరిగింది. తనకు అంత స్థోమత లేదు, ఏం తెల్వది. లాస్టుకు.. ‘డబ్భు వేలిస్తం కేసు ఎన్కకు తీస్కో!’ అన్నరు. అమ్మీ ససేమిరా అన్నది. దీంతోని హైకోర్టుల లాయర్గ జేస్తున్న పెద్దమ్మ వాళ్ల అన్నతోని గల్శి.. శానా అన్యాయంగా కేసును నీరుగార్చింది. చట్టం దృష్టిల ఫలానా ఖయ్యూం సాబ్‌కు ఒకతే భార్య, ఆ నలుగురు పిల్లలే ఉన్నరు. రెండో భార్య లేదు, మేము లేమని కోర్టు ద్వారా తీర్పు ఇప్పిచ్చి.. మా అస్తిత్వాన్ని బొందవెట్టి, కేసును క్లోజ్ చేపిచ్చిర్రు. ఆ తీర్పుతోని అమ్మ సగం సచ్చిపోయింది. మనసు మొరంగడ్డ అయిపోయింది.
‘మనసులతోని ముడిపడ్డ మా బంధాన్ని ఈ కాగితాలు, కత్వలు ఎట్ల ఏరు జేస్తయి?’ అన్న ప్రశ్న అమ్మను లైఫ్‌లాంగ్ ఏడిపిచ్చింది. తను ఎవరి భార్య? మేము ఎవరి పిల్లలం? అనే ప్రశ్న మా ఎదుగుదలల పొడసూపింది. మా భవిష్యత్తు మీద బండమోపింది. షరియా చట్టాలన్నా న్యాయం చేస్తయేమో అంటే.. అవి గూడా మమ్మల్ని అక్కడికే రావాలన్నయి.
‘వో బాజారీ ఔరత్కో హమ్ దీన్ సిఖాకే సుధారీంగే’ అని అత్యంత కర్కశంగా మాట్లాడిర్రు. అమ్మకు ఆ బంగారు పంజరంలకు పోవాలని లేదు. షరియా చట్టాలు గూడా సంప్రదాయం ముసుగేసుకొని స్త్రీని అణగదొక్కే పురుషాహంకారాన్ని ఇంకిచ్చుకున్నయని అమ్మకు సమజైంది.
‘ఈ జన్మకింతే, వాళ్లతోని గెల్వలేం’ అనుకొని మా ఎదుగుదలను, నాన్న ఫొటోను చూసుకుంట అమ్మ ఆ గాయాన్ని మెల్లగ మర్చిపోవట్టింది. కానీ, తాను సచ్చిపోయినంక నాన్న పక్కకు బొందవెట్టాల్నని, గదే తన చివరి కోరికని అన్నది నాతోని. తమ ప్రేమబంధాన్ని మట్టిలోనైనా శాశ్వతం చేసుకుందామని అనుకున్నది.
బాధే జీవితంలా గడిపి వృద్ధాప్యంల అమ్మ సచ్చిపోయినప్పుడు నల్గొండల ఉన్న కనీస్ అన్నకు ఫోన్ జేస్తే నిర్దాక్షిణంగా ఫోన్‌కట్ చేసిండు. అట్ల అమ్మ అటు చట్టం దృష్టిల ఖయ్యూంసాబ్ భార్య కాకుంట, ఇటు భర్త పక్కన సమాధి కాకుంటనే.. అస్తిత్వం కోల్పోయి ఆ అల్లా తానికి పోయింది. మరి ఆయన గూడ సంప్రదాయాలు పాటిచ్చేటోళ్లే తనకు ప్రీతి అంటడు గదా!?
ఈ అల్లా ప్రీతి ఏందో ఏమో? మరి అమ్మను అక్కడ గూడ ఆయన వేధిస్తున్నడేమో తెల్వది? అయినా.. నేను గవన్నీ నమ్మ. అమ్మకు న్యాయం చెయ్యాలని ఒట్టుతోని నేనిక్కడికచ్చిన” అంటూ ఖలీల్ భారంగా నిట్టూర్చాడు. తన శ్వాసలో రాళ్లు అడ్డం పడుతున్నట్టు అనిపించింది. ఇదంతా వార్తల్లో వచ్చినా.. తను ఎవరినుంచైతే న్యాయాన్ని కోరుకుంటున్నాడో.. వాళ్లెవరూ అటువైపు రావట్లేదు. కానీ, ఖలీల్‌కు కాల్స్, వాట్సాప్ మెసేజులు పంపిస్తూ బెదిరిస్తున్నారు.
“మామా.. వాళ్లు చానా డేంజర్ గాళ్లున్నరు. ఫేమస్ అవుతవ్గనీ.. న్యాయం జరుగుతదని అనిపిస్తలేదు” భయంగా అన్నాడు సంతోష్. ఆ మాటలు విన్న ఖలీల్ పెదాలమీద ఓ వైరాగ్యపు నవ్వు. ఆ నవ్వులో.. వెన్ను చూపేదే లేదని.. తన ప్రాణం అడ్డు పెట్టయినా ఏదో ఒకటి తేల్చుకోనిదే ఈ నల్గొండ నుంచి వెనకడుగు వేసేదేలేదని స్పష్టంగా కనిపిస్తున్నది. దృఢమైన ఆత్మవిశ్వాసం అతని ఊపిరిలో ఉఛ్వాసనిశ్వాసమవుతున్నది. కుదురుగా ఉన్న తమ కూసాలు కదిలిపోతున్నాయి. ఇన్నాళ్లు ఎవరికీ తెలియని చేదునిజం ఇవ్వాళ్ల అందరికీ తెలిసి తమ పరువంతా పోతున్నది.. అనుకొని కనీజ్, రియాజ్, ఫైజాన్ మరికొందరు మనుషులతో రాత్రిపూట అక్కడికొచ్చారు.
“కుచ్ దీన్ కే బారేమే మాలుమాత్ హువాతో యే షైతానీ చాల్ నై కర్తేరే తుమ్ లోగాం”..
కనీస్ మాటలు ఖలీల్ రక్తాన్ని మరింత ఉడికించాయి. గడ్డం పెంచిన వాళ్ల నుదుర్ల మీద నల్లని మచ్చలున్నాయి. ఐదు పూటలా నమాజ్ చదువుతారు. కానీ, ఖలీల్ వాళ్లకు పూర్తి వ్యతిరేకంగా ప్యాంటు, షర్టులో ఎలాంటి గడ్డం, మచ్చలేకుండా ఉన్నాడు. వాళ్లనుంచి అవే సాంప్రదాయిక చీదరింపులు.
మానవత్వం కోసం దీన్ కావాలా? దీన్ మానవత్వాన్నే కదా బోధిస్తున్నది? ఈ అణచివేతకు అంతులేదా? దీన్ వాళ్ల దానవత్వాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? నిరంకుశత్వానికి సహకరిస్తుందా? మాకింత అన్యాయం చేసి వాళ్లు హజ్‌యాత్ర చేసి రావడం కుబూలా? అసలిదంతా ఆ పైవాడు చూస్తున్నాడా? చూస్తూ మౌనం నటిస్తున్నాడా?
ఖలీల్ మనసులో ప్రశ్నలు?
నిరసన మానకుంటే చంపేస్తామన్నారు. అయినా ఖలీల్ బెదరలేదు. నిండా అమ్మ ఉన్న ఆ గుండెను మరింత నిబ్బరం చేసుకున్నాడు. అయితే ఫీల్ఖానాలో ఉన్న కొంతమంది పరోక్షంగా ఖలీల్‌కు మద్దతు తెలుపుతున్నారు. కనీజ్ తన పలుకుబడిని ఉపయోగించి ఎమ్మెల్యే, ఎంపీలతో చివరికి రౌడీలతో కూడా బెదిరించాడు. అయినా ఖలీల్ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో వెనకడుగేసే ప్రసక్తే లేదనుకున్నాడు. ఎందుకంటే ఈ విషయం మీద తనకు సోషల్ మీడియాలో, ప్రత్యక్షంగా, పరోక్షంగా లభిస్తున్న మద్దతే కారణం.
ఈ క్రమంలో అడగకున్నా వరాలిచ్చే దేవదూతలాగా శాంతి అనే అడ్వకేట్ వచ్చింది. తన అస్తిత్వ పోరాటంలో చేయూతనిచ్చింది. ముప్ఫై ఏళ్ల క్రితం తాహేరాబేగం దిగువ కోర్టు ప్రొసీడింగ్స్‌లో కావాలని గైర్హాజరు అయినట్లుగా చిత్రీకరించి.. ఆమె కేసును నీరుగార్చిన తీరును గమనించింది. ఆ కేసును రీటేక్ చేసి హైదరాబాద్‌లోని హైకోర్ట్‌లో వాళ్ల అమ్మ తరుపున అప్పీల్ వేసింది. కోర్టు తీర్పు వచ్చేవరకు తన శాంతియుత నిరసన అక్కడే కొనసాగుతుందన్నాడు ఖలీల్. అప్పీల్ వేయడంలో ఆలస్యాన్ని మన్నించమని, దిగువ కోర్టు కళ్లకు గంతలు కట్టి మోసపూరితంగా కేసును రద్దు చేయించిన తీరును హైకోర్టు గమనించాలని ఆధారాలతో ప్రార్థించింది శాంతి. చివరికి శాంతి శ్రమ ఫలించింది. తాహేరాబేగం, ఖయ్యూం నిఖానామాను హైకోర్టు సరైనదిగా గుర్తించింది.
“భౌతికంగా లేని తాహేరాబేగంను.. ఖయ్యూం రెండో భార్యగా కోర్టు గుర్తిస్తున్నది. వారి నిఖా చట్టబద్ధంగానే జరిగింది” అంటూ తీర్పిచ్చింది. ఆ తీర్పును విన్నాక మందంగా, పటిష్ఠంగా ఉన్న మౌనమైన గోడను ఒక్కపెట్టున గుద్ది బద్దలు చేసినంత సంబురమైంది ఖలీల్‌కు! సమాధైన సత్యం లేచి ఊపిరి పీల్చుకున్నట్టయ్యింది!!
ఆకాశానికి అర్రులుజాచి, ఆర్ద్రంగా చూస్తూ..
“అమ్మీ నువ్వు ఖయ్యూంసాబ్ భార్యవే. నీకు న్యాయం జరిగిందమ్మీ” అన్నాడు ఆకాశానికి చిల్లులు పడేంత గట్టిగా గర్జిస్తూ. తండ్రి ఆస్తుల కోసం కేసు వేద్దామన్న శాంతి గారి సలహాను సున్నితంగా తిరస్కరించాడు ఖలీల్.
“మాకు ఆస్తులు ఏమద్దు. నా జన్మ సార్థకం చేసుకున్నా. కోర్టు అమ్మను ఖయ్యూం సాబ్ భార్య అన్నది గదా! ఇగ మా అమ్మీ జన్మ, సావు ధన్యమైనట్టే! గదే నాకు కోట్ల ఆస్తితోని సమానం. వాళ్లతాన దీన్, దౌలత్ రెండు నిండుగ ఉన్నయి గదా.. అవిటిని మాకు పంచియ్యకుంట వాళ్ల దగ్గర్నే ఉంచుకోనియిర్రి. కాకపోతే నాది ఇంకొక కోరికేందంటే.. నాన్న సమాధిని మాకు సూపించాలె. ఆయన సమాధి మీద ఇన్ని పూలేసి మా జన్మగూడ ధన్యమైందనుకుంటం. అట్లనే ఈ తీర్పును మసీదుల మైకుల్ల కెల్లి ఈ నల్గొండ మొత్తం ఇనిపించాలె” అన్నాడు ఉబికొస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున అదుముతూ. ఖలీల్ అభ్యర్థనకు ఫీల్‌ఖానా జనమంతా పచ్చజెండా ఊపారు. కనీజ్ వాళ్లు మాత్రం తీవ్ర అవమానం జరిగిందన్నట్టు అసలు ఇంట్లోంచి బయటికి రాకుండా ముఖం చాటేశారు.
‘రంజాన్, బక్రీద్ పండగలకు నాన్న సమాధి మీద కాసిన్ని పూలు వేసి.. దరూద్ చదువుతానా!?’ అన్న తన ఎన్నో ఏళ్ల కల ఇవాళ నెరవేరుతున్నది!
రాళ్లు ఊడిపోయి ఉన్న నాన్న సమాధి మీద పడి బోరున విలపిస్తున్నారు అన్నదమ్ములు. పూల నక్షత్రాలను గుమ్మరించి తమ కన్నీటి అత్తరును ఆ సమాధిపై ధారపోశారు. తండ్రి గుండెల మీద పసివాడిలా సమాధిపై పడి గుక్కపట్టినట్టే ఏడ్చేస్తున్నాడు ఖలీల్. అతని దుఃఖాన్ని ఆపడం ఎవరితరమూ కావడంలేదు. చాలా సేపటికి తేరుకొని సమాధి పైనుంచి రెండు దోసిళ్ల మట్టిని తీసి సంచిలో వేసుకున్నాడు.
“ఆ మట్టిని తీస్కపోయి ఏం జేస్తవయ్యా?” అక్కడున్న వారిలోంచి ప్రశ్న.
“అమ్మ సమాధి మీద వోస్త. అట్లనన్న అమ్మ.. నాన్న పక్కకు సమాధి అయిన్నని అనుకుంటదేమో. ఇది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే!” అన్నాడు. మనిషి మనుగడకు శాశ్వత చిరునామా అయిన ఈ మట్టిలోనే వాళ్లను శాశ్వతంగా మమేకం చేస్తున్నానన్న ఆత్మసంతృప్తి అతని గుండెల నిండా. మర్నాడు నల్గొండలోని మసీదుల మైకులన్నింట్లోంచి అందరికీ తెలిసేలా ఆ కోర్టు తీర్పును చదివి వినిపించారు.
“అన్యాయమైన బతుకు అట్లా చరిత్రల సమాధి కావొద్దు. అది ఎప్పటికైనా బయటికచ్చి కొన ఊపిరితోనైనా కనీసం గొంతు విప్పాలె. న్యాయం కోసం పోరాడాలె. పదిమందికి తెల్వాలె. అట్లా తెలిస్తేనైనా ఇంకెవరైనా అసుంటి అన్యాయం ఆడోళ్లకు చెయ్యరు” ఖలీల్ మనసులోని మాట నిజమైంది.
అవే మైకుల్లో..
“మేరా బాప్ ఖయ్యూం” అని తన వతన్, మాయిముంత అయిన నల్గొండ మట్టిలోని పరమాణువులకు, దిగంతాల్లోని నాన్న ఆత్మ చెవులకు సైతం వినిపించేలా బిగ్గరగా అరిచాడు. అలా అరవగానే అతని ఎదలో పెనుతుఫాను తగ్గాక తొలగిన మబ్బుల చాటునుంచి నీలాకాశపు నిర్మలత్వం ఆవరించింది. అతని శరీరంలోని అణువణువూ అస్తిత్వపు సొబగులు అద్దుకొని విజయగర్వంతో ఉప్పొంగసాగింది.
నా దేశం, నా మాతృభూమి అని అన్నంత గర్వంగా.. ‘నా పితృభూమి’ అని ఆ నల్గొండ నేల మీద సాష్టాంగపడి గాఢంగా ముద్దుపెట్టాడు.
పుల్సిరాత్ కా రాస్తా = నరకపు దారి
దీన్ = ఇస్లాం సంబంధిత
ఘరేలూ మస్లా = ఇంటి వ్యవహారం
మాలూమాత్ = ఎరుక
సూరాలు = స్తోత్రాలు
ఎర్ర గోర్జాలు = గురువింద గింజలు
– హుమాయూన్ సంఘీర్ 94411 17051