నస్రుద్దిన్ తాన మాలెస్క బాతులున్నయి. అవ్విటిని సాదుడు, సవరిచ్చుడంటె ఆయినెకు మస్తు పాయిరం. అండ్ల ఒక బాతు మస్తు మోరుదోపుది. అన్ని ఒకదిక్కు వోతె.. ఇదొక్క దిక్కు వోతది. తాపతాపకు మందలకెల్లి మాయమైతది. అయిందానికి కాందానికి నస్రుద్దిన్ కాలు, శెయ్యిని కరుస్తుండేది. దాని బాధ వశంగాక.. అమ్మిపారేద్దామని అంగడికి గొంచవోయిండు నస్రుద్దిన్.
దలాల్ తానికి వోయి.. “ఇగో మియా! గిది బట్టేబాజ్ బాతు! దీన్ని అమ్మివెడ్తె రూపాయిత్త” అంట జెప్పిండు. “రండ్రి.. రండ్రి! దునియాల్నే మంచిబాతు. లోకంలనే అవ్వల్ బాతు! రండ్రి! కొనుండ్రి! అగ్గువ అగ్గువ” అంట ఒర్రవట్టిండు దలాల్! గా మాటలిన్న నస్రుద్దిన్.. “అమ్మో! గిది ఇంత మంచి బాతా!? దీన్ని నేనసలే అమ్మనుల్లా!” అనుకుంట.. బాతును గుంజుకొని, ఇంటికి ఉరికిండు.
– పత్తిపాక మోహన్