పొద్దున్నే ఆరింటికి గంట మోగింది.‘ఎవరా!?’ అని తలుపు తెరిస్తే.. పక్కింటి శమన్. “మా మేనల్లుణ్ని హాస్పిటల్లో చేర్చారు. ఉన్నపళంగా పాతికవేలు కావాలని ఇప్పుడే చెల్లి నుంచి ఫోను. నా దగ్గరో పదివేలున్నాయి. మీరేమైనా సర్దితే, రేపిచ్చేస్తాను” అన్నాడు శమన్. బలహీన వర్గాలకని ఓ ప్రముఖ గృహనిర్మాణ సంస్థ కట్టిన చౌకఇళ్ల కాలనీ మాది. సుమారు వెయ్యి విడి ఇళ్లున్న మా కాలనీలో ఎవరింట్లోనూ చిల్లర ఖర్చులకి పేటీఎమ్ముల్లో ఉంచేదే రెండువేలు దాటదు. గతంలో నా అవసరాలకి రెండుమూడుసార్లు వెయ్యీ రెండువేలూ సర్దాడు శమన్. ఉన్నంతలో ఒకరికి సాయపడ్డమే కానీ, ఎవరిముందూ చేయిచాచడని ఆయనకి పేరు. నన్నడగడం ఇదే మొదటిసారేమో, ఫోన్ చేస్తే సరిపోయేదానికి స్వయంగా వచ్చి అడిగాడు.
ఉంటే తక్షణం ఇచ్చేవాణ్నే! కానీ లేదు. ఫోన్లో అడిగితే లేదనడం సులభం. కానీ, చెట్టంత పెద్దమనిషి ఎదుట నిలబడి అడిగితే లేదనలేక, పది నిముషాలు టైమడిగి పంపేశాను.ఉన్నపళంగా యాభై వేలదాకా రాబట్టే పరపతి నాకుంది. ఎటొచ్చీ ఎవర్నడగాలా!? అన్నది తేల్చుకోలేక, ఆలోచిస్తుంటే.. అంతలో వంశీ నుంచి ఫోను.
వంశీ.. నా భార్య సుశీలకి కజిన్. నేనంటే ఇష్టం. వృత్తికి ఫ్రీలాన్స్ జర్నలిస్టు. ఇళ్లు, స్థలాలు అమ్మడం కొనడం.. హాబీ కమ్ వ్యాపారం. చేతిలో ఎప్పుడూ డబ్బాడుతూ ఉంటుంది. కానీ సుశీల మాత్రం.. ‘పైకి కనబడ్డు కానీ, వాడికి బాగా పొగరు. అడగనన్నాళ్లే వాడికి మనమంటే విలువ. ఒక్కసారి అడిగామా.. చులకనైపోతాం’ అని నన్నడగనివ్వదు.వంశీకి పొగరంటే నేన్నమ్మను. కానీ ఇలాంటి విషయాల్లో భార్య మాట కాదనకూడదని ఇంతవరకూ నేను అతని ముందు చేయి చాచలేదు.ఈసారి మాత్రం.. నా కోసం కాదు కాబట్టి అడగొచ్చులే అనుకుంటూ ఫోన్ తీశాను.
నేనేదో అనేలోగా..“మీ కాలనీలో శమన్ అంట. నీకు తెలుసా?” అన్నాడు వంశీ.నేను ఆశ్చర్యపోయి..“అరే! ఆయనది మా పక్కిల్లే! ఇప్పుడే పదిహేనువేలు అప్పడిగాడు. ఎప్పుడూ అడగనివాడు అడిగేడని లేదనలేక పోయాను. కానీ, రెడీగా అంతడబ్బు లేక, నిన్నడుగుదామా!? అనుకుంటున్నా! ఇంతలో నువ్వే ఫోన్ చేశావ్. పైగా ఆయన గురించే అడిగావ్” అన్నాను.“ఆయనకి డబ్బవరసమై అప్పడిగేడా! అదీ మరీ పదిహేనువేలు. తమాషాగా ఉందే!” అని ఆశ్చర్యపోయి.. ఏమనుకున్నాడో, ముందు పదిహేనువేలు నాకు పేటీఎం చేసేశాడు వంశీ.
“ముందాయనకు డబ్బు బదిలీ చెయ్యి. తర్వాత నా గురించి చెప్పు. నేనోసారి ఆయన్ని స్వయంగా కలుసుకోవాలి. ఇవాళే వీలౌతుందేమో అడుగు. సరేనంటే నాకు ఫోన్ చెయ్యి” అన్నాడు.అప్పుడు నా మదినిండా ఎన్నో ప్రశ్నలు: వంశీకి శమన్ ఎలా తెలుసు? శమన్ కోసం అనగానే వెంటనే డబ్బెందుకిచ్చాడు? శమన్ని కలవాలని ఎందుకంత ఆత్రపడుతున్నాడు? వంశీకి పొగరెక్కువంది సుశీల. కానీ, అడగ్గానే ఠక్కున డబ్బిచ్చాడు. అది నామీద గౌరవంతోనే ఐతే.. అతనిపై సుశీలకున్న అభిప్రాయం తప్పేగా! ఈ ఆలోచనలన్నీ పక్కనెట్టి వెంటనే శమన్ నంబరుకి డబ్బు పంపించాను. ఆ విషయం ఫోన్ చేసి చెబుదామనుకునేలోగా వెంటనే ఆయన్నుంచి థాంక్స్ చెబ్తూ ఫోను.
నేను వంశీ విషయం చెప్పాను.“ఇప్పుడు మేం బయటికెడుతున్నాం. వచ్చేసరికి ఒంటిగంట అవుతుంది. ఆ తర్వాత ఆయన తన వీలును బట్టి నన్ను కలుసుకోవచ్చు” అన్నాడు శమన్.వంశీకి విషయం చెబ్తే..“ఐతే మా సుశీలకి చెప్పు. కాసేపట్లో మీ ఇంటికొస్తున్నా. అక్కడే భోజనం. శమన్ని కలిశాకే నేను తిరిగివెళ్లేది! అంతవరకూ నన్ను చూసుకునే బాధ్యత మా సుశీలదే” అన్నాడతను.అది చెప్పగానే సుశీల మురిసిపోతూ..“చిన్నప్పట్నించీ వాడికి నేనంటే ప్రత్యేకమైన ఇష్టం. తనకి పొగరే కానీ, నా దగ్గరెప్పుడూ పిల్లిపిల్లే! అలాగని భయమూ లేదు. ఎప్పుడూ ఇదేచొరవ, చనువు!” అంది.‘ఆడవాళ్లు అల్ప సంతోషులే కాదు.. సేవలడిగితే అదే అనుగ్రహమనుకునే విచిత్రమనస్కులు’ అనుకున్నా.వంశీ పదకొండింటికి వచ్చాడు. వస్తూనే శమన్ ఇల్లు చూపించమన్నాడు.
రెండు పడకగదులున్నా.. మావి చిన్న ఇండ్లు. ఇంటిచుట్టూ చిన్న పెరడు. అందులో ఒకటి రెండు చెట్లు, కొద్దిగా పూలమొక్కలు, పాదులు.
“అంతటివాడు ఇంత సామాన్యంగా ఎందుకుంటున్నాడు?” అని ఆశ్చర్యపడ్డాడు వంశీ.మా ఇల్లు సామాన్యమన్నందుకు మనసు చురుక్కుమనాలి. కానీ, శమన్ని అంతటివాడని వంశీ అంతటివాడు అన్నందుకు కలిగిన ఆశ్చర్యంలో ఆ చురుక్కు గుటుక్కుమంది.“అంతటివాడంటే ఎంతటివాడేంటి?” అడిగాను వంశీని కుతూహలంగా.“అది తెలియాలంటే మూడు కథలు వినాలి. మీ ఇంటికెళ్లేక చెబ్తా” అన్నాడు వంశీ.
మొదటి కథ :
రామనాథానికి క్యాన్సర్ మొదటి దశలోనే తెలిసింది. చికిత్సకి వెంటనే నాలుగులక్షలు కావాలి. అశ్రద్ధ చేస్తే తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుంది.
రామనాథం ఆటోవాలా. ఆదాయం నెలకో పాతికవేలు. భార్య, ఇద్దరు పిల్లలతో అద్దింట్లోనే ఐనా.. తృప్తిగా జీవితం గడిపేస్తున్నాడు. నాలుగులక్షలంటే అతనికి అందని ద్రాక్ష. అలాగని ఉపేక్షిస్తే, జీవితం పులుపెక్కి బూజుపట్టేస్తుంది.
అప్పుడతణ్ని ఆదుకున్నది మనోహర్ అనే చిన్న దుకాణదారు.
నెలకి రెండుమూడు లక్షల అదాయమున్న మనోహర్.. రామనాథం చికిత్సకి నాలుగు లక్షలూ నిరాపేక్షతో అందించాడు. రామనాథం జీవితం బూజు పట్టకుండా తప్పించుకుంది.ఇలాంటి కథల్ని సేకరించి.. ఆసక్తికరంగా, ప్రయోజనకరంగా ప్రదర్శించడం వంశీకి మామూలు. ఓసారి రామనాథం ఆటో ఎక్కినప్పుడు వంశీకి మనోహర్ గురించి తెలిసింది.అతను మనోహర్ని కలుసుకుని..“మీవంటి పరోపకారులు అజ్ఞాతంగా ఉండిపోకూడదు. ఇలాంటి నిజ జీవిత గాథలు ఎందరికో స్ఫూర్తిదాయకమై మరెందరిలోనో సేవాదృక్పథాన్ని ప్రేరేపిస్తాయి” అని అతని జీవిత వివరాలు అడిగాడు.“నాకు అజ్ఞాతంగా సమాజసేవ చేసేంతటి ఉదారస్వభావం లేదు. నాలుగు లక్షలు నిరాపేక్షగా ఇచ్చేంత స్తోమతా లేదు. స్తోమతొచ్చినా.. నాలుగు వేలు కూడా ఇవ్వడానికి మనస్కరించని తత్వం నాది. అజ్ఞాతంగా సమాజ సేవ చెయ్యాలనుకునే ఓ అపూర్వ వ్యక్తికి బినామీని నేను. ఆయనిచ్చిన డబ్బుని నాదని చెప్పుకొంటూ సాయపడతాను. రామనాథం చికిత్సకి నేనే కారణమని ప్రచారం చేసుకోవడం వంచన అవుతుంది. నేను స్వార్థపరుణ్ని కావచ్చుకానీ వంచకుణ్ని కాలేను. కాబట్టి నా గురించి ప్రచారమొద్దు. చేస్తే నేనిప్పుడు బినామీగా చేసే సత్కార్యాలు కూడా ఆగిపోతాయి” అన్నాడు మనోహర్.
రెండో కథ :
సుమతికి తల్లిదండ్రుల్లేరు. మేనమామ వద్ద పెరిగింది. వయసొచ్చేసరికి పెంచిన మేనమామ నుంచే ఆమెకి లైంగిక వేధింపులు మొదలయ్యాయి.
ప్రతిఘటించింది. పోలీసులకి ఫిర్యాదు చేస్తానంది. మేనమామ మండిపడ్డాడు. పోలీసులతో కుమ్మక్కయి సుమతిని వ్యభిచార గృహానికి అమ్మేశాడు. వాళ్ల పొరుగింట్లో ఉండే చంద్ర అనే యువకుడికి సుమతి అంటే ఇష్టం. ఆమె అవస్థలు అతనికి కొంత తెలుసు. ఉన్నట్లుండి ఆమె మాయమైతే.. ఆమెనె ఎలాగైనా రక్షించాలనుకున్నాడు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి పోలీసుల జోక్యంకూడా ఉంది కాబట్టి, ప్రయత్నాలు పైస్థాయిలో మొదలెట్టాడు. అలా అతనికి జయరాజు అనే పోలీసు ఉన్నతాధికారి పరిచయమయ్యాడు.జయరాజు చట్టాన్ని గౌరవిస్తూ, విలువల్ని పాటించే ఉత్తముడు. ఆయన పూనికతో సుమతికి వ్యభిచార గృహం నుంచి విముక్తి లభించడమే కాదు, పునరావాస భాగ్యమూ కలిగింది.
సుమతి కథ మీడియాలో ప్రచారమైనప్పుడు..‘వ్యక్తిగా సామాన్యుణ్ని. నేరాల్ని అరికట్టడం, అసహాయుల్ని కాపాడ్డం.. నా వృత్తిధర్మం, కర్తవ్యం. సక్రమంగా బాధ్యతను నిర్వహించడాన్ని ఘనతగా ఎలా ప్రచారం చేసుకుంటాను? సమాజసేవకే జీవితాన్ని అంకితం చేసి, అతి సామాన్య జీవితం గడుపుతూ అజ్ఞాతంగా ఉండే మహనీయులు కొందరున్నారు. వారు అజ్ఞాతంలోంచి బయటికొస్తే ఎందరికో ప్రేరణ కాగలరు. కానీ వారు రారు. ఎందుకంటే, మన సమాజం వారిని అజ్ఞాతంలోంచి బయటికి తెచ్చే స్థాయికి ఇంకా ఎదగలేదు’ అని జయరాజు అన్నట్లు.. వంశీకి చెప్పాడు చంద్ర.
ఈ అభిప్రాయంతో వంశీ ఏకీభవించలేదు. సమాజంలోని ఘోరాలకూ, అవినీతికీ కారణం.. పదవుల్లో ఉన్నవారి బాధ్యతారాహిత్యమే! అలాంటప్పుడు జయరాజువంటివారు ఎందరికో ప్రేరణ కారా!అది చెప్పడానికి జయరాజుని కలిశాడు వంశీ.“నేనూ అందరు అధికారుల్లాంటి వాణ్నే! ఏ ప్రత్యేకతాలేని నేను, కేవలం కృతజ్ఞతాభావంతో ఓ వ్యక్తి కోరిక మేరకు సుమతిని రక్షించాను. ఆ ఘనతను నేనెలా స్వీకరిస్తాను?” అన్నాడాయన.
మూడో కథ :
పాణి తండ్రి చిరుద్యోగి. ఎలాగో కొడుకుని ఇంజినీరింగ్ చదివించాడు. పైచదువులకి గానూ అతనికి అమెరికాలోని ఓ యూనివర్సిటీ ఎయిడ్ ఇచ్చింది. ఐతే వీసా రావడానికి అకౌంట్లో కనీసం పది లక్షలు చూపించాలన్నారు. తండ్రి ఎలాగో నాలుగు లక్షల దాకా వేశాడు. అప్పటికే వాళ్లకి అప్పులున్నాయి. ఇంకా పాణి చెల్లెలు ఇంటర్ ఫస్టియర్‌లో ఉంది. పాణి అమెరికా వెళ్తే.. వాళ్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ఆశ!
అప్పివ్వడానికి బ్యాంకులు సిద్ధమే! కానీ, వాటికి పూచీకత్తు కావాలి.అందుకోసం పాణి తండ్రి చాలామంది చుట్టూ తిరిగాడు. పని జరగలేదు.
పాణికి వంశీ తెలుసు. సాయపడతాడన్న ఆశతో వంశీని కలుసుకున్నాడు.“సాయపడాలనుంది. సాయపడగలను కూడా! కానీ దురదృష్టవశాత్తూ అనుకోనిదేమైనా జరిగి నువ్వు డబ్బు వెనక్కిచ్చే పరిస్థితిలో లేవనుకో. తట్టుకునేందుకు నా ఆర్థిక బలం చాలదు” అని వంశీ అతనికి సంజాయిషీ ఇచ్చాడు.పాణి అప్పటికి ఏమనకుండా వెళ్లిపోయాడు. మర్నాడు అతను వంశీని కలుసుకుని..“అనుకోకుండా నాకో మహనీయుడి గురించి తెలిసింది. ఒక్కసారి ఆయన్ని కలుసుకోండి. మీరే నా సమస్యను పరిష్కరించే ఉపాయం చెబుతాడు” అన్నాడు.
“చిన్నప్పుడు మా తాతయ్య అంటుండేవాడు.. ‘లక్ష్మి చంచలమైనదిరా! డబ్బు విషయంలో పట్టు సడలిస్తే, తను వేరెటో జారిపోతూ మనని అధఃపాతాళానికి తోసేస్తుందిరా’ అని. అందుకే డబ్బు విషయంలో నేను మహా జాగ్రత్తగా ఉంటాను. వేలలో ఐతే ఫర్వాలేదు కానీ, పాణిది లక్షలతో వ్యవహారం. మామూలుగా ఐతే వెంటనే సారీ చెప్పి పంపేసేవాణ్ని. కానీ పాణి నన్ను కలుసుకోమన్నది శమన్ని” అని ఆగాడు వంశీ.
శమన్ పేరు విని ఉలిక్కిపడి..“శమన్ అంటే మా ఇంటిపక్క శమనేనా?” అన్నాను అపనమ్మకంగా.“ఔను! ఆ శమనే! పాణి ఆ పేరు చెప్పగానే నేనూ ఉలిక్కిపడ్డా. ఎందుకంటే అంతకుముందు మనోహర్, జయరాజు చెప్పిన అజ్ఞాతవ్యక్తి కూడా శమనే!” అన్నాడు వంశీ.తెల్లబోయాను.
నాలాంటి వాడుండే సామాన్యమైన కాలనీలో సామాన్యమైన ఇంట్లో మా ఇంటిపక్కే ఉంటూ, పదిహేనువేల కోసం నావంటి సామాన్యుడిముందు చేయిచాచిన శమన్.. పరోపకారానికి లక్షలకు లక్షలు ఏర్పాటు చేయించేటంత గొప్పవాడా? నమ్మడం కష్టం. కానీ నమ్మించాల్సిన అవసరం వంశీకేమిటి? కుతూహలం పట్టలేకపోతున్నాను. ‘శమన్ ఎప్పుడొస్తాడా!?’ అని వాళ్లింటివైపు ఓ కన్నేసుంచాను. క్షణం యుగంలా గడుస్తుంటే.. మధ్యాహ్నం రెండింటికి కాబోలు శమన్ ఇంట్లో సందడి వినిపించింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకి శమన్ నుంచి ఫోను. మేము రావచ్చనడానికి పచ్చజెండా అది!నేను, వంశీ కలిసి శమన్ ఇంటికెళ్లాం.
ముందు హాల్లో నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు, దానిముందో గాజుబల్ల. ఆయన భార్య మమ్మల్నోసారి చిరునవ్వుతో పలకరించి, నమస్కారంతో వీడ్కోలు చెప్పి వెళ్లిపోయింది. ఆయన, మేము కుర్చీల్లో కూర్చున్నాం. పరిచయాలయ్యేక..“అవసరంలో సాయం చేశారు. థాంక్స్! ముందు రేపన్నాను. కానీ, ఈ సాయంత్రానికే తిరిగిచ్చేస్తాను” అన్నాడాయన వంశీతో.“అయ్యో! అదంత అర్జంటేం కాదు కానీ, నాకొకటి ఆశ్చర్యంగా ఉంది. మీరు చాలామందికి లక్షలు లక్షలు సాయం చేస్తున్నారు. పదిహేను వేలకి మీరు మావాణ్ని అడగడమేమిటి!?..”వంశీ ఇంకా ఏదో అనేలోగా..“ఓహ్! పాణి చెప్పిన వంశీ మీరేనా?” చటుక్కున అన్నాడు శమన్.అంతవరకూ ‘వంశీ కలవాలన్న శమన్ ఈయనేనా!?’ అని అనుమానముంటే.. అదిప్పుడు పూర్తిగా తొలగిపోయింది నాలో.“ఔను?!” అని ప్రశ్నార్థకంగా చూశాడు వంశీ.
శమన్ నవ్వి..“మీరు బ్యాంకులో క్యాషియర్ అనుకోండి. లక్షల రూపాయలు పంచుతారు. మీ జేబులో పైసా కూడా లేనప్పుడు, కాఫీ కావాలొచ్చిందనుకోండి. ఎవరినైనా అడుగుతారా? ఎదురుగా ఉన్న క్యాష్లోంచి తీసుకుంటారా?” అన్నాడు.ఆయన ఆంతర్యం నాకే కాదు, వంశీకీ అర్థం కానట్లుంది.“అంటే?” అన్నాడు.“అవసరంలో ఉన్నవాళ్లని ఆదుకునే బ్యాంకు ఒకటుంది. దానికి నేను క్యాషియర్ని” అన్నాడు శమన్. కొంత అర్థమైనట్లున్నా..“అంటే?” అన్నాడు వంశీ మళ్లీ.“పాణికి అవసరమైన డబ్బు.. మా బ్యాంక్ ఇస్తుంది. అది అజ్ఞాతం కాబట్టి, పేరు మీది వాడుకుంటాం” అని నవ్వేడాయన.‘అజ్ఞాతంగా సమాజసేవ చెయ్యాలనుకునే అపూర్వ వ్యక్తులకి బినామీని నేను’ అని వంశీతో అన్నాట్ట మనోహర్. ఆ మాటలకు భాష్యంలా ఉంది.. ఇప్పుడు శమన్ అన్న మాట!“చేస్తున్నది సమాజసేవే కానీ, తప్పుడుపని కాదుగా! అలాంటప్పుడు అజ్ఞాతంగా ఉండటమెందుకు? ఆ బ్యాంకు ఆదాయం సక్రమమార్గాల్లో సంపాదించింది కాకపోతే తప్ప!” అన్నాడు వంశీ.“చూసేరా! పరోపకారానికి అంకితమైందని తెలియగానే.. ఆ బ్యాంకు ఆదాయంపై బురద చల్లడానికి ఆత్రపడింది మీ మనసు. ఆ బ్యాంకు అజ్ఞాతంగా ఉండటానికి కారణమదేనేమో!” అన్నాడు శమన్.‘ఔను సుమా’ అనుకున్నాను అప్రయత్నంగా. అంతలోనే..“అవసరానికి ఎంతైనా ఇచ్చి సాయపడేంత ఆదాయం ఎలా వస్తోందనడిగితే.. బురద చల్లడం అవుతుందా?” అన్నాను.
“ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకడైన వారెన్ బఫెట్ పేరు వినుంటారు. ఆయన సంపాదనలో అధికభాగం స్టాక్ మార్కెట్లో ట్రేడింగువల్ల వచ్చింది. అలా సక్రమ మార్గాల్లో బాగా సంపాదించిన కోటీశ్వరుల్లో ఒకరు.. ఈ బ్యాంకు అనుకోండి” అన్నాడాయన.“అనుకున్నా సరే! సంపాదన సక్రమమైతే అజ్ఞాతంగా ఉండటమెందుకు?” మళ్లీ అన్నాను.“మంచిపనైనా, గొప్పపనైనా.. నిశ్శబ్దంగా జరిగినంతకాలం ఎవరూ పట్టించుకోరు. ప్రచారమైనప్పుడే సమస్య! ఎందుకంటే.. ప్రచారం కీర్తి ప్రతిష్ఠలకు దారితీస్తుంది. కీర్తిప్రతిష్ఠలతో వెలిగేవారంటే ఎవరికైనా అసూయే! వారు ఆ వెలుగు వెనుక నీడల కోసం వెదుకుతారు. దొరికితే సరేసరి, లేకుంటే నీడలు సృష్టిస్తారు. ఆ నీడల ప్రచారంలో, కీర్తిప్రతిష్ఠల వెలుగు మసకబారిపోతుంది. అందువల్ల ఆయా వ్యక్తులకంటే, సమాజానికే నష్టమెక్కువ. నేడు మహామహా మహాత్ముడికే ఆ అవస్థ తప్పడం లేదు కదా! ఇక సామాన్యులం, మనమెంత!” ఆగాడు శమన్.ఆలోచిస్తున్నాను.
దేశంలో కళ, సాహిత్యం, సినిమా, విద్య, భక్తి, రాజకీయం వగైరా ఎన్నో రంగాలున్నాయి. అన్నింటా ఎందరో నిష్ణాతులున్నారు. వారికి లభించిన గుర్తింపు అవధులు మీరినప్పుడు.. తెరవెనుక గాథలు ప్రచారంలోకి వస్తాయి. కొన్ని ఊహాగానాలు. కొన్ని సగం నిజాలు. ఒకవేళ అవన్నీ నిజాలైనా అ నిష్ణాతుల ప్రతిభకు ఆ నిజాలతో నిమిత్తం లేదు. ఏదేమైనా, తమ జీవితం వివాదాస్పదం కావడానికి ఇష్టపడనివాళ్లు.. గుర్తింపుకో నమస్కారం పెట్టి, ప్రచారానికి దూరమై అజ్ఞాతంగా ఉండటానికి ఇష్టపడతారు. నా ఆలోచనల్ని సమర్థిస్తూ శమన్ కొనసాగిస్తున్నాడు..“అలాంటివాడే నిశాంత్. ఆయన పేరు అది కాదు. మీ కోసం కల్పించి చెబుతున్నా. సమాజంలో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు గతంలో ఆయన చట్టాన్ని పలుమార్లు అతిక్రమించాడు. రెండుసార్లు జైలుకెళ్లొచ్చాడు. క్రమంగా బుద్ధి వికసించి తనని తాను మార్చుకున్నాడు. సక్రమంగా డబ్బు సంపాదించే తెలివి సంతరించుకున్నాడు. వ్యభిచార గృహంలో మగ్గిపోతున్న ఓ మహిళకు చెరతప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులిప్పుడు అజ్ఞాతంగా ఉంటూ సమాజ సేవే ధ్యేయంగా బతుకుతున్నారు. వారివల్ల ప్రయోజనం పొందినవారు అన్ని రంగాల్లో ఉన్నారు. వారు ఆ పరిచయాల్ని అసహాయుల్ని ఆదుకునేందుకు వాడుతున్నారు. అనుకున్నది చేస్తున్నారు. అజ్ఞాతంగా ఉన్నంతకాలం నో ప్రోబ్లం! వారు చీకట్లో ఉన్నా వారిచ్చే వెలుగే సమాజంలో బడుగులకి నీడనిచ్చి ఆదుకుంటుంది. ప్రచారం లభించిందా.. మహనీయులు వెలుగులోకి వస్తారు. ఎవరికీ ప్రయోజనంలేని వారి నేపథ్యపు నీడ చర్చనీయాంశమై, వారిని మసకబారుస్తుంది. అవసరమా?”వింటుంటే సమకాలీనంగా వివిధ రంగాల్లో జరిగే విశేషాలెన్నో స్ఫురిస్తున్నాయి.ఎందరో మహానుభావులు బురద నిండిన ఒంటితో కళ్లముందు మెదులుతున్నారు.
వంశీ చటుక్కున శమన్కి నమస్కరించి..“ఆ నిశాంత్ ఎవరు? అని అడగను. మిమ్మల్నే నిశాంత్గా భావించి చెబుతున్నాను. నావల్ల మీ అజ్ఞాతానికి భంగం కలగదని హామీ ఇస్తున్నాను. పాణికి నేనెలా సాయపడాలో చెప్పండి. తూచా తప్పకుండా పాటిస్తాను” అన్నాడు.‘సమాజసేవకే జీవితాన్ని అంకితం చేసి, అతిసామాన్య జీవితం గడుపుతున్న అజ్ఞాత మహనీయులు కొందరున్నారు. వారు అజ్ఞాతంలోంచి బయటికొస్తే ఎందరికో ప్రేరణ కాగలరు. మన సమాజం వారిని అజ్ఞాతంలోంచి బయటికి తేగల స్థాయికి ఎదగాలి’ అన్నాడు జయరాజు.. వంశీతో.ఆ మాటలు స్ఫురించగా..శమన్ని నిశాంత్గా వంశీ భావిస్తున్నాడేమో కానీ.. నాకైతే నిశాంత్ పేరిట శమన్ తన కథే మాకు వినిపించి, అనుకున్న ప్రయోజనం సాధించాడనిపించింది.
వసుంధర
సమాజంలో వినోద, విషాదాలకు దారితీసే ప్రతి ఘటన, సమస్యలకు కారణం మనిషి ఆలోచనా విధానం, దృక్పథమే! మానసిక విశ్లేషణతో వ్యక్తిత్వాల్ని అధ్యయనం చేసి, ఆ ఫలితాల్ని రచనలుగా మలుస్తుంటారు డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు-రామలక్ష్మి దంపతులు. ఇద్దరూ కలిసి ‘వసుంధర’ కలం పేరుతో రచనలు చేస్తున్నారు. వీరి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం. రాజగోపాలరావు వృత్తిరీత్యా సైంటిస్టు కాగా, ప్రవృత్తిరీత్యా కథకుడు. ఆంధ్రా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్డీ చేశారు. ఒడిశా భువనేశ్వర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీలో సైంటిస్టుగా పనిచేసి, విరమణ పొందారు. పాఠశాల స్థాయి నుంచే కథలు రాయడం మొదలుపెట్టారు. సాహిత్య సేద్యంలో భాగంగా అనేక బహుమతులు అందుకున్నారు. ఇప్పటి వరకూ 1200 కథలు, 250కి పైగా నవల – నవలికలు, బాలసాహిత్యంలో 1600కి పైగా కథలు, 150కి పైగా వ్యాసాలు, 20 నవలలు, 10 నాటికలు ప్రచురించారు. బాలల్లో సాంఘిక, రాజకీయ/వైజ్ఞానిక అవగాహనను పెంపొందించేలా వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. వీరి రచనలు కొన్ని సినిమాలుగానూ వచ్చాయి. కొన్ని హిందీ, కన్నడ, ఆంగ్ల భాషలలోకి అనువాదమయ్యాయి.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
-వసుంధర
98856 20065