Kasi Majili Kathalu | గజకర్ణ – గోకర్ణ విద్యలు
Kasi Majili Kathalu Episode 63 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : పరకాయ ప్రవేశ విద్య తెలిసిన శరభుడు, ఇంద్రజాల విద్య తెలిసిన భద్రుడు.. రత్నాకర మహారాణి కాంతిసేనవల్ల మోసపోయారు. వీరసేనుడనే మహారాజును ఆశ్రయించారు. మహేంద్రజాల విద్య తెలిసిన వీరసేనుడు సైతం కాంతిసేన వల్ల పరాభవం పొందాడు. దాంతో టక్కు - టమార విద్యలు తెలిసిన గజదొంగలను కాంతిసేనపై ఉసిగొల్పాడు వీరసేనుడు.గజకర్ణ - గోకర్ణ విద్యలు
Kasi Majili Kathalu Episode 63 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : పరకాయ ప్రవేశ విద్య తెలిసిన శరభుడు, ఇంద్రజాల విద్య తెలిసిన భద్రుడు.. రత్నాకర మహారాణి కాంతిసేనవల్ల మోసపోయారు. వీరసేనుడనే మహారాజును ఆశ్రయించారు. మహేంద్రజాల విద్య తెలిసిన వీరసేనుడు సైతం కాంతిసేన వల్ల పరాభవం పొందాడు. దాంతో టక్కు – టమార విద్యలు తెలిసిన గజదొంగలను కాంతిసేనపై ఉసిగొల్పాడు వీరసేనుడు.
మరోసారి టక్కరి, టమారి రత్నాకర నగరానికి వెళ్లారు. అంతకుముందు వచ్చిన వీరసేనుడి లాంటివాళ్లకు ఆశపెట్టినట్లే.. వీళ్లను కూడా పెళ్లి చేసుకుంటానని మోసపుచ్చింది కాంతిసేన. పెళ్లికి ముందే విద్యలను ధారపోయాలని నియమం పెట్టింది. ఆనక పెళ్లి మాట పక్కనపెట్టి.. ఖైదులో పెట్టించింది.
ఆ ఉదంతంతో వీరసేనుడికి పట్టుదల పెరిగింది. కాంతిసేన వద్దనున్న విద్యలకంటే పైస్థాయి విద్యలు కలవారిని ఆశ్రయించి, ఎలాగైనా ఆమెను పరాభవించాలని దీక్ష పూనాడు. శాంబరీ విద్యలు నేర్చిన వారిని వెతుక్కుంటూ దేశాటనం చేయసాగాడు.
ఒక అగ్రహారంలో అతనికి జలంధరుడనే బ్రాహ్మణుడు లభించాడు. ఆయనకు గజకర్ణ – గోకర్ణ విద్యలు తెలుసు. మాయా విద్యల్లో ఆ రెండిటికీ పైన విద్యలు లేవు. కానీ, జలంధరుడు మహాతపశ్శాలి. ఆయన తన విద్యలను ఎవరిపైనా ప్రయోగించడు. పరుల సొమ్ముకోసం ఆరాటపడడు. తనకు కలిగినంతలో అందరికీ ఉపకారం చేస్తాడు. పైగా వృద్ధుడు.
ఆయనకు కామందకుడనే కుమారుడు ఉన్నాడు. తండ్రి సకల విద్యాకోవిదుడు కాగా, కొడుక్కు మాత్రం చదువు అబ్బలేదు. వీరసేనుడు అతనితో పదిరోజులు స్నేహం చేశాడు. ఒకనాడు.. “మిత్రమా! ఇంతకాలం నువ్వు పెళ్లి చేసుకోలేదేం?! నీకు పిల్లనిస్తామని ఎవరూ రాలేదా?” అని అడిగాడు వీరసేనుడు.
“నాకు నచ్చిన పిల్ల ఇంతవరకూ దొరకలేదు” అని కామందకుడు సమాధానం ఇచ్చాడు.
“నా ఎరుకలో నీకు తగిన సంబంధం ఉంది. ఆమె రత్నాకర నగరానికి మహారాణి. అందంలో రంభ. విద్యలలో సరస్వతి” అని వీరసేనుడు ఇంకా ఏదో చెబుతుండగానే.. “అలాంటి పిల్లే కావాలి.. నాకు అలాంటి పిల్లే కావాలి!” అన్నాడు కామందకుడు.
“కానీ, ఆమెకు పరకాయ ప్రవేశం, మహేంద్రజాలం వంటి విద్యలు తెలుసు. నువ్వు మీ తండ్రిగారిని అడిగి, గజకర్ణ – గోకర్ణ విద్యలు సంపాదించుకో. ఆ తరువాత ఆమెను జయించి, పెళ్లాడటం ఎలాగో నేను చెబుతాను” అని వీరసేనుడు ప్రబోధించాడు.
దాంతో కామందకుడు తండ్రి వద్దకు వెళ్లి.. కాంతిసేన గురించి చెప్పాడు. తనకు రెండు విద్యలూ ఇమ్మని అడిగాడు.
“మనకు రాచకన్యలు ఎందుకు నాయనా?! నీలాంటి అల్పప్రజ్ఞావంతుడు అందలం ఎక్కాలని ఆశ పడకూడదు. దొరికిన దాంట్లో సంతృప్తి పడటం నేర్చుకో” అని నచ్చజెప్పాడు జలంధరుడు.
అయినా కామందకుడు వినలేదు. తనకు విద్యలు ఇవ్వకపోతే, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విసిగిపోయిన జలంధరుడు చివరికి అంగీకరించాడు.
“రెండు విద్యలూ భరించే శక్తి నీకు లేదు. కనుక గజకర్ణ విద్య ఇస్తున్నాను. తెలివి గలవాడవైతే ఆ విద్యతోనే అనుకున్నది సాధించుకోగలవు” అని చెప్పాడు.
కామందకుడు సరేనంటూ వీరసేనుడితో కలిసి రత్నాకర నగరానికి వెళ్లాడు. ఊరి బయట విడిది చేసి.. “నా మిత్రులను మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పుకోవాలి. లేదా మేం తీసుకోబోయే కఠిన చర్యలకు గురికావాల్సి ఉంటుంది” అని కాంతిసేనకు వర్తమానం పంపాడు.
కాంతిసేన వెంటనే తన చెలికత్తె అయిన కేసరిణితో తిరుగు సందేశం పంపించింది.
“ఆర్యా! తమముందు మా మహారాణి తన విద్యలను ప్రదర్శించదు. ఇంతకుముందు వచ్చినవారంతా ఆమెను మోసగించబోయి.. వారే మోసపోయారు. దీనిలో ఆమె తప్పేమీ లేదు. ఆమె ప్రస్తుతం మిమ్మల్ని పెళ్లాడటానికి అంగీకరించింది. ఆమెను చేపట్టి, మీ విద్యలను ఆమెకిచ్చి.. ఆమె విద్యలను మీరు గ్రహించండి” అన్నది కేసరిణి.
“గతంలో మీ మహారాణి చేసిన మోసాలన్నీ నాకు తెలుసు. తాళి కట్టిన తరువాత మాత్రమే.. నా విద్యలను ఆమెకిస్తాను” అని జవాబిచ్చాడు కామందకుడు.
“సరే.. ఏర్పాటు చేస్తాను” అంటూ వెళ్లింది కేసరిణి.
పెళ్లినాడు ఒక దాసికి తన వేషం వేసి పంపింది కాంతిసేన. కామందకునికి ఆ వైనం తెలియక దాసి మెళ్లోనే పుస్తె కట్టాడు. వెంటనే తన విద్యను ఆమెకు ధారపోశాడు. వెనువెంటనే ఆ దాసి, ఆ విద్యను కాంతిసేనకు ఇచ్చేసింది. క్షణం ఆలస్యం లేకుండానే కామందకుడు కారాగారం పాలయ్యాడు.
వీరసేనుడు, అతని మిత్రులు హతాశులై.. ఆ వార్తను జలంధరుని చెవిన వేశారు. ఆయన పాపం కన్నీరు మున్నీరుగా విలపించసాగాడు. ఆ సమయానికి అక్కడ జలంధరుని శిష్యుడు రత్నపాదుడనే వాడున్నాడు.
“గురువుగారూ! మీ గోకర్ణ విద్యను నాకు ప్రసాదించండి. ఆ విద్య సాయంతో కాంతిసేనను జయించి, మన కామందకుణ్ని రక్షిస్తాను. అలా చేయలేకపోతే నేను తిమ్మరుసు మనవడినే కాదు” అన్నాడు.
“నాయనా! నువ్వు బుద్ధిమంతుడివి. చెప్పిన పని తప్పకుండా చేయగలవని నాకు నమ్మకం ఉంది. నీకిప్పుడే మంత్రోపదేశం చేస్తాను. ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా కార్యం చక్కపెట్టుకుని రా” అంటూ జలంధరుడు విద్యను ఉపదేశించాడు.
వెంటనే రత్నపాదుడు బయల్దేరి రత్నాకర నగరానికి వెళ్లాడు. గోకర్ణ విద్యా ప్రభావంతో అక్షౌహిణుల కొద్దీ సైన్యాన్ని సృష్టించాడు. భేరీ భాంకారనాదాలతో సేనావాహిని నగరాన్ని ముట్టడిస్తున్నట్లు మాయ కల్పించాడు.
ఉరుములేని మెరుపులా వచ్చిపడ్డ ఉపద్రవానికి పౌరులందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, పారిపోవడం మొదలుపెట్టారు. కాంతిసేన, ‘ఇదంతా నిజం కాదు. ఎవరూ భయపడవద్దు’.. అని అందరికీ నచ్చజెప్పింది. కానీ, ఎవరికీ ధైర్యం చాలలేదు.
కొద్దిసేపటికి సైన్యాలన్నీ మాయమైపోయాయి. ఆ అలజడి నుంచి తేరుకునేంతలోపే భూకంపం పుట్టింది. రత్నాకర నగరం బొంగరంలా తిరగసాగింది. ఇళ్లన్నీ కూలిపోతుండగా పౌరులందరూ హాహాకారాలు చేయసాగారు. ఇంత జరుగుతున్నా రత్నపాదుడు ఎవరికీ కనిపించడం లేదు. జరుగుతున్న దానికి కారణం ఏమిటో, ఈ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో కాంతిసేనకు అర్థం కావడం లేదు. మరికొద్దిసేపటికి భూకంపం ఆగింది. పడిపోయిన ఇళ్లన్నీ ఎప్పటిలాగే నిలబడ్డాయి.
‘హమ్మయ్య!’ అనుకునేంత లోగానే ఆకాశం నిండా చిక్కని మబ్బులు కమ్ముకున్నాయి. వర్షానికి బదులుగా పిడుగులు కురవసాగాయి. రత్నాకర నగరం భీకర జ్వాలల్లో చిక్కుకుపోయింది. ఈ మహాప్రళయానికి పౌరులందరూ తల్లడిల్లిపోసాగారు. కలలో వచ్చిన బాధకు ఉలిక్కిపడి మేల్కొనగానే ఏమీ కనిపించని విధంగా.. మళ్లీ కొంతసేపటికి అంతా సద్దుమణిగింది.
పౌరులందరూ కాంతిసేన వద్దకు పోయి.. దీనికి ఎలాగైనా ప్రతిక్రియ చేయాలని మొరపెట్టుకున్నారు.
కాంతిసేన వారికి ధైర్యం చెప్పి.. “మన నగరంలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే జాడలు తీసి రండి” అని నాలుగు దిక్కులకూ దూతలను పంపించింది.
అలా వెళ్లిన దూతలు కొందరికి.. ఒక దేవాలయంలో రత్నపాదుడు కనిపించాడు.
“అయ్యా! మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని ప్రశ్నించారు.
“నేనెవరైతే మీకెందుకు.. నా జోలి మీకేల?” అంటూ వారిని తిరస్కారంగా తోలేశాడు రత్నపాదుడు.
ఆ దూతలు మహారాణికి వార్త నివేదించారు. అప్పుడామె కేసరిణిని అతని మీద ప్రయోగించింది.
రత్నపాదుడి దగ్గరికి వచ్చిన కేసరిణి.. “ఆర్యా! మీ వేషం చూస్తుంటే భూసురులని తెలుస్తున్నది. మా నగర ప్రజలకు ఆశ్చర్యకరమైన వింతలను కనబరిచినవారు తమరే అనుకుంటాను. మా మహారాణి మీ క్షేమం తెలుసుకుని రమ్మంది” అని చతురంగా మాట్లాడింది కేసరిణి.
కొన్ని విలువైన బహుమతులను కూడా సమర్పించింది. అందుకు రత్నపాదుడు మెత్తబడకుండా.. “ఓహో! నువ్వు కేసరిణివా? మీ మహారాణి ఆతిథ్యానికి సంతోషించాను. మాది దక్షిణ దేశం. దేశాటన చేస్తుంటే మీ ఏలికసాని మాయావిద్యా ప్రాభవాన్ని గురించి అందరూ చెప్పుకోగా విని వచ్చాను. అవును గానీ, నేను చూపించిన వింతలకు, మీ మహారాణి ప్రతిజాలం ఏమీ చేయలేదేం?!” అన్నాడు.
అప్పుడు కేసరిణి వినయంగా.. “అయ్యా! మీ సామర్థ్యం అనన్య సామాన్యమైనది కదా! మీ ప్రభావంలో వెయ్యోవంతు కూడా మా కాంతిసేన వద్ద లేదు. ఇప్పుడామె మిమ్మల్ని వివాహం చేసుకోవాలనే తలంపుతో ఉంది. విద్యలలో తనను ఎవరు ఓడిస్తారో వారినే వివాహం చేసుకుంటానని గతంలోనే ఆమె ప్రతిజ్ఞ చేసింది. కనుక రాజ్యలక్ష్మితోపాటు ఆమెను కూడా చేపట్టండి” అని విన్నవించింది.
రత్నపాదుడు పరిహాసంగా నవ్వి.. “కేసరిణీ! మీ రాజపుత్రిక చరిత్రంతా నేను గతంలోనే విన్నాను. ఇదివరకు చాలామందిని ఇలాగే మోసగించిందట కదా! మీ మాయలో పడటానికి నేను భద్ర శరభులు, శంతన వీరసేనుల వంటివాణ్ని కాను. ఆమె టక్కు – టమారాలు నాముందు చెల్లవు. మర్యాదగా మా గురుపుత్రుణ్ని విడుదల చేయకపోతే, మీ నగరాన్ని నట్టేట్లో ముంచిపోతాను” అన్నాడు.
“ఆర్యా! మీవద్ద నిజం దాచడం ఎందుకు? మేము చాలామంది వంచకులను మోసగించిన మాట నిజమే! తన మాయకు లోబడకుండా మిగిలిన వారినే వివాహం చేసుకోవాలని మా కాంతిసేన కోరిక. మీరు అన్నిటికీ అతీతులు కాబట్టే మిమ్మల్ని వరించింది” అని మరోసారి చెప్పింది కాంతిసేన.
“నేను మీ రాజపుత్రికను పెళ్లాడదలుచుకున్నప్పుడు కదా ఇదంతా. నాకు ఆమెపై అనురాగం లేదు. నాతో వాదించడం మాని, మా గురుపుత్రుణ్ని విడిపించి తీసుకురా” అని హుంకరించాడు రత్నపాదుడు.
కేసరిణి పోయి, కాంతిసేనకు అంతా నివేదించింది. ఆమె మరికొన్ని మాయోపాయాలు పన్ని, రత్నపాదుణ్ని లొంగదీయాలని ప్రయత్నించింది. కానీ, సఫలం కాలేదు. చివరికి కాంతిసేనే స్వయంగా అతని వద్దకు వెళ్లి, నమస్కరించి నిలబడింది.
“ఆర్యా! మీరు ఎరుగని ధర్మాలుండవు. భద్రుడు, శరభుడు ఉత్తమవంశంలో జన్మించిన వారైనా.. ఆ విద్యలకు అర్హులు కారు. టక్కరి – టమారి గజదొంగలు. వారి వద్ద మాయా విద్యలుంటే లోకానికి ఎంతటి అపకారమో ఆలోచించారా?! వీరసేనుడు రాజపుత్రుడే అయినా విచక్షణా జ్ఞానం లేకుండా నన్ను అవమానించాలని ప్రయత్నించాడు. ఇక మీ గురుపుత్రుని చాపల్యం మీకు తెలియంది కాదు. వీళ్లందరినీ నేను పరాభవించక పోతే నా రాజ్యాన్ని నేను కాపాడుకోలేను. అటువంటి దుర్జనుల వద్ద అటువంటి విద్యలు ఉండకూడదు. కానీ, మీరు ఉత్తములు కనుక, అన్ని విద్యలూ ఉండవచ్చు. మీకిప్పుడే నా విద్యలను ధారపోస్తున్నాను. దయచేసి తీసుకోండి. మీ గురుపుత్రుణ్ని కూడా విడుదల చేస్తున్నాను” అని అతని హృదయం కరిగేలా మాట్లాడింది.
“నీ విద్యలు మాకు అవసరం లేదు. మా గురుపుత్రుణ్ని విడుదల చేయి. అతను నీమీద మనసుపడ్డాడు కనుక, అతణ్ని వివాహమాడు” అన్నాడు రత్నపాదుడు.
“అయ్యా! సర్వజ్ఞులైన తమరే ఇలా సెలవివ్వడం ఆశ్చర్యంగా ఉంది. అధమునికి ఆలిగా ఉండటం కంటే, ఉత్తమునికి దాసిగా ఉండటం మేలని పెద్దలు చెబుతారు. అదీకాకుండా నన్ను విద్యలలో ఓడించిన వాడినే పెళ్లాడతానని ప్రతిజ్ఞ చేశాను. వ్రతభంగానికి ఒప్పుకోలేను” అని సమాధానం ఇచ్చింది కాంతిసేన.
ఆమె మాటలను రత్నపాదుడు ఖండించాడు. దాంతో వారిమధ్య వాదం పెరిగింది. అది ఎంతకూ తెగలేదు. చివరికి జలంధరుడు వచ్చి, వారికి రాజీ కుదిర్చాడు.
గురువు ఆజ్ఞ మేరకు రత్నపాదుడు, కాంతిసేనను వివాహం చేసుకున్నాడు. కామందకుడు ప్రధాని అయ్యాడు. భద్ర, శరభులు, శంతనుడు పరిహాస సఖులుగా నియమితులయ్యారు. వీరసేనుణ్ని సామంతునిగా చేసుకుని, రత్నపాదుడు చాలాకాలం హాయిగా రాజ్యం చేశాడు.
(వచ్చేవారం.. ఆమె పేరు పద్మిని)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Read More :
Kasi Majili Kathalu | మహేంద్రజాలం టక్కుటమారం
Kasi Majili Kathalu | పరకాయ ప్రవేశం
Kasi Majili Kathalu | కామగ్రీవుని విద్యలు
Kasi Majili Kathalu | యవనద్వీపంలో అందగత్తెలు
Kasi Majili Kathalu | రేవానగరంలో కలకలం
Kasi Majili Kathalu | ఒంటరి ప్రయాణం
Kasi Majili Kathalu | పుష్పహాసుడు
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

