Kasi Majili Kathalu | మహేంద్రజాలం టక్కుటమారం
Kasi Majili Kathalu Episode 62 | జరిగిన కథ : రత్నాకర నగర మహారాజు చనిపోగా.. శరభుడు అనే వ్యక్తి ఆ రాజు దేహంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అతణ్ని వంచించడానికి ఇంద్రజాల విద్య తెలిసిన భద్రుణ్ని ఆశ్రయించింది యువరాణి కాంతిసేన. దాంతో రాజు దేహాన్ని విడిచి శరభుడు వేరొక యువకుడి దేహంలోకి మారిపోయాడు.
Kasi Majili Kathalu Episode 62 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : రత్నాకర నగర మహారాజు చనిపోగా.. శరభుడు అనే వ్యక్తి ఆ రాజు దేహంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అతణ్ని వంచించడానికి ఇంద్రజాల విద్య తెలిసిన భద్రుణ్ని ఆశ్రయించింది యువరాణి కాంతిసేన. దాంతో రాజు దేహాన్ని విడిచి శరభుడు వేరొక యువకుడి దేహంలోకి మారిపోయాడు.
రత్నాకర నగరానికి రాణిగా కాంతిసేన పట్టాభిషిక్తురాలైంది. అప్పటివరకూ చెలికత్తెగా ఉన్న కేసరిణి.. మంత్రిమండలిలో చోటు సంపాదించింది. మహారాజు మరణ రహస్యాన్ని తన ఇంద్రజాల విద్యతో ఛేదించిపెట్టాడు భద్రుడు. పరకాయ ప్రవేశంతో తమ రాజ్యంలో అలజడికి కారణమయ్యాడు శరభుడు. ఆ తరువాత శాలివాహనుడనే యువకుడి దేహంలోకి మారాడు. వాళ్లిద్దరినీ అడ్డు తొలగించుకోవాలని, వారి విద్యలను తాను సంగ్రహించాలని కాంతిసేన నిర్ణయించుకుంది. కానీ, ఆమె ప్రయత్నంలో శంతనుడు.. పాపం ఒక పావులా మారాడు. భద్రుడితో శంతనుడికి ముందునుంచీ స్నేహం ఉంది. ఇప్పుడు కొత్తగా శాలివాహనుడితో కూడా స్నేహం మొదలుపెట్టాడు. ఇద్దరికీ కాంతిసేనపై మోజుంది. వాళ్లిద్దరినీ ఆమెతో కలిపేందుకు కేసరిణితోపాటు శంతనుడు కూడా సహకరించాడు.
కాంతిసేన వాళ్లిద్దరినీ వరించినట్లే కనిపించింది. అయితే ముందుగా ఒక షరతు పెట్టింది. దానిప్రకారం వాళ్లు తమ విద్యలను ఆమెకు ధారపోయాలి. ఆమె షరతు విని భద్రుడు, శరభుడు కూడా ముందుగా కలవరపడ్డారు. ఆ విద్యలు ఒకసారి వేరొకరికి ఇచ్చేస్తే.. ఇక తమకు ఉపకరించవు. అయినా కాంతిసేనను పెళ్లాడాలనే కోరికతో.. భద్రుడు తన ఇంద్రజాల విద్యను, శరభుడు పరకాయ ప్రవేశ విద్యను కాంతిసేనకు ధారపోసేశారు.
మరునాడే పెళ్లిముహూర్తం పెట్టిస్తానని, ఇద్దరికీ వేర్వేరుగా మాటిచ్చిన కాంతిసేన.. వాళ్లకు ద్వీపాంతరవాస శిక్ష విధించింది. వాళ్లిద్దరితోపాటుగా అనుకోకుండా శంతనుడు కూడా నౌకలో ఎక్కాల్సి వచ్చింది.
నడిమంతరంగా వచ్చిన విద్యలు రెండూ వచ్చినట్టే పోయాయని శరభుడు, భద్రుడు విచారించారు. దుష్టులతో సహవాసం చేసినందుకు తగిన ఫలితం లభించిందని శంతనుడు బాధపడ్డాడు.
* * *
ఆ నౌక కుశద్వీపంలో ఆగింది. అక్కడ దిగగానే నరమాంస భక్షకులు వారిని చుట్టుముట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముగ్గురూ పరుగులు మొదలుపెట్టారు. వాళ్ల అదృష్టం బాగుండి.. సమయానికి ఆ ద్వీపాన్ని ఏలే కుశధ్వజుడనే రాజు అక్కడికి వేటకు వచ్చాడు. వీళ్లను రక్షించి, కోటకు తీసుకువెళ్లాడు.
తన కొడుకైన వీరసేనుణ్ని పిలిచి… “పుత్రా! వీళ్లు ముగ్గురూ జంబూద్వీపం నుంచి వచ్చారు. ఒక మోసగత్తె వల్ల తమ ఇంద్రజాల, పరకాయ ప్రవేశ విద్యలను పోగొట్టుకున్నారు. నువ్వు మహేంద్రజాల విద్యా నిపుణుడివి కదా! వీళ్లకు తగిన న్యాయం చేయగలవా?!” అన్నాడు.
వీరసేనుడు అంగీకరించాడు. ముగ్గురినీ వెంటబెట్టుకుని, రత్నాకర నగరానికి చేరుకున్నాడు. తన మహేంద్రజాల విద్యతో ఒక ఉద్యానవనం కల్పించుకుని, దానిలో మహేంద్ర భవనం నిర్మించాడు. నగరంలో విశేషాలు తెలుసుకురమ్మని కొందరు సేవకులను పంపాడు. భద్రుడు, శరభుడు, శంతనుడు ముగ్గురూ కూడా యోగుల్లా గడ్డాలు పెంచి, ఉద్యానంలో తపస్సు చేసుకుంటున్నట్లు నటించసాగారు.
నగరి వెలుపల కొత్తగా ఉద్యానం వెలిసినట్లు చారుల వల్ల కాంతిసేనకు తెలిసింది. తన ప్రియసఖురాలైన కేసరిణిని పిలిచి, విశేషాలు తెలుసుకుని రమ్మని పంపింది. కేసరిణి వస్తూనే యోగుల వేషాల్లో ఉన్న ముగ్గురినీ గుర్తుపట్టింది. వాళ్లను మాటల్లో పెట్టి, మాయచేసి.. వచ్చినవాడు వీరసేనుడని, మహేంద్రజాల విద్యా నిపుణుడని తెలుసుకున్నది. తిన్నగా వీరసేనుని వద్దకు వెళ్లి, తాను మహారాణి కాంతిసేన పంపగా వచ్చానని చెప్పి.. కొన్ని కానుకలు సమర్పించింది.
వీరసేనుడు వాటిని అంగీకరించకుండా.. “మీరు బ్రాహ్మణ ధనాన్ని అపహరించారు. మీవంటి పాతకుల పూజ మేము అంగీకరించం. వాళ్ల సొత్తు వాళ్లకిచ్చి వేయండి. లేదంటే బలాబలాలు చూసుకుందామని మీ రాణికి నా మాటగా చెప్పు” అన్నాడు.
అప్పుడు కేసరిణి యుక్తిగా.. “మీరు ఒకవైపు వాదనే విని తీర్పు చెబుతున్నారు. మా కాంతిసేన చక్కనిది. స్త్రీలలో రత్నం వంటిది. రత్నం నిజానికి మీవంటి రాజుల వద్ద ఉండాలి. వాళ్లు ముగ్గురూ గులకరాళ్ల వంటివాళ్లు. తమ విద్యలను ఎరవేసి, తన రాజ్యాన్ని కాజేయాలని చూశారు. అందుకే తగిన రీతిగా దండించింది. మీరొక్కసారి ఆమెను చూడండి. ఆమె పుణ్యం ఫలిస్తే మీరే ఆమెకు తగిన భర్త కాగలరు” అంటూ అతనికి ప్రీతి కలిగేలా మాట్లాడింది.
అప్పటికి వీరసేనుడు ఏ సమాధానమూ చెప్పలేదు.
మరునాడు కాంతిసేన సఖులతో కలిసి వీరసేనుడు నిర్మించుకున్న భవంతికి సమీపంలో ఒక ఉద్యానవనం కల్పించి, దానిలో విహరించ సాగింది. దానిని ఇంద్రజాలంగా గ్రహించిన వీరసేనుడు, తన మహేంద్రజాల విద్యతో.. జంఝామారుతం చెలరేగేలా చేశాడు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కుండపోతగా వర్షం కురిపించాడు. ఒక్క ముహూర్తకాలంలో కాంతిసేన నిర్మించిన ఉద్యానవనం నాశనం అయిపోయింది.
అది చూసిన కాంతిసేన ఈసారి.. అనేక క్రూరమృగాలతో నిండిన అడివిని సృష్టి చేసింది. దానిని చూసిన శరభుడు మొదలైన వారంతా హాహాకారాలు చేశారు.
“భయపడకండి” అని వారితో చెబుతూ.. ఆ మృగాలను వేటాడే జంతువులను సృష్టించాడు వీరసేనుడు. చూస్తుండగానే కాంతిసేన పుట్టించిన జంతువులన్నీ మాయం అయ్యాయి. అప్పుడు కాంతిసేన.. ‘అయ్యయ్యో! చూసేవారిని కనీసం ఒక్కరోజుపాటు మాయలో ముంచెత్తే నా ఇంద్రజాలం పనిచేయకుండా పోయిందే?! అతడు సృష్టించిన వనం, జంతువులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. నేను చేసినవేమో ధ్వంసమైపోయాయి. ఈ మహేంద్రజాలాన్ని జయించడం శక్యం కాకుండా ఉంది’ అని చాలాసేపు ఆలోచించుకుంది.
చివరికి వీరసేనునిలో మదన వికారాన్ని కలిగించేలా కొన్ని మాయలు కల్పించింది. ఎంత వారలైనా కాంతదాసులే కదా! ఆమె రూపురేఖా విలాసాలకు, కురిపించిన హొయలకు వీరసేనునికి దిమ్మతిరిగి పోయింది. అలా అతని మతిచెడగొట్టి, కాంతిసేన తన మందిరానికి తరలి వెళ్లిపోయింది. ఆ రాత్రంతా వీరసేనుడు చెప్పలేని తాపాన్ని అనుభవించాడు. అతనికి ఉపశమనాన్ని అనుగ్రహించే దేవతలా కేసరిణి దిగివచ్చింది.
“ఆర్యా! మీ మహేంద్రజాల విద్యముందు మా మహారాణి విద్యలు ఎందుకూ కొరగావు. తనను గెలిచినట్లే భావించమని, తనను చేపట్టమని మీకు విన్నవిస్తున్నది” అని సందేశం వినిపించింది.
వీరసేనుడు పూర్తిగా కాంతిసేన విసిరిన వలలో చిక్కుకుపోయాడు. ఆమెను చేపట్టడానికి నిశ్చయించుకున్నాడు. ఆనాటి సాయంత్రమే అచ్చంగా తన రూపంలోనే ఉండే ఒక మాయా సుందరిని సృష్టించి.. ఉద్యానానికి పంపింది కాంతిసేన. ఇంద్రజాలానికి, నిజానికి తేడా గుర్తుపట్టలేనంత మోహంలో మునిగిపోయి ఉన్నాడు వీరసేనుడు. కేసరిణి మధ్యవర్తిగా ఉండి.. వారిద్దరికీ గాంధర్వ వివాహం జరిపించింది. పుష్పశయ్య అమరించి, ఏకాంతం కల్పించి వారిమధ్య నుంచి తొలగిపోయింది. వీరసేనుడు కోరికతో ముందడుగు వేసే సమయంలో.. మాయా యువతి మంచం దిగి, దూరంగా నిలబడింది.
“సుందరీ! మనకు కొదవేమున్నది?! వెనుదీయడం దేనికి? నీ కోరిక ఏమిటో చెప్పు” అన్నాడు వీరసేనుడు.
అప్పుడా సుందరి.. “నవమన్మథా! నీకు నిజంగా నెరవేర్చే ఉద్దేశం ఉందో లేదో తెలియకుండా.. నా మనసులోని కోరిక బయటికి చెప్పుకొని నేను పలచన కావడం ఎందుకు?” అన్నది వయ్యారాలు పోతూ.
ఆమె కనుసైగలు అతనిలో సెగలు రేపాయి.
“ఆహా సుందరీ! నేనాగలేను. నిన్నిప్పుడే ధర్మపత్నిగా స్వీకరించాను కదా! నావద్ద ఉన్నది ఏదైనా సరే నీదే. ఇది ముమ్మాటికీ నిజం” అన్నాడు వేగిరపడుతూ. “మీ మహేంద్రజాల విద్య నాకు అనుగ్రహించండి” అని కోరింది మాయా యువతి.
“అంతేనా.. ఇంత చిన్న కోరిక కోరడానికి సంశయం ఎందుకు? పోయి నీళ్లు తెచ్చుకో. ఇప్పుడే నీకు విద్య ధారపోస్తాను” అన్నాడు వీరసేనుడు ఏమీ ఆలోచించకుండా.
నీరు తెచ్చే నెపంతో మాయా యువతి వెళ్లింది. ఈసారి స్వయంగా కాంతిసేనే వచ్చింది. మహేంద్రజాల విద్యను స్వీకరించింది. అక్కడితో తన ఇంద్రజాలాన్ని ఉపసంహరించింది. వీరసేనుడు తెలతెలబోతుండగా.. అతనికి సాయం చేయడానికి వచ్చిన ముగ్గురితోపాటు చెరసాలలోకి తోయించింది.
“ఒక్క ఆడదాని చేతిలో నలుగురం మోసపోయాం. మన తెలివితేటలు, నేర్చిన విద్యలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి” అని భద్రుడు వాపోయాడు.
వీరసేనుడిలో ఇంకా ఆశ చావలేదు. “మిత్రమా! ఎలాగోలా ఈ ఖైదు నుంచి తప్పించుకుపోయే మార్గం వెతికిపట్టుకుందాం. గజదొంగలైన నా మిత్రులు ఇద్దరున్నారు. వాళ్లకు టక్కు – టమార విద్యలు తెలుసు. వారిముందు కాంతిసేన ఎందుకూ కొరగాదు. చూస్తుండండి.. ఎలాగైనా వాళ్లను తీసుకొచ్చి, దీనికి ప్రతిక్రియ చేసి తీరతాను” అని ప్రతిజ్ఞ చేశాడు.
* * *
కొంతకాలం గడిచింది. కాంతిసేన తండ్రి సంవత్సరీకాలు వచ్చాయి. ఆ సందర్భంలో మహారాణి కొందరు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. కారాగార అధికారులు పొరపాటుగా వీరసేనుడిని, మిగిలిన ముగ్గురినీ కూడా విడిచి పెట్టేశారు. ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్లు ముగ్గురూ రత్నాకర నగరాన్ని దాటి వెళ్లిపోయారు. వీరసేనుడి సొంత ఊరైన కుశద్వీపాన్ని చేరుకున్నారు. వీరసేనుడు తన మిత్రులైన దొంగలిద్దరినీ రప్పించాడు.
“టక్కరీ! టమారీ! మీరు నాకో ఉపకారం చేయాలి. ఇంద్రజాల విద్యలు నేర్చిన ఒక ఆడది మమ్మల్ని అవమానించింది. మీరెలాగైనా ఆమెను ఎత్తుకు రావాలి. మీ విద్యలు ఎదురులేనివి. ప్రాకారాలు, గోపురాలు, గోడలు, తలుపులు ఏవీ మీ గమనానికి అడ్డం పడవు కదా.. మీరు తలుచుకున్న చోటుకు ఏ ఆటంకమూ లేకుండా వెళ్లిపోగలరు కదా!” అని కోరాడు.
“రాజమిత్రమా! మీ కోరిక నెరవేర్చడం మా తక్షణ కర్తవ్యం” అంటూ వాళ్లిద్దరూ అప్పుడే బయల్దేరారు.
మాయారూపులై మూసి ఉన్న తలుపుల నుంచి, రాతికట్టడాలలో నుంచి కూడా తేలికగా నడుచుకుంటూ.. రాజమందిరంలో ప్రవేశించారు వాళ్లిద్దరూ. అంతఃపురంలో కలకలం రేకెత్తించారు. అంతఃపుర స్త్రీలను భయపెట్టారు. చివరికి కాంతిసేనను చేజిక్కించుకుని, ఆమెతో సహా.. రాజభటుల చేతికి చిక్కకుండా కోట దాటిపోయారు. అతివేగంగా ప్రయాణించి కుశద్వీపం చేరుకుని, వీరసేనుని ముందు ఆమెను నిలబెట్టారు.
ఆమెను చూసి.. “కాంతిసేనను తెమ్మంటే పరిచారికను తెచ్చారేమిటిరా?!” అని వీరసేనుడు విసుక్కున్నాడు.
“ఈమే ముందుకొచ్చి ‘నేనే కాంతిసేనను!’ అంటే.. సరిగ్గా విచారించకుండానే తీసుకొచ్చాం. మొత్తంమీద అదెవరో కానీ జిత్తులమారిలా ఉంది. పోనివ్వండి యువరాజా! మరోసారి రత్నాకర నగరానికి వెళ్తాం. మీరు గుర్తులు చెప్పండి.. కాంతిసేనను తప్పకుండా తీసుకువస్తాం” అని టక్కరి, టమారి ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు.
ఈసారి వాళ్లిద్దరూ సరైన జాగ్రత్తలు తీసుకున్నారు. కాంతిసేనను పట్టుకుని బంధించి, కోట దాటించారు. అడవి మార్గం గుండా ఆమెతో కలిసి ప్రయాణించ సాగారు. మార్గమధ్యంలో ఒకచోట కాంతిసేన కుప్పకూలిపోయింది. ఆమె శరీరం చల్లబడి, ముఖం వివర్ణమైపోయింది. దేహంలో ప్రాణం పోయింది.
‘ఇప్పుడేం చేయాలి? ఈ శవాన్ని తీసుకుపోయి యువరాజు ముందుంచాలా?! దీనినిక్కడే పారేసి పోవాలా?!’.. అని తర్కించుకోసాగారు టక్కరి, టమారి.
అంతలో వాళ్లను అనుసరిస్తూ వచ్చిన కేసరిణి.. “అయ్యా! ఈమె మా మహారాణి. అయిందేదో అయిపోయింది. మీరీ శవాన్ని అప్పగిస్తే, ఉత్తరక్రియలు నిర్వహించుకుంటాం” అని బతిమాలింది.
టక్కరి, టమారి అంగీకరించారు. ఉత్త చేతులతో వెళ్లి, వీరసేనుడి ముందు నిలబడ్డారు.
“మీరిద్దరూ మరోసారి మోసపోయారు” అన్నాడు వీరసేనుడు నిర్వేదంతో. “అదేమిటి యువరాజా! భయం వల్ల ఆమె చనిపోవడం మేం కళ్లారా చూశాం” అన్నారు టక్కరి, టమారి.
“కాదు.. ఆమె పరకాయ విద్యలో ప్రవీణురాలు. బహుశా మీరు చూసిన సమయంలో ఏదో దేహాన్ని ఆశ్రయించి చనిపోయినట్లు నాటకం ఆడి ఉంటుంది. కావాలంటే మీరు మళ్లీ వెళ్లి చూడండి. ఆమె బతికే ఉంటుంది” అని చెప్పాడు.
“అదే నిజమైతే.. ఈసారి ఆమె మానుంచి తప్పించుకోలేదు” అని హుంకరించారు టక్కరి, టమారి.
(వచ్చేవారం.. గజకర్ణ గోకర్ణ విద్యలు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Read More :
Kasi Majili Kathalu | పరకాయ ప్రవేశం
Kasi Majili Kathalu | కామగ్రీవుని విద్యలు
Kasi Majili Kathalu | యవనద్వీపంలో అందగత్తెలు
Kasi Majili Kathalu | రేవానగరంలో కలకలం
Kasi Majili Kathalu | ఒంటరి ప్రయాణం
Kasi Majili Kathalu | పుష్పహాసుడు
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

