జరిగిన కథ : కాశీమజిలీల్లో ప్రస్తుతం సప్తమిత్ర చరిత్రలో ఉన్నాం. కాళిదాస మహాకవి రచించిన మేఘసందేశంలోని యక్షుడు కూడా ఒక ప్రధాన పాత్రగా.. ఏడుగురు మిత్రుల మధ్య ఈ కథ నడుస్తుంది. కాళిదాసు, భోజరాజు కూడా ఇందులో ఉంటారు. భైరవుడనే తాంత్రికుడు నెమలిగా మార్చిన భోజరాజుగారి భార్యను యక్షుడు మళ్లీ మనిషిగా మార్చాడు.
మరునాటి నుంచి యక్షునికి ఒకటే పని. ప్రతిరోజూ ఉదయాన్నే బయల్దేరి వెళ్లి, భైరవుడు చేసే కపటపు పనులన్నీ గమనించేవాడు. అరణ్యాలలో రహస్యంగా వాణ్ని వెంబడించేవాడు. భైరవుడి దగ్గరున్న జీవులను పరిశీలించి, కావలివాళ్లు చూడకుండా ఏదో ఒక పక్షినో, జంతువునో చేత చిక్కించుకుని తిరిగి తన గుహకు చేరుకునేవాడు. అలా సువర్ణపదిక వల్ల కొన్ని జంతువులు మానవరూపాన్ని పొందుతుండేవి. తమ తావులకు వెళ్లిపోయేవారు.
ఇలా ఉండగా.. భోజరాజు ధారానగరం చేరుకునేలోపుగా దారిమధ్యలోనే.. భైరవుడికి ఒక ఆజ్ఞాపత్రం వెలువరించమని తన పుత్రుడైన చిత్రసేనుడికి వర్తమానం చేశాడు. ‘కాళిదాసు గౌరవార్థం.. భైరవుడు కూడా తన జంతువులతో వచ్చి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది’ అని.
భైరవుడు రాజాజ్ఞను పాటించక చేయగలిగింది ఏమీ లేకపోవడంతో.. ఒక బరువులు మోసే గాడిద మెడలో వేరొక తాయెత్తు కట్టి, దానిని మేకను చేశాడు. భోజరాజుగారి ఆస్థాన వంటవాడికి ఆ మేకరూపంలోని గాడిదను అప్పగించాడు. వాడు దానిని కోయడానికి దూరంగా తీసుకువెళ్లాడు.
ఈ మార్పులన్నీ ప్రచ్ఛన్నంగా చూస్తూ వస్తున్న యక్షుడు.. అప్పటికప్పుడు ఒక మేకను తన చేతిలోకి రప్పించుకున్నాడు. వంటవాడి దగ్గరికి వెళ్లి..
“ఓరోరీ! నువ్వు ఆ మేకను కొయ్యబోకు. నాకు అమ్మెయ్యి. బదులుగా నీకు నేనీ మేకను, ఇవిగో ఈ నాణేలను ఇస్తాను” అన్నాడు.
ఆ వంటవాడు స్వల్పధనానికి ఆశపడలేదు. యక్షుడు తన చేతి రత్నకంకణం కూడా సమర్పించుకోవాల్సి వచ్చింది. దాంతో వంటవాడు మేకను మార్చడానికి ఒప్పుకొన్నాడు. యక్షుడు ఆ మేకను పుచ్చుకుని తన గుహకు చేరుకున్నాడు. రత్నపదిక ఆ మేక మెడలో రెండు తాయెత్తులు ఉండటం గమనించింది. ఒక తాయెత్తును ఊడదీస్తే గాడిదగానూ.. వేరొక తాయెత్తును తీయగానే చారాయణుడి అసలు రూపమూ వచ్చాయి.
అలా చారాయణుడికి బాహ్యస్మృతి కలుగగానే..
“ఓరీ పాపాత్ముడా! ఎంతటి గురుద్రోహానికి ఒడికట్టావురా?! దయాసింధువైన ఆ మహాత్ముడు నీకేం అన్యాయం చేశాడు?! కనబడవేం.. ఎక్కడికి పోయావు?!” అంటూ చుట్టూ చూశాడు.
అది తానుండాల్సిన అడవి కాదు. ఎన్నెన్నో విలువైన వస్తువులతో.. మానవులకు అలభ్యమైన దివ్యవస్తువులతో అలంకరించి ఉన్న యక్షుని గుహలోని ఒకానొక గది. ఎదురుగా సువర్ణనాభుడు ఉన్నాడు.
“మిత్రమా! అంటూ కౌగిలించుకున్నాడు”.
ఆ తరువాత మిత్రులిద్దరూ అప్పటివరకూ తమ జీవితాల్లో జరిగినదంతా నెమరేసుకున్నారు. తన భార్య మల్లిక కూడా అక్కడే ఉండటం అతనికి మరింత సంతోషాన్ని ఇచ్చింది.
సువర్ణనాభుడు తన మిత్రునికి యక్షుడిని పరిచయం చేశాడు.
“ఈయన వల్లనే నువ్వూ, నీ భార్య, భోజరాజు భార్య కూడా ఉద్ధరించబడ్డారు. కానీ, మన ఘోటకముఖుడు ఇంకా భైరవుడి వద్దనే ఉన్నట్లు మాకు అనుమానంగా ఉంది. దానికోసమే ఈయన రోజూ ఆ భైరవుడి చర్యలను ప్రచ్ఛన్నంగా గమనిస్తూనే ఉన్నాడు. అసలు సంగతి తొందరలోనే తేలిపోతుంది” అన్నాడు.
కానీ, చారాయణుడు అంగీకరించలేదు.
“అయ్యా! ఎందుకిదంతా?! మనం వెళ్లి జరిగిందంతా భోజరాజుగారికి చెప్పుకొందాం. ఆయనే మనకు తగిన న్యాయం చేస్తాడు” అన్నాడు.
ఆ మాట వినేసరికి యక్షునికి హడలెత్తింది.
“బాబూ! వాడు మంత్రతంత్రాలను ఎరిగినవాడు. వాడి చేత చిక్కితే నా పని కూడా పట్టగలడు. వాణ్ని పరిభంగం చేసే మార్గం ఇది కాదు. తొందరలోనే కాళిదాసుగారి గౌరవార్థం పెద్దసభ జరుగబోతున్నదట. దానికి వీడు కూడా వస్తున్నాడు. ఆ సమయంలో మనం మన పనిని తెలివిగా నెరవేర్చుకోవాలి” అని చెప్పాడు.
ఆ మరునాడు ధారానగరంలో సభ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూడటానికి యక్షుడు వెళ్లాడు. అతని దురదృష్టమేమో కానీ, తాను మేకగా మార్చిన చారాయణుణ్ని అతను దొంగతనంగా ఎత్తుకుపోయాడని భైరవుడికి అప్పటికే తెలిసిపోయింది.
ఆ విషయం యక్షుడికి తెలియదు. అలవాటు చొప్పున ప్రచ్ఛన్నంగా భైరవుని వెంట తిరగసాగాడు. ఆ విషయం భైరవుడు గుర్తుపట్టేశాడు.
“నీ పని చెబుతా చూడు” అంటూ అతణ్ని గట్టిగా పట్టుకుని.. నెత్తిపై ఏదో మందురుద్ది పెద్దగాడిదను చేశాడు.
యక్షుడైతేనేం? ఇంద్రుడైతేనేం?! ప్రారబ్ధం అనుభవించాల్సిందే కదా! భైరవుడి తంత్రవిద్యతో యక్షుడు కూడా వాడి దగ్గరున్న జంతువుల్లో ఒకటిగా మారి ధారానగరానికి వెళ్లాడు.
రెండుమూడు రోజుల తరువాత కూడా యక్షుడు తిరిగి రాకపోయేసరికి.. గుహలోని వారంతా అతణ్ని వెతుక్కుంటూ ధారానగరానికి బయల్దేరారు.
ఒకనాడు భోజరాజు పుత్రుడైన చిత్రసేనుడు గోణికాపుత్రునితో ఇలా ఏకాంతంగా మాట్లాడసాగాడు.
“మిత్రమా! పూర్వజన్మ కర్మ ఫలాలు విచిత్రాలు సుమా! సుఖంతో మిళితమైన దుఃఖం, దుఃఖంతో మిళితమైన సుఖం తరచుగా కలుగుతుంది. కానీ, కేవలం ఏదో ఒకటి స్థిరంగా ఉండదు. చారుమతి సంయోగం నాకెంతో ఆనందాన్ని ఇస్తున్నది. అదే సమయంలో అంతఃపురం నుంచి ఒక దుర్వార్త వినవచ్చింది. మా చెల్లెలు రుక్మిణి గర్భవతి అని తెలుస్తున్నది. ఇందులో నిజమెంతో బ్రహ్మదేవుడికి ఎరుక. వెనుకెప్పుడో ఒకసారి ఎవరో ఒక పురుషుడు రుక్మిణి ఉద్యానంలో గుర్రమెక్కి వచ్చాడని చెప్పగా విన్నాను. ఇది అతని పనే అయి ఉండవచ్చు. నేను ఆ రోజునే.. ‘వచ్చిన పురుషుడెవడు?’ అని నిలదీయగా చారుమతిని చూపించి.. ‘ఈమెయే ఇప్పుడు గుర్రంపై వచ్చింది’ అని మా రుక్మిణి బొంకింది. అయినా స్త్రీలకు తెలిసిన మాయలు బృహస్పతికి, శుక్రాచార్యునికి కూడా తెలియవంటారు కదా! చారుమతి మోహంలో పడి ఆ పురుషుడి సంగతి నేను మరిచిపోయాను. ఇలా జరిగిందని మా తండ్రిగారికి తెలిస్తే చాలా కోపగిస్తారు. ఆయన నేడో రేపో ధారానగరానికి రానున్నారు. ఇప్పుడు నా కర్తవ్యమేమిటో చెప్పగలవా?”.
అతని ప్రశ్నకు గోణికాపుత్రుడు ఇలా సమాధానం చెప్పాడు.
“రాజపుత్రా! తమ సోదరికి గర్భకారణమెవరో తెలుసుకుని, వారికే ఆమెనిచ్చి వివాహం జరిపించాలి. రుక్మిణి సామాన్యుణ్ని వరించదు. రాజకన్యలకు గాంధర్వ వివాహం విధాయకమే. దానిగురించి చింతించకండి. ఈ సమయానికి మా మిత్రుడైన దత్తకుడు ఉంటే మనకు తగిన సలహా చెప్పి ఉండేవాడు. ప్రస్తుతానికి మా గోనర్దీయుడు, కుచుమారుడు వచ్చి ఉన్నారు. వారికి తగిన విడిదులు ఏర్పాటు చేశాను. ఇంకా సువర్ణనాభుడు, చారాయణుడు.. ఘోటకముఖుడు రావాల్సి ఉంది. వారంతా మీకు ఇతోధికంగా తోడ్పడుతారు”.
వారిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే భోజరాజు వచ్చాడనే వార్త తెలియవచ్చింది.
కాళిదాసు కవీంద్రుని బంగారు, రత్నాల పల్లకీ ఎక్కించాడు. భోజరాజు తానొక చేతితో మహాకవికి పాదసంవాహనం చేస్తున్నాడు. మరోచేతితో చామరాన్ని ధరించి విసురుతూ నడిచి రాసాగాడు. ముళ్లు, రాళ్లు, మిట్టపల్లాలు, బురద వంటివాటిని లెక్కచేయకుండా అంతటి మహారాజు నడుస్తూ ఉంటే.. రెండువైపులా వైదికులు స్వస్తిమంత్రాలు చెబుతూ నడుస్తున్నారు. కాళిదాసును దైవంలా సంభావిస్తూ మహారాజు ధారానగరంలో అడుగుపెడుతుంటే ప్రజలందరూ ‘ఆహా’ అంటూ కీర్తించసాగారు.
ఆ దృశ్యాన్ని చూడటానికి ప్రజలందరూ బారులు తీరారు. ఒకరినొకరు తోసుకుంటూ దారికి రెండువైపులా నిలిచి ఉన్నారు. కొందరు నీరాజనాలు పడుతున్నారు. మరికొందరు పూలు జల్లుతున్నారు.
సకల రాజలాంఛనాలతో కాళిదాస మహాకవి ధారానగర సింహాసనాన్ని అలంకరించాడు. అప్పుడాయన ఒక శ్లోకం చెప్పాడు.
“ఈ సమస్త భూమండలాన్నీ నీ భుజాలపై మోస్తున్నవాడవైన ఓ భోజ మహారాజా! నీకోసం నేను ధరణీచక్రం తిరిగి వచ్చాను. నన్ను నీవు నీకోసం తిరిగి రప్పించుకున్నావు. ఇదిగో నా ఊరువులపై కూర్చుని, ఈ రాజ్యాన్ని పాలించు” అని ఆ శ్లోకానికి అర్థం.
ఆ శ్లోకాన్ని చెబుతూ… భోజరాజును కాళిదాసు తన తొడపై కొద్దిసేపు కూర్చుండబెట్టుకున్నాడు.
అప్పుడిక తిరిగి భోజరాజు తన సింహాసనంపై కూర్చోగా.. కాళిదాసు తన ఉచితాసనం స్వీకరించాడు. ఆ తరువాత అనేక వినోద ప్రదర్శనలు జరిగాయి.
ఆనాటి సభకు వచ్చినవారిలో సువర్ణనాభుడు – సువర్ణపదిక, యక్షుని భార్య అయిన రత్నపదిక, చారాయణుడు – మల్లిక, భోజరాజుకు దూరమైన లీలావతి కూడా మారువేషాల్లో ఉన్నారు.
వారంతా తిరిగి బసకు వెళ్లిన తరువాత..
“తల్లీ! నిన్ను భోజరాజు తప్పక స్వీకరిస్తాడు. మనం వెంటనే వెళ్లి ఆయన కాళ్లపై పడదాం” అన్నాడు లీలావతితో చారాయణుడు.
“వద్దు! మగవారి బూటకాలను తొందరపడి నమ్మరాదు. వాళ్లలో వాళ్లయితే సద్దుకుపోగలరు. ఒక ఆడదానిపై రంకు కట్టిన తరువాత.. ఎంత చేసినా, ఎన్ని చెప్పినా ఇంకా ఆమెను శోధిస్తూనే ఉంటారు. అనుమానంతో లోలోపల కుళ్లిపోతూ, కుమిలిపోతూనే ఉంటారు. అదీకాకుండా ఘోటకముఖుడు ఏమయ్యాడో తెలియాలి. అలాగే యక్షుడు ఏ ఆపదలో చిక్కుకున్నాడో తెలుసుకోవాలి. అంతవరకు మనం బయట పడకూడదు” అన్నది లీలావతి.
“అయితే ఇప్పుడు మనమేం చేయాలి?” అని అడిగాడు చారాయణుడు.
“ఒక పని చేద్దాం. రుక్మిణి అని నా సపత్ని కుమార్తె ఉంది. ఆమెకు నేనంటే అపరిమితమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆమె దగ్గర రేవతి అనే చెలికత్తె ఉంటుంది. ఆమెతో పరిచయం చేసుకుని, ఇలా నేను ధారానగరానికి వచ్చి ఉన్నానని తెలియచేయి. ఆ తరువాత విషయాలన్నీ రుక్మిణియే చూసుకోగలదు” అని చెప్పింది లీలావతి.
చారాయణుడు ఆమె చెప్పినట్లే ముందుగా రేవతితో పరిచయం కలిగించుకున్నాడు. ఆమె వచ్చి లీలావతిని కలుసుకుంది. భోజరాజు పూర్తిగా మారిపోయాడని, ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు ఆయన లీలావతి చిత్రపటాన్ని చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నాడని తెలియచేసింది.
ఆ మాటలతో లీలావతి సంతృప్తి పడింది. తన రాకను రుక్మిణికి తెలియచేయమని కోరింది. సరేనని రేవతి వెళ్లిపోయింది.
భోజరాజు తన పక్కపైన విరహార్తిలో మునిగి ఉన్నాడు. లీలావతినే తలుచుకుంటూ అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఆ సమయంలో దిండు కొంచెం కదిలి, దానికింది నుంచి ఏదో లేఖ బయటపడింది. భోజుడు ఏమిటో అనుకుంటూ దానిని తెరిచి చదివాడు. దానిలో ఇలా ఉంది..
‘రాజా! మీరు విదేశాలకు వెళ్లిన సమయంలో నీ సంతానం మన్మథావేశంతో ప్రవర్తిల్లింది. నీ కుమారుడు ఒక వారకాంతతో సంతతం అంతఃపురాన్ని విడిచిపెట్టకుండా మదనక్రీడలలో మునిగి తేలుతున్నాడు. నీ కూతురు రుక్మిణికి నెలతప్పినదని చెప్పుకొంటున్నారు. ఈ రెండు విషయాలలో నిజానిజాలు మీరే విచారించి తెలుసుకోవాల్సి ఉంటుంది’..
ఆ లేఖ చదవగానే భోజరాజు ఎక్కడలేని చికాకుకు, అసహనానికి గురయ్యాడు. వెంటనే ప్రధానిని ప్రవేశపెట్టమని అనుజ్ఞ ఇచ్చాడు.
కొద్దిసేపటికే అతను వచ్చాడు.
భోజరాజు తన మనసులోని గందరగోళాన్ని అతని ముందు వెళ్లబుచ్చాడు. గుర్రమెక్కి ఒక పురుషుడు రుక్మిణి అంతఃపురంలోకి ప్రవేశించడం.. ఆమె చివరికి చిత్రసేనుడికి భోగపత్నిగా మారడం వరకు గల కథలో ప్రధాని తనకు తెలిసిన వివరాలన్నీ రాజుతో చెప్పాడు.
“రాజా! ఆనాడు వచ్చింది పురుషుడే కానీ, స్త్రీ కాదు. కనుక రుక్మిణి అతని వల్లనే గర్భవతి అయి ఉండవచ్చు. అలాగే చారుమతి రూపంలో ఉన్నది పురుషుడని నా అభిప్రాయం. కానీ, ఆమె అతిలోక సౌందర్యాన్ని గమనిస్తే ఎవ్వరూ అనుమానించలేరు. ఇదీ పరిస్థితి. ఏది ఏమైనా రుక్మిణి – చిత్రసేనుడు తమతమ శుద్ధాంతాలను విడిచిపెట్టకుండా గడుపుతున్నారన్న మాటలో అవాస్తవం లేదు!”.
“సరే.. ఈ సంగతి నిదానంగా పరిష్కరించాల్సిందే కానీ, తొందరపడి లాభం లేదు” అన్నాడు భోజరాజు.
“మహారాజా! నేడు విద్వత్సభ జరగనున్నది. కాళిదాస మహాకవితో వాదించడానికి దేశదేశాల నుంచి విద్వాంసులు వచ్చి ఉన్నారు” అని నివేదించాడు ప్రధాని.
“సరే! ఇంతకూ ఆ భైరవుడి సంగతి ఏమైంది. వాడు జంతువులతో సహా ధారానగరానికి వచ్చాడా.. లేదా?” అని ప్రశ్నించాడు భోజరాజు.
“మరో వారంలో వాడి ప్రదర్శన జరగబోతున్నది మహాప్రభూ!” అని సమాధానం ఇచ్చాడు ప్రధాని.
(వచ్చేవారం.. భోజరాజుగారి కొలువు)
-అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ