జరిగిన కథ : ధారానగరానికి వెళ్తున్న ఏడుగురు మిత్రుల కథ ఇది. ముగ్గురు ఇప్పటికే ఆ నగరం చేరుకున్నారు. నాలుగోవాడైన కుచుమారుడు తన విద్య ప్రభావంతో పురందరపురాన్ని ఏలే సరస్వతిని పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ, మోసానికి బలయ్యాడు. ఐదోవాడైన గోనర్దీయుడు అతణ్ని రక్షించాడు.ఆరోవాడైన చారాయణుడికి తన ప్రయాణంలో ఒక సిద్ధునితో అనుబంధం కలిగింది.
సిద్ధునికి చారాయణునిపై రోజురోజుకూ ప్రేమానుబంధం పెరగసాగింది. అదే సమయంలో వారిద్దరిపై భైరవునికి క్రోధం పెరగసాగింది. ఆ భైరవుడు సిద్ధునికి మొదటి శిష్యుడు. చారాయణుడు ఇటీవలే వచ్చాడు.
ఈ మధ్య సిద్ధుడు జపం మానేసి మరీ చారాయణునిపై వేదాంతగోష్ఠి జరుపుతున్నాడు. రాత్రీ పగలూ అతణ్నే అంటిపెట్టుకుని ఉంటున్నాడు. క్రమంగా అతనికి తన విద్యలు అనేకం ఉపదేశించాడు. చారాయణుడు కూడా ఆ విద్యలను శ్రద్ధగా నేర్చుకోసాగాడు.
ఒకనాటి రాత్రి సిద్ధుడు..
“చారాయణా! ఈ తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది. నీకు వశిత్వ విద్య బోధిస్తాను. దాంతోపాటే కాంచనయోగం కూడా నేర్పిస్తాను” అని చెబుతుండగా భైరవుడు విన్నాడు.
అసలు కాంచనయోగం నేర్చుకోవడం కోసమే భైరవుడు ఆ సిద్ధుణ్ని ఆశ్రయించాడు. వాడు పూర్వాశ్రమంలో సొంత ఊరిలోనే చాలా చెడ్డపేరు తెచ్చుకున్నాడు. దొంగతనాలు, జూదాలు మరిగాడు. ఎవరైనా.. ‘ఇదేమిరా!?’ అని నిలదీస్తే.. దేవాలయాల్లో దీపాలు ఆర్పి, భారతం నెత్తిన పెట్టుకుని ‘ఏ పాపమూ ఎరగను’ అని శపథం చేసేవాడు. ఒకసారి రాజభటులు తరుముతుంటే తప్పించుకుని అడవికి వచ్చాడు. వాని అదృష్టం కొద్దీ మృగాలను వశం చేసుకుని, వాటితో సేవలు చేయించుకుంటున్న సిద్ధుణ్ని చూశాడు. ఆషాఢభూతిలా ఆ సిద్ధుణ్ని ఆశ్రయించి పలువిద్యలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా సిద్ధుడిలా మృగాలన్నీ వశమై ఉండే విద్య వాడికీ వచ్చింది. చివరికి కాంచన యోగాన్ని ఉపదేశించమని కోరుకున్నాడు. కానీ సిద్ధుడు అంగీకరించలేదు.
“అహంకార, మమకార గ్రస్తులకు ఆ విద్య బోధించకూడదు. స్వార్థపరులకు చెప్పరాదు. కొంతకాలం పోయిన తరువాత నేర్పుతానులే” అన్నాడు సిద్ధుడు.
భైరవుడు అప్పటికి వినయం ప్రకటించి ఊరుకున్నాడు. కానీ, తాను కోరిన విద్యను చారాయణునికి నేర్పుతానని సిద్ధుడు పలుకుతుంటే విని తట్టుకోలేకపోయాడు. ఆ తెల్లవారుజామున సిద్ధుడు స్నానం చేసి వచ్చి జపానికి కూర్చోబోతున్నాడు. చారాయణుడు స్నానానికి వెళ్లాడు. అటువంటి సమయంలో భైరవుడు ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి సిద్ధుడి బుర్ర బద్దలు కొట్టాడు.
ఆయన బ్రహ్మరంధ్రం పగిలి, రక్తం స్రవిస్తున్నది.
జరిగిన ఘాతుకాన్ని చూసి ఆశ్రమంలోని జంతువులన్నీ గగ్గోలు పడ్డాయి. భైరవుడంటే భయపడ్డాయి. చారాయణుడి వద్దకు పరుగున వెళ్లి, మొరపెట్టుకోసాగాయి. స్నానం చేస్తున్న చారాయణుడికి ఏదో జరగరానిది జరిగిందని అర్థమైంది. గబగబా ఆశ్రమానికి తిరిగి వచ్చి చూసేసరికి, సిద్ధుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చారాయణుడి చేతిలోని కమండలం నేల
జారిపోయింది.
“హా గురుదేవా! తపోనిధానా!” అంటూ అతను కూడా నేలపై పడి మూర్ఛపోయాడు.
కొద్దిసేపటి తరువాత ఎలాగో తెప్పరిల్లాడు.
“మహాత్మా! నిన్నిలా చంపిన వారెవరు? నీ ఉపన్యాసం విన్నవారు అమృతాన్ని కూడా చిన్నచూపు చూస్తారే.. నువ్వు అజాతశత్రువు కదా.. నీపై ఈర్ష్య పూనిందెవరు? నీ ప్రభావం చేత జంతువులే వైరం మరిచి కలిసి మెలిసి బతుకుతున్నాయి కదా.. నిన్ను చంపిన క్రూరుడెవరు?” అంటూ చుట్టూ పరికించాడు.
సిద్ధుని పక్కనే పడివున్న రాయి రక్తంతో తడిసి ఉండటాన్ని గమనించగానే చారాయణుడికి అర్థమైంది.
“భైరవా!” అని ఉగ్రంగా అరుస్తూ వాణ్ని పిలిచాడు.
భైరవుడు పరుగున వచ్చాడు.
“గురువుగారికి ఏమైంది?” అంటూ అమాయకత్వం నటించబోయాడు.
“భైరవా! నీకీయన ఏం అపకారం చేశాడు? ఎందుకిలా పొట్టన పెట్టుకున్నావు?” అని ఆవేశంగా ప్రశ్నించాడు చారాయణుడు.
“నేను పొట్టన పెట్టుకోవడం ఏమిటి? నాకేం తెలియదు. నువ్వే గురువును చంపి, నాపై నెడుతున్నావా?” అని ఎదురు తిరిగాడు భైరవుడు.
“ఇక్కడ ఉన్నది మనమిద్దరమే. నువ్వు కాకపోతే ఇంత ఘోరం మరొకరు ఎవరో చేసి ఉండరు” అని నిందించాడు చారాయణుడు. ఆ దెబ్బతో భైరవుడి అహంకారం మరింత దెబ్బతింది.
“ధూర్తుడా! నీ వల్లనే ఈ బైరాగోడు నాకు విద్యలు చెప్పడం మానేశాడు. నీ పని చెబుతానుండు” అంటూ ఏదో ఆకుపసరు తెచ్చి చారాయణుడి నెత్తిమీద పూశాడు.
అంతే.. మరుక్షణంలో చారాయణుడు గాడిదగా మారిపోయాడు. సిద్ధుడు బతికి ఉంటే.. చారాయణుడు కూడా మహాసిద్ధుడై ఉండేవాడు. ధారానగరానికి వెళ్లి, మిత్రులను కలుసుకుని ఉండేవాడు. విధివిధానం ఇలా ఉంటే అతను మాత్రం ఏం చేయగలడు.
ఇలా ఉండగా చారాయణుడి భార్య మల్లిక పుష్పవతి అయింది. పెళ్లయిన కూతురిని కాపరానికి పంపకుండా ఇంటిలో పెట్టుకుని కాపాడాల్సి వస్తే తల్లిదండ్రులకు అంతకంటే ఘోరమైన శిక్ష మరోటి ఉండదు. అందులోనూ చెప్పిన గడువులోపల అల్లుడు తిరిగి రాకపోయేసరికి బ్రహ్మదత్తుడికి దిగులు పట్టుకుంది. కూతురిని వెంటబెట్టుకుని, చారాయణుడిని వెతుక్కుంటూ ధారానగరానికి బయల్దేరాడు. అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ఆ అడవిలో ఎనిమిది మార్గాలు కలుసుకునే చోటు ఒకటుంది. అక్కడో పుణ్యాత్ముడు ధర్మసత్రాన్ని కట్టించాడు. దానికి ‘అష్టాపథ సత్రం’ అని పేరు. ఆ సత్రానికి మూడు యోజనాల దూరంలో గ్రామమేదీ లేదు. ముళ్లతో, పాషాణాలతో, మృగభయాలతో నిండిన అడవిమార్గంలో చాలాదూరం నడిచివచ్చిన బాటసారులందరూ ఆ సత్రంలో కలుసుకుంటూ ఉంటారు.
ఆ సత్రానికి యాభైఆరు దేశాల ప్రజలు వస్తుంటారని వాడుక ఉండేది. బ్రహ్మదత్తుడు ఆ సత్రంలో కుటుంబంతోసహా ప్రవేశించాడు. రెండురోజులపాటు అక్కడే ఉన్నాడు. ఒకనాడు రాత్రి పండువెన్నెల కురుస్తున్నది. బ్రహ్మదత్తుడు భోజనం పూర్తి చేసి.. సత్రం అరుగు మీదికి చేరాడు. పక్క అరుగుమీద ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మదత్తుడు వారి మాటలను ఆసక్తిగా వినసాగాడు.
ఇద్దరిలోని మొదటివాడు ఇలా అన్నాడు.
“కవీంద్రా! మీరు ధారానగరం నుంచి వస్తున్నారని చెప్పారు కదా! భోజమహారాజు కవులను గొప్పగా ఆదరిస్తాడని చెప్పుకొంటారు. ఆయన క్షేమంగా ఉన్నాడా?!”.
అందుకు ఆ కవిగారు..
“పండితోత్తమా! ఆ రాజు ప్రస్తుతం రాజధానిలో లేడు. ఎవరో కాళిదాసు మహాకవికి, భోజరాజు భార్యకూ రంకు గట్టారు. దాంతో బాధపడిన కాళిదాసు ధారానగరం వదిలి వెళ్లిపోయాడు. భోజరాజు తన భార్యను అడవిలో వదిలేయమని భటులను ఆజ్ఞాపించాడు. తరువాత చేసిన తప్పు తెలుసుకుని, వాళ్లిద్దరినీ వెతుక్కుంటూ వెళ్లాడు. ప్రస్తుతం ధారానగరంలో విద్వాంసులను ఆదరిస్తున్నారు కానీ, పరీక్షలు లేవు. ఇంతకూ మీరేమైనా కవిత్వం చెప్పగలరా?” అని తిరుగు ప్రశ్న వేశాడు.
“ప్రౌఢంగా చెప్పలేను. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. అయినా కవితాకన్య సహజంగా వలచి రావాలి కానీ, బలవంతం చేస్తే ప్రయోజనం ఉండదు కదా! అన్నట్లు నేనొక శ్లోకం రాశాను. వింటారా?”.
“ఇప్పుడు నిద్రవస్తున్నది. రేపు వింటాను లెండి. ఇంకా ఏవైనా విశేషాలు చెప్పండి”.
“కవిత్వం అంటే నిద్ర వస్తున్నది కానీ, విశేషాలు వినడానికి అభ్యంతరం లేదన్నమాట. సరే.. పురందరపురం విశేషాలు విన్నారా?”.
“ఆ రాజుకూతురు సరస్వతిని గురించేనా? ఆవిడ ముందు నా కవిత్వం, మీ పాండిత్యం పనికిరావు. ఆ విశేషమైతే చెప్పక్కరలేదు”.
“అదికాదు మహాశయా! ఆ సరస్వతిని కుచుమారుడు అనేవాడు ఓడించాడు. పెళ్లి చేయమని కోరుతున్నాడట. కానీ ఆమెకు ఇష్టం లేదు కాబోలు, ఏవో ఆటంకాలు చెబుతూ పెళ్లి వాయిదా వేస్తున్నది. నేనింకా ఆ పెళ్లి జరిగితే గొప్ప సంభావన దక్కుతుందని ఆశపడి వెళ్లాను. నిరాశ చేసుకుని ధారానగరం బయల్దేరాను”.
..వాళ్లిద్దరి మాటలూ ఆలకిస్తున్న బ్రహ్మదత్తుడు ముందుకు జరిగాడు.
“అయ్యా! మీరు ధారానగరం నుంచి వస్తున్నారని చెప్పారు. అక్కడ చారాయణుడనే పండితుడు కానీ, దత్తకుడు అనే ఆయన కానీ మీ కంటపడ్డారా?” అని కవీశ్వరుణ్ని అడిగాడు.
కవిగారు సమాధానం చెప్పలేదు. మరోపక్క అరుగుమీద కూర్చున్న కుర్రవాడొకడు ముందుకు వచ్చాడు.
“చారాయణుడు, దత్తకాదులను గురించి అడుగుతున్నారేం? వాళ్లు మీకు తెలుసా?” అని ప్రశ్నించాడు.
“ఎరుగుదును బాబూ! ఆ చారాయణుడికి నేను నా పిల్లనిచ్చాను. దత్తకాదులు తన మిత్రులని, ధారానగరం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. గడువు దాటిపోయినా నా గడప తొక్కకపోయే సరికి, నేనే అతగాడిని వెతుక్కుంటూ బయల్దేరాను” అన్నాడు బ్రహ్మదత్తుడు.
“ఓహో! అయితే మీరు మాకు పూజ్యులు. మీ అల్లుడు నాకు మిత్రుడే! నాపేరు ఘోటకముఖుడు అంటారు. నా మిత్రులందరూ ఈ పాటికి ధారానగరం చేరుకుని ఉంటారు. నాకు దారిమధ్యలో విఘ్నాలు ఎదురు కావడం వల్ల వెళ్లలేకపోయాను” అన్నాడతను.
“అయ్యో! ఏమైంది బాబూ?” అని ప్రశ్నించాడు బ్రహ్మదత్తుడు.
దానికి ఘోటకముఖుడు ఇలా సమాధానం చెప్పాడు.
“అయ్యా! ఒక మహనీయుని భార్యను భైరవుడు అనేవాడు ఎత్తుకుపోయాడు. వాడికోసం తిరుగుతున్నాను. వాడిప్పుడు పురందరపురంలో ఉన్నాడని తెలిసింది. నేను ఆ పని పూర్తి చేసుకుని, ధారానగరం వస్తానని నా మిత్రులతో చెప్పండి”.
బ్రహ్మదత్తుడికి ఆ మాటతో మహదానందం కలిగింది.
“బాబూ! నీ మిత్రుని భార్యను చూద్దువుగాని రా” అని తన గది వద్దకు తీసుకువెళ్లాడు.
ఆ అమ్మాయిని చూసి, తన మిత్రుడికి తగిన భార్య లభించిందని ఘోటకముఖుడు సంతోషించాడు. బ్రహ్మదత్తుని ఆదరానికి సంతోషించి, అతణ్ని తన గది వద్దకు తీసుకువెళ్లాడు.
అక్కడ ఉన్న పెద్దమనిషిని పరిచయం చేశాడు.
“ఈయన భార్యనే భైరవుడు ఎత్తుకుపోయాడు. వాణ్ని వెతుకుతూనే మేమిద్దరం పురందరపురం వెళ్తున్నాం” అన్నాడు.
ఆ పెద్దమనిషిని చూడగానే ఎవరో ఒక దేశాధికారి అయి ఉంటాడని భావించిన బ్రహ్మదత్తుడు.. అందుకు తగిన విధంగా ఆశీర్వదించాడు. అతని భార్య త్వరలోనే దొరకగలదని ఓదార్చి, తన గదికి తిరిగి వెళ్లిపోయాడు.
నిజానికి ఆ పెద్దమనిషి ఎవరో ఘోటకముఖునికే తెలియనప్పుడు.. బ్రహ్మదత్తుడికి మాత్రమెలా తెలుస్తుంది?!
అతడే భోజమహారాజు.
మరునాడు భోజుడు, ఘోటకముఖుడు కలిసి పురందరపురానికి వెళ్తూ.. బ్రహ్మదత్తుని గదికి వచ్చారు. అతని కూతురు, భార్య కూడా పండిత కవులే అని తెలిసి భోజుడు సంతోషించాడు.
“అమ్మాయిలూ! నేను మీకు తండ్రి వంటివాణ్ని. నాకు కవులంటే మహాప్రీతి. నేనిచ్చే సమస్యను మీరు నలుగురూ పూరిస్తే వినాలని ఆశ పడుతున్నాను” అంటూ ఈ దిగువ సమస్యను ఇచ్చాడు.
క్రియాసిద్ధిస్సతే భవతి మహతాంనోపకరణైః
‘మహాత్ములకు కార్యసిద్ధి అనేది తమ ప్రభావం చేతనే కలుగుతుంది. వారికి ఉపకరణాలతో పని లేదు’ అని ఈ సమస్యకు అర్థం. ఘోటకముఖుడితో పాటుగా బ్రహ్మదత్తుని భార్య కూడా ఆ సమస్యను తలోవిధంగా పూరించారు. వారందరూ చెప్పిన శ్లోకాల అర్థాలు స్థూలంగా ఇలా ఉంటాయి.
కుండలో పుట్టి, మృగాలతో కూడిన అడవులలో సంచరించే అగస్త్యుడు సముద్రాన్నే పుక్కిట పట్టాడు. తాను మానవుడై పుట్టిన శ్రీరాముడు కోతులతో కలిసి, సముద్రంపై రాళ్లు తేలించి లంక ముట్టించాడు. రావణుణ్ని తుదముట్టించాడు. ఒక చక్రం గల బండినెక్కి, నిరాలంబమైన ఆకాశంలో, కాళ్లులేని సారథితో సూర్యుడు తిరుగుతున్నాడు. కాబట్టి మహాత్ములకు కార్యసిద్ధి కలగాలంటే గొప్ప ఉపకరణాలు ఉండాల్సిన పనిలేదు.
చివరిగా బ్రహ్మదత్తుడి కూతురైన మల్లిక ఈ విధంగా పూరించింది.
“పువ్వులను విల్లుగా ధరించి, వాటికి తుమ్మెదల నారి సారించి.. స్త్రీల చంచల దృక్కులనే బాణాలను ఎక్కుపెట్టి.. మన్మథుడు దేహం లేనివాడైనా ముల్లోకాలనూ వ్యాకుల పెడుతున్నాడు”..
..ఆ నలుగురి పూరణలలో మల్లిక చెప్పిందే రసవంతంగా ఉందని భోజునికి అనిపించింది.
“ఈసారి మిమ్మల్ని ధారానగరంలో కలుసుకున్నప్పుడు భోజరాజుతో చెప్పి.. నీ శ్లోకానికి అక్షర లక్షలిప్పిస్తాను” అని పలికాడు.
బ్రహ్మదత్తుని వద్ద సెలవు తీసుకుని ఘోటకముఖునితో కలిసి పురందరపురానికి వెళ్లాడు.
(వచ్చేవారం.. కుచుమారుడు గెలిచాడు)
-అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ