జరిగిన కథ : ధారానగరానికి వెళ్తున్న ఏడుగురు మిత్రుల కథ ఇది. ముగ్గురు ఇప్పటికే ఆ నగరం చేరుకున్నారు. నాలుగోవాడైన కుచుమారుడు గొప్ప సిద్ధుడయ్యాడు. తన విద్య ప్రభావంతో పురందరపురాన్ని ఏలే సరస్వతిని పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ, మోసానికి బలయ్యాడు. బెస్తవారి వల్ల ప్రాణాలు దక్కించుకున్నాడు. అయిదోవాడైన గోనర్దీయుడు అతణ్ని కలుసుకున్నాడు.
“అయ్యో!
ఇలా చిక్కిపోయావేంటి?! అయినా మిత్రమా! నువ్వేమిటీ.. ఈ బెస్తవాళ్లతో కలిసి నావల మీద పనిచేయడం ఏమిటి?! నువ్వేమో సరస్వతిని పెళ్లాడబోతున్నావని తెలిసి, నిన్ను కలుసుకోవడానికే ఇక్కడికి వస్తున్నాను. ఆ వార్త నిజం కాదా?! అసలేం జరిగింది” అని ఆదుర్దాగా ప్రశ్నించాడు గోనర్దీయుడు.
అప్పుడు కుచుమారుడు జరిగిన సంగతులన్నీ తన మిత్రునితో పూసగుచ్చినట్లు చెప్పాడు.
“నన్ను బతికించడానికి ఆ పల్లె బెస్తవారు పడిన శ్రమను మరిచిపోలేను. పాపం.. వారు అప్పులపాలై మరీ నాకు వైద్యం చేయించారు. మరో జన్మ ఎత్తినా వారి రుణం తీర్చలేను” అన్నాడు ఆఖరుగా.
అంతా విన్న గోనర్దీయుడు ఒక్కసారి మిత్రుణ్ని కౌగిలించుకుని..
“అయ్యయ్యో! ఎంత ప్రమాదం తప్పిపోయింది?! ఆ పల్లెవాళ్లు నిజంగా మనకు ప్రాతఃస్మరణీయులు. వారినిలా తీసుకురా! వాళ్ల ఇళ్లన్నీ బంగారు మయం చేస్తా” అన్నాడు. అంతలోనే మళ్లీ..
“ఆ శంబరుడెక్కడ ఉన్నాడు?! నిన్ను చంపబోయిన ఆ కృతఘ్నుడిని నా కత్తికి ఎరవేస్తాను” అని హుంకరించాడు. కుచుమారుడు అతణ్ని వారించి..
“మిత్రమా! నేను బతికే ఉన్నాను కదా! ఊరడిల్లు. ఆ శంబరుణ్ని కాలమే శిక్షించగలదు. వాని తండ్రి చేసిన సహాయాన్ని పొందిన విశ్వాసంతోనే వాణ్ని విడిచిపెట్టాను. లేకుంటే నా మంత్రశక్తితోనే వాణ్ని శిక్షించి ఉండేవాణ్ని” అని సర్దిచెప్పాడు.
“మిత్రమా! నువ్వు పడిన కష్టాలు వింటుంటే నాకు దుఃఖం ఆగలేదు. దుర్జనులను చేరనిస్తే విపత్తు కలగక మానదు. ఆ శంబరుడు నిన్నిలా పరాభవించి, తానే కుచుమారుడినని ప్రకటించుకున్నాడు కాబోలు. అయ్యో! తొందరపడి.. తెలియక సరస్వతి వాణ్నే పెళ్లాడదు కదా!! నువ్వు చెప్పిన మాటలను బట్టి ఆమె చాలా ప్రజ్ఞావంతురాలని తెలుస్తున్నది. మళ్లీ పరీక్షించకుండా పెళ్లాడదు. సరే.. ఇంతకూ దైవసంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది” అన్నాడు గోనర్దీయుడు.
“అది సరే మిత్రమా! నీ కథ చెప్పనే లేదు. నువ్వీ రాజ్యాన్ని ఎలా సంపాదించావు?” అని ప్రశ్నించాడు కుచుమారుడు.
గోనర్దీయుడు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు.
“మిత్రమా! నేను ముందుగా కాశీ నుంచి మా స్వగ్రామానికి వెళ్లాను. అక్కణ్నుంచి ధారానగరం బయల్దేరాను. నీకు తెలుసు కదా.. నాకు మొదటినుంచి అడవులంటే భయం. కానీ, ప్రయాణంలో అనేక అడవులు దాటక తప్పలేదు. నాకు తోడుగా ఎవరూ లేరు. అరచేతిలో ప్రాణాలు పట్టుకుని ఎలాగో నడుస్తున్నాను.
ఒకనాడు చీకటిపడే సమయానికి ఒక రావిచెట్టు కిందికి చేరుకున్నాను. ఆ రావిచెట్టునే భగవంతునిగా ఎంచి.. రాత్రంతా ధ్యానంలో గడప సాగాను. కారుచీకట్లు కమ్మి, దాదాపు అర్ధరాత్రి అవుతున్న సమయానికి.. భీకరంగా భైరవాట్టహాసం చేస్తూ ఒక భూతం ఆ చెట్టుకొమ్మలపై వాలింది.
‘అయ్య బాబోయ్! రావిచెట్టుపై బ్రహ్మరాక్షసులు ఉంటారని చెప్పుకొంటారు. దీని చేతిలో నా ప్రాణం ఇహనో ఇప్పుడో పోతుంది కాబోలు’ అనుకున్నాను. అంతలో ఆ బ్రహ్మరాక్షసుడు చేస్తున్న ఘోషలో వేదనాదం ఉన్నట్లు నాకు అనిపించింది. నేను కూడా అంత్యసమయంలో వేదపఠనం చేయడం మంచిదనిపించింది. సుస్వరంగా సంహితను ఎలుగెత్తి చదవడం ప్రారంభించాను. చెట్టుమీద నుంచి అతను కూడా నాతో గొంతు కలిపాడు. అతను చెబుతున్న దానికి నేను వంత చెపుతూ ఇద్దరం జతగా చాలాసేపు వేదపఠనం సాగించాం.
చివరికి అతను దిగివచ్చి..
“ఎవడవురా నువ్వు? భయం లేకుండా నాతో సమంగా వేదం ఉచ్చరిస్తున్నావు?’ అని గర్జించాడు.
నేను వినయంగా లేచి నిలబడి రెండు చేతులూ జోడించాను.
“మహాత్మా! నన్ను గోనర్దీయుడు అంటారు. మా ఊరిలోనే కొంత విద్యాభ్యాసం చేశాను. ఆపై చదువులు చెప్పడానికి సరైన ఉపాధ్యాయుడు దొరకనందువల్ల నూతన విద్యాభిలాషతో అనేక దేశాలు తిరిగాను. చివరికి ఇక్కడికి ఉత్తరంగా పదియోజనాల దూరంలో ఉన్న ఒక గ్రామానికి చేరాను. అక్కడ ఒక బ్రాహ్మణుడు.. ‘అబ్బాయీ! నువ్వు చిన్నవాడివైనా అనేక విద్యలలో పాండిత్యం సంపాదించావు. నీకు చదువు చెప్పగలవాడు ఈ గ్రామంలో లేడు. ఒక పనిచెయ్యి. ఇక్కడికి దక్షిణంగా పదియోజనాల దూరంలో ఒక రావిచెట్టు ఉంది. దానిపై ఒక బ్రహ్మరాక్షసుడు కాపురం ఉంటున్నాడు. అతనికి రాని విద్యలు లేవు. నీకు అతనే ఏవైనా కొత్తవిద్యలు ఉపదేశించగలడు’ అని చెప్పాడు. ఆ మాట పట్టుకుని, నేను బయలుదేరాను” అని చెప్పి కొద్దిగా ఆపాను.
బ్రహ్మరాక్షసుడు తలపంకిస్తూ నేను చెబుతున్న మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు.
“దారిమధ్యలో మరో బ్రాహ్మణుడు కనిపించాడండీ. ‘వెర్రివాడా! రాక్షసులు, పిశాచాలు ఎక్కడైనా విద్యలు నేర్పిస్తాయా? నువ్వు వెళ్తే నిన్ను నంజుకు తినేస్తాయి కానీ’ అని బెదిరించాడండీ” అన్నాను.. నా మనసులో భయాన్ని బయటపెడుతూ. అందుకా బ్రహ్మరాక్షసుడు ఎంతగానో నొచ్చుకుంటూ..
“అయ్యో నాయనా! ఇది నా ఇల్లు. నువ్వు అతిథిగా వచ్చావు. ఇంటికి అతిథిగా వచ్చినవాడు బాలుడైనా, వృద్ధుడైనా, తక్కువ కులంవాడైనా గౌరవించి తీరాలి. తగిన రీతిగా సత్కరించి తీరాలి. అందులోనూ నువ్వు చదివిన వేదస్వస్తితో నాలోని జాడ్యాలు వదిలిపోయాయి. నేను తరించినట్లుగా అనిపిస్తున్నది. నీకు అభయం ఇస్తున్నాను. నిన్నేమీ చేయను. నీ మనసులో మాట నిర్భయంగా చెప్పుకో” అన్నాడు.
ఆ మాటతో.. ‘బతికానురా భగవంతుడా!’అనుకున్నాను.
“స్వామీ! ఇంతకూ మీకీ రాక్షసరూపం ఎలా వచ్చింది?” అని ధైర్యంగా ప్రశ్నించాను.అందుకతను తన వృత్తాంతం అంతా వివరంగా చెప్పాడు.అతని పేరు దేవభూతి. యవ్వన దశలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. చిన్ననాడే పెళ్లయింది కానీ, భార్య రూపవతి కాదు. తాను చదువుకున్న చదువులన్నీ వ్యర్థం అవుతున్నాయని, తన శృంగారాభిలాష తీరడం లేదని దిగులు పట్టుకుంది. అంతలో పొరుగింటిలో ఒక కొత్త జంటవచ్చింది. పాడు బుద్ధి ఆ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకునేలా చేసింది. తమ గుట్టు బయటపడే వేళకు ఆమె భర్తను చంపి, ఇద్దరూ కలిసి ఊరినుంచి లేచిపోవాలని ప్రయత్నించారు. దారిమధ్యలో దొంగలు అటకాయించారు. తనను చంపి, ఆమెను ఎత్తుకుపోయారు.
“బలవన్మరణానికి గురికావడం, పరదారా గమనం అనే రెండు పాపాలకు గానూ నేను మరుజన్మలో బ్రహ్మరాక్షసుడినయ్యాను” అని చెప్పాడతను. ఆ తరువాత..
“ఇంతకూ నీ అభీష్టం ఏమిటో చెప్పు” అన్నాడు.
“నాకు కొత్త విద్యలు కావాలి” అన్నాను నేను.
“నువ్వేం చదువుకున్నావు?” అని గంభీరంగా ప్రశ్నించాడు దేవభూతి.
నేను చదువుకున్న విద్యలన్నీ ఏకరువు పెట్టాను.
అప్పుడతను గుండెలమీద చెయ్యి వేసుకుని..
“ఇన్ని విద్యలు నేను కూడా నేర్వలేదు కదయ్యా! ఇంకా నీకు కొత్త చదువులెందుకు?” అన్నాడు. అంతలోనే ఏదో స్ఫురించినట్లు..
“ఇలా చెయ్యి.. ఉభయతారకంగా ఉంటుంది” అంటూ నా చెవిలో ఏదో చెప్పి.. రావిచెట్టుమీద నుంచి ఎగిరి వెళ్లిపోయాడు. అతను చెప్పిన ప్రకారమే జయపురానికి వెళ్లాను. ఆ రాజు తన కోటముందు ఒక ప్రకటన పత్రం వేలాడదీశాడు.
అందులో ఇలా ఉంది.. మా రాకుమారి మదయంతి భూతపీడ చేత బాధించబడుతున్నది. అదేమి భూతమో తెలియదు కానీ, బగళాముఖీ మంత్ర పారాయణుని పళ్లు రాలగొట్టింది. ఉగ్రభైరవ మంత్రోపాసకుని ఎముకలు విరగ్గొట్టింది. నారసింహ మంత్రోపాసకుడి రక్తం కళ్ల జూసింది. తన ఎదుట జ్వాలానృసింహ మంత్రాన్ని ఉచ్చరించిన వాడి బ్రహ్మరంధ్రం బద్దలయ్యేలా గుద్దింది. ఆంజనేయ భక్తుడిని గుండెలవిసేలా పరుగెత్తించింది. గణపతి ఉపాసకుడిని పొట్ట చీల్చింది. చండిక ఆరాధకుడిని కాలితో చిదిమేసింది. ఇటువంటి హింసాక్రియలకు పాల్పడే భూతాన్ని విదిలించేవారు ఎవరైనా సరే.. నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. అంతేకాకుండా ఈ రాజ్యాన్ని కూడా అతనికే అప్పగిస్తాను..
– ఇట్లు జయపురాధీశ్వరుడు.
నేను ఆ ప్రకటన చదువుకుని కోట లోపలికి వెళ్లాను. మహారాజు నన్ను చూసి, నేనా పని సాధించగలనా అని సంకోచించాడు. నేను ధైర్యంగా మదయంతి ముందుకు వెళ్లాను. ఆమెను ఆవేశించింది నాకు వరమిచ్చిన బ్రహ్మరాక్షసుడే కనుక, తేలికగా నేను పని సాధించుకోగలిగాను. ఆ తరువాత రాజ్యం, మదయంతి కూడా నా
పరమయ్యాయి..
..అని గోనర్దీయుడు తన కథను ముగించాడు.
“మిత్రమా! ఈ రాజ్యం నా ఒక్కడిదే కాదు.. మనం ఏడుగురం సమానంగా పంచుకుందాం” అన్నాడు.
కుచుమారుడు అతని సౌహార్దానికి కృతజ్ఞతగా
కౌగిలించుకున్నాడు.
“కుచుమారా! ముందుగా నిన్ను రక్షించిన బెస్తవారికి తగిన కృతజ్ఞత చెల్లించాలి” అంటూ కొన్ని వేల వరహాలు వారికి కానుకలుగా అందించాడు.
ఈ కథను ఇక్కడితో కొద్దిసేపు ఆపి.. ఏడుగురు మిత్రులలో ఆరోవాడైన చారాయణుడి కథ కొంత తెలుసుకోవాల్సి ఉంది.
చారాయణుడు విద్యాభ్యాసం ముగిసిన తరువాత తన స్వగ్రామానికి తిరిగివెళ్లాడు. అక్కడ కొంతకాలం ఉన్న తరువాత, ధారానగరానికి బయల్దేరాడు. దారి మధ్యలో ఒక పల్లెటూరిలో బ్రహ్మదత్తుడు అనే బ్రాహ్మణుడి ఇంట అతిథిగా ఉన్నాడు. ఇతని పాండిత్యాన్ని గమనించిన బ్రహ్మదత్తుడు తన కూతురైన మల్లికను ఇచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం అత్తవారింట భార్యతో సుఖంగా గడిపాడు చారాయణుడు. తరువాత తాను ధారానగరానికి వెళ్లి మిత్రులను కలుసుకోవాలని, తాను తిరిగి వచ్చేవరకు తన భార్యను కాపాడవలసిందని అత్తమామలను ఒప్పించి బయల్దేరాడు.
కొన్ని రోజులపాటు అడవిలో ఒంటరి ప్రయాణం చేసిన తరువాత చారాయణుడు ఒకానొక వింతైన ప్రదేశానికి చేరుకున్నాడు.
అక్కడ ఒక పర్ణశాల వంటిది ఉన్నది. అడవి జంతువులన్నీ ఆ పర్ణశాల ముందు విరోధాలు మరిచిపోయి స్నేహంగా మెలుగుతున్నాయి. అంతేకాకుండా వాటి చేష్టలు చూడగా చారాయణుడికి మరింత వింత గొలిపింది.
చమరీ మృగం ఆ పర్ణశాల ముందు కసవు ఊడ్చింది. ఏనుగులు నీళ్లు తెచ్చి కళ్లాపి చల్లుతున్నాయి. తరువాత, ఏనుగుల కుంభస్థలాలలోని ముత్యాలను సేకరించి.. సింహాలు ముగ్గులు పెడుతున్నాయి. అక్కడ చిలుకలు, గోరింకలు గీతాలు పాడుతున్నాయి. నెమళ్లు పింఛాలు విప్పి ఆడుతున్నాయి.ఆ పర్ణశాలకు ఒకపక్క చెట్టుకింద విభూతి, రుద్రాక్షలు ధరించిన ఒకానొక సిద్ధుడు తపస్సు చేసుకుంటున్నాడు. మరికొన్ని క్రూరమృగాలు భక్తి విశ్వాసాలతో కందమూలాలు తెచ్చి ఆయనకు సమర్పించాయి. ఆయన అనుగ్రహం కోరి దూరంగా ఆయననే చూస్తూ కూర్చున్నాయి.
కొంతసేపటికి పర్ణశాల నుంచి సిద్ధుని శిష్యుడొకడు ఈవలకు వచ్చాడు.
అతను వచ్చిన కొద్దిసేపటికి సిద్ధుడు కన్నులు తెరిచాడు. శిష్యుడు దారిచూపుతుండగా ఒక తటాకంలో స్నానానికి బయల్దేరాడు.
అప్పటివరకూ జరుగుతున్నదంతా దూరంనుంచి గమనిస్తున్న చారాయణుడు ఒక్కసారిగా వెళ్లి.. సిద్ధుని పాదాలపై పడ్డాడు. సిద్ధుని శిష్యుడు వారించబోయాడు.
“స్వామీ! ధారానగరానికి వెళుతూ ఈ అడవిలో దారి తప్పి ఇటువచ్చాను. మీ తపస్సుకు నేనేవిధంగా భంగం కలిగించను. కాకపోతే మృగాలకు భయపడుతున్నాను. దయచేసి కాపాడండి” అని విన్నవించుకున్నాడు చారాయణుడు.
“సరే నాయనా! నీకేం భయం లేదు. నువ్వు మాతో ఉండవచ్చు” అంటూ అభయమిచ్చాడు సిద్ధుడు.
స్నానానంతరం ముగ్గురూ పర్ణశాలకు చేరుకున్నారు.
“భైరవా! అతిథికి కావాల్సిన ఏర్పాట్లు చూడు” అన్నాడు సిద్ధుడు.
శిష్యుడు కొన్ని కందమూలాలను, పళ్లను తెచ్చి చారాయణుడి ముందు పెట్టాడు. అలసట పోయేలా వాటిని సేవించిన తరువాత కొంత విశ్రాంతి తీసుకున్నాడు చారాయణుడు.
ఆ సాయంత్రం తన కథనంతా సిద్ధునికి వినిపించాడు.
అది విన్న సిద్ధుడు ఆనందించాడు. చారాయణుని విద్యా వైదుష్యాలకు ముచ్చట పడ్డాడు. ప్రస్థాన త్రయాన్ని గురించి అతనితో కొంతసేపు సంభాషించాడు. చారాయణుడిని తమతోపాటు ఉండవచ్చని చెప్పాడు. మృగాలేవీ బాధించకుండా ఉండేందుకు ఒక తంత్రాన్ని నేర్పించాడు. దానిసాయంతో చారాయణుడు అక్కడ నిర్భీతిగా ఉండసాగాడు.
(వచ్చేవారం.. గాడిదగా మారిన శిష్యుడు)
-అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ