జరిగిన కథ : సప్తమిత్ర చరిత్రలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన మదాలస వృత్తాంతాన్ని చెప్పుకొంటున్నాం. కువలయాశ్వుడనే మహావీరుణ్ని పెళ్లాడిన మదాలస భర్తపై ప్రేమ కొద్దీ.. అతని అసత్య మరణవార్త విని మరణించింది.కువలయాశ్వుని మిత్రుల తండ్రి అయిన నాగరాజు ఆమెను తన కూతురిగా పొందడానికి తపస్సు చేశాడు.
అశ్వతరుని వల్ల మదాలస తిరిగి జన్మించింది.కిందటిసారి ఆమె మరణించినప్పుడు ఏ వయసులో ఉందో.. ఇప్పుడూ అదే వయసులో ఉంది. పూర్వజన్మ స్మృతి అలాగే ఉంది. ఆమెను అలాగే తన ఆంతరంగిక మందిరంలో ఉంచి, ఎవరికంటా పడకుండా కాపాడసాగాడు నాగరాజు అయిన అశ్వతరుడు.
తన కుమారులిద్దరినీ పిలిచి..
“నాయనలారా! ఆ కువలయాశ్వుణ్ని మనింటికి తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు.నాగ కుమారులిద్దరూ ఎప్పటిలాగే బ్రాహ్మణుల వేషం వేసుకుని, కువలయాశ్వుని వద్దకు వెళ్లారు. వారు తెచ్చిన సందేశం విని..“మీ తండ్రిగారి ఆజ్ఞ అయితే తప్పకుండా పాటించాల్సిందే! ఇప్పుడే వస్తాను” అన్నాడు కువలయాశ్వుడు.నాగ కుమారులిద్దరూ కువలయాశ్వుణ్ని గోమతిలో ముంచి పాతాళానికి తీసుకుపోయారు. అక్కడికి వెళ్లిన వెంటనే వారి రూపాలు మారిపోవడం గమనించి ఆశ్చర్యపోయాడు కువలయాశ్వుడు.
అక్కడ అనేక విశేషాలు కనిపించాయి. మనోహరమైన వీధులు, భవంతులతో ఒప్పుతున్న పాతాళ నగరాన్ని గమనిస్తూ.. క్రమంగా అనేక సౌధాలను దాటి అశ్వతరుని భవంతికి వెళ్లారు.
అక్కడ హారాలు, కుండలాలు, కేయూరాలు మొదలైన విభూషణాలు ధరించి దివ్యవస్ర్తాలను ధరించి.. రత్నసింహాసనంపై కూర్చుని ఉన్న అశ్వతరుణ్ని నాగకుమారులు తమ మిత్రునికి చూపారు.
అశ్వతరుడు ఆసనం దిగివచ్చాడు. కువలయాశ్వుణ్ని ఆలింగనం చేసుకున్నాడు.
“రాజపుత్రా! నేను నీకు తండ్రి వంటివాణ్ని. చిరకాలానికి మా ఇంటికి వచ్చావు. మా ఇంటిలో ఉన్న ధనకనక వస్తువాహనాలలో నీకేది కావాలో కోరుకో!” అన్నాడు అశ్వతరుడు.
అందుకు కువలయాశ్వుడు..
“మహాత్మా! నేను తండ్రిచాటు పిల్లవాణ్ని. మీరీ పాతాళ లోకాన్ని పాలిస్తున్నట్లే నా తండ్రి వెయ్యేళ్ల నుంచి భూమండలాన్ని పాలిస్తున్నాడు. ద్రవ్యం లేనివారు కోరుకోవడం ఉచితం. అన్నీ సంపూర్ణంగా ఉన్నవారు కూడా మళ్లీ ఎవరినో ఏదో ఇమ్మని కోరుకోవడానికి ఎలా నోరు వస్తుంది. మీ పాదదర్శనం కలిగింది. అంతేచాలు!” అని జవాబిచ్చాడు.
“పోనీ.. నీకు ప్రియమైన వస్తువేదైనా అడుగు కుమారా!”.
“తమ పరిష్వంగం కంటే ప్రియమైన వస్తువు ఎక్కడుంది?”.
..వారి సంభాషణ అలా జరుగుతుండగా, నాగకుమారులు మధ్యలో కల్పించుకున్నారు.
“తండ్రీ! అతనికి ప్రియమైన వస్తువేమిటో మేము చెబుతాం. ఇటీవలే మరణించిన మా మిత్రుని భార్యను తిరిగి తీసుకువస్తే చాలు. ఆమెకంటే ప్రియమైనది ఏడేడు లోకాల్లో అతనికి ఇంకేమీ లేదు” అని చెప్పారు.
“సరే.. మీరొక్కసారి ఆ గదిలోకి వెళ్లి, ఆమెను తీసుకురండి” అని కుమారులతో చెప్పి..
“కువలయాశ్వుడా! నీకిప్పుడు ఒక మాయను చూపిస్తాను. దానితో నువ్వు విరహమే అనుభవిస్తావో, తృప్తినే పొందుతావో.. అదుగో! నీ భార్య వస్తున్నది. కానీ, ఆమె మాయా మదాలస. తాకితే మాయమై పోగలదు” అని హెచ్చరించాడు.
అంతలో మదాలస వచ్చి, భర్త ముందు నిలబడింది.ఆమెను చూడగానే కువలయాశ్వుని కన్నులు విచ్చుకున్నాయి. తమకం పట్టలేకపోయాడు. కానీ, ముట్టుకుంటే మాయమై పోతుందనే భయంతో.. ఆమెకు దూరంగా కూర్చుని కన్నీరు పెట్టుకోసాగాడు.అతని బాధను చూడలేక, అశ్వతరుడు దగ్గరికి వచ్చాడు.“వత్సా! నువ్వు ప్రాజ్ఞుడివై ఉండి కూడా ఇలా దుఃఖిస్తావెందుకు? చూడు.. నీ బాధను నా పుత్రులు ముందే నాకు ఎరిగించారు. నేను పరమశివుని కోసం తపస్సు చేసి, ఆమెను పునర్జీవితురాలిని చేశాను. ఒకవిధంగా ఈమెకిది పునర్జన్మ. దేవతాప్రసాదం. ఈమె మాయా మదాలస కాదు. ఈమెను పరిగ్రహించు” అని చెప్పాడు.
కువలయాశ్వుడు దంపతీ సమేతంగా అశ్వతరునికి నమస్కరించాడు. తదుపరి వాళ్లు పాతాళం నుంచి తమ నివాసానికి తిరిగి వెళ్లిపోయారు.కువలయాశ్వుని తండ్రి అయిన శత్రుజిత్తు చిరకాలం రాజ్యాన్నేలాడు. చివరికి రాజ్యభారం కొడుక్కి అప్పగించి, వానప్రస్థానికి వెళ్లిపోయాడు.అటుపైన కువలయాశ్వునికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి విక్రాంతుడు అని కువలయాశ్వుడే పేరు పెట్టాడు. ఆ పేరు విని మదాలస నవ్వింది. ఆ నవ్వుకి అర్థమేమిటో తెలియలేదు.
కానీ, పిల్లవాడికి పాలు పడుతూ, ఊయలలో నిద్రపుచ్చుతూ..
“తండ్రీ! నువ్వు కేవలం పరమాత్మవు. నీకు కల్పనగా ఈ పేరు పెట్టబడింది” అంటూ ప్రతిరోజూ బోలెడంత తత్వబోధ చేసింది. ఆ బోధలన్నీ విన్న విక్రాంతుడు చిన్ననాడే వైరాగ్యభావం పెంపొందించుకుని, రాజ్యాన్ని కాదని తపోభూములకు వెళ్లిపోయాడు.
అటుపైన మదాలసకు మరో కుమారుడు పుట్టాడు. కువలయాశ్వుడు అతనికి సుబాహుడు అని పేరు పెట్టాడు. ఆ పేరు చూసి మదాలస మళ్లీ నవ్వింది. కువలయాశ్వుడు పట్టించుకోలేదు. ఆ కుర్రవానికి కూడా చిన్ననాటినుంచి తల్లి చేసిన తత్వబోధ వల్ల విరాగి అయ్యాడు.
మూడో సంతానానికి అరిమర్దనుడని పేరు పెడుతున్నప్పుడు కూడా మదాలస నవ్వింది. ఈసారి ఏం కొంప ముంచుతుందోనని కువలయాశ్వుడు అనుమానించాడు. అనుకున్నంతా అయింది. మూడోవాడు కూడా విరాగియే అయ్యాడు. ఒక్క కొడుకు కూడా తన రాజ్య వారసత్వానికి పనికి రాకుండా పోయాడు.
నాలుగోసారి కుమారుడు పుట్టినప్పుడు..
“మదాలసా! వీనికి నువ్వే పేరు పెట్టు” అన్నాడు.
ఆమె.. ‘అలర్కుడు’ అని పేరు పెట్టింది.
ఆ పేరు విని కువలయాశ్వుడు నవ్వాడు.
“మదాలసా! నేను అర్థవంతమైన పేర్లు పెట్టాను. అలర్కుడనే మాట మనుషులకు పేరుగా పెట్టడానికి పనికివచ్చేది కాదు కదా! ఈ పేరునెందుకు పెట్టావు?” అని ప్రశ్నించాడు.
అప్పుడు మదాలస..
“రాజా! నేను పెట్టిన పేరు సార్థకమైనది కాదు. వ్యావహారికమైన నామాలు సార్థకమైనవి కానక్కరలేదు. రాముడని పేరు పెట్టబడినవాడు రాముడే కానక్కరలేదు. అది భగవంతుడైన రాముని ఎడల సార్థకమైనది. ఇతరులవి వ్యావహరిక నామాలు మాత్రమే. మనం పిల్లలకు పెట్టుకునే పేర్లు సార్థకమైనవి కాకపోయినా పరవాలేదు, కానీ అపార్థాలు మాత్రం కాకూడదు.
ఇంకా వినండి. క్రాంతి అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం. అంతా నిండివున్న దేహేశ్వరుడు ఒక చోటినుంచి మరోచోటికి ఎలా పోగలడు? కనుక విక్రాంతుడని మీరు మొదటి పిల్లవాడికి పెట్టిన పేరు నిరర్ధకమైనది. ఇక సుబాహుడనే నామం మనిషికే కానీ లోని ఆత్మకు చెల్లదు. ఆ తరువాతివాడికి అరిమర్దనుడని పేరు పెట్టారు. మణులను గుచ్చిన సూత్రంలా సర్వ శరీరాలయందున్న వాడు ఒక్కడే పురుషుడు. అట్టివానికి శత్రువులు, మిత్రులు కూడా ఉండరు. కనుకనే నేను అలర్కుడనే నామాన్ని సంజ్ఞకోసమే పెట్టాను” అని చెప్పింది.
ఆనాటి నుంచి నాలుగో పిల్లవాడికి..
“నాయనా! నువ్వు నీ తండ్రిలా రాజ్యాన్ని పాలించాలి. ధర్మకార్యాలు చేయాలి. శత్రువుల పీచమణచాలి. మిత్రులకు ఉపకారం చేయాలి. ముఖ్యధర్మాల మూలాన్ని ఛేదించి వేసే సప్తవ్యసనాలను విసర్జించాలి. మంత్రాంగాన్ని వెల్లడి కానీయకూడదు. ఎప్పటికప్పుడు కోశాగార వృద్ధి క్షయాలను అంచనా వేయాలి” అంటూ బోధలు చేసేది.
అలా అలర్కుడు తల్లిచేత శిక్షణ పొందినవాడై.. యవ్వన కాలమందు వివాహం చేసుకున్నాడు. పుత్రులను కన్నాడు. యాగాలు చేశాడు. పితృశుశ్రూష చేయసాగాడు. కువలయాశ్వుడు అని బిరుదునామం కలిగిన ఋతుధ్వజుడు చాలాకాలం రాజ్యం చేసిన అనంతరం, మదాలసతో కలిసి వనవాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
వెళ్లేముందు అలర్కునికి పట్టాభిషేకం చేశాడు.వనసీమలకు వెళ్లేముందు మదాలస, తన కుమారునికి ఒక ఉంగరం ఇచ్చింది.“కుమారా! దీనిని ఎల్లప్పుడూ నీ వేలికి ధరించు. యుద్ధం వల్ల కానీ, బంధువియోగం వల్లకానీ, సమస్త విత్తనాశన కరమైన విపత్తు సంభవించినప్పుడు కానీ, ఈ ఉంగరాన్ని చితగకొట్టు. దీనిలో ఇమిడి ఉన్న పత్రికలో సన్నని లిపిలో ఒక శాసనం కనిపిస్తుంది. దానిని అనుసరించి, నీకు వచ్చిన కష్టాన్ని గట్టెక్కగలవు” అని దీవించింది.
అలర్కుడు పట్టాభిషిక్తుడై చాలాకాలం రాజ్యపాలన చేశాడు. ధర్మార్థకామాలను ఆసక్తితో నిర్వహిస్తుండగా.. అతనికి ఎన్నటికీ వైరాగ్యం కలగలేదు. విషయ సుఖాలపై ఎంతకూ తనివి తీరలేదు.
ఈ విషయం తపోవనంలో ఉన్న సుబాహునికి తెలిసింది. అతను తన సోదరుని రాజ్యపాలనా విధానాలన్నిటినీ క్షుణ్నంగా తెలుసుకున్నాడు. సోదరుడు విషయాసక్తుడై చరించడం తెలుసుకుని విచారించాడు.
తిన్నగా కాశీరాజు వద్దకు పోయాడు.“రాజా! నేను కువలయాశ్వుని రెండో కుమారుణ్ని. చిన్నతనంలో మతిచెడి దేశాంతరం పోయాను. నాకు రావాల్సిన రాజ్యాన్ని నా తమ్ముడైన అలర్కుడు అనుభవిస్తున్నాడు. అతనికంటే ముందు ఆ రాజ్యం నాకు రావడమే న్యాయం. నువ్వు వాణ్ని మందలించి, నా రాజ్యం నాకిప్పించు” అని కోరాడు.
దాంతో కాశీరాజు ఒక దూతను అలర్కుని వద్దకు పంపాడు.
“కాశీరాజుకు నేనంత తేలికగా కనిపిస్తున్నానా?! మా అన్న వచ్చి సౌహార్దం చేత నన్నే అడిగితే రాజ్యం ఇవ్వకుండా ఉంటానా? అతణ్ని ఎలా శరణు జొచ్చాలి?! కాశీరాజుకు వెరిచి రాజ్యాన్ని వదిలిపెట్టే రకాన్ని కాదు నేను.. అని వారితో చెప్పు” అని దూతను తిప్పి పంపాడు అలర్కుడు.
ఆ మాట విని సుబాహుడు..
“ఓహో! అభిమానం కలిగిన క్షత్రియుడు వేరొకరిని దేహీ అని యాచిస్తాడా?! అందుకు నేనొప్పుకోను” అన్నాడు.“అయితే యుద్ధం తప్పదు” అని ప్రకటించాడు కాశీరాజు.
చతురంగ బలాలతో అలర్కుని రాజ్యాన్ని ముట్టడించాడు. వివిధ దుర్గాలను ఆవరించాడు.అలర్కుడు తన బలం క్షీణించడం తెలుసుకున్నాడు. హృదయంలో చీకట్లు కమ్ముకున్నాయి. అలాంటి దశలో తన తల్లి చేసిన బోధ గుర్తుకు వచ్చింది. తన వేలికి ఉన్న ఉంగరాన్ని చితకగొడితే దానిలో ఒక ఉత్తరం బయటపడింది. అందులో..
సంగము అనగా జనులతో కలిసి ఉండటం సర్వవిధాల విడువదగినది. అది విడవడానికి శక్యం కాకపోతే సత్పురుషులతో సాంగత్యం చేయి. అదే దానికి మందు. అలాగే అన్నివిధాలుగా ప్రయత్నించి కామము అనగా కోరికను విడిచిపెట్టాలి. అది విడుచుటకు సాధ్యం కానప్పుడు ముక్తిని గురించి ప్రయత్నించు. అదే దానికి వైద్యం.. అని అర్థాలొచ్చే రెండు శ్లోకాలు కనిపించాయి.
రెండు శ్లోకాలను పదేపదే వల్లించిన తరువాత.. సంగము విడువలేనప్పుడు సత్సంగం చేయమని చెప్పినది. కాబట్టి ఇదే తక్షణ కర్తవ్యం అనుకున్నాడు అలర్కుడు.
దత్తాత్రేయ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి, తనను రక్షించమని ఆయననే వేడుకున్నాడు.ఆ మహాగురువు సమక్షంలో అడగకముందే అన్ని సందేహాలూ తీరిపోతాయి. తీరా అడిగిన తరువాత కూడా, ఇంకా సందేహాలు మిగిలే అవకాశం ఎక్కడుంది?! తన శరీరంకంటే వేరైన తనకు సుఖదుఃఖాలతో ప్రమేయం లేదని అలర్కుడు కొద్దిసమయంలోనే తెలుసుకున్నాడు.(శ్రీదత్తునికి, అలర్కునికి మధ్య జరిగిన వేదాంత చర్చ, మదాలస తన పుత్రులకు చేసిన జ్ఞానబోధ దత్తచరిత్రలో చదువదగినది) అలా దత్తాత్రేయుని బోధతో సుబాహుడు సంకల్పించిన వైరాగ్యం అలర్కునిలో కలిగింది. రాజ్యానికి తిరిగి వచ్చాడు.
కాశీరాజు యుద్ధానికి వచ్చే సమయానికి..
“రాజా! నువ్వు రాజ్య కాముకుడివై వచ్చావు. దీనిని నీ ఇచ్చవచ్చినట్లు అనుభవించు. లేదా సుబాహునికి కట్టబెట్టు. దత్తాత్రేయుని ఉపదేశం వల్ల నాకు మిత్రులు, శత్రువులు లేరని తెలుసుకున్నాను. కనుక నీకు నేను, నాకు నువ్వు శత్రువులం కాదు. సుబాహుడు నాకేమీ అపకారం చేయలేదు. నేను నా ఆత్మలాగే బాహ్యప్రపంచాన్ని చూస్తున్నాను. కాబట్టి నువ్వు మరో శత్రువును వెతుక్కో” అని పలికాడు.
కాశీరాజు ఆ మాటలు విని, విస్మయం చెందాడు.
ఇవే మాటలు సుబాహునితో చెబితే..“రాజా! నేను ఏ పనికోసం నిన్ను శరణుజొచ్చానో.. ఆ పని నెరవేరింది. మా తమ్ముడు మా తల్లిపాలు తాగి కూడా విషయాసక్తుడై.. ఈడు మించిపోతున్నా నివృత్తిమార్గాన్ని అనుసరించడం లేదు. ఈ విషయాన్ని అతనికి అర్థమయ్యేలా చెప్పడం కోసమే నిన్ను ఆశ్రయించాను. నా అభీష్టాన్ని నువ్వు నెరవేర్చావు. నాకు అంతే చాలు! రాజ్యం అక్కరలేదు. కావాలంటే నువ్వే దీనిని తీసుకో. నాకు సెలవిప్పించు” అని వెళ్లిపోయాడు.కాశీరాజు యుద్ధవిరమణ ప్రకటించాడు.అలర్కుడు తన పెద్దకొడుక్కి పట్టాభిషేకం చేసి తపోవనానికి వెళ్లాడు.
(వచ్చేవారం.. ఉపసంహారం)
-అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ