జరిగిన కథ : భైరవ ఆత్మాహుతి జాయపుణ్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎప్పుడూ లేనంతగా చలించిపోయాడు. కాకతి గుర్తొచ్చింది. భైరవ ఆత్మాహుతి తర్వాత మళ్లీ కనిపించలేదు. రుక్కమను, వెన్నియను పరామర్శించేందుకు అయ్యనవోలు వెళ్లాడు. రుక్కమను పరామర్శించాడు.అప్పుడే ఇంటి లోపలికి వచ్చిన వెన్నియ.. తలగుడ్డ తీసి ముఖం కప్పుకొని బావురుమన్నాడు. అతని వెనక కాకతి ఉన్నదోమోనని చూశాడు జాయపుడు. కానీ, అక్కడ ఎవరూ లేరు.
రుక్కమ ఇంట్లో అన్నీ వింటూ, చూస్తూ.. కాకతి రాకకోసం ఉత్కంఠగా ఉన్నాడు జాయపుడు. ఎవరెవరో వస్తున్నారు. రుక్కమను ఓదార్చుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా.. కొడుకు కైలాసం వెళ్లిన ఆనందంలో ఉన్నదామె. అప్పుడన్నారు ఎవరో..
“కాకతి ఏది ఎన్నియా.. యాడుంది?”.
“అక్కడే అనుమకొండలోనే ఉందిగా. గుళ్లో అంగపూజలు చేస్తాంది. ప్చ్.. ఆ పిచ్చిదానికి పెళ్లికంటే, ఆ అమ్మోరిమీదే గురి ఎక్కువ” అన్నాడు వెన్నియ.
సందేహంలో పడిపోయాడు జాయపుడు. కాకతి అక్కడే అనుమకొండలో ఉన్నదా? మరి తనను కలవలేదే! భైరవ మరణానికి తనే కారణమని ఆమె అభిప్రాయమా!? అందుకే తనను కలవలేదా!? అయితే వెంటనే అనుమకొండ వెళ్లాలి. కాకతిని కలవాలి.
ముళ్లపై కూర్చున్నట్లు కాసేపు అక్కడే కూర్చున్నాడు. ఏదో మాట్లాడాడు. చాలాసేపు విన్నాడు. మెల్లగా కదిలి అశ్వాన్ని అధిరోహించాడు. అది మూడుకాళ్ల సవారీపై అనుమకొండ చేరింది. మధ్యరాత్రి వేళ భైరినాయకుడి తలుపు తట్టాడు. తలుపు తీసిన ఆ దంపతులు అంత రాత్రివేళ జాయపుణ్ని చూసి ఆశ్చర్యపోయారు.
“కాకతి?!!”.
“నేనే రేపు మిమ్మల్ని కలిసి అడుగుదామని అనుకుంటున్నా జాయపా! ఆ నాట్య ప్రదర్శన తర్వాత ఆమె మా ఇంటికి రాలేదు. పాపం.. భైరవ ఆత్మాహుతికి ఆమె చాలా బాధపడుతున్నదేమో.. మీవెంటే ఉన్నదని భావిస్తున్నాం!” అన్నాడు భైరినాయకుడు.
నిర్ఘాంతపోయాడు జాయపుడు.
‘ఇదేమిటి!? కాకతి అటు అయ్యనవోలు వెళ్లక.. ఇక్కడ రేణుక ఇంటికి చేరక ఎక్కడికి వెళ్లినట్లు?’.. ఆలోచిస్తున్న కొద్దీ మనసు మొద్దుబారిపోతున్నది. ఎటు చూసినా చిమ్మచీకటి..
అశ్వాన్ని నడిపిస్తూ అనుమకొండ వీధులలో చాలాసేపు తిరుగాడాడు.
కాకతి.. కాకతి.. లిప్త లిప్తకూ ఆమె నామాన్నే ఉచ్చరిస్తున్నది మనసు. పెదవులు కూడా! ఘడియ ఘడియకూ ఆమెపై భయం పెరిగిపోతున్నది. ఏమైనట్లు?? భైరవ మాటలు విన్న కాకతి నోరు కొట్టుకుంటూ తనను చూసిన చూపు.. మరుక్షణం భీతావహలా లోపలికి వేగంగా పరిగెడుతూ చూసిన చూపు..
ఆ చూపు.. మళ్లీమళ్లీ కళ్లముందు కదులుతున్నది.
శరీరమంతా ఏదో తెలియని భయవిహ్వల భావనతో వణుకుతున్నది.
కాళ్లు ఆ దేవాలయం వైపు తీసుకుపోయాయి. అంతా నిశ్శబ్దం.. గాడాంధకారం.. నిశ్శబ్దంగా నిద్రపోతున్నది దేవాలయం.. సిద్ధేశ్వరాలయం!! సిద్ధేశ్వరుడైనా కాకతి జాడ చెబుతాడేమో..
లోపలికి వెళ్లాడు. మళ్లీ మళ్లీ ఆనాటి దృశ్యం మొత్తం సజీవంగా చుట్టూ కదలాడుతున్నది.
గాడాంధకారం. మంటపాలలో అక్కడక్కడా భక్తులు కాబోలు.. నిద్రపోతున్నారు. పెరడు, అంతరాలయం, కోష్టాగారం, అన్నీ అంతా.. చీకట్లో కళ్లే కాగడాలుగా వెతికాడు. లేదు.. కనిపించలేదు.
అలా మొదలైన వెతుకులాట రోజులు.. వారాలు.. పక్షాలు.. మాసాలు కొనసాగుతూనే ఉంది.
కాకతి కనిపించలేదు. కాకతి వార్త తెలియరాలేదు.
‘అక్కడ చూశాం!’ అన్నవారు లేరు. ‘నాతో మాట్లాడింది’ అన్నవారూ కనిపించలేదు. అందరూ తననే అడుగుతున్నారు. తనవైపే వేలెత్తి చూపుతున్నారు.
నిద్ర పట్టదు. ఊహల్లో సన్నిహితంగా వస్తుంది. పక్కనే ఉన్నట్లు తోస్తుంది. ముందు పల్లకిలో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. వెతికితే ఉండదు. దూరంగా ఆ అంగడిలో నిలబడినట్లు.. యుద్ధంలో కత్తి తిప్పుతున్నట్లు.. ఆ నాట్య ప్రదర్శనలో లాస్యం చేస్తున్నట్లు.. తోలుబొమ్మలాటలో బొమ్మలా కదలాడుతున్నట్లు..
భ్రమ! భ్రమ! భ్రమ!! భ్రమ!!
కాకతీ! ఏమైపోయావ్!? ఎంత పెద్ద శిక్ష వేశావ్!? ఇదే వాక్యం పెదవులపై .. గుండెంతా.. ఒళ్లంతా మోగుతున్నది.
ఆమె చెప్పకుండా జీవితంలోకి వచ్చేసింది. జీవితాన్ని ఆసాంతం చుట్టేసింది. ఉద్వేగంతో ఊపేసింది. కోర్కెలు రేపింది. మండించి చల్లబరచింది. జీవితాంతం తోడు ఉంటానంది. క్షణకాలంలో మాయమైంది. ఇదేనా జీవితాంతం అంటే.. అంటే ఏమిటి!? ప్చ్.. శివా!!
రాజాంతఃపురం లోపలికి ప్రవేశించాడు జాయపుడు.
నారాంబ అంతఃపురం ఆనంద సంతోషాలతో పులకించిపోతున్నది. గణపతిదేవుడు లేడు కానీ.. నారాంబ, మరికొందరు కులీన మహిళలు ఏవో చిత్తరువులు చూస్తూ మురిసిపోతూ.. ముచ్చట్లాడుతూ గోలగోలగా పులకించి పోతున్నారు. పరిచారికలు కూడా అత్యుత్సాహంతో పిల్లలను ఎత్తుకుని ఆడిస్తూ ఆ చిత్తరువులను చూడాలని.. ఆసక్తిగా వంగి వంగి చూస్తున్నారు.
జాయపుని ఆగమనం గుర్తించి అందరూ ఒక్కసారిగా లిప్తకాలం నిశ్శబ్దమై.. మళ్లా జలపాతమై పరవళ్లు తొక్కారు. అదికూడా రెండుమూడు క్షణాలే! అతని వాలకం చూసి.. వాళ్లంతా మౌనమై, అబ్బురంగా ఆసక్తిగా చూడసాగారు.
మెల్లగా భారంగా నడిచి.. ఓ ఆసనంలో కూలబడ్డాడు జాయపుడు.
మాసిపోయి మట్టి అంటుకుని అసహ్యంగా ఉన్న దుస్తులు. ముఖమంతా స్వేదం.. చెదిరిన తలనుంచి కారుతూ ముఖాన్ని విషాదభాజనం చేస్తున్నది. శరీరమంతా ఏదో జరగరానిది జరిగినట్లు.. చూడరానిది చూసినట్లు ముడుచుకుపోయి ఉంది. పాదరక్షలు లేనట్లు కాళ్లు మురికిగా కనిపిస్తున్నాయి.
జాయపుణ్ని నారాంబ అలా ఎప్పుడూ చూసిందిలేదు. దూరమైన ఏడేళ్లకాలంలో కూడా అతను ఎప్పుడైనా ఇలా ఉన్నాడన్న ఊహ కూడా ఆమెకు లేదు.
మరికొన్ని క్షణాల తర్వాత ధైర్యంచేసి.. ఓ చిత్తరువును చేతపట్టి అతని దగ్గరగా రాసాగింది.
అంతే.. పెద్దపెట్టున అరిచాడు జాయపుడు.
“పొండి.. అందరూ పొండి! పో అక్కా పో! నన్ను వదిలేయ్.. పొండి.. అందరూ పొండి!”.. పిచ్చెక్కినట్లు అరిచాడు.
అతని అరుపులు సామాన్యంగా లేవు. అతను భయపడుతున్నాడో.. ఎదుటివారిని భయపెడుతున్నాడో!?
గొంతులో చిన్నపాటి వణుకు.. నారాంబ రెండడుగులు వెనక్కి వేయగా.. అక్కడున్న కొత్తవారు గబగబా బయటికి వెళ్లిపోయారు. పరిచారికలు కూడా పిల్లలతో మరో గదిలోకి జారుకున్నారు.
కాసేపు చూసింది నారాంబ. తమ్ముడు ఏదో పెద్ద విపత్కర పరిస్థితుల్లో ఉన్నాడని ఆమె కీడు శంకించింది. ఇంద్రాణి జాయపుణ్ని వివాహం చేసుకోనని తిరస్కరించిన తర్వాత నారాంబ మరో అమ్మాయి కోసం సుదీర్ఘంగా ప్రయత్నించి ఓ అమ్మాయిని నిర్ణయించింది. ఆ సంబంధీకులు అమ్మాయి చిత్తరువులతో రావడంతో ఆమె మరింత సంతోషంతో వారితో పరవశాలలో ఉండగా.. అత్యంత దుఃఖితవదనంతో జాయపుడు వచ్చాడు. ఆ అమ్మాయి చిత్తరువు పక్కనపెట్టి మళ్లీ అతనివైపు రెండడుగులు వేసింది నారాంబ.
“జాయా.. ఏమైంది తమ్ముడూ..?” అన్నదామె అనునయంగా..
చేతులు రెండూ శబ్దంవచ్చేలా జోడించి అక్కకు మొక్కుతున్నట్లు అన్నాడు.
“నన్ను వదిలేయ్ అక్కా.. నాకు పెళ్లీ వద్దూ పెటాకులూ వద్దు. నన్ను నన్నుగా బతకనివ్వండి. దయచేసి నాకు పెళ్లి గిళ్లీ ప్రయత్నాలు వద్దు..” ఏడుస్తున్నాడు.
అనూహ్యమైన పరిణామంతో కొయ్యబారిన అంతఃపురం..ఎక్కిళ్ల మధ్య చెప్పాడు.
“ఓ అమ్మాయి.. ఇష్టపడ్డాను. కానీ ఆమె ఆమె.. కనిపించడం లేదు. ఎటో వెళ్లిపోయింది. వస్తే గిస్తే.. ఆమే నా భార్య. వచ్చినా రాకున్నా ఆమె.. ఆమెనే నాజీవితం.. లేకుంటే లేదు!”.
దుఃఖసాగరపు బడబాలనం పొంగినట్లు పెద్ద పెట్టున రోదించాడు.
రోదించి రోదించి.. రోదిస్తూనే ఉన్నాడు. భుజంపై ఎవ్వరో చెయ్యి వేస్తే తలతిప్పి చూశాడు. గణపతిదేవుడు.
మళ్లా పెద్దపెట్టున రోదించాడు. ఆయన్ని అల్లుకుపోయాడు.
“క్షమించండి బావగారూ! చిన్న అపరాధం.. తొందరపాటు నన్ను దహించివేస్తున్నది. నన్ను క్షమించండి.. క్షమించండి.. క్షమించండి!”. పిచ్చివానిలా ఉన్మత్త ప్రతాపంలా అదే మాట పదే పదే..జాయపుణ్ని పొదువుకున్నాడు గణపతిదేవుడు.
“నా జాయపుడు తప్పుచెయ్యడు. జాయా.. నాకు తెలుసు. నా అంతరాత్మ చెబుతున్నది. ఏమిటా ఏడుపు?! భయం.. పిరికితనం ఈ జాయపునిలోనా!? నాట్యరంగంపైనా.. యుద్ధరంగంలోనూ ఏకకాలంలో తాండవమాడగల నా జాయపునిలోనా?!.. అసంభవం!! బయటినుంచి రాదు. లోపలినుంచి లేదు. నామాట నమ్ము..” ఊరడింపు ఆయన మాటలలో పొంగి ప్రవహిస్తున్నది.
ఆయన్ని వదలకుండా హత్తుకుని మౌనంగా రోదిస్తున్నాడు.
వివాహమైన తర్వాత తొలిసారి నారాంబ తల్లడిల్లిపోతున్నది. మహావీరుడు తమ్ముడు ఇలా విహ్వలంగా దుఃఖించడం ఆమె చూడలేక.. భయాందోళనతో రోదిస్తూ ఆమె కూడా భర్తను అల్లుకుంది. ఇద్దరూ ఆయన్ని చెరోవైపు గాఢంగా హత్తుకుని.. నియమితి తప్పి కంటికి మంటికి ఏకధారగా రోదిస్తుండగా.. ఊరడిస్తునట్లు ఇద్దరినీ పొదువుకుని భారంగా కళ్లు మూసుకున్నాడు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు.
కాకతి కనిపించడం మానేసి మాసాలు దాటాయి.
కాకతీయ వేగులు, సైనికులు ఆమెకోసం వెతకని చోటులేదు. తిరగని ఊరులేదు.
ఆమె ఉనికి గురించి ఎవరైనా చిన్నమాట చెబితే అక్కడికి వెళ్లిపోయేవాడు జాయపుడు. ఎన్నో గ్రామాలు, పురాలు, వాడలు.. అడవులు, కొండలు గుట్టలు..
కాకతి.. ఎక్కడ.. ఎక్కడెక్కడ.. రెప్పపడని కళ్లు.. రేయింబవళ్లు.. లోనా బయటా వెతుకులాట!!
దాదాపు పిచ్చివాడయ్యాడు.
ఎవ్వరినీ కలవడు. ఎవ్వరితోనూ చూపు కలపడు. మిత్రులు లేరు. అక్కా లేదు చక్రవర్తీ లేడు. తల్లిదండ్రీ ఎవ్వరూ లేరు. తిండితిప్పలు లేవు.. స్నానం లేదు. మధుపాన మత్తుడయ్యాడు. తాగి వీధులలో పడిపోతున్నాడు. అరుస్తాడు. ఏడుస్తాడు. నవ్వుతాడు. పిచ్చి పిచ్చిగా. అందరిలో ఆందోళన. నారాంబ పిచ్చిదైపోగా.. గణపతిదేవుడు నిర్ఘాంతపోయాడు.
“నువ్వు ఇలా ఉంటే రాజ్యమే నీరసపడి పోయింది జాయా! ఆ అమ్మాయి ఎవరో రాజ్యమంతా జల్లెడ పట్టించాను. దొరకలేదు. కాకతీయవీరుడివి. పోరాటయోధుడివి. నువ్వే ఓ ఆడదాని కోసం అలా కుంగిపోతే.. సామాన్యుల మాటేమిటి!?”.
మౌనం.. నిట్టూర్పు.. దూరంగా ద్వారంపై నిలిపిన చూపు..
కాకతీయ మహావేగులే జల్లెడ పడుతున్నా కాకతి దొరకలేదంటే.. ఓ దేవుడా.. నా కాకతి ఏమైపోయినట్లు??
కాకతి అదృశ్యమవడం ఏమిటో అర్థంకాక, ఆమె ఆచూకీ దొరక్క పిచ్చెక్కినట్లు తిరిగేవాడు. పురనివాసంలో ఒంటరిగా ముడుచుకుపోయి ఓ మూలగా పడుకుని కాకతి ఊహల్లో విహరించేవాడు. దానికి కావాల్సిన మధువుతోపాటు అతనికి తోడయ్యాడు బలియనాయకుడు. వేశ్యావాటికలతో అనుసంధానకర్త. ఒంటరిగా సతమతమై కుంగిపోతున్న జాయపుడు.. బలియ గాలానికి తగిలిన అత్యంత సులువైన చేప.
“కాకతిని తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము సేనానీ..” అన్నాడు.
నిజమో అబద్ధమో అలా నమ్మబలికినవారు ఎవ్వరూ లేరు జాయపునికి. కేవలం వారంలోనే అతణ్ని పూర్తి తాగుబోతును చేశాడు బలియ.
“ఏది.. ఏది నా కాకతి ఏది? ఎప్పుడు చూపిస్తవ్ బలియా” అంటూ మత్తులో ఏడుస్తున్నాడు జాయపుడు.
“ఇదిగో.. ఇదే మీ కాకతి. చూడండి అచ్చం అలాగే ఉంది కదూ!”..
“ఆ.. అలాగే ఉందా!? ఈమె నా కాకతేనా.. భలే!”.
అలా అతణ్ని తాగుడుకు, వ్యభిచారానికి దాసుణ్ని చేశాడు. బలహీనుడైనప్పుడు తెలిసి తెలిసి వ్యసనాలకు బానిస అవుతాడు మనిషి. అది తప్పు అని తెలుసు. కానీ, తప్పదు అని భావిస్తాడు. అదే ఒక ఉపశమనంగా నమ్ముతాడు. అదే తోడూ నీడా!!
ఓ మహాయోధుడు, మహామేధావి, దేవుడు సృజియించిన గొప్పనాట్యకారుడు.. అలా జీవితమనే మహా యుద్ధరంగంలో.. తొలి ప్రవేశంలోనే ఓడిపోయి మూలాన ముడుచుకు పోయాడు!!
(సశేషం)
కాకతి అదృశ్యమవడం ఏమిటో అర్థంకాక, ఆమె ఆచూకీ దొరక్క పిచ్చెక్కినట్లు తిరిగేవాడు. పురనివాసంలో ఒంటరిగా ముడుచుకుపోయి ఓ మూలగా పడుకుని కాకతి ఊహల్లో విహరించేవాడు. దానికి కావాల్సిన మధువుతోపాటు అతనికి తోడయ్యాడు బలియనాయకుడు. వేశ్యావాటికలతో అనుసంధానకర్త. ఒంటరిగా సతమతమై కుంగిపోతున్న జాయపుడు..బలియ గాలానికి తగిలిన అత్యంత సులువైన చేప.
-మత్తి భానుమూర్తి
99893 71284