జరిగిన కథ : భావి కాకతీయ సామ్రాట్టు.. మురారిదేవుడు యుద్ధానికి రాకపోవడంపై కాస్త నిరాశతో ఉన్నాడు జాయప. ‘ఏమిటి వాడి మనస్తత్వం?’ అనే ఆలోచనలో ఉన్నాడు. ఆ విషయం.. శుక్ర చెప్పాడు. ఒకనాడు రాత్రి దీపాలు వెలిగించిన తర్వాత.. జాయపను కలవడానికి వచ్చాడు. కాసేపు ఇద్దరూ పిచ్చాపాటిగా మాట్లాడుకున్న తర్వాత.. అసలు విషయంలోకి దిగాడు శుక్ర. మురారిదేవునికీ.. రుద్రదేవమ్మకూ మధ్య పడటం లేదనీ.. ఇద్దరూ ‘ఢీ అంటే ఢీ!’ అనేలా ఉంటున్నారని చెప్పుకొస్తున్నాడు.
మఠియవాడ.. మఠియలు అంటే చిన్నచిన్న అంగళ్లు. అక్కడ తినుబండారాలు ప్రసిద్ధి. నాలుగైదు వీధులతో విస్తరించి ఉంది మఠియవాడ. మఠియల ముందు అమ్మకాలు, వెనుక వసారాలో వంట.. ఘుమఘుమలు, వాటివెంట పిడకల పొగ.. వీధులన్నిటినీ చుట్టేసి నోరూరిస్తున్నాయి. వాటికితోడు వీధులలో వస్తూ పోతూ ఆగిన బళ్లు.. ఎడ్ల మెడల్లో చిరుగంటల చిరు చిరు నాదాలు.. కొనుగోలుదారుల మాటలు, నవ్వులు ముచ్చట్లు.. మఠియదారుల వినయ వ్యాపారాలు.. ఉదయపు రెండవ ఝామువేళ పత్తిపువ్వుల మాగాణిలా తెల్లని ఎండ విరగకాస్తోంది. ఓ తినుబండారాల మఠియ. దాని ప్రధానస్థానంలో తక్కెడ పట్టుకుని వణిజుడు కూర్చుని ఉన్నాడు. లోపల కోరిన వంటలు చేస్తుండగా ఒకామె వాటిని వేడివేడిగా మోదుగాకులలో పెట్టి తక్కెడలో ఉంచగా.. ఆ వణిజుడు తూకం వేయగా.. వాటిని మఠియ ముందు కూర్చుని తింటున్నవారికి అందిస్తోందామె. బిడ్డ కాబోలు. పదేళ్లు ఉండొచ్చు. మంచినీళ్ల చెంబులతో సిద్ధమై అడిగిన వాళ్లకు అందిస్తోంది.
‘రుచి అదిరిపోయింది’ అన్నాడు తమ్ముడు.‘అద్భుతం..’ అన్నాడు మిత్రుడొకరు. బుగ్గల నిండా పెట్టి తింటున్న మిగిలినవారు వేళ్లు నాకుతూ అవునవును అన్నట్లు తలలూపారు. తల ఊపినవారిలో అక్క కూడా ఉంది. చెంబు అందుకుని గటగటా తాగి తెంచి.. ‘నిజమే తమ్ముడూ.. బహుబాగు.. నాకు మరో మోదకం..’ అంది గుటకలు వేస్తూ. అందరూ మళ్లీ తమకు కావాలని చెయ్యెత్తి చూపారు. అప్పుడు అనుకోకుండా ఓ సంఘటన జరిగింది..ఆ అక్కా తమ్ముడు..చెబుతున్న శుక్రను ఆపమన్నట్లు చెయ్యెత్తాడు జాయచోడుడు.“ఓ అక్కా.. ఓ తమ్ముడు.. అతని మిత్రులు. అలా చెప్పడం ఎందుకు? మురారి, రుద్రమ అని చెప్పవచ్చుగా.. వాళ్లే అని.. చూసినట్లు చెబుతున్నావ్?!” జాయచోడుని గొంతులో అసహనం.వాళ్లు కాదని చెబితే బావుండును అనే ఆశ లీలగా ధ్వనిస్తోంది.
“నా నియోగ ఉద్యోగులు తెలుసుకుని చెప్పిందే.. నేను తమరికి నివేదిస్తున్నాను ప్రభు!” “అంటే.. మీవాళ్లు గూఢచర్యం చేస్తున్నారా? అందుకో నియోగం ఉంది కదా!” “ఉంది. అది రహస్యంగా సమాచారం సేకరించి ప్రభువులకు, ప్రధానికి నివేదిస్తుంది. పైగా అది రాజ్యమంతా.. ఆ మాటకొస్తే శత్రు, మిత్ర రాజ్యాలన్నిటిలో పనిచేస్తుంది. మా పరిధి కేవలం అనుమకొండ మాత్రమే. మేము బాహాటంగా పురవాసులు ఏమి అనుకుంటున్నారో వాళ్లతో మాటామంతి ద్వారా తెలుసుకుని ఓ అభిప్రాయానికి వచ్చి సిద్ధంగా ఉంటాం. ప్రభువులు అడిగినప్పుడు చెబుతాం..” “సరే సరే! ఇక ఓ అక్క, ఓ తమ్ముడు అనడం మానేసి.. మురారి, రుద్రమ అని చెప్పు..”
జాయపుని అసహనం ఊహించినట్లు ప్రశాంతంగా చెప్పసాగాడు శుక్ర. “ఆ యువబృందం మన్మహామండలేశ్వరుడు గణపతిదేవుని కన్నబిడ్డలని, వాళ్ల మిత్రబృందమని ఆ మఠియదారులకు తెలియదు. అసలు ఆ వీధిలో ఎవరికీ తెలియదు. ఆ మాటకొస్తే సాధారణ సమాజంలో మహారాజులను దేవుళ్లుగా గౌరవిస్తారు. కానీ, ఆయా రాజులను, వాళ్ల కుటుంబసభ్యులను చూసిన సంఘటనలు తక్కువ. వీధుల్లో కనిపించే వ్యక్తులను వారివారి దుస్తులు, అలంకరణ, ఠీవి, ప్రవర్తన, ఆయుధ ధారణ, వాహనాలు, అధిరోహించే అశ్వపుజాతిని బట్టి వారు కులీనులని, రాజకుటుంబీకులని, రాజనగరి నివాసులని గుర్తించి.. వినయంగా వంగి నమస్కరించి పక్కకు తొలగుతారు. వాళ్లకు తెలిసిన పేర్లు రుద్రమదేవి, మురారి కళ్లెదుటే ఉన్నా.. వారు వీళ్లేనని తెలుసుకోలేరు. ఆ సంగతి తెలిసిన రాజకులీనులు అందరిలాగే వీధులలో తిరుగుతుంటారు. మురారి, రుద్రమ కూడా వీధులలో విహరిస్తూ తినుబండారాల కోసం ఆ మఠియ వద్దకు చేరారు. హాయిగా తింటున్నారు. మురారి మిత్రుడొకరికి పొలమారింది. అతడు ఆ పిల్లను చూస్తూ.. ‘మంచినీళ్లు!’ అన్నాడు. ఆ పిల్ల మరొకరికి నీరు అందిస్తోంది కానీ ఇటు చూడలేదు. అతడు మళ్లీ గట్టిగా దగ్గి.. ‘మంచినీళ్లు!’ అని అరిచాడు. కానీ ఆ పిల్ల ఏమాత్రం అతణ్ని పట్టించుకోలేదు. కోపంతో ఉగ్రుడైన మురారి లేచి.. ఆ పిల్ల చెంప చెళ్లుమనిపించాడు.
‘దిక్కులు చూస్తున్నావ్ కానీ ఆయన దాహం.. మంచినీళ్లు అంటే వినిపించడం లేదా??’ అంటూ గద్దించాడు.అప్పుడు చూసింది ఆ పిల్ల.. దిగ్భ్రమతో నిర్ఘాంతపోతూ. మరో మిత్రుడు ఆ పిల్ల వీపుపై గుద్దాడు. అసలే బక్కగా ఉన్న ఆ ఆరేళ్లపిల్ల మఠియ ముందు బొక్కబోర్లా పడిపోయింది. అప్పుడు గర్జించాడు ఆ పిల్ల తండ్రి.‘రేయ్.. ఎవడ్రా నువ్వూ! నా బిడ్డనే కొడతావా!? ఆ పిల్ల మూగ చెవుడు. ఆమెకు వినపడదు. అలాంటి పిల్లపై చెయ్యి చేసుకుంటావా?’ అంటూ లేస్తూనే.. చేతిలోని కర్రతో ఒక్క ఊపుతో మురారి మిత్రుణ్ని ఈడ్చి కొట్టాడు. వాడు గింగరాలు తిరిగిపడ్డాడు. అంతే.. మురారి కోపంతో ఉగ్రుడై అంతే వేగంగా అతని కర్రను గుంజుకుని అతని భుజంపై ఒక్కవేటు వేశాడు. అతడు తూలి పడిపోయాడు. కారణం.. అతడు కుంటివాడు. ఎడమచెయ్యి, కుడికాలు రెండూ లేవు. చిన్నపిల్లను కొట్టాడన్న కోపంతో నడవడానికి ఊతంగా చంకలో ఉన్న కర్రతో వాళ్లను కొట్టాడు. బయట చుట్టుపక్కలవాళ్లు పోగయ్యారు. అప్పుడే లోపలినుండి ఆ స్త్రీ పదార్థాలున్న మోదుగ ఆకులతో బయటికి వచ్చింది.
లోపల భర్త పడిపోవడం, బయట కూతురు పడిపోవడంతో ఆమె మ్రాన్పడిపోయి.. ‘ఎవడ్రా.. నా వాళ్లను కొట్టింది?’ అంటూ బయటికి వచ్చి.. మురారి మిత్రబృందంలోని ఒకణ్ని బలంగా తోసింది. రుద్రమ అందరినీ ఆపడానికి ప్రయత్నిస్తూ ఆ పిల్లను లేవనెత్తింది. లోపల మఠియదారు మెల్లగా లేవలేక లేస్తున్నాడు. ఆమె అరుస్తూ.. ‘ఎవల్రా.. మీరు. నా భర్త ఎవరనుకున్నావ్. గొప్ప యోధుడురా. పిఠాపుర యుద్ధంలో కాలు, చెయ్యి పోగొట్టుకున్న వీరుడురా! ఆయన మీదే చెయ్యి వేస్తార్రా మీరు. మీ అంతు చూస్తారా..’ అంటోంది. రుద్రమ ఆమెను సముదాయిస్తూ.. మురారిని, మిత్రులను అడ్డుకుంటోంది. ‘నీ మొగుడు సైనికుడు అయితే ఎవడికి ఎక్కువ! నేనెవరో తెలుసా..’ అంటూ ఆమెను క్రోధంతో రెచ్చిపోతూ రెండుచేతులతో విచక్షణా రహితంగా కొడుతున్నాడు మురారి. ‘తమ్ముడూ! ఆగు.. ఆగు. ఏమిటిది.. స్త్రీలపైనా నీ ప్రతాపం.. ఆయన యుద్ధవీరుడైన క్షతగాత్రుడట. వాళ్లను తాకినా తండ్రిగారు ఆమోదించరు. ఆగు ఆగు..?’ అంటున్నది రుద్రమ. మురారి ఏమాత్రం ఆగడంలేదు. అతణ్ని చూసి మిత్రులు కూడా ఆమెను, అతణ్ని కొట్టసాగారు. మఠియనంతా అల్లకల్లోలం చేస్తున్నారు. చెప్పిచెప్పి విసిగిపోయిన రుద్రమ.. చివ్వున మురారి చెంపలను వాయించింది. గట్టిగా అరిచింది. అక్కడున్న చెక్క ఆసనాన్ని ఎత్తి ఒక్క ఊపున మురారి పైకి విసిరింది. అది అతివేగంగా పోయి మురారి నుదుటికి తగిలి దూరంగా పోయి పడింది. కళ్లు తిరిగిన మురారి తూలి కింద పడిపోయాడు!”..
అంతవరకూ చెప్పి ఆపాడు శుక్ర. వింటున్న జాయచోడుని మది మదిలోలేదు. ఊహాతీతమైన సంఘటన!జాయచోడుని ముఖం చూస్తూ చెప్పసాగాడు శుక్ర. “ఇది ఇక్కడితో ఆగిపోతే.. ఏ గొడవా లేదు. కానీ మురారి అలా తేలికగా వదలలేదు..” “ఏం చేశాడు?” జాయచోడుని గొంతు లిప్త లిప్తకాలానికీ ఉధృతమవుతోంది. “ఆ గొడవ సద్దుమణిగాక రాజప్రాసాదానికి వెళ్లారు. కానీ, పగతో రగిలిపోతూ అదేరోజు రాత్రివేళ ఆ మఠియపై దాడి చేశారు మురారి, ఆయన మిత్రులు.. మరికొందరు సైనికులతో!”
జాయచోడుని దవడ బిగుసుకుంటోంది. “కానీ వాళ్లు ఊహించింది జరగలేదు. వాళ్లు దాడి చేస్తారని ముందే ఊహించిందేమో.. రుద్రదేవమ్మ వాళ్లను అక్కడినుండి తప్పించింది. ఆమె తప్పించింది అని ఎలా చెబుతున్నానంటే.. ఉదయం జరిగిన ఈ గొడవ ఆ నోటా ఈ నోటా పోయిపోయి మాకు తెలిసింది. అప్పుడే మఠియవాసులు కొందరు వాళ్లు మురారి, రుద్రమదేవి అని గుర్తించారు కూడా.నేను మావాళ్లను మఠియవాడలో నియమించాను. జరిగేది పరిశీలించమని..అర్ధరాత్రి మఠియవాడ గాఢనిద్రలో ఉంది. అక్కడక్కడ కుక్కల అరుపులు.. దూరదూరంగా ఉన్న ఆముదపు దివిటీల వద్ద దోమల గుంపులు.. మఠియల ముందువైపు వ్యాపారంచేస్తే వెనక నివాసం ఉంటారు ఈ మఠియదారులు. చీకటిలో వెదుక్కుంటూ వెళ్లారు ఆ మఠియవద్దకు. దానిని గుర్తించాక మెల్లగా వెనక్కు వెళ్లారు. నివాస గుడిసెను చుట్టుముట్టి దానిని తగలబెట్టడానికి ఉద్యుక్తులవుతూ మెల్లగా లోపలికి తొంగి చూశారు. ఆశ్చర్యం!! లోపల ఎవ్వరూ లేరు. ఏం చెయ్యాలో తోచలేదు. చంపాలనుకున్నవాళ్లు లేకుండా గుడిసెను తగలబెట్టడం ఎందుకు? అనుకుంటూ ముందుకొచ్చి ఆలోచించారు. తండ్రి, తల్లి, పిల్ల ముగ్గురూ ఎటు వెళ్లారు. ఎక్కడ దాక్కున్నారు?
మర్నాడు పగలు మిత్రుల్ని పంపాడు మురారి. మఠియ మూసివేసి ఉంది. పక్క మఠియవాళ్లను అడిగారు.‘ఏవో.. ఎవరో నిన్ననే వచ్చి ముగ్గుర్ని తీసుకుపోయారు’ అన్నది జవాబు. మళ్లీ అయోమయం. ఏవరో వచ్చి తీసుకుపోవడం ఏమిటి.. వెళ్లి మురారికి చెప్పారు. తాము రాత్రి వచ్చి దాడి చేస్తామని ఎవరు ఊహించారు?వాళ్లను రక్షించగలిగింది ఎవరు?అక్క! రుద్రమదేవి!! వాళ్లను కాపాడుతూ తనపై చేయి చేసుకుంది.. ఆసనాన్ని విసిరేసి గాయం చేసింది. మురారికి తొలిసారి అక్కపై అనుమానం కలిగింది. పరుగున అంతఃపురానికి వెళ్లాడు. తల్లి నారాంబ.. పైనున్న ఆసనంలో కూర్చోగా, కింద ఆసనంలో రుద్రమదేవి కూర్చుని ఉంది. “తమ్ముడూ! రారా.. నీ సంగతే ముచ్చటించుకుంటున్నాం..” ఆశ్చర్యపోయాడు మురారి. తల్లి నారాంబ.. అక్క రుద్రమ జుట్టులో పేలు కుక్కుతోంది.. కబుర్లు చెబుతూ. చెయ్యాల్సిందంతా చేసి ఎంత ప్రశాంతంగా నవ్వుతూ అమ్మతో కబుర్లు చెబుతోంది?! అక్కను అడిగే ధైర్యం లేదు. అయినా ఏమని అడగాలి.. క్రోధంతో కసితో రగిలిపోతున్నాడు. ముందు వాళ్ల సంగతి చూసి ఆనక అక్కకు తన శక్తియుక్తులు చూపాలని అనుకున్నాడు. కానీ, అక్కే ఓ మెట్టు పైన ఉంది. అది మరింత అవమాన సెగలు రగిలిస్తోంది.
మిత్రులను, కొంతమంది సైనికులను, కొందరు గూఢచారులను కూడగట్టి నిశ్శబ్దంగా ఆ ముగ్గురి కోసం వెదికించసాగాడు. రాత్రింబవళ్లు ఇదే పని.. ఇదే ధ్యాస.. అనుమకొండ, కోట, రాజప్రాసాదం, ముఖ్యమైన వాడలు, పేటలు, పురాలు ఆఖరికి వెలివాడ వరకు జల్లెడపట్టి వెతికారు. వృధాప్రయాస తప్ప వాళ్ల ఆచూకీ లభించలేదు. అక్క కాదేమో.. వాళ్లు తాము దాడిచేస్తామని భయపడి రాత్రికి రాత్రి ఊరు విడిచి పారిపోయారేమో!?కానీ, ఓ ఉదయం మురారి బృందంలోని ఓ మిత్రుడు పరుగుపరుగున వచ్చి మురారి ముందు సాగిలబడ్డాడు. ‘మిత్రమా.. ఘోరం! ఆరోజు ఆ మఠియ బిడ్డను నేనే ముందు కొట్టాను. అదే ఇప్పుడు నా తప్పయ్యింది. రాత్రి నా ఇంటికి ఆ మఠియ మహిళ ఓ బృందంతో వచ్చింది. ఆ పాపను కొట్టినందుకు, ఆ మఠియదారుణ్ని తోసినందుకు నా కాలో చెయ్యో.. ఏదో ఒకటి తీసేస్తారట. ఏదో ఒకటి నేను నిర్ణయించుకోవాలట!’ అంటూ బావురుమన్నాడు. కాసేపు వెక్కివెక్కి ఏడ్చాడు. ఆనక కళ్లు తుడుచుకుని చెప్పాడు.‘వాళ్లు మళ్లీ వస్తారట. వాళ్లు వచ్చినట్లు నీకు చెప్పమన్నారు. నా కాలో చెయ్యో నువ్వే రక్షించాలి దేవా..’ మరి రెండుగంటల కాలానికి తొమ్మిదిమంది మిత్రులు వచ్చి ఇదే చెప్పారు. పదోవాడు ఎటో పరారయ్యాడు.
(సశేషం)
అక్కను అడిగే ధైర్యం లేదు. అయినా ఏమని అడగాలి.. క్రోధంతో కసితో రగిలిపోతున్నాడు. ముందు వాళ్ల సంగతి చూసి ఆనక అక్కకు తన శక్తియుక్తులు చూపాలని అనుకున్నాడు. కానీ, అక్కే ఓ మెట్టు పైన ఉంది. అది మరింత అవమాన సెగలు రగిలిస్తోంది. మిత్రులను, కొంతమంది సైనికులను, కొందరు గూఢచారులను కూడగట్టి నిశ్శబ్దంగా ఆ ముగ్గురి కోసం వెదికించసాగాడు.
-మత్తి భానుమూర్తి
99893 71284