జరిగిన కథ : రాజనగరి కళామందిరం. సామ్రాజ్యస్థాయి కళావేదిక కావడంతో.. సంస్కృత, తెలుగు భాషా సాహిత్యాలలో పుంభావ సరస్వతులైన కవిపండితులు ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. ఎన్నో చర్చోపచర్చలు నిర్వహిస్తుంటారు. జాయచోడుడు అందరితోనూ ఆత్మీయంగా ఉంటాడు. కానీ, లలితాంబతోనే తనకు కాస్త ఇబ్బంది. రాసుకుంటూ.. పూసుకుంటూ తిరుగుతుంది. పిండి బంధాలపై, కరణులపై సందేహాలున్నట్లు అడుగుతుంది. మరో పండితుడు చెబితే నిరాసక్తంగా చూస్తుంది. జాయచోడుడు చెబుతుంటే.. కోటివెలుగుల కళ్లతో చూస్తుంది.
ఓ ఎనభై ఏళ్ల పండితుడు అడిగాడు చొంగ తుడుచుకుంటూ, “లలితాంబా! నిత్యమూ ఇక్కడికి వస్తుంటే నీ వేశ్యాగృహ నిర్వహణ ఎలా..?” “మామ ఎక్కడుంటే అదే నాగృహం. ఏం మామా..” అన్నది గారంగా.ఎంత గారంగా అన్నదంటే.. కొన్ని లిప్తల కాలం ఎవ్వడూ ఊపిరి పీల్చలేకపోయారు. ఓ కుర్రకవి కదిలి ఆ పెద్దాయనకు ఉత్తరీయం అందించాడు.
ఆయన ‘ఇది ఎందుకు?’ అన్నట్లు చూశాడు.
“చొంగ తుడుచుకోండి..” అన్నాడు కుర్రకవి. ముసలాయన కూడా తక్కువ తినలేదు.“ముందు నీ చొంగ తుడుచుకో..” అన్నాడు చిరాగ్గా.లలితకు కవుల ప్రతిభ, వాళ్ల శృంగార కవిత్వం మాత్రమే కాదు.. వాళ్ల వెకిలి ప్రవర్తన కూడా క్షుణ్నంగా తెలుసు. జాయచోడునికి ఇప్పుడు కాకతి కంటే మువ్వ ఎక్కువగా గుర్తొస్తున్నది. అది మధుర భక్తి.లలిత శృంగార కీర్తనల ఉప్పెన. గతంలో లలిత పట్ల లలితలాలిత్య శృంగారయుత ఆలోచనలు, వివాహబంధం.. అలాగే నీలాంబక్క చెప్పిన భోగినీ పండుగ కూడా అతనెప్పుడూ మర్చిపోలేదు.ఈ మధ్యకాలంలో తను ఎన్నో జీవనకాలపు సంఘర్షణల్లో నలిగి నలిగి.. చిక్కి శల్యమయ్యాడు. లలితది కూడా పునర్జన్మే! ఇప్పుడామె అందరి కళ్లకు దోరగా ముగ్గిన మామిడిపండులా.. శృంగార రసాధిదేవతగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నది. ఆమె తనపై కురిపిస్తున్న మధుర లేదా ముగ్ధ ప్రేమలో మొత్తంగా మొత్తం శృంగారమేనని అందరూ భావించవచ్చు. కానీ, అందులో తనకోసం ఆమె ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న విరహప్రేమ, మధుర భక్తి లేవని తానెలా అనుకోగలడు?!
లలితపై జాయచోడునికీ ఇష్టాయిష్టాలున్నాయి. అందులో శృంగార ఉధృతి ఇప్పుడొచ్చిన సమస్య. ఇప్పుడతనికి లలిత శారీరక సౌందర్యం కూడా రాత్రి పవళ్లు గుర్తొస్తున్నది. కవిగాళ్లు మరింత ఎగదోస్తున్నారు.ఇంతకాలం జాయచోడుని అంతరంగంలో మరుగున పడిపోయిన శారీరక తృష్ణ ఏదో లోలోన సలుపుతున్నది.
గణపతిదేవుడు గుర్తొచ్చాడు.
ఆమెను ఆస్థాన నర్తకిగా నియమించడంలో ఆయన ఆంతర్యంలో మరేదో ఆలోచన ఉన్నట్లు జాయచోడుని సందేహం. ఆమె తనతో అతిగా ప్రవర్తించడం ఇక్కడ, ఇప్పుడు మాత్రమే కాదు.. ఆతుకూరు దేవాలయ ప్రారంభోత్సవం నాడుకూడా తనతో అతిగానే ప్రవర్తించింది. నృత్త ప్రదర్శనలో ఏ మార్గి నటి కూడా అలా ప్రవర్తించదు. లలితాంబకు తనపై ఆశ ఉన్నా ఆమె అతిగా ప్రవర్తించే తరహా ఆడపిల్ల కాదు. ఆమె పులి పిల్ల. స్త్రీ గౌరవాన్ని అవమానపరిస్తే సివంగిలా తలపడుతుంది. తల తెంచి పారేస్తుంది.
నీలాంబ శయనమందిరంలో ఉన్న వర్ణచిత్రం.. గణపతిదేవుల తండ్రి మహాదేవులవారిది. అంటే.. లలితాంబ ఆయన అనధికారిక కుమార్తె!అంటే, గణపతిదేవులకు సోదరి వరస.. తనకు మేనకోడలు, మరదలు వరస! ఆమెకు ఆస్థాననర్తకిగా తల్లి స్థానాన్ని ఇవ్వడం.. ఇటీవల కళామండపం ప్రసక్తి వచ్చినప్పుడు కూడా.. “లలితాంబ వస్తున్నదా.. కలుస్తున్నదా.. ఎప్పుడూ నిన్నే కలవరిస్తూ ఉంటుంది మా దగ్గర.. అహ్హహ్హహ్హ..’ అన్నాడు. ‘నవ్వితే నవ్వాడు. నా ముఖం చూస్తూ నవ్వడం ఏమిటి!? నేను బెల్లంకొట్టిన రాయిలా ఉంటే ఆయన ఆశ్చర్యపోవడం ఏమిటి!?’..కాకతిని కదిపి చూశాడు. ఊహు. మౌనమే ఆమె భాష! ఎందుకు ఈవిడగారు మౌనవ్రతం పట్టారు?! అంటే తన శారీరక సుఖాన్ని బావగారిలాగే ప్రోత్సహిస్తున్నదా..!? అవునేమో!!
ఈ భావన కాస్త హుషారు కలిగించింది.
జాయచోడుడు రచించిన కొన్ని యక్షగానాలను, ఉప రూపకాలను తీసుకుని.. అందులోంచి చిన్నచిన్న అంశాలను కళామండపంలో కవి పండితుల ముందు ప్రదర్శించి చూపిస్తూ ఉంటుంది లలితాంబ. అలాంటి ఓ ప్రదర్శన చేస్తూ జాయచోడుణ్ని చూస్తూ.. రెచ్చగొట్టేలా.. నటిస్తున్నట్లు జీవిస్తూ.. ప్రదర్శిస్తుంటే.. కవిపండిత మిత్రులు తట్టుకోలేకపోతున్నారు.జాయచోడునితో అన్నాడో పండితుడు.. “మీపై అచంచల ప్రేమతో ఆమె వేశ్యాగృహం నిర్వహణ పట్టించుకోవడం లేదట. మొన్న మామిత్రుడు విదేశీమధువు కోరితే తాటికల్లు పోశారట. కాకపోతే విదేశీ చషకంలోనేనట!”.
వెళుతున్నప్పుడు విక్రమ దగ్గరి వరకూవస్తుంది లలిత. “అక్క.. మీ అక్కగారు తమరిని కలవరిస్తున్నది..” అలా అప్పటికి పాతికసార్లు చెప్పాక ఆమె వేశ్యాగృహానికి వెళ్లాడు. నీలాంబను చూస్తే వాంతి వచ్చినంత పనయ్యింది. కేవలం చిన్న చీపురుపుల్ల. నిప్పులో కాలగా మిగిలిన శరీరంలో.. కళ్లు మాత్రమే తెలుస్తున్నాయి. చూస్తున్నాయి. జాయచోడుణ్ని చూసి.. అవి మరింత వెలుగుతూ కన్నీళ్లతో మెరిశాయి. ఆమె అతని తల నిమురుతూ తడి బుగ్గలను స్పృశిస్తూ ఏదో అన్నది. జాయచోడునికి ఏదో శబ్దం మాత్రమే వినిపించింది.
“అక్కా.. అక్కా.. అక్కా..” ఏడుస్తూనే ఉన్నాడు.
లలిత చెప్పింది.“పగలూ రాత్రి.. శరీరమంతా మంటలు. భరించలేని నొప్పి. అరుస్తుంది. కేకలు పెడుతుంది. ‘దేవుడా.. నన్ను తీసుకుపో!’ అంటూ తల తల్పానికేసి కొట్టుకుంటుంది.”నిర్వికారంగా చెబుతున్నది లలితాంబ. వినీవినీ.. చూసీచూసీ.. భరించీభరించీ.. ఆమె నిర్వికారమై పోయినట్లుంది. లేచాడు. కళ్లు తుడుచుకున్నాడు. లలితాంబ చేయి పట్టుకున్నాడు. నీలాంబక్కను చూస్తూ.. ఆ చేయిని తన గుండెలకు ఆన్చుకున్నాడు. చాలు! ఈ తృప్తి చాలు!! అన్నట్లు నీలాంబ తల్పంలో వణికి కదలాడింది. కళ్లు ధారాపాతంగా వర్షించసాగాయి. తిరిగి పురనివాసానికి వచ్చేశాడు. ఐదారురోజులు రాజనగరిలో తిరిగాడు. నారాంబక్క మందిరం దగ్గర్లో తచ్చాడాడు. బావగారి ఆంతరంగిక మందిరం ముందు కాసేపు నిలిచి తిరిగి వచ్చేశాడు. అక్క ముద్దలు తినిపిస్తుంటే మంచినీరు తాగి ఆమెకేదో చెప్పబోయాడు.
మిత్రులు గుర్తొచ్చారు. ఎవరితోనైనా చెప్పుకొంటే బావుండును. ఎవరెవరు ఎక్కడున్నారో.. అతని అంతరంగంలో ప్రశ్న.. లలితాంబను ఎలా తనదానిగా చేసుకోవాలి? వివాహమా.. వేశ్యా బంధమా?? పదిరోజులుగా అదే ప్రశ్న.. తిప్పితిప్పి చాకిరేవు పెడుతున్నది. మరోసారి సిగ్గు విడిచి కాకతిని అడిగిచూశాడు. ఊహు. అదే నిశ్శబ్దం.. బెట్టు వీడటంలేదు. అంతటి తీవ్ర సమస్యను లలితాంబ లిప్తలకాలంలో ఛేదించింది. “పౌర్ణమినాడు.. అంటే రేపుకాక ఎల్లుండి. మా నివాసంలో మనకు భోగినీ పండుగ. మీ అక్క కోరుకున్నది అదే! అదే నాభాగ్యం. అంతేచాలు నాకు మామ!!”.
మాట్లాడటానికి ఏమీ లేదు. మౌనమే మంచి ప్రసార సాధానం. ఆరోజు.. పౌర్ణమిరోజు రాత్రి నీలాంబ వేశ్యాగృహం ప్రధానద్వారం పక్కగా ఆమె నివాస మందిరంలోకి మెట్లదారి ద్వారా లోపలికి వెళ్లాడు. శయనమందిరలోకి వెళ్లకుండా వసారాలో నిలబడ్డాడు లలిత కోసం. అనుకున్నట్లుగానే వేశ్యాగృహం సహాయకులకు అప్పగించి పైకి వచ్చింది లలితాంబ. ఇద్దరి చూపులు మత్తుగా, సిగ్గుగా కలుసుకుంటూ.. విడిపోతూ రెపరెపలాడుతున్నాయి. అతని చేయి సున్నితంగా అందుకుని లోపలికి నడిచింది లలితాంబ.. ఏడడుగులు! లోపలికి నడిచి ఇద్దరూ ఒకేసారి చూశారు దిగ్భ్రాంతిగా! మహాదేవుల వర్ణచిత్రం స్థానంలో జాయపుని వర్ణచిత్రం! అదికాదు వాళ్లను దిగ్భ్రాంతి పరచింది. పైనుంచి వేలాడుతున్న పూచికపుల్ల. నీలాంబ శరీరం.. ఉరివేసుకున్న నీలాంబ శరీరం!! “నాకెంతో తృప్తిగా ఉంది.. తమ్ముడూ..”
శయనతల్పంపైన ఓ పాతచీరపై రాసి ఉంది అడ్డదిడ్డంగా.. ఆమె ఆఖరిదశ బతుకులా..
అంతఃపుర మందిరం.
లోపలికి ప్రవేశించాడు జాయచోడుడు. మందిరంలో కొత్త మనుషులను చూసి చటుక్కున అడుగు వెనక్కువేశాడు. ఆయనను విభ్రమంగా చూస్తూ ఆ కొత్తవాళ్లు లేచి నిలుచున్నారు.
“రా.. రా.. జాయా! లోపలికి రా! అందరూ మన కుటుంబసభ్యులే..” ఆ మాట అన్నది మధ్యగా కూర్చున్నవారు.. చక్రవర్తి గణపతిదేవుడు. ఆయన దగ్గరగా తల్పంపై సోమలదేవి పడుకుని ఉండగా, తల్లి కాళ్ల వద్ద గణపాంబ. పక్కనున్న పల్యంకంపై నారాంబ. ఆమెను పరివేష్టించి కూర్చున్న మరో ఇద్దరు. యువ నవ్వనులు!!
వాళ్లు కళ్లు పెద్దవి చేసి అబ్బురంగా జాయచోడుణ్ని చూస్తుంటే.. ఆయన కూడా ఒకింత చకితమై వాళ్లను చూస్తున్నాడు.“అడుగుతున్నారుగా.. ఆ మహావ్యక్తి ఈయనే! జాయచోడదేవుడు. మీ మేనమామ.” అన్నాడు చక్రవర్తి.వాళ్లు చూపు మరల్చడం లేదు. ఆయన జాయచోడుణ్ని ఉద్దేశించి.. “జాయా.. వీళ్లు ఎవరో గుర్తుపట్టావా!? కాకతీయ సామ్రాజ్యవారసులు. మనిద్దరికీ భావి పాలకులు. వీడు నీ పెద్ద మేనల్లుడు రుద్రదేవుడు. వీడు నీ చిన్నమేనల్లుడు మురారిదేవుడు..” అతని వంక పిల్లలు.. పిల్లలవంక జాయచోడుడు.. అలా తేరపారి చూస్తుండిపోయారు.
లోలోపల కాకతి అంటున్నది.. ‘మన పిల్లలు.. ముగ్గురు!’
జాయచోడుడు అన్నాడు.. “అయితే నాకు ఇద్దరు అమ్మలు.. ముగ్గురు పిల్లలు!”. అంతా ఆత్మీయతతో ఫెళ్లున నవ్వారు. ఆ నవ్వులమధ్య గణపతిదేవుడు అన్నాడు.. “గణపాంబ వివాహం నిశ్చయించినట్లు నీకు వర్తమానం పంపినట్లే వీళ్లకూ వర్తమానం పంపాము. నిన్ను వెంటనే బయల్దేరి రావాల్సిందిగా కోరాము. వీళ్లను వెంటనే రావద్దని కోరాము..” “అదేమిటి.. ఎందుకు రావద్దన్నారు?”.
“భరించలేని వీళ్ల అల్లరి.. పెళ్లి పనులకు ఆటంకపరుస్తుందని రావద్దన్నాను. కానీ, వీళ్లు నా మాట పెడచెవిన పెట్టి పరుగులు పెట్టి మరీ వచ్చారు..” ముగ్గురూ తండ్రిని ‘వెవ్వేవ్వే!’ అని వెక్కిరించి.. “మా అక్క పెళ్లికి మేము వస్తాం. వద్దనడానికి మీరెవ్వరూ..” అంటూ బయటికి పరిగెత్తారు.
నవ్వుల సునామీ.. ఆ మందిరాన్ని చుట్టేసి ఊపేసింది. జాయచోడుడు ‘గణపాంబపెళ్లి చేస్తే’ అనే ఆలోచన గణపతిదేవుని ముందుంచి వెలనాడు వెళ్లిపోయాడప్పుడు. గణపతిదేవుడు గణపాంబ పెళ్లి గురించి చెల్లెళ్లను, మేనత్తలను, జ్ఞాతులను, ఇతర దగ్గరి బంధువులైన రాజవంశజులను సంప్రదించాడు. అన్నివిధాలుగా చర్చించిన పిమ్మట ధరణికోట వంశీయుడు, మూడవ భీమరాజు కొడుకు బేతరాజును గణపాంబకు తగిన వరుడిగా నిర్ణయించి.. సంప్రదించగా వాళ్లూ ఆనందంగా అంగీకరించారు. జాయచోడుణ్ని తిరిగి అనుమకొండకు రప్పించాడు. గణపాంబ వివాహవేడుకలకు ప్రధాన కార్యనిర్వాహకత్వం కట్టబెట్టాడు. కొత్తతరం కాకతీయ యువతను తీర్చిదిద్దే బాధ్యతను కూడా జాయచోడుని భుజస్కంధాలపైనే ఉంచాడు. “మా జీవితకాలం పడమటి వైపు ఒరుగుతున్నది జాయా! ఆంధ్రసామ్రాజ్య స్థాపన చేయగలనో లేదోనన్న భయం బాధిస్తున్నది. ఆంధ్ర సామ్రాజ్య స్థాపన వేగవంతం చెయ్యాలి. మేము ఆ దిశగా పూర్తిగా దృష్టి పెట్టాలి. తమరు గ్రంథరచనతోపాటు మన కుటుంబ భవిష్యత్తు దిశగా దృష్టి పెట్టాలని మా కోరిక!”. “తప్పకుండా.. అది నా బాధ్యత బావగారు..”
ఆ సంఘటన మరునాడే లలితాంబ కళామందిరానికి వచ్చింది. వెళ్లి దూరంగా కొందరు మహిళా కవయిత్రుల మధ్య కూర్చుంది. అందరూ అవాక్కయ్యారు. ఎక్కడో ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.. విడిపోయాయి. ఇద్దరి మధ్య పూర్తి నిశ్శబ్దం! అదొక నృత్త విన్యాసం.. దాని అర్థం ఆ పరమేష్టికే తెలియాలి!!
(సశేషం)
మా జీవితకాలం పడమటి వైపు ఒరుగుతున్నది జాయా! ఆంధ్రసామ్రాజ్య స్థాపన చేయగలనో లేదోనన్న భయంబాధిస్తున్నది. ఆంధ్ర సామ్రాజ్య స్థాపన వేగవంతం చెయ్యాలి. మేము ఆ దిశగా పూర్తిగా దృష్టి పెట్టాలి.
-మత్తి భానుమూర్తి
99893 71284