‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
కళ.. “రోజు మారిపోద్ది.. రోజు మారిపోతే లోకం మారిపోద్ది. నిన్న సూసినవన్నీ కలలైపోతాయి. కతలన్నీ గుండెల్లో జ్ఞాపకాలు అయిపోతాయి. కట్టె కాలినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ కాలిపోతాయి..”చదువురాని అప్పన్న తాత, కవిలా మాట్లాడుతుంటే కళ్లార్పకుండా చూస్తున్నాడు ఆదిత్య. తాత ఎప్పుడూ తాత్వికుడుగానే కనిపిస్తాడు ఆదిత్యకి. తాత ఊరు విడిచిరాడు. నాన్న పట్నం వదిలిరాలేడు. తాతతో గడిపే ఆ కొద్దిరోజులను, దొరికే ఆ కొద్ది సెలవులను జ్ఞాపకాలుగా.. జ్ఞానంగా దాచుకుంటాడు ఆదిత్య.
“నిజంరా సిన్నా! నా సిన్నప్పుడుకీ, ఇప్పుడికీ ఎంత మారిపోయింది జాతర! నెలముందు నుండే పనులు మొదలెట్టీవోళ్లు. డబ్బుల ఊసే లేదసలు. తలో సెయ్యేస్తే అదే పోగయ్యేది. మనూరి పండగ మనం సేసుకోవాలంతే! మాకు-పిల్లలకైతే సందడే అసలు. మూడు రోజులూ ఎవుడుకీ బడీ లేదు. పనీ లేదు. పులి వాలకాలోళ్లు వస్తుంటే, ఆ సప్పుడుకి సెట్లెక్కి సూసివోళ్లం. రాత్రల్లా కూకోని తోలుబొమ్మలాటలు సూసివోళ్లం. తప్పెడుగుళ్లు, పగటేషాలు, పందిరి పాటలు, హరికథలు.. ఇలా పూటకో పోగ్రాముండేది. సాయంకాలం నాలుగింటికి జాతరకెళ్తే, మళ్లీ తెల్లారే తిరిగి ఇంటికిరాడం. జాతరలోనే తిండి, పోగ్రామేదో సూసుకుని ఏ ఏలకో అక్కడే పడుకొనివోళ్లం!”
తాత మాటల ప్రవాహానికి అడ్డు రాకూడదని మౌనంగా వింటున్నాడు ఆదిత్య.
“పోనీ నా సిన్నప్పుడంటే ఎప్పుడి కథో! మీ నాన్న సిన్నప్పుడు కూడా జాతర కళగానే ఉండీది. హరిశ్చంద్ర నాటకవేస్తే తెల్లార్లూ ఎవుడూ కదిలీవాడు కాదు. పందిరి పాటలూ, తోలుబొమ్మలు తగ్గిపోనాయి గానీ, హరికథలు, బుర్రకథలూ ఉండీవి. వాలకోలు ఉండీవి. ఇప్పుడన్నీ పోనాయి. ఒక సాంఘిక డ్రామా ఏసి కానిచ్చేస్తునారు” అప్పన్న తాత మాటలోని వేగం, ఉత్సాహం, జాతరలో జానపద కళలు తగ్గినట్లే తగ్గిపోయాయి. “మొదటిసారి పులివేషం ఎప్పుడేశావు తాత. నా వయసుంటుందా అప్పుడు..?” అడిగాడు ఆదిత్య.
“నీకన్నా కొంచెం పెద్దే, పద్దెనిమిదో ఏడు అప్పుడు” మళ్లీ అలలా ఎగసింది తాత మాట.
“ఏడాదిపాటు నేర్చుకున్నాం. మా గురువు పొలాల గట్లెంబడ పరుగెత్తించీవోడు. మమ్మల్ని రోజుకి వంద దండీలు కొట్టమనీవాడు. ‘అడుగులోన, సేతి ఊపులోన, మెడ నులుపులోన అన్నింటా పులి అవుపించాలి’ అనీవోడు. జాతర రోజు వరకూ అలాగే సాధన సేసీవోళ్లం. నాకు బాగ గుర్తుంది, జాతరరోజు నేను, నా ఈడోల్లు జాతరెనకాల షెడ్డులో నిల్చొని రంగు పూయించుకొంటున్నాము. ఒకరిద్దరిని ఒగ్గీసి, మిగిలినందరికీ అదే మొదటిసారి ఏషం కట్టడం. అప్పుడు సన్యాసన్న వచ్చాడక్కడికి. సన్యాసన్న పందిరిపాట పాడీవోడు, కత్తిసాము సేసీవోడు, సదువుకున్నోడు. అప్పట్లోనే రంగూనెల్లొచ్చాడు. అందుకే సన్యాసన్న అంటే ఊళ్లో అందరికీ గౌరవం. ఊళ్లో ఏ ఉత్సవమైనా సన్యాసన్న కత్తి తిప్పి, ఒక ఉడామేసి కొబ్బరికాయ కొడితేనే మొదలయ్యేది. అలాటి సన్యాసన్న మా దగ్గరికి వచ్చి ఓ మాటన్నాడు..
‘అబ్బాయిలూ! పులి వాలకోలు అంటే మూడడుగుల స్టెప్పో, డప్పుల చప్పుడో కాదర్రా.. నైవేద్యం! వేదం తెలిసినోడు మంత్రం చదువుతాడు, అది తెలీనోడికీ దేవుడున్నాడు, పాడే పాటలోనో, ఆడే ఆటలోనో ఉన్నాడు. ఒకరిద్దరికి శాస్త్రమైతే, జనానికి జానపదం, మన పదం. అడుగు దేవుడికోసం అనుకొండి, మనసు మండపమనుకొండి, సత్తువంతా భక్తిగా చేసి ఆడండి’.. అని. సన్యాసన్న మాటలు మంత్రంలా పనిసేశాయి మామీద. దేవుడు ఆడిస్తున్నట్లే ఆడామారోజు. అది మొదలు గౌరీ పున్నమైనా, రాములోరి జాతరైనా, అమ్మోరి పండగైనా ఏషం కట్టకుండా ఉన్నది లేదు, మాకది బక్తి, దేవుడికి సేసే పూజ, ఊరి పండుగకి మేవిచ్చే కానుక” క్షణమాగి.. మళ్లీ అన్నాడు, “అన్నీ మారిపోనాయిప్పుడు”మాట నిర్వేదమయింది. ఉత్సాహం ఉద్వేగమయింది. రెండు నిముషాలపాటు ఏం మాట్లాడాలో తెలియలేదు ఆదిత్యకి. తర్వాత అడిగాడు.. “ఇప్పుడు వేషం కట్టచ్చుగా తాత?”అని. “ఇప్పుడా..?”
కథ..
“ఇప్పుడా..?” అన్నాడు ప్రెసిడెంట్, ఎదురుగా కూర్చున్న అప్పన్న మాటలు వింటూ.బల్లపై అప్పన్న పక్కనే ఆదిత్యా కూర్చున్నాడు.
“పులుముకొని పాతికేళ్లు అయినాది, ముడుకుల్లో సత్తువ పోతాంది. వచ్చేఏడికి ఉంటానో, పోతానో తెల్దు, ఈ ఏడికి ఏషం కట్టనీ” అన్నాడు అప్పన్న. ముసలోడు, తెలిసిన మనిషి, చిన్నప్పటి నుండి చూసిన మనిషి, పదేపదే అదేమాట చెబుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ప్రెసిడెంటుకి.
“అప్పన్నా! పులివేషాలు ఎవరూ చూడట్లేదిప్పుడు. పాత కళలకు కాలం కాదిది. ఈఏడు సాంఘిక డ్రామా కూడా వద్దన్నారు కమిటీ సభ్యులు. టీవీ యాంకరుని, కమీడియన్లను పిలిచి ప్రోగ్రాం పెట్టిస్తున్నాం. కాలంతోపాటూ మనమూ మారాలి కదా” అన్నాడు నచ్చచెబుతున్నట్లుగా.
“కాలంకి అన్నీ ఒగ్గేస్తే, నాగావళికి ఒగ్గేసినట్లే, కొట్టుకుపోతాయి అన్నీ. మీలాటి బాబులే సూసుకోవాలి, ఏది ఒగ్గేయాలో, ఏది ఒగ్గకూడదో” అన్నాడు అప్పన్న.
“ఒకరి చేతిలోని పనా అప్పన్న! కమిటీలో పది మందున్నారు, మా తలమీద ఇంక స్పాన్సర్లు. ఇచ్చినోడు నచ్చిన ప్రోగ్రాం పెట్టమంటాడు. ఖర్చులా ఏటికేడూ పెరిగిపోతున్నాయి. గతేడాది ఫ్రీగా దొరికింది, ఈ ఏడు కొనుక్కోవల్సి వస్తుంది. కేవలం మంచినీళ్లకే ఈ ఏడాది పాతికవేలు అయింది. ఇంక లైట్లు, సౌండ్లు, శాలువలు, సన్మానాలు అంటూ చేతి ఖర్చుకీ తగిలేస్తుంది. పది ప్రోగ్రాములు పెట్టి వందమందిని పోషించే అవకాశం లేదిప్పుడు” అన్నాడు ప్రెసిడెంట్.
“కళతోటి పోషణ రోజులు పోనాయిలే బాబు! ఆడినోళ్లు, పాడినోళ్లు రెండు రకాలోల్లే మిగిలారు దేశంలో. డబ్బు అవసరం లేదనుకుని కళతోటి ఉన్నోళ్లు, డబ్బు రాదని తెలిసినా కళతోటే ఉన్నోళ్లు. ఆ రెండో కోవకే సెల్లుతానేమో నేనున్నూ! ఏషం కట్టి మనవడికి సూపించాలనుంది.. అంతే! నాకు డబ్బులొద్దు, టేజీ వద్దు, టేజీ ముందు, జనం మధ్యల ఓ పావుగంట ఏషం కట్టి ఆడటానికి అవకాశమివ్వు.. సాలు!” అన్నాడు అప్పన్న.
అవునన్నట్లు తలూపాడు ఆదిత్య. ఇద్దరినీ తేరిపారా చూశాడు ప్రెసిడెంట్. ఇంకో గంట కూర్చోబెట్టి మాట్లాడినా.. ‘సరే’ అన్నమాట దగ్గరకే తీసుకొస్తారని అర్థమయింది. అందుకే.. “సరే” అన్నాడు.
“రేపు సాయంత్రం ఆరు నుండి ఆరుంపావు! టీవీ వాళ్లు స్టేజ్ ఎక్కడానికి అరగంట ముందు” అన్నాడు ప్రెసిడెంట్.“చాలు!” అనుకుంటూ లేచాడు అప్పన్న. అప్పన్నతోపాటే ఆదిత్య. ఒకే వయసు వాళ్లలా ఉత్సాహంగా అడుగు బయటపెట్టిన వాళ్లకి.. “మరి డప్పుల సంగతి ఏంటి?” అని ప్రెసిడెంట్ అడుగుతున్న ప్రశ్న వినిపించింది.
“అది నేను సూసుకుంటానులే!” అన్నాడు అప్పన్న, ఉత్సాహంగా. అన్నాడే గానీ, బయటకొచ్చి ఆలోచిస్తే ఏం చెయ్యాలో తెలియలేదు. ‘రేపు రవణగాడి ట్రూపు ఉత్సవ విగ్రహాల ఎనకాల ఉంటారు, ఆళ్లు రాలేరు. లక్ష్మణ, ఆడి బ్యాచు టవునులో పెళ్లికెళ్తున్నారు, ఆళ్లూ రాలేరు’ అనుకుంటూ ఇంటికొచ్చాక, పక్కూరి ప్రసాదుకి ఫోను కలిపాడు. రెండు అడిగాడు.
“రెండు వేలా!” అంటూ నిలువునా నీరుగారిపోయాడు అప్పన్న.
“రంగుడబ్బాలు కొనుక్కోవాలి, ఏసిన రంగు వదిలించుకోవడానికి డీజిలు కొనుక్కోవాలి, ఒంటికి రంగులేసినోడికీ ఎంతో కొంత ఇచ్చుకోవాలి, ఇది తేలేలా లేదు సిన్నా!” అన్నాడు అప్పన్న.
“ప్రెసిడెంట్ తెలివైనోడు, కాదనకుండా దెబ్బనప్పించేండు” అన్నాడు మళ్లీ.
“నాన్నను అడుగుదామా?” అన్నాడు ఆదిత్య.
“సీరేస్తాడు ఇద్దర్నీ కలిపి. సంపాదించక్కర్లేదు, కానీ తగలేసే పనులేవీ సెయ్యకని ముందే సెప్పాడు” అన్నాడు అప్పన్న.
“సరే! ఓ పనిచేద్దాం తాత, ముందు మిగతా ఏర్పాట్లన్నీ చూసుకుందాం. కావల్సినవన్నీ కొందాం. డప్పులకు ఇంకేమైనా దారుందేమో వెతుకుదాం, రేపు సాయంత్రం వరకూ టైమ్ ఉంది కదా!” అన్నాడు ఆదిత్య.
ఆ సాయంత్రం తాతా మనవళ్లు ఇద్దరూ కావల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వచ్చారు. తెలిసిన పెయింటర్ ఒకరిని రంగు వేయడానికి బెత్తాయించుకున్నారు, రంగులెలా వెయ్యాలో అప్పన్న చెప్పాడు. ఇంటికొచ్చాక పెట్టెలో ఉన్న పాత పులిచెవుల టోపీని, రబ్బరు తోకను చూపిస్తూ అన్నాడు అప్పన్న..
“ఓసారి రంగేస్తే మునుపటి మెరుపొస్తాదీటికి” అని.
రాత్రికి అప్పన్న మరికొన్ని జాతర కథలు చెప్పాడు, ధ్యాసగా విన్నాడు ఆదిత్య. తాత కథల మాటున, రేపటి సంగతేమిటన్న చింత, అంతా సవ్యంగా జరిగితే బావుణ్ను అన్న ఆత్రుతా కనిపించాయి ఆదిత్యకి. తెల్లారింది. స్నానాలు చేసుకుని గుడికి వెళ్లారు ఇద్దరూ. రాములవారి కల్యాణం చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా పోటెత్తారు. మంత్రాలు, మంగళవాయిద్యాలు మైకులో మారుమోగుతున్నాయి. గుడి ప్రాంగణమంతా పండగ వాతావరణంతో కనిపిస్తున్నది. ఆభరణాలతో, అలంకరణలతో అందంగా ఉన్నారు సీతారాములు. దర్శనమయ్యాక మేళం వాయిస్తున్న వాళ్లను చూపిస్తూ అన్నాడు అప్పన్న..
“అదుగో! ఆ డోలు వాయిస్తున్నోడు రవణగాడు. ఆ పక్కన మృదంగంతోటి ఉన్నోడు సూరి. సన్నాయి వాయిస్తున్నోడు శ్యామలు. పులేషానికి మృదంగం, సన్నాయి అక్కర్లేదు. డోలుతోపాటూ డప్పు, బిగేలు ఉంటే సరిపోద్ది. అవన్నీ ఆలదగ్గర ఉంటాయి. మనకైతే ముందు వాయించినోళ్లే కావాలి” అని.
తాత ఆలోచనలన్నీ అక్కడే ఉన్నాయి అనిపించింది ఆదిత్యకి. ఇప్పుడైతే ఇంక టైమ్ కూడా దగ్గర పడుతుంది, నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాడు.
“తాతా! నిన్న సామానుకి పోను, మన దగ్గర వెయ్యి రూపాయిల వరకూ ఉంది. ఊరెళ్లాక, నాన్నని ఎలాగోలా ఒప్పించి డబ్బు పంపిస్తాను, అందాకా వెయ్యి ఎవరిదగ్గరైనా అప్పు తీసుకో! నువ్వు వెయ్యి అప్పడిగితే లేదనేవాళ్లు ఉండరు. ఆ ప్రసాదుకి ఫోన్ చేసి సాయంత్రం రమ్మని చెప్పు” అన్నాడు.
నవ్వాడు అప్పన్న.
“మా సత్తెం మేష్టారుకి నాటకాల పిచ్చి. గతేడాది వారాలకి సొంత డబ్బులతో సాంఘికడ్రామా వేసి, అప్పులపాలయిపోనాడు. ఈయేడు నా వంతులాగుంది” అన్నాడు.
“డబ్బులు సర్దుబాటు చేద్దాంలే తాతా! ముందు వాళ్లను సాయంత్రం రమ్మని చెప్పు” అన్నాడు ఆదిత్య.
సరేనని ఫోను కలిపాడు అప్పన్న. కలవలేదు. భోజనాలయ్యాక మళ్లీ చేద్దామనుకుని, ఈ లోపు తెలిసినవాళ్ల దగ్గర వెయ్యి రూపాయిలు అప్పు అడిగి తీసుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక మళ్లీ ప్రసాదుకి ఫోన్ చేశాడు, మళ్లీ కలవలేదు. ఈసారి అప్పన్నకి, ఆదిత్యకి ఇద్దరికీ టెన్షన్ మొదలయింది. మూడు గంటలకు పెయింటర్ని రమ్మన్నాడు, కొత్త కుర్రాడు, పులివేషాలకు వేసిన అలవాటు లేదు. రంగు వేయడానికి, ఆరడానికి కనీసం రెండు, రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇప్పుడింక కదిలే పరిస్థితీ లేదు అప్పన్నకి.
“నేను వెళ్లి చూసుకొస్తాను” అన్నాడు ఆదిత్య, బయటకు నడుస్తూ.
“ఊర్లో దిగ్గానే ప్రసాదు ఇల్లెక్కడని అడుగు, ఎవుడైనా సెప్తాడు” అన్నాడు అప్పన్న, తలుపు మూసిన చప్పుడు గుండె దడలా వినబడుతుంటే!
మరికాసేపటికి మూసిన తలుపులు తెరుచుకుంటూ పెయింటర్ వచ్చాడు. అప్పన్నను చూస్తూ అన్నాడు..
“చమటలు పడుతుంటే రంగు వెయ్యలేము, నిలవదు” అని.
ఒళ్లంతా తువ్వాలుతో తుడుచుకొని, లంగోటా పైకెత్తి కట్టి, ఫ్యానుకింద నిటారుగా నిల్చున్నాడు అప్పన్న. తనకు రెండువైపులా చెరో అడుగు దూరంలో కుర్చీలను ఉంచి, వాటిపై అరచేతులు ఆన్చాడు. ఒంటికి రంగు పడుతుంటే, మనసు మాట్లాడుతున్నది. ఒకవైపు పాతికేళ్ల తర్వాత రంగులు ఏసుకుంటున్నందుకు ఉద్వేగంగా ఉంటే, మరోవైపు ఇంత కష్టమా అనిపిస్తున్నది.
‘నాకు తెలిసిన ఆట నేను ఆడటం ఇంత కష్టమా! ఆటలోని అందమే కనిపించట్లేదా ఎవులికి? అంత పాతబడి పోనాదా? పాతబడి పోడానికి వస్తువేమీ కాదుగా! ఏ రంగులొచ్చాయి దేశంలోనికి, మా రంగులు సెరిపేయడానికి! ఆడితే రూపాయి వస్తాదన్న రోజులనుండి, ఆడాలంటే రూపాయి పెట్టుకోవాలి అన్న రోజులకొచ్చేసినాం. డబ్బుల ఊసూ కాదిది. డబ్బులు రాకుంటే రాలేదు, జాతరకి కళే లేకుండా పోనాది. ఏదో గాలి! అన్నీ నిముషాల మీద అయిపోవాలి, సూసిందేది మళ్లీ కళ్లకి అవుపించకూడదు, ఇదే వరస అన్నింటా! ఇది కళకు నప్పుద్దా లేదా అని ఎవుడాలోసిస్తున్నాడు, కళనే నమ్ముకున్నోళ్లు ఏమైపోతున్నారు అని ఎవులడుగుతున్నారు?’ దడేలున చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకుంది, మనసు మూసుకుంది. ఎదురుగా ఆదిత్య, అలసిపోతూ చెప్తున్నాడు..
“ప్రసాదు, వాళ్ల బాజావాళ్లూ ఊళ్లో లేరు తాత. రేపటికి గాని రారంట”
ఏం మాట్లాడలేదు అప్పన్న, తీక్షణంగా చూస్తున్నాడు. రంగు ఆరుతున్నది. ఒంటినుండి నీరురాకుండా పైనున్న ఫ్యాను ఆపుతున్నది. కంటి నుండి నీరు రాకుండా ఏం ఆపగలదు??
గతి.. రాత్రి ఏడుగంటలయింది. జాతర కోలాహలంగా ఉంది. ఎల్ఈడీ లైటింగ్ సెట్ల మధ్య ప్రాంగణమంతా వెలుగులతో నిండిపోయింది. సౌండ్ బాక్సుల నుండి డీజే మిక్సింగ్ పాటలు మంచి బీటులో వస్తున్నాయి. స్వీట్ కార్న్, ఐస్ క్రీము, టీ-కాఫీ స్టాళ్లు చెల్లాచెదురుగా జాతరంతా ఉన్నాయి. బొమ్మల షాపులు, మినీ ఎగ్జిబిషన్‌ను తలపించే రంగుల రాట్నాలు మిగతా స్థలమంతా నిండిపోయాయి. పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దలు కబుర్లు చెప్పుకొంటున్నారు, స్టేజ్ ముందు జనం నిండుగా ఉన్నారు. స్టేజ్ మీదున్న ప్రెసిడెంట్ దేనికో కంగారు పడుతున్నాడు. కమీడియన్ల బండి లేటయింది, మరో రెండు గంటలకు గానీ రారంట.. ప్రెసిడెంట్ కంగారుకి కారణం! అప్పన్న రాలేదన్న ధ్యాస లేదతనికి, వస్తానన్నాడన్న గుర్తుకూడా లేదు.
“ఈయాల పోగ్రాం పెంటయిపోయేలాగుంది” స్టేజ్ ముందున్న జనం లోనుండి ఎవడో అన్నాడు.
మెల్లగా ముసలం మొదలయింది, గోలగా మారుతున్నది. ఏం చేయాలో తెలియలేదు ప్రెసిడెంట్‌కి, పాటలు ఆపమన్నాడు.. మాట్లాడడానికి.
“ప్రేక్షక మహాసయులకు విజ్ఞప్తి” అంటూ మొదలుపెట్టాడు ప్రెసిడెంట్. గోల ఆగింది, జనం చూస్తున్నారు ఏం చెప్తాడా అని. ఒక్కసారిగా వచ్చిన నిశ్శబ్దానికి ఏం మాట్లాడాలో ప్రెసిడెంటుకీ తెలియలేదు. ఇంతలో.. గాలితో శ్రుతి కలుపుతూ మెల్లగా బిగేలు చప్పుడు వినిపించింది ఎక్కడినుండో. అరనిముషానికి డప్పు, డోలు తోడయ్యాయి. ఆ చప్పుడు, ముందు విన్న డీజే పాటలలో లేని సహజమైన ఊపుని తెస్తున్నది. జనం దృష్టి అటుమళ్లింది, ఎగబడి చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, విజిళ్ల్లేస్తున్నారు. ఏం జరుగుతున్నదో ప్రెసిడెంటుకి అర్థంకాలేదు, ముందేముందో కనిపించలేదు. నెమ్మదిగా, జనం మధ్యనుండి దారి ఏర్పడింది. అప్పుడు కనిపించింది ప్రెసిడెంటుకి.. పులి.
పులి ఊగుతున్నది, గెంతుతున్నది, నాట్యం చేస్తున్నది. జనం మొత్తాన్నీ తనవైపుకి తిప్పుకొన్నది. రవణ, అతని తోటి వాయిద్యాల వాళ్లూ పులితో పాటే వస్తున్నారు, పక్కనే ఆదిత్య కూడా ఉన్నాడు. ప్రెసిడెంట్ ఎప్పుడు స్టేజ్ దిగాడో, అప్పన్న పులి, వాయిద్యాల వాళ్లూ ఎప్పుడు స్టేజ్ ఎక్కారో ఎవరికీ గుర్తులేదు. అందరికీ గుర్తున్నదంతా ఆ రాత్రి, ఆ రెండు గంటలు అప్పన్న తనకు తెలిసిన కళతో అంతమంది జనానికి ఎంతలా వినోదాన్ని పంచాడో! పిల్లలు ఆ పులినాట్యం చూసి ఎంతలా కేరింతలు కొట్టారో! కుర్రాళ్లు ఈలలెలా వేశారో!
తనకు తెలిసిన కళలో లీనమయిపోయాడు అప్పన్న. ‘కళ, దేవుడికిచ్చే నైవేద్యం!’ ఇదే మాట తిరుగుతున్నది మనసులో. డప్పుల చప్పుడుకి పాదం కదులుతున్నది, చేయి గాల్లోకి లేస్తున్నది, తల ఊగుతున్నది. సత్తువతగ్గి, పాదం తడబడేంతవరకూ అలానే ఆడాడు. ముందున్న జనంలోనూ దైవమే కనిపించింది అప్పన్నకి. మనసంతా ఆనందంతో నిండిపోయింది. స్టేజ్ దిగి, ప్రెసిడెంట్ చేతులు పట్టుకొని ఏడ్చేశాడు. ఆదిత్య దగ్గరకు వచ్చి, అప్పన్న చేయి పట్టుకుని ముందుకు తీసుకువెళ్లాడు.
“అప్పన్నా! అదరగొట్టావు! జాతరకు మునుపటి కళతెచ్చావు” అన్నాడు జనం లోనుండీ ఎవరో పెద్దాయన.
“మాకూ నేర్పించు అప్పన్న తాతా” అన్నాడు ఎవరో కుర్రాడు.
“నాకూ నేర్పించు తాతా! వచ్చే ఏడాది నేనూ పులివేషమేస్తాను” అన్నాడు ఆదిత్య. కళ్ల నీళ్లు తుడుచుకుంటూ, ఆదిత్యను చూసి నవ్వి సరేనన్నాడు అప్పన్న. ఇవన్నీ లీలగా వినిపిస్తూనే ఉన్నాయి ప్రెసిడెంటుకి. అప్పన్న తర్వాత స్టేజ్ దిగిన రవణ, డోలు భుజానికి తగిలించుకొని, నేరుగా ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చి అన్నాడు..
“మా అప్పన్నమావకు తెగ మొహమాటం ప్రెసిడెంటుగారూ! నిన్నటి నుండి బాజాలకోసం ఇబ్బంది పడుతున్నాడు. ఉత్సవం ఆరుకి ముగిసిపోద్దని, తర్వాత మేం ఖాళీయేనని మీరయినా చెప్పాల్సింది. మీరు అవకాశమిచ్చారనే కళ్లంట నీళ్లు తిప్పుకొన్నాడు, ఇంకాస్త సపోర్టు చేసుంటే.. నెత్తిన పెట్టుకునేవాడు” అని.
పొరలేవో తొలగిపోయినట్లు అనిపించింది ప్రెసిడెంటుకి. సమాధానమేం చెప్పలేదు. నేరుగా స్టేజ్ మీదకు వెళ్లి మైక్ అందుకున్నాడు.
“జాతరని ఇంత విజయవంతం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు, ఇంతలా మనల్ని అలరింపజేసిన అప్పన్న గారికి ఏ విధంగా కృతజ్ఞత తెలియజేయాలో నాకు తెలియట్లేదు, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అయితే అది చెప్పేముందు మీ అందరికీ మరో విషయం చెబుదామనుకుంటున్నాను..
గత ఏడాది ఇదే జాతరలో శనగకాయలు అమ్మినవాళ్లు, ఈ ఏడాది స్వీట్‌కార్న్ అమ్ముతున్నారు, గత ఏడాది టీ అమ్మినవాళ్లు, అదే టీ ఈసారి ‘టీ స్టాల్’ బోర్డు కింద అమ్ముతున్నారు. మరి గత ఏడాది ఇదే స్టేజ్ మీద నాటకాలేసిన వాళ్లు ఈసారి ఏమయ్యారు? ఈసారి మనం వాళ్లను పిలవలేదు, వాళ్లు ఏ చీకటిలో ఉండిపోయారో మనకు తెలీదు. ఉపాధి మారినంత వేగంగా కళ మారదు కదా! అసలు మారాల్సిన అవసరమే లేదుకదా! ప్రతి విషయంలో మార్పు కావాలన్న తొందరలో మనమే, మనదైనదేదో వదిలేసుకుంటున్నాము. అలరించే శక్తి ఉన్న కళలని, ఆదరించడానికి మనమెందుకు ప్రయత్నించట్లేదు. ఈ రోజు ఒక అప్పన్న చీకట్లోంచి బయటకొస్తే జాతరకెంత వెలుగొచ్చిందో చూశాం మనం. అదే మరో నాటకమో, హరికథో, తప్పెడుగుళ్లో తోడైతే ఇంకెంత అందంగా ఉంటుంది! అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను.
ఇకపై జాతరంటే మన కళలే ఉంటాయి, మన కళాకారులే ఉంటారు. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అప్పన్న గారికి పంచాయితీ తరుఫున ప్రతినెలా రెండువేలు భత్యం ఇద్దామని నిర్ణయించుకున్నాను, వచ్చే ఏడాదికి ఆసక్తి ఉన్న ఓ అరడజను కుర్రాళ్లను పులివేషం వేయించేలా సన్నద్ధం చేసే బాధ్యతను అతనికి అప్పగిస్తున్నాను. అలానే సత్యం మాష్టారుగారికి ఒక నాటకం ట్రూపుని తయారుచేసే బాధ్యతను ఒప్పజెబుతున్నాను. దానికి అయ్యే ఖర్చునీ పంచాయితీ పెట్టుకుంటుంది. జాతరకు మనమిచ్చే విరాళాలను, మన కళలకు మనమిచ్చే ప్రోత్సాహకాలుగా ఉపయోగిద్దాం. ఈ చైతన్యం ఇక్కడితో ఆగిపోకూడదు. మనదైనదేదీ వదులుకోవద్దు. మన నిర్ణయం, మన గ్రామం మరో పదిమందికి ప్రేరణగా నిలవాలి”
ప్రెసిడెంట్ మాటలకు, జాతరంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. ఆ చప్పుడు, ఓ కొత్త సంస్కృతిని స్వాగతిస్తున్నంత అందంగా వినిపిస్తున్నది.
ప్రపంచీకరణలో భాగంగా మారిన సామాజిక అభిరుచులు, వాటిని మన సంస్కృతికి, కళలకూ ఆపాదించుకున్న తీరు.. దానివల్ల కళాకారులకు జరుగుతున్న నష్టం. అందులో ఉన్న ఆర్థిక, ఉపాధి కోణాలను తడిమే కథ.. జాతర! ఏమీ ఆశించకుండా, జానపద కళలను మాత్రమే ప్రేమించే ఓ బీద కళాకారుడి ఔన్నత్యాన్ని గొప్పగా చూపించారు రచయిత పొన్నాడ వెంకట అన్నాజీరావు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల గ్రామం. బీటెక్ చదివారు. ప్రస్తుతం కేంద్ర కస్టమ్స్ పన్నులశాఖలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన రాసిన మొదటి కథ.. శూన్యం. 2016లో హైదరాబాద్‌లోని ఏజీ కార్యాలయం నిర్వహించిన రంజని నందివాడ భీమారావు కథానికల పోటీలో ప్రత్యేక బహుమతిని గెలుచుకుంది. 2018లో తెలుగు వెలుగు మాస పత్రికలో ప్రచురితమైన ‘ఎర్ర ధోవతి’ కథ.. రచయితకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘జాతర’.. ఈయన రాసిన ఐదో కథ. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీలో రూ.రెండువేల బహుమతికి ఎంపికైంది.
– పొన్నాడ వెంకట అన్నాజీరావు
94411 21556