పెట్టుబడి మార్గాలు ఇన్వెస్టర్లను తెగ ఆకర్షిస్తుంటాయి. లాభాల పంట ఎంతో దూరంలో లేదని ఊరిస్తుంటాయి. దీంతో సరైన లక్ష్యాన్నినిర్దేశించుకోకుండా ఉత్సాహంగా ఈ దారిలోకి ప్రవేశిస్తారు. అయితే,ముందుకు వెళ్లే కొద్దీ ఆ దారి ఇరుకవు తుంది. ఊహించని మలుపులు వస్తాయి.ముందుకు వెళ్లడమే కాదు… వెనక్కి రావడమూ కుదరదు. ఎగ్జిట్ తెలియకుండా ఎంట్రీ అయిన ఇన్వెస్టర్లు మార్గం మధ్యలోనే చేష్టలుడిగి పోవడం ఖాయం. ఈ క్రమంలో సన్నకారు పెట్టుబడి దారులు తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. భారీగా ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మాత్రం చేతులు కాల్చుకోక తప్పదు.
డబ్బులోకంలో సమీకరణాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఈ సూత్రాలు పాటించని వ్యక్తులు ఎంతటి సంపన్నులైనా.. ‘చివరకు మిగిలేది ఇంతే..’ అని నిస్తేజంలో కూరుకుపోవడం ఖాయం. నిత్య దరిద్రులుగా మారిన ఆగర్భ శ్రీమంతులు ఎందరో! దీనికి కారణం సరైన పెట్టుబడి పెట్టకపోవడమే! సకాలంలో స్పందించకపోవడమే!! ఆదాయం బాగా ఉందని ఎడాపెడా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే… వడ్డీ పైసలు రాకపోగా.. అసలు కూడా మనల్ని చూసి నొసలు చిట్లిస్తుంది. హయ్యర్ ఇన్కమ్ గ్రూపులో ప్రధానంగా రెండు కేటగిరీలు ఉంటాయి. లక్షల్లో జీతాలు పొందే వ్యక్తులు ఒకరకం. వ్యాపారాల్లో కోట్లు గడించేవాళ్లు మరో రకం. ఈ వ్యాపారుల్లో మళ్లీ రెండు రకాలు. ఒకరు ఆర్గనైజ్డ్ సెక్టార్లో నిలదొక్కుకున్న వాళ్లయితే, మరొకరు అనార్గనైజ్డ్ సెక్టార్లో నక్కతోక తొక్కి అదృష్టాన్ని అందుకున్నవాళ్లు. అందరూ సంపన్నులే! కానీ, వీళ్లు తీసుకునే కొన్ని నిర్ణయాలు వీళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికర అంశం.
ఉద్యోగులు సేఫ్
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కుదురుకున్నవాళ్లు ఏడాదికి అరకోటికి పైగా ప్యాకేజీ అందుకుంటున్నారు. ఆదాయపు పన్ను పోనూ నెలకు రూ.మూడు లక్షల వరకు జీతాలు అందుకుంటున్న వాళ్లూ ఉన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవాళ్లయితే రాబోయే తరాలకూ సరిపడా కూడబెట్టే అవకాశం వీరికి ఉంది. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అని తలపోసినా.. నట్టుపడేదేం ఉండదు. ప్రతినెలా మూల వేతనంలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంటుంది. నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.40 వేలు పొదుపు చేస్తున్నాడన్న మాటే కదా! పైగా పని చేస్తున్న సంస్థ తరఫున ఉద్యోగి కుటుంబానికి ఆరోగ్యబీమా, ఉద్యోగికి జీవిత బీమా అదనపు రక్షణనిస్తాయి. బోనస్లనీ, ప్రోత్సాహకాలనీ ఏటా ఒక నెల వేతనం అదనంగా అందే అవకాశాలు ఉన్నాయి. ఇంత ఇన్కమింగ్ సోర్స్ ఉన్నప్పుడు ధారాళంగా ఖర్చు పెట్టుకున్నా.. పోయేదేం లేదు! అలాగని వీళ్లు ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పడం కాదు! ఇల్లు, ప్లాటు, ఎస్ఐపీ, మ్యూచువల్ఫండ్స్ ఇలా ఎందులో అయినా కుదురుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ నష్టపోయినా.. ఆ నష్టాల్లోంచి బయటపడే దాకా ఆ ఉద్యోగి జీవితంలో ఆటుపోట్లు పెద్దగా ఉండవనే చెప్పాలి!
వ్యాపారులకే రిస్క్
పెట్టుబడుల విషయంలో ఓనమాలు తెలియని ఉద్యోగులు తెలివిగా వ్యవహరిస్తే… తలపండిన వ్యాపారులు తప్పులో కాలేస్తారు. ఆర్గనైజ్డ్ వ్యాపారాల్లో ఉన్నవాళ్లు కొంతవరకు ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అనార్గనైజ్డ్ వ్యాపారులు మాత్రం పెద్ద తప్పులు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ దందాలో లక్షల్లో డబ్బు చూస్తుంటారు. నడమంత్రపు సిరి కారణంగా డబ్బు విలువను అర్థం చేసుకోరు. ‘చేతిలో ఉన్నాయి కదా!’ అని నానా ప్రయోగాలకూ పూనుకొంటారు. అవగాహన లేని వ్యాపారం కత్తి మీద సామే! అలాగని ఉన్న సొత్తంతా ఒకేచోట ఇన్వెస్ట్ చేయడం మరింత ప్రమాదం. ఒక్కసారిగా ఆ రంగం కుదేలైతే అంతకాలం పడిన శ్రమంతా మట్టిపాలు అవుతుంది. కోట్ల వ్యాపారం కొలాప్స్ అయితే.. మళ్లీ ఫుట్పాత్ నుంచి జర్నీ మొదలుపెట్టే దుస్థితి దాపురిస్తుంది. ఖర్చుల విషయంలో ‘ఎంత చెట్టుకు అంత గాలి’ సూత్రం ఎలా వర్తిస్తుందో.. పెట్టుబడుల విషయంలో ‘ఎంత చెట్టుకు అంత చేటు’ అతికినట్టు సరిపోతుంది. ఆనూపానూ తెలియకుండా వ్యాపారంలో కోట్లు కుమ్మరిస్తే.మీ సంపద వృక్షం కూకటివేళ్లతో కూలిపోయే ప్రమాదం ఉంది.
ఇలా చేయండి
అనార్గనైజ్డ్ రంగంలో ఉన్న వ్యాపారులు ప్రాథమిక సూత్రాలు తప్పకుండా పాటించాలి. ఆ తర్వాతే మరేదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి.
-ఎం. రాం ప్రసాద్సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in