చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : ఒకనాటి ప్రత్యూషవేళ.. వ్యాయామశాలకు వెళ్లాడు జాయపుడు. ఆశ్చర్యం! అక్కడ గణపతిదేవుడు మరొకరితో కుస్తీపట్లు పోటాపోటీగా పడుతున్నాడు. ఆ వ్యక్తికున్న కేశాలంకరణ వల్ల మహిళ అని తెలుస్తోంది. దగ్గరికి వెళితే అబ్బురంగా.. అతడు.. కాదుకాదు ఆమె! రుద్రమదేవి!! కూతురి యుద్ధవిద్యా ప్రావీణ్యం చూసి.. ఆమె గురించి కొండంత తృప్తితో చెప్పాడు గణపతిదేవుడు. జాయచోడుడు విభ్రమంగా చూస్తున్నాడామెను.. కాకతీయ సామ్రాజ్య భవిష్యత్ స్వరూపాన్ని!!
ఎంత హాయిగా ఉంది! పదహారేళ్ల అచ్చమైన పదహారణాల ఆడపిల్ల.. స్నిగ్ధ గంభీరం!!
పకపకా నవ్వింది.. అప్పుడే విచ్చుకున్న కాకతీయ నవపారిజతం!.. వసంత మనోజ్ఞం!!
అదే మగాడి దుస్తుల్లో మగాడిగా పరిచయం చేస్తే వికారంగా ఉంది. జాయచోడుని మనసు సంతోషంతో పరిమళించింది. మహిళ వ్యాయామ దుస్తుల్లో తండ్రితో తలపడి.. అలవోకగా ఆకాశానికి కాలెత్తి ధైర్యంగా విసురుతున్న రుద్రమదేవి! తండ్రిని పట్టి కదలకుండా బంధించి విసిరేసిన లాఘవం.. బరిసెను పట్టి ఎత్తినతీరు.. ఖడ్గాన్ని తిప్పి పరీక్షించిన అవగాహన.. ఓహో.. అద్భుతం! తప్పకుండా మహా యుద్ధయోధ!!
ఆమెనే చూస్తున్నారు ఇద్దరూ.. తండ్రి, మేనమామ. పులకింతగా!
‘ప్రజలు కూడా ఆమెను బుద్ధిమంతురాలైన యువతిగా, గణపాంబలాగే మంచి కాకతీయ ఆడపడచుగా చూస్తున్నారు’.. అని శుక్ర చెప్పాడు. సందేహంలేదు పుట్టినింటికి, మెట్టినింటికీ గొప్ప పేరుప్రఖ్యాతులుతేగలదు. తథ్యం.
ఇది తథ్యం!
“మామా!”
మురిసిపోయాడు.
“రుద్రమా.. హబ్బ! ఎంత హాయిగా ఉన్నావూ.. ఆ మగ దుస్తుల్లో ఎంత క్లేశం అనుభవించావో కదా!”
పకపకా నవ్వింది.. అప్పుడే విచ్చుకున్న యువ యుద్ధ మందారం!!
“మామా.. యుద్ధవిద్యల్లో మీ ప్రావీణ్యం అద్భుతమట. యుద్ధరంగంలో మీ యుక్తులు, తంత్రాలు అమోఘమట. ఘడియఘడియకూ వ్యూహం మార్చి లిప్తకాలంలో శత్రువు శిరస్సును తెంచి కందుకక్రీడ ఆడగలరట. తండ్రిగారికి మీరు ఖడ్గం అందించినప్పటి గగుర్పాటు ఆయన నాకు రోజూ చెబుతూనే ఉన్నారు. ఇక యుద్ధ జంతువులకు మీ శిక్షణ అద్భుతమని దక్షిణావర్తంలోని రాజులందరూ చెప్పుకొంటారట..”
ఆమె మాటలను తండ్రి ఆస్వాదిస్తుండగా మధ్యలో అడ్డుపడ్డాడు జాయచోడుడు.
“ఆ.. ఆపాపు! నా శిక్షణాపటిమ కేవలం జంతువుల మీదే..”
ముగ్గురూ ఘొల్లున నవ్వారు.
“చిన్నతల్లీ!!”
“ఆ..”
“హమ్మయ్య.. పలికావు! నేను గణపాంబను ‘పెద్దతల్లి’ అని పిలుస్తాను. అందుచేత నువ్వు చిన్నతల్లివి అన్నమాట..”
“ఉన్నమాటేగా మామా! తండ్రిగారి తర్వాత మీరే నాకు ఆరాధ్యులు!!”
జాయచోడుడు పులకించకుండా ఉంటాడా..?! గణపతిదేవుడు మురిసిపోవడంలో ఆశ్చర్యం ఏముంది!??
అయితే రుద్రమదేవి గురించిన ప్రకటన ప్రజల్లో కలిగించిన స్పందన చూసి జాయచోడుడు మళ్లా నోరు వెళ్లబెట్టాడు. ఇది మరొక మలుపు తీసుకుంది.
“అప్పుడు అబ్బాయి అని ప్రకటించారు.. అంటే మోసం చేశారు. ఇప్పటివరకూ అబ్బాయిగానే ఉంచారు. అదెలా సాధ్యం!? ఇప్పుడు అమ్మాయి అంటున్నారు. ఇదేం పద్ధతి?”
“అబ్బాయి కాస్తా అమ్మాయిగా మారిపోయాడు. మరైతే ఇక వారసుడు మురారిదేవుడే!!”
“అంతే అంతే! అతను మహావీరుడు జాయపచోడ దేవులవారి మేనల్లుడు. మేనమామ పోలికలు వస్తాయి కదా!”
“అవునవును. నా అభిప్రాయమూ అదే. మురారిదేవుడు జాయచోడుల వారి అందచందాలు పుణికి పుచ్చుకున్నాడు. ఆ యుద్ధ చాతుర్యం వస్తే ఇక కాకతీయరాజ్యానికి తిరుగుండదు..”
రానురానూ పురవాసులలో మురారిపట్ల వ్యామోహం పెరుగుతోంది.
“మా యువరాజు మురారిదేవుడు” అని జనులు చెప్పుకొంటున్నారు.
అంతఃపురంలో అంతా ఆనందమే కానీ.. మురారి యుద్ధ నైపుణ్యత, మంత్రాంగ విశారద విస్తృతం కావాలి. అప్పుడే గణపతిదేవుని వారసుడిగా మహోన్నతస్థానం అధిరోహించగలడు. ఇది తండ్రి, మేనమామల సంయుక్త ఆలోచన.
“నాయన గారూ.. నా విద్యాభ్యాసం పూర్తయిందని గురుదేవులు చెప్పారు. తదుపరి తమరి ఆదేశం ఏమిటో..” అడిగాడు మురారి, తండ్రితో జాయచోడుని సమక్షంలో.
ఇప్పటికే చదువు ధ్యాస వదిలేసి రాజనగరి, అనుమకొండ వీధులు అన్నీ చక్కబెట్టేస్తున్నాడు. గణపతిదేవుడు కొడుకు బుగ్గలు పుణికాడు మురిపెంగా. నారాంబ అక్క అయితే కొడుకుని చూసుకుని తమ్ముణ్ని పట్టించుకోవడం లేదు. కొత్త కొడుకు.. పాత తమ్ముడు!!
“నీ మేనల్లుడికి మూతిమీద మీసాలు మొలుస్తున్నై. చూడు.. ఏమైనా ప్రయోజకుడు అయ్యాడేమో..” అన్నాడు.
“వీడి సంగతి నాకు వదిలేయండి బావగారు..” అన్నాడు జాయచోడుడు.
మురారి, రుద్రమదేవి ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండటం చూసి.. జాయచోడుడు ముచ్చటపడగా నారాంబ ఇద్దరికీ దిష్టి తీసింది. గణపతిదేవుడు అన్నాడు మురిపెంగా..
“మీ అక్కాతమ్ముళ్లను మళ్లీ చూస్తున్నట్లుగా ఉంది..”
అంతా ప్రశాంతంగా ఉన్నట్లు భావించినా.. కాలపురుషుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాడు కదా!
రాజధాని అనుమకొండ మరోమారు పెద్ద కుదుపునకు గురయ్యింది.
పట్టమహిషి సోమలదేవి స్వర్గస్తురాలయ్యింది. దీర్ఘకాలంగా అంతుచిక్కని జబ్బుతో బాధపడుతూ తల్పానికే అంకితమైన సోమల.. గతరాత్రి మరణించింది. రాజ్యమంతా దుఃఖసాగరంలో మునిగింది. స్తబ్ధుగా ఉండిపోయాడు గణపతిదేవుడు. ఎక్కువ దుఃఖపడింది నారాంబ. ఆమెకు దాదాపు మూడేళ్లుగా సపర్యలు చేస్తోంది.
ఆమె దహన సంస్కారాలకు అనుమకొండ అంతా తరలివచ్చింది. దేవగిరి నుండి ఆమె అన్న సింఘణదేవ మహారాజు ఇతర బంధుమిత్ర సపరివారంగా తరలివచ్చారు. పుణ్యస్త్రీగా చనిపోయిన సోమలకు ఎన్నో శాంతి హోమాలు నిర్వహించారు శైవగోళకీ మతాచార్యులు. పండితులకు, బ్రాహ్మణులకు వేలవేల గోవులను, భూములను దానమిచ్చాడు గణపతిదేవుడు. ఆయన పక్కన నిలుచుని సహకరించాడు జాయచోడుడు.
ఈ క్రతువులలో ఆయనకు ఓ వింతదృశ్యం పొడగట్టింది.
మురారి వెంట ఎప్పుడూ పెద్ద మిత్రబృందం కనిపిస్తోంది. మురారి అందరినీ హత్తుకుంటూ, కలుపుగోలుగా ముచ్చటిస్తూ ఆకర్షిస్తున్నాడు. బృందం కూడా దూకుడుగా ఉంది.
రుద్రమ ఎప్పుడూ సౌమ్యంగా హుందాగా కనిపిస్తోంది. ఆమెను చూసి ముచ్చటపడతాడు జాయచోడుడు. ఏ ఇంటికి వెళుతుందో.. తప్పకుండా మెట్టినింటికి, పుట్టినింటికి ప్రఖ్యాతి తెస్తుంది. ధరణికోట వంశీయుల కోడలిగా వెళ్లిన గణపాంబ కూడా భర్తకు చేదోడువాదోడుగా రాణిస్తున్నట్లు వార్తలు వస్తుండటం విని.. అంతా ఆనందంగా ఉన్నారు. అయితే సోమల పుణ్య
తిథుల కార్యక్రమాలలో రుద్రమదేవి వెంట కనిపించిన వ్యక్తిని చూసి జాయచోడుడు నిర్ఘాంతపోయాడు.
ప్రసాదిత్య నాయకుడు!! సోమల చనిపోయాక కూతురు పక్కన చేరాడన్నమాట.
ఆంధ్ర సామ్రాజ్య స్థాపనా దీక్షలో గణపతిదేవుడు తీవ్ర సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకు ఆయన అసిధారావ్రతం చేస్తున్నాడు. అవన్నీ తన పరిధిలోని అంశాలు కావని జాయచోడుని ఆభిప్రాయం.
చెయ్యమంటే యుద్ధం. కాదంటే నాట్యం. అంతవరకే పరిమితం. కాకపోతే ఇప్పుడు పిల్లల సంగతి నెత్తిన పెట్టాడు. పెద్దబిడ్డ గణపాంబ అత్తారింటికి వెళ్లిపోగా.. రెండవబిడ్డ రుద్రమ, ఏకైక కుమారుడు మురారి. ఇద్దరూ కళ్లముందు కన్నుల పండువగా తిరుగాడుతున్నారు. రుద్రమదేవికి పెళ్లిచేసి పంపిస్తే.. ఏకైక కుమారుడు మురారి కాకతీయ సింహాసనాన్ని అధిరోహిస్తాడు.
గణపాంబ యుద్ధవిద్యల పట్ల అంత ఆసక్తి కనబరచలేదు. అందుకే ఆమెను ప్రాథమిక విద్య అనంతరం పెద్దపెద్ద అనుభవజ్ఞులైన ప్రధానులు, యుద్ధ తంత్రజ్ఞులతో, ధర్మశాస్త్ర పండితులతో రాజప్రాసాదంలోనే రాజ్యపాలన, వ్యవస్థల నిర్వహణలో శిక్షణ ఇప్పించాడు.
రుద్రమ చదువుకున్న త్రిపురాంతక గోళకీమఠ విద్యాకేంద్రం యుద్ధవిద్యలలో ప్రఖ్యాత కేంద్రం. ప్రాథమిక విద్య అనంతరం రుద్రమ యుద్ధవిద్యల్లో ఆసక్తి, ప్రతిభ కూడా చూపిందని గురువుల నివేదన.
మురారి.. గణపాంబ వివాహానికి హాజరయ్యేనాటికి ప్రాథమిక విద్య విసురునాడులోని సంస్కృత ఘటికలో పూర్తి చేసుకున్నాడు.
గణపాంబ వివాహం, సోమల మరణానంతరం రుద్రమను దగ్గరే ఉంచుకున్నాడు గణపతిదేవుడు. కొంకణభట్టు వద్ద రాజనీతిశాస్ర్తాల్లో శిక్షణ పొందుతోంది. మురారిని యుద్ధవిద్యలలో ప్రత్యేకశిక్షణ కోసం రుద్రమ చదివిన త్రిపురాంతక గోళకీమఠ విద్యాకేంద్రానికి పంపాడు జాయచోడుడు.
కాకతీయ రాజ్యం, సమాజం ఇప్పుడొక సంధికాలంలో ఉంది.
అనుభవ కాకతీయానికి, యువ కాకతీయానికి మధ్య ఈ సంధికాలంలో గణపతిదేవుడు.. జాయచోడుడు, తిక్కనామాత్యుల నేతృత్వంలో పూర్తి తెలుగు సామ్రాజ్య స్థాపన కోసం విశేష పోరాటం చేస్తున్నాడు.
విష్ణుకుండినుల కాలంలో వెలుగొంది నేడు శిథిలమైన పానుగల్లు కళాక్షేత్రాన్ని తిరిగి నిర్మించాడు జాయచోడుడు. పీఠభూమి రాజ్యాల కళాకారులకు అది గొప్ప కళాక్షేత్రమయ్యింది.
కొంతకాలం దేశసంచారం చేయాలని ఆయన మనసులో బలంగా ఉంది. అనుమకొండ కళామందిరంలో కూడా ఈ చర్చ వచ్చింది.
“అఖండ భారతమంతా తిరుగుతూ నాట్యకళాప్రదర్శనలతో తెలుగువారి ఖ్యాతిని చాటుతున్న నాట్యబృందాలు, వాగ్గేయకారులు మీ వెలనాడువారే ప్రభూ.. మీ కూసెనపూండి కళాక్షేత్రం ప్రభావంతో ఎందరెందరో కవులు, వాగ్గేయకారులు, నాట్యాచార్యులు, యక్షగాన నిపుణులు తయారయ్యారు. ఏ రాజ్యమైనా వెళ్లండి. ఏ రాజాస్థానమైనా సందర్శించండి. వెలనాడు కవో పండితుడో నాట్యకారుడో సంగీతజ్ఞుడో వాగ్గేయకారుడో అప్పటికే అక్కడ గండపెండేరం తొడిగించుకుని ఉన్నతాసంపై కూర్చుని ఉంటాడు..”
ఇలాంటి పండితుల వ్యాఖ్యలు విన్నప్పుడు జాయచోడుడు ఉబ్బితబ్బిబ్బు అవుతాడు.
ప్రాంతీయభాషలు స్పష్టమయ్యాక ఆయా రాజ్యాలను కూడా.. తమిళ రాజ్యాలు, కన్నడ రాజ్యాలు, మలయాళ రాజ్యాలు, ఓడ్ర రాజ్యాలు, మరాఠా రాజ్యాలు.. అంటున్నారు. ఆయా స్థానికభాషలలో లిఖిత సాహిత్యం, ప్రదర్శన సాహిత్యం, నాట్య, సంగీత, వాద్య సంప్రదాయాలు కూడా కొత్త సృజనాత్మక కెరటాలతో సాంస్కృతిక సముద్రాల్లా ఎగసిపడుతున్నాయి. వాటన్నిటినీ పరిశీలించాలని జాయచోడుని ఉబలాటం.
ఓ పూర్తిస్థాయి నాట్యమేళంతో దక్షిణరాజ్యయాత్రకు కదిలాడు. రాజలిపికారుడు నందియార్యుడు, కూసెనపూండి కళాక్షేత్రం నిర్వాహకుడు పరాశరుడు, అనుమకొండ కళాప్రాంగణ నిర్వాహకుడు రాజనాయకుడు, సంగీత విద్వాంసుడు కాసెప్ప, డప్పు వాద్యకారుడు సూరప్పడు, మార్దంగికుడు వెంకటప్ప, కాహళి వాద్యకారుడు కొమ్మన, పల్లకి బంటులు, విక్రమ తదితర వాహన జంతువులు, వాటి నిర్వాహకులు.. ఆ నాట్యమేళంలో ఉన్నారు.
మేళం వివిధ రాజ్యాలగుండా పోయిపోయి చేరరాజ్యం దక్షిణ సముద్ర అంచులవరకూ వెళ్లింది. అక్కడి నుండి కదిలి దేవాలయాలు, శిల్ప, నాట్య, సంగీత సంప్రదాయాలు చూస్తూ, పోల్చి, బేరీజు వేసుకుంటూ చేర రాజ్యాలు, తమిళ రాజ్యాల్లోని రాజాస్థానాలు, దేవాలయ స్థానాపతులు బలవంతం చేస్తే నృత్తం ప్రదర్శిస్తున్నాడు.
కానీ, ఎందుకో మనసు లగ్నం కావడం లేదు. ఏదో చేశాడు అంటే చేశాడు!
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284