హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిపడా ఎరువులు అంద క రైతులు దుకాణాల ఎదుట చెప్పులు వరుసలో పెట్టాల్సి వస్తున్నదని, యూరి యా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సక్రమంగా ఎరువులు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పాత పింఛన్ వర్తింప జేయాలి: శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ-2003 టీచర్లకు పాత పింఛన్ వర్తింపజేయాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి శాసనమండలిలో డిమాండ్ చేశారు. బుధవారం మండలిలో మాట్లాడిన ఆయన ఇప్పటికే ఈ విషయంపై కేంద్రం ఓ నోటిఫికేషన్ విడుదల చేసిందని, పాత పింఛన్ కు అర్హులని స్పష్టంచేసిందని ప్రస్తావించారు. అయినా ఈ ఉత్తర్వులను అమలుచేయకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇటీవల హైకోర్టు సైతం పాత పింఛన్‌ను వర్తింపజేయాలని తీర్పు ఇచ్చినా ఈ తీర్పు అమలుకావడంలేదని వాపోయారు. రెండేండ్లుగా రిటైర్ అయిన వారికి బకాయిలు, బెనిఫిట్లు అందడంలేదని తెలిపారు. సకాలంలో వైద్యం అందక అనేక మంది మరణించినా ప్రభుత్వం స్పందించకపోవడంపై విచారం వ్యక్తంచేశారు.
ఫసల్ బీమా అమలు చేయాలి: మల్క కొమురయ్య
రాష్ట్రంలో రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలను తక్షణమే అందించాలని, ఫసల్ బీమా యోజనను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. అదేవిధంగా పంటల బీమా, సులభ రుణ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేశారు. శాసనమండలిలో బుధవారం జీరో అవర్‌లో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ప్రస్తావించారు.