‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో విశిష్ట బహుమతి పొందిన కథ.
వాషింగ్టన్ డిసి. అమెరికా రాజధాని. ఆ నగరంలోని ఒక ప్రముఖ హోటల్ ప్రాంగణంలోకి భారత రాయబారి కార్యాలయంవారి వాహనం వచ్చి ఆగింది. హోటల్ గేటు ముందున్న సూట్ వేసుకున్న వ్యక్తి కారు తలుపు తెరిచాడు. కారులోంచి దిగాడు ఒక 30 ఏళ్ల యువకుడు. తెల్లగా, పొడుగ్గా ఉన్నాడు. హోటల్ రిసెప్షన్ వైపు నడిచి, తన ఐడెంటిటీ కార్డు చూపించాడు.
“డాక్టర్ హాసన్ మంగళగిరి, ఐఎఫ్ఎస్. పోస్టెడ్ యాజ్ థర్డ్ సెక్రటరీ. ఇండియన్ ఎంబసీ”..
ఆ రిసెప్షనిస్ట్ ఆ కార్డులోని ఆ వివరాలు పైకి చదువుతూ, నమస్కారం చేసి..
“హేవ్ ఎ సీట్ సార్. యువర్ రూమ్ విల్ బి రెడీ ఇన్ ఎ మూమెంట్” అన్నది. హాసన్ ఆ మాటలకు చిన్నగా నవ్వి..
“మై అపార్ట్మెంట్ ఈజ్ నాట్ యెట్ రెడీ. ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ డేస్” అన్నాడు.
పావుగంట తర్వాత ఆ హోటల్ అటెండెంట్ హాసన్ లగేజీతో రూమ్‌కు వెళ్లే లిఫ్ట్ ఎక్కాడు. హాసన్ అతన్ని అనుసరించాడు. తర్వాతి రోజు ఉదయం ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటున్నాడు హాసన్. తలుపు కొట్టిన చప్పుడు.
“ఎస్ ప్లీజ్” అన్నాడు. పద్దెనిమిదేళ్ల యువకుడు. మల్లెపూవులాంటి తెల్లని యూనిఫామ్. నెత్తికి క్యాప్. నల్లటి ఆ శరీరం బాగా కసరత్తు చేసినట్టుగా ఉంది. నవ్వుతూ వచ్చిన ఆ వ్యక్తి..
“రూమ్ సర్వీస్ సార్! బాత్రూమ్ క్లీనింగ్” అన్నాడు.. సెల్యూట్ చేసి.ల్యాప్‌టాప్ లోంచి తలెత్తి చూసిన హాసన్..
“వెయిట్ ఫర్ ఎ మూమెంట్” అన్నాడు. ఆ వ్యక్తి అలాగే నిలబడిపోయి చూస్తూ..
“షల్ ఐ కమ్ లేటర్ సార్” అంటూ వెనక్కి తిరిగాడు.
“ప్లీజ్ బి సీటెడ్ ఫర్ ఎ వైల్” అంటూ సోఫా చూపించి.. అతని చేతిలోని బకెట్టు, ఇతర సామగ్రి తీసుకొని తనే వాష్ రూమ్‌లోకి వెళ్లబోతుంటే..
“నో సార్.. నో సార్! ఐ విల్ లూజ్ మై జాబ్ సార్. ప్లీజ్.. ప్లీజ్..” అంటూ వెంటపడ్డాడు ఆ రూమ్ బాయ్.
హాసన్ ఆ హోటల్ రూమ్ తలుపు వేసి..
“నో ప్రాబ్లమ్. ఐ విల్ నాట్ రివీల్. దిస్ ఈజ్ ఆల్రెడీ వాష్డ్ ప్రోపర్లీ. ఎనీహౌ.. ఐ విల్ డూ ఇట్” అంటూ చాలా శుభ్రంగా ఉన్న ఆ టాయిలెట్‌ను మళ్లీ కడిగి.. ఆ సామగ్రిని అతనికి అందించాడు.
ఆ బ్లాక్ అమెరికన్ విస్మయంగా, ఆశ్చర్యంగా హాసన్ వంక చూస్తూ ఉండిపోయాడు.రెండో రోజూ అదే తంతు. తనని టాయిలెట్ కడగనివ్వకపోవడం, తనే కడుక్కోవడం, తనను బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టడం ఆ యువకుడికి ఆశ్చర్యం కలిగించింది. మూడో రోజు ఇక అడిగేశాడు.
“యూ ఆర్ అమేజింగ్ సార్. వాట్ మేడ్ యూ టు డూ దిస్ జాబ్. ది జాబ్ ఈజ్ ఎలోకేటెడ్ టు మి. యూ ఆర్ అవర్ ఫారెన్ డెలిగేట్ అండ్ హై ప్రొఫైల్ డిప్లమేట్” అంటూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు. హాసన్ ఆ మాటలకు నవ్వి, ఊరుకున్నాడు.
సివిల్ సర్వీస్ పరీక్షలో సఫలీకృతులైన నాలుగు వందల మందిలో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఎంచుకొన్న బృందంలో హాసన్ ఒకడు. మూడు నెలల శిక్షణలో తమకు న్యాయ నిర్వహణ, ఆర్థిక స్థితిగతులు, క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ వంటి వాటి మీద శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా తాను రాసిన జనరల్ రైటింగ్.. అంటే ప్రతిరోజూ జరిగిన అనుభవాలు, తేదీల వారీగా రాసిన డైరీ చూస్తూ కూర్చున్నాడు. తమ శిక్షణలో భాగంగా వివిధ రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంతాలకు గ్రామ సందర్శన పేరిట తీసుకువెళ్లేవారు. అయితే తాను తన బృందంతో మహారాష్ట్రలోని కొన్ని మారుమూల పల్లెలను సందర్శించాడు. ఇంకా మేన్యువల్ స్కావెంజరింగ్.. అంటే పొట్టకూటి కోసం సఫాయి, మురుగు పనులు చేస్తున్నవారి జీవితాలను పరిశీలించాడు.
సఫాయి కర్మచారుల జీవనం గురించి సివిల్స్ ఇంటర్వ్యూలో అడిగారు. కారణం తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఆ విషయం మీద ఒక ప్రాజెక్ట్ చేశాడు. ఆరోజు ఇంటర్వ్యూలో తనేం చెప్పాడు?
‘సాటి మనుషుల మలాన్ని ఎత్తి జీవించే దుస్థితిలో ఈ దేశంలో ఇంకా లక్షలాది మంది బతుకుతున్నారు. అయితే సఫాయి కర్మచారులను పనిలో పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పొడి పాయిఖానాల నిషేధ చట్టం 1993లో అమలులోకి వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా నేటికీ లక్షలాది మంది పారిశుధ్య కార్మికులు డ్రైనేజీ గుంతల్లోకి దిగి శుభ్రం చేస్తున్నారు. చేతులతో మానవ మలాన్ని ఎత్తి గంపల్లో మోసుకొంటూ వెళ్లే అమానుషమైన పనిలో మగ్గుతున్నారు’.. అలా తన పీజీ థీసిస్ గురించి క్లుప్తంగా చెప్పాడు హాసన్.
అంతలో ఇంటర్వ్యూలో తనను ప్రశ్నించే వ్యక్తి..
“మీకు ఈ హాసన్ అనే పేరు ఎలా వచ్చింది?” అని అడిగాడు హఠాత్తుగా..
“యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన్ని పడుకోబెట్టేందుకు ఏ స్థలమూ లేదు. మరియమ్మ ఆయనను పశువుల పాకలో, పశువుల తొట్టెలో పడుకోబెట్టింది. అలాగే ఆయన పుట్టినరోజు డిసెంబర్ 25నే పుట్టిన నన్ను.. ఒక ఖబ్రస్థాన్‌లో పడుకోబెట్టారు” అన్నాడు హాసన్.
ఆ మాటలకు ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు ఆశ్చర్యంగా చూశారు. మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు.
“మా నాన్నకు ఆ సమయంలోనే, మా అమ్మ డెలివరీ అవడానికి రెండు నెలల ముందు ఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మినిస్ట్రీలో గుమస్తా ఉద్యోగం వచ్చింది. నిండు చూలాలైన మా అమ్మను తీసుకొని ఆయన ఢిల్లీ వచ్చేశారు. కొన్నిరోజులు హోటల్లో ఉన్నారు. ఇళ్ల కోసం వేట మొదలుపెట్టారు. అయితే ఆయనకు ఇల్లు ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదు”.
ఆ కమిటీలో ఆ ప్రశ్న అడిగిన సభ్యుడు..
“ఎందుకు ఇల్లు ఇవ్వలేదు?” అని మళ్లీ అడిగాడు.
“రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల జాబితాలో మాది 51వ కులం. పాకి, తోటి, మోటి. ఈ జాబితాలో మొదటిది. అలా ఇళ్ల కోసం తిరిగిన మా నాన్న విసిగి వేసారుతున్న సమయంలో.. పాత ఢిల్లీలోని ఖబ్రస్థాన్ ప్రాంతంలో ఓ ఇల్లు దొరికింది”.
“అంటే.. యు మీన్ బరియల్ గ్రౌండ్” అన్నాడు ఇంకో సభ్యుడు.
“అవును సార్. ఢిల్లీలోని ఆ ఖబ్రస్థాన్ ప్రాంతంలో 500 ఏళ్ల క్రితం నుంచి ఉన్న గోరీలు ఉన్నాయి. వందలాది సమాధుల మధ్య ఇల్లు నిర్మించుకున్నారు. వాటిని పగలగొట్టడం ఇష్టంలేక అలా ఉంచేసి ఇల్లు కట్టుకొన్నారు. అంచేత కొన్ని ఇళ్లల్లో కూడా సమాధులు కనిపిస్తాయి. అలా మాకు ఇచ్చిన ఆ అద్దె ఇంట్లో మా బెడ్ రూమ్‌లోనూ ఒక సమాధి ఉంది. అక్కడే నా జననం. అలా జీసస్ క్రైస్ట్ పుట్టుక పశువుల పాకలో జరిగితే, నా పుట్టుక సమాధుల స్థలంలో జరిగింది. ఎవరూ ఇల్లు ఇవ్వడానికి నిరాకరించగా.. పెద్ద మనసుతో ఇల్లు ఇచ్చిన ఆయన పేరే మా నాన్న నాకు పెట్టాడు. అదే ‘హాసన్’ పేరు వెనక కథ. పాతికేళ్లుగా మేము ఆ ఇంట్లోనే మకాం. జీవం ఉన్న మనుషులు.. జీవం లేని మనుషులతో సహవాసం” అంటూ చెప్పడం ముగించాడు.
“మీ పీహెచ్డీ థీసిస్‌లో సబ్జెక్ట్ ఏంటి?” అని అడిగాడు కమిటీ చైర్మన్.
“బ్యాట్.. అంటే గబ్బిలాలు” అన్నాడు హాసన్.
“పులులు, సింహాలు, ఏనుగులు.. ఇలా ఆకర్షణీయమైన జంతువుల గురించి పరిశోధనలు చేస్తారు. మరి గబ్బిలాల గురించి ఎందుకు అధ్యయనం చేశారు?” అన్నాడు చైర్మన్. హాసన్ చెప్పడం మొదలుపెట్టాడు.
“నా రీసెర్చ్ టాపిక్.. కన్జర్వేషన్, ప్రయారిటైజేషన్ ఆఫ్ సౌత్ ఆసియా బ్యాట్స్. మనం గబ్బిలాలను అసహ్యించుకుంటాం. ఇంటి పరిసరాల్లో కనిపిస్తే వాటిని పారదోలుతాం. సినిమాల్లో వాటిని రక్తం తాగే డ్రాకులాలుగా చిత్రీకరిస్తారు. అయితే ప్రపంచం మొత్తానికి 1460 గబ్బిల ప్రజాతులు ఉంటే.. వాటిలో మూడు రకాలు మాత్రమే రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఈ మూడు దక్షిణ అమెరికా, అమెజాన్ అడవుల్లో మాత్రమే ఉన్నాయి. ఇవి మినహా మిగతావన్నీ పళ్లూ, కీటకాలు తినేవే! పంట పొలాలను నాశనం చేసే పురుగులను గబ్బిలాలు తిని పంటలకు మేలు చేస్తాయి. గబ్బిలాల సంఖ్య పెరిగితే పంటలకు పురుగు మందుల వాడకం తగ్గుతుంది. అయితే చీడపీడ నివారణకు వాడే పురుగు మందుల్లో రసాయనాల వల్ల ఆ పురుగులను ఆహారంగా తిని గబ్బిలాలు చనిపోతున్నాయి.
70 శాతం గబ్బిలాల జాతులకు కీటకాలు, దోమలే ఆహారం. ఒక్క రాత్రిలోనే కోట్ల సంఖ్యలో కీటకాలను నియంత్రించి రైతులకు మేలు చేస్తాయి. మకరందాన్ని ఆహారంగా స్వీకరించే కొన్ని జాతుల గబ్బిలాలు మొక్కల ఫలదీకరణానికీ దోహదపడతాయి. అయితే క్రమంగా కొన్ని గబ్బిలాల జాతుల మనుగడ ప్రమాదంలో పడింది. విద్యుత్ తీగలతోనూ ప్రాణాలు కోల్పోతున్నాయి. గాలిమరల వల్ల చనిపోతున్నాయి. అందుచేత గబ్బిలాలు అనేవి శత్రువులు కాదు. మనిషికి మిత్రులే! ఇదే నా థీసిస్‌లో చెప్పింది” అంటూ ముగించాడు.
“అయితే గబ్బిలం మీద ఒక కవి కావ్యం రాశాడు కదా!” అన్నాడు ఒక సభ్యుడు.
“అవును సార్! గబ్బిలాన్ని అపశకున పక్షిగా సమాజం పరిగణిస్తుంది. ఎందుకంటే అది వెలుగును చూడలేదు. పంచముల జీవితాల్లో వెలుగు లేదు. ఎంత ఎదిగినా ఇంకా సమాజం దూరంగానే పెడుతున్నది. దాని ప్రతీకగా జాషువా మహాకావ్యం గబ్బిలాన్ని రాశాడు” చెప్పడం ముగించాడు.
“ఇంకా మీ హాబీలు?” అడిగాడు కమిటీ సభ్యుడు.
“నేను ఇంగ్లిష్ నవలలు బాగా చదువుతాను”.
“మీకు బాగా నచ్చిన నవల?”.
“ముల్క్‌రాజ్ ఆనంద్ రాసిన అన్‌టచబుల్!”.
వెంటనే ఇంకో సభ్యుడు ప్రశ్నించాడు..
“మీరు ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఏ సర్వీస్‌ను
ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు?”.
ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు..
“ఇండియన్ ఫారెన్ సర్వీస్. నేను ఇందాక చెప్పినట్టు ముల్క్‌రాజ్ ఆనంద్ రాసిన ఆ నవల నాకు స్ఫూర్తిగా నిలిచింది. దాంట్లో బాఖా అనే పద్దెనిమిదేళ్ల కుర్రవాడు మరుగుదొడ్లు శుభ్రపరుస్తాడు. ఇంగ్లిష్ వారిలా దుస్తులు ధరించాలని, హాకీ ఆడాలని అతని కోరికలు. అయితే అతని కోరికలు తీరే మార్గం ఉండదు. బాఖా లాంటి నిమ్నజాతి యువకుడి కల నా ద్వారా తీర్చుకోబోతున్నాను” అని చెప్పాడు.
“ఇంటర్వ్యూ అయిపోయింది. మీరు వెళ్లవచ్చు” చెప్పాడు ఇంటర్వ్యూ చైర్మన్. ఆ ఇంటర్వ్యూ విషయం అంతా మనసులో మెదిలింది హాసన్‌కు. ఇహంలోకి వచ్చాడు. తరువాత రోజు ఎప్పటిలాగే వాష్‌రూమ్ కడగడానికి వచ్చిన కేల్విన్ను వారించి తనే వాష్‌రూమ్ కడుక్కున్నాడు. అప్పటికి హాసన్‌తో చనువు పెరిగిన కేల్విన్..
“ఎందుకు సార్.. వాష్ రూమ్ మీరే కడుక్కుంటున్నారు. ఇది మా పని కదా!?” అన్నాడు.అతనితో సంభాషణంతా ఇంగ్లిష్‌లో సాగుతున్నది.ఆ మాటలకు నవ్వి.. చెప్పడం మొదలుపెట్టాడు.
“కొందరు జీవితకాల పర్యంతం తమ మేథకు సంబంధించిన శ్రమలే చేస్తారు. కొంతమంది శారీరక శ్రమ చేస్తారు. వీటిలో చిట్టచివరి శ్రమ మురికిని శుభ్రం చేసే శ్రమ. ఇంకా దారుణమైన శ్రమ.. టాయిలెట్లు కడగడం. అయితే మా దేశంలో డ్రై టాయిలెట్లు కడగడం అనే ప్రక్రియ అత్యంత హేయం, నీచమైనది. ఈ నేపథ్యంలో నుంచి వచ్చిన నేను నా టాయిలెట్ కడుక్కుంటున్నాను. మాది స్కావెంజర్ కమ్యూనిటీ” అన్నాడు.
“నేను ఇక్కడి యూనివర్సిటీలో చదువుతున్నాను. ఇది పార్ట్‌టైమ్ జాబ్. ఈ దేశంలో నా రంగు చూసే ఈ టాయిలెట్ కడిగే పని నాకు అప్పజెప్పారు. ఆఫ్రికా నుంచి బలవంతంగా ఓడల్లో బానిసలుగా తెచ్చిన గత కాలపు సంస్కృతిలోనే మమ్మల్ని ఇంకా ఉంచుతున్నారు. మీరు చూస్తే తెల్లగా ఉన్నారు. అయినా మీరు ఈ వృత్తి ఆధారిత కులంలోకి ఎలా వచ్చారు?” అన్నాడు కేల్విన్.
“భారత్‌లో ఐదు వేల ఏళ్ల క్రితం వెలసిల్లిన సింధు నాగరికతలో స్వదేశీయులతోపాటు మెడిటారేనియన్, మంగోలాయిడ్ ప్రోటోఆస్ట్రిల్లాయిడ్ ఆల్వినాయిడ్ అనే జాతులు కలిశాయి. వీటి సమ్మేళనం నుంచి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడిందనేది చరిత్రకారుల భావన. వేదకర్మలు నిర్వహించేవారు, పరిపాలించేవారు, వ్యాపారం చేసేవారు, పరిచారక వర్గం.. ఇలా నాలుగు జాతుల తర్వాత ఐదోవర్గం పంచములు.. అంటే అంత్యజులు, అస్పృశ్యులు.
ఇలా మా దేశంలో అంటరానివారిగా, వంశానుగత వృత్తులను అనుసరించి ఆర్యుల కాలం నుంచి కోట్లాదిమంది అస్పృశ్యులుగానే పరిగణింపబడుతున్నాం. ఇలా విభిన్న భాషల, జాతుల సంస్కృతుల సమ్మేళనంలోంచి వైదిక సాహిత్యం పునాదిగా ఏర్పడిన ఈ కుల వ్యవస్థ.. సమాజంలో ఒక అపశృతి”.. హాసన్ చెప్పడం ముగించగానే కేల్విన్ కళ్లల్లో నీళ్లు నిలిచాయి. హాసన్ రెండు చేతులూ పట్టుకొని కళ్లకు అద్దుకున్నాడు. ఆఫీస్ అయిన తర్వాత హోటల్‌కు దగ్గరగా ఉన్న పార్కులో నడుస్తున్నాడు హాసన్. ఆ పార్కులోని ఫౌంటెన్ దగ్గర ఆగాడు. అక్కడే కనిపించాడు కేల్విన్.
“సార్.. గుడ్ ఈవెనింగ్!” అంటూ విష్ చేశాడు. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. కొన్ని అడుగులు వేసేసరికి ఎవరి సెల్ఫోన్లోంచో ఒక తెలుగు సినిమా పాట.
‘ఈ అమెరికాలో ఎక్కడినుంచీ తెలుగు పాట’ అనుకుంటూ.. ఆ పాట వింటూ ఉండిపోయాడు హాసన్.
‘వెళుతున్నా వెళుతున్నా.. మౌనంగా వెళుతున్నా వెళ్లాలని లేకున్నా దూరంగా వెళుతున్నా నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా’.. ఆ పాట విని ఒక్కసారిగా నడుస్తున్నవాడల్లా నిల్చుండిపోయాడు. స్తబ్ధుగా అయిపోయాడు. కేల్విన్ హాసన్‌ను పరిశీలనగా చూసి..
“ఆర్ యు ఓకే సార్?” అన్నాడు.
“ఓకే.. ఓకే..” అంటూ ఓ బెంచీపై కూర్చున్నాడు. అప్పటికి ఆరు దాటింది. ఆకాశంలో చిన్నచిన్న మబ్బులు. మెల్లగా చీకట్లోకి జారుకుంటున్న సంధ్య.
“అవును. సంధ్య.. సంధ్య..” నోట్లో అనుకుంటున్న ఆ మాటలు పైకే గొణుక్కున్నాడు హాసన్. అప్పటికే హాసన్‌తో చనువు ఏర్పడిన కేల్విన్..
“సంధ్య ఎవరు సార్?” అన్నాడు.
“ఢిల్లీలోని జేఎన్‌యూలో నేను పీహెచ్డీ చేస్తున్న రోజుల్లో ఆమె ఎంఏ చదివేది. అప్పటికే కోర్సు వర్క్ పూర్తయి.. రీసెర్చ్‌లో పూర్తిగా మునిగిన నేను.. ఆమె ప్రేమలో కూడా పూర్తిగా మునిగిపోయాను. ఎన్నో సాయంత్రాలు.. ఆమెతో జ్ఞాపకాలు.. ఆగ్రాలో తాజ్ మహల్ సాక్షిగా నా ప్రేమను ప్రపోజ్ చేశాను. తను ఇంట్లోవాళ్లకు పరిచయం చేస్తానంటూ రమ్మంది. ఆమె సెమిస్టర్ బ్రేక్ సెలవులకు తన సొంతూరు రాజమండ్రి వెళ్లింది. అది మా ఊరే! మా తాత పుట్టింది, పెరిగింది రాజమండ్రే. అందుకే నేనూ సంతోషంగా బయల్దేరాను. మా మావయ్యలు, బాబాయిలు ఇంకా రాజమండ్రిలోనే ఉన్నారు.
మా నాన్నకు ఉద్యోగం రావడంతో ఢిల్లీ వచ్చేశాం. అప్పుడప్పుడూ సెలవులకు మా ఊరు వెళ్లేవాణ్ని. రాజమండ్రి వెళ్లిన తర్వాతి రోజు సాయంత్రమే సంధ్య ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే వాళ్ల డ్రాయింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి లోపలికి వెళ్లింది సంధ్య. పావుగంట తర్వాత లోపలి నుంచి సంధ్య.. ఎవరితోనో చెబుతోన్న మాటలు నాకు లీలగా వినిపించాయి.
‘హాసన్ అంటే ఎవరో అనుకున్నాం. గంగాధరం మనవడు. వాడెందుకు తెలీదు’ అన్నారు ఎవరో.
‘మీకు తెలుసా డాడీ?’ అన్నది సంధ్య.
‘హాసన్ వాళ్ల తాత ఏం చేసేవాడో తెలిస్తే.. నువ్వు అతగాడిని మన ఇంటివరకూ పిలవవు. అతగాడు స్వయంగా తన చేతులతో మానవ విసర్జనలను ఎత్తివేసేవాడు. మలంతో నిండిన ఆ పాత్రను తలపై పెట్టుకొని ఆ గోదారి గట్టు వెంబడి వెళుతుంటే.. అందరూ ముక్కు మూసుకొని దూరంగా జరిగేవారు. పాపం! ఏం చేస్తాడు.. అతని జీవనోపాధికి మానవుని మలమూత్రాలను చేతితో ఎత్తి తీసుకెళ్లడమే తప్పనిసరి!’.
‘అయ్యో.. ఇప్పుడు అలాంటివేమీ లేవు. ఈ ఊర్లో హాసన్ మావయ్యలు, బాబాయిలు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు’ అన్నది.
‘అవును.. ఏం వ్యాపారమో తెలుసా?’.
‘కాంప్లెక్స్..’ అంటూ ఆగిపోయింది.
‘అవును. వాళ్లు నడిపేది సులభ్ కాంప్లెక్స్! ఆ ముసలాయన 30 – 40 ఏళ్ల క్రితం డ్రైలెట్రిన్లు కడిగితే.. వాళ్లు ఇప్పుడు వెట్ లెట్రిన్లు కడిగే వృత్తిలో ఉన్నారు. ఏమీ మార్పు లేదు. నువ్వు వాళ్ల ఇంట్లోకి వెళతావా.. నీ ఇష్టం!’ చెప్పాడతను. ఆ మాటలు వింటున్న నేను.. ఆ సంభాషణలు ఇక వినలేకపోయాను. మనసులో కుంగుబాటు.
‘లేదు డాడీ.. హాసన్ బాగా చదువుతాడు. బ్యాట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రొఫెసర్ అవుతాడు!’. ఆ మాటలకు అతను పెద్దగా నవ్వి..
‘అంటే గబ్బిలాలే కదా? అదో అపశకునపు పక్షి. వాళ్ల జీవితాల్లాగే అదీ మనకు నిషిద్ధం. ఇక నీ ఇష్టం!’.
ఆ మాటలు విన్న నేను ఇక మరి వినలేకపోయాను. వేగంగా బైటికి వచ్చాను. అప్పటి నుంచి సంధ్య నన్ను కలవడం మానేసింది. మాటల్లేవ్.. నేను ఫోన్ చేసినా ఎత్తేది కాదు. తన ఎంఏ పూర్తి కావడంతో ఢిల్లీ నుంచి షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు పెళ్లి అయిపోయింది. భర్తతో లండన్ వెళ్లిపోయింది. ఆమె వెళ్లేముందు నాకు మెసేజ్‌గా పెట్టిందే మనం విన్న ఆ పాట. ఆమె మాటలు మాట్లాడటం ఆపేసినా బాగుండేది. కానీ, వెళ్లిపోయేముందు తన బాధను, నిస్సహాయతను ఆ పాట ద్వారా వ్యక్తంచేయడం నాకు కలవరం కలిగించింది. ఆమెతోనే లోకం అనుకుని బతుకుతున్న నాకు జీవితం శూన్యం అనిపించింది”.. హాసన్ చెబుతున్న అతని గతాన్ని వింటూ కేల్విన్ ఆర్తిగా, జాలిగా చూస్తూ ఉండిపోయాడు.
హాసన్ చెప్పడం కొనసాగించాడు.
“ఒకరోజు రాత్రి ఒక మిత్రుడి రూమ్‌లో ఒంటరిగా ఉండిపోయాను.. అతను ఊరు వెళ్లడంతో. ఆ రూమ్‌లో నిద్రమాత్రల సీసా కనిపించింది. నిద్ర పట్టని ఆ రాత్రి నాకు శాశ్వతంగా నిద్ర కావాలని కోరుకున్నాను. అలా గుప్పెడు నిద్రమాత్రలు నా గొంతులో పోసుకున్నాను. మెల్లగా కళ్లు మూతలు పడ్డాయి. నిద్రలో ఏవో కలలు. తాతయ్య గుర్తుకొచ్చాడు. మంగళగిరి గంగాధరం నా ఎదురుగా నిల్చొని తన కథ చెప్పడం మొదలుపెట్టాడు.
‘నాయనా.. మున్సిపాలిటీ కాంట్రాక్టరు ఒక మోరీలో పూడిక తీసేందుకు నన్ను పిలిచాడు. ఆరోజు రాత్రయిపోయింది. తర్వాతి రోజు వస్తానని చెప్పాను. అయితే ఒప్పుకోలేదు. ఆ రాత్రే బలవంతం చేశాడు పనికి రమ్మని. ఆరోజే పనిలోకి దిగాను. ఇంతలో హఠాత్తుగా వ్యాపించిన విషవాయువులు.. నన్ను ఊపిరి ఆడకుండా చేశాయి. అంతే! నా ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది. నా శవం దొరకడానికి ఆరు రోజులు పట్టింది. నాలా ఇలా నిండు జీవితాన్ని బలి తీసుకున్న సఫాయి కార్మికులు ఎందరో! నేను మన కులం కారణంగా బలయ్యాను. నువ్వు కూడా అదే కులం చేసిన గాయాలు తట్టుకోలేక జీవితాన్ని చాలించాలనుకుంటున్నావా? ఇక మనం బతికేదెప్పుడు? బాగుపడేదెప్పుడు?’..
తాత మాటలు నాలో ప్రతిధ్వనించాయి.
సంధ్య, తాతయ్య ఇద్దరూ నీడల్లా కదులుతున్నారు. సంధ్య నీడ కదిలిపోయింది. తాతయ్య నన్ను పట్టి లేపుతున్నాడు. ఇంతలో నా మిత్రుడు లోపలికి వచ్చి, మత్తుగా చావు అంచుల వరకు వెళ్తున్న నన్ను రక్షించాడు. కాదు.. తాతయ్యే నన్ను కాపాడినట్టున్నాడు”.. చెప్పడం ముగించాడు హాసన్.అప్పటికే సంధ్య పూర్తిగా కనుమరుగైంది. చీకటి ఆవరించింది. హాసన్ చెప్పిన ఆ విషాదభరిత ప్రేమ కథకు కేల్విన్ కళ్లు తడిచాయి.
“యు ఆర్ అన్‌టచబుల్ సార్… నిజంగా అన్‌టచబుల్. ఎవరూ టచ్ చేయలేని స్థితికి ఎదిగారు!”.
“ఇది విజయమో.. విషాదమో!” అంటూ తనలో తానే గొణుక్కున్నాడు హాసన్, కేల్విన్ మాటలకు.
అంతలో తల కిందికి వేలాడుతోన్న ఒక పక్షి.. రెక్కలు విప్పుకొని తన తల మీదినుంచి నీడలా పైకి ఎగురుకుంటూ వెళ్లినట్టనిపించింది హాసన్‌కు.
డాక్టర్ ఎమ్ సుగుణ రావు
‘గబ్బిలంలాగానే ఎన్నో జీవితాలు సమాజ నిరాపేక్షకు, నిర్దయకు గురవుతున్నాయి. అస్తిత్వం కోసం, ఉనికి కోసం ఆ జీవితాలు పడే తపన, ఆవేదనే.. ఈ గబ్బిలం కథా వస్తువు’ అంటున్నారు డా. ఎం. సుగుణరావు. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. ప్రస్తుతం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. భారత ప్రభుత్వరంగ బీమా సంస్థలో స్కేల్ -4 అధికారిగా పదవీ విరమణ పొందారు. మూడు దశాబ్ధాల రచనా అనుభవంలో మూడు వందల పాతిక కథలు రాశారు. వీటిలో నూట పాతిక కథలకు బహుమతులు అందుకున్నారు.
ఈ మధ్యే ‘అన్వీక్షికి ఉగాది నవలల పోటీ’లో ‘ఫైనల్ డయాగ్నోసిస్’ అనే నవలకు ప్రోత్సాహక బహుమతి వచ్చింది. స్వాతి వీక్లీ నవలల పోటీలో ‘మరుగేలరా’ అనే నవలకు, ఇటీవలే ‘ఏడు గుర్రాల సూర్యుడు’ నవలకు లక్ష రూపాయల బహుమతి దక్కింది. ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ కథను ఇంగ్లీష్ నాటకంగా మలచగా.. ‘టాటా లిట్‌ఫెస్ట్ సుల్తాన్ పదాంశీ’ అంతర్జాతీయ నాటక పోటీలలో ద్వితీయ బహుమతి పొందింది. జాబిలి మీద సంతకం, నేలకు దిగిన నక్షత్రం, ఆకాశంలో ఒక నక్షత్రం, సుగుణ కథాభిరామ డాక్టర్ ఎం.సుగుణ రావు బహుమతి కథలు పేరుతో కథా సంపుటాలను వెలువరించారు.
– డాక్టర్ ఎమ్ సుగుణ రావు 97046 77930