‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
‘కొక్కొరోకో..’ మెడ సాగతీసి, రెక్కలను టపటపలాడిస్తూ హుషారుగా కూసింది కోడిపుంజు అలియాస్ డేగ.
దాని అరుపుతో.. పెరట్లో పట్టిమంచమ్మీద కునుకు తీస్తున్న పడమటయ్య దిగ్గున లేచి కూర్చున్నాడు. కొయ్యకు కట్టేసున్న డేగ మహా హుషారుగా ఉంది. ఓ రెండు కోడిపెట్టలు దాన్ని కవ్విస్తున్నాయి. అది చూసి అతను గాబరా పడిపోయాడు. జరగరాని ఘోరం జరిగిపోయిందేమోనని భయపడిపోయి.. తువ్వాలతో అదిలిస్తూ కోడిపెట్టలను అక్కణ్నుంచి దూరంగా తరిమేశాడు.
‘కూస్త ఆదమరిస్తే సాలు.. పక్కింటోల్ల పెట్టలు నా డేగతో సరసాలాడ్డానికి వొచ్చేతున్నయి!’ అంటూ గొణుక్కున్నాడు పడమటయ్య.
దీపాల వేళ కావడంతో డేగ కాలుకు కట్టిన తాడును విప్పాడు. దాన్ని గోముగా చేతుల్లోకి తీసుకుని, మెడను మృదువుగా నిమురుతూ..
“పెట్టలను తరిమేసినానని నా మీద కోపంగుందా? ఇంకెంత కాలమీ ఉపాసమని గునుగుతున్నవా? ఇంకెన్ని దినాల్లే! పందెం గెల్సీగానే.. నిన్ను నీ ఇస్టానికొదిలేత్తను. సరేనా?” అన్నాడు. దానికి ఏమర్థమయ్యిందో మరి.. ‘కొక్కొరోకో’ అని కూసింది. దాంతో..
“అయితే పందెం గెలిసేత్తవన్నమాట! నాయమ్మే!” అన్నాడు మురిసిపోతూ..
డేగకి గంట్లు, ఉడకబెట్టిన గుడ్డు తినిపించి వరండాలో కోళ్లగంప కింద భద్రంగా మూశాడు. పడమటయ్యకు ఎనభైయేళ్లు ఉంటాయనడానికి వడలిన దేహం, నెరిసిన తలే నిదర్శనాలు! ముక్కు పోగు, ముతక పంచె, మాసిన లాల్చీ, భుజమ్మీద తువ్వాలు.. శ్రమజీవి అనడానికి తార్కాణాలు! భార్య అనారోగ్యంతో కాలంచేసి ఐదేళ్లయింది. కొడుకులిద్దరూ విశాఖపట్నంలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. వాళ్లు రమ్మంటున్నా వెళ్లక.. ఇల్లే తీర్థం – పొలమే వారణాసి – ఆ ఊరే కైలాసంలా తన అరెకరాన్ని సాగుచేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు.
అనకాపల్లి జిల్లాలో శారదానదిని ఆనుకుని పచ్చని పొలాల మధ్య ఉంది ఆ పల్లె! సంక్రాంతికి ఆ పల్లెలో కోడిపందేలవుతాయి. ఏనాడూ వాటి జోలికిపోని పడమటయ్య.. రెండేళ్ల క్రితం తన మిత్రుడు దుర్గయ్య బలవంతం చేస్తే అయిష్టంగానే వెళ్లాడు. అక్కడ పదుల సంఖ్యలో ఉన్న కోడిపుంజులను చూసి ముచ్చటపడ్డాడు. వాటి రంగులను బట్టి డేగ, కాకి, సేతువ, నెమలి, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, పర్ల వంటి పేర్లతో పిలుస్తారని దుర్గయ్య చెబుతుంటే కుతూహలంగా విన్నాడు. కోడిపందేలలో ఎత్తుడు దింపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం, చూపుడు పందెం ఉంటాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంతలో పల్లపు వీధి సూరిబాబు నెమలి, మెరకవీధి గంగరాజు కాకి పందేనికి సిద్ధమయ్యాయి. దుర్గయ్య పుంజులను పరిశీలించి..
“గంగరాజు కాకి మాంచి ఏపుమీదుంది. దానిమీద పందెంగట్టు. గెలుత్తవు!”..
“సూసెల్లిపోతేగాదు.. పందెం గెలిత్తేనే ఆనందముంటది!” అంటూ పడమటయ్యను ఎగదోశాడు.
ఏ కలనున్నాడో పడమటయ్య.. పందెంకట్టి సూరిబాబుకు మూడువేలు సమర్పించుకున్నాడు. పుట్టి బుద్ధెరిగిన దగ్గర్నుంచి అతను పరాయిసొమ్ము ఆశించిందీ లేదు, తన సొమ్ము వట్టినే ఎవ్వరికీ ఇచ్చిందీ లేదు. అలాంటి పడమటయ్య తొలిసారిగా పందెంకాసి మూడువేలు పోగొట్టుకోవడంతో కుడితి కుండలో పడ్డ ఎలుకలాగ యేడాదిపాటు గింజుకున్నాడు. బుద్ధిలేక కోడిపందేలు చూడ్డానికి వెళ్లానని ఎన్నోమార్లు గొణుక్కున్నాడు. ఓడినచోటే తిరిగి తన సొమ్ము రాబట్టుకుని, ఆ తర్వాత కోడిపందేల ముఖం చూడకూడదనుకున్నాడు. సంక్రాంతివరకూ కాసుక్కూర్చొని మరీ సూరిబాబుతో పందెంకట్టాడు. మళ్లీ మూడువేలు పోగొట్టుకున్నాడు.
సూరిబాబు మీసం మెలేస్తూ..
“ఒరే ముసలి నక్క! కాటికి కాలు సాపుకొని ఇంటికాడ కూకోక పందెం గెలుద్దామనొచ్చవు! బొక్కబోర్ల పడ్డవు. నన్ను గెల్సీడం నీతరం గాదుగానీ, ఇంటికెల్లి ముసుగేసుకుని తొంగో!” అంటూ అందరి ముందూ ఎగతాళి చేశాడు. అది విని అంతా నవ్వుకున్నారు. ఆ అవమానభారంతో ఇంటిదారి పట్టాడు పడమటయ్య.
‘కుర్రకుంక ఎంత మాటనేసినడు!? కాటికి కాలు సాపుకొని కూకోమంతడా? నాను ముసలి నక్కనని ఎటకారం సేత్తడా? నలుగుర్లోనూ అవుమానిత్తడా? వొచ్చే సంకురాత్రికి ఆడి పుంజునోడించి.. ఈ ముసలోడి దెబ్బేటో ఆడికి రుసి సూపిత్తను. నా దెగ్గిర గెల్సిన డొబ్బులను కక్కిత్తను’ అని పంతం పట్టాడు.
స్వతహాగానే పట్టుదలగల మనిషి పడమటయ్య. ఇక వేరేవాళ్ల కోడిపుంజుల మీద పందెం కాయకూడదని అనుకున్నాడు. తనే కోడిపుంజును పెంచి, బరిలో నిలవాలనుకున్నాడు. అందుకోసం తలపండిన పందెం రాయుళ్లను కలిశాడు. పందెం కోడిని ఎలా పెంచాలో, ఎటువంటి ఆహారం పెట్టాలో తెలుసుకున్నాడు. పోరాట పటిమలో డేగను మించిందిలేదని విని.. ఎర్ర ఈకలు గల డేగకోసం రెండుమూడు కోళ్లసంతలు తిరిగి ఐదునెలల వయసున్న డేగను కొన్నాడు. దాని సంరక్షణ కోసం తన పొలాన్ని బీడుపెట్టేశాడు. తన వ్యాపకాలన్నిటినీ పక్కన పెట్టేశాడు. పందెం గెల్చి సూరిబాబు పొగరణచి, పోగొట్టుకున్న డబ్బూ.. పరువూ నిలుపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు.
డేగతోనే తన దినచర్య ఆరంభమవుతుంది. దానితోనే పూర్తవుతుంది. తెల్లవారుతూనే దాన్ని నదికి తీసుకెళ్లి, కాసేపు ఈత కొట్టిస్తూ వ్యాయామం చేయిస్తాడు. పనిలో పనిగా అక్కడే తన కాలకృత్యాలూ, స్నానమూ కానిచ్చేస్తాడు. అటు తర్వాత ఇంటికి తీసుకొచ్చి బాదంపప్పు, నల్లద్రాక్ష, ఎండు ఖర్జూరం, నల్లనువ్వులు, తాటిబెల్లం కలిపి గుండ్రంగా తయారుచేసిన ఉండలను.. గంటకొక్కటి చొప్పున దాని నోటికందిస్తాడు. మధ్యాహ్నం కైమా, జీడిపప్పు తినిపిస్తాడు. సాయంత్రం గంట్లు, సోళ్లు, ఉడకబెట్టిన గుడ్డుతో మేపుతాడు. దాని శరీరం గట్టిపడటం కోసం ముప్పూటలా చల్లని నీళ్లను నోట్లోకి తీసుకుని.. దాని శరీరం తడిసేలా గట్టిగా ఊస్తాడు. దానికి చిన్న సుస్తీ చేసినా.. జాగు చేయకుండా పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తాడు.
క్రమక్రమంగా పడమటయ్యకు డేగతో మంచి అనుబంధం ఏర్పడింది. దాన్ని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. డేగకూడా అతను కాసేపు కనిపించకపోతే చాలు.. గోలగోల చేస్తుంది. అతను కనిపించగానే.. రెక్కలు టపటపలాడిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్దీ పడమటయ్యను కోడికత్తి భయపెడుతున్నది. కత్తి తగిలి తన డేగ గాయపడ్డమో, చావడమో జరిగితే.. అన్న ఊహే అతనికి నిద్రలేకుండా చేస్తున్నది. ‘డింకీ పందెమైతే కత్తులు కట్టరంట. సూరిబాబుతో డింకీ పందెం కడదామని అడగాల!’ అని అప్పటికి చాలాసార్లు అనుకున్నాడు.
ఆ రోజు భోగి పండుగ. ఆ మర్నాడే కోడిపందేలు! పడమటయ్య తన డేగను ఎప్పటిలాగే నదికి తీసుకెళ్లి వ్యాయామం చేయించాడు. ఎప్పుడూ లేనిది షాంపుతో దాన్ని బాగా రుద్ది స్నానం చేయించాడు. కాసేపు దాన్ని ఎండలో చలికాయించి తిరిగొస్తుంటే.. ఏటిగట్టుమీద సూరిబాబు బైక్ మీదొస్తూ ఎదురైతే ఆపాడు.
సూరిబాబు వెటకారంగా నవ్వి..
“నీ పుంజును తెగ మేపుతున్నవంట! భలేగా టయినింగిత్తున్నవంట! ఏటీ.. నా పుంజునోడించేద్దామనే?! నామీద గెలిసేద్దామనే?! ముసలి నక్కవి నీకంత కలేజా ఉందా?” అన్నాడు.
“ఉందో.. నేదో రేపు తెలుత్తది గానీ.. డింకీ పందెం ఏద్దం! పుంజుల పేనాలకు ఏటిగాదు. ఏటంతవు?”.
“ఏటీ.. డింకీ పందెమా? పుంజులు పూటల్లా కొట్టుకున్నా.. ఆ పందెం తేల్దు! రేపు జెరిగేవన్నీ ఎత్తుడు దింపుడు పందేలే! బేగొచ్చి నీ పుంజును నా పుంజుకత్తికి బలిచ్చేద్దువు గానీ” అంటూ బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. సూరిబాబు మాటలతో తన ఆశ ఆవిరైనందుకు చింతిస్తూ..
“సూసినవురా ఆడి పొగరు? ఆ పొగరు నువ్వు అనిసీయాల! ఆడి దగ్గిరోడిన డొబ్బులను నువ్వే కక్కించాల! ఆడి పుంజుక్కట్టిన కత్తినుంచి ఒడుపుగా తప్పించుకొని గెలవాల!” అంటూ, డేగతో చెబుతూనే ఇంటికి చేరుకున్నాడు పడమటయ్య. పొద్దుగుంకే వరకూ డేగ ఆలనాపాలనా చూసుకుంటూ, పందేనికి సిద్ధంచేస్తూ గడిపాడు. చీకటిపడ్డాక దాన్ని కోళ్ల గంపకింద మూసి, ఏదో తిన్నాననిపించి తన గదిలోకెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఎంత ప్రయత్నించినా నిద్రరాలేదు. ‘పందెమేమవుద్దో.. డేగకేమవుతుందో!’.. ఇవే ఆలోచనలు! అర్ధరాత్రి తర్వాత గాఢంగా నిద్రపట్టేసింది.
పొద్దుపొడిచాక దిగ్గునలేచాడు పడమటయ్య. ‘ఇదేటి సిత్రం! ఏటీ మొద్దునిద్ర! సీకటితోటే నిద్రలేపేసే డేగకీ నిద్రట్టీసిందా?’ అనుకుంటూ వరండాలోకెళ్లి, గంపెత్తాడు. గంప కింద డేగలేదు. పడమటయ్య గుండె ఆగినంతపనైంది. కంగారుగా పెరట్లోనూ, ఆ పక్కింటోళ్ల కోడిపెట్టల దగ్గర వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. పిచ్చోడిలా ఊరంతా వెతుకుతూ.. ‘దా.. దా..’ అని పిలుస్తూనే ఉన్నాడు.
“నా పుంజేమన్నా అగుపించిందా?” అని కనిపించిన వారినల్లా అడుగుతూనే ఉన్నాడు. బారెడు పొద్దెక్కాక నిరాశగా ఇంటికి చేరుకుని, విచారంగా మంచమ్మీద కూలబడ్డాడు.
‘డేగెలాగ మాయిమైపోనది? ఒకేల ఆ సూరిబాబుగోడు దొంగతనంగొచ్చి అట్టుకుపోనడా?’ అని అనుమానిస్తుండగా దుర్గయ్య వచ్చాడు.
“ఏట్రా.. పుంజు అగుపడ్డంనేదని ఎతుకుతున్నవంట. ఏటైంది?“ అంటూ పరామర్శించాడు.
“ఏటి సెప్పమంటవురా! తెల్లారిలేసి సూత్తే డేగనేదు” అని.. తన అనుమానాన్ని వెలిబుచ్చాడు.
“ఆడైయుండడు, ఆడికాడే బోల్డు పుంజులు!
ఇదెవడో దొంగనాయాల కోడిపందేలాడీడానికి ఎత్తికెల్లుంటడు. పందేలప్పుడు ఇట్టాంటివి జెరుగుతుంటయి, కనిపెట్టుకునుండాల! బేగెల్లి బరిదెగ్గిర ఎతుకు… దొరికితే దొరకొచ్చు”. అతనలా చెప్పడమే ఆలస్యం దిగ్గునలేచి బయల్దేరాడు పడమటయ్య. ఊరికి దూరంగా గుబురు చెట్లమధ్య నున్న ఖాళీ ప్రదేశంలో జరుగుతున్న కోడిపందేల దగ్గరికి ఆయాసపడుతూ చేరుకున్నాడు. అప్పటికే అక్కడ కోడి పుంజులమధ్య సంక్రాంతి సంకుల సమరం మహాజోరుగా సాగుతున్నది. మరోపక్క గుండాటలూ జరుగుతున్నాయి. పందెంరాయుళ్ల మధ్య డబ్బు వేలల్లో చేతులు మారుతున్నది. అక్కడి కోలాహలం, సందడి మధ్య పడమటయ్య తన డేగను వెతకడం మొదలెట్టాడు. తుప్పలకు, కొమ్మలకు కట్టేసి ఉంచిన కోడిపుంజులలో తన డేగ ఉందేమోనని గాలిస్తున్నాడు. యేడాదిపాటు తనుపడ్డ శ్రమంతా వృథా అయిందని ఆక్రోశిస్తున్నాడు.
కోడిపందేలాడుతున్న సూరిబాబు పడమటయ్యను చూసి..
“ఒరే ముసలినక్క! ఏదిరా నీ పుంజు? ఓడిపోతానన్న బయంతో పుంజు అగుపించనేదని నాటకాలడుతున్నవంట” అన్నాడు పళ్లికిలిస్తూ.
పడమటయ్య ఏమీ బదులు చెప్పలేదు. ఇంకా అక్కడే ఉంటే అందరూ తనను లోకువచేసి మాట్లాడతారని అక్కణ్నుంచి బయల్దేరాడు. అతనికి సూరిబాబును దెబ్బకుదెబ్బ తీయలేకపోతున్నందుకు కోపంగా ఉంది. ఓడిపోయిన డబ్బు తిరిగి గెల్చే అవకాశం లేనందుకు దిగులుగా ఉంది. తన డేగ ఏమయ్యిందోనని బాధగా ఉంది. అడుగులో అడుగేస్తూ విచారంగా నడుస్తున్నాడు. అంతలో ‘కొక్కొరోకో’ అన్న కూత వినిపించింది. నడకాపి వెనక్కి తిరిగి చూశాడు. ఆశ్చర్యంగా రెక్కలు టపటపలాడిస్తూ పరుగెత్తుకొచ్చి అతని చేతుల్లో వాలిపోయింది డేగ! దాన్ని చూడగానే అతని దిగులెగిరిపోయి, హృదయం ఉప్పొంగిపోయింది. దాని కాలుకు వేలాడుతున్న తాడును చూసి..
“అదునుసూసి నిన్ను బరిలో దించీడానికి దొంగోడు డొంకలో కట్టేత్తే ఇడిపించుకునొచ్చేసినవా? నానంతే నీకెంత పేమ!” అంటూ డేగను ఆప్యాయంగా నిమిరాడు. అదేమన్నా తిన్నాదో లేదోనని ఇంటికి తీస్కెళ్లి కాసిన్ని గంట్లు తినిపించాడు. డేగను పందేనికి తీస్కెళ్లడానికి పడమటయ్యకు మనసొప్పడం లేదు. కానీ, సూరిబాబు మాటలు పుండుమీద కారంలా సల్పుతుంటే మనసు చంపుకొని దాన్ని పందేనికి సిద్ధంచేశాడు. కాసిన్ని గంజినీళ్లు తాగి, పందెం డబ్బును, డేగను పట్టుకుని బరి దగ్గరికెళ్లాడు.
సూరిబాబు పడమటయ్య చేతిలోని డేగను చూసి..
“నాటకాలు కట్టేసి నీ పుంజును అట్టుకొచ్చేసినావన్నమాట. ఇంకేటాలిస్యెం? నీ డేగను సికెను పలావు వొండించీడానికి నా నెమలి, సేతువ, కౌజు సిద్ధంగున్నయి. దేనితో పందెమేత్తవో ఎయ్యిరా!” అన్నాడు.
“తెగ మిడిసిపడతన్నవు. కట్టెవొంకర పొయ్యి తీరిసినట్టు నీ పొగర్ను నా డేగ తీరుస్తది! ఈ ముసలోడి తడాక ఏటో సూపిత్తది! ఏ పుంజును పందేనికి ఎడతవో ఎట్టుకో!” రోషంగా అన్నాడు పడమటయ్య.
“అబ్బో… పవురుసం తన్నుకొచ్చేసిందే… మరి పందెమెంత ఏద్దమేటి!”.
“ఆ రోజేదో మాయికమ్మేసి నీతో పందేనికి దిగానుగానీ, నేనొకడి సొమ్ముకు ఆసపడేవోణ్ని గాదు. నీ దెగ్గిర రెండుతూర్లు పందేమేసి ఆరేలు పోగొట్టుకున్నను. అయి తిరిగొస్తే సాలు!”.
ఇద్దరి మధ్య పందెం కుదిరింది. కత్తి కట్టేవాడు మూడొందలు తీసుకుని డేగ కుడికాలుకు కాటన్ గుడ్డ చుట్టి, దానిమీద కత్తిపెట్టి తాడుతో కడుతుంటే పడమటయ్య బాధగా మూలిగాడు. సూరిబాబు తెల్ల ఈకల సేతువతో బరిలోకొచ్చాడు. పడమటయ్య గుండెరాయి చేసుకుని తన డేగతో బరిలోకి దిగాడు. పుంజులు రెండూ మంచి కండపుష్టితో ఉన్నాయి. వాటి కాలి గోళ్లూ, ముక్కూ బలంగా మొనదేలున్నాయి. చూడ్డానికి వచ్చినవారు వాటి బలాబలాలు అంచనావేసి వేలల్లో పందేలు కాసారు.
సూరిబాబు, పడమటయ్య పుంజుల తలలను వాటిముక్కుతో పొడిపించి, వాటిలో క్రోధాన్ని రగిలించారు. వాటిని దువ్వి బరిలో వదిలి పక్కకు తప్పుకొన్నారు. సేతువ, డేగ ఎదురెదురుగా నిల్చుని కాళ్లొంచి, మెడమీద ఈకలు రిక్కించి కాసేపు కోపంగా చూసుకున్నాయి. ఒక్కసారిగా గాల్లోకెగిరి తన్నుకున్నాయి. ముక్కులతో పొడుచుకున్నాయి. సేతువ ఎగురుతున్నప్పుడు డేగ ఒడుపుగా తప్పించుకుంటున్నది. జనం వాటి పోరును ఆసక్తిగా తిలకిస్తున్నారు. పడమటయ్య అయితే ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు.
‘బగవొంతుడా… పుంజులకేటవ్వకుండ నా డేగ గెల్సీలాగ సూడు!’ అంటూ ప్రార్థిస్తున్నాడు పడమటయ్య.డేగ కళ్లు చురుగ్గా కదులుతున్నాయి. ప్రత్యర్థి కదలికలను కనిపెడుతూ ఒక్కసారిగా గాల్లోకి లేచి సేతువను కుడికాలుతో తన్నింది. సేతువ మెడకు కత్తి తగిలి అది నేలకూలింది. మరి లేవలేదు. డేగ గెలవడంతో పడమటయ్యను అక్కడున్నవారంతా పొగడ్తలతో ముచ్చెత్తారు. దాంతో అతనికి ప్రపంచాన్ని జయించినంత ఆనందమేసింది. ఉద్వేగంతో బరిలోకి దూకి డేగను ప్రేమగా చేతుల్లోకి తీసుకుని ముద్దుపెట్టాడు. గోళ్లరక్కులు తప్ప కత్తి గాయాలు లేనందుకు సంతోషించాడు. చచ్చి పడున్న సేతువను చూడగానే అతని మనసు చివుక్కుమంది.
“సూసిరమ్మంటే కాల్సొచ్చేసిన అనుమంతులోరిలాగ ఓడించమంతే ఏకంగ సంపేసినవు! అదేమన్న నీ సెత్రువా? నీ జాతి తన అసలు సెత్రువును కానుకోనేకపోతున్నది గాబట్టే.. అనాదిగ కోడిపందేలు ఇలాగ సాగుతున్నయి” అన్నాడు డేగతో. పందెం డబ్బులను పడమటయ్య చేతిలో పెట్టి..
“ఏటో అనుకున్నను, గట్టి ముసలోడివే! గెలిసెయ్య నీకి వొయస్సడ్డంగాదు, ఓపిగ్గ సెమిత్తే ఓరినైన ఇజియం వరిత్తదని నిరూపించినవు! నిన్ను సులకన సేసి మాట్లాడినాను. సెమించు” అంటూ తలొంచాడు సూరిబాబు. పడమటయ్య పోయిన తనడబ్బు మళ్లా తిరిగొచ్చినందుకు సంతోషపడిపోయాడు. తన పంతం నెగ్గినందుకు మురిసిపోయాడు.
“నీ తప్పు తెలిసికొని తలొంచావు. అది సాలు!” అన్నాడు సూరిబాబుతో.
“కోడిపందేలు మడుసులలో పగలూ, కచ్చలూ పుట్టిత్తయి! అందువొల్లే పల్నాడిద్దం, బొబ్బిలిద్దం జెరిగాయంట. ఇల్లు ఒల్లు గుల్లసేసే ఇట్టాంటి పందేలు నానింకెప్పుడు ఆడనుగాక ఆడను” అంటూ ఒట్టుపెట్టాడు. అంతలోనే..
“పోలీసోలొత్తున్నరు… పారిపొండి… పారిపొండి” అంటూ ఎవరో అరిచారు. అంతే, జనం చెట్టుకొకరుగా పుట్టకొకరుగా పరుగులు తీశారు. పడమటయ్యకు పందెం గెల్చానన్న ఆనందం ఆవిరైపోయింది. భయం నిలువెల్లా ఆవహించింది. పోలీసోళ్లకు దొరికితే స్టేషన్‌కు తీసుకుపోయి, కోర్టుకు కట్టేస్తారన్న భయంతో అడ్డదారిలో డేగను పట్టుకుని కొంతదూరం పరుగు తీశాడుగానీ, వయసు సహకరించక ఆగిపోయాడు. దారి పక్కన పశువులపాక ఉంటే అందులోకి దూరాడు. పక్కనే ఉన్న కుక్కిమంచం వాల్చి, దానిమీద డేగనుంచి తువ్వాలతో పూర్తిగా కప్పేశాడు. కీడెంచి జేబులోని డబ్బును ముంజూరులో దోపాడు. మంచమ్మీద ఓ వారగా పడుకున్నాడు.
హెడ్ కానిస్టేబుల్, ఓ కుర్ర కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని వేగంగా బైక్ మీదొచ్చి బరి దగ్గరాపాడు. బరిలో రాలిన ఈకలూ, చిందిన నెత్తురూ తప్ప అక్కడెవ్వరూ కనిపించలేదు. ఇద్దరూ తమ డేగకళ్లతో ఆ చుట్టుపక్కలంతా గాలించారు గానీ లాభం లేకపోయింది.
“మనమొస్తున్నట్టు ఏనా కొడుకో ఉప్పందించేశాడు. వచ్చినందుకు కనీసం పెట్రోల్ చార్జీలకన్నా గిట్టుబాటు కాలేదు” అసహనంగా అన్నాడు హెడ్ కానిస్టేబుల్.
వేరే దారి కనిపిస్తే అటెళ్తే గిట్టుబాటు అవుతుందేమోనని బైక్‌ను అటు పోనిచ్చాడు. బిక్కుబిక్కుమని పాకలోవున్న పడమటయ్యకు బైక్ శబ్దం వినగానే ఒళ్లంతా ముచ్చెమటలు పోశాయి. ఊపిరి బిగబెట్టి పడుకున్నాడు. బైక్ పాకను దాటి ముందుకు పోయింది. దాంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతలోనే బైక్ మళ్లీ వెనక్కి తిరిగొచ్చి సడన్ బ్రేక్‌తో పాకముందాగింది.
ఆ శబ్దానికి పడమటయ్య హడలిపోయాడు. గురకపెట్టి నిద్రపోతున్నట్టు నటిస్తూ గట్టిగా కళ్లు మూసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్, కుర్ర కానిస్టేబుల్‌తో కలిసి పాకలోకి దూరాడు. పడమటయ్యను లాఠీతో తట్టి లేపాడు. బద్ధకం నటిస్తూ లేచాడు పడమటయ్య.
“ఏటి బాబు… ఇలా వొచ్చరు?” అని అడిగాడు ఏమీ తెలీనట్టు.
“తాతా.. కోడిపందేలు ఆడేవారు ఎటెల్లారో చూశావా?” అడిగాడు హెడ్ కానిస్టేబుల్.
“సూన్నేదు బాబు… పొలం పన్జేసి నిద్రోననా… మత్తుగ నిద్రట్టేసింది” చెప్పాడు పడమటయ్య.
హెడ్ కానిస్టేబుల్‌కు పడమటయ్య మీద ఏ మాత్రం అనుమానం రాలేదు. ఇద్దరూ నిరాశగా పాకలోంచి బయటకొచ్చారు. పడమటయ్య మరోసారి ఊపిరి పీల్చుకున్నాడు. అంతలో అంతవరకూ కిక్కురుమనని డేగ ‘కొక్కొరోకో’ అని కూసింది. పడమటయ్య గుండె గుభేలుమంది. ‘ఎంత పన్జేసినవే డేగ… పోలీసు డేగలకు నన్నప్పగించేసినవు గదే’ అంటూ గొణిగాడు.హెడ్ కానిస్టేబుల్ తిరిగి పాకలోకి పరుగునొచ్చి, తువ్వాలు కింద కదులుతున్న డేగను పట్టుకుని చంకలో ఇరికించుకున్నాడు.
“అమ్మ ముసలినాయాల… ఎంత నాటకమాడావురా?” అన్నాడు కళ్లెర్రజేసి. పడమటయ్య జేబులను, అక్కడి పరిసరాలను కుర్ర కానిస్టేబుల్ చేత వెతికించాడుగానీ ఏమీ దొరకలేదు.
“కోడిపుంజుంటే డబ్బులు కూడా ఉంటాయి. ఎక్కడ దాచావో తియ్యరా… లేకపోతే మక్కలిరగొట్టీగలను” అంటూ లాఠీ ఎత్తాడు హెడ్ కానిస్టేబుల్. దాంతో బెదిరిపోయిన పడమటయ్య.. హెడ్ కానిస్టేబుల్ కాళ్లమీద పడిపోయాడు.
“పుంజు ఓడిపోనది బాబూ! డొబ్బులు పోనయి” అని అబద్ధం చెప్పాడు.
“ఈతూరికి సెమించి ఒదిలేయండి” అంటూ బతిమిలాడాడు. హెడ్ కానిస్టేబుల్ ఎత్తిన లాఠీ దించి..
“పండగపూట హింసెందుకని వదిలేస్తున్నాను. ఇంకెప్పుడూ కోడిపందేలాడకు!” అన్నాడు. డేగనుచూసి పళ్లు చప్పరిస్తూ..
“వచ్చినందుకు కోడిపుంజు గిట్టుబాటయ్యింది. పండక్కొచ్చిన అల్లుళ్లకు ఎంచక్కా పుంజు మాంసంతో భోజనమెట్టొచ్చు” అంటూ డేగను పట్టుకుని హుషారుగా పాకలోంచి బయటకొచ్చాడు. డేగను పట్టుకుపోతుంటే విలవిల్లాడిపోయాడు పడమటయ్య.
‘డేగనిడిసి నానుండగలనా?’ అనుకుని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. తనను గెలిపించిన డేగ, ఓడిందని అబద్ధం చెప్పినందుకు తనను తను అసహ్యించుకున్నాడు. బైక్ స్టార్ట్ చేసిన శబ్దం వినగానే ఒక నిశ్చయానికొచ్చి, ముంజూరులో దాచిన డబ్బును గాబరాగా తీసి, ఒక్కుదుటున బయటకొచ్చాడు.
“నాను అబద్దం సెప్పినను బాబు. నా డేగ ఓడిపోనేదు.. గెల్సినాది! పోగొట్టుకున్న నా పరువును, డొబ్బును గెల్సినాది! నన్ను ఎటకారం సేసినోణ్ని తలొంచుకునేల గెల్సినాది! ఆ డబ్బేబాబు ఇది. పన్నెండేలు! తీస్కోని గొర్రిపోతిని కొని తమరి అల్లుల్లకు ఏటమాసంతో బోజనం ఎట్టండి. నా డేగను నాకొగ్గీయండి బాబు.. మీకు పున్నెముంటది” అంటూ బోరున ఏడ్చాడు. హెడ్ కానిస్టేబుల్ తన పంట పండిందని ఉప్పొంగిపోయాడు. మారోమాట లేకుండా డేగను పడమటయ్య చేతిలో పెట్టి, డబ్బును జేబులో కుక్కుకున్నాడు. ఆ వెంటనే బైక్‌ను ముందుకు ఉరికించాడు.
పడమటయ్యకు డబ్బు పోయిందన్న బాధ కాస్తకూడా లేదు! తన డేగ తనకు దక్కినందుకు సంతోషంగుంది! గద్దతో పోరాడి రక్షించిన కోడిపిల్లను రెక్కలమాటున దాచిన తల్లికోడిలా డేగను ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు. ‘అందరి కండ్లూ నా డేగమీదే అడిపోనయి. బేగ ఇంటికెల్లి దిస్టి తీసియాలి’ అనుకుంటూ ఇంటివైపు నడక మొదలుపెట్టాడు.
పందెం కోళ్లను ప్రాణానికి ప్రాణంగా, కన్నబిడ్డల కన్నా మక్కువగా చూసుకుంటారు కొందరు యజమానులు. అలాంటి ఓ యజమాని కథే.. ‘డేగ’! కన్న ప్రేమే కాదు.. పెంచిన మమకారం కూడా ఎంతో గొప్పదని నిరూపించిందీ కథ! కథా రచయిత బొడ్డేడ బలరామస్వామిది అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామం. ప్రైవేట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇప్పటివరకూ ముప్పైకి పైగా కథలు, కొన్ని కవితలు రాశారు. ‘ఆకుపచ్చని చంద్రుడు’ నవల.. చతురలో ప్రచురితమైంది.
‘సముద్రం’ కథకు.. 2017లో స్వాతి మాసపత్రిక నుంచి ‘అనిల్ అవార్డు’ అందుకున్నారు. అనకాపల్లి గౌరీ గ్రంథాలయం నిర్వహించిన కథలపోటీలో ‘ఆడపిల్ల’ కథకు ద్వితీయ బహుమతి దక్కగా.. డా. సి. నారాయణరెడ్డి గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. ‘కళింగ పౌరుషం’ చారిత్రక కథకు జాగృతి వార పత్రిక నుంచి ప్రోత్సాహక బహుమతి దక్కింది. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించిన కథల పోటీ – 2021లో ‘కీడు గుడెసె’ కథకు, హాస్యానందం పత్రిక నిర్వహించిన కథల పోటీలో ‘పట్టుచీర’ కథకు ప్రత్యేక బహుమతులను అందుకున్నారు. వీరి ‘సముద్రం’ కథ హిందీలోకి, ‘ఒక ప్రయాణం’ కథ కన్నడంలోకి అనువాదమయ్యాయి.
– బొడ్డేడ బలరామస్వామి 89197 07141