“అత్తయ్య గారూ.. మీరుకూడా మాతో రావచ్చు కదా! ఆ కొత్త మాల్ చాలా బాఉందిట. అందులో అయిదు స్క్రీన్లు కూడా ఉన్నాయట. కాసేపు మాల్లో తిరిగి సినిమా చూసి వద్దాం” బాల్కనీలో కూర్చుని కింద గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్న రాజేశ్వరి.. కోడలి మాటలు విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది.
“నేను రానులే తల్లీ! నువ్వూ అబ్బాయి వెళ్లి రండి” అంటూ కుర్చీ లోనుంచి లేచింది రాజేశ్వరి.
“ఏం అంటోంది అమ్మ? వస్తోందా?”.. టక్ సవరించుకుంటూ వచ్చాడు సాగర్.
“ఎంత చెప్పినా రానంటున్నారు”.. నిష్టూరంగా అన్నది శృతి.
“మీరిద్దరూ వెళ్లి రండిరా.. వచ్చేవారం నన్ను శివాలయానికి తీసుకువెళ్తే సంతోషంగా వస్తాను” నవ్వింది రాజేశ్వరి.
“తప్పకుండా తీసుకుని వెళ్తాను. తలుపు వేసుకో!” అంటూ భార్యతోపాటు వెళ్లిపోయాడు సాగర్.
తలుపు వేసుకుని, మళ్లీ వచ్చి బాల్కనీలో కూర్చుంది రాజేశ్వరి. కాసేపు పిల్లల ఆటలు చూసి హాల్లోకి వచ్చి గంటసేపు చాగంటి వారి ప్రవచనాలు విని, రెండు పుల్కాలు తిని, టేబుల్ సర్దుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. రాజేశ్వరి వీధి గదిలోకి వెళ్లి బయట లైటు వేసి.. కిటికీ కర్టెన్ పక్కకు జరిపి చూసింది. గుమ్మంలో సాగర్, శృతి..
రాజేశ్వరి ఆశ్చర్యపోతూ తలుపు తెరిచింది.
“అప్పుడే వచ్చేసారేమిటి? సినిమాకి వెళ్లలేదా?”.
శృతి ఏమీ మాట్లాడకుండా జేవురించిన మొహంతో విసురుగా తమ గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది.
నిశబ్దంగా లోపలికి వచ్చి వీధి తలుపు మూశాడు సాగర్.
“ఏమైందిరా? శృతి ఏమిటి అదోలా ఉంది? ఇంత త్వరగా వచ్చేసారేమిటి?” అంతా అయోమయంగా ఉంది రాజేశ్వరికి.
“ఏమో? మాల్లో కాసేపు తిరగగానే ఇంటికి వెళ్లి పోదామంది. కారణం చెప్పదు. కారులో కూడా ఉలుకూ పలుకూ లేకుండా కళ్లు మూసుకుని కూర్చుని ఉంది”.
“ఒంట్లో బాగో లేదేమో! ఒకసారి వెళ్లి చూడు!”.
మూసి ఉన్న తలుపు తోసుకుని గదిలోకి వెళ్లాడు సాగర్. మంచం మీద పడుకుని ఉంది శృతి.
“ఏమిటీ.. పడుకుండి పోయావు? భోజనం చేయవా? అసలు ఏమైంది నీకు?”..
మంచం మీద ఆ వైపు తిరిగి పడుకుని ఉన్న శృతినుదుటి మీద చేయి వేసి చూస్తూ.. ఆత్రుతగా అన్నాడు సాగర్.
“జ్వరం కానీ రాలేదు కదా!?”.
శృతి ఏడుస్తోంది.
కంగారు పడి పోయాడు సాగర్.
“ఎందుకు ఈ ఏడుపు? కడుపు నొప్పిగా ఉందా?”.
సాగర్ మాటలు విని కంగారుగా గదిలోకి వచ్చిన రాజేశ్వరికి.. ఏడుస్తున్న శృతిని చూసి కాలూ చేయీ ఆడలేదు.
“అమ్మా శృతీ! ఏమైంది తల్లీ! నాకు చెప్పు” శృతి పక్కనే మంచం మీద కూర్చుంటూ, ఆమె మొహాన్ని తన వైపు తిప్పుకొంది రాజేశ్వరి.
ఏడుపుతో శృతి మొహం అప్పటికే ఉబ్బి పోయింది.
శృతి వెక్కివెక్కి ఏడుస్తూనే ఉంది.
“ఎందుకమ్మా.. ఈ ఏడుపు? ఏమైంది నీకు?”.
శృతి నుంచి ఎటువంటి సమాధానం లేదు.
“ఒరేయ్.. నువ్వొకసారి బయటికి వెళ్లు!” అని, కొడుకు వెళ్లాక..
“నాకు అర్థమైంది. ఆడవాళ్ల ప్రాబ్లెమ్ అనుకుంటా! పొత్తి కడుపులో నొప్పిగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? చెప్పు తల్లీ! నువ్విలా బాధ పడుతూ ఉంటే నేను చూడలేను” పమిట చెంగుతో శృతి చెక్కిళ్ల మీది కన్నీళ్లు తుడుస్తూ అంది రాజేశ్వరి.
కష్టం మీద ఏడుపు కంట్రోల్ చేసుకుని..
“నా ఒంట్లో బాగానే ఉంది” అంది శృతి చిన్నగా.
“మరి.. ఎందుకిలా ఏడుస్తున్నావు?”.
అత్తగారు అలా అడగగానే మళ్లీ దుఃఖం పొంగుకు వచ్చింది శృతికి.
“అలా ఏడుస్తూ ఉంటే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. నా తల్లివి కదా.. చెప్పు ఏం జరిగింది?”.. శృతి చుబుకం పట్టుకుంది రాజేశ్వరి.
“మాల్లో జనం విపరీతంగా ఉన్నారు. ఏమిటో అన్నీ ఊరికే పంచుతున్నట్లుగా జనం ప్రతిచోటా ఎగబడి పోతున్నారు. అదే అదనుగా భావించి ఒకడు.. ఒకడు..”
“ఆ ఒకడు.. వాడేం చేశాడు?”.
“నా నడుం, గుండెలు నొక్కేశాడు” భోరున మళ్లీ ఏడ్చేసింది శృతి.
క్షణంపాటు రాజేశ్వరి నోరు పెగలలేదు. కాస్సేపటికి తనని తాను సర్దుకుని..
“అప్పుడే చెప్పు తీసి వాడి చెంప చెళ్లుమనిపించాల్సింది” అంది కోపంగా.
“ఆ పాడు పని చేయగానే, వాడు గబగబా జనంలో కలిసి పోయాడు. మళ్లీ కనిపించ లేదు”.
“ఇది అబ్బాయి చూడలేదా?”.
లేదన్నట్లుగా తల ఊపింది శృతి.
“ఆయన ఐస్క్రీమ్ కోసం కౌంటర్ దగ్గిర ఉన్నారు. ఏమీ చేయలేని నా అశక్తతకి దుఃఖం పొంగుకు వచ్చింది. ఒళ్లంతా తేళ్లు జేర్రులు పాకుతున్న ఫీలింగ్. అందుకే ఆయనను తీసుకుని వెనక్కి వచ్చేశాను. జరిగిన దానికి నామీద నాకే అసహ్యంగా ఉంది. ఒళ్లు మైల పడినట్లుగా ఉంది. వాణ్ని ఏమీ చేయలేక పోయినందుకు దుఃఖం..” మళ్లీ దుఃఖం పొంగుకు వచ్చింది శృతికి.
“ఊరుకో తల్లీ! ఇలా ఎంతసేపు ఏడుస్తావు? ఇందులో నీ తప్పు ఏమీ లేదు. బాధ పడకు” కోడల్ని ఎలా ఊరడించాలో అర్థం కావడం లేదు రాజేశ్వరికి.
“నా మనసు రగిలిపోతోంది అత్తయ్యా! ఇటువంటి దుర్మార్గులను ఊరికే వదిలి పెట్టకూడదు”.
“అవుననుకో.. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. మనసు కుదుట పరచుకుని భోజనం చేసి పడుకో!”.. కోడలి భుజం తట్టి తన గదిలోకి వెళ్లిపోయింది రాజేశ్వరి.
మర్నాడు కొడుకు, కోడలు ఏదో గొడవ పడుతూ ఉంటే.. పూజ గదిలో నుంచి ఇవతలకు వచ్చింది రాజేశ్వరి.
“సాయంత్రం మాల్కి వెళ్లాల్సిందే!” అంటోంది శ్రుతి.
“ఎందుకు తీరుకూర్చుని గొడవ పెద్దది చేసుకోవడం. నలుగురూ నాలుగు మాటలు అనుకుంటారు. అవసరమా? అంతా ఒక పీడ కలగా భావించి మరచిపో!” అంటున్నాడు సాగర్.
“అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది బాధ. నేను వాణ్ని వదలను. ఆ దుర్మార్గుడికి శిక్ష పడాల్సిందే!”.
తల్లిని చూస్తూనే..
“చూడమ్మా! నీ కోడలు ఎంత చెప్పినా వినడం లేదు. సాయంత్రం మళ్లీ మాల్కి వెళ్లి, నిన్నటి సీసీటీవీ ఫుటేజ్ చూసి.. వాణ్ని ఐడెంటిఫై చేసి, వాడి మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలట! ఎందుకు చిన్న విషయం పెద్దది చేసుకుని నలుగురి నోట్లో నానడం అంటే వినడం లేదు!” అన్నాడు సాగర్.. శృతి మీద ఫిర్యాదు చేస్తున్నట్లుగా.
“ఇది చిన్న విషయమా? దీనిని ఆడవాళ్లు ఎంత అవమానంగా భావిస్తారో మీకు అర్థం అవుతోందా? వాడికి శిక్ష పడితే మళ్లీ జీవితంలో ఇటువంటి పాడుపని చేయడు. అది చూసి అటువంటి పాడు ఆలోచనలు ఉన్న వాళ్లకీ బుద్ధి వస్తుంది” ఆవేశంగా అంది శృతి.
“అయితే నా మాట విననంటావు. నీ మొండి పట్టుదల నీదే అన్నమాట! అమ్మా.. నువ్వయినా నీ కోడలికి అర్థమయ్యేలా చెప్పు. నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది ఇవాళ” బూట్లు వేసుకుని హడావుడిగా వెళ్లి పోయాడు సాగర్.
“అమ్మా.. వాడు అంతగా చెబుతున్నాడు కదా! ఇక్కడితో ఈ విషయం అందరం మరచిపోదాం. ఇక ఈ విషయంలో నువ్వు ముందుకు వెళ్లవద్దు” నచ్చ చెబుతున్న ధోరణిలో అంది రాజేశ్వరి.
“లేదు అత్తయ్య గారు! వాడు చేసిన పాడుపనికి వాడు శిక్ష అనుభవించాల్సిందే!” ఖచ్చితంగా చెప్పేసింది శృతి.
సాయంత్రం అయిదు అవగానే భర్తకు ఫోన్ చేసింది.
“ఏమిటో త్వరగా చెప్పు. చాలా బిజీగా ఉన్నాను” అన్నాడు సాగర్ చిన్నగా మాట్లాడుతూ.
“గుర్తుంది కదా.. సాయంత్రం మాల్కి వెళ్లాలి. ఆరు అవకుండా వచ్చేయండి”.
“ఇంకా నువ్వు అదే విషయం పట్టుకుని కూర్చున్నావు. చెప్పాను కదా.. గొడవ పెద్దది చేసి, నలుగురి నోట్లో పడటం ఎందుకని?! మరోసారి ఆలోచించు!”.
“మరో ఆలోచనే లేదు. వాణ్ని పోలీసులకి పట్టించి జైలుకి పంపించాల్సిందే!”.
“అలాగే చేద్దాం. చెప్పానుగా ఈరోజు చాలా బిజీ. మరోరోజు చూద్దాం”.
“కుదరదు.. ఈరోజే వెళ్లాలి!”.
“ఏమిటంత మొండితనం. ఈరోజు కుదరదు అంటున్నాను కదా.. రేపు వెళ్దాం”.
“మీరు ఆరు గంటలకల్లా రాకపోతే నేనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతాను” ఫోన్ కట్ చేసింది శృతి.
సాయంత్రం అయిదు గంటల కల్లా స్నానం చేసి, చీర మార్చుకుని రెడీ అయిపోయింది శృతి.
మాటిమాటీకి టైమ్ చూసుకుంటున్న శృతిని చూసి..
“అయితే అబ్బాయి వస్తున్నాడా!? మాల్కి వెళ్తున్నారా తల్లీ” అని అడిగింది రాజేశ్వరి.
“వెళ్తున్నాం అత్తయ్య గారూ! ఆ పాడు పనిచేసింది ఎవరైనా వదిలేది లేదు”.
“జాగ్రత్త తల్లీ! వాడు ఎలాంటి వాడో.. మనసులో పగ పెట్టుకుని ఏం చేస్తాడో అనేదే నా భయం”.
“తప్పు చేసిన వాళ్లు భయపడాలి. మనకెందుకు అత్తయ్యా భయం?” ధీమాగా అంది శృతి.
సరిగ్గా గడియారం ఆరు కొడుతూండగా వచ్చేశాడు సాగర్.
వస్తూనే..
“నొప్పితో తల బద్దలు అయిపోతోంది! కొంచం కాఫీ ఇవ్వు శృతి.. ప్లీజ్” అన్నాడు.
శృతి బ్రూ కాఫీ కలిపి తెచ్చింది.
“కాఫీ తాగగానే స్నానం చేసి వచ్చేయండి. పొద్దుపోయిన కొద్దీ మాల్లో జనాలు పెరిగిపోతారు”.
అలాగే అన్నట్లుగా తల ఊపి, కాఫీ తాగి స్నానానికి వెళ్లాడు సాగర్.
పావు గంట టీవీ చూసి..
“ఆరున్నర అవుతోంది.. రావాలి!” అంటూ టీవీ ఆఫ్ చేసి, బెడ్రూంలోకి వెళ్లింది శృతి.
సాగర్ స్నానం చేసి, నైట్ డ్రెస్ వేసుకుని కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని.. దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు.
“ఏమిటీ!? మీరింకా రెడీ అవలేదా? ఎన్నిసార్లు చెప్పాలి?” అసహనంగా అంది శృతి.
“కొంచం జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తోంది. పోనీ రేపు వెళ్దాం!? ఏమంటావు?” శృతి వైపు చూడకుండా అన్నాడు సాగర్.
ఆ మాట వినగానే భర్త నుదుటి మీద చేయివేసి చూసింది శృతి.
“జ్వరం ఏమీ లేదు. ఎందుకో మీరు మాల్కి రాడానికి భయ పడుతున్నారు!”.
“అవును! ఈ గొడవ ఎక్కడిదాకా పోతుందోనని భయం”.
“మనం ఎందుకండీ భయపడాలి? అటువంటి పాడు పని చేసినవాడు భయపడాలి గానీ! డ్రెస్ మార్చుకోండి.. వెళ్దాం!” భర్త చేయి పట్టుకుని పైకి లేవదీసింది శృతి.
పైకి లేస్తూనే చప్పున శృతి రెండు చేతులూ పట్టుకున్నాడు సాగర్..
“నన్ను క్షమిస్తానంటే నీకో నిజం చెబుతాను”.
“ఆ నిజం ఏమిటో తెలుసుకోకుండా క్షమిస్తానని ఎలా మాటిస్తాను?” నిర్మొహమాటంగా అంది శృతి.
“ఆ రోజు మాల్లో నేను కూడా అటువంటి పాడు పని చేశాను!” తల దించుకుని చెప్పాడు సాగర్.
“ఇప్పుడు మాల్కి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చెక్చేస్తే.. నేను కూడా దొరికి పోతాను”.
“మీరు చేసిన పాడుపని నేను కళ్లారా చూశాను లెండి!”.
పక్కనే బాంబు పడినట్లు అదిరిపడ్డాడు సాగర్.
మొహంలో కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు. ఒంట్లో ఒణుకు.
“నా కోసం నిన్ను తాకినవాణ్ని క్షమించు”.
“నా ఒంటి మీద ఎవరూ చేయి వేయలేదు. మీరు చేసిన పాడు పని చూసినందుకే రాత్రంతా నిద్ర లేకుండా ఏడ్చాను నేను! మరి మీరు అసభ్యంగా ఒళ్లంతా తాకిన ఆ అమ్మాయి కూడా రాత్రంతా నా కన్నా ఎక్కువగా ఏడ్చి ఉంటుంది కదా! అటువంటి పాడుపని చేస్తే ఆడవాళ్లు ఎంత బాధ పడతారో మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుందని అనుకుంటా! పోతే.. ఆ పని ఎంత ప్రమాదకరమో తెలియ చెప్పడానికి, మాల్ కి వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ చూద్దామని అన్నాను. ఆ అమ్మాయికి కూడా ఇటువంటి ఆలోచనే వచ్చి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మీ అమ్మగారి ముందు తల ఎత్తుకొగలరా? హాస్టల్లో ఉండి ఇంజినీరింగ్ చదువుతున్న అబ్బాయి మీ గురించి ఏమనుకుంటాడు? ఒకసారి ఊహించుకోండి”..
ఊపిరి తీసుకోవడం కోసం అన్నట్లుగా క్షణం ఆగింది శృతి.
“ఈ నేరానికి జైలు శిక్ష పడొచ్చు, ఉద్యోగం ఊడొచ్చు!”.
“ఐయామ్ వెరీసారీ శృతి. నేను నిజంగా అంతదూరం ఆలోచించ లేదు. అనుకోకుండా అలా..”
“అనుకోకుండా అలా ఎలా చేస్తారండి? అసలు పరాయి ఆడదాని ఒంటి మీద చేయి వేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఆ క్షణంలో మీకు మీ తల్లీ, చెల్లి, భార్య పిల్లలు ఎవరూ గుర్తుకు రారా?” అప్రయత్నంగా గొంతు పెంచింది శృతి.
“నెమ్మది.. అమ్మ వినగలదు” అన్నాడు సాగర్ గొంతు తగ్గించి.
“వింటే మంచిదే! తన పెంపకంలో కొడుకు ఎంత ఉన్నతంగా ఎదిగాడో తెలుసుకుంటారు”.
“ప్లీజ్ అలా మాట్లాడకు. ఇలా ఇదివరలో ఎప్పుడూ..” అంటూ సాగర్ ఇంకా ఏదో చెప్పబోతూండగా అడ్డుపడింది శృతి.
“ఇంతకు మునుపు ఇలా ఎన్నిసార్లు ఇటువంటి పాడుపని చేశారని నేను అడగను. ఇక మీదట ఇలా ఎప్పటికీ జరగదని అబ్బాయి అభయ్ మీద ఒట్టు వేయండి” అంటూ చేయి చాచింది శృతి.
మనస్ఫూర్తిగా ఆ చేతిలో చేయి వేసి, ప్రేమగా శృతిని దగ్గరికి తీసుకున్నాడు సాగర్.
“అమ్మా.. వాడు అంతగా చెబుతున్నాడు కదా! ఇక్కడితో ఈ విషయం అందరం మరచిపోదాం. ఇక ఈ విషయంలో నువ్వు ముందుకు వెళ్లవద్దు” నచ్చ చెబుతున్న ధోరణిలో అంది రాజేశ్వరి.
“లేదు అత్తయ్య గారు! వాడు చేసిన
పాడుపనికి వాడు శిక్ష అనుభవించాల్సిందే!” ఖచ్చితంగా చెప్పేసింది శృతి.
సాయంత్రం అయిదు అవగానే
భర్తకు ఫోన్ చేసింది.
“ఏమిటో త్వరగా చెప్పు. చాలా బిజీగా ఉన్నాను” అన్నాడు సాగర్
చిన్నగా మాట్లాడుతూ.
“గుర్తుంది కదా.. సాయంత్రం
మాల్కి వెళ్లాలి. ఆరు అవకుండా వచ్చేయండి”.
“ఇంకా నువ్వు అదే విషయం పట్టుకుని కూర్చున్నావు. చెప్పాను కదా.. గొడవ పెద్దది చేసి,
నలుగురి నోట్లో పడటం ఎందుకని?!
మరోసారి ఆలోచించు!”.
“మరో ఆలోచనే లేదు. వాణ్ని పోలీసులకి పట్టించి జైలుకి పంపించాల్సిందే!”.
“అలాగే చేద్దాం. చెప్పానుగా ఈరోజు చాలా బిజీ. మరోరోజు చూద్దాం”.
మాచిరాజు కామేశ్వర రావు
ఈ కథా రచయిత తూర్పుగోదావవరి జిల్లా పత్తిపాడులో పుట్టారు. ఆయన రాసిన మొదటి కథ.. ప్రసిద్ధ బాలల కథల మాస పత్రిక చందమామ (1969 సెప్టెంబరు సంచిక)లో ప్రచురితమైంది. ఒక్క చందమామలోనే ఆయన రాసిన 256 కథలు ప్రచురితమయ్యాయి. అయిదు వందలకుపైగా కథలు, ఏడు నవలలు రాశారు. అయిదు కథా సంపుటాలు వెలువరించారు. ఆయన రాసిన ‘పారిపోయిన దొంగ’ కథ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 12వ తరగతి విద్యార్థుల పాఠ్యాంశంగా ఎంపికైంది. ‘విధి నిర్వహణ’ అనే కథను మహారాష్ట్ర పాఠశాల విద్యా ప్రణాళిక సంస్థ 6వ తరగతి పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. బాలల అకాడమీ నవలల పోటీలో తను రాసిన ‘అడుగుకో ఆపద’ ప్రథమ బహుమతి గెలుచుకుంది. మాచిరాజు బాల సాహిత్యపీఠం స్థాపించారు. బడి పిల్లలకు ఏటా కథల పోటీలు నిర్వహిస్తున్నారు. మాచిరాజు సీతారామయ్య – రత్నకుమారి స్మారక పురస్కారాలను ఏటా ఇద్దరు బాలసాహితీవేత్తలకు ప్రదానం చేస్తున్నారు. ఇక ఈ కథ పుట్టుకకు బలమైన నేపథ్యమే ఉంది. ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని షీ టీమ్ అరెస్ట్ చేస్తున్న వార్తలు తరచూ వస్తుంటాయి. ఆ ఆకతాయిల్లో పరివర్తన కోసం ‘ఎవరు కౌన్సెలింగ్ చేస్తే బాగుంటుంది’ అన్న ఆలోచనకు అక్షర రూపమే ఈ కథ.
-‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
-మాచిరాజు కామేశ్వర రావు
9000080396