తనని చుట్టుకుని నిద్రపోతున్న మల్లి చేతిని తప్పించి, లేచి కూర్చున్నాడు సింహాచలం. “అప్పుడే ఎల్లాలా?” దిగులుగా అంటూ భర్తని మళ్లీ కౌగిలించుకుంది మల్లి. బలవంతంగా మల్లి కౌగిలి నుండి తప్పించుకుని లేచాడు. ఎదురు బద్దలతో అల్లిన తలుపు.. ఆ గదికి అడ్డుగా ఉంటుంది. దాన్ని తోసుకుని బైటికి వచ్చాడు సింహాచలం. ఎప్పటిలా తన పనులు పూర్తి చేసుకున్నాడు. ఉట్టి మీదున్న చట్టిలో గెంజన్నం టిపిన్ కేరియర్లో పెట్టుకున్నాడు. నంజుకి డబ్బాలో ఉన్న కాల్చిన ఎండుచేప ముక్కని చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాడు. అలికిడి విని తల్లి ఎంకటమ్మ వసారాలో తమ పడకకి అడ్డుగా ఉన్న తడిక తోసుకుని బైటికి వచ్చి చెప్పింది. “మీ నానకి మందులట్టుకురా.. రేత్రే అయిపోనాయి” “అత్తా! ఇప్పుడా మందులేత్తే లేచి కూకుంటాడా మాయ్య? ఇంకెన్నాల్లు సాకిరి సేత్తావు?” జాలిగా అత్తని చూస్తూ అంది మల్లి. “పెనిమిటి తోటేనే ఆడదాని బతుకు” శూన్యంలోకి చూస్తూ గొణుక్కుంది ఎంకటమ్మ. “అట్టుకొత్తాలే!” చెప్పులేసుకుంటూ చెప్పాడు సింహాచలం. “మల్లీ! నువ్వెదుర్రావే” కోడలికి చెప్పింది ఎంకటమ్మ.
మల్లి ఎదురొచ్చింది. తల్లి చూడకుండా మల్లి నడుంగిల్లి.. “వత్తానూ!” అన్నాడు. మల్లి చందమామలా నవ్వింది. గబగబా గోదారొడ్డున ఉన్న ఇసుక రేంపు దగ్గిరికి సైకిలేసుకుని బయలుదేరేడు సింహాచలం. వెన్నెల్లో ఇసుకదిబ్బలు వెండిమబ్బుల్లా మెరుస్తున్నాయి.అప్పటికి టైం తెల్లవారుజామున నాలుగైంది. అందరూ పడవ మీదున్నారు. మల్లయ్య వొడ్డున కట్టిన తాళ్లు విప్పుతున్నాడు. పరుగెత్తుకెళ్లి పడవ ఎక్కేడు సింహాచలం.“ఏటల్లుడూ! కొత్తపెళ్లాం పక్కలోంచి రాబుద్దేయనేదేటి?” అని ఏలాకోళం ఆడే ఈరాసామి మావ లేడిప్పుడు.గోదారమ్మతల్లి పున్నెమా అని ఏడాదిక్రితం పెద్దల్లో కల్సిపోయేడు.“ఏటీ.. ఒక్కొక్కొల్లనీ బొట్టెట్టి పిలవాలేంట్రా..?”భూషణం కొబ్బరికాయ కొట్టి గోదారమ్మకి దణ్నం పెట్టుకున్నాడు.
డ్రైవర్ ఇంజన్ ఆన్ చెయ్యగానే పడవ చప్పుడుచేస్తూ గోదారమ్మ గుండెను చీల్చుకుంటూ ముందుకు కదిలింది.“సల్లంగా సూడుతల్లీ!” అని అందరూ గోదారమ్మకి చేతులెత్తి మొక్కేరు. ఎంత వద్దనుకున్నా మల్లి గుర్తొస్తోంది సింహాచలానికి. దాని వెచ్చని పడకసుఖం గుర్తొస్తోంది. వెంటనే మంచంలో ఉన్న తండ్రి గుర్తొచ్చేడు. ఆశ నిండిన కళ్లతో చూసే తల్లి నుదుటిమీద ఎర్రెర్రని బొట్టు గుర్తొస్తోంది. మనసు బరువైంది.
తన చిన్నతనం నుంచీ తండ్రి గోదాట్లో ఇసక తీత పనికి ఎళ్లేవోడు. అప్పుడు భూషణానికి ఒక్క పడవే ఉండేది. పెద్దక్క పెళ్లికి తండ్రి అప్పు చేసేడు. రోజు కూలీ డబ్బులు వొడ్డీలు కట్టడానికే ఎగిరిపోయేవి. అమ్మానాన ఓ పూట గెంజితాగి పడుకోటం తను చాలాసార్లు చూసేవోడు. తను ఎనిమిదో క్లాసులోకి వచ్చేడు. బేగా బాకీలు తీర్చడానికి నాన రెండుట్రిప్పులు ఇసక తీతపని చేసేవోడు. ఇంటికొచ్చేక ప్రతిరోజూ వొళ్లునొప్పులనేవోడు. కాలం ఎటకారం చేస్తూ ముందుకెళ్లిపోతున్నాది.
చిన్నక్కకి పెళ్లి కుదిరింది. మళ్లీ అప్పుకోసం ఎతుకులాట. ఆరోజు తనకింకా గుర్తుంది. రేంపుకాడికి నానకోసం బువ్వట్టుకెళ్లిన చిన్నక్క చీకటడినా ఇంటికి రాలేదు. నాన ఇంటికొచ్చేడు. చిన్నక్క స్నేయితుల ఇళ్లన్నీ ఎతికొచ్చింది అమ్మ. నాన, తనూ తెల్సినవాళ్ల ఇళ్లకెళ్లి అడిగేరు. ఇసక రేంపులకాడ ఎతికి ఎతికి, అరిసి అరిసి అల్సిపోయేరు. భయంతో పోలీసు స్టేషనుకెళ్లి చెప్పొచ్చేరు.
చిన్నక్క కోసం తిండీనిద్రా మానేసి ఎతుకుతానే ఉన్నారు. మూడోరోజు పోలీసులు కబురెట్టేరు. ఇంటిల్లిపాదీ పరిగెత్తుకెళ్లేరు. గోదారి మద్దెలో రెల్లుగడ్డి దుబ్బుల్ని తట్టుకుని ఆగిన చిన్నక్క సెవం ఉబ్బిపోయి కనబడింది. గుండెలు పగిలేలా ఏడ్చినా గోదారమ్మ నిజం చెప్పలేదు. అక్క ఎందుకు చచ్చిపోయిందో తనకెవరూ చెప్పలేదు. గోదారొడ్డునే ఉన్న శ్మశానంలో కప్పెట్టొచ్చేరు.“గోదారమ్మ నా బిడ్డని మింగేసిందిరో దేవుడా!”.. చిన్నక్క గుర్తొచ్చినప్పుడల్లా తన గర్భసంచిని తడుముకుంటూ అమ్మ పెట్టే శోకం.. గాలితోపాటు తేలుతూ గోదారమ్మ అలల్ని జాలిగా తాకి, జవాబుకోసం ఎతుకుతూనే ఉండేది. ఆ కన్నీళ్లు గోదారి వరదలా పొంగుతూనే ఉండేయి.
‘సిన్నదింకా ఇంటికి రానేదయ్యా!’ గుర్తొచ్చినప్పుడల్లా నాన్నని నిలబెట్టి అడుగుతూనే ఉండేది అమ్మ. పేదోళ్ల కన్నీళ్లు పెదాల్ని కూడా తడపవేమో? నాన అప్పుడప్పుడూ పోలీసుస్టేషనుకి ఎళ్లొచ్చే వోడు. ఆ రోజంతా అన్నం తినకుండా అమ్మతోపాటు ఏడుస్తూ ఉండేవోడు. చిన్నక్క.. మర్సిపోలేని జ్ఞాపకం అయిపోయింది. రానురాను ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. తన బాల్యం ఎటో ఎగిరిపోయింది. తన చదువు ఆగిపోయింది. రెండు పొద్దులా కడుపునిండా తినే బువ్వ పోయింది. స్నేహితులతో కల్సి గోదాట్లో సరదాగా పోటీలుపడే ఈతపోయింది. ఇంట్లో సంతోషం పోయింది. అసలు ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉండేది.
నాన ఫుల్లుగా తాగొచ్చేవోడు. అమ్మతోపాటు కూకుని ఏడ్సేవోడు. చిన్నక్క చావుకి కారణమైనోడు దొరకలేదని అప్పుడప్పుడూ తల బాదుకునేవోడు. అంటే సిన్నక్కని ఎవరో సంపేసి గోదాట్లో పారేసేరని తనకి పదారేళ్లు వచ్చేదాకా తెలవలేదు. తర్వాత తనూ ఆళ్లతోపాటు ఏడ్చేవోడు. నాన ఆరోగ్యం పాడయింది. ఇసుక తియ్యలేక పోతున్నాడని, భూషణం పనికి రావద్దన్నాడని ఓరోజు ఇంటికొచ్చి ఏడ్చేడు. మూడు కడుపుల ఆకలి తీర్చడంకోసం నాలుగిళ్లలో పనికెళ్లేది అమ్మ. పదో తరగతి పరీచ్చలు రాయకుండానే బడి మానేసేడు తను. బజార్లో ఉన్న బట్టల కొట్లో పనికి ఎళ్లేవోడు. ఆర్నెల్ల తర్వాత.. ‘ఇంకో పడవ కొన్నాను. పనికి రా!’ అంటూ నానకి కబురెట్టేడు భూషణం. నాన మళ్లీ పనికెళ్లడంతో పస్తుల బాధ తప్పింది ఇంట్లో. బట్టల కొట్లోకంటే ఇసకతీత పనిలో డబ్బులు ఎక్కువొత్తాయని తననికూడా పనికి పెట్టాడు నాన.
‘ఆడికెందుకయ్యా.. ఇసకతీత పని. పది పరీచ్చలు రాత్తాడు వొదిలెయ్యి!’ అని అమ్మ అడ్డు చెప్పినా నాన ఇనలేదు. ‘ఎంత సదివినా కూలిపనే సెయ్యాలే! చేసిన అప్పులు ఎట్లా తీరతాయి’ అని వాదించేవోడు. పనిలో జేరినంక నాన కష్టం తెలిసొచ్చింది తనకి. మూడునాలుగు అడుగుల లోతు మునిగి.. గోదారమ్మ మేటేసిన ఇసుక తియ్యటం. రెండు నిమిషాలు ఊపిరి బిగపెట్టి, నీళ్లలో మునిగి, తట్టతో ఇసక తీసి.. పైకి లేచి పడవలో ఎయ్యాలంటే కొన్నిరోజులు భయపడ్డాడు. మానేస్తే పని దొరకదు. పని కష్టమైనా ఏ రోజు కూలీ ఆరోజు చేతికి వొస్తుందని నాన బతిమలేవోడు. కష్టమైనా వోర్చుకుని ఆపని అలవాటు చేసుకున్నాడు తను.
ఆరోజు నాన ఎందుకో కొత్తగా కనబడ్డాడు. ఏదో నిజం కనిపెట్టినోడిలా అమ్మతో కొత్తగా మాటాడేడు. తను వద్దన్నా ఇనకుండా చీపు లిక్కరు తాగేడు. పోలీసు టేసనుకి ఎల్లొచ్చేనని.. అమ్మతో నాన చెప్పడం తను విన్నాడు కానీ, ఇవరం చెప్పలేదు. ఆరోజు ఓ మనిషి తక్కువయ్యేడని భూషణం గోదాట్లోకి దిగేడు. ఇసకతో పడవ సగం నిండినంక తనకి నాన, నానతోపాటు భూషణం కనబడళ్లేదు. భయంతో అందరికీ అరిచి చెప్పేడు. అందరూ తలోవైపు గోదాట్లో ఈతకి దిగేరు. మధ్యలో ఉన్న ఇసుక మేటమీద ఉలుకూపలుకూ లేకుండ నాన కనబడ్డాడని పడవని అటు తిప్పేరు. నీళ్లు కక్కించి పడవలోకి ఎక్కించేరు. భూషణం ఎప్పుడొచ్చాడో ఆయాసపడతూ పడవలో కూర్చున్నాడు. నానని గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకెళ్లేడు. పక్షవాతం వచ్చిందని డాక్టరుగారు చెప్పేడు. కాలూసెయ్యీ పడిపోయేయి. నోటిమాట ఉన్నా అదెవరికీ అర్థం కాదు. భూషణం బాధపడుతూ పదివేలిచ్చేడు.
ఇప్పుడు అమ్మ చిన్నక్కని మర్చిపోయి నానకోసం ఏడుస్తోంది. కష్టం-సుఖం పంచుకునే నానని జీవచ్చవంలాగా చూడాల్సి వస్తోంది. పతీరోజూ అమ్మ గుండెకోతని కళ్లతో చూస్తున్నాడు. బతుకంటే భయం పట్టుకుంది. అయినా బతుక తప్పదు.ఏరోజు కట్టపడకపోతే ఆరోజు ఇల్లు గడవదు. బాకీలోళ్లు ఇంటిమీద పడతారు. ఇంట్లో అవసరాలు అరిచి గోలెడతాయి. పన్లు లేనప్పుడు అప్పుకోసం పరుగెత్తడం, పనిచేసి వడ్డీతో బాకీలు తీర్చటం అలవాటు అయిపోయింది. మల్లి తన బతుకులోకి ఎన్నెల్లా వొచ్చింది. తన మేనమావ కూతురు. తనలో ఏం మంచి సూసేడో.. ‘నువ్వే నా అల్లునివి’ అని మల్లినిచ్చి పెళ్లిచేసేడు. పెళ్లికోసం ఉన్న రెండుగదుల తాటాకుల కొంపనీ తాకట్టు పెట్టి భూషణం దగ్గర డబ్బు తీసుకున్నాడు. ఎచ్చెచ్చని మల్లి పక్కలో సుఖపడే ఆ కొన్ని క్షణాలు కూడా దిగులుగానే ఉంటాది. ఏ రోజుకా రోజు బతుకు ఎటు పోతుందో తెలవదు.‘ఈ పని మానేసి, మా నానకాడ తాపీపని నేర్సుకోరాదా!’ అంటాది మల్లి.
నవ్వే తన సమాధానం. మల్లి తన బంగారం.
“ఏటల్లుడూ దిగవేటి?” జబ్బ చరుస్తూ అన్నాడు దామోదరం. అప్పటికే లంగరేసి తాడుతో పడవ కదలకుండా కట్టేడు మల్లయ్య. ఒక్కొక్కరూ ఒంటి మీదున్న బట్టలు విప్పి, డ్రాయర్తో నీళ్లలోకి దిగేరు. తల తడవకుండా పాలిథిన్ కవర్‌ను టోపీలా పెట్టుకున్నారు. తట్టలు మానేసారు.
బకెట్‌తో ఇసుక తోడి పడవలో వేస్తున్నాడు సింహాచలం.. మిగిలిన కూలీలతోపాటు. సూరీడు గబగబా పైకొస్తున్నాడు. ఆ వేడి ఒంట్లో మంట రాజెయ్యడం లేదు. తడిచిన ఒళ్లు బరువెక్కుతూ ఉంది. తనలోంచి సంపదను దోచేస్తుంటే గోదారమ్మ ఉండుండి నొప్పులు పడుతున్నట్టు అటూ ఇటూ కదులుతోంది. సమయం పదయ్యింది. ఇసుకతో పడవ బరువెక్కింది.అందరూ కేరేజీలు తెరిచారు. గెంజన్నంలో ఎండుచేప నంజుకుని తింటున్నాడు సింహాచలం. టిఫిన్ కేరేజీ మూతమీద, తను తెచ్చుకున్న ఆవకాయ పచ్చడి అన్నం రెండు ముద్దలు పెట్టి..‘తినల్లుడూ!’ అంటూ ఆప్యాయంగా అనే ఈరాసామి మావ గుర్తొచ్చేడు సింహాచలానికి. కళ్లలో నీళ్లూరేయి.
వాళ్లతోపాటే భూషణం ఇంటినుండి తెచ్చుకున్న టిఫిన్ తిన్నాడు. పడవ బయలు దేరుతోందని అవతలి పక్కనున్న ఎవరికో ఫోన్ చేసి చెప్పేడు భూషణం.నీళ్ల మీద నాలుగంగుళాలు మాత్రమే పైకి తేలుతూ నిండు గర్భిణిలా కదిలింది పడవ. శరీరాల్ని ఓదార్చుకుంటూ గోదారమ్మ వైపు చూస్తూ కూర్చున్నారు కూలీలు. ‘బూసనం గారికి డబ్బులు బానే మిగులుతాయా మావా?’.. అని ఓసారి ఈరాసావి మావని అడిగేడు తను.‘ఆల్ల పెద్దోల్లు మనలాగే ఇస్క తీత పనే సేసేవోల్లు. బూసనం ఎట్టా కొన్నాడో.. పడవ కొనేసినాడు. ఆడు ఓనరయ్యేక నీల్లలో దిగటం, ఇస్క తియ్యటం మానేసినాడు.
మనకియ్యాలి, డీజిలుకి కర్సెట్టాలి. అక్కడ రేంపు కాడ ఇస్క దించే కూలోల్లకి ఇయ్యాలి. ఇయ్యన్నీ పోను ఆడికి మిగిలేయి ఏటుంటాయిలే అల్లుడూ!’ చెప్పేడు మావ. ‘ఏమీ మిగలకపోతే రెండో పడవ ఎట్టా కొన్నాడు మావా?’ ‘ఏమోరా.. అయ్యన్నీ మనకెందుకులే. లోతుకెలితే మన తలరాతలు మారిపోతాయి!’ వేదాంతిలా నవ్వేడు మావ.కూలీ డబ్బులు చేతిలో పెట్టేడు భూషణం. అక్కడితో ఆ రోజు పని అయిపోయింది. సింహాచలం ఆ డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో తండ్రికి మందులు కొన్నాడు. చేతిలో రెండొందలు మిగిలేయి. ఈటితో ఎన్నవసరాలో? రోజువారీ బాకీకి రెండొందలు కట్టాలి. కొత్త సిన్మాకి ఎల్దామంటే, అట్టాగేనని మల్లికి ఆశ పెట్టేడు. మల్లి మొగం సిన్నబుచ్చుకుంటాది. నిట్టూర్చి మూరెడు మల్లెపూల దండ కొన్నాడు. సింహాచలం ఇంటికి వచ్చేవరకూ గుమ్మంలోకి చూస్తూనే ఉంది ఎంకటమ్మ. కొడుకును చూసాక ప్రాణం కుదురుకుంది. “మావకి మందులు తెత్తావో లేవోనని అత్త నీకోసం ఎదురు సూత్తాంది”… పరాచికం ఆడింది మల్లి.అక్కలా, నానలా తనకేం అవుతుందోనని అమ్మ భయం.. అది తనకి మాత్రమే తెలుసు. ఆ గుండె ఎన్ని సేదు నిజాల్ని బరించిందో కూడా తెలుసు. ఎండిపోయిన బావుల్లా ఆ కళ్లు ఎంత గుంటలు పడినాయో, రోజురోజుకీ అయ్యి ఎంత లోతుకెల్లి పోతున్నాయో తను సూత్తానే ఉన్నాడు.
తల్లి చేతికి మందులున్న కవరు అందించాడు.“అయ్యా! తానంచేసి బువ్వతిను” అంది.జాలి దల్చినట్టుగా ఓ నీటిచుక్క ఆమె కంటిలో తళుక్కున మెరిసిందని ఆమెకికూడా తెలీదు. పెనిమిటి ఉన్న పంచలోకి దారితీసింది ఎంకటమ్మ. “సిన్మాకి ఎల్దారా” మొగుడి భుజానవాలి గుసగుసలాడింది మల్లి.“రేపెల్దాంలే!” అని మల్లి బుగ్గన ముద్దెట్టుకుని, స్నానం చెయ్యడానికి దొడ్లోకెళ్లాడు.మల్లి అతని వెనకే నడిచింది. చిన్నిచిన్ని కోరికలు. తీరని సంతోషాలు ఎన్నింటినో సరిపెట్టుకోడం అలవాటు అయిపోయింది ఇద్దరికీ. నులక మంచంలో ఉన్న తండ్రి పక్కన కూర్చున్నాడు. తండ్రి చేతిని తీసుకుని నిమిరాడు. తండ్రి ఎప్పటిలాగే ఓ చెయ్యి పైకెత్తి, పీకని నులిమెయ్యమని ఉక్రోషంగా సైగలు చేస్తున్నాడు. సింహాచలం కళ్లలోకి నీళ్లొచ్చాయి. మందుబిళ్లలు వద్దని తల కోపంగా పక్కకి తిప్పుకొన్నాడు రాజయ్య. “మందు బిల్లలు ఏసుకోడా మీనాన. ఆ మందు కావాల్నేమో అడుగు.. లేసి కూకుంటాడు” అంది ఎంకటమ్మ. ఆ రాత్రి ఎందుకో ఈరాసామి మావ బాగా గుర్తొచ్చేడు సింహాచలానికి.
ఈరాసామి మావ పనికి రాలేదారోజు. మావ చోటులోకి ఇంకో కొత్తమనిషి పనికొచ్చేడు. మావ పనిలోకి రాలేదంటే దిగులేసింది. నిండిన పడవ మునగనా.. తేలనా.. అన్నట్టు నీళ్లలో తేలుతూ, ఒడ్డుని చేరుకోవాలని ఆత్రుత పడుతోంది. పడవ ఒడ్డు చేరగానే కూలీ డబ్బులు తీసుకుని ఈరాసామి మావ ఇంటికెళ్లేడు. లోపల పడుకుని ఉన్న మావ తనని చూసి నవ్వేడు.“ఏటయ్యింది మావా! ఒంట్లో బాగానేదా ఏటి?” స్టూలు మీద కూర్చుంటూ అడిగేడు. “ఏటోరా! నీరసంగుందని ఆసుపత్రికి ఎలితే, ఏటేటో పరీచ్చలు చేసేరు. సేత్తన్న పని మానెయ్యాలంట, తాగటం మానెయ్యాలంట. ఆళ్లకెట్టా తెలుత్తాయిరా మన కట్టాలు. పనికి ఎల్లకపోతే ఇంటిల్లిపాదినీ పత్తులెట్టాలి. తాక్కపోతే ఒల్లంతా సలిపేత్తాదని!” అంటూ నీరసంగా నవ్వేడు.
“బూసనం కొత్తోన్ని పన్లో ఎట్టుకున్నాడు మావా!” జేబులోంచి రెండొందలు తీసి మావచేతిలో పెట్టి చెప్పేడు. “నేనింక పనికిరాని గొడ్డునే గదరా అల్లుడూ!” తనకి ఏదోలాగ అనిపించింది. ఈ బతుకులు ఇంతేనా? “జేగ్రత్త మావ” అని మావ చెయ్యి నిమిరేడు. “అన్నియ్యా! తాత బదులు నేను ఇసకతీత పనికొత్తా! నువ్వోపాలి వోనరుగారికి సెప్తావేటి”.. ఈరాసావి మనవడు ఈరేషు ఆశగా అడుగుతున్నాడు. ఇలాగే తనూ నాన ఎనకాల ఎళ్లేడు. ఇప్పుడు ఈరేషు.
‘ఇదేటి వారసికం దేవుడా!’ అని గట్టిగా అరవాలనిపించింది. “అల్లుడూ! నోరు జిల్లార్చుకు పోతాంది. ఓ సీసా తెచ్చిపెట్టరా నీకు పున్నెవుంటాది” అంటూ చెయ్యట్టుకున్నాడు మావ.జాలేసింది. మర్నాడు మందుసీసా కొనుక్కెళ్లేడు. ఎంత పొంగిపోయేడో. నెలరోజుల తర్వాత మావని బూడిద సెయ్యటానికి మల్లా ఎళ్లేడు. ఇప్పుడు మావ మనవడు ఈరేషు పనికొత్తన్నాడు.వానలు పడితే రేంపులకాడ పనుండదని కూలీలకి దిగులు మొదలవుతుంది. వానాకాలం ఎంత కష్టంగా గడుస్తుందో ఆ దేవుడికే బాగాతెలుసు. భయం భూతంలా వెంటాడుతూనే ఉంటుంది. చెప్పా పెట్టకుండానే వరద గుమ్మంలోకొచ్చి నిలబడుతుంది. ఆదుకునే చేయికోసం ఎదురుచూపులు. తెల్లారితే ఏం జరుగుతుందో తెలీని బతుకు పోరాటాలు. కాలం వెక్కిరింతలు. తలదాచుకునే కాసింత చోటునీ చెల్లాచెదురు చేసికానీ ఊరుకోని గోదారమ్మ ఆటలు. ఎప్పుడూ చుట్టూ కష్టాల సుడిగుండాలే.
జ్వరాలంటూ ఇద్దరు కూలోళ్లు ఇసుక తీతపనికి రావడంలేదు. కాంటాక్టర్ గొడవ చేస్తున్నాడని, తప్పక భూషణం నీళ్లలోకి దిగేడు. కూలీలు నీళ్లలో మునిగి తేలుతున్నారు. భూషణం ఎంతసేపటికి పైకి రాకపోయేసరికి అందరూ కంగారుగా నీళ్లలో వెతుకులాట మొదలెట్టేరు. అరగంట తర్వాత అందరూ అలసటగా నీళ్లలోంచి పడవ దగ్గరకు వచ్చేరు.‘బూసనం బాబుని గోదారమ్మ మింగేసినాదా ఏటి?’.. అందరూ కంగారు పడిపోతున్నారు. సింహాచలం రొప్పుతూ నీళ్లలోంచి పైకి తేలి పడవలోకి ఎక్కేడు. భూషణం జాడలేదు.గజ ఈతగాళ్లు నీళ్లలో దిగి గాలిస్తున్నారు. మర్నాడు గోదారి మధ్యలో దుబ్బుల్లో భూషణం శవం దొరికింది. ఏమెరగనట్లు గోదారమ్మ ప్రశాంతంగా ప్రవహిస్తోంది. పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకి అప్పగించేరు. నీళ్లలో ఊపిరందక చనిపోయాడు. హర్ట్ స్ట్రోక్.అందరితోపాటు భూషణం అంతిమ యాత్రలో పాల్గొని, ఇంటికొస్తూ రెండు మందు సీసాలు తెచ్చేడు సింహాచలం. తండ్రిని లేపి కూర్చోబెట్టేడు. “బూసనం సచ్చిపోయేడు నానా!”.. మందు గ్లాసు తండ్రి నోటికి అందిస్తూ చెప్పేడు. రాజయ్య కొడుకు వైపు నమ్మలేనట్లు చూస్తున్నాడు. “గోదారమ్మ మింగేసిందంట నానా!” చెప్పేడు సింహాచలం.
రాజయ్య కొడుకు చేతిలోంచి మందుగ్లాసు లాక్కుని గబగబా తాగేడు. పొలమారిన తండ్రి తలమీద ప్రేమతో తట్టి గుండెకి అదుముకున్నాడు. కళ్లలోంచి నీళ్లుజారి మందుగ్లాసులో కలిసేయి.‘బూసనం సూపు ఈరాసామి మనవరాలిమీద పడిందిరా! ఇంక ఆ పిల్లని దేవుడే కాపాడాలి. రాజయ్య కూతుర్లాగే ఈ పిల్లా గోదారి పాలైపోద్దేవోనని గుబులుగా ఉంటోందిరా! బూసనం, ఆ ఇసక కాంటాట్టరూ కలిసి ఈరాసావి మనవరాల్ని ఏటి సేత్తారో.. ఏటో? కళ్లతో సూసినా ఎవల్లకీ సెప్పలేను. నోరిప్పి సెప్పలేని గోదారమ్మ ఈ గోరాన్ని నెత్తి నేసుకుంటాది’..
మల్లన్నకు రాములు సెప్పడం తను ఇన్నాడని ఎవరికీ తెలవదు. ఆల్లకి తెలవని నిజం కూడా తనకి తెలుసు. నానకి నిజం తెలిసిందని అనుమానవొచ్చి, బూసనమే నానని బతికించినట్టు నాటకవాడి, బతికున్న శెవాన్ని సేసేడని. సిన్నక్కలా ఈరాసావి మావ మనవరాలి బతుకుని ఏటిపాలు కాకుండా కాసేడు తను.‘ఓరోజు పని పోయినా పర్లేదు గానీ, అక్కని బువ్వట్టుకుని రావొద్దని సెప్పు!’ ఈరేషుని ఎచ్చరించడం గుర్తొచ్చింది.
రాచ్చస సంవారం ఏరోజైనా జరిగే తీరుద్దని బూసనం అనుకుని ఉండడేమో!? “సిన్నక్కని సంపేసినోన్ని గోదారమ్మతల్లి ఒదన్నేదు నానా!”.. అతని నవ్వు గాల్లో తేలుతూ గోదారి అలల్లోకి చేరింది. మర్నాడు తెలతెలవారుతుండగా రాజయ్య ఈ లోకాన్ని విడిచేడు. తల్లి నుదుటిమీంచి రాలిన కుంకుమ బొట్టులా.. ఎర్రెర్రని సూరీడు పైకొచ్చేడు. “పోనీలేరా సింవాసెలం! మీ నాన మందుమీద మనేదెట్టుకున్నాడు. మనేదతీరి తుప్తిగా ఎల్లిపోనాడు” కొడుకువైపు నీళ్లు నిండిన కళ్లతో చూసింది ఎంకటమ్మ. గోదారమ్మ పైనుంచి తేలి వచ్చిన చలచల్లని గాలి.. ఎంకటమ్మ ఎదని జాలిగా తడిమింది.
జాస్తి రమాదేవి
కాస్త ఆలస్యం కావొచ్చు కానీ, రాక్షస సంహారం జరిగే తీరుద్దని చెప్పే కథ.. సంభవామి యుగేయుగే! రచయిత్రి జాస్తి రమాదేవి. స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ములకల్లంక. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉంటున్నారు. వీరు రాసిన రచనల్లో ఇప్పటివరకు 170 కథలు.. వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో.. 70 కథల వరకూ బహుమతులు పొందాయి. బహుమతి పొందిన మొదటి కథ.. భారమైన బంధాలు. 1993లో ఆంధ్రజ్యోతి – తెలుగు కళాసమితి న్యూజెర్సీ రాజాలక్ష్మి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన దీపావళి కథల పోటీలో బహుమతికి ఎంపికైంది. ‘ప్రేమంటే ఏంటి…?’ నవల.. ఉషా-సృజనా ఫౌండేషన్ పోటీలో బహుమతి దక్కించుకున్నది. ‘నీ కౌగిలిలో తలదాచి’ నవల.. స్వాతి పదహారు వారాల సీరియల్ పోటీలో బహుమతి పొందింది. త్వరలోనే సీరియల్‌గా రాబోతున్నది. ‘పందిరి పట్టెమంచం’ పేరుతో త్వరలోనే కథా సంకలనం.. ప్రచురణకు సిద్ధంగా ఉన్నది. నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీ-2022లో వీరు రాసిన ‘వేగుచుక్క’.. ప్రోత్సాహక బహుమతి పొందింది. ఈ ఏడాది ‘సంభవామి యుగేయుగే’ ప్రత్యేక బహుమతికి ఎంపికైంది.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
-జాస్తి రమాదేవి
93915 55364