“బాబోయ్ మళ్లీ ఇడ్లీనా.. నాకొద్దు. నేను కాలేజ్ క్యాంటీన్లో రిచ్‌గా తింటా” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది మల్లిక.“నీకేం చెప్పినా చెవికి ఎక్కడం లేదు. ఏది చేసి పెట్టినా నోట్లోకి వెళ్లడం లేదు. మీ నాన్నకు చెప్పి క్లాస్ పెడితే తప్పా.. నువ్వు దారికి వచ్చేలా లేవే! ప్లేట్లో పెట్టింది తింటేనే కాలేజీకి. లేదంటే లేదు” అని వంట గదిలోంచి గొంతు పెంచింది తల్లి మహాలక్ష్మి.
“ఇడ్లీలను నువ్వేమైనా కాంటాక్ట్ తీసుకున్నావా? లేకా ఇడ్లీనే చేయాలని కొత్తగా చట్టమేదైనా తెచ్చారా? వేరే ఏది చేయటం రాదనట్టుగా? చేసిందే చేసి.. చెప్పిందే చెప్పి.. తప్పంతా నాదే అంటావ్? ఎందుకమ్మా నా జీవితంతో ఆడుకుంటావ్??”.. నవ్వుతూ, అద్దంలో చూసుకుంటూ తల్లిని అడిగింది మల్లిక. “నీతో నావల్ల కాదే.. ఏయ్ రాజీ! నువ్వైనా తింటున్నవా లేదా?” అని మరింత గొంతు పెంచింది మహలక్ష్మి. “తినేశానమ్మా! చూడు” అంటూ ఖాళీ ప్లేట్ చూపించి, కిచెన్‌లోకి వెళ్లింది రాజీ. “రాజీని చూసి నేర్చుకోవే! అది తిన్నా తింటుంది. చేసినా పని చేస్తుంది. పైగా బుద్ధిగా చదువుతుంది. నువ్వూ ఉన్నావ్ ఎందుకు? దండగ. కాలేజీకెళ్లి రావడానికే ఆయాసపడుతావు. చూస్తూ ఉండు.. అది ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతుంది. నువ్వే డౌట్” అంది తల్లి.
“అమ్మా! రాన్రాను నీకు రాజీపైనే ప్రేమ ఎక్కువవుతుందే! కొద్దిరోజులుగా చూస్తున్న! కొద్దికొద్దిగా నన్ను మర్చిపోతున్నావ్. కొంపదీసి దానికి గుడిగానీ కట్టేస్తావా ఏంటి?” అంటూ నుదుటిన బొట్టు స్టిక్కర్ అంటించుకుని, బ్యాగ్ భుజానికి వేసుకుంది. “నువ్విలాగే చెప్పింది వినకుండా, పెట్టింది తినకుండా తిక్క వేషాలు వేస్తుంటే.. నీ మాటే నిజం చేస్తా! దాన్ని ఇంటి పిల్లగా చేసి సర్వ హక్కులిస్తా” అంది. “ఆ పనిచెయ్! ఎంచక్కా అది ఇక్కడే ఉండిపోతుంది. ఏమంటావ్ రాజీ?” రాజీని చూస్తూ అడిగింది మల్లిక.“నువ్వెలా చెప్తే అలానే మల్లిక. కానీ, అమ్మ చెప్పింది కూడా వినాలి కదే!” అంది ముద్దు ముద్దుగా. “ఓయ్ మొద్దు! గుద్దుతా.. నువ్వు నా ఫ్రెండా? మమ్మీ ఫ్రెండా? ఇడియట్.. అది సరే ఇంకా ఎన్ని రోజులు నీకు హాలిడేస్?”. “ఈరోజే చివరి రోజు. రేపటి నుండి స్కూల్” చెప్పింది రాజీ. అప్పుడే వచ్చిన తులసమ్మ.. “ఏంటే? పనిపిల్లను ఇంటి పిల్లను చేస్తావా? ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. అప్పుడే అందరికీ మంచింది. మళ్లీ ఆమాట నీ నోట వింటే వీపు చీరేస్తా”.. అంటూ కోడలిపై విరుచుకుపడింది. మనసు చివుక్కుమన్నది మహాలక్ష్మికి. “అత్తయ్యా! ఏదో మాట వరసకన్నాను. క్షమించండి” అన్నది. “లేడీ విలన్ వచ్చింది. నేను వెళ్తున్న! బై.. బై..” అని చెప్పి, బయటికి నడిచింది మల్లిక. “ఒసేయ్ రాజీ.. పైన గదిలో రాగి బిందె, ఇత్తడి చెంబు ఉన్నాయి. అవి తీసుకొచ్చి శుభ్రంగా తోమి నా గదిలో పెట్టవే”.. రాజీకి పని పురమాయించింది తులసమ్మ. “సరే పెద్దమ్మ గారూ!” అంటూ మేడపైకి వెళ్లింది రాజీ.
మనోహర్-మహాలక్ష్మి భార్యాభర్తలు. మనోహర్ మార్కెట్ కమిటీ చైర్మన్. వారి డ్రైవరైన రాజయ్య కూతురే రాజీ. పుట్టగానే తల్లి కాలం చేసింది. రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో రాజయ్య ఒక కాలు పోగొట్టుకున్నాడు. దాంతో జీవనోపాధి పోయింది. ఎనిమిదో తరగతి చదువుతున్న రాజీ నేరుగా మహలక్ష్మి వద్దకు వచ్చి.. “అమ్మా! మా నాన్న పనిచేయలేని పరిస్థితిలో ఉన్నాడు. మేము బతకాలంటే నేనే పని చేయాలి. చదువు ఆపేసి మీ ఇంట్లో పనికి వస్తాను” అని ధైర్యంగా చెప్పింది. రాజీ ఉన్నతమైన మాటలకు ఆశ్చర్యపోయినా.. చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవడం నచ్చని మహలక్ష్మి తిరస్కరించింది. కానీ రాజీ పట్టు వదలలేదు. “ఒకపని చెయ్! ముందు చదువుకో! నేనే చదివిస్తాను. తరువాత ఖాళీ టైంలో పని చేసుకో! జీతమిస్తా!” అని చెప్పింది. సరేనని ఆ ఇంట్లో అడుగు పెట్టింది రాజీ. ప్రస్తుతం రాజీ పదో తరగతి చదువుతోంది. మల్లిక ఇంటర్ రెండో సంవత్సరంలో ఉంది. ఈ రెండేళ్ల కాలంలో మల్లిక-రాజీ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు.
“మేము ఊరెళ్లి వచ్చిన దగ్గర నుండి రాజీ రావడం మానేసింది. మీకేమైనా చెప్పి వెళ్లిందా అండీ!” అని భర్తను అడిగింది మహాలక్ష్మి. “నా పనులే నాకు సరిపోతున్నాయి. పనిపిల్ల గురించి నాకేం తెలుసు?” అని కస్సుమన్నాడు మనోహర్. అప్పుడే వచ్చిన మల్లిక.. “నాకూ రిప్లయి లేదమ్మా! రేపొకసారి ఇంటికెళ్లి కనుక్కుంటా” అని చెప్పింది.పేదరికానికి అద్దం పట్టేలా.. ఊరవతల విసిరేసినట్టుగా ఉంది ఆ ఇల్లు. వాకిట్లో నులక మంచం పైన కూర్చుని తాళ్లు పేనుతున్నాడు రాజయ్య. యాక్టివా పైన వచ్చి ఇంటి ముందు స్టాండ్ వేసి, బండి దిగింది మల్లిక. ఆమెను గుర్తుపట్టిన రాజయ్య.. “రామ్మా మల్లిక! బాగున్నావా తల్లి!” అని అడిగాడు.
“బాగున్నా బాబాయ్! రాజీ ఎక్కడ?” అని అడిగింది. “ఏమో తల్లీ! మనిషిలో మనిషిగా లేదమ్మా! ఒంట్లో బాలేదేమో! ‘దవాఖానకు పోదామా!?’ అంటే వినదు. మంచం దిగడం లేదు. కంచం ముట్టడం లేదు” అంటూ వాపోయాడు. ఇంటి లోపల అడుగు పెట్టింది మల్లిక. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక మూల మంచంలో కళ్లు మాత్రమే కనిపించేలా దుప్పటి కప్పుకొని పడుకుంది రాజీ. ఆమెను సమీపించి.. “రాజీ.. రాజీ” అంటూ తట్టి లేపింది.భారంగా కళ్లు తెరిచి మల్లికను చూసి.. “హా.. మల్లిక!” అంటూ లేచి కూర్చుంది.పక్కనే కూర్చుంటూ.. రాజీని పరీక్షగా చూసింది మల్లిక. చెదిరిన జుట్టు, మాసిన బట్టలు, వాడిపోయిన ముఖం. ఏడ్చిఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి. చెంపల మీద కన్నీటి మరకలు ఉన్నాయి.
“జ్వరం ఏమైనా ఉందానే!?” అని అడుగుతూ, మెడపైన చేయిపెట్టి చూసింది. ఒళ్లంతా వేడిగా ఉంది. ఏ కోణంలో చూసినా.. రాజీ రాజీలా లేదు. ఆమె చేయిని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని.. “ఏమైందే ఇలా ఉన్నావ్? ఇంటికి రావడంలేదు. ఫోన్ తీయడం లేదు. ఎందుకు?” అని ఆప్యాయంగా అడిగింది. రాజీకి దుఃఖం ముంచుకొచ్చి కళ్ల నుండి నీరు దూకింది. “జ్వరం ఉందని ఫోన్‌చేసి చెప్పొచ్చు కదా? చెప్పా పెట్టకుండా వచ్చేశావ్? ఇంటికి వస్తే ఒక్క పూటలో తిరిగొచ్చేదానివి. కానీ నాలుగు రోజులైనా జాడ లేదని వచ్చాను. చూస్తే ఇలా పిచ్చిదానిలా ఉన్నావు. ఏమైందే నీకు? పదా ఇంటికి వెళ్లి మమ్మీని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్దాం” అంటూ, పట్టుకున్న చేయిని పట్టి లాగింది మల్లిక.చేయిని విదిలించుకుని.. “నేను బానే ఉన్నానే! నన్ను ఒంటరిగా వదిలేయ్.. ప్లీజ్” అంది రాజీ. ముంచుకొస్తున్న దుఃఖంలో. “పిచ్చా నీకు? అద్దంలో చూసుకో! పేషెంట్లా ఉన్నావ్. లే.. డ్రెస్ చేంజ్ చేసుకో! వెళ్దాం” అంటూ, రాజీ మెడకు ఉన్న చున్నీనీ తీసింది. దాంతో ఆమె భుజంపైనున్న గాయాలు కనిపించాయి. ఆశ్చర్యంతో డ్రెస్ మరింత జరిపి చూసింది. అవి గోళ్లతో రక్కితే ఏర్పడ్డ గాయాలని ఇట్టే అర్థమైంది మల్లికకు.రాజీకి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్క ఉదుటున మల్లికను కౌగిలించుకొని వెక్కివెక్కి ఏడవ సాగింది.అయోమయానికి గురైన మల్లిక.. “ఏయ్ రాజీ! ఈ గాయాలేంటే? నాకేం అర్థం కావడం లేదు. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. ఏం జరిగిందో చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు!” అంది. ఆ మాటకు గబుక్కున కౌగిలి విడి.. తన చేయితో మల్లిక నోటిని మూసి, ‘అలా అనకు!’ అని తల అడ్డంగా ఊపింది. నోటిపై ఉన్న చేయిని తీస్తూ..“మరైతే ఏమైందో చెప్పు!” అని అడిగింది మల్లిక.
జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ.. “మీరు ఊరెళ్లిన రోజు మేడపైన గదిలో పని ఉందని నాన్న పిలిస్తే వెళ్లాను. అప్పుడు నాన్న నన్ను.. నన్ను..” అంటూ, మాట రాక కుమిలి కుమిలి ఏడవసాగింది. షాక్ తిన్న మల్లిక రాజీ భుజాలను పట్టుకొని.. “ఏంటే.. ఏంటే.. నువ్వు చెప్పే.. ది? నాన్న ఏంటే? ఏం చెప్తున్నావ్?” అని భయం భయంగా అడిగింది.“అవును! నాన్న నన్ను”.. అని కళ్లతోనే జరిగిన ఘోరాన్ని కళ్లకు కట్టింది. మల్లికకు కళ్లు బైర్లు కమ్మాయి. మెదడు మొద్దుబారి పోయింది. ఆమె అంతరంగంలో ఆలోచనల అలలు ఉధృతంగా ఎగసి పడుతున్నాయి. కొంతకాలంగా తన తండ్రి గురించి తాను వింటున్న మాటలు నిజమని తేల్చి చెప్పిన సంఘటన ఇది. ఆమె మనసులో ఇప్పుడు సంఘర్షణకి తెర తీసింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేయడానికి మార్కెట్ కమిటీ చైర్మన్ మనోహర్‌ను ఆహ్వానించారు పాఠశాల సిబ్బంది. తెలుగు తల్లి, భారతమాత వేషధారులైన ఎనమిదో తరగతి చదువుతున్న కవల పిల్లలు ఆధ్య-ఆరాధ్యలకు.. బహుమతి అందిస్తున్న సమయంలో ఆ చిన్నారులను మనోహర్ బ్యాడ్‌టచ్ చేశాడని గుసగుసలు వినిపించాయి. గుడి-బడి అని తేడా లేకుండా చిన్నారులను తప్పుడు ఉద్దేశంతో తాకుతుంటాడనీ, ఆ విషయలేవీ బయటికి పొక్కకుండా తన పలుకుబడితో సమాధి చేస్తున్నాడని మల్లిక చెవిన పడ్డాయి. తన స్నేహితులను ఇంటికి పిలిస్తే..
‘మీ నాన్న ఉంటే రాలేం!’ అని చెప్తే.. గౌరవంతో కూడిన భయం అనుకున్నది ఇన్నాళ్లూ! కానీ, తన తండ్రి లోపల మరో మనిషి ఉన్నాడని ఆమెకు ఇప్పుడే అర్థమైంది. మనసు లోతుల్లోంచి తండ్రిపై అసహ్యం పుట్టుకొచ్చింది.
“ఇది నువ్వు జీర్ణించుకోలేవని తెలుసమ్మా! కానీ నిజం! గతంలో నా ఫ్రెండ్స్ ద్వారా కొంత తెలిసింది. కొట్టి పారేశాను. ఇప్పుడు నిర్ధారణ అయింది” అని తల్లికి చెప్పిది మల్లిక. “మీ నాన్న.. సంఘంలో పేరు ప్రతిష్ఠలున్న వ్యక్తి. ఆయనపై అందరూ మంచి అభిప్రాయంతోనే ఉండాలని లేదు. ఆయన గౌరవానికి భంగం కలిగించాలనే దురుద్దేశంతో గిట్టనివారు ఎన్నో చెప్తుంటారు. అవన్నీ నిజాలనుకోవడం, నిలదీయడం నీ పిచ్చితనం” అంటూ భర్తను వెనకేసుకొచ్చింది. “పిచ్చితనం కాదమ్మా! పచ్చి నిజాలు. రాజీ ఒంటిపైనున్న పచ్చి గాయాలే అందుకు సాక్ష్యాలు. గతంలోనే కొన్ని విషయాలు తెలిసినా.. నేనూ నీలానే గుడ్డిగా నమ్మాను. అందుకే, నీ చెవిదాకా రానివ్వలేదు. రాజీ అబద్ధం చెప్పదనే నమ్మకంతోనే ఇప్పుడు తీసుకువచ్చాను. గిట్టనివాళ్లు ఏదో అంటారని నువ్వు అంటున్నావు. నాన్నంటే ఆ స్కూల్ పిల్లలకు ఎందుకు గిట్టదు? రాజీకి ఎందుకు గిట్టదు? అదికూడా ‘నాన్న నాన్న’ అనే కదా పిలుస్తుంది? మార్కెట్లో ప్రాబ్లమ్స్ ఉండి ఎవరైనా చెప్పారా? అంటే.. నువ్వు చెప్పింది నమ్మొచ్చు. కానీ, చిన్న పిల్లలు పనిగట్టుకుని ఎందుకు చెప్తారు? తప్పుడు పనులు చేస్తేనే కదా చెప్పేది. లేదంటే నాన్న పేరు చెప్పాల్సిన అవసరం వాళ్లకేంటమ్మా” అని ప్రశ్నించింది.
“నోర్ముయ్! నువ్వు నమ్మితే నిజం అవుతుందా? నీ కళ్లతో చూసావా? ఆధారాలున్నాయా? ఏం తక్కువ చేసామే దానికి? మన మనిషిలా చూసుకున్నాం. చదివిస్తున్నాం. నీతో సమానంగానే చూస్తున్నాం కదా?” అంటూ కోపంతో ఊగిపోయింది తల్లి. “నీకు పిచ్చి పట్టిందా?! జరిగింది చెప్తుంటే.. నాన్ననే వెనకేసుకొస్తున్నావ్? గొప్పవాడని భ్రమ పడుతున్నావ్? ఇప్పుడు అడిగావ్ నన్ను. ‘నువ్వు నమ్మితే నిజమైపోతుందా!’ అని. నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు నమ్మితే నీ భర్త శ్రీరామచంద్రుడై పోతాడా? గుణం ఉండాలి కదా? నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వేమో వెర్రి దానిలా మోసపోతూనే ఉన్నావు. నేను చెప్పేది నిజం! పచ్చి నిజం.. నిజంగానే నిజం” అని ఆవేశంగా అరిచింది. ఆ అరుపులకి కోపం వచ్చిన మహాలక్ష్మి.. మల్లిక చెంప చెల్లుమనిపించింది. దాంతో ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది మల్లిక.అది చూసిన తులసమ్మ..
“ఎందుకే దాన్ని అంతలా కొడుతున్నావ్? ఏం చేసిందని?” అంటూ అడిగింది. “ఏం చేయమంటావు మరి? రాజీ దీనికేదో చెప్పిందంట. ఇది నమ్మిందంటా! నాకే నీతులు చెప్తుంది. అందుకే నాలుగు తగిలించాను” అంది. “నేనెప్పుడో చెప్పానే.. ఎక్కువ తక్కువలు చూడకుండా పక్కన కూర్చోబెట్టుకుని తిండిపెట్టి మేపితే.. నెత్తినెక్కి కూర్చుంటారని! నా మాట వింటేగా మీరు?” అని చిర్రు బుర్రులాడింది ఆమె. “సాయం చేద్దామని చేయి ఇస్తే.. మన వేలుతో మన కంట్లోనే పొడుస్తున్నారు” అంటూ, తల పట్టుకుని కూర్చుంది మహలక్ష్మి.
మల్లిక ఏడుస్తూ గదిలోనే ఉంది. ఆమెలో ఏదో ఒకటి చేయాలన్న తపన తపస్సు చేస్తున్నది. ‘స్వార్థం లేకుండా ఉండటం అనేది కష్టతరమైన పని. నేనే కాదు నాలాగే చుట్టూ ఉన్నవారందరూ సంతోషంగా ఉండాలి. అందుకోసం ధైర్యంగా ముందడుగు వేయడమే సఖ్యతకు సంకేతం. తప్పు చేసింది ఎవరో తెలిసికూడా మౌనంగా ఉండటం ఇంకా పెద్ద తప్పు. అమ్మ తిట్టిందని, నేను చెప్పింది నమ్మడం లేదని దిగాలు పడి, చేతకాని దానిలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? తండ్రి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే మరిన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది. ఇది పరీక్షలాంటి పరిస్థితి. ఇప్పుడే ధైర్యంగా ఉండి నిజాన్ని నిర్భయంగా నిరూపించాలి. లేదంటే మొన్న స్కూల్ అమ్మాయిలు, ఈరోజు రాజీ.. రేపు నేను! ఇదే జరుగుతుంది నిత్యం ఇవే వార్తలు చూస్తూనే ఉన్నాం! కన్నవాళ్లే కాటు వేస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. బదులుగా ఆ పోలీసులు కూడా కామ వాంఛ తీర్చమనే వేధిస్తున్నారు. మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగిక దాడి. ఐదేళ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారం. విద్యార్థినిపై టీచర్ రేప్. ఇదీ మనం చూస్తున్న సమాజం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడ్డం ఎందుకు?.. మనమే మనకు ఆయుధం.. సైన్యం అవ్వాలి! ప్రక్షాళన చేయాలంటే.. ముందు మన ఇంటి నుండే మొదలు పెట్టాలి. అదే సరైన మార్గం!’ అని అనుకుంది మల్లిక.
వారం తర్వాత. ఒకరోజు రాత్రి మనోహర్ తన గదిలోకి అడుగుపెడుతూ.. “రాజీ! ఎందుకు చీకట్లో ఉన్నావ్? లైట్ వేసుకో! ఇన్నాళ్లూ రాకుంటే మళ్లీ రావేమో!? అనుకున్నా. ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నా కదా! చెప్పినట్టు వింటే అమ్మగారి కన్నా నిన్నే బాగా చూసుకుంటానని. ఇలా పిలిచినప్పుడల్లా వస్తే ఇక నువ్వే ఇంటికి అన్నీ..” అంటూ, ఆమె భుజంపై చేయివేసి.. లైట్ వేయబోయాడు. అప్పుడే అతని ముఖంపై టార్చిలైట్ వెలుగు పడింది.“ఎవరది? ఏయ్ ఎవరు?” అంటూ గద్దించాడు. టార్చ్‌లైట్ ఆగిపోయింది. ట్యూబ్‌లైట్ వెలిగింది. అతని ముందు కూతురు మల్లిక ఉంది. అతని చేయి ఆమె భుజంపైన ఉంది. వణికిపోయి చెయ్యి తీశాడు. గుమ్మం దగ్గర భార్య, తల్లి, రాజీ ఉన్నారు. ఊహించని ఆ షాక్.. మనోహర్ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా చేసింది. ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చి తల్లిని చుట్టుకుంది మల్లిక. బతకడానికి కారణాలు లేని మనోహర్.. పక్కనే ఉన్న కరెంటు వైరు తెంచి పట్టుకుని, గిలగల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. కరెంట్ షాక్ తగిలి మార్కెట్ కమిటీ చైర్మన్ మరణించాడనే వార్త.. ఊరి జనాలకు క్షణాల్లో చేరింది.
‘తనకు సహకరిస్తే సరి! లేకుంటే ఉరి’ అని తల్లిని బెదిరించి, ముందురోజు రాజీచేత తండ్రికి ఫోన్ చేయించింది మల్లిక. పొరుగూరులో ఫంక్షన్‌కు వెళ్తున్నామని తండ్రికి చెప్పి.. తల్లి, నానమ్మతో కలిసి బయటికి వెళ్లింది. అనుకున్న పథకం ప్రకారం.. అతని నిజస్వరూపాన్ని బయటపెట్టింది. తప్పుచేస్తే తన వాళ్లయినా, పరాయి వాళ్లయినా శిక్ష అనుభవించి తీరాలన్న ధర్మాన్ని నిజం చేసింది మల్లిక.
పట్ల యాదగిరి
‘గిరిపట్ల’ కలంపేరుతో రచనలు చేస్తున్నారు పట్ల యాదగిరి. తల్లిదండ్రులు పట్ల బుచ్చమ్మ-మల్లయ్య. ఈయన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. డిగ్రీ చదివిన యాదగిరి.. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే, తెలుగు సినిమా పరిశ్రమలో గీత రచయితగానూ పనిచేస్తున్నారు. పాఠశాల స్థాయి నుండే కవితలు రాయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. వివిధ దినపత్రికల్లో కవితలు, కథలు, ప్రచురితం అయ్యాయి. వాటికి బహుమతులు రావడం, సన్మానాలు అందుకోవడం ద్వారా స్ఫూర్తిని పొందుతూ.. రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. కథలు, సినిమా పాటలతోపాటు ప్రయివేట్ ఆల్బమ్స్‌లోనూ భక్తి, జానపద పాటలు రాశారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో రూ.2వేల బహుమతి పొందిన కథ.
-పట్ల యాదగిరి
99859 26292