తుప్పురు తుప్పురుగా సురువైన వాన.. ముసురువట్టి నిలవడి కురుస్తంది. వాడకట్టోళ్లంతా ఒకలెనుక ఒకలు.. రాజీరు ఇంటికచ్చి, జరిగిన విషయం అడిగి తెలుసుకుని బాధ పడ్తండ్రు. ఒకామె అక్కడికి వచ్చుడుతోనే ఏడుపందుకున్నది. అది సూచిన బొందయ్య..“నీ ఏడ్చుడు సల్లగుండ. కాసేపు సైసరాదవ్వా!లోపలున్న ముసలాయన ఇంటే గుండె పల్గుతడు” అనంగనే..ఆమె దబ్బున కొంగును నోటికి అడ్డం పెట్టుకుని, నసుగుతున్నట్టుగా కాసేపు అట్లనే ఏడ్చి ఊకున్నది.“అందరినుండ్రి. ఏడ్చుడు తూడ్చుడు కథ ఇప్పుడే మొదలువెట్టకుండ్రి. ముసలాయన పాణం అసలే బాగలేదు. అయిందేదో అయిపోయింది. ఉన్నొక్కన్ని నాలుగు రోజులు బతికిచ్చుకోవాల్నంటే మీ ఎగపోతను జరంతసేపు ఆపుకోండ్రి” అని, అక్కడున్నోళ్లందరిని బతిమాలినట్టుగ చెప్పిండు. బొందయ్య చెప్పింది విన్న అందరూ సప్పుడుజెయ్యకుంట గమ్మునైపోయిండ్రు. ఇంతల ఛత్రీ నెత్తిన పెట్టుకుని పందిట్లకచ్చిన సామేలు, దాన్ని మడిచి ఓ మూలకువెట్టి..
“ఈ వాన పాడుగాను! కొడితే లగాంచి దంచి కొట్టిందిగాదు, ల్యాకపోతే పురాంగ ఊకున్నదిగాదు, పండ్లపుల్ల నమిలెటోడు తుప్పతుప్ప ఊంచినట్లు ఏం తుప్పురు వానిది. ఏ పని చేసుకోనియ్యకుండా ముసురు ఇట్ల తగులుకున్నదేంరా! పురాంగ చీకటాయె. పోయినోళ్ల జాడేమైనా తెల్సిందా. బైలెల్లిండ్రటనా?!”.. అరుగుమీద పోచాలు పక్కన కూసుండుకుంట అడిగిండు.“ఈ వానకగ్గిదల్గా! ఉండుండి ఇయ్యాల్నే కొట్టాల్నా?! గిది ఎప్పటిదాకుంటదోగానీ.. వాళ్లయితే అప్పుడే బయలెల్లిండ్రంట. ఇంకో నాలుగైదు గంటల వరకు వస్తుండొచ్చు”.. అంగిలకేంచి బీడీ తీసి ఎలిగించుకుంట చెప్పిండు పోచాలు.“ఈ ముచ్చట ముసలోనికి తెల్సిందా?! ఎవలైన చెవులేసిండ్రా?! కర్మ పాడుగాను.. ఎందుకైనా మంచిది, వాళ్లు వచ్చేలోపట ఏదన్న గింతంత తినవెట్టుండ్రి”విచారపడి, గలుమవంక సూసుకుంట, అక్కడున్నోళ్లకు ఇషారలెక్క చెప్పిండు సామేలు.
“రాజీరుకు ఇప్పుడే ఎట్లజెప్పుతరే! తెలిస్తే తట్టుకుంటడా?! ఇప్పుడప్పుడే చెప్పుడేంలేదు. ఎవ్వలు ఏడ్చేదిలేదు. రేపు కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు వచ్చేదాక ఆగాలే! గిదే ముచ్చటను అందరు జరంత మదిలవెట్టుకుని మెదులుండ్రి” అని మల్లోమల్క చెప్పిన బొందయ్య, ఇంట్లకుజూసి..
“లోపల ఎవ్వలున్నరవ్వా.. ఏమన్న వండితే మిత్తమంత ముసలోనికి తినిపించుండ్రి”జరంత అరిసినట్టే చెప్పిండు.“హా.. బాపూ! ఉన్నం ఉన్నం. లోపల సుధమ్మ ఉక్మ, చాయ్ చేస్తంది”ఇంట్లనుంచి ఎవరో సమాధానం చెప్పిండ్రు.
రాజీరున్న గదిలకు పోవాల్నంటేనే బొందయ్య, సామేల్‌కు ధైర్యం జాల్తలేదు. ఎళితే..‘మా నర్సవ్వకు ఏమైంది? ఎట్లున్నది?’ అని అడిగితే ఏం జెప్పాల్నో తెల్వక.. బయిటనే ఉండి చేతులు పిసుక్కుంటండ్రు. ఇంతల సుధమ్మ ఉక్మ, చాయ్ తీస్కొని ఆడికొచ్చింది. బయిట గాబరా పడుతున్న వాళ్ల లెక్కనే, తన పరిస్థితి ఉన్నదనే విషయాన్ని బయిట పడనీయకుండా.. లోలోపల్నే ఆగమాగం అవుకుంటలోపలికివొయ్యి..“తాతా.. ఓ తాతా! లెవ్వే లెవ్వు” అనిచిన్నగ పిల్సింది.ఆ అలికిడికి..“అవ్వా! వచ్చినవా.. నీ బాంచెన్!” అని మంచాన్ని పునుక్కుంట లేచి కూసున్నడు రాజీరు.
కండ్లద్దాలు సర్దుకుంట.. ‘అవ్వో.. వాయ్యో’..అని మూలుగుకుంట, ఎడమ కాలును సవరించుకొని కూసున్నడు.
“ఏమైంది బిడ్డా! అటే పోతివి”జరంత ఆయాసపడుకుంట అడిగిండు రాజీరు.“ఇంట్ల పనుండెనే. అన్నీ సవరించి వచ్చేసరికి కొంచమంత ఆల్చమైంది. ఉడుకుడు ఉక్మ, చాయ్ తెచ్చిన. తిను” అని ఉక్మ పిలేటునందిచ్చిం.రాజీరు దాన్ని తీసుకుంట..“నీ తిండి పాడుగాను. నేను దీనికంటలేను. మీ అమ్మమ్మ ఎట్లున్నదట. ఏమైన మంచి చెడ్డ సంగతి తెలిసిందా!? ఎవ్వలు ఇటు దిక్కు వస్తనేలేరు. నాకు ఏ ముచ్చట చెప్తలేరు. దవఖాన్ల ఒక్కదాన్నే ఇడిసిపెట్టిండ్రా. తోడెవలైన ఉన్నరా!?”సుధమ్మనే సూసుకుంట అడిగిండు. ఆయన మాటలు ఇనంగనే దుఃఖం ఆమె బొండిగలోకచ్చింది.కానీ, ఓర్సుకున్నది.
“మంచిగనే ఉన్నదట. పోన్ జేసి తెల్సుకున్నలే! నువ్వైతే తిను” అని చెప్పింది.బల్ల మీదున్న జగ్గులనుంచి నీళ్లను గిలాసలపోసుకుంట, ఓరకంట తాతనే గమనించుకుంట,కండ్లళ్ల తేలిన తడిని తుడ్చుకున్నది సుధమ్మ.“అయ్యో తల్లీ! నీకెంత కష్టమొచ్చిందే.. నువ్వు మంచిగుండి, నేను దవఖాన్లవడ్డా బాగుండేది గదనే!” అని రాజీరు ఎక్కిళ్లు వెట్టుకున్నడు.“ఏమన్న తింటందటనా?! డాక్టర్లు ఏమన్నరట?! ఈ కాలునొప్పి పాడుగాను. ఇది లేకుంటే నేనే ఎంబడుండేటోన్ని”అట్ల అనుకుంటనే, తన భార్యను గుర్తు చేసుకుని.. ఆమెకి తోడుగా ఉండలేదనే, తన చేతగాని తనాన్ని తిట్టుకున్నడు. “నువ్వైతే ముందు తిను. తర్వాత మాట్లాడుకుందం” అని రాజీరును మాటల్లవెట్టే దొరింపుజేసింది సుధమ్మ.
దాంతో ఉక్మ ముద్దను నోట్లెవెట్టుకుని చప్పరించి, ముక్కిరిసిండు. చేతిలున్న కంచాన్ని సుధమ్మకు అందించి..“వద్దు బిడ్డా! ఎందుకో నోటికి సైసుతలేదు. చాయ్ బొట్టు తాగుతలే” అని చాయ్ గిలాసను తీసుకుని తాగసాగిండు.ఆ మాటలు ఇనంగనే గొల్లున ఏడవాల్నంత దుఃఖమొచ్చింది సుధమ్మకు.. అందుకనే అక్కడ ఉండలేక.. చీర కొంగును నోటికి అడ్డంబెట్టుకుని, ఏడుపుని బల్మీటికి ఆపుకొంట.. జప్పజప్ప నడుచుకుంట బయటికొచ్చింది.గది లోపల జరుగుతున్నదంత.. బయటనే ఉండి గమనిస్తున్న బొందయ్య, సామేల్‌కు ఏం సమజ్ గాక, రువ్వడిగా సుధమ్మ వెనుకాల్నే నడిచిండ్రు.ఇంటిముందట చేరిన వాళ్లంతా.. జరిగిన సంగతిని రాజీరుకు ఎట్లజెప్పాల్నో తెల్వక, ఎవలకు తోచినట్లు వాళ్లు మాట్లాడుకుంటుండ్రు.నువ్వు చెప్పమంటే , నువ్వే చెప్పాల్నాని అనుకుంట, పెద్దమనిషికి ఎవ్వలుగూడా చెప్పేటందుకు ధైర్యం చాలుతలేదు. ముసురువట్టిన వాన, చిన్నంగా వణుకుడు పుట్టిస్తుంటే.. వెచ్చబడేందుకు మొగోళ్లంతా బెల్ట్ దుఖాన్లకు వెళ్లి వస్తుండ్రు.“మీరంతా ఓపారి నేను జెప్పేది జరంత ఇనుండ్రి. రాజీరుకు సెప్పుడు మనతోని కాదుగానీ.. కొడుకో కూతురో, లేకుంటే ఇంకెవలైన దగ్గరి చుట్టాలు వస్తే చెప్పిద్దాం. ఏమంటరు?” అని ఓ పెద్దమనిషి అడిగిండు.ఆ మాట సరింగనే ఉన్నదని అందరికీ అనిపించడంతో అట్లనే కానియ్యమన్నరు.
బయట ఏం జరుగుతందో తెల్వని రాజీరు జరంత కునుకేసిండు. ఏ రాత్రికో తెలివొచ్చి దిగ్గున కళ్లు తెరిచిండు. కట్టెలు, పిడికెలు కాలుతున్న కమురు వాసన ముక్కుకు తాకంగనే.. ఆ వాసనను రెండు మూడుసార్లు అనుమాన పడుకుంట పీల్చిండు. ఎందుకో గుండెల రాయి పడినంత అగులు బుగులైతుంటే.. ఏదో కీడు జరిగినట్లనిపించి మంచంలకేంచి మెల్లగ లేచిండు. పక్కనున్న చేతికర్రను అందుకొని దాని ఆసరాతోటి, తడుముకుంట లేచి నిలబడ్డడు. చేతి కర్ర సాయంతోని ఒంటికాలుమీద చిన్నగ గెంటుకుంట కిటికీ దగ్గరికెళ్లి బయిటికి సూసిండు.ఇంటిముంగట పందిరికింద ఎలుతుర్ల మనుషులు కూసున్న ఆనవాళ్లు కనవడ్డది. ఆ పక్కన్నే మంటలకేంచి పొగచ్చుడు కనవడంగనే.. కళ్లద్దాలను సర్దుకుని మల్లోమల్క నిగురాంచి సూసిండు. అంతే..“ఓ అవ్వా.. నా నర్సవ్వ! మాయిళ్లమే పోయినవానే.. నన్నాగంజేసి పోతివానే.. నన్నిడిసి నీకెట్ల పోబుద్దయ్యిందే నర్సవ్వా!” అని నెత్తి, చాతిల కొట్టుకుంట అరుపులు, కేకలు, పెడబొబ్బలతో ఏడుపందుకున్నడు. రాజీరు ఏడుపినంగనే, పందిట్లో ఉన్నోళ్లంతా దబ్బున ముందటి దర్వాజలకేంచి ఆయన గదిలకు ఉరికిండ్రు.
కిటికికాడ కింద కూలవడిపోయి పసిపోరనిలెక్క ఏడుస్తున్న రాజీరు దుఃఖాన్ని ఇనంగనే.. అప్పటిదాకా ఏడుపును ఉగ్గవట్టుకున్నోళ్లంతా కంటికి ధారాలువడ ఏడ్వసాగిండ్రు.నర్సవ్వ తనని ఒంటరోన్నిజేసి, లోకాన్నిడిసి ఎల్లిపోయిన సంగతిని రాజీరు జీర్ణించుకోలేక పోతండు. ఇన్నేండ్లల్ల ఆమెతోటి నెరిపిన సంసార సాంగత్యాన్ని తల్సుకుంట నవిసినవిసి ఏడుస్తాంటే.. సూసెటోళ్లకు ఆయనను ఆపతరమైతలేదు.
ఇంతల కుయ్ కుయ్ మనుకుంట అంబులెన్సు వచ్చింది. ఆ పాటికే పందిరి కింద అంతా సగబెట్టి ఉంచడంతో, నర్సవ్వ శవాన్ని కిందికి దించి, ఆకిట్ల పేర్సిన వరిగడ్డి మీద పండవెట్టిండ్రు.
నెమ్మదిగా రాజీరును నర్సవ్వ పీనుగ కాడికి తీసుకుపోయిండ్రు. ఆమెను చూడంగనే..“నా నర్సవ్వా.. నన్నిడిసి నీ జాగల నువ్వు పోయినవ్ గానీ, నా గతేంగానే అవ్వా! నా పిల్లలు, నా బిడ్డలని తెగ ఆరాట పడితివిగదనే నర్సవ్వా.. ఇప్పుడు ఏమక్కరకొచ్చిండ్రే నా అవ్వా.. ఆళ్లను కంటాంగానీ, మన తలరాతను మార్చమని అడుగుతమానే నర్సవ్వా!” అని ఏడ్చుకుంటనే..“ఈ పిచ్చిది.. నా బిడ్డ, నా కొడుకని రందివెట్టుకునే, మనాదిలవడి రోగాలు తెచ్చుకుని చచ్చిపోయి, నన్ను ఒంటరోన్ని చేసిందయ్యా! దాని మట్టుకు అదెళ్లిపోయింది గానీ, నన్నెట్లా మర్సిపోయిందోనయ్యా..” అని అందరినీ సూసుకుంట, గుక్క తిప్పుకోకుంట ఏడ్చిఏడ్చి నెరిగిలవడ్డడు. అదిజూసిన కొందరు దబ్బున ఆయనను లేవట్టి గడాంచల కూసోబెట్టి కొద్దిగన్ని నీళ్లు తాగిపించి పండబెట్టిండ్రు.
రాజీరు, నర్సవ్వ.. ఆ వాడల అందరితోని కలుపుగోలుగా ఉండే ఆలుమగలు. వాళ్ల లగ్గమయ్యేనాటికి ఉండెటందుకు ఇల్లుదప్ప గుంటెడు జాగలేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకుని, పెయ్యి దాచుకోకుంట కూలినాలి చేసుకుంట.. కూతురు, కొడుకు పుట్టేనాటికి రెండెకరాల భూమిని సంపాయిచ్చిండ్రు. దాంట్ల ఎవుసం చేసుకుంటనే.. పెగ్గెలకు వోకుంట, బయిటి పనులగ్గూడ పోవుకుంట.. రూపాయి రూపాయి పోగేసి బిడ్డలిద్దరూ పెరిగి పెద్దయ్యే యాళ్లకు ఐదెకరాలు పోగుజేసిండ్రు. మిద్దె ఇంటిని కట్టుకున్నరు. బిడ్డలకు కష్టమనేది తెల్వకుంట పెంచిండ్రు.ఆళ్లకు అదురుష్టం నెత్తిన కూసున్నదేమో.. తవ్విన బాయిల పుష్కలంగ నీళ్లువడ్డయ్. ఇంకేమున్నది.. ఏ దినుసేసిన ఇరుగ మరుగ దండి పంటలే పండేటివి. అంతా కలిసిరావడంతోటి బిడ్డకు మంచి సంబంధం జూసి ధూంధాంగా లగ్గంజేసిండ్రు.ఇగ కొడుకు రమేష్ సంగతికస్తే.. ఏమంత లగాంచి చదవకపోయినా, ఉన్న భూమిల ఎవుసం జేసుకుంటే సుఖంగనే బతికేటి సౌలతి ఉన్నదని నర్సవ్వకు దూరపు వరసైన అన్న బిడ్డ వసంతతోటి సంబంధం కుదరడంతో కొడుకుకు మనువుజేసిండ్రు.
ఈడివరకు అంతా సక్కంగనే సాగింది. ఎప్పుడైతే కొడుక్కి తొలుసూరు కాన్పు అయిందో.. అప్పటినుంచే ఇంట్ల లుకలుకలు సురువైనయ్.
‘ఊరునిడిసి పట్నం పోదాం. అక్కడనే ఏదైనాపనిజేసుకుని బతుకుదాం!’ అని మొగుడిని ఒత్తిడి పెట్టింది వసంత.రెండో సంతానం బిడ్డ పుట్టినంకా మరింత ఎక్కువైంది. పట్నంబోతే పిల్లల్ని అక్కన్నే మంచి బడిలో సదివించుకుందామని కొడుకు చెవుల్ల కోడలు సీసం పోసింది. అదీ నిజమేనని నమ్మిన రమేష్.. అవ్వయ్యను ఇడిసి పట్నానికి మకాం మార్సిండు. అప్పటినుంచి..తన కొడుకు తన దగ్గర ఉంటలేడని మనాది వెట్టుకున్నది నర్సవ్వ. లంకంత ఇల్లు, దండిగ పండే ఐదెకరాల భూమిని వదిలిపెట్టి, కొడుకు దూరంగ ఉండవట్టెనని రందిలవడింది. ఒక్కగానొక్క కొడుకు.. ఏం పని చెయ్యక పోయినా, కండ్ల ముంగట ఉంటే.. గదే చాలని, పట్నమిడిసి ఇంటికి రావాల్నని కొడుకు, కోడలును బతిమాలుడే గాకుండా.. దేవుడికి రోజూ పూజలు చేసుకుంట, ఉపవాసాలుండుకుంటా.. అదే ధ్యాసల ఉన్న నర్సవ్వకు.. మెల్లంగా బీపీ, షుగరు తగులుకున్నయి. ఆటి వల్లనే పురాగా పానం బాగాలేక, దవాఖానల సుట్టు తిరిగి తిరిగి ఆఖరికి సచ్చిపోయింది. ఊరోళ్లు, వాడకట్టొళ్లు అయ్యో పాపమని బాధపడ్డరు. జరంత దగ్గరగ మెదిలినోళ్లు కన్నీళ్లు కార్చి, ఆమె జీవాత్మకు శాంతి కలగాల్నని దండం బెట్టుకున్నరు. కట్టుకున్న భార్య, తననిడిసి దూరమైందనే దుఃఖం ఒక్క రాజీరుకే మిగిలిందిక్కడ.
తెల్లారేవరకు కొడుకు-కోడలు, బిడ్డ-అల్లుడు వచ్చి నర్సవ్వ శవంమీద పడి, ఆళ్ల మనసు తీరునువట్టి ఏడిసిండ్రు. కార్యం అయ్యాక వాళ్ల బుద్ధుల్ని బయటవెట్టిండ్రు.“మా అమ్మ పోయిందంటే.. నా బలం సగం పోయినట్లే! బతికున్నప్పుడు అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. మేం సంపాంచిన ఆస్తిలో మా ఇద్దరికీ సగం సగమని. ఇప్పుడు ఈ ముచ్చట తేలాలే. అసలే మా నాయిన అమాయకుడు. ఆయనే ఇప్పుడీ సంగతి తేల్చాలే” అని కూతురు దినానికొచ్చిన సుట్టాలు, ఊరి పెద్ద మనుషుల ముందు పంచాయితీ పెట్టింది.అన్నతోపాటు, అంతా.. గిదేం తిరకాసనే సందిగ్ధంల పడ్డరు. ఆమె పద్ధతి ఎవ్వలకు నచ్చక పోవడంతో..“సూడమ్మా! గిదంతా మీ ఇంటికి సంబంధించిన సంగతి. మమ్మల్ని లాగకండి. ఏదున్నా.. మీ నాయిననే అడగండి. ఆయన ఏం జెప్పితే గదే ఆఖరి మాట” అని ఓ పెద్దమనిషి తన ముచ్చటను జెప్పిండు. అందుకు కూతురు..“ఇసొంటి సంగతులు మా నాయినకు పెద్దగ తెలవవు. పట్టించుకోడు గూడ. గందుకనే, మిమ్మల్ని అడుగుతన్న” అని పలికిన కూతురు మాటలకూ రాజీరుకు ఏం జెప్పాల్నో తోచలేదు. కానీ,“నేను సంపాయించిన ఇల్లు, జాగ కోసమే.. నా బిడ్డలు వచ్చిండ్లని అర్థమైతంది. కానీ, నేను వాళ్లకేదీ ఇవ్వను. వీళ్లవల్లనే నా నర్సవ్వ తండ్లాడి తండ్లాడి సచ్చిపోయింది. అది బతికున్ననాడు, బాగలేక దవాఖాన్ల పడ్డప్పుడు ఒక్కళ్లు రాలే. ఉన్నయి వాళ్లకిస్తే నన్ను సూసుకుంటరన్న గ్యారంటీ లేదు. మేం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాంచినం. దాన్ని ఏం జెయ్యాల్నో, ఎవ్వరికివ్వాల్నో తర్వాత చెప్తా” అని నిదానంగా చెప్పిండు రాజీరు. దాంతో కూతురు, కొడుకు గుండెలు పగిలిన అవమానానికి లోనయ్యిండ్రు.
“రాజీరు చెప్పిందిగూడ నిజమే! కొడుకులు బిడ్డలు మనల్ని పువ్వుల్లబెట్టి చూసుకుని పూజించాల్నని ఎవ్వలు ఆశపడరు. వాళ్లకు ఉన్నదాంట్ల కలో గంజో పోసి.. అవ్వయ్యలను ‘తిన్నవా? పానమెట్లున్నది? ఏమైనా కావాల్నా’.. అని సావుదలకున్నప్పుడు జరంత మందలించి, మంచి చెడ్డలు చూసుకుంట.. సచ్చేటప్పుడు గింతంత జీగంజి పోసి, తుర్తిగ పాణం పోయేటప్పుడు కండ్లముందు ఉంటే బాగుంటదని అందరం కోరుకుంటమంతే! ఈ ముసల్దిగూడ గదే కోరుకున్నది. ‘నా కొడుకొచ్చి జీగంజి పోసి, నన్ను సాగనంపాలె!’ అని తండ్లాడి.. తండ్లాడి, ఆ రందితోనే జీవిడిసింది. అయ్యో భగవంతా.. నర్సవ్వ ఆత్మను నువ్వే శాంతింపజెయ్యి తండ్రీ!” అనుకుంట అక్కడినుండి అంతా కదిలిండ్రు.బిడ్డల కారణంగానే రోగాల కుప్పయి సచ్చిపోయిన తన భార్య నర్సవ్వ.. కళ్లముందే కదలాడుతుంటే, ఆమె జ్ఞాపకంగా తాము సంపాదించినదాన్ని.. తమలాగా సావుదలలో ఉన్నవాళ్లకు ఉపయోగపడేందుకు ఖర్చువెట్టాలని ఆలోచన చెయ్యసాగిండు రాజీరు.
“నేను సంపాయించిన ఇల్లు,జాగ కోసమే.. నా బిడ్డలు వచ్చిండ్లనిఅర్థమైతంది. కానీ, నేను వాళ్లకేదీ ఇవ్వను. వీళ్లవల్లనే నా నర్సవ్వతండ్లాడి తండ్లాడి చచ్చిపోయింది.అది బతికున్ననాడు, బాగలేక దవాఖాన్ల పడ్డప్పుడు ఒక్కళ్లు రాలే. ఉన్నయివాళ్లకిస్తే నన్ను సూసుకుంటరన్న గ్యారంటీ లేదు. మేం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాంచినం. దాన్నిఏం జెయ్యాల్నో, ఎవ్వరికివ్వాల్నో తర్వాత చెప్తా” అని నిదానంగా చెప్పిండు రాజీరు. దాంతో
కూతురు, కొడుకు గుండెలు పగిలినఅవమానానికి లోనయ్యిండ్రు.
బోయిన భాస్కర్
పిల్లలే తల్లిదండ్రుల పంచప్రాణాలు. వారే జీవితంగా బతుకుతుంటారు. అయితే, పిల్లలు తమను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని ఏ తల్లీదండ్రీ ఆశించరు. మలిసంధ్యలో మంచి చెడ్డలు చూసుకుంటే చాలనే అనుకుంటారు. అలాంటి ఓ తల్లి కథే.. తండ్లాడి తండ్లాడి. రచయిత బోయిన భాస్కర్. స్వస్థలం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామం. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. బీఎస్సీ చదివారు. ఓ తెలుగు దినపత్రికలో కంట్రిబ్యూటర్ (ఇన్చార్జి)గా పనిచేస్తున్నారు. బాల్యం నుంచే కవితలు, కథలు రాయడం అలవాటు చేసుకున్నారు. ఈయన రాసిన మొదటి కథ ‘కన్నెమోజు’.. స్వాతి వారపత్రిక (1994)లో ప్రచురితమైంది. మొదటి కవిత ‘అనైతికం’. పలు ప్రధాన పత్రికల్లోనూ వీరి రచనలు ప్రచురితం అయ్యాయి. ఆంధ్రభూమి వారపత్రిక నిర్వహించిన సరసమైన కథల పోటీల్లో ‘యామిని’ కథకు కన్సొలేషన్ బహుమతి అందుకున్నారు. అల స్వచ్ఛంద సంస్థ కథల పోటీలో ‘రైతే రాజు’ కథ.. ప్రత్యేక బహుమతి గెలుచుకున్నది. వ్యక్తిగత కారణాలవల్ల 17ఏళ్లు రచనలకు దూరంగా ఉన్నారు. మూడేళ్లుగా మళ్లీ గాడిలోపడి.. కథలే రాస్తున్నారు. ఈ క్రమంలోనూ వివిధ సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. ఇప్పటివరకు ప్రచురితమైన కొన్ని కవితలు, కథలతో రెండు సంకలనాలను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి
రూ.3 వేలు పొందిన కథ.
-బోయిన భాస్కర్
80085 73368