గుడిశె అంటుకుంది. బయట గట్టేసిన మేకలు, మంటల అగడుకు తల్లడిల్లి మబ్బును దాకేటట్టు వొర్రుతాన్నై. అగ్గి శిమ్ముకొచ్చి ఆకలాకలని దొరికిందల్ల మింగుకుంట..‘పేదింటి బక్కపీనుగా.. భలే రుషిగ ఉన్నవే!’.. అంటూ లొట్టలేసుకుంట, గుడిశెలున్న రేణుకను బూడిజ్జేసింది!
కానీ, మూలకున్న ఒత్తుకుండ.. అగ్గిని అంగిలెక్క గప్పుకొని ఎదురొడ్డి నిలబడ్డది. ఒళ్లంతా పేదోడి కట్టాన్ని నల్లటి మశిజేషి ఈర తిలకం దిద్దుకున్నది.
‘కడుపును మసిలిచ్చి, కడజాతోడికి కాసిన్ని మెతుకులెట్టి, కడుపుల బెట్టుకొని సాకుతా! అంటరాని, అవమానపు దురాగతాలపై నా బిడ్డలు గెల్షేదాక.. పేదోడికి పెద్దన్నగా నేనుంట!’ అంటంది.
“దీంట్ల బువ్వ, కూర బెట్టిన. పొద్దుబూకీ సుతరా.. మిగిల్తే మల్లబెడుతా.. సరేనా? ఎవ్వల్లేంది జూసి గిన్నెలు దెచ్చియ్యి. ఇగబో.. మా అత్త జూడకముందే! మల్ల ‘గిన్నెలెటు?’ అంటది. ఒచ్చేటప్పుడు మౌనికని సుత దీస్కరా. పనంత ఆన్నేబన్నది.. మా అవ్వగని! జర మర్షిపోకు”.. రాధ నవ్వింది.
“ఒత్తం తీయమ్మ.. గట్లెందుకంటవ్! కషేపు మా ఉందునుగని.. కుమ్మరి సమ్మక్కొళ్ల ఇంటికి బొయ్ కుండ దెచ్చుకోవాలే. నిన్న మేకలు అటుర్కి ఇటుర్కెనో.. ఏంపాడో!? ఒత్తుకుండ బల్గింది. ఒక్కడుగు అటుబొయ్యొచ్చి.. మేకల్ని సారన్నకు వొప్పజెప్పి, పోర్ని తీస్కొని దబ్బిన్నె వొత్తతీయమ్మ” గిన్నెలు బట్టుకొని కదిలింది రేణుక.
ఆనాడు సాయంత్రం..పనంత ఒడగొట్టి రేణుక, మౌనిక అరుగుమీద కూకున్నరు.“ఇప్పుడు కష నిమ్మలంగుందే పాణం! మాపటిల్లి, మా అత్త ఊరికి బోయింది. దానొర్రుడుకు తలకాయ నొచ్చు. కషేపు ఉప్పసబోను ముచ్చటసుత బెట్టనియ్యది.. ఇందాకనే రాజన్న (రాధ భర్త) గుడ పట్నం బోయిండు. ఎప్పుడొత్తడో తెల్వది. వొచ్చేదాకా ఉండరాదుల్లె జర!” అంటూ సాట నిండా అల్లమెల్లిగడ్డ దెచ్చి.. ముందటేశి పక్కనే అరుగు మీద కూకున్నది రాధ.“వావ్వో.. ఎవలన్న జూత్తే ఏమన్నున్నదానుల్లా? మా పక్కపొంటి కూకుంటే ఏమనుకుంటరు జనం” నవ్వింది రేణుక.
“ఎమ్మో.. తియ్యే! ఏమన్న అనుకోని! ఇయ్యాలేమన్న కొత్తనా? ఐదేండ్ల సంది సూత్తలేరా! నా పెండ్లయినకాంచి నువ్వు ఇంట్లనే తినబడితివి. ఇంట్ల మన్షిలెక్క..” అంది రాధ.ఆళ్ల ముచ్చటిని నవ్వింది మౌనిక.“నువ్వు అయ్యేపాటికే నన్ను పాపమన్నవ్.. ఎన్నడన్న ఒక్క మాటన్నవ!? మొన్న మీ యారాలు ఇంట్ల పనంత జేపిచ్చుకొని.. గిన్ని మంచిళ్లు సుత బోయలేదమ్మా! మల్ల, ఏం పని జేశినవని కడిగి కంపల బోసింది. సోలెడు బియ్యమే పెట్టింది, అస్సుత మొత్తం పురుగె” రేణుక మాట్లాడుతంటనే..“అదెపాయే.. గా ముచ్చట బంజెయ్యిగ..! యాడాదికోనాడు అన్నట్టు గూసుంటం.. గిట్ల తీర్కగా. పాటలో, గీటలో బాడ్రాదే జర! మస్తు రోజులైతంది నీ గొంతినక” అంది రాధ.‘నేను పాడనా!’ అన్నట్టు సైగజేసింది మౌనిక..
ముగ్గురు నవ్విర్రు..(మౌనిక పుట్టుకతో మూగ. కానీ, విన పడ్తది. భాష సుత తెల్తది)“ముందుగాల బడి దప్పిచ్చుడు బంజేత్తే.. రాసుడన్న వొచ్చిపాడైతది. అవ్వయ్యను వొదిలిబెట్టి నా ఎంబడిబడితే ఏమొత్తది!” రేణుక కసురుకుంది.
“ఏమనకే దాన్ని! మీ బోటోల్లు సదువుడే గగనం. సరే.. సదివి పట్నంబోయి ఎదుగుదామంటే, కులంజూపి కింద పడేశుడే.. అరిగోస బడాలే! అసొంటిది, అదాడివిల్ల.. మల్ల యెడ్డిది! సదివేంజేత్తది? ఆడివిల్లల బతుకే గట్ల.. అది పేదింటి పిల్లయినా.. పెద్దింటి పిల్లయినా.. గదే కథ! నేనంతో ఇంతో సదివితిని. ఏంజేత్తన్న? ఇంట్లనే పడుండాలే. పేరుకు పెద్దిల్లు, సూత్తె మారాణి! ఇంట్లకెళ్లి బైటికి బోలేను. మీ లెక్క బైటికి బోవాలే.. పొలాలు జూడాలే, ముచ్చట్లు బెట్టాలే.. ఐతదానే? గుడ్డిలో మెళ్లలెక్క కష నీది, దాందేనే బతుకంటే.. ఏ బాధ లేకుండా!” ఇద్దరికేసి సూశింది రాధమ్మ.
“ఓషినీ అన్నాలం పాడుబడ! అట్ల అనిపిత్తందానమ్మా నీకు.. ఇప్పుడేంది.. పోరి సదువుకోవద్ద” నోరు లేపింది రేణుక.“ఆగంగాకే! నువ్వన్నట్టు సదువుకుంటనే మంచిది” అంది రాధమ్మ.రేణుకను జూషి సైగలు జేశింది మౌనిక. రాధకర్థంగాలే.“నాకు సదువొచ్చు.. కథలు రాత్త, బొమ్మల్సుత గీత్త.. రాతల జూపియ్యనా మాటలు?” మౌనిక అంటందని, రేణుక చెప్పంగనే.. ముగ్గురు నవ్వేశారు.“ఓయమ్మనే! తెలివిగల్ల పిల్లే! నీ సైగలు నాకేడ దెల్తయ్ గానీ.. ఈ యేడు పదెల్లి సూపెట్టు. మంచి బట్టల్గొంట.. సర్నా?” మౌనిక తల నిమిరింది రాధమ్మ.తలూపి మురిశింది మౌనిక.
“సరెగని! మంచి పాట వార్రాదే రేణుకా?” అంది రాధమ్మ.“పుట్టలేని అడవిలోనా పాములున్నాయో మాయల పాములున్నాయో..
పాము నోట్లె రాముని పాదాలున్నాయో.. మాయలపాదాలున్నాయో..ఆకులేని అడవిలోనా మేకాలున్నాయో మాయల మేకాలున్నాయో.. మేక నోట్లె రాముని…”పాటను మధ్యలోనే ఆపేసి..“మేకలంటే యాదికొచ్చింది.. సారన్న, నా మేకల్ను ఏంజేత్తండో గదా! యాళ్లకు నీళ్లబెట్టిండో?” అంది రేణుక.
“అయింత బాడకవోతివే.. ముద్దుగున్నది పాట” అంది రాధ.
“అయినున్నప్పుడు.. గీ పాట్నే బాడేటోడు. ‘పోరగండ్లు పుడితే వాళ్లకు గీ పాట్నె బాడాలే!’ అనేటోడు. మాకొక్క పోరన్నన్న ఇయ్యకబాయె ఎల్లవ్వ తల్లి. ఐన సంకకి జమిడిక ఏస్కొని పాటవాడితే లందె గోలెంలున్న ఎల్లవ్వ తల్లి లేశి, గజ్జెగట్టి శిందులెయ్యాలే. పతేట పండుగనాడు బైండ్ల ఈరన్న, ఎల్లమ్మేషం గట్టి, బలి జల్లితే.. ఊరంతూగాలే. నన్నన్నాలం జేసి.. ఊరవుతల ఒక్కదానివే ఎల్లమ్మ కట్టాలు బడవే అని పైకిబాయె”
“బసెక్కి బోతంటే.. గంత కొసకు గుడిశెను జూశినప్పుడల్లా బయమైతదే రేణుక.. అసలు ఎట్లుంటన్నవే? వావ్వో నేనైతె సత్తును!”
“ఇది జూర్రాదమ్మా! ఐనకు మంత్రాలొత్తయని ఊరానూరు మీదబడ్డది! ఐనను పోశమ్మ శింతగట్టేసి.. నరకాలే, సంపాలంటంటే మొక్కని కాల్లేదు. ఏడువని ఏడ్పులేదు. మీ మావ అప్పుడు పెద్దమనిషి. సచ్చి ఏ లోకాన బోయిండో.. మా అయ్యగని! ‘ఈరన్న మంచోడ్రా! గవానికేమెర్కర. అసలు మంత్రాలు యాడున్నాయిరా! గట్లురుకొత్తల్లు, సంపుతార్ర! కాపోతే పెళ్లాంమొగలు ఊరౌతల గుడిశేసుకొని బత్తరు తీయుర్రా!’ అని తీర్మానం జేసిండు. అదైనంక, యాడాదికే రోగమొచ్చి ఐన పైకిబాయే. పిల్లలు జెల్లల్లేరు.
అత్తమావల్లేరు. ‘పడుసు పోరంటే అందరికి ఆశేగాదు బిడ్డా.. ఇంటికి రారారు జర!.. పురుగుబూషి కుట్టి సత్తవే!’ అని మావొల్లు మొత్తుకున్నా ఇంటికి బోలే నేను”“ఎందుకింత మొండి! వాళ్లన్నట్టు ఈడెమున్నదే” తదేకంగా చూసింది రాధ.గుండెలనిండా ఊపిరి బీల్సుకొని..“గట్లుంటదానమ్మా! ఏడున్న గిదే ఒంటరి బతుకు.. ఐన బతికున్నప్పుడు జెప్పేటోడు.. ‘నా శిన్నప్పుడు మా అయ్యని గిట్లనే తరిమితే ఈ ఊర్లకొచ్చివడ్డడు. ఇగిప్పుడు నా ఒంతు. ఎటుబోదమే మనం. యాడికి బోయినా.. ఈ కడజాతోడికి కట్టం దప్పది! అవుమానం మన ఇంటిపేరు లెక్క. మనెంటనే వొత్తది. పానంబోయినా.. ఈన్నె ఉండాల్నే రేణుక’ అనేటోడు. ఐన శళీరం ఈ మట్లే కలిశి, పాట గాల్ల కలిశింది. పతిరోజు ఐన జమిడక, నా కోసం పాడతన్నట్టు.. ‘భయపడకే! నేనీన్నె ఉంటిని!’ అన్నట్టు అనిపిత్తది. ‘రెండు బుక్కలు తినవ్వ!’.. అన్నట్టు మేకలు యాళ్లకు నన్నే సూత్తయి. ఇగ కన్నబిడ్డసొంటి మౌనికకు నేనే గావాలె.. బువ్వపెట్టి నన్ను అర్సుకుంటన్నందుకు.. నువ్వు మా అవ్వలెక్క. రాజన్నయితే, యాడ గనబడ్డ.. ‘తిన్నావ్రా ఓ శెల్లె’ అంటడు. నేనెటు బోత, గింతమంది ఉన్నంక. ఈన్నె ఉంట ఈన్నె సత్త. ఏమన్నగానీయ్! భయమేలేదు..”
రేణుక మాటలకి శెవులు నిక్కబెట్టి ఇంటల్లు.“ఏన్నుంచొత్తయే గిన్ని మాటలు! నీ ధైర్నానికే మెచ్చుకోవాల్నే రేణుక. మరి గీ పోరేడ దొరికిందే నీ పాణానికి!? ఎంబడే బడ్తది” అని చెరొక రెండు ఎల్లిగడ్డలు పెట్టింది.
“ఆ! ఏన్లేదమ్మ.. ఒగనాడు నేనూ, దీనవ్వ.. ఎంకన్నకు నాటేయ్య బోయినం! బల్లెకు బోలేదో ఏంపాడో మరి.. అవ్వెంబడొచ్చి మా ఎమ్మటే ఉన్నది. అప్పటికే ఐన సచ్చిపోయి మూన్నెల్లు ఐతంది. గా యశోదమ్మ.. రాజన్న దేవుని అందె లేసుకున్నదట. సోమారం పూజాయే. మతికి రాక పుసుక్కున.. ‘ఓక్క! గా నారందుకోవా!’ అని చెయ్ తోటి సూపెట్టబోయి ఆమెకు తగిలిన.. గంతే!.. ‘నీ కండ్లుమండ.. నీ దినాల్గాను! దేవుడున్న దాన్ని ముండరాండ్లు ముట్టుకుంటర? గింత అన్యాలమానుల్ల!’ అని తీరొక్క బూతుగక్కింది. దబదబ ఒడ్డుకుబోయి, బోరు కింద మునిగి తడిబట్ట తానంజేసింది.. మనిషికొగ మాటన్నరు. ‘మొగన్ని మింగిగూకున్నది. ఓర్వని కండ్లది.!’ అని ఓగామె అనంగనే.. కంట్లె నీల్లాగలే! శేతులున్న నారు ఆడబడేశి.. ఇంటికొచ్చి ఒలపోశిన. పాపమనిపిచ్చిందో! గీ పిల్ల నా ఎన్కనె వొచ్చింది. నన్నుజూశి ఒకటే ఏడుసుడు. ‘నా బిడ్డగదనే!’ అని పోరిని బట్టుకొని దమ్ముదమ్మార ఏడ్సిన. గప్పట్నుంచి ఒగలగొగలంటె ఇష్టం. కొన్ని రాత్రుల్లయితే.. ఒక్కతే ఇంటికొచ్చి పండేది. దీనవ్వయ్య ఊరంత ఎతికేటోళ్లు. ఇప్పుడు అల్వాటుబడ్డరు. కానరాక పోతే నాకాన్నె ఉన్నదనుకుంటరు. నాకున్న సొమ్మంత దీనికే. నాకెవలున్నరు. నేను సచ్చిన్నాడు.. ఇదే తలగోరిబెట్టాలే!” అని రేణుక ఎల్లిపాయని గిచ్చుకుంట బాధను మింగింది.
గంతల్నే మౌనిక ఏడ్వబట్టే.“ఏడ్తన్నవానే బిడ్డా! అయ్యో.. ఊకోరా!” అని రేణుక, మౌనికను అక్కున చేర్చుకుంది.రాధకు బాధైంది. ఏం దోశిందో మరి.. ఇంట్లకు బొయ్యి శెంబు నిండా నీళ్లు దెచ్చి మౌనికకిచ్చింది.తోమటానికి సుత ఇయ్యని శెంబది.. ఇయ్యాల రాధమ్మ, తాగమని దాంట్లనే నీళ్లిచ్చింది! అంట్లుదోమి బతికే అంటరానోళ్లమీద అమ్మకెంత పెద్ద మనసు’ లోపలనుకుంది రేణుక.“ఎంత అర్లుగల్ల దానివమ్మా! సచ్చి నీ కడుపున బుట్టాలె! మీరు సళ్లగుండాలె! మీకో సక్కని కొడుకు పుట్టాలని, వొచ్చే ఐతారం నాడు ఎల్లవ్వ తల్లికి బోనంజేసి ఉపాసముంట!” రేణుక అనంగనే..మాటల్రాక రాధ అదోలా జూషింది.“రాయే పోరీ బోదాం! ఎల్లిపాయలు ఒగ గిన్నెలబొయ్.. లంగంత దులుపుకో.. పొట్టుబోయేటట్టు.. ఓమ్మా! ఇగ పోతన్నం మేం. మేకలొచ్చినాలే. కుక్కలెగవడ్తే ఒగమానంగా దొర్కయి మల్ల” బజారుకేసి నడిశింది రేణుక.గుమ్మంలోనే ఆగిపోయిన రాధ మనసులో ఎన్నో ప్రశ్నలు. వాళ్లనే సూత్తంది. గుండె బరువెక్కింది. వాళ్లతో బంధం ఎలాంటిదనేది తొలిచేస్తున్న ప్రశ్న.‘ఒక మనిషికి ఇన్ని కట్టాల!? నా అసొంటిదైతే సచ్చేపొవ్! మొగడు లేని ఆడిదాన్ని ఆడోల్లె దేవుని పేర గద్దల్లెక్క బీక్కదింటే అదెట్ల బత్తది. అవమానాలను తొక్కిబట్టి తాటదీసి.. ముందుకు బోతన్న రేణుకను సూత్తే.. భూతల్లిలెక్క గొడ్తంది’..
రాత్రి ఒంటిగంట.. ఊరికిబోయిన భర్త ఇంకారాలే. నిద్రసరిగ పట్టట్లే.. కుక్కల మొరుగుడు భయంకరంగున్నయి. యాన్నుంచో ఏడుపులు చెవులని తాకుతంటే, గుండె వేగం పెరిగింది. ‘దడెల్ దడెల్’ అని తలుపుగొట్టిన సప్పుడుకు రాధకి గుండాగినంత పనైంది.“అమ్మా! నేను మల్లన్నను. రేణుక గుడిశె తల్గబడ్డది.. దాని పాణమైతే పోయిందంటల్లు. ఎట్లయిందో తెల్వదట. ఊరంత లేశి కూకున్నది.. నేను సుత అటేబోతన్న.. ఎంబడే వొత్త! పైలం!” మల్లన్న విషయం జెప్పి ఉరికిండు. కుప్పకూలింది రాధ. దుఃఖం ఏర్లయి పారింది.‘నేనీ రాత్రి బయటికి ఎట్లడుగుబెట్టాలె!? అసలు ఇదెందుకు సావాల్సొచ్చింది? పోదునా!? వద్దా!?’ అని రాత్రంతా ఆలోచిత్తనే ఉన్నది.బల్లున తెల్లారింది. ‘పెద్దింటి బిడ్డని ఎన్నడు బయటికి బోలె! ఐన సుత లేడు. రేణుకిల్లు శాన దూరం. అక్కడిదాకా ఎట్లబోను!? ఊరంత సూత్తరు. ఏమనుకుంటరో ఎందో?’ అని సతమతమైంది.అదే టయానికి మల్లన్న మల్లచ్చిండు.. రాధ బయటికొచ్చి విషయం అడిగేలోపే..“అమ్మగారు! అదెట్ల జెప్పాలె!? అయ్యగారు.. బండి మీంచి పడ్డడట. రాత్రి పట్నంల జరిగిందట. అయ్యగారి దోస్తు ఒకాయన లేడా!?.. అదే ఊకూకె మనింటికి వొత్తడు జూడు.. మనోహరయ్య! ఆన్నాన్నే సచ్చిబోయిండట. నయం.. మనయ్యకు ఏంగాలే! దెబ్బలు దగిల్నియట” సల్లగ జెప్పిండు మల్లన్న.
20 రోజుల తర్వాత. ఒకదిక్కు.. తలకాయకి దెబ్బ గట్టిగదాకి రాజన్నకు పక్షవాతమొచ్చింది. మాట్లడుత లేడు. ఒగ కాలు, ఒగ రెక్క లేత్తలేదు. పాపం మంచానబడ్డడు.. ఎన్నడు నయమైతదో తెల్వది. ఇంకోదిక్కు.. రేణుకకు ఎందుకు సావలనిపిచ్చిందో తెల్వదు. గప్పట్నుంచి మౌనిక ఇటు రాకపాయే. గా పిల్లెట్లున్నదో, ఏడున్నదో ఎవ్వలు జెప్పకపాయే! ధైర్నంజేశి పోదమంటే.. రాధ వొట్టి మనిషి కూడా కాదు. మొన్ననే డాక్టర్ జెప్పిండు పైలమని. కడుపుల పోరడు బడ్డడని తెలిత్తే ఈ పాటికి రేణుక సంబురపడేది.. అంత కాయిషి.ఎన్నిసార్లు తన గుమ్మంకేసి చూసేదో రాధ.. రేణుక ఒత్తదేమోనని. ఇంట్ల మనిషికైతే ఎట్లుంటదో అంతకంటే బాధెక్కువే ఐతంది రాధకి. కండ్లు కాయలు గాశినయ్.. రేణుకతో మాట్లాడినట్టు ఊహించుకునేది రోజు..అట్ల అరుగు మీద కూకోని సూత్తంటే.. మౌనిక సరాసరి ముందుకొచ్చి నిలబడ్డది. రాధకు కాల్జేతులాడలే. అట్లే సూసుకుంట, మౌనికని దగ్గర తీసుకొని నెత్తిమీద శెయ్యేశి నిమిరింది. కుత్తుక దుఃఖంతో నిండింది. మాటలురాట్లే.. మౌనికొక పుస్తకం తీసి రాధ చేతిల పెట్టింది..
ఏంటిదని ముక్కుబీల్చి, కళ్లు తుడుచుకుని.. చిన్నగా నవ్వి.. పుస్తకం తెరిచింది రాధ.మొదటి పేజీలో ‘రేణుక’ అనుంది. మిగిల్న పేజీలన్నీ బొమ్మలే.. మౌనికనే గీశిందని తెల్తంది.ప్రతి పేజొక సన్నివేశమే.
మౌనిక ఆనాడు రాత్రి రేణుకింట్లనే పన్నది.. కానీ, మౌనిక వాళ్ల అయ్య పట్టుబట్టి ఇంట్కి తొడ్కపోయిండు.అందరూ పన్నది జూసి మధ్యరాత్రి మళ్లీ రేణుక ఇంటికి మౌనిక ఒక్కతే పోయింది.. అక్కడ జూసిన భయంకరమైన సన్నివేశానికి గజ్జున వణికింది మౌనిక. వెనక నుండి అయ్యొచ్చి నోర్మూసి.. గుడిసె ఎనకాలకి తీస్కపోయిండు. సప్పుడు కాకుండా.. గుడిసెనుక తడకలోంచి, రేణుక సావు కళ్లారా జూషిళ్లు. ఇదంతా ఒక పేజీలో గీసిపెట్టింది మౌనిక. కండ్లకి కట్టినట్టు కనపడ్తంది. ఎన్ని రోజులు కూకొని గీశిందో. ప్రతి మనిషి బొమ్మకి పేరు సుత రాశి పెట్టింది. పాత్రలు మాట్లాడినట్టు అచ్చరాలు గూడ రాసింది.
మరోపేజీ తీయంగానే.. గుండె పేలినంత పనైంది! మొత్తం సన్నివేశాల సారాంశం ఎట్లుందంటే..!బగ్గ దాగిన రాజన్న, మనోహర్.. యాన్నుంచి వచ్చిల్లో తెల్ల్వది గానీ, గుడిసెలోకి జేరి రేణుకను చెరబట్టిళ్లు. ఎంత ఏడుకున్నా వొదలలే..‘రాజన్నా! నీ కాళ్లు మొక్కుతనే. ఇడిసిపెట్టుల్లె జర! ‘శెల్లె’ అని పిల్తవుగాదన్న’.. అని కాళ్లమీద బడ్డది. అయినా ఇనలే! ఇద్దరు బట్టుకొని చెరపడానికి జేశిన పెనుగులాటల.. రైక శినిగి, జుట్టు ఊడి, కొంగు జారి కాళ్ల కింద పడ్తే.. అదే కొంగు తట్టుకొని కిందపడ్డది. ఎల్లెల్కల పడ్డ రేణుక తలాపున ఎల్లమ్మ బోనం కుండలున్నయి. ఇంకోపక్క జమిడిక. చేతికి కత్తిపీట దొరికింది. కత్తిపీట ఆళ్ల్లకి సూపెట్టి.. లేషి నిలబడ్డది. కళ్లు పెద్దగ జేసి, దమ్ము పైకైత్తి ముందుకు జరిగింది. ఉగ్రంతో ఊగిపోతంది. సూద్దానికి ఎల్లమ్మేషం గట్టి, మేక దొబ్బ నోట్లె పెట్టుకొని బలి సల్లడానికి బయల్దేరిన అమ్మోరులెక్కుంది రేణుక. ఒక్కొక్కడుగు ఎనకకేస్తున్నరు వాళ్లు. ఏమనుకున్నదో ఏమో! ఎనకకు తిరిగి, గుడ్లు నిమిరి, ఊపిరి గట్టిగా పీల్సుకొని.. కత్తిపీట అందుకొని గొంతు కోసుకున్నది.. కుత్తుక తెగి రక్తం సొడసొడ బొంగి, శిమ్ముకుంట బోనంమీద బడి, రక్తంతో ఎల్లమ్మ పట్నంబడ్డది. కోడిలెక్క ఎగిరెగిరి కొట్టుకున్నది. ‘పేదోడి బిడ్డల ఆత్మాభిమానం కాపాడు తల్లీ! నీ బాంచన్.. ఇగ దీసుకో నీ బలి!’ అన్నట్టుంది. భయంతో ఒనికిన దుర్మార్గులు.. గుడిశెకు నిప్పుబెట్టి ఆన్నుంచి దెంకపోయిళ్లు..కండ్లమీద శెక్కరొచ్చినట్లు అయ్యింది రాధకి..రక్తపు సన్నివేశాలున్న పేజీల్లో మాత్రం నిజంగనే రక్తమసొంటి మరకలున్నయి.. ఎర్రరంగు తప్ప ఇంకేరంగూ లేదు. మౌనిక, పెద్దనేలు గాయాన్ని రాధకి సూపెట్టి.. ఇది రక్తంతో పులిమిన రంగని చెప్పకనే చెప్పింది.
కడుపు రగిలి ఉగ్రంతో లేశి.. పొయ్యికాడి కత్తిపీట అందుకొని ఉరుకొచ్చి, మంచం మీదున్న రాజన్న గుండెల మీద కూసున్నది రాధ. కత్తిపీట లేపి కుత్తుక నరకపోయింది. రాజన్నకు ఏమర్థంగాలే కషేపు. గజ్జునొనికిండు. కాండ్రికిచ్చి..“యాక్ తూ! నీయవ్వ!” అని మొకంమీదూంచి, కత్తిపీట బారేశి.. మొకంమీద బొమ్మల పుస్తకం గొట్టి.. కట్టుబాట్లు దెంచుకొని, బయటడుగుబెట్టి, జుట్టు ఇరబోసుకొని పిచ్చి దానిలెక్క ఉరుకుతూ.. వీధులన్నీ దాటి రేణుకింటిని చేరుకుంది. శ్మశానం లాగా ఉంది. సుట్టుజూత్తే, సన్నివేశాలు కళ్లముందే కనబడ్డయి రాధకి. గాలి దుమారానికి చెత్తజేరి శిల్లరగత్తమున్నది. శీరకొంగు జింపి, పిడికెడు బూడిద, నాలుగు రేణుక బొక్కల్ని మూటగట్టి అడుగు ముందుకేసింది.. కాసింత దూరంలో రాధకు, బగ్గగాలి మశిబట్టిన ఒత్తుకుండ కానొచ్చింది. దాంట్ల మూటేసి నెత్తి మీదబెట్టుకొని మందంత సూత్తంటే నడూల్లెకెళ్లి ఇంటికి బోయింది..
వాళ్ల అత్తింట్లకుబోయి పాతబడ్డ ఉట్టి ఒకటిదెచ్చి.. రాజన్న కండ్లకి సూటిగా పైన గట్టి, దాన్ల ఒత్తుకుండ బెట్టింది.“పతిరోజు నువ్విది జూడాలే.. రేణుకకు జేసిన అన్నాయం తల్సుకొని కుమిలి సావాలే! గా కుండనే.. నీ సావుకు చితికుండ. నువ్వు సచ్చినాకనే దాని బొక్కలు గోదాట్ల కలుపుత”.. అని మొకంల మొకంబెట్టి హెచ్చరించింది రాధ.పశ్చాత్తాపం తాలూకు కన్నీళ్లు జారి రాజన్న చెవుల్ని నింపేసినయి.
రెండేండ్లు గడిచినయి..రాధకొక పాప. నడ్తంది.‘శరణు మాదేవి రాణిరావమ్మో ఎల్లు..నిన్ను కొలిశేటి యాల్లయే రాయే ఎల్లు.. ॥స2॥నీకు నిచ్చతోరణాలే ఎల్లు..పచ్చాని పందిట్లురాయే ఎల్లు ॥స2॥..’ఆకిట్ల జమిడిక మోగుతంటే..సాట్లిన్ని గింజలు పట్టుకొచ్చి పాపచేత బైండ్లోని జోలెల పోపిచ్చింది.
రేణుకని మరవలేక.. బుడ్డ పోరికి ‘రేణుక’ అని పేరు బెట్టింది. గజ్జెలు గట్టి ఆడికీడికి తిరుగుతున్న పిల్లని..“ఇగో రేణుక! అగో రేణుక” అని పిల్శినప్పుడల్ల.. రాజన్నకు గుండెవలిగి సచ్చినంత పని..
బి. సుజిన్ కుమార్
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుల వివక్ష, సామాజిక అసమానతలను కళ్లకు కట్టే కథ.. ఒత్తు కుండ! ‘అంటరానితనం’లో మగ్గిపోయే బడుగు మహిళ, ‘మంచితనం’తో కుల వ్యవస్థ గోడల్ని కూల్చిన మరో మహిళ జీవితాలను ఈ కథలో ఆవిష్కరించారు రచయిత బి. సుజిన్ కుమార్. ఈయన స్వస్థలం వరంగల్ జిల్లాలోని కొంకపాక గ్రామం. బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారు. కథలంటే ఇష్టం. వినడం, చదవడం నుంచి.. కాలక్రమేణా ‘రాయడం’ అనే అభిరుచిని పెంచుకున్నారు. సామాజిక రుగ్మతలు, పేదలు, మహిళలే ఈయన కథా వస్తువులు. ‘ఒత్తుకుండ’.. ఈయన మొదటి రచన. అంతకుముందు తన ఆత్మసంతృప్తి కోసమే కొన్ని చిన్నచిన్న కథలు రాశారు. కానీ.. వాటిని ఎప్పుడూ, ఎక్కడా ప్రచురణకు కానీ, ఇతర పోటీలకి కానీ పంపే సాహసం చేయలేదట. ఒక కథను పోటీకి పంపడం, బహుమతి గెలుచుకోవడం.. ఇదే మొదటిసారి! ఈ నూతనోత్సాహంతోనే ప్రస్తుతం రెండు నవలలు రాస్తున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
-బి. సుజిన్ కుమార్
86391 61721