కళ్లుతెరుద్దామన్నా తెరవలేనంత మత్తు. నా యజమాని కూడా నిద్రపోతున్నాడు. భలే యజమాని దొరికాడు! రాత్రంతా పనిచేసి పగలు పడుకుంటాడు. ఇంతలో రోడ్డుమీద పెద్ద శబ్దం వినిపించింది. మైక్‌లో ఏదో పాట.హుషారు వచ్చేసింది. వినాయక చవితి పండుగ సందడి! పండుగలంటే ప్రసాదాలు దొరుకుతాయి.వినాయక చవితికి రోజుకో రుచి. బైటికి కదిలాను.
అది మైసమ్మ యూత్ కాలనీ వినాయకుడి శిబిరం. పక్కనే ఉన్న నిజాముద్దీన్ కాలనీవారు కూడా చేరినట్టున్నారు. వస్తోన్న సినిమా పాటకు అనుగుణంగా లయబద్ధంగా నృత్యం చేస్తున్నారు. అప్పుడే వేడివేడిగా వండి వార్చిన ప్రసాదాన్ని వినాయకుడి ముందుంచారు. నన్నెవరో పక్కకు తోలారు.
“ఛీ! పాడు ఈగలు..” ఎవరో గట్టిగా అరిచారు.నేనేమీ పట్టించుకోలేదు. నాకు ఇవన్నీ మామూలే!ఇంతలో ఇంకో పాట మొదలయ్యింది. అది నా గురించే. చాలా సంతోషం కలిగింది. నన్ను పెట్టి సినిమా తీసేశారు. అది చాలదన్నట్టు అంతరిక్షంలోకి మా ఈగల్ని పంపుతున్నారు. అది ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేసే గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్టు కోసం. ఇవన్నీ మాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? ఇదంతా మా యజమాని చలవ! అతనొక సైంటిస్టు. ఎవరితోనో చెబుతూంటే విన్నాను. అంతరిక్షంలోకి పదిహేను ఈగల్ని పంపిస్తారట. అక్కడ వాటిని వారం రోజులు ఉంచుతారు. అక్కడ శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉంటుంది. అక్కడ వ్యోమగాములు నిలబడలేరు. గాలిలో ఎగురుతూ ఉంటారు. మనిషి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, ఈగ జీర్ణవ్యవస్థతో పోలిక ఉన్నది. ఆ పోలికలతోనే మనుషులతోపాటు ఈగల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్తున్నారు. ఇదంతా మా యజమాని ద్వారా విన్నప్పటినుంచి గాలిలోనే తేలుతున్నాను. అతను నన్ను మాత్రమే బైటికి వదిలేస్తున్నాడు. నా సహచర జీవుల్ని మాత్రం ఒక తొట్టెలో పెంచుతున్నాడు. బహుశా ఇది కూడా ఒక ప్రయోగమేమో! నేను వెళ్లేటప్పటికి అతను ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. అతనికి కూడా మా బాస్ వయసే ఉంటుంది. ఇద్దరూ కబుర్లలో పడ్డారు.“ఎంతవరకు వచ్చింది నీ పరిశోధన?” అడిగాడు అతను.“నడుస్తోంది. ఇప్పుడే కదా మొదలైంది…”
అన్నాడు మా బాస్.“ఈగల మీద ఎందుకు పరిశోధన?”.“ఒక ఆడ ఈగ మూడు నుంచి నాలుగు రోజుల టైమ్‌లో ఐదు వందల గుడ్లు పెడుతుంది. ఈగలు బతికేది నెల రోజుల లోపే. కానీ, నేను ప్రయోగాత్మకంగా వీటిని ఆరు నెలల వరకు బతికిస్తున్నాను. ఈగలు గొప్ప డిటెక్టివ్‌గా పని చేస్తాయి. పదమూడో శతాబ్దంలోనే చైనాలో నేర పరిశోధనలో ఈగలను మొదటిసారిగా వాడుకున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో ఈగ లార్వా దశల్ని అధ్యయనం చేయడం ద్వారా చనిపోయినవారు ఏ సమయంలో చనిపోయారనేది అప్పట్లోనే చైనా ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలాంటి విషయాలు తెలుసుకోవాలనే.. ఈ ఈగల పరిశోధన”. “సూపర్!” అంటూ అతను చప్పట్లు కొట్టాడు. నేను రెక్కలు టపటపలాడించాను ఆనందంగా.“ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు?” అన్నాడు మా బాస్.
“టీచర్‌గా సెలక్ట్ అయ్యాను కదా. పది రోజులు ట్రైనింగ్‌కి రమ్మన్నారు.. ఖమ్మంలో” అన్నాడు ఆ వ్యక్తి.“మంచిది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. వెంటనే ఉద్యోగం కూడా వచ్చేసింది. రుబియా ఎలా ఉంది?”. “బాగానే ఉంది. అయినా తల్లిదండ్రుల మీద బెంగ ఉందంటే రుబియాను వాళ్ల ఇంటికి తీసుకొచ్చాను. ఆమె అన్న, నాన్న లేరు. అయితే మెల్లగా వాళ్ల మనసులు మారుతున్నాయి”. “శుభం! ఇక ఫర్వాలేదులే! మెల్లగా మెత్తబడతారు”. “సరే.. మిత్రమా! వస్తాను” అంటూ అతను ఆ గదిలోంచి బైటికి నడిచాడు.
అతనెవరో తెలుసుకోవాలనే ఉత్సాహం నాలో పెరిగిపోయింది. అతని భుజం మీద వాలాను. మసీదు పక్కనున్న భారీ భవంతి దగ్గర ఆగాడు. ఆ ఇల్లు కోఠిలో పెద్ద బట్టల కొట్టు ఆసామి జాఫర్ గారిది. ఇంతలో అక్కడికి ఒక బస్సు వచ్చి ఆగింది. ఆ భవంతి నుంచి వచ్చిన అమ్మాయి తెల్లగా, సన్నగా ఉంది. అతని వంక నవ్వుతూ చూసింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకొంటూ ఆగి ఉన్న బస్సువైపు నడిచారు. బస్సు స్టార్ట్ అవడంతో అతగాడు ఆమె చేతిని నొక్కి వదిలి బస్సు ఎక్కాడు. బస్సు కదిలి కనుమరుగయ్యేవరకూ ఆమె అతనికి టాటా చెబుతూనే ఉంది. ఆ తర్వాత ఆ భవంతిలోకి నడిచింది.
నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఆ అమ్మాయి పేరు రుబియా. ఆ భవంతి యజమానిగారి అమ్మాయి. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అజ్ఞాతంగా ఉంటున్నారు. అతను ఆ ఇంటి లోపలికి వెళ్లలేదు. నాకు అర్థం అయ్యింది ఇంతే!
“నేను శంకరరావుని మాట్లాడుతున్నాను. మా బంధువు భూపాలరావు మా కులపోళ్లందరికీ ఆయన ఫామ్‌హౌస్‌లో వనభోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ ఫంక్షన్‌కి మావాళ్లే కాక ఆయన వర్గం వారందరినీ పిలిచాడు. వెళ్తున్నాను. నేను ల్యాబ్‌కు లేట్‌గా వస్తాను. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. నలుగురితోపాటు నారాయణ. కులంతోపాటు గోవింద. ఏదో అటెండెన్స్ కోసం వెళ్లాలి. తప్పదు” చెప్పి ఫోన్ కట్ చేశాడు.
ఏదో విందు భోజనం! బైటికి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేసిన బాస్ వీపుమీద ఎక్కాను. పావుగంటలో ఆ ఊళ్లోని ఐదు నక్షత్రాల హోటల్ దగ్గర బండి ఆపాడు. లోపలికి వెళ్తుంటే తెల్లగా, పొడుగ్గా, గడ్డం, నెత్తిమీద టోపీతో ఉన్న ఒక అరవై ఏళ్ల పెద్దాయన కనిపించాడు.
“నమస్తే జాఫర్ సాబ్!” అన్నాడు మా శంకరరావు.ఆయన నవ్వుతూ.. “చాలా సంతోషం. మీ మామ భూపాలరావుది గొప్ప మనసు. మీ వనభోజనాలకు మమ్మల్ని కూడా పిలిచాడు. ఇంతకీ మీ దోస్త్ నిర్మల్ కుమార్ ఎలా ఉన్నాడు?” ఆ మాటలు చెప్పగానే శంకరరావు ఒక క్షణం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.“ఏమీలేదు బేటా! మా అమ్మాయి అతణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయనే మా ఇంటికి రావడం లేదు. ఒక మంచిరోజు చూసి అల్లుడిని, కూతురిని ఇంటికి పిలుస్తాను” అన్నాడు జాఫర్.“అలాగే సార్. మంచి విషయం చెప్పారు” చెప్పాడు మా బాస్.
లోపల మీటింగ్ మొదలైంది.“ఇప్పుడు భూపాలరావు గారు మాట్లాడతారు” అనడంతో సూటు, టైతో ఉన్న అరవై ఏళ్ల పెద్దాయన స్టేజి మీదకు వచ్చాడు. అందరికీ నమస్కారం చేసి చెప్పడం మొదలుపెట్టాడు.“అందరం కలిసి వనభోజనాలు చేసేందుకు ఏర్పాటు చేశాం. మావాళ్లనే కాక నా మిత్రులను, శ్రేయోభిలాషులందరినీ పిలిచాను. అయితే మా కులపోళ్లకు మాత్రం ఒక విషయం మనవి చేస్తున్నాను. మిగతా మిత్రులు ఏమీ అనుకోకండి. ‘ద ఎర్త్ ఈజ్ గోయింగ్ టు సింక్’. 3000 సంవత్సరానికి ప్రపంచంలో ప్రజలు ఉండరు. మన కులపోళ్లమందరం ఒక అసోసియేషన్‌గా కూడి మార్స్‌లో.. అంటే అంగారక గ్రహంలో 20 మంది జంటలను దాచిపెట్టాలి. రానున్న 80 ఏళ్లలో ప్రపంచానికి యుగాంతమట! ఈ విషయాన్ని సీరియస్‌గా ఆలోచించండి. ఇలా చేస్తేనే మన బ్రీడ్, మన బ్లడ్, మన కులం ఈ భూమి ఉన్నంతవరకూ ఉంటుంది” అంటూ భూపాలరావు చెప్పగానే.. అందరూ చప్పట్లు కొట్టారు.
ఆ మాటలకు మా బాస్ మొహం ఎర్రగా మారింది.‘ఛీ… అంతరిక్షంలో ఎగురుతున్నాం. ఇంకా ఏమిటో ఈ బ్లడ్, బ్రీడ్…’ అనుకుంటూ తనలో తాను గొణుక్కున్నాడు. ఆ తర్వాత ఎవరెవరో మాట్లాడారు. మా శంకరరావు భోజనానికి లేవడంతో నేనూ కదిలి మూతలు లేని ఆహారపదార్థాలపై వాలి, నా భోజనం ముగించాను.
ఆరోజు ఉదయం పెద్ద కలకలం వినిపించింది. వినాయకుడి మంటపం దగ్గర కుర్రవాళ్లు కేకలేస్తున్నారు. అక్కడికి చేరిన నాకు విగ్రహాన్ని చూడగానే అర్థమైపోయింది. మంటపంలోని వినాయకుడి చెయ్యి విరిగి ఉంది. చేతిలో ఉన్న పరశువుని, పాశాన్ని పక్కన పడేశారు ఎవరో!“ఈ పని చేసింది ఆ నిజాముద్దీన్ కాలనీవాళ్లే” ఒక కుర్రవాడు గట్టిగా అరిచాడు.“అయ్యో… అట్లా అంటావేందిరా తమ్మీ! మైసమ్మ యూత్ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ బాయ్-జాన్ లెక్క మెసులుతున్నారు. అన్ని పండుగలకు దావత్‌లు ఇచ్చుకుంటారు. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. జర సోచాయించండి” అన్నాడు కాలనీ పెద్దాయన.“అరే… నీకేమీ తెలియదు కాకా. మీవాళ్లే విగ్రహం విరిచిండ్రు. వాళ్ల అంతు చూస్తా!” అంటూ దగ్గరలో ఉన్న మసీదు ఎక్కాడు కుర్రవాడు. జెండాలు పీకేశాడు. అతనితోపాటు వచ్చిన కుర్రవాళ్లు గేట్లు విరిచేశారు. పావుగంటలో వాతావరణం మారిపోయింది. నేను, మా యజమాని ఇంటికి చేరుకున్నాం. ఆయన టీవీ చూస్తున్నాడు.‘పాతబస్తీలో మత కల్లోలం. ఇరువర్గాల మధ్య ఘర్షణ. ఇప్పటికే ఇద్దరి తలలు పగిలాయి’.. టీవీలో వార్త చూసి భయంతో ఇంట్లోనే ఉండిపోయాను.
రెండు రోజుల తర్వాత మా బాస్ టీవీ చూస్తున్నాడు.‘ఇప్పుడే అందిన వార్త. లైవ్‌లో చూడండి. బస్సు దిగిన మైసమ్మ కాలనీ వ్యక్తిపై ఇనుపరాడ్డుతో దాడి చేసిన దుండగులు’.అది చూసి మా యజమాని ‘అయ్యో’ అంటూ బైటికి పరిగెత్తాడు. నేను అతణ్ని అనుసరించాను. నిజాముద్దీన్ కాలనీకి వెళ్లే దారిలో రక్తపుమడుగులో పడిఉన్న వ్యక్తిని చూసి మా యజమాని నెత్తీనోరూ బాదుకున్నాడు.అవును అతనే! నేను గుర్తుపట్టేశాను. అతను మా యజమాని దోస్త్ నిర్మల్ కుమార్. రుబియా భర్త. అతను పడిపోయిన ప్రదేశం చుట్టూ నెత్తురు వరదలా ప్రవహిస్తోంది. ఇంతలో రుబియా పరిగెత్తుకుంటూ వచ్చింది. గుండెలు అవిసేలా ఏడుస్తోంది. రెండు రోజుల క్రితం ఫంక్షన్ హాల్లో చూసిన జాఫర్గారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన కూడా కూతురిని పట్టుకొని ఏడ్వడం మొదలుపెట్టాడు.
“ఎంత డబ్బయినా ఖర్చు పెడతాను. మా అల్లుడిని బతికించండి”.. రెండు చేతులతో దండం పెట్టి గట్టిగా ఏడుస్తున్నాడు జాఫర్. అంతలో అంబులెన్స్ వచ్చింది. రక్తం కారుతోన్న నిర్మల్ కుమార్ శరీరాన్ని అంబులెన్స్‌లో ఎక్కించారు. మా బాస్తోపాటు నేనూ ఆసుపత్రికి వెళ్లాను. రుబియాతోపాటు మొత్తం కుటుంబం అంతా ఆ ఆసుపత్రి బైట కంగారుపడుతూ కనిపించారు. ఇంతలో గొల్లుమంటూ ఏడుపులు వినిపించాయి. నాకు అర్థమైపోయింది, నిర్మల్ కుమార్ చనిపోయి ఉంటాడని.
ఇంతలో అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ టీవీ ఛానల్వాళ్లతో చెప్పటం మొదలుపెట్టాడు.“వినాయక చవితి శిబిరం దగ్గర రెండు మతాల మధ్య సంఘర్షణ మొదలైంది. అది చిలికిచిలికి గాలివానగా మారింది. ఇరువర్గాలు కొట్టుకున్నారు. కర్ఫ్యూ విధించినా మార్పు లేదు. ఈ మతకల్లోల ఫలితంగా నిర్మల్ కుమార్ అనే యువకుడిని దుండగులు తల బద్దలుకొట్టడంతో చనిపోయాడు. దోషులు ఎవరైనా వదలం. ఇరువర్గాలు శాంతియుతంగా సహజీవనం చేయాలి” అని చెప్పి.. అక్కడ ఉన్నవారందరినీ పంపించివేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మా బాస్ ఇంట్లోంచి కదలనివ్వలేదు. ప్రయోగశాలలో ఉండిపోయాను.
నాలుగు నెలలకు బైటికి వచ్చాను. నేను ఇంకా బతికి ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నా బాస్ ఏదో చేసి నా జీవితకాలం పొడిగిస్తున్నాడు. రివ్వున ఎగిరాను. ఆ నిజాముద్దీన్ కాలనీవైపుగా వెళ్లాను. ఆ ప్రాంతమంతా హడావుడి. పిల్లలు రంగురంగుల దుస్తుల్లో నెత్తిమీద టోపీలతో కనిపించారు. అవి రంజాన్ మాసం రోజులని అర్థమైంది. నోరూరింది. రంజాన్ అంటేనే రకరకాల నాన్ వెజిటేరియన్ వంటకాలు. అలా ఎగురుకుంటూ రుబియా వాళ్ల ఇంట్లోకి వెళ్లాను. లోపల మంచం మీద కూర్చుంది రుబియా. ఆమె పక్కనే తండ్రి జాఫర్, అన్న జహంగీర్ నిల్చున్నారు. ఆ పక్కనే నెత్తిమీద ముసుగు వేసుకుని రుబియా తల్లి, వదిన నిల్చున్నారు.
“మంచిగా చెబితే నీకు సమజయితలేదు. దిమాఖ్ ఖరాబయిందా. పోయినోడు పోయిండు. నీ పెనిమిటితో నువ్వూ పోతావా? చెప్పింది ఇను. మన చుట్టాల పోరడు గల్ఫ్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సంబంధం ఖరారు చేసినం. రంజాన్ పండుగ అయినాకనే షాదీ ఏర్పాట్లు షురూ చేసుకుందాం” అంటూ అరిచాడు.
నేను రుబియా వంక పరిశీలనగా చూస్తూ ఉండిపోయాను. మౌనముద్ర దాల్చింది.“ముంతాజ్! జర సముదాయించు నీ కూతుర్ని” భార్యవైపు చూసి అన్నాడు జాఫర్.ఆ తర్వాత తండ్రీకొడుకులిద్దరూ బైటకు నడిచారు. ఆ గదిలో రుబియాతోపాటు ఆమె తల్లి ముంతాజ్, వదిన సుల్తానా ఉన్నారు.బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది. వర్షం వచ్చే సూచనలు లేవు. అయినా ఆ ఇంట్లో కుండపోతగా వర్షం కురుస్తోన్నట్టు ఆ ముగ్గురి కళ్లనుండి అశ్రుధారలు. నేను అక్కడ మరి ఉండలేకపోయాను. మళ్లీ మా ఇంటికి రివ్వుమంటూ ఎగిరాను.
వారం తర్వాత మా బాస్ బండిమీద వెళ్తుంటే నేనూ ఎక్కి కూర్చున్నాను. తిన్నగా ఒక షాపు దగ్గర ఆగాడు. అక్కడ జనం గుమిగూడి కనిపించారు. అక్కడ మాంసాన్ని ఇనుపచువ్వల్లో పెట్టి నిప్పుల మీద కాలుస్తున్నారు. బాస్ ఆ దుకాణంలోకి వెళ్లాడు. నేను ఆహారం దొరుకుతుందని పడిగాపులు గాస్తూ.. ఆ పక్కనే తాగి తూలుతోన్న వ్యక్తుల దగ్గర నిల్చున్నాను. అంతలో మా బాస్ ఒక సంచీలో సీసాలు వేసుకొని వచ్చాడు. అక్కడ తాగుబోతుల మాటలు మా బాస్ చెవులను తాకాయి.“అయ్యో… అయ్యో…” అంటూనే.. బండి ఎక్కి ఇంటికి వచ్చేశాడు.
తర్వాతి రోజు ఉదయం మా బాస్ పని చేసుకుంటుండగా.. ఒక వ్యక్తి వచ్చాడు.అతని నెత్తిమీద టోపీ, లాల్చీ, పైజామా.“అబ్బాస్ చెప్పు… ఏంటి, నేను విన్నది నిజమేనా? నిన్న బ్రాందీ షాపు దగ్గర ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను” అన్నాడు.“అవును. నాకూ చూచాయగా తెలిసింది. జాఫర్ మాకు బంధువే కదా!” అన్నాడు అబ్బాస్, సోఫా మీద కూర్చుంటూ.“ఇదంతా నమ్మలేక పోతున్నా” అన్నాడు మా బాస్.అబ్బాస్ చెప్పడం మొదలుపెట్టాడు.
“ఈమధ్య కొన్ని రోజులుగా జాఫర్, జహంగీర్… రుబియాను మళ్లీ పెళ్లి చేసుకోమని శత పోరుతున్నారు. మెల్లగా బుజ్జగించి చెప్తున్న వారిద్దరూ ఆమెను కొట్టినంత పని చేశారు. అంతవరకు మౌనంగా ఉన్న రుబియా గట్టిగా అరిచింది. ఆ మాటలకు నాకూ ఆశ్చర్యం కలిగింది” అన్నాడు అబ్బాస్.“అవును. భూపాలరావు వనభోజనాలు ఏర్పాటు చేసినప్పుడే జాఫర్ ఆయనతో ఏవో మంతనాలు జరిపాడు. అదేమిటో నాకు అప్పట్లో అర్థం కాలేదు. బార్ షాపు దగ్గర ఆ తాగుబోతులు చెప్పుకొన్న మాటలతో ఏదో లింకు దొరికినట్టయ్యింది” అన్నాడు మా బాస్.
“చూద్దాం… ఇదంతా అనుమానమే! రెండు రోజుల్లో మరిన్ని వివరాలు తెలుస్తాయి” అంటూ అబ్బాస్ ఇంట్లోంచి బైటికి నడిచాడు. నాకు అంతా అయోమయంగా ఉంది. అసలే అల్పప్రాణిని. ఈ అభివృద్ధి చెందిన మనుషులు, వారి మాటలు-మర్మాలు నాకేం తెలుస్తాయి. చాలాసేపు మా బాస్ మౌనంగా ఉండిపోయాడు. ఆలోచనలో కూరుకుపోయాడు.
తర్వాతి రోజు రుబియాను చూడాలనిపించింది. ఉదయమే ఆ ఇంటికి చేరుకున్నాను. ముందుగదిలో ఒక ముసలాయన. గడ్డం, జుట్టు బాగా మెరిసి ఉంది. ఆ ఇంట్లో మగవాళ్లంతా టీ తాగుతున్నారు. అంతలో రుబియా ఆ గదిలోకి వచ్చింది.“కూర్చో బేటా!” అన్నాడు ఆ ముసలాయన. “ఫర్వాలేదు దాదా!” అంటూ ఆమె తల వంచుకుని నిలబడింది. ఆమెను చూడగానే తండ్రీ, అన్నయ్యల కళ్లు ఎర్రబడ్డాయి.“బేటా! మన రాతలు అల్లా రాస్తాడు. గట్లనే జరుగుతాయి. జరిగిందేదో జరిగిపోయింది. మీ అబ్బాజాన్ చెప్పిన మాట విను. సుఖపడతావ్. మళ్లీ షాదీ చేసుకో” అన్నాడు ఆ పెద్దాయన.
ఆ మాటలకు ఆమె చివ్వున తల ఎత్తింది.
“ఈ పెద్దమనుషుల గురించి వచ్చినావా దాదా? వీళ్లు పాములలెక్క సొంత పిల్లల్నే తినేటోళ్లు. ఈ మధ్యనే కోలుకుంటోన్న నా మనసు మీద ఇంకో గాయం. ఆ గాయం రేపింది వీళ్లే! గొడవ సృష్టించింది మా భయ్యానే. ఆ తర్వాత అగ్గి రాజేసింది మా అబ్బాజాన్. వీరికి సాయం చేసింది భూపాలరావు. నిర్మల్ కుమార్ వాళ్ల నాన్న సుల్తాన్ బజార్లో చెప్పులు కుట్టే షాపు నడుపుతున్నాడని వీళ్లకు నామోషీ. అతను బాగా చదువుకుని మంచి టీచర్ అయిండు. నా పెనిమిటి కుటుంబం అంటే వీరికి అసహ్యం. నా పెళ్లికి ఎవరూ రాలేదు. మా ఆయన్ని చంపి, నా బతుకును ఆగమాగమం చేశారు. వీళ్లను వదల. పోలీస్ కేస్ పెట్టి జైల్లో తోయిస్తా. ఇది మతకల్లోల హత్య కాదు. పరువు హత్య! దీనికి వినాయక చవితి సాకుగా దొరికింది” అంది గట్టిగా ఏడుస్తూ.
ఆ మాటలకు జాఫర్, ఆమె జుట్టు పట్టుకుని కిందకు తోశాడు. వంటగదిలో ఉన్న తల్లీ, వదినా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ ముసలాయన జాఫర్‌ను శాంతపరచి కూర్చోబెట్టాడు.అంతవరకు మౌనంగా ఉన్న ఆమె అన్న జహంగీర్.. “పోలీస్ కేస్ పెడతావా! పెడితే నన్నూ, అబ్బాజాన్ను జైల్లో నూకుతారు. ఉరిశిక్షనో జీవిత ఖైదో పడతది. అప్పుడు నీ లెక్కనే అమ్మీజాన్, బాబీజాన్ బతుకులు ఒంటరి బతుకులౌతాయి. అదే నీకు మంచిగుంటదా. గట్లానే చెయ్యి. బద్మాష్…” అంటూ బూతులు తిట్టాడు.రుబియాతోపాటు ఆ ఇద్దరు ఆడవాళ్లు తల వంచుకుని ఆ గదిలో కూలబడ్డారు. ఆ ముసలాయన ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని వదిలి.. “ఇప్పుడు రంజాన్ కదా. జుమ్మా కె రాత్ నాడు ఈ మంచిపని షురూ చెయ్యి. అబ్బాజాన్ను, భయ్యాను క్షమించు. వాళ్లు తప్పు చేశారు. ఇప్పుడేం చేయగలం? నేను వెళ్తున్నాను. నాకు నమాజ్‌కు టైమ్ అయింది” అంటూ తన చేతిలోని టోపీని నెత్తికి పెట్టుకున్నాడు. మగాళ్లిద్దరూ ఆ ఇంట్లోంచి విసురుగా బైటికి నడిచారు.
రుబియా ఆలోచనలో పడింది.తను నిర్మల్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనిది తమ మతం కాదు, కులం కాదు. తనతోపాటు బీఈడీ చదివాడు. ఉద్యోగం సంపాదించుకున్నాడు. తమ పెళ్లి ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదు. అందుకే ఏ మతాలు వద్దనుకున్నారు. ఇల్లు విడిచిపెట్టారు. ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. భారతదేశ వివాహ చట్ట ప్రకారం జరిగింది. తాము అజ్ఞాతంగా బతుకుతున్నారు. తను మాత్రం ఇంట్లోవాళ్లను కలిసేది. నిర్మల్ కుమార్‌ను తమ కుటుంబం అల్లుడిగా ఆదరించలేదు. గణపతి ఉత్సవాల్లో నిర్మల్ కుమార్‌పై దాడిచేసి చంపేశారు. తన తండ్రి, అన్న కూడా అది చూసి గుండెలు అవిసేలా ఏడ్చారు. కానీ.. అది నిజమని తను నమ్మింది. అయ్యో… నమ్మించి ఎంత మోసం చేశారు! కులం తాలూకు అహంకారం అన్ని మతాల్లోకి చొచ్చుకుపోతోంది. మైనారిటీలమైన తమలో కొంతమంది ఆధిపత్య భావజాలంతో ఉంటున్నారు. ఫలితం తన పెనిమిటిని పోగొట్టుకున్నది. ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి.. రుబియా గొల్లుమంది. రుబియా తల్లీ, వదినా ఆమెను ఓదారుస్తూ, ఆమె చేతులు పట్టుకుని ఉండిపోయారు.
“నేను కేసు పెడితే మీ ఇద్దరికీ వైధవ్యం వస్తుందట. ఆ ముసలాయన చెప్పినట్టు వినుకోవాలా? నాలాగే మీ ఇద్దరి బతుకులు ఒంటరైపోతాయా? నా పెనిమిటిని హత్య చేసినవారెవరో నాకు తెలిసిపోయాక, ఆ దోషుల్ని క్షమించి వదిలేయాలా?”. అంటూ ఏడ్చింది రుబియా. రుబియా మాటల్ని ఆ ఇద్దరూ మౌనంగా విన్నారు. తమ గదిలోకి వెళ్లి నమాజ్ ముగించుకుని వచ్చారు. గదిలోకి వచ్చిన వదిన, తల్లి ఆమె రెండు చేతులు పట్టుకుని ఆమెను లేవదీసి.. బైటకు తీసుకొచ్చారు. “ఈ నెలవంక ఎంత బాగుంది! అమావాస్య తర్వాత వచ్చే తొలి చంద్రోదయం. శివుడి తలపై నెలవంక ఉంటుంది. రోమన్ కేథలిక్‌లు కన్యమేరీకి ప్రతీకగా దీన్ని చూపుతారు” అంటోంది రుబియా.“చూడు…” అంటూ ఆమె తల్లి ముంతాజ్ దూరంగా మసీదు మినార్‌పై ఉన్న నెలవంకను చూపించింది.“అన్ని మతాల, కులాల సారాంశం ఒక్కటే. అయినా ఎవరి అభిమతం వారిదే” అంటోంది రుబియా.వారి మాటలు వింటూంటే నాలో ఆలోచనలు!
‘మేము మనుషులకు వ్యాధులను కలుగజేస్తామని భయపడతారు. కానీ ఆ వ్యాధుల కన్నా మరింత భయంకరమైన రుగ్మతతో మనిషి బతుకుతున్నాడు. నేను చెత్తమీదే పుట్టాను. చెత్తలోనే బతుకుతున్నాను. మనిషి కులం, మతం, వర్గం, పరువు అనే వైవిధ్యాలతో, వైషమ్యాలతో జీవితం సాగిస్తున్నాడు. ఎందుకూ ఈ ఈగ జన్మ అని బాధపడుతున్నాను గానీ రుబియా కథ విన్న తర్వాత మనిషి కన్నా ఈగ జన్మే బాగుందనిపిస్తోంది’.నాలోని ఆత్మ నా ముందు ప్రత్యక్షమైనట్టు ఎదురుగా వెలుగు కనిపించింది. ఎవరో చెబుతోన్న మాటలు లీలగా వినిపించాయి.
‘అహం అనే భావన నాశనమైనప్పుడు శ్రేష్టం, అఖండం అయిన సత్యస్వరూపం నేను, నేను అంటూ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది. అంతవరకు మనిషి కులం, మతం, పరువు అనే అడ్డుగోడలు వేసుకుంటూ తోటి మనిషిని, సమాజాన్ని ధ్వంసం చేస్తూనే బతుకుతాడు’..
మళ్లీ నా మనసులో ఆలోచనల సుడులు.‘నేనే మీకు ఈ కథ ఎందుకు చెప్పినట్టు? అదే మనిషి కోణం నుండి చెబితే ఎలా ఉంటుంది? ఆ మనిషి ఏ మతానికో, కులానికో, వర్గానికో, భావజాలానికో కొమ్ము కాస్తాడు. లాయర్‌గా తనవైపునుండే తీర్పు తీరుస్తాడు. నేను మనిషిని కాదుగా! తోటి మనిషిని వేటాడను. జడ్జిలా న్యాయంవైపు నిలబడతా!’రుబియాతో నడుస్తోన్న ఆ ఇద్దరు ఆడవాళ్లతోపాటు నేనూ ముందుకు కదిలాను. నా కళ్లు మూతపడుతున్నాయి. ఈగగా నా జన్మ తరించిందనుకున్నాను. నాకు మరణఘడియలు సమీపించాయి.“దుష్టశిక్షణ జరగాలి. ఆ పని చేస్తే అల్లా కూడా సంతోషిస్తాడు. జుమ్మా కె రాత్, తాము చేయబోయే ఆ పనికి అల్లా ఆశీస్సులు ఉంటాయి”.. ఆ ముగ్గురు ఆడవాళ్లు తమలో తాము అనుకుంటోన్న మాటలు నా చెవికి ఇంపుగా అనిపించాయి. వారు నెలవంకను చూస్తూ ముందుకు నడుస్తోన్న దృశ్యాన్ని చూస్తూనే నేను నేలమీద రాలి పడ్డాను.
డా॥ఎమ్.సుగుణ రావు
చెత్తలో పుట్టి, చెత్తలో బతికే క్రిమికీటకాలు.. మనుషులకు వ్యాధులు కలుగచేస్తాయని భయపడతారు. కానీ.. కులం, మతం, వర్గం, పరువు అనే వైషమ్యాలతో బతికే మనిషులదే తనకన్నా చెత్తబతుకని తలపోసే ఒక క్రిమి అంతరంగ ప్రయాణమే.. ఈ ఆత్మ సాక్షాత్కారం. రచయిత డా॥ఎమ్.సుగుణ రావు. స్వస్థలం విశాఖపట్నం. ఇప్పటివరకూ 350 కథలు రాశారు. వీటిల్లో 147 కథలకు.. వివిధ సాహితీ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. ‘ఏడు గుర్రాల సూర్యుడు’ నవలకు లక్ష రూపాయల బహుమతి అందుకున్నారు. ‘ఆకాశంలో ఒక నక్షత్రం’ కథ ఇంగ్లీష్ నాటకంగా రూపుదాల్చి.. టాటా లిట్‌ఫెస్ట్ సుల్తాన్ పదాంశీ అంతర్జాతీయ నాటక పోటీలలో ద్వితీయ బహుమతి పొందింది. తానా బాలల నవలల పోటీలో ‘ఆలీబాబా ఐదుగురు స్నేహితులు’ నవలకు బహుమతి వచ్చింది. సాహిత్యసేవలో భాగంగా.. అనేక పురస్కారాలు అందుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో తృతీయ బహుమతి
రూ.10 వేలు పొందిన కథ.
-డా. ఎమ్. సుగుణ రావు
97046 77930