తన సంగటికాళ్లతో కలిసి పురవీధులను దాటి, గిరి శిఖరాన్ని చేరుకున్న జయసేనుడు.. ఒక్కసారి తన పోదన నగర సౌందర్యాన్ని చూసి మైమరచిపోయాడు. మిత్రులతో ఇలా అన్నాడు పోదనమా తథాగతు ప్రబోధన కేంద్రమనంగ తోచు, నింపాదిగ చూడు డయ్యది విభా విభవ ప్రభలీను సౌధమేపాదగు బోధివృక్షముకు; ప్రార్థన మందిరముల్, గృహమ్ము లేవేదననైన తీర్చును; పవిత్ర చరిత్ర మదీయరాజ్యమౌ.(పోదన నగరం ఆ తథాగతుడైన బుద్ధుడు తపస్సు చేసిన కేంద్రం అన్నట్లు కనిపిస్తున్నది. అది ఉజ్వలమైన కాంతులను వెదజల్లే బోధివృక్షానికి పాదులాగా ఉన్నది. ప్రార్థన మందిరాలు, గృహాలు ఏ ఆవేదననైనా తమ అక్కున చేర్చుకొని తొలగింపజేసేటట్లుగా ఉన్నాయి. ఎంతో పవిత్ర చరిత్ర కలిగిన నా ఆరాధ్యనగరం ఇది)జయసేనుని మాటలు విన్న ముగ్గురు మిత్రులు ఆనందభరితులయ్యారు. “భళా మిత్రమా! ధనమున్నా అహం లేదు; వంశక్రమం ఎరిగినా మదం లేదు; బలం ఉన్నా అది దుష్ప్రయోగం కాదు. నీలాంటి మహోన్నత వ్యక్తికి స్నేహితులమైనందుకు మాకు గర్వంగా ఉంది” అన్నాడు జయసేనుణ్ని చూస్తూ.. అతని స్నేహితుల్లో ఒకడైన వామదేవుడు.“మిత్రమా! మన గొప్పతనం ఎప్పుడైనా ఎదుటి వాళ్ల మంచితనం మీద ఆధారపడి ఉంటుంది. మీరు మంచివాళ్లు కాబట్టి నేను ఉత్తముడిలాగా కనిపిస్తున్నాను అంతే !” అన్నాడు జయసేనుడు వినయంగా.
ఆ విధంగా వాళ్లు ఇచ్చకాలు మాట్లాడుకుంటూ అస్మక రాజ్య పరిధిని దాటి ఎంతోదూరం వెళ్లిపోయినారు. హఠాత్తుగా వాళ్లకు ఆడవాళ్ల నవ్వుల కలరవం వినిపించింది. ముందుగా అది విన్న ఉల్లోలుడు అందరినీ అప్రమత్తం చేసినాడు. గుర్రాలను ఆపి, నిశ్శబ్దంగా ఆ మాటలను వినడానికి నలుగురూ చెవులు రిక్కించినారు. ఈసారి మరింత చేరువగా, స్పష్టంగా వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దం వచ్చిన వైపు దృష్టి సారించినాడు జయసేనుడు.సెలయేరు జలపాతంగా మారుతున్న ప్రదేశం అది. బహుశా ఆ సుందరీమణులు జలక్రీడలో మునిగి ఉన్నారు కాబోలు. మిత్రులు ముగ్గురిని చూస్తూ తన అంచనాను వాళ్లకు తెలిపాడు జయసేనుడు.“అయితే కనులకు విందే…” చిన్నగా కేకవేస్తూ గుర్రం దిగాడు విసమసేణుడు.“మిత్రమా! ఆడవాళ్లు స్నానం చేస్తుండగా తొంగి చూడటం అనైతికం. మనం వాళ్లను కలుసుకోవాలనుకుంటే, వాళ్లు వస్ర్తాలు ధరించి వచ్చేదాకా ఎదురు చూడటమే మార్గం!” హెచ్చరిస్తున్నట్లు అన్నాడు జయసేనుడు. తప్పిదం తెలుసుకున్నట్లు తలవంచుకున్నాడు విసమసేణుడు.పాపా న్నివారయతి యోజయతే హితాయగుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీ కరోతి
ఆపద్గతం నచ జహాతి దదాతికాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదన్తి సన్తః
(పాపపు పనులు చేయకుండా కాపాడటం, మేలును ఆలోచించడం, రహస్యాన్ని దాచుకోవడం, మంచి గుణాలను బయటికి చెప్పడం, ఆపత్కాలంలో తోడుగా ఉండటం, అవసరానికి సాయం చేయడం మంచి మిత్రుని లక్షణాలని పెద్దలు చెప్పినారు) అనే శ్లోకం గుర్తుకొచ్చింది ఉల్లోలుడికి. కళ్లతోనే జయసేనుడిని అభినందించినాడు. చిరునవ్వుతో తన సంతోషం వ్యక్తం చేసినాడు వామదేవుడు. ఇంతలోనే దాపుననున్న పొదలదాపున ఏదో కదిలిన అలికిడి అయింది. మిత్రులు నలుగురూ అటు చూసినారు. అంతలోనే ఒక అశ్వికుడు ఆ పొదల నుండి వెలువడి, సంధించి వదిలిన బాణంలా దూసుకు పోసాగినాడు. ముందుగా తేరుకున్న విసమసేణుడు గుర్రంతో ఆ అశ్వికుడిని వెంబడించినాడు.అది గమనించిన స్త్రీలు కెవ్వుమని అరుస్తూ క్షణాల్లో వస్ర్తాలను ధరించినారు. వాళ్లలో ఒక అందమైన యువతిని చూసిన జయసేనుడికి మతిపోయింది.ఆల్చిప్పల వంటి విశాలమైన కనులను విప్పార్చి శిలా ప్రతిమలాగా చూస్తూ ఉండిపోయిన జయసేన శ్రేష్ఠిని.. ఈ లోకంలోకి తీసుకొని రావడం గగనమైంది ఉల్లోల వామదేవులకు. “ఆ అద్భుత సౌందర్య రాశి ఈ ప్రదేశం వదిలి వెళ్లిపోయి చాలా సేపయింది. ఇంకా ఎవరిని చూస్తున్నావోయీ!” ఆశ్చర్యాన్ని, ఆందోళనను, నవ్వునూ అదిమిపడుతూ అడిగినాడు ఉల్లోలుడు.ఒక్క క్షణం తటపటాయించి, అంతలోనే జరిగిన పొరపాటు గ్రహించి, ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు జయసేనుడు…
సరిగ్గా అప్పుడే విసమసేణుడు అంతకుముందు పారిపోయిన వాని పెడరెక్కలు విరిచికట్టి మిత్రత్రయం ముందు పడేశాడు.శాంత స్వభావానికి మారుపేరుగా ఉండే జయసేనుడు వాడిని చూడగానే మీదికి లంఘించి, పిడిగుద్దులతో వాని మొహాన్ని పచ్చడి చేయడమే గాకుండా.. దొరికిన చోట్లల్లా వాణ్ని గుద్దుతూనే ఉన్నాడు.పరిస్థితి విషమించడం గమనించిన మిత్రులు అతన్ని పట్టుకొని ఆపేశారు.
“మిత్రమా! ఏమిటి ఈ ఆవేశం? శాంతించు” అన్నారు. ఆ మాటలతో మరింత రెచ్చిపోయినాడు జయసేనుడు.“నన్ను ఆపొద్దు హితులారా! ఇటువంటి నీచులను బతకనీయడం సమాజానికి క్షేమకరం కాదు!” అంటూ సర్రున ఒరలో నుండి కరవాలం బయటికి తీసినాడు.జరగబోయే పరిణామాన్ని ఊహించుకొని దిగ్భ్రమకులోనైనారు మిత్రులు ముగ్గురూ. మరొక్క క్షణం ఆలస్యమైతే వాని తల తెగి నేలమీద పడేదే కానీ.. అదే క్షణం ఒక గంభీర స్వరం వినిపించింది వాళ్లకు…“ఆగండి! ఏంటి మీ దౌర్జన్యం?”మిత్ర చతుష్టయం ఒకేసారి అటు తిరిగి చూసింది. అశ్వారూఢుడైన ఒక సైనికుడు వాళ్లకు కనిపించినాడు. అతడు తమ జనపదానికి సంబంధించిన వాడు కాదని అర్థమవుతున్నది. ఒక్క క్షణం తామెక్కడున్నారో అర్థం కాలేదు వాళ్లకు.“మీరు పరదేశీయులు. మీ హద్దుల్లో మీరు ఉండకపోతే మా ముళక రాజ్యంలో ఆజన్మ బందీలుగా ఉండాల్సి వస్తుంది తెలుసా?” అతను గట్టిగా మందలించినాడు.“క్షమించండి యోధా! వీడు చేసిన దుర్మార్గం గురించి తెలిస్తే, మీరే వీని తలను మొండెం నుండి వేరు చేస్తారు” తనను తాను నిగ్రహించుకుంటూ, నిజం తెలిపినాడు జయసేనుడు.
“అది మా అంతర్గత విషయం. పొద్దుగుంకేలోపు మా రాజ్యం సరిహద్దు దాటకపోతే, ఇంకెప్పటికీ ఇక్కడి నుండి మీరు వెళ్లలేరు!” అతని గొంతు కటువుగా ఉంది.“ఇంతకూ మీదే రాజ్యం? ఇక్కడికి వచ్చిన పనేమి? అసలు ఎవరు మీరు?” అని సూటిగా చూస్తూ అడిగినాడు.తమ వివరాలన్నీ స్పష్టంగా చెప్పినాడు వామదేవుడు. ఆ తర్వాత ఆ నలుగురు స్నేహితులు అక్కడి నుంచి పోదన నగరం వైపు బయలుదేరినారు.
మల్లికా గిరి.
ముళక జనపదంలోని ఒక అందమైన పట్టణం. అందులో అందమైన ఒక మేడ. ఆ మేడ మీద శయ్యా గృహంలో జ్వరంతో బాధపడుతున్నది రోహాదేవి. ఆమె అహయాదేవి, మేఘచంద్రుల జ్యేష్ఠ పుత్రిక. మరో కూతురు పేరు సీహాదేవి. నిన్నటి రోజు వాళ్లిద్దరూ చెలులను వెంటబెట్టుకొని వనవిహారానికి వెళ్లినారు. అక్కడ ఏం జరిగిందో కానీ వచ్చిన క్షణం నుంచి రోహాదేవి పడక దిగడం లేదు. మరుసటి రోజు గమనిస్తే జ్వరంతో బాధపడుతున్నది. భిషగ్వరుణ్ని పిలిపించి అడిగితే.. “ఆందోళన పడాల్సిన పనిలేదు. శీతం, పైత్యం ప్రకోపించినాయి. మూడు రోజులు కషాయం తాగితే తగ్గిపోతుంది” అని కషాయంతోపాటు కొన్ని గుళికలను ఇచ్చి వెళ్లినాడు ఆ వైద్యుడు.రెండోరోజు సాయంత్రమైనా జ్వరం దిగిన ఛాయ లేదు. వీళ్లు వెళ్లిన చోట ఏదైనా భయం గొలిపే సంఘటన జరిగిందేమోనన్న అనుమానం కలిగింది అహయాదేవికి. అటువంటిదేమీ లేదని చెప్పింది సీహ.“అక్కా! నిన్న మనం జలక్రీడానంతరం వస్తుండగా నువ్వు అనిమిషవై చూసిన ఆ సుందరుడు ఎవరో నీకు తెలుసా?” అడిగింది సీహ.
“ఎవరు?” ఆశ్చర్యంగా అడిగింది రోహ.“అతను మా బావగారే!” ఠక్కున సమాధానం చెప్పింది సీహ.రోహ ఆ మాటలను అస్సలు నమ్మలేదు. తనని ఏదో ఓదార్చడానికి చెల్లి అలా చెప్పిందని ఆమె అనుమానం. అందుకే మళ్లీ అడిగింది… “అవునూ.. అతనే మీ బావగారని ఎలా చెప్పగలుగుతున్నావే? ఆ వచ్చిన వాళ్లు ఎవరో నీకేం తెలుసు?” అన్నది.దానికి సమాధానంగా సీహ.. “మన పట్ల అపచారం చేసిన దుర్మార్గుణ్ని తీసుకుపోతున్న యోధుడు.. ఆ నలుగురు యువకులు అస్మకరాజ్యం వారని, అందులో ఒకడు కుసుమ శ్రేష్ఠి కుమారుడు జయసేనుడని తన పక్కనున్న భటునితో చెప్తుంటే విన్నాను” అన్నది సీహ.“నిజమా???” ఇంకా నమ్మకం కుదరలేదు రోహకు. ‘అవును’ అన్నట్లు కనురెప్పలు మూసి, తెరిచింది సీహ.ఒక్కసారిగా చెల్లిని గుండెకు గట్టిగా హత్తుకుంది రోహ. కన్నీరు ధారాపాతమై సీహా వీపును తడపసాగింది. అది ఆనందమో, దుఃఖమో చెప్పడం కష్టం. అక్క ఆలింగనంలోని సెగ.. సీహను ఆశ్చర్యానికి, భయానికి లోనుచేయగా… ఒక్క క్షణం ఆగి అక్క కళ్లు తుడిచి ఈ విధంగా అన్నది…యాగము చేయుచోట అసహాయముగా వెలుగొందు అగ్నియే త్రాగెడు వారి కొంపలను దర్పముగా జ్వలియించు; బాధతోవేగెడు వారి డెందముల వేయి విధాల దహింపజూచు; నాహా! గణియింప శక్యమె మహాగ్ని మహత్వము నెంత వారికిన్ !
(అగ్ని మహత్తరమైంది. యజ్ఞ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది. అదే తాగుబోతుల జీవితంలో దూరి కొంపలు తగలబెడుతుంది. బాధపడే వాళ్ల మనసుల్లో దూరి అనేక విధాలుగా కాలుస్తుంది)“అక్కా! దుఃఖం ఏ సమస్యకూ పరిష్కారం కాదు! నిజానికి నీది అసలు సమస్యే కాదు. అగ్నిసాక్షిగా వివాహమాడిన బావగారినే నువ్వు కోరుకుంటున్నావు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఈపాటికి నువ్వు మాకొక పాపడిని ఆడుకోవడానికి ఇచ్చేదానివి. మామగారి తీరికలేని వ్యవహారాలు, బావగారి నిరాసక్తత…” అంటూ ఆగిపోయి, ఏదో గుర్తొచ్చినట్టు అడిగింది సీహ..
“అవునూ… నిన్న బావగారు నిన్ను చూసినారా?”“ఆఁ…” కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది రోహ.అలా అంటున్నప్పుడు ఆమె బుగ్గలు ఎరుపెక్కడం స్పష్టంగా కనిపించింది.“అయితే నీకింక సమస్యే లేదు. అసలు కష్టమంతా బావగారికే!” అంది నర్మగర్భంగా నవ్వుతూ సీహ.అంతరార్థం అవగతంకాక బిత్తర చూపులు చూసింది రోహ. “నువ్వే నువ్వు అని, నువ్వింత అందంగా ఎదిగినావని బావగారికి తెలియదు కదా! ఒక్కసారి నిన్ను చూస్తే మతి పోగొట్టుకున్నట్లే! ఇంత అందాన్ని కళ్లారా చూసిన మగవాడు చలించకుండా ఉండటం అసంభవం. అంటే నిన్ను చూసి ఆయనగారు గుర్తించి ఉంటే.. అనుక్షణం నీ ఊహల్లో, ఊసుల్లో ధ్యాసల్లో కణకణ మండే అగ్నితాపంలో కాగిపోతూ, ఆ కాకను తట్టుకోలేక నిన్ను వెతుక్కుంటూ రాకపోతే… నా పేరు సీహాదేవే కాదు!” అన్నది ప్రతిజ్ఞ చేస్తున్నట్లు దృఢంగా.“నిజంగా నన్ను వెతుక్కుంటూ ఆయన వస్తారంటావా?!” నమ్మలేనట్లుగా అన్నది రోహ.(సశేషం)
సెలయేరు జలపాతంగా మారుతున్న ప్రదేశం అది. బహుశా ఆ సుందరీమణులు జలక్రీడలో మునిగి ఉన్నారు కాబోలు. మిత్రులు ముగ్గురిని చూస్తూ తన అంచనాను వాళ్లకు తెలిపాడు
జయసేనుడు. “అయితే కనులకు విందే…” చిన్నగా కేకవేస్తూ గుర్రం దిగాడు విసమసేణుడు.“మిత్రమా! ఆడవాళ్లు స్నానం చేస్తుండగా తొంగి చూడటం అనైతికం. మనం వాళ్లను కలుసుకోవాలనుకుంటే, వాళ్లు వస్ర్తాలు ధరించి వచ్చేదాకా ఎదురు చూడటమే మార్గం!” హెచ్చరిస్తున్నట్లు అన్నాడు జయసేనుడు.
జరిగిన కథ
అస్మక రాజ్యంలో గొప్ప ధనికుడైన కుసుమ శ్రేష్ఠి సార్థవాహుడు. కుసుమ శ్రేష్ఠి, సిరిసత్తిల ఏకైక కుమారుడు జయసేనుడు అందగాడు, యోధుడు. చిన్ననాటే పెండ్లి అయినా.. బౌద్ధమతంపై ఆసక్తి పెంచుకున్నాడు. దాంతో, భార్యను ఇంటికి తెచ్చుకోవడంపై అనాసక్తుడై ఉంటాడు. తండ్రి ఇంట్లో లేని సమయంలో స్నేహితులతో కలిసి వనవిహారానికి వెళ్తాడు. తర్వాత…
దోరవేటి
89788 71961