సమయం ఒంటి గంట దాటిపోతున్నది. గేటు పక్క గొలుసుతో కట్టేసి ఉన్న స్నూపీ నిమిషానికోసారి కూర్చుంటూ మళ్లీ పైకి లేస్తూ, ఓసారి గిరగిరా తిరిగి మళ్లీ నిలబడి.. పదేపదే వాష్ ఏరియా వైపున్న వంటగది తలుపు వైపు చూస్తున్నది.ప్రతిరోజూ ఈపాటికి రెండుసార్లు తినడానికి పెట్టే అమ్మాజీ తన దరిదాపులకు రాలేదు సరి కదా, కంటికి కూడా కనిపించక పోయే సరికి స్నూపీకి అయోమయంగా ఉంది. దాని కడుపు ఆకలితో నకనకలాడుతుంటే.. ఆమెపై కోపం కూడా వస్తున్నది.
బయట స్నూపీ సంగతలా ఉంటే.. ఇంటి లోపల మనుషుల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది.బలరామ్మూర్తి గారికి టిఫిన్ తినని కారణంగా కళ్లు బైర్లు కమ్ముతున్నట్లు అనిపిస్తున్నది. అసలే షుగరు ఉండటం వల్ల ఆయన్ని ఆకలి ఎక్కువగా బాధిస్తుంటే.. కాఫీ అయినా తాగుదామనిపించి కోడలు పద్మని అడిగితే, ఆమె కాఫీ ఇచ్చింది. ఆ కాఫీ కప్పు నోటిదగ్గర పెట్టుకోగానే రుచి సహించక సైలెంటుగా కప్పు పక్కన పెట్టేస్తుంటే చూసిన పద్మ.. మామగారితో అంది.“ఏం మామయ్యా! ఇది కూడా నచ్చలేదా ఏంది? ఎవరికి నచ్చినా నచ్చకున్న నాకట్లే చాతనైతది.. తాగితే తాగండ్రి.. లేకుంటె మానండ్రి! అసలికీ అమ్మాజీకి ఏం రోగం పుట్టిందో ఏమో.. చెప్పాపెట్టకుండా మానేసె! ఇప్పటికి ఎన్నిసార్లు జెప్పిన.. చిన్నఫోన్ కొని పెడతనె. ఇట్లాంటి అవసరమొస్తె ఫోన్ చెయ్యడానికి పనికొస్తదని. ‘నాకెందుకమ్మ పోనూ.. దాన్ల ఎట్ట మాట్లాడాల్నో నాకు తెలియనే దెలియదాయే! పొద్దంతా ఈడ్నే ఉంటగా.. రాత్రైనంకేగా తెలిసినోళ్ల ఇంటి పక్కగదిల పండుకునేతందుకు పొయ్యేది.. మరీ అక్కరపడితె ఆల్లకి చేయండమ్మా’ అంట వాళ్ల నంబరు పేపర్ మీద రాపించుకుని తెచ్చె! గాని ఏం లాభం? ఉదయం ఎనిమిది గంటలకెల్లి వాళ్లకి కాల్ జేస్తున్న గాని.. వాళ్లు కాల్ రిసీవ్ చేసుకోటమే లేదాయె! మరీ ఆలస్యమైతందని పొద్దున నేను ఉప్మా జేస్తే.. ఏం రోగమో ఏందో.. ఇంట్ల ఒక్కరంటే ఒక్కరు కూడా తిని చావలే! జర ఆలస్యంగైనా అమ్మాజీ వస్తదిలే అని వంట జోలికే పోలే..”
నిజానికి ఆమె చేసిన ఉప్మా ఆమే తినలేక చెత్త బుట్టలో వేసేసింది. ఇంట్లో తెచ్చి పెట్టుకున్న పళ్లు కూడా నిన్ననే అయిపోతే.. ఈరోజు తెప్పించుకుందాం అనుకుంది. ఇప్పుడేమో కడుపులో ఖాళీఖాళీగా పేగులు లాగేస్తున్నట్టనిపిస్తుంటే.. దాన్నే ఆకలంటారని తెలిసొచ్చి ఆ దుస్థితికి కారణమైన అమ్మాజీ మీద కోపంతో రగిలిపోతూ ఆ కోపంలో మామగారిపై విరుచుకుపడింది పద్మ.“సర్లే.. గిప్పుడు నువ్వు వంటజేస్తె మాత్రం తినేదెవరంట? అదిగూడ చెత్తబుట్టల బోసేదేగద తల్లీ”.. మనసులో అనుకున్నానని పైకి అనేశారు బలరామ్మూర్తి గారు.
అంతే.. కస్సున లేచింది పద్మ.“ఏమంటుండ్రు.. నా వంటంత బాగుండదనా మీ ఉద్దేశం! అత్తమ్మ ఉన్న రోజుల్ల గూడ ఆమెని మాత్రానికి మెచ్చుకున్నరా ఏనాడైనా? మీకూ, మీ కొడుక్కి ఎప్పుడు జూసినా పొరిగింట్ల పుల్లకూరేగా మంచిగుండేది. అందుకేగ మీ కొడుకు ఈ అమ్మాజీని వెతికివెతికి తీసుకొచ్చి పెట్టిండు..” అంటూ రుసరుసలాడింది పద్మ.నిజం అది కాదు. అత్తగారు ఉన్నప్పుడు ‘నువ్వు చెయ్యి’ అంటే.. ‘నువ్వు చెయ్యి’ అంటూ వంతులు వేసుకుని అలక పాన్పులెక్కుతూ, అత్తగారు టీవీ సీరియల్స్ చూస్తూ.. కోడలు కొత్తగా వచ్చిన సెల్ఫోన్లో ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ.. షాపింగులకు తిరుగుతూ ఉంటే.. కడుపు మాడ్చుకోలేకా, బైట తినలేకా తన బడ్జెట్లోనే తక్కువ జీతానికి వస్తుందిలే అని వంట మనిషి అమ్మాజీని పెట్టాడు తన కొడుకు భాస్కరం. ఆ విషయం గానీ గుర్తుజేస్తే కోడలు ఉగ్రరూపం ధరిస్తుందని తెలిసిన బలరామ్మూర్తి గారు నచ్చచెబుతున్నట్టుగా.. మెల్లగా..“అదిగాదు పద్దమ్మా.. నీకు అలవాటు లేదుగా”.. అని నసుగుతూ, ఆకలికి తట్టుకోలేక మాటిమాటికీ నీరసంగా కడుపు తడుముకుంటూ..‘ఛ.. పొద్దుటా ఉప్మ ఎట్లోగట్ల తినేసి ఉంటె మంచిగుండేది.. జర లేటైన ఎట్లయిన అమ్మాజి వస్తాదిలే.. అప్పుడా వంట కాంగానే త్వరగ తినొచ్చులే.. అనుకుని తినకుండా వదిలేసిన.. ఇప్పుడేమొ ప్రాణం బోతున్నట్లు అనిపిస్తుండె’ అనుకున్నారు బలరామ్మూర్తి గారు.
స్కూల్‌కి వెళ్లడానికి లంచ్ బాక్సులు రెడీ కాలేదన్న వంకతో ఇంటి దగ్గరే ఉండిపోయిన పన్నెండేళ్ల మనవరాలు వసుధ, పదేళ్ల మనవడు వంశీ చాక్లెట్లూ అవీ తింటూ.. ట్యాబ్‌లో గేమ్స్ ఆడుకుంటుంటే..
మనవడిని పిలిచి..‘అమ్మాజీ ఎందుకు రాలేదో తెలుసుకుని ఆడ్నే ఉంటె వెంట పెట్టుకుని దీసుకురా’ అని చెప్పి.. వంశీని గంట క్రితం బతిమాలి, అమ్మాజీ రాత్రిపూట ఉండే చోటుకు పంపించారు. వాడు వస్తున్నాడేమో.. వాడివెంట అమ్మాజీ వస్తుందేమోనని గేటువైపే చూస్తుంటే, వంశీ ఒక్కడే వస్తుండటం చూసి నిరాశ పడ్డారు. విషయమేంటని అడిగితే చెప్పాడు.“తెల్లవారుజామున అమ్మాజీ చనిపోతే, హాస్పిటల్ వాళ్లు వచ్చి తీసుకెళ్లిండ్రట” అని చావుకబురు చల్లగా చెప్పేసరికి, బలరామ్మూర్తి గారు కోడలు పద్మ వైపు చూశారు.. ‘నీవే దిక్కు’ అన్నట్లు.ఆ చూపు అర్థమైనా గానీ పద్మ.. పట్టించుకోనట్టుగా..“చచ్చిందాన్ని హాస్పిటల్‌కి దీసకపోయి ఏం చేస్తారంట? ఒక్కమాట ముందే ఒంట్లో బాగోలేదనో, ఇంకోటనో జెప్పుంటె.. ఈసరికి ఇంకో మనిషిని పెట్టుకుందుముగద. ఇట్ల చెప్పాపెట్టకుండ పోతే ఎట్ల!”
ఆవిడేదో పని ఎగ్గొట్టి పక్కూరుకి వెళ్లినట్టుగా, ఆవిడ ఏం చేసినా తన కనుసన్నల్లోనే జరగాలనే ఆలోచనతో.. ఆఖరికి ఆవిడ మహాప్రస్థానం కూడా తనకు చెప్పి చేయాలన్నట్టు అంది పద్మ. తమకు అసౌకర్యంగా అనిపిస్తే ఎదుటి మనిషి ఏ పరిస్థితిలో ఉన్నా గానీ, వాళ్లనే తప్పుపట్టే మెంటాలిటీ ఉన్న మనుషులలో మొట్టమొదటి వరసలో ఉంటుందామె.“ఇంగో మామయ్యా.. ఏనాడైన బైటనుంచి ఫుడ్ ఆర్డర్ బెడితె కడుపుకి పడలేదంటరుగా.. అయిన గానీ మరో మనిషి దొరికిందాక ఎవరైన సరే మాట్లాడకుండ అది తినాల్సిందే! తప్పదు. మీ కొడుక్కి గూడ ఫోన్ చేసి.. ‘ఇంటి నుండి క్యారేజీ రాదు. ఆడ్నే క్యాంటీన్లో తిను’ అని చెబుతాలె”.. అంటూ వెజ్మీల్స్ ఆర్డర్ పెట్టింది పద్మ.ఒక్కపూట భోజనానికే నలుగురికీ వెయ్యి రూపాయిలైంది. పద్మ గుండె గుబేలుమంది. అదీ అమ్మాజీ ఉంటే.. ఇంటి పని, వంటపనీ కూడా పొద్దుటి నుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ చేస్తుంది. మధ్యాహ్నం నాలుగు ముద్దలు, రాత్రి నాలుగు ముద్దలు అందరూ తిన్నాక.. మిగిలిపోయిన కూరలతో తినేసి వెళ్లిపోతుంది.
నెలకు కేవలం వెయ్యి రూపాయలు ఇవ్వమని పోస్టాఫీసులో కట్టుకుంటుంది. అత్తగారు పోయాక ఆమె కొత్తచీరలు కావాల్సిన వాళ్లకు ఇవ్వగా మిగిలిన పాత జరీచీరలు అమ్మాజీ కట్టుకుంటుంది. అంత తక్కువ జీతానికి మనిషి దొరకటమంటే కష్టమే.. ఒక్క పాచిపని చేయటానికే మూడువేలు అడుగుతున్నారు. ఇప్పుడు పద్మకేం చెయ్యాలో తోచటం లేదు. ఈ రోజులాగ ప్రతిరోజూ ఫుడ్ ఆర్డర్లు పెడితే.. భర్త సంపాదనలో సగం తిండికే సరిపోతుంది. ఇంక పిల్లల చదువులు, షాపింగులు, సరదాల సంగతేంటి.. తననీ అగమ్యగోచరంలో పడేసి, అకస్మాత్తుగా వంటింటిని వదిలేసి పోయిన అమ్మాజీ మీద మళ్లీ కోపం ముంచుకొచ్చింది కానీ.. ఎవరి మీద చూపించాలో తెలియక డైనింగ్ టేబుల్ పక్కనున్న కూర్చీని కాలితో తన్నింది. బొటనవేలు బొప్పి కట్టడం మినహా.. ఏం జరగ లేదు. కోడలి అవస్థ చూసి మనసులో చిన్నపాటి ఆనందం కలగగా, ఆమెనింకా ఉడికించాలన్నట్టుగా.. “ఏ మాటకామాటే చెప్పుకోవాలి పద్దమ్మా! చదువు సంధ్యా, తీరూ వాకా లేకున్నా.. వంట మాత్రానికి అమోఘంగా చేస్తది అమ్మాజీ. ఆ చేతిల ఏం మహిమ ఉందో ఏమో.. మన ఇంటిల్లిపాదీ కంచంలో ఒక్క మెతుకంటే ఒక్కటి కూడా ఉంచకుండా తినేస్తం..” ఇంక ఆ వంట తినలేక పోతామే అన్న నిరాశతోనూ, ఇకనుండి రుచిపచీ లేని కోడలి వంట తినాల్సొస్తుందేమోనని భయంతోనూ బలరామ్మూర్తి గారు అంటుంటే.. ఈరోజు తాను చేసుకున్న ఉప్మా నోట్లో పెట్టుకున్నప్పుడే.. అమ్మాజీ వంట విలువ తెలిసొచ్చిన పద్మకి మామగారితో ఏకీభవించక తప్పలేదు.
గంట గడిచాక ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. ఆవురావురంటూ గబగబా ప్యాకెట్స్ విప్పుకొని తినేశాక, కాస్త అన్నం కూర కలిపి స్నూపీ దగ్గరికి వెళ్లి.. దాని గిన్నెలో వెయ్యాలని చూస్తే.. పొద్దుట వేసిన ఉప్మా అలాగే ఉండేసరికి.. “ఏమే! నీకుగూడ నచ్చలే నా ఉప్మ! సర్లే ఇది తిను” అని, గిన్నె ఖాళీ చేసి, అందులో అన్నం వేసి వెళ్లింది పద్మ. స్నూపీ కడుపులో ఆకలి బాధ పెడుతున్నా సరే.. అన్నం గిన్నెలో మూతి పెట్టకుండా ఇంకా వంటగది తలుపువైపే చూస్తుండిపోయింది.“ఇంగో మావయ్యా! ఈరోజు ఎట్లయిన వైకుంఠ ఏకాదశే గద! రాత్రికి ఉపాసం.. రేపటి ముచ్చట రేపు జూసుకుందాం గానీ.. ఎట్లయిన సరె పైసలెక్కువైన గానీ.. ఎవర్నొ ఒకర్ని పెట్టమని మీ కొడుక్కి జెబుదాంలె! అమ్మాజీ గాకుంటె ఇంకో బొమ్మాజీ..” అంటూ తెలిసినవాళ్లని చవకలో వచ్చే వంటమనిషి గురించి అడగటానికి ఫోన్ అందుకుంది పద్మ.“అవునా.. ఈరోజు వైకుంఠ ఏకాదశా! ఎంతమంచి రోజున అమ్మాజీకి చావొచ్చె! ఏం పుణ్యం జేసుకుందో ఏవో గానీ.. డైరెక్టుగ స్వర్గానికే పోతది” అన్నారు బలరామ్మూర్తి గారు.“ఆ.. అవును! ఏం దెలియనమ్మకి ఏకాశి, అన్ని తెలిసినమ్మకి అమాస అని ఊర్కె అన్నరా!? విచిత్రం ఏంటంటె.. రోజూ పురాణాలు చదువుత, పూజా పునస్కారాలు జేస్త.. రెండుమార్లు కాశీకి పోయొచ్చిన..అత్తమ్మకి, మాయమ్మకి గూడ చెడ్డ గడియన చావొచ్చెనని.. ఎన్నో శాంతి పూజలు చేయించాల్సి వచ్చె! కనీసం అక్షరం ముక్కరాని ఈ అమ్మాజీ ఏ దినాన గూడ ఏ దేవుడికి మొక్కుడు చూడలే.. అయిన సరె అప్పనంగ స్వర్గానికి పోయేటట్టుంది”..
పద్మ గొంతులో అసూయ లాంటిది తొణికిసలాడింది. ఎందుకో తెలియదు ఇప్పటికిప్పుడు అమ్మాజీ చచ్చిపోయి తననేదో మోసం చేసేసి, తనకు డబ్బు నష్టం కలిగించినట్టు ఫీలింగ్ వచ్చి.. అమ్మాజీపై అకారణంగా చిన్నపాటి ద్వేషంకూడా పుట్టుకొచ్చేసింది ఆమె మనసులో. చీల మండలపైకి చీరకట్టుతో, సీవెండి గాజులు, ఎర్ర పూసల దండ వేసుకుని పలచబడిపోయిన జుట్టుతో జిల్లేడు మొగ్గంత ముడి వేసుకుని మోటు మనిషిలా, అమాయకత్వంతో కూడిన మాటలతోనూ ఉండే అమ్మాజీ అంటే.. పద్మకు మొదటినుండి చిన్నచూపే! ఎవరే పని చెప్పినా, ఏం వండి పెట్టమన్నా విసుగన్నది చూపించకుండా అన్నీ అమర్చిపెడుతూ కూడా జీతం పెంచమని కానీ, మానేస్తానని కానీ అనని అమ్మాజీనీ.. ‘ఎక్కడికి పోతుందిలే’ అన్న అలసత్వంతో మరీలోకువగా కూడా చూసేది. అలాంటిదీ రోజు అమ్మాజీ పుణ్యతిథిన పోయి స్వర్గానికి వెళ్లేవారి లిస్టులోకి చేరిందంటే.. పద్మ మనసు అస్సలు తట్టుకోలేక పోతున్నది.‘ఆమె ఏం పుణ్యకార్యాలు, ఘనకార్యాలు జేసెనని ఆ దేవుడీ సన్మానం చేసిండు’ అని అర్థంకాక తెగ మధన పడిపోతున్నది.
రెండు రోజులు వరుసగా హోటల్ భోజనాలతో గడిపాక మామగారికి, భర్తకు, ఆఖరికి తనకు కూడా ఎసిడిటీతో కడుపులో మంట మొదలయ్యే సరికి.. ఆరువేలు ఇస్తామని చెప్పి ఓ వంటమనిషిని పెట్టుకున్నారు. రుచికరంగా వండించుకుని తింటూ అమ్మాజీ పేరుకూడా తలుచుకోవటం మానేశారంతా.. వాళ్ల దృష్టిలో అమ్మాజీ ఓ గతం.కానీ, అమ్మాజీ కనిపించని రోజు నుండి ముద్దముట్టని స్నూపీ.. చిక్కి శల్యంగా మారసాగింది. దానికెందుకు తిండి సహించటం లేదో అర్థం కాని ఇంట్లో వాళ్లు.. ‘ఒకవేళ మాంసం ముక్కల మీద మొహం వాచిందేమో’ అనుకొని కోడి కాళ్లు, మేక బసర కొని తెప్పించి వండించి పెట్టారు.
మాంసాహారం అంటే తోక ఊపుకొంట ఎగబడిపోయే స్నూపీ.. ఆ కంచం వైపు మొఖం తిప్పి వాసన కూడా చూడలేదు. దాని నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరింది.
దాని కనుకొనలకు పుసుకులు కట్టి నీరుధారగా అట్ట కట్టింది. డాక్టర్ కూడా వచ్చిచూసి.. ఇంజక్షన్ ఇవ్వాలన్నా వీలు పడనివ్వలేదు. అతణ్నే కాదు ఎవ్వర్నీ దగ్గరికి రానీయడం లేదు. ఎవరైనా దగ్గరికి రాబోతుంటే ‘గుర్రు గుర్రు’ మంటూ ముడుచుకుని పడుకుని, అప్పుడప్పుడూ ఓపిక తెచ్చుకుని నెమ్మదిగా పైకిలేచి వంటగది గుమ్మంవైపు చూడటం మాత్రం మానలేదు.దాన్ని పదివేలు పెట్టి కొనితెచ్చింది భాస్కరమే అయినా.. దాని ఆలన పాలన చూసింది మాత్రం అమ్మాజీయే! కాబట్టి, అమ్మాజీ మీద కాస్త బెంగ పెట్టుకుందేమోనని అందరికీ అర్థమై.. కొన్నాళ్లకు మరిచిపోతుందిలే! అనుకున్నారు.
తొమ్మిదో రోజు ఓ అపరిచిత వ్యక్తి గేటు దగ్గరున్న కాలింగ్ బెల్ నొక్కి, గేటు తీసుకుని లోనికి వస్తుంటే.. అక్కడే గేటు పక్కన కట్టేసి ఉన్న స్నూపీ ఓపిక తెచ్చుకుని లేచి ఆ వ్యక్తి దగ్గరగా వచ్చి ‘కుయ్ కుయ్!’ అంటూ తన రెండు కాళ్లనూ పైకిచాపి, ఆ వ్యక్తి గుండెలపై వేసి ముఖం నాకి, మళ్లీ కిందకి వచ్చి అతని చేతిలో కనిపిస్తున్న తిను బండారాలను నోటితో లాక్కుని, అక్కడే అతణ్ని ఎటూ కదలనీయకుండా అతని పాదాల మీద జారబడి కూర్చుని ఆబగా తినసాగింది. ఆ వ్యక్తి ఈ హఠాత్పరిణామానికి కాస్త బెదిరినా ధైర్యంగా నిలదొక్కుకుని, అక్కడే ఉయ్యాల బల్ల మీద కూర్చుని సెల్ఫోన్లో సోషల్ మీడియా వీడియోలు చూస్తూ బిజీగా ఉన్న పద్మ వైపూ, కూర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న బలరామ్మూర్తి గారి వైపూ చూస్తూ…
“ఏమండీ..” అని పిలిచాడు. ‘ఎవరు నువ్వు?’ అన్నట్టు చూశారు వాళ్లు.“నాపేరు రామచంద్రం. నేను కంటి హాస్పిటల్ నుండి నేరుగా ఇక్కడికి వచ్చాను. నాకు కంటిచూపు పోతే.. హాస్పిటల్లో ట్రీట్మెంటు తీసుకుంటున్నా.. ఎవరో ఒక డాక్టర్ ఉపన్యాసం విని, మీ ఇంట్లో ఉన్న ఓ దేవత తను బతికుండగా తన కళ్లను దానం చేసి, కళ్లు లేని వాళ్లకు ఉచితంగా పెట్టమని అప్లికేషన్ పెట్టి, ఎవరి అనుమతీ అవసరం లేదని, తను చనిపోగానే తీసుకుపొమ్మని రాయించి వేలి ముద్రేసి, అప్లికేషన్లో ఇదే తన అడ్రస్ అని రాయించిందట. ఆమెకు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే పక్కింటి వాళ్లు అంబులెన్స్‌కి ఫోన్ చేశారట. వాళ్లు వచ్చేసరికే చని పోయిందట. ఆమె కంటి పొర నా కంటికి అమర్చి.. నాకు చూపు వచ్చేలా చేశారు. అందుకే ఆమె ఇంట్లో వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకొందామని చూపు వచ్చిన మరుక్షణం ఇక్కడికే వచ్చేశాను. తన కళ్లే కాదు.. తన విగత శరీరాన్ని నిరుపయోగంగా కాల్చేయవద్దనీ, దానిలో ఎవరికైనా అవసరమైతే ఏ అవయవాన్నయినా తీసుకోమని, లేకుంటే మెడికల్ స్టూడెంట్ల కోసం హాస్పిటల్‌కి ఇచ్చేయమందట ఆ దేవత. అంతేకాదు తన పేరున పోస్టాఫీసులో కొంత డబ్బు ఉందనీ, తనుపోతే అది తీసి ఓల్డేజ్ హోమ్‌కి ఇమ్మని బతికుండగానే పేపర్ మీద రాయించి వేలిముద్ర వేసిందట.
అంతటి పుణ్యాత్మురాలు నివసించిన చోటు చూసి తరించాలని వచ్చాను. ఆమెతో నివసించిన ఈ ఇంటివారు కూడా ఎంతో గొప్పవారు అనిపిస్తున్నది.ఇన్నాళ్లూ మీ ఇంట్లో వెలిగిన వెలుగు నా కంటి వెలుగై నాకు జీవితాన్నిచ్చి బతకాలనే ఆశ పుట్టించింది. ఆమె కంటితో నేను లోకాన్ని చూసేలా చేసింది. మీరేకాదు మీలాగే మీ కుక్కకూడా మనసున్న దానిలా ఉంది. ఇది నా మీదకి ఎక్కేసరికి భయపడ్డాను. విచిత్రంగా నా ముఖాన్ని ముద్దాడి నేను మీకివ్వాలని తెచ్చిన స్వీట్స్ తీసుకుని తినటమేంటో.. అర్థం కాలేదు. సాధారణంగా ఈ జర్మన్ షపర్డ్ జాతి కుక్కలు కొత్తవారిని కరవకుండా వదలవు. ఇప్పుడు కూడా ఇది నా పాదాల మీద కూర్చుని నా కాలు కదపనీయటం లేదెందుకో..” అన్నాడు ఆ వచ్చినతను.
అతను చెప్పింది విన్నాక అర్థమైంది పద్మకు. అమాయకంగా కనిపించే అమ్మాజీ ఎంత గొప్ప పనిచేసిందో! తన శరీరంలో తొడ భాగాన్ని తృణ ప్రాయంగా కోసి దానంగా ఇచ్చేసిన శిబి చక్రవర్తి కంటే కూడా తన యావత్ శరీరాన్ని దానం చేసిన అమ్మాజీ గొప్పగా కనిపించింది. తను అమ్మాజీ రూపమే చూసింది. కానీ, ఆమెలో మంచితనం చూడలేక పోయింది. స్నూపీ మాత్రం అమ్మాజీ రోజూ దానికి అన్నం పెట్టేటప్పుడు ఆమె కళ్లలో ఆప్యాయత చూసి ఆమెపై ప్రేమ పెంచుకుందనుకుంటా.. ఆ కంటి ఆనవాళ్లు మళ్లీ చూసేసరికి దాని బెంగపోయింది. తినాలని ఆశ పుట్టింది. ఛఛ.. ఏమిటి తన బుద్ధి. రెండేళ్ల పరిచయానికే తనకు అన్నం పెట్టే అమ్మాజీని అభిమానించి తను చనిపోతే తిండి మానేసి బెంగపడిన కుక్కకున్న విశ్వాసం, పదేళ్లుగా అమ్మలా ఆప్యాయంగా వండి వడ్డిస్తున్న అమ్మాజీని, మనిషి పుట్టుక పుట్టిన తనెందుకు అభిమానించలేక పోయిందో తలుచుకుంటుంటే సిగ్గుగా అనిపించి.. తల వంచుకున్న పద్మకు తనకెప్పుడూ నేలకు అట్టడుగున కనిపించే అమ్మాజీ ఒక్కసారిగా ‘ఇంతింతై వటుడింతయై’ అన్నట్లు వామన అవతారంలో విష్ణుమూర్తిలా పెరిగిపోతుంటే.. తలఎత్తి చూడగా ఆకాశమంతా అనంతంగా అమ్మాజీయే కనిపించేసరికి.. తలతిప్పి మామగారి వైపు చూసింది. అప్పటికే వచ్చిన మనిషివైపూ స్నూపీ వైపూ మార్చిమార్చి చూస్తున్న బలరామ్మూర్తి గారు, తనను స్నూపీతో పోల్చుకోగా.. ఆయన మనసు భారమయింది. పదేళ్లుగా ఇంటి మనిషిలా.. మనిషిమనిషికీ నచ్చినట్టు వండి వడ్డించిన అమ్మాజీ చనిపోతే కనీసం ఒక్కపూట పస్తుండి సంతాపం చూపించకపోగా.. తిండి కోసం వెంపర్లాడానన్న అపరాధ భావం మనసంతా నిండిపోగా, వచ్చిన మనిషిని లోనికి తీసుకెళ్లి, మర్యాదచేసి ఆ వ్యక్తి కళ్లలో అమ్మాజీని చూస్తూ.. అప్పుడప్పుడూ వస్తుండమని చెప్పి పంపించారు.
పూజలు, పునస్కారాలు, పురాణాలు, పుణ్యక్షేత్రాలు కాదు.. మనిషిని దేవుడి సరసన నిలబెట్టేవి.మనిషి మరణించినా మరో మనిషికి బతుకునిచ్చే గుప్తదానం, అవయవ దానమే దేవుడికి దగ్గరయ్యేలా చేసి మనిషిని దేవతగా నిలబెడుతుందని, మరణించినా మళ్లీ మనుషుల మధ్య చిరంజీవిగా ఉంచగలదని, అమ్మాజీ గురించి పూర్తిగా అర్థమైన పద్మ.. ఆరోజే తను కూడా ఓ మంచి నిర్ణయం తీసుకుంది. సౌందర్య తేజ కోరా రాసిన రెండు కథలకూ నమస్తే తెలంగాణ – ముల్కనూర్ ప్రజాగ్రంథాలయం కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు యువ రచయిత్రి సౌందర్య తేజ కోరా. కథల పోటీ – 2022లో ‘మట్టి వాసన’, 2023/24లో ‘చిరంజీవి’ రెండు కథలూ రూ. 3వేల బహుమతికి ఎంపికయ్యాయి. రచయిత్రి స్వస్థలం భద్రాచలం. తల్లిదండ్రులు దుద్దుంపూడి అనసూయ – చంద్ర శేఖర్. బాల్యం, విద్యాభ్యాసం రాజమండ్రిలో గడిచింది. బెంగళూరులో ఎంబీఏ చదివి, ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ దుద్దుంపూడి అనసూయ, పెద్దమ్మ జాస్తి రమాదేవి ఇద్దరూ రచయిత్రులే! దాంతో బాల్యం నుంచీ కథలు చదవడం, రాయడంపై ఇష్టం పెంచుకున్నారు. వారి ప్రోత్సాహంతోనే కథా రచనలోకి అడుగుపెట్టారు. అయితే, ఉద్యోగబాధ్యతల వల్ల కథలు రాయడానికి సమయం కేటాయించలేక పోతున్నారు. తన చిన్నతనంలో తాతగారి ఒళ్లో కూర్చొని విన్న ఆయన వ్యవసాయ అనుభవాలనే.. 2022లో ‘మట్టి వాసన’గా పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా, కొన్ని వాస్తల సంఘటల స్ఫూర్తితో ‘చిరంజీవి’ కథను మలిచారు. తన కథలను బహుమతికి ఎంపిక చేసిన నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
-సౌందర్య తేజ కోరా
78998 53581