“భామా సుందరాలో వెన్నెల.. బంగారు కుందనాలో వెన్నెల..నిన్నుసూస్తే నా మనసు.. వెన్నెలోవెన్నెల! నిలవజాలకున్నాదే.. వెన్నెలోవెన్నెల! అమ్మో నీ అందాలకి.. వెన్నెలోవెన్నెల! నాకు దిమ్మతిరిగి పోతుందే.. వెన్నెలోవెన్నెల!”..
అంటూ దేవయ్య పాట పాడుతుంటే.. కోలాటం కట్టెల చప్పుడు, గజ్జెల చప్పుడుకంటే వాని గొంతే ఎక్కువ వినిపిస్తున్నది. దేవయ్యకు తెలిసినవి రెండే.. ఒకటి కోలాటం, ఇంకోటి తప్పెట కొట్టడం.సమర్త కాణ్నించి, పెండ్లి, చావు ఇట్లా ఏ కార్యమైనా.. దేవయ్య తప్పెట మోగాల్సిందే! తెల్లారితే బోనాల పండుగ. ఆ ఊళ్లె పెద్ద పండుగ అదే. పట్నమని, దేశమని బతకనికే వలస పోయినోళ్లందరు వస్తరు. వాళ్లను చూస్తే దేవయ్య నోరు ఆగదు, కాలు నిల్వదు. పదం వెంట పదం పాడుతడు, ఉద్ది వెనుక ఉద్ది వేస్తడు. ఏ మధ్యరాత్రో చల్లటి చెమటలతోటి గుడిశెకు పోతడు. ఆ గుడిశె, ఆ ఊరి బొందలగడ్డకు ఆనుకొని ఉంటది. ఎప్పుడెప్పుడు ఆ గుడిశెను ఆక్రమించుకుందామా!? అని బొందలగడ్డ నోరెళ్లబెట్టుకొని చూస్తుంటది.
దేవయ్య గుడిశెకు పోయి, కాళ్లుచేతులు కడుక్కొని, గాఢనిద్రలో ఉన్న పెండ్లం – పిలగాని పక్కన పండుకుండు. పెండ్లం పద్మ, ఆరేండ్ల కొడుకు బాల్ చెంద్రి.పద్మ పొద్దుగాల లేచి, ఓ కోడిని పట్టుకొని కట్టేసి.. వాకిలి ఊడ్చి, సాంపి చల్లి, బువ్వతొక్కు వండి, పిలగానికి తానం చేపిచ్చింది. మొగుడు తానం చేస్తుంటే ఈపు రాసింది. అందరూ కొత్త బట్టలేసుకున్నారు. పటేల్‌ను కలవనీకె పోయిండు దేవయ్య. పద్మ.. కొడుకుతోపాటు కుమ్మరోళ్ల ఇంటికివోయి, ఓ బోనం కుండ, చిన్న గురిగి కొనుక్కున్నరు. పద్మ బోనంకుండ, కొడుకు గురిగి పట్టుకొని గుడిశెకు వచ్చిండ్రు.
పద్మ కొత్తకుండను కడుగుతుంటే, పిలగానికి కట్టేసిన కోడి కనిపించింది.
“అమ్మా.. కోడినెందుకు కట్టేసిండ్రు”. “పోషమ్మ కాడ కోసుకోనికె”.“ఇయ్యాల మన ఇంట్ల చియ్యల కూరనా!? అయితే నాకు పొలావ్ బువ్వ కావాలి. నాకంటా.. పొలావ్ బువ్వా.. కావాలీ..” అని దీర్ఘాలు తీస్తూ పాడుతుండు. పద్మకు నగొచ్చింది.“చియ్యలు, పొలావ్ బువ్వ ఇయ్యాల కాదు.. రేపు!” అన్నది తల్లి.“రేపైతె మల్ల కోడిని ఇయ్యాల ఎందుకు కట్టేసిండ్రు. నేను పోయి ఇప్పుతా!”.
“ఏయ్.. కోడికాడికోతే దెబ్బలు పడ్తయ్!”..
కొంచెం కోపంగా అంటూ, కుండ కడుక్కొని గుడిశెలకు పోయింది పద్మ. పిలగాడు అలిగి, పద్మ వెనుకనే మెల్లగా పోయిండు. పద్మ మూడు దోసిళ్ల బియ్యం చేటల పోసుకుని చెరుగుతున్నది. పిలగాడు పద్మ దగ్గరికివోయి గదువ పట్టుకొని..“అమ్మా! చియ్యలు రేపు చేసుకుందాం. ఇయాల పొలావ్ బువ్వ చెయ్యే!”.
పిలగాని కండ్లకేసి చూసింది పద్మ. వానికి పొలావ్ అంటే పానమని తెలుసు. వాడట్లా అడిగేసరికి పానమంత రోట్లేసి దంచినట్టయ్యింది. సర్రున కన్నీరు వచ్చి కంటిపొర అవుతల ఆగింది. వాడు ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా చేసి పెట్టింది. బియ్యం చేట పక్కకు పెట్టి, పిలగాణ్ని దగ్గరికి తీసుకుని..“అది కాదయ్యా! ఇయ్యాల బోనాల పండుగ కదా, పోషమ్మకు నైద్యం పెట్టాలి. అందుకే ఇయ్యాల పొలావ్ బువ్వ, చియ్యల కూర చేయకూడదు. రేపు సద్దిపండుగ, రేపు చేసుకుందం!” అన్నది.
పిలగాడు అలిగి తల్లివైపు అట్లనే సూస్తుండు.
“ఇప్పుడు బెల్లం బువ్వ చేసుకుందం!”..
గా మాట ఇనంగనే.. పిలగాని ముఖం కొంచెం ఎలిగింది. “నీకు బెల్లం బువ్వ అంటే ఇష్టమే గద!?”.“ఇష్టమే! కానీ, పొలావ్ బువ్వంటే ఇంకా శానా ఇష్టం” అని చేతులు వెడల్పు చేసి చూపిచ్చిండు.
ఇద్దరి ముఖాల్లో నగొచ్చింది.పద్మ చేటల మెరికెలు ఏరుతున్నది. పిలగాడు తలకాయ కిందికేసుకుని అంగీ పైగుండి కాడ చేతితో సుడులు తిప్పుతూ, కుడికాలు గోరుతో నేల గీకుతూ..
“అమ్మా!” అనంగానే పిలగాణ్ని చూసింది పద్మ.
“అమ్మా.. మల్ల పోషమ్మ కాడికి, కోడ్‌ని నేను పట్టుకొస్తనే!” అన్నడు. పద్మ నగుమొకంతో.. ‘సరే!’ అన్నది. పిలగాని మొఖం చందమామలాగ వెలిగిపోయింది.పిలగాడు పద్మ వెనుకజేరి మెడ చుట్టూ చేతులేసి ఊగుతున్నడు. ఇంతలో.. “పద్మా..” అనుకుంటూ దేవయ్య వచ్చిండు.పిలగాడు ఎదురు ఉరికి.. “అయ్యా! ఇయాల పోషమ్మకాడికి కోడ్‌ని నేనే పట్టుకొస్తున్న.. అమ్మ చెప్పింది” అని చెప్పిండు. “సరే.. ఇంత బువ్వ ఏస్కరాపో” అన్నడు దేవయ్య. పద్మ ఏసిచ్చిన బువ్వ తీసుకుపోయి ఇచ్చిండు. దేవయ్య తినుకుంటూ, మధ్యలో పిలగానికి కూడా తినిపిస్తుండు. వాడు ఇంతసేపు జరిగిందంత తండ్రితోని చెప్తున్నడు..
“ఇయాల మన ఇంట్ల బెల్లం బువ్వ, రేపు చియ్యలకూర పొలావ్ బువ్వ!” అని.పద్మ కుండలో బియ్యం పోసి, పొయ్యి మీద పెట్టింది. బెల్లం దంచుతూ, పిలగాడు చెప్పే జోలి వింటూ ముసిముసిగా నగుతున్నది.
“అయ్యా.. అమ్మ కూడా బువ్వ తినలే!”.
“ఇయాల మీయమ్మ బువ్వ తినదు. ఒక్కపొద్దు”.
“ఒక్కపొద్దంటే..!?”.
“అంటే.. పోషమ్మకు నైద్యం పెట్టేవరకు ఏం తినదు”..
పిలగాడు నోట్లో ముద్ద పెట్టుకుని పద్మవైపు తిరిగి..
“అవునా అమ్మా” అన్నడు.
“అవును!’ అన్నట్టుగా తలూపింది పద్మ.
దేవయ్య వైపు తిరిగి..
“మల్ల, నువ్వెందుకు తింటున్నవ్!?” అన్నడు పిలగాడు. పద్మకు కిసుక్కున నగొచ్చింది. దేవయ్య నోట్లో ముద్ద పెట్టుకొని నములుకుంటా..
“ఇంట్ల ఒక్కరే ఉండాలె”.
“అట్లయితే నువ్వుండు.. అమ్మ తింటది!”.
“ఇగో.. నాది తినేది అయిపోయింది”.
“అట్లయితే నేనుంటా!”.
“చిన్న
పిల్లలు ఉండొద్దు. అయినా నువ్వు కూడా తిన్నవు”.
“మల్ల నాకెందుకు తినిపించినవ్!?”.
“అవుతల నాకు శానా పనులుండయి.. ఇకడ్రా” అంటూ.. పిలగాని చేయి కడిగి, దేవయ్య చేయి కూడా కడుక్కుని, గిన్నెను పద్మ ముందలికి తోసిండు. పద్మ కుండల బెల్లమేసి, బయటికివోయి గిన్నె కడుక్కొచ్చింది. తండ్రికొడుకులిద్దరూ బయటున్న బంతిపూలు, బంగారు మల్లెలు ఇంకొన్ని పూలు తెంపుకొచ్చి గుడిశెల పోసిండ్రు.
దేవయ్య తప్పెట భుజానికి వేసుకొని..
“పద్మా.. నేను పోతున్న” అన్నడు.
“ఆ.. సరే!”.
“అయ్యా! నాకో రూపాయి ఇయ్యే”.
“ఒక్కపొద్దు ఉంటాన్నవు! మల్ల రూపాయెందుకు!?”.
పిలగాడు అలిగి, అమ్మవైపు చూసిండు. పద్మ దేవయ్యవైపు చూసింది. జోపిల నుంచి రూపాయి తీసిచ్చి, నగుకుంట పోయిండు.“నేను ఏపిచ్చుకొచ్చుకుంటా” అంటూ పిలగాడు ఊళ్లెకు ఉరికిండు.కొంతసేపటికి పిలగాడొచ్చి, పద్మ బోనం జేస్తుంటే చిత్రంగా చూస్తుండు. బోనం కుండకు కిందినుంచి సగం వరకు సున్నం రుద్దింది. ఇప్పుడు కుండ సగం నలుపు, సగం తెలుపైంది. ఆపైన నల్లదానికి నూనె పూసి, దానిమీద పసుపుకుంకుమ బొట్లు పెట్టింది. గురిగికి కూడా అట్లనే చేసి, దాంట్ల కొంచెం చింతపులుసు పోసింది. తెంపుకొచ్చిన పూలను అల్లి బోనానికి పైన చుట్టింది. గుడిశె మధ్యలో కొన్ని వొడ్లు పోసి, దానిమీద బోనంకుండ వెట్టి తల్లికొడుకులిద్దరు మొక్కిండ్రు.
ఊళ్లె హడావుడి మొదలైంది. ఈలలు అరుపులతో ఊరు తిరుగుతున్నరు. పిలగాడు కూడా.. ‘నేను చూసొస్త!’ అని ఉరికిండు.
ఈ ఊళ్లె బోనాల పండుగ ఉన్నట్టు, ఏ ఊళ్లె ఉండదు. తొల్త కోట మశమ్మను చేస్తరు. ఊరుమీద ఇడిసిన దున్నపోతును పట్టుకొచ్చి, ఊరంతా తిప్పి,కోట మశమ్మ కాడ బలిస్తరు. మల్త రోజు పోషమ్మకు బోనం పెడ్తరు. కానీ ఈ ఊళ్లె, రెండు బొడ్రాళ్లు, రెండు పోషమ్మ గుళ్లు ఉంటయి. ఒకటేమో సూదరోల్లది, ఇంకోటి మాదిగోల్లది. తొల్త సూదరోల్ల (ఎక్కువ కులం) పోషమ్మకు బోనంబెట్టి, తర్వాత మాదిగోల్ల పోషమ్మకాడికి వస్తరు. ఆ మల్త రోజు చెరువు కట్టమీద ఉన్న కట్ట మశమ్మకు నేవేద్యం పెట్టి, తెప్పలో మేకను కట్టి చెరువులో ఇడుస్తరు. మేక వెళ్లే దిక్కును బట్టి, ఆ ఏడాది ఎట్ల ఉండబోతుందని జాతకం చూస్తరు. దాంతో పండుగ అయిపోతది. ఈ మూడు దినాలు కోలాటాలు బొడ్డెమ్మలు, తాగుడు తినుడు, చుట్టాలతోని ఊరంతా కళకళలాడుతది.
సూదరోల్ల బోనాలు అయిపోయే వరకు సాయంత్రమయింది. పిలగాడు ఉరుకొచ్చి..
“అమ్మా.. తప్పెట తీస్కొని అయ్యొస్తుండు” అని చెప్పిండు.పద్మ.. కోడి కాళ్లురెక్కలు కట్టి పిలగానికి ఇచ్చింది. ఇంతలో బైనోండ్లతోపాటు దేవయ్య, వీరయ్య, మల్లయ్య భుజాలకు తప్పట్లేసుకుని వచ్చిండ్రు.
పద్మ బోనానికి మొక్కి, నెత్తిన పెట్టుకొని బయటకొచ్చింది. బోనం ఎత్తుకున్నోళ్లను పోషమ్మతల్లిగా భావిస్తరు. పైగా పెద్ద మేతరి బోనం, దాన్నే తొల్త తీస్తరు. అందుకనే దాన్ని కత్తుల బోనం అని కూడా అంటరు. దేవయ్య తప్పెట పక్కన పెట్టి, నిండుకుండ నీళ్లు తెచ్చి, పద్మ కాళ్లకు పోసి మొక్కిండు. తర్వాత పిలగాడు కూడా మొక్కిండు.తప్పెట్లు ఇంటింటికి పోయి బోనాలను పిలుచుకొచ్చినయి. అన్ని బోనాలు రాగానే, ఆ వాడంతా తిరుగుతూ.. బొడ్రాయి మీదుగా పోషమ్మకాడికి పోతరు. ముందల బైనోండ్లు, తర్వాత తప్పెట్లు, ఆ తర్వాత బోనాలు. ఆ తప్పెట దరువుకు మొగోళ్లు చిందాట ఆడుతుంటే, ఆడోళ్లు పైనిండుతుండ్రు. బొడ్రాయికి నూనె పూసి, పసుపుకుంకుమ పెట్టి, పోషమ్మ దగ్గరికి పోయి, గుడి చుట్టూ మూడుసార్లు తిరిగి గుడి లోపలికి పోయిండ్రు. అప్పటికే పటేల్ గుడికాడికి వచ్చిండు.
బైనోండ్లు పద్మ బోనం తీసుకుని పోషమ్మ ముందలవెట్టి మొక్కిండ్రు. పటేలొచ్చి కొబ్బరికాయ కొట్టి, కల్లు ఆరపుచ్చి, కూసొని మొక్కిండు. టెంకాయ కొట్టి లేస్తుంటే, గుడి పైకప్పు రాయి తలుగబోయింది. ఇంతలో పద్మ చూసి చేయి అడ్డుపెట్టింది. పటేల్ నెత్తొచ్చి పద్మ చేయికి తగిలింది. పద్మ నగుమొకంతో..
“సూసుకో పటేలా!” అన్నది.
పటేల్ పైకి లేచి.. ఎవరైనా చూశిండ్రేమోనని అటూఇటూ చూసిండు. బైనోండ్లు, పద్మ బోనంల బువ్వ తీసి పోషమ్మ ముందర పెట్టిండ్రు. ఒకదాని తరువాత ఒకటి పెడుతుండ్రు. పటేల్ మేక తలకాయ కొట్టే వరకు ఉండి పోయిండు. ఈలోపు దేవయ్య కోడ్‌ని కోపిచ్చి,పిలగానికి ఇచ్చిండు. మొగోళ్లందరూ కోలాటం.. ఆడోళ్లందరూ బొడ్డెమ్మ ఏస్తుండ్రు. కాసేపు పద్మ కూడా బొడ్డెమ్మ ఆడి, బోనం తీసుకొని పిలగాణ్ని పిల్చింది.
“అమ్మా.. నేను కొంచేపు ఉండి వస్తనే..” అని కోసిన కోడ్‌ని ఇచ్చిండు పిలగాడు.రెండు కట్టెలు పట్టుకుని, కోలాటం రాకపోయినా కొట్టుకుంటూ తిరుగుతుండు. పద్మ తప్పెట, బోనం, కోడ్‌ని పట్టుకొని దారిపొడుగున దేవయ్య పాట వినుకుంట పోతున్నది.
“నడుము సన్నం నాగరికం పిల్లో…
నీ ముక్కు మొకం సక్కదానమున్నది” అని దేవయ్య పాడుతుండు.పల్లాయి అయిపోయేలోపు పద్మ గుడిశెకొచ్చింది. బోనం ఇంట్లో పెట్టి, ఓ తట్ట తెచ్చుకొని అండ్ల కోడి బొచ్చు తీస్తున్నది. ఇంతలో గుడిశెలకు పటేల్ వచ్చిండు. బయట పనోడు ఉన్నడు. “పటేలా.. ఏంది? ఇయ్యాలటప్పుడు వచ్చిండ్రు!”. “ఏం లేదు పద్మా! ఇందాక పండుగయినాక ఇంటికిపోయి తాగుతున్న.. ఏం మనసున వడ్తలేదు!”.
“ఎందుకు? ఏమైంది పటేలా!”.
“నా చిన్నప్పట్నించి ఓ అలవాటుంది. ఏ కులం తక్కువదైన నన్ను తాకితే.. నేను దాన్ని మొత్తం తాకాలి. లేకపోతే నాకు మనసున వట్టదు!”.
“ఏంది పటేలా.. పరాష్కాలాడుతుండవా!?”.
“నీతోటి నాకు పరాష్కాలేందే..” అంటూ బలంగా కొట్టిండు.
దాంతో పద్మ కిందవడ్డది.
“రామా రామా ఎల్లమ్మకో..
రాముల పరిషాలెల్లమ్మకో..
పసుపు బండారెల్లమ్మకో..
యాపాకు నీలెల్లమ్మకో..” అంటూ దేవయ్య
రెండు ఉద్దులు ఒకతోటి మాగే పాట చెప్తుండు.
పద్మ బతిమిలాడుతున్నది. చేతులెత్తి మొక్కుతున్నది.. అవి ఆ మృగానికి కనిపియ్యలే..
“నల్లరాజా.. నల్లరాజా.. ఎన్నియాలో
నల్లరాజా కొడుకులంటా.. ఎన్నియాలో
నలుగురన్నదమ్ములంటా.. ఎన్నియాలో” అంటూ మరో పాట అందుకున్నడు దేవయ్య.
కొండచిలువ రక్తం పీల్చి, శవాన్ని వదిలేసినట్టు వదిలేసిండు పద్మను.
ఇంతలో పనోడు తలుపు తట్టి..
“పటేలా.. ఎవరో వస్తుండ్రు” అన్నడు.
పటేల్ కంగారు కంగారుగా ఉరికిండు.
“అమ్మా.. బెల్లం బువ్వా..” అంటూ తలుపు కాడికొచ్చి లోపలికి సూసిండు పిలగాడు.
పద్మ నిస్సహాయంగా రక్తంలో పడి ఉంది.
వానికి ఏం అర్థం కాలేదు.
“అమ్మా..” అంటూ దగ్గరికి వెళ్లిండు. పద్మ తేల కండ్లేసింది. కండ్లు ఎటో సుస్తుండయి. పద్మకు కాస్త దూరంలో కోసుకొచ్చిన కోడి పడి ఉంది. పిలగాడు పద్మను, కోడ్‌ని మార్చి మార్చి సూసిండు. ఒకే విధంగా కనిపించేసరికి.. పిలగాడు ఏడ్చుకుంట కోలాటం కాడికి ఉరికిండు.“పైనవొయే పక్షులారా.. ఎన్నియాలో ఆడపిల్ల గతి ఇంతే సూడు.. ఎన్నియాలో” అంటూ దేవయ్య చెప్పే పాట చివరకొచ్చింది.
“అయ్యా అయ్యా.. అమ్మ సచ్చిపోయిందే!” అని తడారిన గొంతుతో చెప్పిండు పిలగాడు.
దేవయ్య వెంటనే గుడిశెవైపు పరిగెత్తిండు.“పద్మా..” అంటూ లోపలికి పోయిండు.భార్య తలను ఒళ్లో పెట్టుకొని కూసున్నడు. అక్కడ పడిన రక్తాన్నంత మెడలో ఉన్న తుండుతో తుడిసిండు. తెల్లది కాస్త ఎర్రగా మారింది. వాడలో అందరికీ తెలిసి, ఒక్కొక్కరు వచ్చి గుమికూడిండ్రు. ఎవరికీ ఏం అర్థమైతలేదు. అందరూ గుండెలు బిగపట్టి సూస్తున్నరు. దేవయ్య పద్మను గుండెలకు హత్తుకుని..
“పద్మా..” అని గట్టిగా అరిసిండు.
బిగపట్టిన గుండెలన్నీ గొల్లుమన్నాయి. ఆ ఆర్తనాదాలకు పక్కనే పండుకున్న బొందలగడ్డ నిద్రలేచి ఆ గుడిశెను ఆక్రమించింది. దేవయ్యకు ఈ ప్రపంచంలో ఒంటరోడైనట్టు అనిపిచ్చి, లేసి బయటికొచ్చిండు. కొయ్యకు ఏలాడుతున్న తప్పెట భుజానికి ఏసుకున్నడు. ఏ దరువేస్తుండో ఎవరికీ అర్థం కాలేదు. వాడి తప్పెట దరువు, చినుకు చినుకు కలిసి వానయినట్టు.. వాన కాస్త జడివానగా, తుఫానుగా మారుతున్నది. దానిపై మెరుపులు మెరుస్తున్నయి.. పిడుగులు పడుతున్నయి. అప్పటిదాకా చిందులేసిన బొందలగడ్డ కర్ణభేరి పగిలి అరుస్తున్నది.
ఎన్ని సంగీత వాయిద్యాలు వచ్చినా, మనిషి నరాల్లోని రక్తాన్ని మరిగించే శక్తి ఒక్క తప్పెటకే ఉంది. అప్పటివరకు రక్తం చచ్చుబడి, బొందలగడ్డలోని శవాలకు,ఆ వాడలోని మనుషులకు పెద్ద తేడా ఉండేది కాదు. ఇప్పుడు ఆ తప్పెట దరువుకు వాళ్ల రక్తం వాళ్లకు తెలియకుండానే మరుగుతున్నది. దేవయ్య వేళ్లు పగిలి రక్తం కారుతున్నాయి. అయినా దరువు ఆగుతలేదు. శివుడు తాండవం ఆడితే పార్వతిదేవి ఆపుతది. పార్వతిదేవి తాండవమాడితే శివుడు ఆపుతడు. కానీ, ఇప్పుడు ఈ జాంబవంతుణ్ని ఎవరు ఆపుతరు? ఎట్ల ఆపుతరు?
తప్పెట తాండవం ఆడుతున్న దేవయ్యకు పిలగాడు కనిపించిండు. గుడిశె ముందు కూసోని ఏడుస్తుండు. దేవయ్య చూపు ఆ పక్కనున్న చెప్పుల మీదికోయింది. వెంటనే తప్పెట ఆపిండు. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. బొందలగడ్డలోని శవాలన్నీ ఊపిరి పీల్చుకున్నయి. అక్కడున్న అందరూ దేవయ్య వైపు చూశిండ్రు. దేవయ్య మాత్రం చెప్పుల వైపు చూస్తుండు. అందరూ చెప్పుల వైపు చూశిండ్రు. ఆ గుంపుల నుంచి..
“పటేలు చెప్పులు ఈడెందుకున్నయి..!?” అన్నరు ఎవలో..
“రేయ్.. పటేలా’!’ అని అరుసుకుంటూ పటేల్ ఇంటివైపు ఉరికిండు దేవయ్య.అప్పటివరకు మరిగిన రక్తాలు కూడా వాడితోపాటు కదిలాయి. దేవయ్యకు అది పగే కావొచ్చు.. కానీ ఈ సమాజానికి అదొక విప్లవం. ఒక పద్మం రాలిపోయింది. కానీ, అక్కడొక విప్లవ పద్మం పూసింది. కోలాటాలు, బొడ్డెమ్మలు ఈ సంస్కృతిలో భాగం. అలాగే అత్యాచారాలు కూడా ఈ సంస్కృతిలో కంటికి కనిపించకుండా భాగమయ్యాయి. కనిపించే ఈ కోలాటాలు, బొడ్డెమ్మలు అంతరించిపోతున్నాయి. కానీ, కనిపించని ఈ ముదనష్టపు అత్యాచారాలు ఎప్పుడు అంతరిస్తాయో.! వాటిని ఎప్పుడు బొందవెట్టాల్నో..!!
చింతకింది శివశంకర్
తెలంగాణ మాండలికంలో.. మనసుకు హత్తుకొనే కథలు రాస్తున్నారు యువ రచయిత చింతకింది శివశంకర్. ఈయన రాసినవి తక్కువ కథలే అయినా.. అన్నీ వాసికెక్కినవే! శివశంకర్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లి గ్రామం. తల్లిదండ్రులు చింతకింది అపరంజమ్మ – వెంకటయ్య. బీటెక్ (ఈసీసీ) చేశారు. సైయంట్, ఇన్ఫోసిస్ సంస్థల్లో టెలికామ్ ఇంజినీర్‌గా ఐదేళ్లు పనిచేశారు. సాహిత్యాభిలాషతో 2021 నుంచి కథలు, కవితలు రాస్తున్నారు. ఈయన రాసిన మొదటి కథ.. ‘స్వాతంత్య్రం.
నమస్తే తెలంగాణ – ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం నిర్వహించిన 2021 కథల పోటీలో రూ.1000 బహుమతి గెలుచుకున్నది. మరణం అంచున నేను, స్వజాతి, పమేరియన్ కథలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ‘విషనరుడు’ పేరుతో ఓ కవితా సంపుటి ప్రచురించారు. ‘చరిత కామాక్షి’ అనే సినిమాతోపాటు ‘గప్ చుప్’ అనే వెబ్ సిరీస్‌కు రచయితగా పనిచేశారు. యూట్యూబ్ చానెల్ ద్వారా వివిధ రకాల పుస్తకాల గురించి వివరిస్తున్నారు. ‘అసుర తెలుగు పోడ్కాస్ట్’ను నిర్వహిస్తున్నారు.
“అయ్యా.. అమ్మ సచ్చిపోయిందే!”
అని తడారిన గొంతుతో చెప్పిండు పిలగాడు.దేవయ్య వెంటనే గుడిశెవైపు పరిగెత్తిండు.“పద్మా..” అంటూ లోపలికి పోయిండు.భార్య తలను ఒళ్లో పెట్టుకొని కూసున్నడు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
-చింతకింది శివశంకర్
99123 24492