“సునీ! ఊరి నుంచి మా అమ్మానాన్నలను మనతోపాటు ఇక్కడే ఉండేందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను”..
తటపటాయిస్తూనే అన్నాడు మాధవ్.
“వద్దు.. అదనపు పనులు నేను చేయలేను. అదనపు ఖర్చులూ పెట్టలేను. ఇప్పటికే ఆఫీసులో పనెక్కువైంది. ఇంటికి వచ్చాక రోహిత్‌ని చదివించాలి. ఇప్పుడు బాగా చదివితేనే వాడి భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే వాడు కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ మీలాగా ప్రతి రూపాయికీ వెతుక్కుంటూ ఉంటాడు” నిష్టూరంగా అన్నది సునీత.
మాధవ్ ముఖం మాడిపోయింది.
“మా అమ్మానాన్నలను పోషించడం కొడుకుగా నా బాధ్యత. నాకు వచ్చే జీతంలోనే వాళ్లను చూసుకుంటాను. నువ్వేమీ వాళ్లకు ఇవ్వనవసరం లేదు!” పట్టువదలకుండా మళ్లీ అన్నాడు మాధవ్.
“కొడుకుగా మీ బాధ్యత నెరవేర్చుకోవాలని అనుకుంటే.. మీరు కూడా దోసపాడు వెళ్లి మీ అమ్మనాన్నలతో నాగలి పట్టి పొలం సాగుచేయండి. అసలు మీరు ప్రైవేట్ బ్యాంక్‌లో బిజినెస్ లోన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారని పెళ్లికి ఒప్పుకొన్నాను. మీకు ఇన్సెంటివ్‌లు బాగా వస్తాయి, పోనీలే జీతం కంటే గీతం ఉంటుందని అనుకున్నాను. కానీ, మీది అరకొర సంపాదన కావడం వల్ల నేను అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది” అసంతృప్తిగా అన్నది సునీత.
మాధవ్ మనసంతా బాధతో విలవిల్లాడింది. ఆ నిమిషంలో సునీతకు దూరంగా వెళ్లిపోయి అమ్మానాన్నలతో సంతోషంగా గడపాలనిపించింది. కానీ, అతని కళ్ల ముందు రోహిత్ ముఖం కనిపించింది. వెంటనే ఆ ఆలోచన విరమించుకున్నాడు.
“మీకు వచ్చే భారీజీతంలో మీవాళ్లకు సరిపడే డబ్బులు పంపుతూనే ఉన్నారు. అవి చాలకపోతే ఇంకా పంపండి. నాకు, రోహిత్‌కి మీరేమీ పెట్టనవసరం లేదు. అంతేకానీ వాళ్లను తీసుకొచ్చి నా నెత్తిన ఎక్కించకండి. ఇక ఈ విషయంలో నేను మాట్లాడాల్సింది మరేమీ లేదు!” నిర్మొహమాటంగా అన్నది సునీత.
చేసేదేమీ లేక తన నిస్సహాయతకు తనను తాను తిట్టుకున్నాడు మాధవ్.
మాధవ్ విజయవాడలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో లోన్స్ ఇప్పించే ఉద్యోగం చేసేవాడు. సునీత గుంటూరు రెవెన్యూ ఆఫీసులో క్లర్కుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నది. పెళ్లయ్యాక మాధవ్ కూడా గుంటూరులోనే ఉద్యోగం చూసుకున్నాడు. అలా సునీతకి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా తను కూడా అక్కడే ఉద్యోగం వెతుక్కుంటాడు. వాళ్లకు ఒక్కడే అబ్బాయి.. పేరు రోహిత్. తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం, భర్తది ప్రైవేట్ ఉద్యోగమని సునీతకు చిన్నచూపు. మాధవ్ మంచివాడు. నిదానస్థుడు. సునీత పొగరు అతణ్ని బాధించినా.. రోహిత్ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని భార్యలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. రోజులు వడివడిగా సంవత్సరాలుగా మారుతున్నాయి. సునీతకు సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ వచ్చి మచిలీపట్నం ట్రాన్స్ఫర్ అయింది.
“రోహిత్! నిన్ను చేర్చిన స్కూల్ కృష్ణా జిల్లాలోనే నంబర్ వన్ స్కూల్. నువ్వు పదో తరగతి మంచి మార్కులతో పాసవ్వాలని డబ్బు కోసం ఆలోచించకుండా ఇందులో చేర్చాను!” స్కూల్లో అడ్మిషన్ తీసుకోగానే అన్నది సునీత.
“సునీ! ఎందుకు చదువు పేరుతో వాడి మీద ఒత్తిడి తెస్తున్నావు? మొదటి నుంచి రోహిత్ బాగానే చదువుతాడు. చిన్నప్పటి నుంచీ వాడితో చదువు గురించి తప్ప వేరే ఏదైనా, ఎప్పుడైనా మాట్లాడావా? ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా?” అన్నాడు మాధవ్.
“అలా కబుర్లు కాకరకాయలు, చెప్పడానికి మీరున్నారు కదా? నాకు అంత సమయం లేదు!” ముఖం చిట్లించి అన్నది సునీత.
వాళ్లిద్దరి మాటలు విని రోహిత్ ముఖం వాల్చేశాడు. మాధవ్ అది చూసి.. రోహిత్ చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కాడు. ఆ స్పర్శలో.. ‘నేనున్నాను!’ అనే అండ ఉన్నదని అర్థమైన రోహిత్.. తండ్రిని చూసి నవ్వాడు.
“ఇక ఇంటికి వెళ్దాం పదండి. ఈరోజు లీవులో ఉన్నాను కదా పక్క ఇళ్లల్లో వాకబు చేసి పనిమనిషిని వెతుక్కోవాలి” అని తొందరపెట్టింది సునీత.
అన్నట్లుగానే ఇంటికి వెళ్లిన తరువాత చుట్టుపక్కల ఇళ్లలో పనిమనిషి కోసం వాకబు చేసింది.
“అమ్మగారు! అమ్మగారూ!..” అన్న పిలుపు
వినిపించింది సునీతకు.
“ఎవరూ?” అంటూ హాల్లోకి వచ్చింది.
“అమ్మగారూ! నా పేరు తులసి. నేను మీ పక్కింట్లో ఉండే లాయరమ్మ గారింట్లో పనిచేస్తాను. మీరు మధ్యాహ్నం పనిమనిషి కావాలని చెప్పారట. అందుకే వచ్చాను” అన్నది తులసి.
ఒక నిమిషంపాటు తులసిని పరీక్షించింది సునీత.
తెల్లగా, బక్క పలుచని ఆకారం, నుదుట చిన్న సిందూరం బొట్టు, ప్రశాంతత నిండిన నవ్వుతో, చిరిగిన చీరైనా మనిషి శుభ్రంగా కనిపిస్తున్నది.
‘పేదరికంలో కూడా ఈ ప్రశాంతత ఎక్కడినుంచి వచ్చింది? ముఖ్యంగా పాచిపని చేసుకునే వ్యక్తికి?’.. ముఖం చిట్లించింది సునీత.
“నేను పని శుభ్రంగా చేస్తాను. మీరు ఉద్యోగానికి వెళ్తారట కదండీ! అందుకే ఇప్పుడే మాట్లాడటానికి వచ్చాను. మీరు రమ్మంటే రేపటినుంచి పనిలోకి వస్తానమ్మగారు. నా పని మీకు నచ్చితే.. లాయరమ్మ గారు ఇచ్చినంత జీతం మీరూ ఇవ్వండి” అన్నది తులసి.
తనకు ప్రస్తుతం పనిమనిషి అవసరముందని మారు మాట్లాడకుండా ఒప్పుకొన్నది సునీత.
“ఇదుగో తులసి! నాకు పని ముఖ్యం. సోది కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తే ఊరుకోను. రోజూ తప్పనిసరిగా రావాలి, సెలవు కావాలంటే ముందుగా చెప్పాలి” సీరియస్‌గా అన్నది సునీత.
“అలాగే అమ్మగారు!” అన్నది తులసి.
తులసి అన్నమాట ప్రకారం ఎక్కువగా నాగాలు పెట్టకుండా పని శుభ్రంగా చేస్తున్నది.
“తులసీ! నువ్వు తింటావని ప్లేట్లో టిఫిన్ పెడితే తినకుండా బాక్సులో పెట్టుకున్నావేంటి?”.. ఒకరోజు ఉదయం ఆశ్చర్యంగా అన్నది సునీత.
“ఇంటి దగ్గర మా అత్త ఉంటుందమ్మా! ఆమెకు టిఫిన్లంటే చాలా ఇష్టం. నేను పొద్దుటే అన్నం వండేస్తాను, గంజి పోసుకుని తింటాం. మీరు ఇచ్చినవి మా అత్త తింటుందని తీసుకెళ్తాను” అన్నది తులసి.
ఆ జవాబుకి సునీత తుళ్లిపడింది.
“మీ ఆయన ఏం పని చేస్తాడు?” తులసిని ఎగాదిగా చూస్తూ అన్నది సునీత.
“మా ఆయన లేడమ్మా! మా పెళ్లయిన రెండో ఏడాది చేపల వేటకు వెళ్లినప్పుడు నీళ్లలో పాము కాటేసి అక్కడికక్కడే పోయాడు. అప్పుడు మా అబ్బాయికి ఏడాది వయసుంటుంది. మా మామగారు కూడా చిన్న వయసులోనే పోయాడట. మా అత్తను, మా అబ్బాయిని పోషించే బాధ్యత నాదేనమ్మా! వాళ్ల కోసమే నాలుగిళ్లల్లో పని చేస్తున్నాను” అన్నది తులసి.
“తులసీ! మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు?” అన్నాడు పేపర్ మడుస్తూ మాధవ్.
“చదువుకుంటున్నాడు బాబుగారు! వాడికి చదువంటే బాగా ఇష్టమయ్యా! మా అత్తనేమో.. వాణ్ని పనిలో పెట్టుమంటుంది. కానీ వాడు చదువులు చదవాలని ఆశపడుతున్నాడు. అలా చదవడం మాలాంటోళ్లకి వీలుకాదని వాడికి అర్థం కావడం లేదు” అన్నది తులసి.
“తులసీ! నాకు టైం అవుతున్నది తొందరగా పని కానివ్వు” అని టాపిక్ పెంచకుండా తులసిని అక్కడినుంచి పంపించేసింది సునీత.
ఒక ఆదివారం తులసి ఒక అబ్బాయిని తీసుకుని వచ్చింది. కాలర్ దగ్గర చిరిగిన షర్టు, పొట్టి ప్యాంటు వేసుకుని తులసి పోలికలతో ఉన్నాడు. చూడగానే.. చెప్పకుండానే అర్థమవుతున్నది ఆమె కొడుకని. ఆ అబ్బాయి వాళ్లమ్మకు పనిలో సాయం చేస్తున్నప్పుడు దగ్గరికి రమ్మని పిలిచాడు మాధవ్.
“నీ పేరేంటి బాబూ? ఎక్కడ చదువుకుంటున్నావు?” అన్నాడు మాధవ్.
“నా పేరు వేణు అండి. గాంధీ మెమోరియల్ హైస్కూల్లో చదువుకుంటున్నాను” వినయంగా అన్నాడు వేణు.
“రోహిత్! కాసేపు పుస్తకాల దగ్గర నుంచి లేచి ఇలా వచ్చి వేణుతో ఆడుకో!” అన్నాడు మాధవ్.
రోహిత్ వచ్చి వేణుని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి కాంపౌండ్ వాల్ బయటికి వెళ్లి మాట్లాడుకుంటున్నారు.
“సునీ! మన తులసి కొడుకు వేసుకున్న ప్యాంటు, షర్టు అసలు బాగాలేవు. చదువుకుంటున్న పిల్లాడు కదా అలాంటివి వేసుకుంటే బాగుండదు. రోహిత్ పాతదుస్తులు కొన్ని ఆ అబ్బాయికివ్వు” అన్నాడు మాధవ్.
“ఇప్పుడు కాదు లెండి! తర్వాత ఎపుడైనా చూస్తాను. రోహిత్‌కి రేపటినుంచి సమ్మెటివ్ ఎసెస్మెంట్స్ ఉన్నాయి. నేను దగ్గరుండి వాణ్ని చదివించాలి. ఏడి వీడు?” అంటూ బయటికి వచ్చింది సునీత.
కాంపౌండ్ దగ్గర రోహిత్, వేణు నవ్వుతూ మాట్లాడుకోవడం చూడగానే సునీత ముఖం చిట్లించింది.
“రోహిత్! ఇలా రా!”.. పెద్దగా అరిచింది సునీత.
“ఆదివారం కూడా కాసేపైనా వాణ్ని వదలవా? తోటి పిల్లలతో కాలక్షేపం మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. చదువనేది ఇష్టంతో చదివితే ఒంటపడుతుంది. బలవంతంగా ఒత్తిడిచేసి కూర్చోబెడితే తలకెక్కదు సునీ! నా మాట విని వాణ్ని వదిలేయి” బతిమాలినట్లుగా అన్నాడు మాధవ్.
“ఏం చేయాలో నాకు తెలుసు. ఇష్టంతో ఏ పిల్లలూ చదవరు. వెంటపడి కూర్చోబెడితేనే చదువుతారు. అయినా వాడికి పనిమనిషి కొడుకుతో కబుర్లేంటి? నాకు సలహాలివ్వకుండా మీ పని మీరు చూసుకోండి!” చిరాకుగా ముఖం పెట్టి అన్నది సునీత.
సునీత వెనక.. లోపల పని పూర్తిచేసుకుని వస్తున్న తులసి కనిపించింది. ఆ మాటలన్నీ విన్నదనిపించింది. కానీ ఆమె ముఖంలో కోపతాపాలకు అతీతమైన నిర్వికారభావం కనిపిస్తున్నది. ఈ పరిస్థితికి కారణం రోహిత్‌ని పిలవడమేనని మాధవ్ బాధపడ్డాడు.
“అమ్మగారు! పనంతా అయిపోయింది. ఇక నేను వెళ్తాను” అన్నది తులసి.
‘సరే!’ అన్నట్లుగా తలూపింది సునీత.
సునీత అలా అవమానకరంగా మాట్లాడినప్పుడు ఎదిరించాలనిపించినా.. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లేనని మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు మాధవ్. రోహిత్ అయిష్టంగానే వేణుకి బై చెప్పి లోపలికి వచ్చి పుస్తకాలు తీశాడు.
వార్షిక పరీక్షలు వచ్చేశాయి. సునీత తను టెన్షన్ పడుతూ రోహిత్‌ను కూడా టెన్షన్ పెడుతున్నది. తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు రోహిత్ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు అనడం కన్నా.. సునీత పట్టిస్తున్నది అనడం సబబు. ఎట్టకేలకు పరీక్షలు పూర్తయ్యాయి. ‘హమ్మయ్యా!’ అంటూ ఇద్దరూ ఊపిరి తీసుకున్నారు. ఆ తర్వాత ఫలితాల కోసం ఎదురుచూస్తున్నది సునీత. ఆ రోజు కూడా వచ్చేసింది.
“అమ్మగారు! ఈ రోజు పదవ తరగతి పాసు, ఫేలు ఫోనుల్లో తెలుస్తుందని అందరూ అంటున్నారు. నిజమేనా అండి?”.. కంప్యూటర్ ఉన్న గది గుమ్మం బయట నిలబడి చేతుల తడి కొంగుకి తుడుచుకుంటూ అన్నది తులసి.
“ఆ.. అవును నిజమే! అయినా అవి నీకెందుకు? అంట్లు తోమడం పూర్తయితే ఇల్లంతా శుభ్రంగా సర్దుకురా. గుడ్డ తీసుకుని కిటికీల అద్దాలు మరకలు లేకుండా తుడువు. ఎక్కడా కొంచెం దుమ్ము కూడా కనిపించకూడదు” ముఖం చిట్లించి అన్నది సునీత.
“ఎక్కడా దుమ్ము లేదమ్మగారు! మొన్నేగా శుభ్రంగా తుడిచాను. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారామ్మా?” అన్నది తులసి.
“చుట్టాలు రావడం లేదు. ఇవ్వాళ బాబు పరీక్ష ఫలితాలు తెలుస్తాయి. వాడు స్కూల్ ఫస్ట్ వస్తాడు. సాయంత్రం ఆఫీసు వాళ్లకి పార్టీ ఇవ్వాలి. ఈ పూట పనవ్వగానే ఇంటికి వెళ్లి సాయంత్రం త్వరగా రావాలి” తులసి వైపు చూస్తూ అన్నది సునీత.
తులసికి పనెక్కువ చెప్పినప్పుడు కోపం రావడం, చిరాకు పడటం సునీత ఎప్పుడూ చూడలేదు. ఆమె ముఖం ఎప్పటిలాగానే ప్రశాంతంగా కనిపించింది. అది చూడగానే సునీతకి మళ్లీ ప్రశ్నార్థకం గుర్తు కళ్ల ముందు మెదిలింది. ‘ఒక్కదాని రెక్కల కష్టం మీద మూడు ప్రాణాలు బతకాలి. సరైన తిండి, కట్టుకోవడానికి సరైన గుడ్డ లేదు. మరేం చూసుకుని ఈ ప్రశాంతత?’ ఒక క్షణం మనసులో అనుకుంది సునీత.
“అమ్మగారు! చిన్నబాబు గారిని బాగా చదివించారు. బాబు తప్పకుండా అందరికంటే ఫస్టుగా పాసవుతాడు. మీరు చెప్పినట్లు సాయంత్రం తొందరగా వస్తానమ్మా!” ముఖం చేటంత చేసుకుని అన్నది తులసి.
‘మరి కొద్ది క్షణాలలో మన విద్యాశాఖ మంత్రిగారు పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తారు!’ అని టీవీలో వార్త వినిపించింది.
“ఇక నన్ను విసిగించకుండా ఇక్కడినుంచి వెళ్లి పని చూసుకో!” అని సిస్టం ముందు నుంచి లేచి, హాల్లోకి వచ్చి టీవీవైపు చూసింది సునీత.
రోహిత్ సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. అతని ముఖమంతా చెమటలు పట్టాయి. టెన్షన్‌గా సునీత వైపు, టీవీవైపు మార్చి మార్చి చూస్తున్నాడు.
“రోహిత్! మరి కాసేపట్లో నీ రిజల్ట్స్ వస్తున్నాయి. నేను సిస్టంలో చూస్తాను. నువ్వు కూడా నాతో రా!” అంటూ వేగంగా గదిలోకి వెళ్లింది సునీత.
తులసి కాసేపు ఏదో అడగాలని తచ్చాడుతూ సునీత పట్టించుకోవడం లేదని గ్రహించి అక్కడినుంచి లోపలికి వెళ్లిపోయింది. విద్యాశాఖ మంత్రి ఫలితాలు వెల్లడి చేశారు. సిస్టంలో సర్వర్లన్నీ బిజీ అయ్యాయి. సునీత ముఖంలో విపరీతమైన కంగారు మొదలైంది. అది చూస్తున్న రోహిత్ మనసులో అంతకంతకూ భయం పెరుగుతున్నది.
“అమ్మా! ఒకవేళ నువ్వనుకున్నట్లు నేను స్కూలు ఫస్ట్ రాకపోతే?” భయపడుతూనే అడిగాడు రోహిత్.
“నో వే.. నీకు తప్పకుండా వస్తుంది. అలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు” అసహనంగా మౌస్ కదుపుతూ అన్నది సునీత.
ఆ మాటలకు రోహిత్ మనసులో భయం మరింత పెరుగుతున్నది. ఒళ్లంతా వణుకు వస్తున్నది. సరిగ్గా అప్పుడే అతని భుజం మీద ఒక చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి మాధవ్ ఉన్నాడు.
“బీ బ్రేవ్ మై బాయ్!” చిన్నగా అన్నాడు మాధవ్.
రోహిత్ మాట్లాడకుండా తండ్రి చేయి తన రెండు చేతులతో పట్టుకున్నాడు.
“రోహిత్! నీకు టెన్ బై టెన్ పాయింట్స్ వచ్చాయి. నా అంచనా ప్రకారం కాసేపట్లో మీ స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది” ఆనందంగా అరుస్తూ రోహిత్ చెయ్యి పట్టుకుని ఊపేస్తూ అన్నది సునీత.
రోహిత్ ముఖం పువ్వులా వికసించింది. కానీ, అంతలోనే మళ్లీ భయంతో ముడుచుకుపోయింది. అది చూసిన మాధవ్‌కి పరిస్థితి అర్థమైంది.
“రోహిత్! నువ్వు మంచి మార్కులతో పాసయినందుకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్” అంటూ అతని నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు మాధవ్.
“రోహిత్ స్కూల్ ఫస్ట్ వచ్చాడని స్కూల్ నుంచి ఫోన్ రాలేదు. కొంపదీసి వీడికి ఫస్ట్ ర్యాంక్ రాలేదంటారా? స్కూల్‌కి ఫోన్ చేసి చూడనా?” అన్నది సునీత.
“సునీ! ర్యాంకులు పిల్లల శక్తి సామర్థ్యాలను నిర్ణయించలేవు. నీలాంటి తల్లితండ్రుల వల్లే పిల్లల్లో అసూయ ద్వేషాలు పేరుకుంటున్నాయి. ర్యాంక్ రాకపోతే తల్లిదండ్రుల కోపాలకు, నిరాశలకు పిల్లలు బలవుతున్నారు. తోటి పిల్లల గెలుపును మంచి మనసుతో అభినందించలేక పోతున్నారు. రోహిత్‌కి ఫస్ట్‌ర్యాంక్ రాకపోయినంత మాత్రాన ఇప్పుడు వచ్చిన నష్టమేముంది?” అన్నాడు మాధవ్.
అంతలో సునీత ఫోన్ రింగయింది.
“స్కూల్ నుంచి ఫోన్!” ఉద్వేగభరితంగా అంటూ ఫోన్ తీసింది సునీత. రోహిత్ తండ్రి చెయ్యి పట్టుకుని తల్లివైపు బిక్కమొహంతో చూశాడు. మాధవ్ మాట్లాడకుండా దగ్గరికి తీసుకున్నాడు.
“ఓ మై గాడ్! థాంక్యూ.. థాంక్యూ! థాంక్యూ సో మచ్ అండి. ఇన్నాళ్లకు నా కలలు నెరవేరాయి. మీ స్కూల్లో టీచర్స్ అందరికీ నేను రుణపడి ఉంటాను. నేను రోహిత్‌ని తీసుకొని మిమ్మల్ని కలుస్తాను. వన్స్ అగైన్ థాంక్స్ అండి!” అంటూ ఫోన్ పెట్టేసింది సునీత.
అప్పటికే విషయం అర్థమైన రోహిత్, మాధవ్ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.
“హార్టీ కంగ్రాట్స్ మై బాయ్!” పెద్దగా అరుస్తూ రోహిత్‌ని కౌగలించుకుంది సునీత.
“థాంక్స్ అమ్మా!” నవ్వుతూ అన్నాడు రోహిత్.
ఈ అరుపులకు తులసి కూడా హాల్లోకి వచ్చి వాళ్లను చూసి తనుకూడా వారి నవ్వుల్లో జత కలిపింది.
“తులసీ! చెప్పానా! మా రోహిత్ స్కూల్ ఫస్ట్ వస్తాడని. అలాగే వచ్చాడు!” పట్టలేనంత ఆనందం సునీత గొంతులో.
“కూర్చోబెట్టి చదివిస్తే చదువు రాదన్నారు. ఇప్పుడైనా మీకు తెలిసిందా? మంచి స్కూల్లో చేర్పించి, క్రమపద్ధతిలో చదివిస్తేనే చదువు వస్తుంది” మాధవ్ వైపు తిరిగి అరుస్తూ అన్నది సునీత.
“సునీ! నువ్వు చాలా ఎగ్జయిట్ అవుతున్నావు. నీ కోరిక నెరవేరింది కదా! ముందు కాస్త రిలాక్స్ గా కూర్చో!” అంటూ ఆమె చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టబోయాడు మాధవ్.
అంతలో కాంపౌండ్ వాల్ దగ్గర గేటు తీసిన శబ్దమయింది. అందరి దృష్టి అటు వైపు మళ్లింది. గేటు తీసుకుని కొంతమంది విలేకర్లు లోపలికి వస్తున్నారు.
“అదుగో! అప్పుడే మీడియా వాళ్లకు స్కూల్ నుంచి సమాచారం అందినట్లుంది. ఇప్పుడు రోహిత్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. తల్లిదండ్రుల ఫీలింగ్స్ కూడా అడుగుతారు. మీరు పిచ్చి మాటలు మాట్లాడకుండా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అది లోకల్ టీవీలో కూడా ప్రసారమవుతుంది. అర్థమవుతుందా?” కంగారు కంగారుగా అంటూ రోహిత్ చెయ్యి పట్టుకుని వాళ్లకు ఎదురు వెళ్లింది సునీత.
విలేకర్లు ఆమెను దాటుకుంటూ ముందుకు వెళ్లారు.
“హలో! ఇటు చూడండి.. రోహిత్ ఇక్కడే ఉన్నాడు!” అని పిలిచింది సునీత.
వాళ్లు వినిపించుకోకుండా వెళ్లి తులసి దగ్గర ఆగారు. వాళ్లు తన దగ్గరికి వచ్చి మైక్ ముందు పెట్టగానే.. తులసికి ఏమీ అర్థంకాక అయోమయంగా బిత్తర చూపులు చూస్తున్నది.
“అమ్మా! మీరు వేణు తల్లి తులసి గారేనా?” అన్నాడు ఒక విలేకరి.
“అవును బాబూ! వేణు నా కొడుకే.. ఏమైందయ్యా!?” అయోమయంగా అన్నది తులసి.
“మీ అబ్బాయి వేణు పదో తరగతిలో మన స్టేట్‌ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గారు అతి నిరుపేద కుటుంబానికి చెందిన వేణుకి చిన్నప్పటి నుంచీ చదువంటే చాలా ఇష్టమని గొప్పగా చెప్పారు. మీరేమంటారు?” అన్నాడు మరో విలేకరి.
“వేణు విజయానికి మీరే విధంగా సహాయం చేశారు?” అన్నాడు ఇంకో విలేకరి.
తులసికి వాళ్ల మాటల్లో వేణు పాసయ్యాడని మాత్రం అర్థమైంది. అందుకు వీరంతా ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు.
“వేణూ! మీ అమ్మగారు అకస్మాత్తుగా నీ గెలుపు వార్త వినడం వల్ల ఆనందంతో మాట్లాడలేకపోతున్నారు. అక్కడే అగిపోయావేంటి? ఇలా రా!” అని విలేకర్లలో ఒకతను వెనక్కి తిరిగి పిలిచాడు.
అప్పుడు అందరి దృష్టి గుమ్మం వైపు మళ్లింది. అక్కడ వేణు నిలబడి ఉన్నాడు. వెనుక నుంచి టీవీలో వార్తలు వినిపిస్తున్నాయి.
‘మచిలీపట్నానికి చెందిన వేణు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఈ అబ్బాయి గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్య రాణిస్తుందనడానికి ఇదో మచ్చుతునక’…
హాల్ టికెట్ మీదున్న వేణు ఫొటో టీవీలో చూపిస్తున్నారు.
“డాడీ! వేణు!.. వేణుకి స్టేట్ ఫస్ట్ వచ్చింది!” సంతోషంగా అన్నాడు రోహిత్.
“రియల్లీ గ్రేట్ రోహిత్! వేణుకి అభినందనలు తెలియజేద్దాం పద..” అన్నాడు మాధవ్.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన
‘కథల పోటీ-2023/24’లోరూ.5 వేల బహుమతి పొందిన కథ.
కైకాల వెంకట సుమలత
పిల్లల తెలివితేటలను ర్యాంకులతో నిర్ధారించి.. వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న వ్యవస్థ మారాలని ‘ఆశ బరువు తూయగలమా!’ కథ ద్వారా కోరుతున్నారు రచయిత్రి కైకాల వెంకట సుమలత. వీరి స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ. డిగ్రీ తర్వాత టీటీసీ చేశారు. ఊహ తెలిసినప్పటి నుంచే తన మనసును ఆకట్టుకునే అందాలకు, హృదయాన్ని కదిలించే ఆర్ద్రతకు అక్షర రూపం ఇవ్వాలని ఉవ్విళ్లూరేవారు. డిగ్రీ మొదటి సంవత్సరం సావనీర్లో వీరి మొదటి కవిత ‘అందాల శిశిరమా! నిశ్శబ్దత దాల్చి దుఃఖిస్తావెందుకు?’ ప్రచురితమైంది. మొదటి కథ ‘ప్రేమించే మనసు’.. ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో వచ్చింది. అలా వీరి సాహితీప్రయాణం మొదలైంది. సాహో, స్వాతి ముత్యం, ఏది దానం?.. ఎవరు దాత? కథలు విశేష పాఠకాదరణ పొందాయి. శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు నుంచి వీరి కథల సంపుటి ‘సుమ సౌరభాలు’ వెలువడింది. వీరి రచనలు అన్ని ప్రముఖ దిన, వార పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వాటిలో బహుమతులు పొందినవే ఎక్కువగా ఉన్నాయి. సాహిత్య ప్రయాణంలో భాగంగా.. సోమేపల్లి జాతీయస్థాయి పురస్కారం, అక్షరాల తోవ జాతీయ స్థాయి పురస్కారం, మం‘దారం’ లాంటి పలు జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు.