(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)
పోటిసుని రూపం మార్చడానికి ముగ్ధ హరిణుడిని పిలిపిస్తుంది సవరసత్తి. పురుష వేషంలో ఉన్న చంద్రహత్థిపై దాడి చేస్తారు సవర మనుషులు. జయసేనుడు, మారువేషంలో ఉన్న వామదేవుడు, సౌగంధిక చీకటి గదిలో చర్చించుకుంటూ ఉండగా గది తలుపులు తెరుచుకుంటాయి. ఆ తర్వాత..
చీకటి గదిలో ఉన్న ముగ్గురూ ఊపిరి బిగబట్టినారు. జయసేనుడు ఒక పక్కకు; వామదేవ-సౌగంధికలు మరో పక్కకు ఒత్తిగిలి కూర్చున్నారు. తలుపు తెరిచిన మనిషి చేతిలో చిన్న కాగడా లాంటిది ఉన్నది. ఆ వెలుతురులో వాడు కాపలాదారు అని తెలుస్తున్నది.ఎక్కువ ఆలస్యం చేయకుండా వాని మీద దాడి చేసినాడు జయసేనుడు. కాపలాదారు చేతిలోని కాగడా అల్లంత దూరాన పడ్డది. వెంటనే సౌగంధిక దాన్ని చేతిలోకి తీసుకున్నది. క్షణాల్లో తలుపులు మూసేసి కాపలాదారు మీద తనూ ఒక చేయి వేసినాడు వామదేవుడు. వాడు స్పృహ కోల్పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
కాగడా వెలుగులో జయసేనుణ్ని చూస్తుంటే దుఃఖం ఆగలేదు సౌగంధికకు.
“అన్నా! ఇట్లా అయిపోయినావ్ ఏంది?” అన్నది కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం చేస్తూ.
“అంతా శివానుగ్రహం తల్లీ! మరో రెండు రోజులు ఉంటే ప్రాణాలే పోయేవి. మిమ్ములను ఆ పరమేశ్వరుడే పంపినాడు..”
జయసేనుణ్ని అడ్డుకుంటూ..
“మీ పరామర్శలు తర్వాత! ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి” అంటూ తన ఆలోచనను వివరించినాడు వామదేవుడు.
“మేమిద్దరమూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్తాం! నీవు వీని వస్ర్తాలు ధరించి కాపలాదారుగా మారాలి! వాని సహచరులలో కలిసిపోయి, మున్ముందు ఏం చేయగలవో ఆలోచించుకోవాలి! ప్రస్తుతం నా పేరు దేవి; సౌగంధిక పేరు సుద్ది. మేమిద్దరమూ అవణాయరు వద్ద వంటవాళ్లుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు సౌగంధికను బయటికి పంపుదాం! ఆమె కోసం ఈసాణుడి మనుషులు వెతుకుతుంటారు. ఆమె అవణాయరు వద్దకు చేరుకుంటే భయం ఉండదు” అని..
“నువ్వు వెళ్లిపో జాగ్రత్తగా..” అంటూ సౌగంధికను తొందర పెట్టినాడు వామదేవుడు. తల మీద నిండుగా కొంగు కప్పుకొని బయటికి వెళ్లి, గది తలుపులు మూసేసింది సౌగంధిక. దూరాన ఇద్దరు మనుషులు కనిపించినారు. వాళ్లు ఆమె కోసమే వెతుకుతున్నట్లు అనిపించింది సౌగంధికకు. జాగ్రత్తగా వాళ్ల చూపులు తప్పించుకొని, అవణాయరు గదికి చేరింది ఆమె. చీకటి కొట్లో కాగడా వెలుతుర్లో జయసేనుడు, వామదేవుడు కలిసి కాపలాదారు బట్టలు మార్చినారు. జయసేనుని దుస్తులు వానికి తొడిగి, వాని వస్ర్తాలు జయసేనుడు ధరించినాడు.
“నీవిక వెళ్లు! నేను తర్వాత వస్తాను” అన్నాడు జయసేనుడు, అంగీ బొందులు కట్టుకుంటూ.
“అట్లా కాదు! ముందు వీడు మాట్లాడకుండా నోట్లో గుడ్డలు కుక్కి, చేతులూ కాళ్లు కట్టేయాలి. వీడు లేచినా, అరిచినా ప్రమాదమే! నీవు ముందుగా బయటికి వెళ్లి పరిస్థితులు గమనించి ఆపై నన్ను బయటికి పంపించు!” అన్నాడు యుక్తియుక్తంగా వామదేవుడు.
వామదేవుని ఆజ్ఞ పాటించినాడు జయసేనుడు. నెమ్మదిగా చుట్టూ పరికిస్తూ తమ గదికి చేరుకున్న వామదేవుడు.. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయినాడు.
“వయసు చూస్తే 17 ఏండ్లు కూడా ఉన్నట్టు లేదు” పట్టుబడిన అశ్వికుణ్ని చూస్తూ అన్నాడు, వృద్ధుడిగా మారిన పోటిసుడు.
“వీడెవడో; ఎక్కడి నుంచి వచ్చినాడో; మనకు మేలు చేసేవాడో, కీడెంచే ఇక్కడికి చేరుకున్నాడో.. అన్నీ వివరంగా తెలుసుకోవాలి! ముందుగా భూగృహంలోకి చేర్చండి!” ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు.
పోటిసుని మాటలు వింటూ ఆ యువకుడు కలవర పడిపోతున్నట్లు అతని ముఖ కవళికల ద్వారా అర్థమవుతున్నది. స్పృహలో లేకున్నా, పోటిసుని మాటలు అతని మీద ప్రభావం చూపిస్తుండటం వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. నెమ్మదిగా ఆ వనితల్లో నుంచి నలుగురు యువకుని రూపంలో ఉన్న చంద్రహత్థిని భూగృహంలోకి చేర్చినారు. అందులో ఒక వనితకు అనుమానం కలిగింది..
“ఇంత సుకుమారంగా ఉన్నాడు, వీడు మగాడేనా?” అన్నది. ఆ మాటలకు మిగతా ముగ్గురు నవ్వినారు.చేతిలో కర్ర ఊతగా ఊరివైపు వెళ్తున్న పోటిసుని మనసులోనూ ఇదే అనుమానం కలిగింది..
‘వాడు నిజంగా మగవాడేనా? పాలుగారే వాని బుగ్గలు చూస్తుంటే అచ్చం ఆడదానిలాగే ఉన్నాడు! లేదా.. చాలా చిన్న వయసులో ఉన్న కుర్రవాడు కావచ్చు..!’ అనుకుంటుంటే ఆ ముఖ కవళికలు ఒక్కసారి గుర్తుచేసుకొని ఉలిక్కిపడ్డాడు.
ముఖ కవళికలే కాదు; శరీరాకృతి గుర్తు చేసుకుంటే.. అవి.. అవి.. చంద్రహత్థికి సరిగ్గా సరిపోయేటట్లు ఉన్నాయి!!! అంటే.. ఆ వచ్చినవాడు చంద్రహత్థి తమ్ముడా? చంద్రహత్థికి సోదరులు లేరు! మరి ఆ వచ్చింది.. చంద్రహత్థేనా..??
‘ఒక్కసారి తాకితే చాలు..! ఆ స్పర్శతో తాను ఆమెను గుర్తుపడతాడు! ఇప్పుడు మళ్లీ వెనకకు పోవడానికి సవరసత్తి అనుమతి లేదు. ఆమె అనుమతి లేకుండా ఏమీ చేయడానికి లేదు. ఈ ఆలోచన అక్కడ ఉన్నప్పుడే కలిగినా.. తాకి చూసి నిర్ధారించేవాడు..’ ఎడతెగని ఆలోచనలతో సవరసత్తి భవనానికి చేరుకున్నాడు పోటిసుడు. అప్పటికే ఆలస్యమైనట్లు ఉన్నాడు.
పోటిసుణ్ని చూడగానే..
“ఏమిటింత ఆలస్యం? ఆ ఈసాణుడు వస్తానని కబురు పంపినాడు” అంటూనే ఆపాదమస్తకం పరిశీలించింది అతణ్ని.
మనసులోనే మరోమారు ముగ్ధహరిణుడి పనితనానికి వందనాలు సమర్పించింది సవరసత్తి. ముఖంలోని ముడతలు, జుట్టు రంగుతోపాటు శరీరం మీద కూడా ముడతలు, పైకి ఉబికినట్లున్న నరాలను తన పచ్చబొట్టుతో సహజంగా కనిపించేటట్లు చేసినాడు. జుట్టును తెల్లగా మార్చడానికి ఏ మూలికారసం వాడినాడో ప్రతి రోమం తెల్లగా మారిపోయింది.
“మహావీరా! ఈరోజు నుంచి నీ పేరు మియంకుడు. నాకు దూరపు చుట్టానివి. పిల్లలు సరిగ్గా ఆదరించకపోవడం వలన పోదన నగర పరిసర గ్రామమైన సిద్ధాపురం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చినావు. అక్కడి వివరాలు ఏమైనా అడిగితే.. ‘కుసుమ శ్రేష్ఠి భవనం పూర్తిగా బుగ్గి అయింది. అందరూ మంటల్లో కాలిపోయినారు’ అని చెప్పాలి అంతే!” అన్నది.
“అమ్మా! ఒక్క మాట..!”’ భూగృహంలోకి చేర్చిన యువకుని గురించి తనకున్న అనుమానం చెప్పబోయినాడు పోటిసుడు.
“నోరు ముయ్యి!” గట్టిగా అరిచింది సవరసత్తి. ఆమె హఠాత్తుగా అట్లా మందలించడంతో ఆశ్చర్యంతోపాటు ఒకింత భయం కలిగింది పోటిసునికి మొదటిసారిగా.
“వయసుకు తగ్గట్టు మాట్లాడలేవా మియంక తాతా!” అన్నది హెచ్చరికగా.
“ఇదే చివరి మందలింపు! ఇకపై హెచ్చరించడానికి ప్రతి నిమిషం నీ వెంట నేను ఉండను కదా!” అన్నది. నిజమే! తాను తన వయస్సు సంగతి మరిచిపోయినాడు.
“మన్నించండి తల్లీ!”అన్నాడు గొంతులో వణుకుని జోడించి, కర్ర ఊతతో తల ఎత్తి మాట్లాడటానికి ప్రయాస పడుతున్నట్లుగా.
“ఇది.. ఇది బాగున్నది!” అన్నది తృప్తి చెందుతూ సవరసత్తి.
“అయినా, నిన్ను నీవు చూసుకుని ఉంటే ఇట్లా మాట్లాడి ఉండవు కదా!” అంటూ ఒక పరిచారికను పిలిచి, ఆమె వెంట పోటిసుణ్ని ఒక గదిలోకి పంపించింది.
అందులోకి వెళ్లిన మియంకుని రూపంలో ఉన్న పోటిసునికి అమితాశ్చర్యం కలిగింది. ఆ గదిలో ఎనిమిది అడుగుల నిలువుటద్దం ఉన్నది. నిజంగా తనను తాను గుర్తుపట్టలేక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయినాడు. అంతలో.. ‘ఈసాణుడు వస్తున్నాడు’ అన్న సమాచారం అందింది. ఎక్కడి వాళ్లు అక్కడ తమ తమ పనులు చూసుకోవడంలో లీనమైనారు. మియంకుడు సవర సత్తి వద్దకు వెళ్లినాడు.
జంగిటిలో.. ‘అందరూ మంచివాళ్లు అయినంత మాత్రాన ప్రమాదాలు పలకరించకుండా ఉంటాయా?’ ఇద్దరు రాణుల కోసం వంట వండుతూనే అదే పనిగా ఆలోచిస్తున్నది అలసుద్ది. చిన్న రాణి రోహదేవి ఎంతో ఉత్తమురాలు! భర్తనే సర్వస్వంగా భావించే పతివ్రత; అత్తను అమ్మగా భావించే ఉన్నత గుణవంతురాలైన కోడలు; అందరినీ తనవాళ్లు అనుకునే అమాయిక; ప్రకృతిని, మనుషులను తనతో సమానంగా ప్రేమించే సంస్కారవంతురాలు!
మరి ఆ అత్తగారు సిరిసత్తి సామాన్యురాలా! కోడలిని కూతురుగా భావిస్తుంది; కొడుకంటే పంచప్రాణాలు; ఏది మంచో, ఏది చెడో తెలిసిన విజ్ఞత కలిగింది; మూఢనమ్మకాలకు విలువ ఇవ్వని వాస్తవిక వాది.. కానీ భర్త ఎక్కడున్నాడో తెలవదు; అతణ్ని తోడుకొని వస్తానని పోయిన తన ప్రియుడు పోటిసుడు, వాళ్లిద్దరినీ వెతకడానికి వెళ్లిన కొడుకు, అతని మిత్రుడు కూడా ఏమైపోయినారో తెలవదు! ఇది చాలదన్నట్లు ఇల్లు కాలిపోయింది; సంపద నశించింది; అయినవాళ్లందరూ ఆ మంటల్లో మాడిపోయినారు. తన రెండు కళ్లు చూపును కోల్పోయినాయి. ప్రాణాలు కాపాడుకొని ఈ పల్లెటూరిలో వచ్చి పడ్డారు.
పోటిసుడు గుర్తుకు రాగానే ఏదో అపురూపమైన వస్తువును కోల్పోయిన భావన ఆమెను కుదిపేసింది. వాడు సకాలంలో తిరిగి వచ్చి ఉంటే, ఈపాటికి తనను మనువాడే వాడు. ఇంట్లో కూడా వాని గురించి చెప్తే ‘సరే’ అన్నారు. ఈ సంగతి అతనికి తెలవదు. అతను తనను బలంగా కోరుకునే విషయం కూడా చూపులే నిర్ధారించినాయి. తమ ప్రణయం మాటల దాకా చేరుకోకముందే దూరంగా పోయినాడు. ‘రానీ.. వాని సంగతి చెప్తా!’ అనుకున్నది.
‘ముగ్గురూ ఆడవాళ్లు; ఊరికి దూరంగా ఇల్లు; తోడేళ్ల వంటి మగవాళ్లు; కళ్లు కనిపించని పెద్దమనిషి; తమను ఇక్కడికి పంపించి, త్వరలో కలుస్తానని చెప్పిన నమ్మినబంటు కువిందుడు ఇంతవరకూ కనిపించలేదు. ఇంకా ఎంతకాలం ఈ అజ్ఞాతవాసంలో ఉండాలి? మరొక పక్క చిన్న రాణి రోహ శారీరక దాహం తీర్చుకోవడానికి సతమతం అవుతున్నట్లున్నది. కొత్తగా పరిచయమైన బాటసారి మంచివాడో, మంచివాడిలా నటిస్తున్నాడో అర్థం కాలేదు. అయినా ఇంటికొక మగతోడు ఉన్నాడని తెలిస్తే, ఇతర మగవాళ్లు కొంచెం దూరంగా ఉంటారు. అందుకోసమైనా ఆ బాటసారిని ఆదరించాలి. అతను ఎటువంటి వాడో పూర్తిగా గ్రహించాలి..’ అనుకుంటూనే వేడి చేసిన పాలను తీసుకొని పోయి ఇద్దరు రాణులకు వేర్వేరుగా ఇచ్చింది.
పెద్ద రాణి అంతరంగం తెలుసుకుందామని ఒక మాట అడిగింది ఆహవసత్తిగా పేరు మార్చుకున్న అలసుద్ది..
“అమ్మగారూ..!” ఆమె మాట ప్రారంభిస్తుండగానే అడ్డుకున్నది అత్త..
“అదేమి ఆహవా! మన పేర్లు, వరుసలు మారినై కదా! ఇక్కడ ఉన్నంతకాలం అదే కొనసాగించాలి!” అని మందలించి..
“అడుగు! ఏదో అడుగుతున్నావు కదా!” అన్నది, వాస్తవం గుర్తుచేస్తూ.
“అత్తమ్మా! మనుషుల మధ్య ప్రేమ ఎప్పటికీ ఒక తీరుగానే ఉంటుందా? ఉండదా?” అన్నది ధర్మ సందేహం అడిగినట్లు.
“ఉంటుందని అనుకుంటారు బిడ్డా! కానీ ఉండదు. ఉండాలంటే మనసుకు ఆధారమైన శరీరం కూడా దగ్గరగా ఉండాలి. చూపులు పలకరిస్తుంటేనే దేహం పులకరిస్తుంటుంది. పరస్పర మైత్రి ఇగి చెడకుండా ఉంటుంది” అంటూ కమలసత్తి..
పెద్ద కాలముగను విడివిడిగా నున్న ప్రేమ గట్టిదైన నేమి బిడ్డ!
కరములందు నీరు కారిన రీతిగా నిలువజాలకుండు పలుచబడుచు.. (ప్రేమ ఎంత గట్టిదైనా ఒకరినొకరు చూసుకోకుండా దూరంగా ఉంటే, చేతి వేళ్ల సందులలో నుంచి నీళ్లు ఆగకుండా జారిపోయినట్లే అది పలుచబడి, చేజారుతుంది)” అన్నది.
అంటే.. ‘రోహాదేవి, జయసేనుల మధ్య ప్రేమ కరిగిపోతున్నదా? ప్రేమకు మనసుతోనే గాక శరీరంతోనూ సంబంధం ఉంటుందా? వయసు, శరీరం, కోరికలు ప్రేమను శాసిస్తాయా? అటువంటి ప్రేమ నిజంగా నిలబడుతుందా? వయసుతోపాటే అంతరించిపోతుందా?’.. రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న ఆహవసత్తి.. భాణుసత్తిని చూసి వణికిపోయింది.
ఆహవ భయపడటానికి కారణం భయం గొలిపే దృశ్యం కాదు! కన్ను పక్కకు కదలనీయని భాణు అందం!
అసలే ఆమె అందమైంది! భర్త ఎడబాటు తర్వాత ఆమెకు దేహ సౌందర్యం మీద శ్రద్ధ తగ్గింది కానీ, ఇన్నాళ్లకు మళ్లీ ఆమె ప్రత్యేకంగా అలంకరించుకుంటున్నది.
‘మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఇంత అందంగా అలంకరించుకోవడం ఎన్ని ప్రమాదాలకు కారణమవుతుందో!’ అన్నది ఆహవ భయం! ఆ భయాన్ని మరింతగా పెంచుతూ గుమ్మంలో ప్రత్యక్షమైనాడు బాటసారి!!
‘ఇంతకూ ఇతనెవరో? ఏం చేస్తుంటాడో? వివరాలన్నీ తెలుసుకోవాలి’.. అనుకుంటూ అడిగింది. “అయ్యా! ఇంతకూ తమరు ఎవరు? ఏం చేస్తుంటారు? అన్నీ వివరంగా చెప్పండి!”
(సశేషం)
– దోరవేటి 89788 71961