ఇంజినీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్. ఏటా లక్షా పది వేల మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్నారు. కానీ వారికి ఉద్యోగం చేసే నైపుణ్యం లేదు. తెల్ల కాగితం ఇస్తే ఉద్యోగ దరఖాస్తు ఫారం కూడా నింపలేరు. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం సృష్టించాయి. ఇంజినీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శగా మాత్రమే చూడాలా? లేక దీని వెనుక మరో విధానపరమైన సంకేతం దాగి ఉన్నదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్య విలువనే ప్రశ్నించేలా ప్రజాభిప్రాయాన్ని నిర్మించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కుదించడం, పరిమితం చేయడం, రూపాంతరం చేయడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించే విధానపరమైన ఆలోచనలో భాగమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
2007కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, మెడికల్ వంటి వృత్తి విద్యలు సామాన్య కుటుంబాలకు దాదాపు అందని ద్రాక్షగానే ఉండేవి. అధిక ఫీజుల కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతర బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యేవారు. ఇంజినీరింగ్ సీటు లేదా మెడికల్ చదవడం వారి కుటుంబాలకు ఒక కలగానే ఉండేది. ఈ పరిస్థితిని మార్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం 2007లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2008 నుంచి ఈ పథకం విస్తృత స్థాయిలో అమల్లోకి వచ్చింది. విద్యార్థుల ట్యూషన్ ఫీజును ప్రభుత్వం నేరుగా కళాశాలలకు చెల్లించడం ద్వారా ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని కొనసాగించాయి. ఈ పథకం వల్ల లక్షలాది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యల్లో ప్రవేశించారు. ఒకప్పుడు కొద్దిమందికే పరిమితమైన సాంకేతిక విద్య సామాజిక న్యాయానికి ప్రతీకగా మారింది. ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, తయారీ రంగాల్లో లక్షలాది యువత ఉపాధి పొందారు. అనేక కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితి మెరుగుపడింది. ఈ కోణంలో చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సామాజిక మార్పునకు దోహదపడిన కీలక సంక్షేమ కార్యక్రమమని చెప్పవచ్చు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమల్లోకి లోపాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ రీయింబర్స్మెంట్ నిధులను ఆసరాగా చేసుకొని అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు విచ్చలవిడిగా స్థాపించారు. అనుమతులు పొందిన పలు కళాశాలలపై విమర్శలు వచ్చాయి. పట్టభద్రుల సంఖ్య పెరిగినా, అందరికీ పరిశ్రమలు కోరే స్థాయి నైపుణ్యాలు అందలేకపోయాయి. కానీ ఈ పరిస్థితికి బాధ్యత విద్యార్థులదా? లేక నాణ్యత లేని కళాశాలలకు అనుమతులు ఇచ్చిన పాలక వ్యవస్థదా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వ పెద్దలే. నాణ్యతను పర్యవేక్షించే బాధ్యత, ప్రమాణాలు పాటించని కళాశాలలను మూసివేసే అధికారం ప్రభుత్వానికే ఉన్నది. ప్రభుత్వ వైఫల్యాన్ని విద్యార్థుల వైఫల్యంగా చిత్రీకరించడం సరికాదు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ప్రభుత్వం ఏటా బడ్జెట్లో వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నది. కానీ కళాశాలలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ఇది ప్రభుత్వానికి ఆర్థిక సవాలే కావచ్చు. అయితే దానికి పరిష్కారం పథకాన్ని నిర్వీర్యం చేయడం కాదు. నిజమైన అర్హులకు ప్రయోజనం అందేలా వ్యవస్థను పారదర్శకంగా మార్చడం, నాణ్యత లేని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దడమే సరైన మార్గం.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది. లక్షలాది యువత ఆశలు, వారి కుటుంబాల కలలు ముడిపడి ఉన్న ఇంజినీరింగ్ విద్యను బలోపేతం చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. ప్రమాణాలు లేని కళాశాలలను ఉపేక్షించడం ఎంత తప్పో, అదే వ్యవస్థలో చదివిన విద్యార్థులను వైఫల్యానికి ప్రతీకలుగా చిత్రీకరించడం కూడా అంతే తప్పు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల సామాజిక న్యాయం విస్తరించింది. అదే సమయంలో దాని అమల్లోకి లోపాలు కూడా బయటపడ్డాయి. కాబట్టి సంస్కరణలు అవసరం. కానీ సంస్కరణల పేరుతో అవకాశాలను కుదించడం సబబు కాదు, నాణ్యతను పెంచడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి. విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజం. కానీ బాధ్యతాయుతమైన నాయకత్వం విమర్శలతో ఆగిపోదు, పరిష్కారాలను చూపిస్తుంది. అదే మంచి పాలనకు, అదే విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిబద్ధతకు అసలైన కొలమానం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-ప్రగతి మాలి