శాతవాహన ప్రభువుల్లో 17వ రాజు హాలుడు. ఈయన మొదటి శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కవి చక్రవర్తి. తన పాలన కాలం స్వల్పమే అయినా.. మొట్టమొదటి సంకలన కావ్య సంపాదకుడిగా సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రాకృత భాషలో వెలువడిన సమకాలీన గాథలను పోగుచేసి.. 700 గాథలతో ‘గాథా సప్తశతి’ని భద్రపరిచిన సాహితీ కళాపోషకుడు. ఆ 700 గాథలను ఆధారంగా చేసుకుని రూపొందించిన కాల్పనిక ప్రణయగాథ.. ఈ అపూర్వరాగం.
ఇరుగు పొరుగు రాజ్యాలైన అస్మక, ముళక రాజ్యాలు సఖ్యంగా, సమృద్ధిగా ఉండేవి. ప్రజలు శ్రమజీవనానందాన్ని అనుభవిస్తూ, కష్టాలను కూడా భాగ్యంగా భావిస్తూ జీవిస్తుండేవారు. అస్మకరాజ్య రాజధాని పోదన నగరం (ఇప్పటి బోధన్). అందులో కుసుమ శ్రేష్ఠి అనే వర్తకుడు ఉండేవాడు. సంవత్సరంలో చాలాభాగం వ్యాపారం కోసం దేశదేశాలు తిరుగుతూ ఉండేవాడు. అతని కొడుకు యువకుడైన జయసేనుడు. అందగాడు, యుద్ధ విద్యలను నేర్చిన యోధుడు. తండ్రి ద్వారా వాణిజ్య మెలకువలను తెలుసుకొని, తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. కానీ, బుద్ధుడి బోధనల ప్రభావం చేత గృహస్థ జీవితంపై నిరాసక్తుడు అవుతాడు.
ఒకసారి జయసేనుడు తన మిత్రులతో కలిసి కుంటాల జలపాతానికి వెళ్లి, అక్కడ ఒక అద్భుత సౌందర్యరాశిని చూసి.. వైవాహిక జీవనం పట్ల ఆసక్తి చూపిస్తాడు. అది తెలిసి తల్లి సిరిసత్తి చాలా సంతోషిస్తుంది. కొడుకుకు కోడలితో శోభనానికి ముహూర్తం నిర్ణయించి, దూర దేశంలో ఉన్న తన భర్తను తీసుకొని రావడానికి తనవద్ద పనిచేసే పోటిసుడు అనే యువకుణ్ని పంపిస్తుంది.
పోటిసుడు తనతోపాటు పనిచేసే పరిచారిక అలసుద్దిని బలంగా ఇష్టపడుతుంటాడు. ఆమె కూడా పోటిసుని పట్ల ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది. పోటిసుడు తన మనసులోని మాటను అలసుద్దికి చెప్పాలని అనుకుంటుండగానే.. సిరిసత్తి ఈ పని అప్పజెప్తుంది. తప్పనిసరై తన యజమాని కుసుమ శ్రేష్ఠిని తీసుకొని రావడానికి గుర్రం మీద బయలుదేరుతాడు పోటిసుడు.మరొకపక్క ములక రాజ్యంలోని మల్లికా గిరిలో ఉండే రోహ.. తన చెల్లెలు సీహతో కలిసి కుంటాల జలపాతం వద్ద స్నానానికి వెళుతుంది. అక్కడ వాళ్లు స్నానాలు చేస్తుండగా.. ప్రణాలుడు దొంగచాటుగా చూస్తాడు. అది మహా నేరం. ఆ విషయం తెలుసుకున్న మహారాజు.. ప్రణాళునికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. కుసుమ శ్రేష్ఠిని తీసుకొని రావడానికి బయలుదేరిన పోటిసుడు.. మార్గమధ్యంలో కొందరు దొంగలు ఆడవాళ్లను ఎత్తుకొని పోతుంటే అడ్డుకొనబోయి, ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు.
తన తండ్రి సకాలంలో ఇంటికి రాకపోవడంతో జయసేనుడు శోభన కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని.. కుసుమ శ్రేష్ఠిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. మరొకపక్క ప్రణాలుడు అనుకోకుండా రోహ వద్దకు వస్తాడు. ఈ విధంగా అనేక మలుపులు తిరుగుతూ.. ఆనాటి సామాజిక, సాంస్కృతిక జీవనానికి అద్దం పడుతూ ఉత్కంఠ భరితంగా సాగిపోయే అపూర్వ నవల.. అపూర్వ రాగం. ఆలస్యం ఎందుకు అపూర్వరాగంలో
ఓలలాడుదాం రండి.
పోదన నగరం… అస్మక జనపదానికి రాజధాని. దక్షిణ భారతదేశంలో గోదావరి, మంజీరా నదుల దివ్య సంగమ ప్రదేశానికి పూర్వ భాగాన.. అపూర్వ శోభతో వెలిగిపోతున్న అందమైన నగరం. ఒకపక్క పెట్టని కోట గోడలాంటి పర్వతాలు. సాయుధ పాణులై, విచ్చు కత్తులతో, సావధాన చిత్తంతో విధులు నిర్వహిస్తున్న సైనిక సమూహాన్ని తలపిస్తూ.. తల ఎత్తుకొని అస్మకరాజ్య కీర్తిని చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి ఆ కొండలు. అవి కేవలం బండలు కావు. అనేక దట్టమైన తరువులు, లతలు, పొదలు కలిగి, హరిత సంభరితమై, ఆకుపచ్చదనానికి ప్రతీకలై, నానా విధ ఔషధ సంపత్తితో చల్లని గాలులను నిరంతరం అందజేస్తూ.. గంగాఝరీ సౌందర్య రాశిలా సుమధుర మంజుల నాదాలను నినదిస్తూ సాగిపోయే సెలయేళ్ల సమూహంతో జీవ ప్రపంచానికి సంజీవనిలా భాసిస్తూ.. శుక, పిక, సారిక, మయూర, కపోతాది అనేకానేక పక్షుల కలకూజిత ధ్వనులకు ఆలవాలమై.. సారంగ, శశి, వరాహ, భల్లూక, శార్దూల, మహీష, గజ, సింహాది మృగాలతో అలరారుతున్నది. మరొకపక్క అస్మక ప్రజల హృదయ వైశాల్యాన్ని బొమ్మ కడుతున్నట్లుగా సువిశాలమైన మైదాన ప్రదేశం కనువిందు చేస్తున్నది.
భూభాగమంతా భూమిపుత్రుల పవిత్రమైన చెమట స్పర్శతో పులకించి.. పసుపు, అల్లం, జొన్న, గోధుమ, వరి, కంది, శనగ, చెరకు మొదలైన పంటలతో మెరిసిపోతున్నది. అక్కడక్కడా మామిడి, ద్రాక్ష, పనస, జామ తోటలు నవ పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఈ తోటలతోపాటు మల్లెలు, మొల్లలు, పొన్నలు, పొగడలు, కనకాంబరాలు మొదలైన పూదోటలు మంచివాని మనసులా సుగంధాన్ని వ్యాపింప జేస్తున్నాయి. ఇంకొక పక్క అక్కడి జానపదుల అంతరంగ తరంగాలను తలపిస్తూ స్ఫటిక స్వచ్ఛ జలం.. సెలయేళ్లుగా, నదులుగా, కాసారాలుగా, చెరువులుగా, కుంటలుగా, దిగుడు బావులుగా మారి.. వారి జీవనాన్ని అమృతమయం చేస్తున్నది.
పోదన నగరాన్ని ఆవరించి 3,000 మైళ్లలో విస్తరించి ఉన్న జనపదాలలో ప్రజలు ఎంతో అందమైన వాళ్లు, దృఢమైన వాళ్లు.
చామనఛాయ దేహంతో, కండలు తిరిగిన శరీరాకృతితో, మోచేతులు దాటిన అంగీలతో, చేతులకు వెండి కడియాలతో, మెడల్లో పులిగోళ్లు, తాయెత్తులు అలంకరించుకొని, మోకాలు దాటిన పంచెకట్టుతో, మోములో కొట్టొచ్చినట్టు కనిపించే మీసకట్టుతో, తలను మించిన తలపాగా చుట్టుతో, కిర్రు చెప్పులతో, కుడి కాలికి కడియంతో.. మగవాళ్లు మగటిమికి చిరునామాలా వెలిగిపోతున్నారు.
ఆడవాళ్లు మగవాళ్ల కంటే కొంచెం భిన్నంగా… నలుపులో బంగారు వన్నె కలిపిన రంగులో మెరిసిపోతూ తీరుతీరైన కొప్పులతో, అందులో వెండి పూల బిళ్లలతో, మెడలో గుళ్ల పేరులతో, చెవులకు బుగిడీలతో, దండచేతులకు వంకీలతో, మోచేతుల దాకా నిండైన గాజులతో, కాళ్ల కడియాలతో పోటీపడే బరువైన వెండి మంజీరాలతో, చంద్రుణ్నే పరిహసించే గుండ్రని ముఖచంద్రాలతో, ముక్కున బేసరలతో, నుదుట అందమైన తిలకాలతో.. అప్సరస కాంతలను తలపిస్తున్నారు. వారి దేహసౌందర్యం గొప్పదో, హృదయ సౌందర్యం గొప్పదో చెప్పడం కష్టం.
వాళ్ల కన్నులు మగవాళ్ల హృదయాలను నిరంతరం ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయి; నాసికారేఖలు రేయికి చక్కని దారి చూపిస్తున్నట్లు ఉంటాయి; దొండపండు పెదవులు అమృత కలశాన్ని దాచుకున్నట్లు ఉంటాయి; నునుపైన చెక్కిళ్లు పదారు కళల చందమామ తన వన్నెను చిలిపిగా అలికిపోయినట్లు మెరుస్తుంటాయి; చెక్కిళ్లు మగవాళ్ల మునివేళ్లను సవాలు చేస్తున్నట్లు ఉంటాయి; కంఠాలు శంఖాన్ని తలపిస్తుంటాయి; స్తన సంపదలు వైవిధ్యభరితమై వివిధ ఉపమానాలను తలపిస్తుంటాయి; ఉండీ లేనట్లు ఉండే నడుము.. తనను, తనలో ఆనందాన్ని వెతుక్కోమని ఆహ్వానించే నాభీ సంపదలు అక్కడి యువతుల ఆస్తి. వెన్నెలను తలపించే నవ్వులు వాళ్ల అదనపు ఆస్తి.
తండ్రి ద్వారా వాణిజ్య రహస్యాలను సహజంగా అలవరచుకున్న జయసేనుడు.. యుద్ధ విద్యల్లో కూడా ఒడుపు చిక్కించుకున్నాడు. చిన్న వయసులోనే వివాహమైనా అతని భార్య ఇంకా కాపురానికి రాలేదు. అందుకు కారణాలు రెండు. మొదటిది జయసేనుడు బౌద్ధం వైపు
ఆకర్షితుడై కుటుంబ సౌఖ్యం పట్ల ఆసక్తి చూపకపోవడం; రెండోది కుసుమ శ్రేష్ఠి నిరంతరం వ్యాపార కార్యకలాపాల్లో మునిగితేలుతూ తరచూ ప్రయాణాల వల్ల ఇంటికి దూరంగా ఉండటం. అందుకే కొడుకును ఎక్కువ ప్రయాస పెడుతూ గృహ జీవనానికి దూరం
చేస్తున్నానన్న అనుమానంతో కొన్నాళ్ల వరకు ఇంటిపట్టునే ఉండుమని ప్రోత్సహించాడు.
ఇక పల్లెలు…
గోవులు లేని గృహాలు లేవు; పిల్లలు లేని వీధులు లేవు; పశుసంపద లేని జనపదం లేదు; పదాలు పాడని పనులు లేవు; ఘర్మ జలాన్ని అక్కున జేర్చుకోని పొలాలు లేవు; చిరునవ్వులు విరియని కుటుంబాలు లేవు; సంబురాలు నోచుకోని రుతువులు లేవు; ఉత్సవాలు జరుగని పండుగలు లేవు; ఆత్మీయతను పంచని స్నేహాలు లేవు; గౌరవ మర్యాదలను అందుకోని చుట్టరికాలు లేవు; భక్తితో మారుమోగని మందిరాలు లేవు; పెద్దలపట్ల ఆదరం చూపని పిన్నలు లేరు; వెన్నెలలో ఆడుకోని ఆడపిల్లలు లేరు; మునిమనవలను చూడని వృద్ధులు లేరు. అటువంటి 582 జనపదాలకు గుండెకాయ వంటి రాజధాని పోదన నగరం.
నగరంలో రహదారులకు ఇరుపక్కలా బారులు తీరినట్లున్న గృహ సముదాయం. ప్రతి ఇంటికీ విశాలమైన ప్రాంగణం, చిన్నచిన్న పుష్పవనాలు, అందమైన చిత్రాలు అలంకరించిన గోడలు, ఎత్తయిన అరుగులు, అవసరమైన చెట్లు, తీగలు, విశాలమైన గదులు, ధాన్యాగారాలు, పశుసంపద నిండిన పాకలు ఆ నగర శోభను ఇనుమడింపజేస్తున్నాయి. అందులో తూర్పు వీధిలో రాజగృహాన్ని తలపించే ఒక అందమైన విశాలమైన మేడ.
మూడు అంతస్తుల ఆ మేడలో అనేక గదులు ఉన్నాయి. శయ్యా గృహాలు, సౌందర్య శాలలు, అలంకార మందిరాలు, కళారాధన నిలయాలు, ఒక వైపు గృహోపకరణాలు, మరొకవైపు వ్యవసాయ సంబంధమైన పరికరాలు, ఇంకొకపక్క ధాన్యాగారం.
ఈ విలాసవంతమైన భవనంలో ఆగ్నేయం వైపు పాకశాల, దానిని అంటుకొని భోజనశాల, దానికి పక్కనే సమావేశ మందిరం, అతిథి గృహం ఉన్నాయి. మేడకు వెనుక భాగంలో స్నాన ఘట్టాలు, ఉద్యానవనం ఉన్నది. అందులో గులాబీలు, బంతి, చేమంతి, నందివర్ధనం పూలమొక్కలు ఉన్నాయి. ఉత్తరం వైపున శివాలయం ఉన్నది. శివలింగంతోపాటు ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఆ మేడ చుట్టూ కోట గోడ లేకపోవడం వల్ల అది రాజగృహం కాదని గుర్తించగలుగుతారు కానీ.. నిజానికి రాజగృహానికి అది ఏమాత్రం తీసిపోదు. ఈ గృహరాజం ప్రముఖ వ్యాపారస్తుడు అంటే సార్ధవాహుడైన కుసుమ శ్రేష్ఠిది.
కుసుమ శ్రేష్ఠి వ్యాపారం భూమి మీద కంటే సముద్రం పైనే అధికంగా జరుగుతుంది. విలువైన రత్నరాశులతోపాటు అపురూపమైన వస్త్ర సంపదను, అరుదైన పండ్లను, ధాన్యాలను, సుగంధ ద్రవ్యాలను ఆయన క్రయవిక్రయం చేస్తుంటాడు. కుసుమ శ్రేష్ఠి భార్య సిరిసత్తి. నిరంతరం దైవచింతనలో కాలం గడిపే సౌజన్య శీల. ఆ దంపతులు ఎన్నో ఏండ్లు నోచిన నోములు, చేసిన పుణ్యకార్యాలు ఫలించి వరాల మూట వంటి కుమార రత్నం కలిగాడు. అతడే జయసేనుడు. లేకలేక కలిగిన బిడ్డను అపురూపంగా పెంచినా, విద్యాబుద్ధులకు లోటు రానీయలేదు. వినయ విధేయతలకు ఆటంకం కలిగించలేదు.
తండ్రి ద్వారా వాణిజ్య రహస్యాలను సహజంగా అలవరచుకున్న జయసేనుడు.. యుద్ధ విద్యల్లో కూడా ఒడుపు చిక్కించుకున్నాడు. చిన్న వయసులోనే వివాహమైనా అతని భార్య ఇంకా కాపురానికి రాలేదు. అందుకు కారణాలు రెండు. మొదటిది జయసేనుడు బౌద్ధం వైపు ఆకర్షితుడై కుటుంబ సౌఖ్యం పట్ల ఆసక్తి చూపకపోవడం; రెండోది కుసుమ శ్రేష్ఠి నిరంతరం వ్యాపార కార్యకలాపాల్లో మునిగితేలుతూ తరచూ ప్రయాణాల వల్ల ఇంటికి దూరంగా ఉండటం.అందుకే కొడుకును ఎక్కువ ప్రయాస పెడుతూ గృహ జీవనానికి దూరం చేస్తున్నానన్న అనుమానంతో కొన్నాళ్ల వరకు ఇంటిపట్టునే ఉండుమని ప్రోత్సహించాడు. కాబట్టే భరుచ్ఛకానికి తానొక్కడే వ్యాపారపరివారాన్ని వెంటబెట్టుకొని వెళ్లాడు.
వ్యాపారం కోసం తండ్రితోపాటు వెళ్లకుండా ఇంటి పట్టున ఉండటం జయసేనునికి పరీక్షా సమయమే! ఒంటరిగా ఇంటిపట్టున ఉండలేక తరచూ తన స్నేహితులను వెంటబెట్టుకొని వాహ్యాళులతో, వన విహారాలతో, గుర్రపు స్వారీలతో, మల్ల యుద్ధాలతో కాలక్షేపం చేస్తుండేవాడు. ఆరోజు తల్లి అనుమతి తీసుకొని మిత్రులతో వనవిహారానికి బయలుదేరాడు. ఆ విహారం.. అతని జీవితాన్ని అనుకోని మలుపు తిప్పుతుందని ఆ క్షణంలో జయసేనుడికి తెలియదు.
(సశేషం)