‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో విశిష్ట బహుమతి పొందిన కథ.
రాళ్లవాగును ఆనుకుని ఉన్న గుత్తికోయల వెదుళ్ల గుంపులోని ముప్ఫై ఇండ్లవాళ్లు.. ఆదివారం పొద్దు జొరబడుతుండగా దేవరచెట్టు గద్దె కింద జమయ్యారు. కొద్దిసేపు గడిచిన తరువాత అందరూ వచ్చారో, లేదోనని లెక్క సరిచూసుకున్న గుంపు పటేల్ కిడ్మా..
‘అంతా వచ్చినట్టే! ఇంగ మొదలు పెడ్దుమా?’ అన్నట్టు.. గుంపు వెజ్జు డోంగూ దిక్కు చూశాడు.
‘అట్లనే!’ అన్నట్టు డోంగూ కూడా కండ్లతోనే జవాబిచ్చాడు. అప్పుడు నోరు విప్పాడు కిడ్మా..
“సూడండ్రి! అయిటి సినుకు పడనీకి కాలమొచ్చి నెత్తిన కూసుంది. ఆ సినుకేందో పడక ముందట్నే మనకు గాదెల పండుగ జేసుకునె ఆన్వాయితీ ఉంది గద? గా దాన్ని గురిచ్చి మాట్లాడ్దామనే గుంపునంత ఈడ కూడేసినం”.. అంటూ ఏదో చెప్పబోతుండగా, మధ్యలోనే అడ్డుపడ్డది మూలింటి రుక్మా.
“అరె! ఇప్పటికే శానా ఆల్సెం అయ్యింది పటేల్. ఇంక మాతోటి మాట్లాడు డేముంది? పండ్గంటె మాటలా? బొచ్చెడు ఏర్పాట్లు చేసుకొనేదుంటది. సుట్టపక్కాలను పిల్సుకునేదుంటది. పండ్గ కర్సు ఇంటి కెంతైతదో లెక్కజేసి సెప్పురి.. ఐపాయె!” అంటూ తగని హుషారుగా చెప్పుకొచ్చింది.
“సరే మంచిది. అట్లనే!”.. తనలో తాను సన్నగా నవ్వుకుంటూ బదులిచ్చాడు కిడ్మా.
ఖర్చు ఎంత వస్తుందో ముందుగానే లెక్కచేసి పెట్టుకున్న వెజ్జు..
“ముందల అసలు మీ అంతట మీరు ఎవలేమి ఇస్తరో చెప్పండ్రి! అయిటెంక మిగిన్ల కర్సుకోసం ఇంటికెంత పడుద్దో అప్పుడు లెక్కజేద్దాం”.. కూర్చున్నవాళ్ల దిక్కు చూసుకుంటూ లౌక్యంగా అన్నాడు.
కొద్దిసేపు గుంపు అంతా వాళ్లల్లో వాళ్లు గుసగుసలాడుకున్న తరువాత అందరికన్నా ముందుగా తుర్రుం సిడ్మా..
“మా మందల ‘గాదెల దేవర’ పేరు మీన ఎప్పుడో ఇడ్సిపెట్టిన మేకపోతును ఇస్తా!” అన్నాడు.
“నా గున్నల్ల నుంచి ఒక గున్నను ఇస్త!”.. పెద్ద చింతకింద ఉండే ఒంటరి మహిళ సుక్కి వాగ్దానం చేసింది.
“మన గుంపు పోరగాల్లమంత గల్సి పండగనాటి కోసం నాలుగు బానల కల్లు ఒడుపుకొస్తం!”.. గుంపులోని యువకులంతా ఉత్సాహంగా చెప్పుకొచ్చారు.
యువకుల గుంపు ముందు తామూ తగ్గేదేలేదన్నట్టు యువతులంతా చివ్వున లేచి..
“మా మేస్త్రీల కాడ తలో ఐదొందలు అడ్మాన్సు అడుక్కొచ్చి ఇస్తం!”.. రోజూ పాల్వంచ తాపీ పనికి వెళ్లే వాళ్లంతా ఆత్మవిశ్వాసంతో మాటిచ్చారు. అట్లా గుంపులోని వాళ్లంతా పండక్కు కావాల్సిన సరంజామా సమకూర్చుకునేందుకు తమవంతుగా ఏదో ఒకటి ఇస్తామంటూ చేసిన వాగ్దానాలను విన్న పటేల్ కిడ్మా.. లోలోపల ఆనందంతో పొంగిపోతూ..
“మీరంత ఇచ్చినైగాక పైఎత్తున ఎంత కర్సు అయితే అంత నేను పెట్టుకుంట తియ్యిర్రి!” అంటూ, తన పెద్దరికానికి తగ్గట్టు హూందాగా సెలవిచ్చాడు.
పటేల్ మాటలు విన్న వెజ్జు డోంగా..
“అయితే ఇంకేంది? పండక్కి కావల్సినయన్ని ఒనగూడినట్టే! కాబట్టి అచ్చే పున్నమినాడు మన గుంపంతా కలిసి ఆన్వాయితెమ్మటి గాదెల పండుగ జేస్కుందాం!” అంటూ తీర్మానాన్ని ప్రకటించాడు.
పండుగ ఇంకా మూడు రోజులు ఉందనగా, గుంపులోని వాళ్లంతా ఎవరెరు ఏ ఏ వాగ్దానాలిచ్చారో దాని ప్రకారం అందరూ స్వచ్ఛందంగా తీసుకొచ్చి, గుంపు పటేల్ కిడ్మా ఇంట్లో ఒప్పజెప్పారు.
పండుగరోజు పొద్దున్నే లేచిన గుంపులోని వాళ్లంతా.. నేరుగా రాళ్లవాగు దగ్గరికి పొయ్యి స్నానాలు చేసి, ఉతికిన బట్టలు కట్టుకొన్నారు. ప్రతివాళ్లూ తమ గుడిసెల్లోని దొంతుల్లో శుద్ధి చేసి దాచుకున్న రకరకాల ఇత్తనపు గింజల్ని గుప్పెడు గుప్పెడు తీసి, మోదుగాకు దొప్పల్లో పోసి ఉంచారు.
ఆవుల మందలను అడవికి విడిచే వేళకు దేవర గద్దె దగ్గరికి చేరిన యువకులు.. ఒక్కసారిగా ‘తూత్ కొమ్’ (వెండి పొన్నులున్న చిన్న కొమ్ముబూర)తో పరిసరాలు మార్మోగిపోయేలా ఊదసాగారు.
ఆ బూర ధ్వని విన్న గుంపు గుంపంతా ఒక్కసారిగా సంతోషంతో నెమలి పిట్టల మాదిరిగా చిందులు తొక్కుతూ, చిన్నచిన్న వెదురు బుట్టల్లో విత్తనపు గింజలతోపాటు ఇంకా ఏవేవో సామాన్లు సర్దిపెట్టుకొని, తుడుములు కొట్టుకుంటూ ఇండ్ల నుంచి వెలుపలికి వచ్చి.. గుంపు మధ్యనున్న దేవర గద్దె దగ్గరికి చేరుకున్నారు.
అప్పటికే అక్కడ పటేల్, వెజ్జుతోపాటు మరికొందరు గుంపు పెద్దలు గుమిగూడి ఉన్నారు. అన్ని ఇండ్లవాళ్లూ వచ్చారని నిర్ధారణ చేసుకున్న తరువాత కోళ్లు, మేక, పందిగున్న, కల్లు కుండలు, కూర అరటి గెల, కొడవళ్లు, గొడ్డళ్లు మొదలైనవాటిని పట్టుకొని, తుడుం దరువుకు అనుగుణంగా.. ఆడ – మగ, పిల్లలు, యువకులు, వృద్ధులు అన్న తేడాలేకుండా, చిందులు వేస్తూ గుంపు గుంపంతా రాళ్లవాగుకు కూతవేటు దూరంలో ఉన్న పాలచెట్ల వనం వైపుగా కదిలారు.
గట్టిగా నడిస్తే నిండా ఇరవై నిమిషాలు కూడా పట్టని ఆ దూరాన్ని చేరడానికి వాళ్లకు దాదాపు గంటకు పైగానే పట్టింది.గుంపు వనానికి చేరిన వెంటనే కొంతమంది యువతీ, యువకులు తాము తీసుకుపోయిన కొడవళ్లు, గొడ్డళ్లతో ఓ పెద్ద పాలచెట్టు కింద నిలబెట్టి ఉన్న.. ఏనాటిదో? ఏ అమ్మ తల్లికి ప్రతిరూపమో! తెలియని ఓ శిథిల స్త్రీమూర్తి రాతి శిల్పం చుట్టూ.. మొక్కా, మోడు, చెత్తా చెదారాన్ని నిమిషాల్లో చెలిగి పారేసి, ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేశారు.
అంతలోనే కొంతమంది నడి వయస్కులు కొడవళ్లు తీసుకుని, అక్కడికి కొద్ది దూరంలో గుర్రపునాడ ఆకృతిలో ఒంపుతిరిగి ప్రవహిస్తున్న రాళ్లవాగు ఒడ్డునున్న ఈతచెట్ల నుంచి ఓ బిర్రు పిడికెడు ఈత మెల్లెల్ని చెలుక్కొచ్చి వెజ్జు ముందు పడేశారు. అతనికి తోడుగా మరి కొంతమంది వృద్ధులు కూడా జతకలిసి, కొడవళ్లు తీసుకుని ఆ ఈత మెల్లెల్ని సన్నగా చీల్చి పక్కన వెయ్యసాగారు.
అంతలోనే మరికొంత మంది.. దేవరకు ఎడమ పక్కన అడుగు కైవారంతో గడ్డపారతో మూడుచోట్ల చిన్నచిన్న గాతాలు వేశారు. గాతాలు వేసిన వాళ్లు పక్కకు తప్పుకోగానే, మరి కొందరు బొటనవేలి లావుతో, రెండు అడుగుల పొడవుతో ఉన్న పాలచెట్ల కొమ్మల్ని నరుక్కొచ్చి ఆ గాతాల్లో బలంగా గుచ్చి గట్టిగా కూరారు.
ఆ వెంటనే పటేల్, వెజ్జు మరికొంత మంది కలిసి, పాతిన పాలకర్ర ముక్కలను కలుపుతూ.. తడిక అల్లినట్టు అల్లసాగారు. ఐదే ఐదు నిమిషాల్లో చిత్రంగా అవి పూర్వకాలం గ్రామాల్లోని పెద్ద పెద్ద భూస్వాముల ఇండ్లముందు ధాన్యాన్ని నిల్వ ఉంచే గుమ్ముల మాదిరిగా రూపుదాల్చాయి.
అదే సమయంలో మరికొంత మంది కూర అరటి గెల నుంచి కాయలను విడిపించి, కూర వండటం కోసం చక్రాల మాదిరిగా తరిగి, టేకు ఆకుల విస్తళ్ల మీద కుప్ప పోయసాగారు.మరి కొంతమంది యువకులు గొడ్డళ్లతో ఓ పాలచెట్టు నుంచి నాలుగు బడితెలను, నాలుగు గుంజలను కొట్టుకొచ్చి.. దేవరపైన నాలుగు అడుగుల వెడల్పు, ఐదు అడుగుల పొడవున పందిరి వేశారు. మిగిలిపోయిన మండల్ని ఆ పందిరి మీద కప్పుగా పరిచారు.
ఇంతలో కొంతమంది యువకులు మెడల్లో పెద్దడోళ్లు వేసుకుని, తలల మీద కొమ్ము తలపాగాలు పెట్టుకొని దేవర చెట్టు చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఉంటే.. వారితోపాటు జతగలిసిన కొంతమంది యువతులు ఒకరి నడుముల మీద మరొకరి చేతులు వేసి వల యాకారంలో నిల్చి, వెనక్కి – ముందుకు అడుగులు వేస్తూ.. లేడిపిల్లల్లా చురుగ్గా కదులుతూ, కోకిలల్లా పాడుతూ తమను తాము మరిచిపోసాగారు. వారిని వారు మరిచిపోవడమే కాదు.. వారి నర్తనానికి, గానానికీ పులకించిపోయిన సమీపంలోని చెట్టూ చేమలన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయి, వారి దిక్కే చూస్తున్నట్టుగా నిల్చిపోయాయి.
వెజ్జుతోపాటు మరికొందరు వృద్ధులుకూడా కలిసి గాదె దేవరను పసుపు, కుంకుమలతో అలంకరిస్తుంటే.. మరికొంత మంది ఎడంగా వెళ్లి, పొయ్యిని పొందించి, దానిమీద చిన్న రాతెండి సర్వలో అన్నం వండుతూ.. అందులోనే ఐదారు కోడిగుడ్లను కూడా వేశారు. కొంత సేపటికి అన్నం ఉడికిన తరువాత సర్వను దించి కిందపెట్టారు. అన్నంతోపాటే ఉడికిపోయిన గుడ్లను బైటికి తీసి, వాటి మీది పెంకుల్ని పక్కనే ఉన్న రాతి కేసి పగులగొట్టి వలిచి, టేకు ఆకుల విస్తరిలో ఉంచారు. ఆ తరువాత సర్వలోని అన్నాన్ని మొత్తం వేరే విస్తర్లోకి తోడి ఓ పక్కన పెట్టారు. ఇంతలో ఇద్దరు యువకులు రెండు అరకోడి పుంజుల్ని దేవరముందు కొడవలితో మెడలు తప్పించి.. చితుకుల మంట మీద బూరుతోపాటే కాపి శుభ్రం చేసి, ముక్కలు కొట్టిన తరువాత పొయ్యిమీద కెక్కించిన కూర సట్టిలో వేసి.. పావుగంటలో కూర వండి తీసుకొచ్చి దేవర ముందు ఉంచారు.
అట్లా తయారుచేసిన అన్నాన్ని, కోడికూరను, గుడ్లను దేవర ముందుంచి ధూపం వేసిన వెజ్జు.. సీసాలో పట్టుకొచ్చిన ఇప్పసారాను వారబోసి నైవేద్యం పెట్టి అక్కణ్నుంచి పక్కకు తప్పుకొన్నాడు. ఆ వెంటనే కొంతమంది పందిగున్నను, మేకపోతును దేవరముందు ‘బలి ఇచ్చి’ తీసుకుపోయి, వాటిని ముక్కలుగా తరిగేవాళ్లు తరుగుతుంటే.. అన్నం, అరటికాయ కూర వండేవాళ్లు వండుతూనే ఉన్నారు.
దేవర ముందు నుంచి వెజ్జు తప్పుకోగానే.. అప్పటిదాకా చుట్టూ ఉన్న చెట్లకింద కూర్చుని ఆటపాటల్తో దేవర చెట్టు కింద జరుగుతున్నతంతునంతా చూస్తున్న గుంపంతా లేచి వచ్చి దేవరకు మొక్కి పోసాగింది. మొదలు పెట్టినప్పటి నుంచీ డప్పుల దరువు, నృత్యం ఆగకుండా నడుస్తూనే ఉన్నాయి.
సమయం ఎంత గడిచి పోతున్నదన్న స్పృహ కూడా లేకుండా అక్కడున్న వాళ్లంతా ఆ కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. మరికొంతసేపటికి కొంతమంది వృద్ధులు, పదిపన్నెండేండ్లలోపు పిల్లలు ఒక్కొక్కరే లేచి.. తమ ఒంటిమీది చొక్కాలను విప్పి, దేవర చెట్టు ముందు వేసిన పందిరి కిందికి చేరుతుంటే.. ఇద్దరు ముగ్గురు యువకులు పందిరిని ఆనుకుని ఉన్న దేవరచెట్టు కొమ్మలమీదికెక్కి కూర్చున్నారు.
అంతలోనే కొంతమంది ముత్తయిదువులు పసుపునీళ్ల కడవలు ఎత్తుకొచ్చి, చెట్టు కొమ్మల్లోకెక్కి కూర్చున్న యువకులకు అందించారు. నీళ్ల కడవల్ని అందుకున్న యువకులు వాటిలోని నీళ్లను పందిరి మీద చల్లుతుంటే.. ఆ నీళ్లు ఆకుల మధ్య నుంచి బిందువులు, బిందువులుగా కిందికి జారుతూ.. పందిరి కింద ఉన్నవాళ్లను తడపసాగాయి. దాంతో వాళ్లంతా చిత్రవిచిత్రంగా పెద్దపెద్ద కేకలు వేస్తూ చిందులు వేయసాగారు. ఎప్పుడైతే ఆ కార్యక్రమం ఆరంభమయ్యిందో.. ఆ క్షణం నుంచే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అక్కడున్న వాళ్ల శరీరాలు అప్రయత్నంగా కంపించిపోసాగాయి. గాలి స్తంభించిపోయింది. వాళ్ల అరుపులు, కేకలు తప్ప.. ఆ పరిసరాల్లో పిట్ట కీచుమన్న శబ్దం కూడా వినిపించకుండా పోయింది.
ప్రకృతిని ఆవాహన చేస్తూ వాళ్లు కొలుస్తున్న కొలుపునకు ఏదో అదృశ్య శక్తి అక్కడి కొచ్చి ఆ పరిసరాల్లో సంచరించిపోయిన అనుభూతికి ప్రతివారూ లోనయ్యి, నిర్వచించడానికి వీలుకాని ఓ చిత్రమైన ఉద్విగ్నితకు గురయ్యారు. ఆ పరిస్థితి ఎంత వేగంగా మొదలయ్యిందో.. అంతే వేగంగా అంతమైపోయింది.
పందిరి మీదినుంచి పసుపు నీళ్లు పడటం ఎప్పుడైతే ఆగిపోయిందో.. అప్పుడే పందిరి కింద ఉన్నవాళ్ల అరుపులు, కేకలు వాటంతటవే ఆగిపోయాయి. పందిరి కింద నుంచి బయటకొచ్చిన వాళ్లంతా ఏదో నిస్ర్తాణకు లోనైనట్టు ఎక్కడి వాళ్లు అక్కడ కూలబడి పోయారు. ఆ మరుక్షణమే వెజ్జుతోపాటు మరికొందరు వృద్ధులు సారా తీసుకొచ్చి గబగబా గ్లాసుల్లో పోసి, చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా వాళ్లందరికీ అందించారు.
ఆ సారాయి తాగిన కొద్దిసేపటికి చిత్రంగా వాళ్లంతా ఏదో మత్తులో నుంచి బయటకొచ్చినట్టు మామూలు మనుషులుగా మారిపోయారు. కొంతమంది మహిళలు మోదుగాకులతో డొప్పలు కుట్టి పక్కన పెట్టసాగారు. ఇంతలో.. మూడు పొయ్యిల మీద అన్నంతోపాటు అరటికాయ, యాటపోతు, నల్లదాని కూరలు కూడా ఉడికాయన్నట్టుగా.. వంటగాళ్లు సైగలు చేశారు. ఆ సైగలు అందుకున్న తక్షణమే గుంపులోని ఇంటి కొకరు చొప్పున మోదుగాకు దొప్పల్ని పట్టుకొని వరుస క్రమంలో దేవరచెట్టు కిందికొచ్చి నిల్చున్నారు. అక్కడ తయారుగా కూర్చున్న వెజ్జు అంతకుముందు ఈత మెల్లెల వేనెలతో అల్లిన గుమ్ముల్లోని విత్తనాలను గుప్పెడు గుప్పెడుగా తీసి ఒక్కొక్కరి చేతుల్లోని డొప్పల్లో పోస్తుంటే.. అవి పట్టుకొన్నవాళ్లు పక్కకు తప్పుకోసాగారు. అట్లా పక్కకు తప్పుకొన్న ప్రతివాళ్లూ మరొకరితో తరగని ఆనందంగా..
“దేవర గాదెల్లో నుంచి తీసిచ్చిన ఈ ఇత్తనాలను పదిలంగ తీస్కపొయ్యి మన ఇండ్లల్లోని గాదెల్ల ఉన్న ఇత్తనపు గింజల్ల కలుపుకోవాల. ఆయిటి చినుకు పడంగనె ఆ ఇత్తనాల్ని తీస్కపోయి భూమిల జల్లితే.. ఆ భూమి తల్లి పిడికెడు గింజలకు కుండెడు గింజల్ని మనకిస్తది” అంటూ గొప్ప నమ్మకంతో చెప్పుకొని తెగ మురిసిపోసాగారు.
అందరికీ విత్తనాలు అందాయని తెలిసిన తరువాత దేవర గుమ్ముల్లో అడుగున మిగిలిన విత్తనాల్ని గీసి గీసి ఎత్తుకొని, తన డొప్పలో నింపుకొన్న వెజ్జాయన దేవరకు పెట్టిన బోనాన్ని అక్కడే ఉంచి చెట్టు కిందినుంచి లేచాడు. ఆయన చెట్టు కింద నుంచి లేచిన తక్షణమే అప్పటిదాకా నిర్విరామంగా మోగిన డోళ్లు, చిందేసిన కాళ్లూ నిలిచిపోయాయి.
వెజ్జుతోపాటు మిగిలిన వాళ్లంతా పొడిబట్టలు కట్టుకున్న తరువాత వంటగిన్నెలు, సారా క్యాన్లు, కల్లు బానల్తోపాటు అక్కడ మిగిలిపోయిన అన్ని వస్తువులనూ తలోటి చేతబట్టుకొని.. మళ్లీ వచ్చే ఏడాది గాదెల పండుగ దాకా పాపం! ఆ దేవరను అక్కడే ఒంటరిగా వదిలేసి రాళ్లవాగు దారిపట్టారు. గుంపులోని వయసుకొచ్చిన యువతీ – యువకులు చిలిపిమాటల తురాయిపూలను రువ్వుకుంటూ, కొంటెచూపుల ప్రేమబాణాలను సంధించుకుంటూ.. నడివయస్కులు, కుటుంబ భారాన్ని మోస్తున్న ఇంటిపెద్దలు రేపు ఆయిటి చినుకు తోటి రానున్న కొత్త యాడాది ఎట్లుంటదో ఏమోనన్న ఆలోచనతో.. ముసలివాళ్లు మళ్లొచ్చే గాదెల పండుగ కండ్ల జూస్తమో లేదో అనుకుంటూ.. వయసులవారీగా గుంపులు కట్టి వాగు ఒడ్డుకు సాగిపోయారు.
పావుగంటలోపల గట్టిగా చేయి చాపితే వాగు నీరు అందేంత దగ్గరగా.. మెత్తటి ఇసుకలో ఆడవారు ఒక వరుసలో, మగవారు ఒక వరుసలో పిల్లా జల్లల్తో సహా బారుగా కూర్చున్నారు. కొంతమంది యువకులు వరుసల్లో కూర్చున్న వాళ్లందరికీ చిన్నాపెద్దా తేడా లేకుండా.. ముందుగా వాళ్లు ఇండ్ల దగ్గర్నుంచి తెచ్చుకున్న గ్లాసుల్లో కల్లు, గిన్నెల్లో తునకలు వడ్డించారు. ఇక దాంతో అందరూ తాగుతూ తింటూ.. సాగిపోతున్న వాగునీటి సాక్షిగా, ఫారెస్ట్ వాళ్ల దాడుల నుంచి ముందుముందు తమను తాము ఎట్లా నిలబెట్టుకోవాలో, భవిష్యత్తు జీవితాన్ని ఎట్లా నిర్మించుకోవాలో మాట్లాడుకోసాగారు. కల్లు బానలు ఖాళీ అయిన తరువాత సారాయి అందించారు. అదీ అయిపోయిన తరువాత విస్తర్లు వేసి అన్నం, అరటికాయ కూరల్తోపాటు అప్పటిదాకా నంజుడుకు పోగా మిగిలిన మాంసం కూరను కూడా వడ్డించారు.అయితే, అప్పటికే మత్తు నెత్తికెక్కిన వాళ్లంతా ఆకుల్లోని అన్నాన్ని, కూరల్ని నేలపాలు చేస్తూ, రాగాలు తీస్తూ, నోటికొచ్చిన లల్లాయి పాటలు పాడుతూ.. తాత్కాలికంగా తమ ఇబ్బందుల్ని మరిచిపోయి, పండుగ సంతోషంలో మునిగిపోతూ.. కఠినమైన వాస్తవ ప్రపంచానికి దూరంగా కలల లోకంలో విహరించసాగారు.
సరిగ్గా అదే సమయంలో వాగుకు ఆవలి ఒడ్డున అటువంటి అవకాశం కోసమే చాలారోజులుగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అటవీశాఖ ఉన్నతాధికారులు, వారి సిబ్బంది, పోలీసుల రక్షణ వలయంలో ఆ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం అతి త్వరలో ప్రభుత్వం వారు నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి అడ్డంకిగా ఉన్న వెదుళ్ల గుంపును ఆనవాలు లేకుండా చిదిమి వెయ్యాలన్న ఉద్దేశంతో.. బుల్డోజర్లను, ఎక్స్కవేటర్లనూ తీసుకుని వస్తున్నారు.
“దేవర గాదెల్లో నుంచి తీసిచ్చిన ఈ ఇత్తనాలను పదిలంగ తీస్కపొయ్యి మన ఇండ్లల్లోని గాదెల్ల ఉన్న ఇత్తనపు గింజల్ల కలుపుకోవాల. ఆయిటి చినుకు పడంగనె ఆ ఇత్తనాల్ని తీస్కపోయి భూమిల జల్లితే.. ఆ భూమి తల్లి పిడికెడు గింజలకు కుండెడు గింజల్ని మనకిస్తది”
శిరంశెట్టి కాంతారావు రచనలో వైవిద్యాన్ని ప్రదర్శిస్తూ.. రాసిన ప్రతి నవలకూ ఏదో ఒక పురస్కారాన్ని అందుకున్నారు శిరంశెట్టి కాంతారావు. వీరి స్వస్థలం సూర్యాపేట (ఉమ్మడి నల్లగొండ) జిల్లాలోని ఫణిగిరి. క్రీ.పూ. నుంచి బౌద్ధమత క్షేత్రంగా పేరెన్నిక గల గ్రామం. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత పాల్వంచలోని ఎన్ఎండీసీ లిమిటెడ్ స్పాంజ్ ఐరన్ యూనిట్లో ఉద్యోగం చేశారు. పదవీ విరమణ అనంతరం.. అక్కడే స్థిరపడ్డారు. 2003 నుంచి కథలు రాస్తున్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో సుమారు 350 కథల దాకా.. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు ఆరు కథా సంపుటాలు, ఒక హిందీ కథా సంపుటి (వీరి కథల అనువాదంతో), ఐదు నవలలు వెలువరించారు. వీటితోపాటు అనేక అముద్రిత కథలు, నవలలు, ట్రవెలాగ్స్, వ్యాసాలు రచించారు. ఉమ్మడి రాష్ట్రస్థాయిలో వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కథానికా పోటీల్లో సుమారు 70 కథలకు బహుమతులు అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారంతోపాటు తెలంగాణ అకాడమీ నిర్వహించిన నవలల పోటీలోనూ బహుమతి దక్కించుకున్నారు.
– శిరంశెట్టి కాంతారావు 98498 90322