Jaya Senapathi | జరిగిన కథ : కృష్ణమ్మ ఉప్పెనలో కొట్టుకొని పోయిన జాయపుడు, మువ్వ.. చచ్చిబతికి, కూసెనపూండి అగ్రహారం మాదిగవాడకు చేరుకున్నారు. మిత్రుడు పరాశరుడితోపాటు తమ్ముని కోసం పృథ్వీశ్వరుడు నియమించిన పల్లికేతు, విక్రమ.. జాయపుణ్ని వెతుక్కుంటూ వచ్చారు. తన యోగక్షేమాలతోపాటు తనను రక్షించినవారిని వదిలివెళ్లడం ఇష్టంగా లేదనీ, ఆరోగ్యం కుదుటపడ్డాక వస్తాననీ పల్లికేతు ద్వారా అన్న పృథ్వీశ్వరుడికి తెలియజేశాడు జాయపుడు. వాడవాసులకు తాను జగన్నాథుడని, అనుమకొండవాసిననీ చెప్పాడు.
ఆరోగ్యం కుదుటపడే వరకూ అక్కడే ఉండి ఆ సమయాన్ని యక్షగానాలు, నాట్యరూపకాల రచనకు ఉపయోగించాలని అనుకున్నాడు జాయపుడు. పరాశరునితో తాళపత్రాలు, ఘంటాలు, సిరా పిడతలు తెప్పించుకున్నాడు. ఆ కూసెనపూండి గ్రామంతో తన కళాజీవితం పెనవేసుకుంటున్నదని.. ఇక్కడే తానొక మహాకళాక్షేత్రాన్ని నిర్మించబోతున్నానని జాయపుడు ఊహించలేదప్పుడు.
* * *
పర్ణశాలకు కాస్త ఆవలగా గజ్జెలసవ్వడి! ఏదో నాట్యాభ్యాసం, నాట్యశిక్షణ లాంటిది జరుగుతున్నట్లు వినిపిస్తున్నది. కాస్త ఓపిక చేసుకుని మెల్లగా పర్ణశాల బయటికి వచ్చి, అటుగా పోతున్న వ్యక్తిని అడిగాడు జాయపుడు.
“ఆ గజ్జెల శబ్దం ఏమిటి?” అని.
“ఇది బాగోతుల కూసెనపూండి గందా. ఆ బాగోతుల సిద్ధయ నాట్టెం నేర్పుతాడుగా..” చెబుతూ వెళ్లిపోయాడు. జాయపుడు మెల్లగా కుంటుకుంటూ ఆ గజ్జెలసవ్వడి వినవచ్చిన వైపుగా వెళ్లి.. అగ్రహారంలో నాట్యాభ్యాసం జరుగుతున్న గృహాన్ని గుర్తించాడు. గజ్జెలశబ్దం, నట్టువాంగం, ఓ పాట.. గాలితో కలగలిసి వీధులవెంట ప్రవహిస్తూ చిందులు వేస్తున్నది. చక్కగా అలికి ముగ్గులుపెట్టిన మట్టి అరుగుపై కూర్చుని నాట్యానికి కూర్చిన పాటను వింటూ నాట్య భంగిమలు ఊహిస్తున్నాడు.
నాట్యగురువు శిష్యులకు కొన్ని కిటుకులు చెప్పడం వినిపిస్తున్నది. అనంతరం పిల్లలు గోలగోలగా అరుచుకుంటూ బయటికి పరుగులు పెట్టారు. తర్వాత బయటికి వచ్చాడు నాట్యగురువు సిద్ధయ. మీగడ వర్ణపు ధోవతిపై వెండివర్ణపు పట్టుకండువా వల్లెవాటుగా ధరించి, విశాలమైన నుదుట తిరునామం, నున్నగా దువ్వికట్టిన శిఖతో నాజూకు శరీరంతో నవనవలాడుతూ ముప్ఫైలలో ఉన్న యువకుడతను. జాయపుణ్ని చూసి..
“అరెరే.. బయటే కూర్చున్నారు. తమరెవరో మహాపురుషుల్లాగా ఉన్నారు?” అన్నాడు ప్రశ్నార్థకంగా.
జాయపుడు మాత్రం ఎక్కువమంది పిల్లలు బ్రాహ్మణ ఆహార్యంలో ఉండటం చూస్తున్నాడు.
“పురుషుణ్నే కానీ మహాపురుషుణ్ని కాను..” అంటూ నవ్వాడు.
“నా పేరు జగన్నాథుడు. అనుమకొండ నివాసిని. నంగెగడ్డలో బంధువులు ఉంటే చూసిపోవడానికి వచ్చి ఉప్పెన బారినపడి ఇక్కడ తేలాను!”.
“ఆ వ్యక్తి తమరేనా!? విన్నాను. అయితే అనుమకొండ వారన్నమాట. ఆగండాగండి ఆసనం తెస్తాను!”.
“వద్దొద్దు. ఇంతకన్నా ఉన్నతాసనం ఉంటుందా?” అంటూ బాసింపట్టును పద్మాసనంలోకి మార్చాడు జాయపుడు.
“నాపేరు సిద్ధయ. ఊరివాళ్లు భాగోతుల సిద్ధయ అంటారు” చెబుతూ జాయపుని ముందు
చతికిలబడ్డాడు.
‘తిరునామం పెట్టుకున్నవాళ్లను ‘భాగవతులు’ అంటూండటం ద్వీపరాజ్యంలో మరీ ఎక్కువగా వినిపిస్తున్నదే!’ అనుకున్నాడు జాయపుడు.
“ఇదేమిటి.. మీ విద్యార్థులంతా బ్రాహ్మణులేనా.. ఇతరులకు నేర్పరా??!”.
“అందరూ నాపై చేసే విమర్శ అదే. ఇది పూర్తిగా బ్రాహ్మణ అగ్రహారం. ఇది పాతికగృహాల గ్రామంగా ఉన్నప్పుడే అప్పటి పాలకుడు రాజేంద్రచోళుడు ‘కూసెనభట్టు’ అనే ఉపాధ్యాయునికి దానం చేశారు. ఇక్కడి కులీనరైతులు పంట సాగుచేసి ధాన్యంవాటాను అగ్రహార వారసునికి ఇస్తారు కానీ, పిల్లలను చదువులకే పంపరు. ఇక నాట్యం అంటే మక్కెలు విరగ్గొడతారు. ఆసక్తిగల పిల్లలు కొందరున్నా.. వాళ్లూ నిత్యమూ తరగతులకు రారు. అందువల్ల చదువే ఏకైకవృత్తిగా గల బ్రాహ్మణ పిల్లలే ఎక్కువగా వస్తారు. అందువల్లనేమో కూసెనపూండిని అందరూ భాగోతుల కూసెనపూండి అంటున్నారు”.
మరో వాస్తవం చెప్పాడు భాగవత సిద్ధయ.
“పంచముల పిల్లలకు కళలంటే ఆసక్తి ఉన్నా.. సామాజిక కట్టుబాట్లు ప్రధాన అడ్డంకి. అగ్రహార పెద్దలు కూడా దైవదత్తమైన కళను పంచములకు నేర్పడం అంతగా ఇష్టపడరు. ఎవరికైనా నాట్యం నేర్పడానికి నా గృహం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇన్ని సామాజిక కట్టుబాట్ల మధ్య తరగతికే రానివారికి నాట్యం నేర్పలేను కదా!?”.
అనుభవంతో ఆయన చెప్పినదాంట్లో వాస్తవం ఉంది.
“ఓ రహస్యం.. మనసులో పెట్టుకోండి. నాట్యంపట్ల ఆసక్తి ఉన్న పంచముల పిల్లలకు జంధ్యంవేసి నాట్యం నేర్పుతుంటాను. ఇది చాలామంది గురువులు చేసేపనే! ఆసక్తి ఉన్నవాడికి చెప్పాలన్న దురద గురువులకు ఉండటం సహజం. ఇది తాతల కాలంనుంచి ఉన్న అనుభవమే. ఇప్పుడు గొప్ప నాట్యాచార్యులుగా గుర్తింపు పొందుతున్నవారిలో ఈ తరహా పంచములు కూడా ఉన్నారని మీకు తెలిసి ఉండొచ్చు!”.
ఆశ్చర్యపోయిన జాయపుడు సిద్ధయతో కలిసి భళ్లున నవ్వాడు అంగీకరిస్తున్నట్లు. అతనికి మువ్వ గుర్తొచ్చింది. ఈయన మువ్వను చూస్తే తప్పక నాట్యం నేర్పేవాడేమో.. కానీ ఆమెకు జంధ్యం వెయ్యడం ఎలా!?.. మళ్లీ నవ్వు తన్నుకురాగా లేచి నమస్కరించాడు.
“సంతోషం మీ పరిచయం. రేపు మీ నాట్యాభ్యాసం చూడటానికి అనుజ్ఞ ఇవ్వండి”.
“అయ్యయ్యో.. రేపే మేము దక్షిణాదికి వెళ్లబోతున్నాం. దాదాపు రెండుమాసాల తర్వాత తిరిగి గ్రామం చేరతాం. అప్పుడు తమరు మా ప్రదర్శనను మీకు చూపే అవకాశం మాకు ఇవ్వండి..” అన్నాడు.
“అలాగా!? నాకూ మరిన్ని పనులున్నాయి. లేకుంటే మీతోనే వచ్చేవాణ్ని!” అంటూ.. అతణ్ని సంతోషపుచ్చి వెనుతిరిగాడు. తర్వాత తర్వాత రాజబంధువు జగన్నాథునికి, గొప్ప నాట్యకారుడు, నాట్యగురువు సిద్ధయకు మధ్య అపూర్వ స్నేహం, అనుబంధం ఏర్పడ్డాయి.
గుంపులుగా వివిధ సామాజికవర్గాలు వేరువేరు రాజ్యాలకు, మండలాలకు, నాడులకు తరలిపోవడం ఇప్పుడు సర్వసాధారణం. ముఖ్యంగా బ్రాహ్మణులు, పండితులు ఎక్కడ పాలకుల అనుగ్రహం ఉందని తెలుస్తుందో.. అక్కడికి వెళ్లిపోతుంటారు. పంచాణంవారిని అనేక రాజ్యాలవారు నెత్తిన పెట్టుకుంటారు. సేవావృత్తులైన చాకలి, మంగలివాళ్ల కోసం చాలాగ్రామాల రట్టలు బాజాభజంత్రీలతో ఆహ్వానాలు పలుకుతుంటారు. కరువు కాలంలో, అంటువ్యాధుల కాలంలో రైతులు, రైతుకూలీలు దూరరాజ్యాలకు వెళ్లడం కద్దు. రాజాశ్రయమే ముఖ్యమైన ప్రదర్శన కళాబృందాలు సంచారజాతుల్లా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. వెలనాడు సంపద్వంతమైన రాజ్యం కావడంతో రైతులు, కూలీలు, వృత్తులవారి కంటే కళాకారబృందాలే ఎక్కువగా వస్తూ పోతూ బాగా సంపాదిస్తుంటారని చెప్పుకొంటారు.
రాజు తర్వాత సమాజం పూజించేది కవి పండితులను, నాట్యకారులను అని చెప్పుకొన్నా.. అది జనాభాలో పది శాతమే. తొంభైశాతం జనాభా కళలను ఆరాధిస్తారు కానీ, కళాకారులు కావడానికి వారికి సమయం లేదు. ముఖ్యంగా వాణిజ్యంతో, వ్యవసాయంతో సంపద్వంతమైన వెలనాడు లాంటి రాజ్యాలలో.
“గొడ్లను మేపుకోవాలి. పొలంలో బోలెడు పని ఉంది!”..
“ఉప్పుడు కాదు. నాయన ఊరుకోడు.. తంతాడు!”..
ఈ సమాధానాలే.. ఎవ్వర్ని అడిగి చూసినా!
* * *
తెలతెలవారుతున్నది. వెచ్చని ఉషోదయ పవనాలు గోరింటాకు వర్ణపు భానుకిరణాలను తెచ్చి నిద్రిస్తున్న జాయపుని బుగ్గలకు గోరింటాకు పెడుతున్నాయి. దగ్గరగా ఓ గాత్రం.. తంబుర నాదంతో మేళవించి.. వీధివీధంతా ప్రతిధ్వనిస్తున్నది.
శివా.. శివోహం! కేశవా.. నమోహం!!
శివ కేశవులకు భేదమా.. సుజ్ఞానవంతులకు వాదమా..
శివా.. శివోహం! కేశవా.. నమోహం!!
పులిచర్మము కట్టే లింగడు.. పట్టు వస్ర్తాలు కట్టే రంగడు..
ప్రేమ బూడిద రాసే లింగడు..
పట్టె నామాలెట్టే రంగడు.. ॥ శివ ॥
ఎద్దు నెక్కినవాడు లింగడు.. గ్రద్ద నెక్కినవాడు రంగడు..
పాము పాగా చుట్టే లింగడు.. పాముపైనే పవ్వళించె రంగడు.. ॥ శివ ॥
కైలాసగిరి పైన లింగడు.. వైకుంఠపురమందు రంగడు..
శివ కేశవులకు భేదమా.. సుజ్ఞానవంతులకు వాదమా..
శివా.. శివోహం!.. కేశవా.. నమోహం!!
చెళ్లున చరచినట్లయ్యింది. లేచి వేగంగా బయటికి వచ్చాడు. ఓ భిక్షుక గాయకుడు.. తలకు తలపాగా, చిరుగుల కంచుకం, భుజాన జోలె, ముఖాన నిలువు అడ్డబొట్లు, వెలుగుతున్న గరుడ కమ్ము (ఎత్తుదీపం) ఓ చేతిలో, మెడలో పెరికెతాడు కట్టిన ఇత్తడి పళ్లెరంపై కర్రతో శబ్దం చేస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ.. భిక్షాటనతో దీవెనలు ఇస్తూ పాడుకుంటూ పోతున్నాడు. హరిహర తత్వగీతం!.. తెలుగు ప్రాంతాలలో వేగంగా విస్తరిస్తున్న మరో మతకోణం! తిక్కనామాత్యులు తదితరులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారని విన్నాడు.
అరె.. ఈ అంశం తెలిసినా ఎలా తన మనసు నుంచి తప్పుకొన్నది!?
అతని వెనకే వెళ్లి ఆ తత్వగీతం పూర్తిగా విన్నాడు.
“ఆయన మాల దాసరిగాడు. భలే భలే పాటలు కడతాడు!”.. జాయపుని ఆశ్చర్యం చూసి పొదుంపుల్ల నోట్లో పెట్టుకున్న పౌరుడొకడు వివరణ ఇచ్చాడు. కాస్త ఆవలగా ఇలాగే ఏదో పాడుకుంటూ మరొక దాసరి.. దూరంగా మరొకడు. అక్కడెక్కడో మరో దాసరి గీతం! కాస్త పులకింత కలిగింది జాయపునికి.
“అతడు.. ఆ దాసరి ఎక్కడుంటాడు?” అడిగాడా పొదుంపుల్లను.
“అటు పో.. గడ్డిపాడు దాటిపో! ఆడ పెద్ద రాయిసెట్టు ఉంటది. ఆడ గుడిసెలుంటయ్. అందరూ దాసరిగాళ్లే! ఇప్పుడంతా అడుక్కోడానికి పోతారు. పొద్దుగుంకే యాలకు వత్తారు!”.
రోజంతా అస్థిమితంగా గడిపి పొద్దుగుంకే వేళకు గడ్డిపాడు అవతలనున్న ఆ రావిచెట్టు వద్దకు వెళ్లాడు. ఉప్పెన సమయంలో నిలిచిన నీటిచలమ ఎండిపోగా.. తిరిగి తేలిన మెరక నేల అది. సంచారజాతుల చిన్నచిన్న తాత్కాలిక గుడిసెలు. ఆడవాళ్లూ, పిల్లలూ ఉన్నారు. మగవాళ్లు ఎవ్వరూ లేరు. గ్రామ భిక్షాటన నుంచి రాలేదనుకుంటా. రావిచెట్టు మొదట్లోనున్న దిమ్మెపై కూర్చున్నాడు. జాయపునిలాంటి ఆకర్షణీయ విగ్రహం అక్కడ కనిపించడం ఆ మహిళలకు అబ్బురంగా ఉంది. గుడిసెల్లోంచి తొంగి చూస్తున్నారు.
అది అలవాటైన జాయపుడు తలవొంచుకుని కూనిరాగం తీస్తూ కూర్చున్నాడు. కాస్త అవతలగా మరో రావిచెట్టు. దాని మొదట్లో చిన్నగూడులా ఓ గుడి. అందులోంచి ఎవరో గ్రామదేవత అనుకుంటా.. దూరానికి కూడా పెద్దపెద్ద కళ్లు.. జాయపుణ్నే చూస్తున్నట్లు. రానురానూ చీకటి ముసురుకుంటున్నది. ఎవరో మహిళ దైవప్రార్థన చేయడం వినిపించింది. ఆశ్చర్యంగా అటు చూశాడు. ఆ గ్రామదేవత ముందు ఓ వృద్ధ మహిళ పాడుతున్నది.
శివశక్తే నమస్తుభ్యం!!
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున
ర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥
చటుక్కున లేచి చూశాడు. ఆమె ఆ చిన్నగుడి ముందు చీపురుతో ఊడుస్తూ పాడుతున్నది. పూచికపుల్ల లాంటి వడలిన శరీరం. కానీ కంఠం మాత్రం ఖంగున మోగుతున్నది. ఉద్వేగంతో కూడిన శ్రావ్యత.. ఆ గొంతులో చిప్పిల్లుతున్నది. గుడిసెల్లోని స్త్రీలు బయటికి వచ్చి నిలబడ్డారు.. భక్తిగా చేతులు జోడించి.
ఆమె సాయంకాలపు రంగపూజనం నిర్వహిస్తున్నది.
చేతులు వెనక్కి కట్టుకుని వింటూ.. అటుగా నడవసాగాడు. ఊడ్చాక వెంట తెచ్చుకున్న కడవలోని నీళ్లతో కడిగింది. ముగ్గులేసింది. అన్ని సంస్కృత భక్తిగీతాలు. ప్రతిపదానికీ అర్థం తెలిసినట్లు.. మనోధర్మంతో తాదాత్మ్యతతో తడుముకోకుండా పాడుతున్నది. స నుంచి ని వరకు.. అంటే సంగీతం పూర్తిగా తెలిసినవారే.. సాని. ఆమె గుడిసాని కావచ్చు. పాడుతూనే చీర కొంగు నడుంవద్ద దోపి నాట్యానికి సిద్ధమై భంగిమ తీసుకుంది.
అప్పుడెప్పుడో కాకతి ఉదయ భోగాలు నిర్వహిస్తుండగా చూశాడు. ఇప్పుడు.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సంధ్యా భోగం సమర్పిస్తుండగా చూస్తున్నాడు. చూపు ఆ చిన్నగుడిలోని దేవుడిపైకి పోయింది. చిత్రంగా ఆ దైవరూపం చుట్టూ ఏదో వెలుగు.. చిరుకంపన. పిచ్చెక్కిపోయింది జాయపునికి. నిస్సందేహంగా ఆ దేవుడు ఆమె సమర్పణకు స్పందిస్తున్నాడు. పులకిస్తున్నాడు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284