Jaya Senapathi | జరిగిన కథ : నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తితో కంకుభట్టు గురుకులం దగ్గరికి వస్తున్న యువతి.. మువ్వ. ఆమెను కలిసిన జాయపుడు.. తాను అనుమకొండ నుంచి వచ్చిన నాట్యాచార్యుడిననీ, నాట్యం నేర్పిస్తాననీ చెప్పాడు. కంకుభట్టు గురుకులంలోని వాళ్లకంటే గొప్ప నాట్యకారిణిగా తీర్చిదిద్దుతానని చెప్పి, శిక్షణ కూడా మొదలుపెట్టేశాడు. అలా మాసంరోజులు గడిచాయి. ఓ రోజు ఊహించని సంఘటన జరిగింది. శిక్షణ ఇవ్వడానికి జాయపుడు రేవు దగ్గరికి రాగా.. అక్కడ మువ్వ లేదు. అప్పుడే తాటిపొదల చాటునుంచి ముందుకు వచ్చాడు ఆమె భర్త కపిలేశ. వెనకే మరికొందరు కూడా కపిలేశ పక్కకొచ్చారు.
బలప్రదర్శన కాబోలు.. మౌనం గొప్ప బలం కూడా. జాయపుడు ముఖాన కించిత్ భయం తెచ్చి పెట్టుకున్నాడు. “నిన్ను సూసుకుని నాపెళ్లాం నాపక్కలోకి రాడం లేదు. నిన్ను పాతేస్తే అది దారికొస్తది! దానికి సెప్పు. లేపోతే నిన్ను..” అంటూ క్రోధంతో పిడికిళ్లు బిగించి.. గుంజకు కట్టిన దేవుడి విగ్రహాన్ని ఒక్కదెబ్బ వేశాడు. విగ్రహం విరిగి ముక్కచెక్కలవ్వగా.. ఆ గుంజ కదిలి నిలబడింది. అతని మిత్రులంతా వికటాట్టహాసం చేశారు. అర్థమయ్యేలా చెప్పినట్లు సంతోషిస్తూ వెళ్లిపోయింది కపిలేశ బృందం. కారణం.. జాయపుడు ఇప్పుడు శరీరమంతా భయంతో వణికించాడు!
ఈరోజు ఉదయం నుంచి వాతావరణం వినూత్నంగా హడావుడిగా ఉంది. బాగా దట్టంగా పట్టిన నల్లని మబ్బులు ఆకాశంలో ఉరుకులు పరుగులు పెడుతుంటే.. ఉరుములు, మెరుపులు నిరంతరం శబ్దాలు చేస్తుంటే.. ప్రకృతి పిచ్చెక్కినట్లు ఊగిపోతున్నది.
చిన్నచినుకులు మనిషిని తడుపుతుంటే.. పెద్ద చినుకులు మీదికొచ్చి చెళ్లున కొడుతున్నాయి. చలిగాలి నృత్తమాడుతూ కృష్ణానదిని, తూర్పు సముద్రాన్నే కాదు.. దారులపై పోతున్న మనుషుల నెత్తిమీది బుట్టలను, గడ్డిమోపులను సైతం పడవేస్తున్నది. ఎడ్లబళ్లను, గుర్రాలను కూడా కదలనివ్వక చుట్టేసి ఊపివేస్తున్నది. మేకలు, కోళ్లు, కుక్కల అరుపులు పెరిగాయి.
సముద్రతీరపు వాతావరణం తెలియని జాయపుడు.. ఆ బీభత్స వాతావరణంలోనే రోజూ వచ్చే సమయానికే నంగెగడ్డరేవుకు చేరాడు. రేవంతా అల్లకల్లోలంగా ఉంది. రేవు ప్రయాణికులు కళ్లపై చేయిపెట్టి ఆకాశం వంక చూస్తూ.. ‘పడవ ఎక్కాలా.. వద్దా!?’ అన్న సందిగ్ధంలో ఆందోళనగా చర్చించుకుంటున్నారు. ముందే తెలిసినట్లు వాణిజ్య పడవల రేవు అప్పటికే మూసేసి ఉంది.
గుంజవద్ద.. విరిగి పడిఉన్న విగ్రహం ముక్కచెక్కల ముందు ఇసుకగుట్టపై కూర్చుని ఉంది మువ్వ. ఎదురుగా ఇసుకను మరోగుట్ట చేసి దానిపై చిన్న గోపాలుడు.. శిఖిపింఛ మౌళి.. కొత్త దారుశిల్పం నిలబెట్టింది. బుగ్గలపై చేతులుంచుకుని ఆ గోపాలుణ్నే తదేకంగా చూస్తున్నది. జాయపుణ్ని చూడగానే లేచి అతణ్ని నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూసింది కంగారుగా.
“సామీ.. నీకేమీ దెబ్బలు తగల్లేదుగా!”. నవ్వి అన్నాడు..
“మీ ఆయన మంచివాడు”. ఆమె నల్లని ముఖం మ్లానమైంది.
“ఆడు.. ఆడు నన్ను శానా బాధపెడతన్నాడు. నాట్టెం నేర్సుకోవద్దని!”.
“అలా అనలేదే..” చటుక్కున అన్నాడు.
ఏం చెప్పాలో ఆమెకు తెలియడంలేదు. ఎలా అడగాలో జాయపునికి తెలియడంలేదు.
‘పక్కలోకి రావడంలేదు!’ అని ఓ మొగుడు చెప్పడం.. నిజంగా పెద్దసమస్యే అనిపించింది జాయపునికి.
“సరే.. మీరు భార్యాభర్తలు కదా.. ఏమిటి మీమధ్య గొడవ?”. తలవాల్చింది మువ్వ. తర్వాత మెల్లగా అన్నది..
“ఆడికి పిల్లలు కావాల. నాకేమో నా గోపయ్యే సాలు!”.
ఏమిటి ఈమె చెబుతున్నది?! పెళ్లి అయిన స్త్రీ.. భార్య విధులు నిర్వహించకుండా దేవుడే చాలు అనడం.. ఈ మధురభక్తిలో శృంగారభావనలు కూడా మిళితమై తెలిసీతెలియని అలౌకిక ఆనందాంబుధిలో మునిగి తేలుతున్నప్పుడు భర్త, శారీరక శృంగారం లాంటివి తుచ్ఛమైనవిగా భావించడం.. మువ్వ కూడా అలాంటి అలౌకిక స్థితిలో ఉన్నదా!? అందులోనే శృంగారానుభూతులను పొందుతున్నదా?
రానురానూ మబ్బులు దట్టంగా కమ్ముతూ ఏమీ కనిపించడం లేదు. గాలి వేగానికి ఇసుకరేణువులు కళ్లలో పడుతున్నాయి. రాబోయే ముప్పును గుర్తించిన మువ్వ హఠాత్తుగా అన్నది.
“సామీ కదులు.. రేవు పోటు పెరుగుతాంది. ఉప్పెన వచ్చేటట్టుంది. ఉప్పెనొస్తే రేవు మనల్ని మింగేస్తది. పద పద.. దూకు..” అంటూనే, పోయి రేవులో దూకేసింది. జాయపుడు కూడా రేవులోకి పరిగెత్తి చేతులు చాచి ఈత కొట్టసాగాడు. క్షణక్షణానికీ కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తున్నది. వచ్చినప్పుడు మోకాళ్ల లోతున్న రేవు.. ఇప్పుడు మనిషి మొత్తం మునిగేంతగా పెరిగిపోయింది. నీళ్లు సుళ్లు తిరుగుతూ.. వింతగా గర్జిస్తూ.. వేగాతివేగంగా ప్రవహిస్తూ పోతున్నాయి. ఎక్కడో పుట్టిన కృష్ణమ్మ.. ప్రవాహమార్గంలోని రాజ్యాలను అనురాగంతో అన్నపూర్ణగా.. ఆవేశంతో శ్మశానంగా మారుస్తుంటుంది. వర్షకాలంలో ముసురుపట్టినవేళ ఊరూవాడా ఏకంచేస్తూ బీభత్సం సృష్టిస్తుంది. ఇది ప్రతిఏటా ఉండేదే. ఎవరైనా ఆ మహాతల్లి తీవ్రతకు తలవొగ్గాల్సిందే కానీ, ఎదిరించి నిలబడలేరు.
మరోపక్క తూర్పు సముద్రుడు. ఆయన కూడా పర్వతస్థాయి మహానౌకలను అలవోగ్గా తీసుకుపోతాడు. తీసుకువస్తాడు. తిక్కరేగితే వాయుగుండాలు, బడబాగ్నులు, తుఫానులు, సునామీలు.. ఒకటేమిటి బతుకుల్ని వల్లకాడు చేసేస్తాడు. అనుమకొండలో పెరిగిన జాయపునికి.. కృష్ణమ్మ, సముద్రునితో సంగమించే ద్వీపరాజ్యంలోని ప్రకృతి మంచిచెడ్డలు తెలియవు. వరద, ఉప్పెన.. విన్నమాటలే కానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు.
ఈత కంటే మహావేగంతో కృష్ణమ్మ ఇద్దరిని లాక్కుపోతున్నది. లిప్తల కాలంలోనే మువ్వ, జాయపుడు ఎడమైపోయారు. ఇద్దరికి మధ్య కొమ్మలు, చెట్లు.. గడ్డీ గాదం, గేదెలు, దూడలు, ఆవులు, కడవలు, బిందెలు.. సుళ్లు తిరుగుతూ మునిగి – తేలుతూ సాగిపోతున్నాయి.
అదిగదిగో.. ఏదో గుడిసె తేలుతూ పోతున్నది. గుండెలు గుభిల్లుమంటున్నాయి జాయపునికి. ఈత చాతకావడంలేదు. శరీరం అదుపుతప్పి ఎండు చెక్కముక్కలా సుళ్లు తిరుగుతూ పోతున్నది. పైన వర్షం మరింత పెరిగింది. కింద నీటి ఉరవడి తీవ్రస్వరంతో గర్జిస్తూ పెరుగుతున్నది.
చీకటి కూడా భయంతో కళ్లు మూసుకున్నట్లు.. కళ్లున్నా లేనట్లే!కృష్ణమ్మ అడ్డమొచ్చిన వాటినల్లా తనలోకి గుంజుకుంటూ.. ముంచుకుంటూ మహా ఉగ్రంగా పూనకం పట్టినట్లు ఊగిపోతూ.. మహావేగంతో సాగిపోతున్నది. ఆ ఉరవడిని జాయపుడు తట్టుకోలేక పోతున్నాడు. మరికాసేపటికి నియంత్రణ తప్పిన శరీరం ఉరవడిలో గడ్డిపోచలా ఎటు పోతున్నదో తెలియకుండా పోతున్నది. అప్పుడప్పుడూ గుండెలు అదిరే ఉరుములు.. ఆకాశం పగిలినట్లు మెరుపులు.. ఆ మెరుపుల్లో కళ్లముందు నీటిలో పోతూ చేతికి తగిలే పాములు, ఏనుగులు, గుర్రాలు, ఎడ్లు, బళ్లు, చెట్లు, చేమలు.. మానవ కళేబరాలో సజీవాలో తెలియడం లేదు.
మువ్వ.. ముందు ఎటుపోయిందో తెలియదు. అలా పోయిపోయి ఓ పెద్దకొమ్మకు తగిలి ఆగాడు. ఆ కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. దాంతో కాస్త ఆగాడు. మరి జారకుండా ఆ కొమ్మను పట్టుకుని అలాగే ఉన్నాడు. గంట.. రెండు.. మూడు గంటలు. మహావాహిని అలా సాగిపోతూనే ఉన్నది. ఉన్నట్టుండి ఓ పెద్ద మెరుపు. మరి లిప్తకాలం తర్వాత పెద్ద ఉరుము. ఆ మెరుపులో చూశాడు. మరో లిప్తకాలంలో గుర్తించాడు.. దూరంగా ఓ తాడిమట్టను పట్టుకుని ఓ మనిషి.. ఓ ఆడ మనిషి! ఆమెను గుర్తించి పెనుకేక పెట్టాడు.. ఆమె మువ్వ!!
ఆమె ఓ తాడిచెట్టు మట్టలమధ్య వటపత్రశాయిలా కనిపిస్తున్నది. కళ్లు మూసుకుని ఉంది. జాయపునిలో సందేహం నరనరానా పాకింది. ఆమె బతికే ఉందా!?.. పక్కగా సాగిపోతున్న కళేబరాల్లా కళేబరమా!?.. అలా నీటిలో కళ్లు మూసుకుని తాటిమట్టతో పాటు ఊగుతున్నదామె. తన పరిస్థితి కూడా అంతే. వందల ఏనుగులు కలిసికట్టుగా వచ్చినా నియంత్రించగల తను.. ఈ నీటి ఉధృతిలో తన శరీరాన్నే తను నియంత్రించుకోలేక పోతున్నాడు. కానీ, బతికి ఉన్నదో లేదో తెలియని మువ్వ వైపు వెళ్లాలి.. ఆమెను రక్షించాలి.
మహావీరుడైన జాయపుడు స్పృహ కోల్పోలేదు. ధైర్యం వీడలేదు. చురుకు తగ్గలేదు. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయత. ఆ చీకటిలోనే కాస్త కాళ్లు కదిలించాడు. అంతే.. చటుక్కున శరీరం ఆ చెట్టును వదిలివేసింది. జారి మళ్లీ ఏటో కొట్టుకుపోతున్నాడు. ఈసారి శరీరం మరింత వేగంగా.. అంటే పల్లం వైపు.. ఏ లోయలోకో జారిపోతున్నట్లు.. మళ్లీ ఏదో కాళ్లకు తగలడంతో కాస్త నిలబడ్డాడు. ఊపిరి పీల్చుకున్నాడు. కాళ్ల కింద ఏదో గట్టిగా.. నిలబడటానికి దానిని మరింత గట్టిగా తొక్కాడు. అదేదో పెటపెటా విరుగుతున్నది. గుర్తించాడు. అవి ఇంటిపై కప్పిన పెంకులు. కాలి గట్టితనానికి విరుగుతున్నాయి. తనొక ఇంటి పైకప్పుపై నిలబడి ఉన్నానని అప్పుడు గుర్తించాడు.
మీదుగా ఓ పడవ.. ఓ మహావృక్షం.. విరిగిన రెమ్మలు.. ఏవో జంతువులు.. శవాలో.. సజీవాలో.. ఏనుగులు, గుర్రాలు, చిరుత, దుప్పి, ఎలుగుబంటి, కుక్కలో కోళ్లో.. అలా పోతూనే ఉండగా.. కాళ్ల మధ్య ఏదో పాకినట్లు.. పాము.. పాము కాదు కదా అనుకునేటప్పటికి, అదేదో కరచినట్లు.. ఏదో మగత! తర్వాత ఏమీ తెలియదు. మరికాసేపటికి మెలకువ వచ్చింది. తడిసిన కళ్లు మండుతున్నాయి. మువ్వ అక్కడే ఉన్నట్లు ఓ మెరుపు తెలియజెప్పింది.
ఓ ముళ్లకంప పోతూపోతూ అతని పక్కనే ఆగింది. ఆగిన ముళ్లకంప నీటి ఉరవడికి శరీరానికి గుచ్చుకుంటున్నది. ఒళ్లంతా ముళ్లు చేసిన గాయాలతో రక్తం.. పళ్ల బిగువున నొప్పి భరిస్తున్నాడు. అప్పుడొచ్చి ఆగింది కళ్లముందు ఓ చిన్ని కర్రముక్క. చీకటిలోనే తడిమి దానిని అందుకున్నాడు. మెరుపు వెలుగులో గుర్తించాడు.. అది గోపయ్య బొమ్మ. మువ్వ చేతిలో పట్టుకుని ముద్దులతో పూజించుకునే దేవతామూర్తి.
వెయ్యి ఏనుగుల బలమేదో శరీరమంతా జరజరా పాకింది. ఆ బొమ్మను చేతపట్టి నీట్లో గట్టిగా కొట్టాడు. మంత్రించినట్లు అక్కడొక ఏనుగు కళేబరం పైకి తేలింది. లాఘవంగా దాని తొండాన్ని పట్టుకుని పర్వతంలా ఉన్న దాని పొట్ట పైకెక్కాడు. అది మళ్లీ నీటిలో వేగంగా ముందుకు జారింది. బొమ్మను నడబంధంలో దోపి ఏనుగు దంతాలను గట్టిగా పట్టుకున్నాడు. నీటి వేగంతో అది జారిపోతున్నది.
ఏనుగు కళేబరంపై పోతూనే.. ఒక్కసారి నడికట్టులో ఉన్న గోపయ్య బొమ్మను తాకాడు. మరుక్షణం ఆ కళేబరం మరోవైపు తిరిగి ఓ పెద్దచెట్టును తాకింది. ఆ వేగానికి జాయపుని చేతులు పట్టుతప్పి.. ఏనుగు కళేబరాన్ని వదిలేశాయి. అది సర్రున జారిపోగా.. జాయపుడు గబుక్కున ఆ చెట్టును వాటేసుకున్నాడు. పట్టు దొరికింది.
ప్రత్యూష వేళ కాబోలు.. వెలుగురేఖల కాంతి మసగ్గా ప్రపంచాన్ని చూపిస్తున్నది. ఎటు చూసినా నీళ్లే! ఊర్లన్నీ మునిగిపోయి తూర్పుసముద్రం దగ్గరికొచ్చినట్లు కనుచూపుమేరా నీళ్లే.. నీళ్లు! వరద మళ్లీ పెరిగి అతన్ని ముంచెత్తి పైకి లేపగా.. చెట్టుపైకి చేరాడు.
ఊహాతీతం.. మువ్వ అక్కడే ఉంది! జాయపుడిప్పుడు మువ్వ చిక్కుకున్న చెట్టుపైకే చేరాడు. గోపయ్య బొమ్మతీసి ఆమె చేతిలో పెట్టాడు. తన చేయికూడా కలిపి పట్టుకున్నాడు. లేకుంటే ఇద్దరూ జారిపడి కొట్టుకుపోయేవారే. ఆమె ముక్కువద్ద వేలు పెట్టి చూశాడు.
హమ్మయ్య.. ప్రాణాలున్నాయి!! అంతటి విహ్వలతలోనూ చిన్నపాటి సంతసం. ఆమెను ఒడిలోకి మరింతగా పొదవుకున్నాడు. ప్రత్యూషం పలుచగా పైకి పాకుతున్నది. కృష్ణమ్మ ఉగ్రం మెల్లగా తగ్గుతున్నది. బాలభానుడు భయం భయంగా మేఘాలను అడ్డుపెట్టుకుని పైకి వస్తున్నాడు. ఆ తొలిసంజెలో అందమైన కృష్ణాతీరం చూడరానంత అసహ్యంగా.. ఊహించలేనంత బీభత్సంగా ఉంది. కనిపించినంతమేరా చూస్తూ.. కిందికి చూసి మూర్ఛపోయినట్లు కొయ్యబారిపోయాడు జాయపుడు. ఇప్పుడు జాయపుడు, మువ్వ ఉన్నచెట్టు ఆకాశానికి ఎదిగిన తాడిచెట్టు. పిచ్చికేక పెట్టాడు భయంతో వణికిపోతూ. చటుక్కున కదిలింది మువ్వ.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284