Jaya Senapathi | జరిగిన కథ : కంకుభట్టు గురుకులం దగ్గర కనిపించిన ఆ జలకన్య గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు జాయపుడు. ఆరోజు సాయంత్రమే నాట్యారామం దగ్గరికి వెళ్లాడు. లోపలి నాట్యాంశాన్ని ఆసక్తిగా చూస్తున్న ఆ అమ్మాయికి ఏదో సంశయం కలిగి.. ఏట్లోకి దూకేసింది. ఆమె వెనకే నదిలోకి దూకిన జాయపుడు.. అవతలి ఒడ్డుకు చేరి, ఆమెతో మాట్లాడాడు. తనకు నాట్యమంటే చాలా ఇష్టమనీ, నేర్చుకుందామని వెళ్తే.. ఆ పంతులు రావొద్దన్నాడనీ చెప్పిందామె. తనకూ నాట్యం చేయడం వచ్చునంటూ.. గురుకులంలో చూసిన అంశాలన్నీ నర్తించి చూపించింది. దిగ్భ్రమతో కళ్లు చికిలించి చూసిన జాయపుడు.. అక్కడక్కడా తప్పులున్నాయనీ, వాటిని తాను సరిచేస్తాననీ చెప్పాడు.
మువ్వ.. విస్తుబోయింది. తప్పులున్నాయని అన్నందుకు కాదు.. ఆయనే ‘నేర్పుతా! తప్పులు సరిదిద్దుతా!’ అన్నందుకు.
“నాకు నేర్పుతావా.. అసలు నీకు వొచ్చా?” అన్నది.. అనుమానపు సంభ్రమంతో! జవాబివ్వకుండా కదిలి కొన్ని నాట్య భంగిమలు పెట్టి చూపాడు. ఆమె ఆనందంగా బిగ్గరగా నవ్వేసింది.
“సాల్లే.. సాల్లే! అబ్బో.. బాగావచ్చు నీకు..” అన్నది. జాయపుణ్ని నఖశిఖ పర్యంతం చూసింది.
“పిల్లాడివి. సర్వీసెట్టులాగా ఏపుగా ఎదిగావ్. నాట్టెంకూడా బాగా తొక్కుతున్నావ్. సరే సరే!” అంటూ నవ్వుతున్నది.. వెన్నెల్లో పుచ్చపువ్వుల పొద కదిలినట్లు. మాటిమాటికీ కాకతి గుర్తుకొస్తున్నది జాయపునికి. పెద్దగొంతుతో స్పష్టమైన అభిప్రాయ ప్రకటన. మాటలో, చూపులో మొగలిపువ్వు గరుకుదనపు ఆకర్షణ. ఆమె అటూ ఇటూ చూస్తున్నది. ఎవరికోసమో వెతుకుతున్నట్లు గుర్తించి అడిగాడు జాయపుడు..
“ఎవరికోసం..?” అంటూ.
“మా ఆయన. నాకోసం ఎదుకుతా వత్తాడు!”. అప్పుడు చూశాడు. కాస్త బొద్దుగా, నిండుగా.. తనకంటే పెద్దది కావచ్చు. ఆమె వయసు, నాట్యాసక్తి, ఈతలోని చురుకుతనం.. మొత్తంగా నిర్భీకత్వపు స్త్రీమూర్తిమత్వం.
“కాస్త ముందే రావాలి.. ఈపాటికి నాట్టెం నేర్పడం అయిపోవాలి. మా ఆయనొచ్చి లాక్కుపోతాడు..” అన్నివైపులా చూస్తూ, అసహనంగా కదులుతున్నది.
“సరే సరే! నీ పేరు రాధ కదూ?”.
“యేవే.. మువ్వా! యాడ? ఇంకా అవ్వలేదా నీ తైతక్కలు?!”.. పెద్ద గొంతుతో అరుస్తున్నట్లు పిలుస్తూ వస్తున్నాడు.. మొగుడు కావచ్చు.
“ఇన్నవ్ గా.. మువ్వ! నాట్టెం ఆడేటప్పుడు కాలికి కట్టుకుంటారే.. మువ్వ! అది నాపేరు. ఎల్లు..
ఆడు సూత్తె పెద్ద గోల!”. కదిలాడు. రేవులోకి వెళ్తున్నట్లు నడిచి ఆగి.. వెనక్కివెళ్లి ఓ పొదచాటుగా ఉండి చూస్తున్నాడు. బలిష్టుడైన వ్యక్తి. నడుము నుంచి మోకాళ్ల వరకే ఉన్న పంచె. కంచుకంలేని విశాల వక్షం. తల గుడ్డ. భుజాన పలుగు.. దానికి తగిలించిన పార. బహుశా సగరుడు కావచ్చు. కాలువలు, చెరువులు తవ్వి తవ్వి బలిష్టమైన శరీరం.. చీకట్లో కూడా విస్పష్టంగా కనిపిస్తున్న జబ్బలు. ఆమె నడుమును చుట్టి చెయ్యి వేయగా.. ఇద్దరూ సాగిపోయారు మరోవైపు.. ‘హమ్మయ్య.. అన్యోన్య జంట!’ అనుకున్నాడు జాయపుడు.
నీరెండలో.. లంక నీటిలో తేలిన బంగారుముక్కలా మెరుస్తున్నది ఆ మెరక. దానిపై మువ్వ.
ఇవతల ఒడ్డుకు చేరుకున్నాడు జాయపుడు. తనకోసం నిరీక్షిస్తున్న మువ్వ వైపు చేయి ఊపి ఏటిలోకి దిగబోయాడు. ఆమె అరిచినట్లుగా వినిపించి ఆగాడు.
మువ్వ రెండుచేతులూ ఊపుతూ..
‘ఇటు రావద్దు. అదిగో అటు.. అటెళ్లు. ఆడ తోవ ఉంది. అట్నుంచి ఇటు.. ఈవొడ్డుకు రావచ్చు..’
ఆమె చేతులు ఊపుతూ చెప్పిన వివరణ అర్థమైంది. లోతు తక్కువగా ఉన్నచోట నడకమార్గం కోసం మట్టితో మెరకచేసి ఉంది. ఆమె చెప్పినచోట రేవుదాటి అటువైపు వెళ్లాడు. ఇప్పుడు ఏటవాలు వెలుతురులో.. ఇద్దరూ ఎదురెదురుగా. కాసేపు రెప్పవెయ్యకుండా చూసుకున్నారు ఒకరినొకరు.
“సిన్నోడివి.. నాకంటే..” అన్నది మువ్వ.
“అలాగే అనిపిస్తున్నది. నాకంటే పెద్దదానివి. పర్లేదు. నేను గురువుగా.. నువ్వు శిష్యురాలుగా మనజంట బాగానే ఉంటుందిలే..” అన్నాడు. కళాకారుల మాటల్లో వద్దనుకున్నా రసికత చిప్పిల్లుతూనే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు.
“గురువుకు, దేవుడికి వయసుతో సంబంధం లేదు..” అన్నది పెద్ద ఆరిందలా.
హమ్మయ్య.. ‘పిల్లాడివి నువ్వు నాకు నేర్పడం ఏమిటి’ అంటూ, పొమ్మంటుందేమో అనుకున్నాడు. నిలబడే.. కాళ్లతో మట్టిని మోకాలు ఎత్తున పోగుచేసి..
“కూసో.. కూసో!” అన్నది. జాయపుడు ఆశ్చర్యంగా కూర్చునేసరికి మరో మట్టిపోగు సిద్ధంచేసి తనూ కూర్చుంది.
“నాట్టెం యాడ నేర్సుకున్నా? నీ గురువెవ్వడు..?”. అబ్బో.. గురుకుల మర్యాదలు, విధానాలు బాగా పట్టేసిందే!
“నా గురువు గుండయామాత్యులు. మాది అనుమకొండ”.
“వామ్మో.. అనుమకొండ అంటే ఊరంతా నాట్టెంగాళ్లేనని మా అయ్య సెప్పేవోడు. అసలు నీ వొళ్లు సూత్తేనే సెప్పొచ్చు. నువ్వు నాట్టెంగాడివయినా అయ్యుండాలి లేదా పెద్ద యుద్ధం గాడివయినా అయ్యుండాలి!”.
అరెరే.. ఈమెకున్న ఈ చిన్నపరిశీలన పరాశరుడికి, ఇతర సాహిత్యమిత్రులకి లేదు కదా.. నవ్వుతూ లేచి స్థానకం తీసుకుని చేతులు జోడించి..
“ఏదీ.. భంగిమ పెట్టు..” అన్నాడు. ఆమె విడ్డూరంగా చూస్తూ లేచి..
“భంగిమ ఏంటి!? స్థానకం అంటారు. అనుమకొండ నుంచి వచ్చానన్నావ్.. అది కూడా తెలవదా?” అన్నది.
ఈమెకు నాట్యశిక్షణకు సంబంధించిన పదజాలం సర్వం తెలుసురా దేవుడా..
“ఇవన్నీ గురుకులం వెనక నుంచి దొంగచాటుగా చూసి నేర్చుకున్నావా?” అన్నాడు.
“అవును. ఆడు నేర్పకపోతేనేం.. నేనే నేర్సుకుంటన్నా!”.
మువ్వకు ఏదైనా గేయం, సందర్భోచిత పాత్ర, లేదంటే భావప్రధానమైన ఏదైనా అంశం చెప్పి నృత్తం చేయిస్తూ.. ముందు ఆమె ఒంటరిగా చేస్తున్న నాట్యంలోని తప్పొప్పులు సరిచేయాలి. తర్వాత కంకుభట్టు జగన్నాథాలయ ప్రదర్శన అంశం ఏదో తెలుసుకుని దానిలో ఈమెను ప్రావీణ్యురాలిగా చేసి, ఆ బృందంలో కలపాలి. అప్పుడే మరో సందేహం కలిగింది. కంకుభట్టు మువ్వను గుర్తిస్తే..??
మర్నాడు కంకుభట్టు నాట్య గురుకులానికి వెళ్లాడు జాయపుడు. పూరి ప్రదర్శన కోసం ఉధృతంగా అభ్యాసం చేస్తున్నారు నాట్యకారులు. కంకుభట్టు ఆలోచనా విధానాలు.. ఆయన రేచకాలు, ముద్రలు, పిండిబంధాలు, కరణులను పరీక్షగా చూడసాగాడు. గంట గంటన్నర చూశాక కంకుభట్టు అడిగాడు..
“నా నాట్యరూపకల్పన ఎలా ఉంది?” అని. జాయపుని ఆలోచనా ధోరణికి కంకుభట్టు ధోరణికి కొంత వ్యత్యాసం ఉంది కానీ, జాయపుడు చెప్పలేదు. అతనిప్పుడు మువ్వకు కంకుభట్టు తరహాలో శిక్షణనివ్వాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి తను పరిశీలించిన తేడాలు చెప్పలేదు. కరతాళధ్వనులతో అభినందించాడు. కంకుభట్టుతో సహా నాట్యకారులంతా సంతోషించిన సమయంలో అడిగాడు జాయపుడు.
“అనుమకొండలో నా శిష్యురాలొకామె మీ ధోరణిలో నర్తించగలదు. వీలయితే ఆమెను మీ బృందంలో చేర్చుకోగలరా మిత్రమా?!”. క్షణమాలస్యం చేయకుండా అంగీకరించాడు.
“అనుమకొండ నాట్యకారిణి అంటే మాకూ ఆనందమే కదా మిత్రమా! అవశ్యం.. తప్పక. ఆమెను తక్షణమే ఇక్కడికి మా ఆహ్వానంగా రమ్మని చెప్పండి!”.
“సంతోషం..” అని లేచి, అటూఇటూ పైకి చూస్తూ..
“ఆ.. ఆ దొంగ నాట్యకారిణి.. ఆ పైనుంచి చూసే చండాలిక.. మళ్లీమళ్లీ వస్తూనే ఉందా!? ఆమె ఎవరో తెలుసా?” అని అడిగాడు జాయపుడు. అందరూ భళ్లున నవ్వగా..
“అలాంటి వారిని నేను గుర్తుపెట్టుకోవడం ఏమిటి.. ఛఛ..” అన్నాడు భట్టు.
అదే జాయపునికి కావాల్సింది. ఆ తర్వాత కంకుభట్టు సంప్రదాయంలో మువ్వకు శిక్షణ మొదలుపెట్టేశాడు.
“కంకుభట్టు గురుకులంలోని వాళ్లకంటే నిన్ను గొప్ప నాట్యకారిణిగా వాళ్ల ముందు నిలబెడతాను. సరేనా?”.
ఆమెకు మొదట అర్థం కాలేదు. తర్వాత ఎలా స్పందించాలో తెలియనట్లు మూగబోయింది. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ఈ లోకంలో అన్నట్లు చూసింది. కాసేపు మౌనంగా కృష్ణమ్మ గలగలలు విన్నది. అప్పుడు మార్దవంగా మాట్లాడింది.
“నీ పేరేంది?.. ఎందుకు నువ్వు నాకు గురుకులంలో నేర్సుకున్నట్టు నాట్టెం నేర్పతానంటన్నావ్?”.
“నాట్యానికి ఎక్కువ తక్కువలు లేవు మువ్వా.. నువ్వు చాలా తీవ్రంగా నాట్యం కోసం ఆరాటపడుతున్నావు. ఏ కళ అయినా నేర్చుకోవడానికి మొదటి అర్హత కులం, కులీనత కాదు. ఆరాటం, తపన. అందులో తాదాత్మ్యత చెందాలి. అవన్నీ నీలో కనిపించాయి.
ప్రణమ్య శిరసా దేవౌ పితామహ మహేశ్వరౌ
నాట్యశాస్త్రమ్ ప్రవక్ష్యామి బ్రాహ్మణా యదూతాహృతమ్ ॥
(తండ్రికి, నటరాజైన మహేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కరించి.. బ్రహ్మప్రోక్తమైన నాట్యశాస్ర్తాన్ని ప్రవచిస్తాను) అన్నాడు భరతముని. ఆయన చెప్పినట్లే నేను తలగడదీవి కోటలో మహారాజుగారి పిల్లలకు నాట్యం నేర్పుతున్నాను. అలాగే నీకూ నేర్పుతాను. ఈ నాట్యాచార్యుల ప్రతిభ తెలుసు కానీ, వాళ్ల విశ్వాసాలు నాకు తెలియదు. నాకు తెలిసిన నాట్యం నీకు నేర్పితే ఆ దేవుడు పులకిస్తాడు!”. మువ్వ ఉద్వేగంతో కాసేపు దిమ్మెరబోయింది. ఆమెను మామూలు మనిషిని చేయడానికన్నట్లు చెప్పాడు జాయపుడు..
“నా పేరు జగన్నాథుడు..”
“సామీ.. నిన్ను సామీ అని పిలుస్తాను. నన్నాదరించిన దేవుడివి. సామివి..” కాళ్లకు నమస్కరించింది.
వెళ్లి ఆ విష్ణుదేవుని విగ్రహానికి నమస్కరించింది.
“ఇప్పటికి నన్ను కరుణించావా గోపయ్యా! నాకు గురువును ఇచ్చావా! నా నాట్టెం నీకోసవేగా గోపయ్యా..” అంటూ, ఆ విగ్రహం ఎదుట మోకరిల్లి పరిపరివిధాలుగా కొలుస్తున్నది.
ఆమె భక్తురాలు. ఆమెది మధురభక్తా.. ముగ్ధభక్తా??
అది మొదలు జాయపుడు చెప్పినట్లల్లా ఆడసాగింది మువ్వ. నాట్యంలో ప్రాథమిక అంశాలన్నీ నేర్పాడు అనే కంటే.. ఆమెకు తెలుసు అనుకుంటున్నవి అన్ని మళ్లీ మళ్లీ చేయిస్తూ, ఆమె చేసేదాంట్లో తప్పొప్పులు చెబుతూ చేసి చూపెడుతున్నాడు. మువ్వ తనకు తెలిసిన వాటిల్లో తప్పులున్నాయని గుర్తిస్తూ, సవరించుకుంటూ నాట్యాంశాలు అనురక్తితో అభ్యసిస్తున్నది.
మాసంరోజులు గడిచాయి. నాట్యం పట్ల ఏకాగ్రత తగ్గకుండా ఉండేందుకు చాలామంది గురువులు శిష్యులతో వ్యక్తిగత అంశాలు, కబుర్లు, ముచ్చట్లు పెట్టుకోరు. జాయపుడు చాలా ఏకాగ్రతతో శిక్షణ ఇస్తుంటే.. మువ్వకూడా అంతే ఏకాగ్రతతో జాయపుడు చెప్పినవి చెప్పినట్లు ఆచరిస్తూ వ్యక్తిగత సంగతులు ఎప్పుడూ చెప్పలేదు.. అడగలేదు. కానీ, రోజులన్నీ ఒక్కలా ఉండవు. ఓ రోజు ఊహించని సంఘటన జరిగింది.
సాధారణంగా వారి శిక్షణా కార్యక్రమం మూడోజాము దాటి పొద్దు వేడితగ్గే వేళ మొదలై.. చీకట్లు ముసిరేవేళకు ముగుస్తుంది.
ఆరోజు జాయపుడు రేవు మధ్య ఇసుకతిన్నె వద్దకు వచ్చేసరికి అక్కడ మువ్వ లేదు. కానీ ఆ గుంజ.. దానికి కట్టిన విష్ణుదేవుని విగ్రహం ఉంది. జాయపుడు కాస్త ఆశ్చర్యపోయాడు. తల తిప్పి అటూఇటూ చూస్తుండగా తాటిపొదల చాటునుంచి ముందుకు వచ్చాడు ఆమె భర్త. ఇద్దరూ ఎదురెదురుగా.. తీక్షణంగా చూసుకున్నారు. జాయపుని చూపులో ఆశ్చర్యం.. అనుమానం. అతని ముఖంలో తీక్షణత.. క్రూరత్వం! బెదిరించాలని.. భయపెట్టాలన్న భావనలు.
“మువ్వ నా పెళ్లాం. నీతోనేనా అది తైతక్కలు ఆడతంది?”. లిప్తకాలంలో జాయపుని చేయి మెల్లగా నడబంధంలోని చురకత్తి పైకి వెళ్లి తృప్తిగా వెనక్కి వచ్చింది.
“నా పేరు తెలుసా!?”. అడ్డంగా తల ఊపాడు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు.
“అది చెప్పలేదా..?”.
“అవసరం ఏముంది?!!”.
“కపిలేశ నా పేరు. నా వృత్తి తెలుసా!?”. మౌనం గొప్ప ఆభరణం. భర్తృహరి చెప్పాడుగా..
“సగరుణ్ని. రేవులో మట్టి తవ్వడం నా పని! నాలుగు తాళ్ల లోతున తవ్వగలను. నాకు నచ్చకపోతే ఎవడినైనా నాలుగుతాళ్ల లోతున పాతెయ్యగలను!”.
జాయపునికి వినయం ఎక్కువ. విద్యా దదాతి వినయం!
“నిన్ను సూసుకుని నాపెళ్లాం నాపక్కలోకి రాడం లేదు. నిన్ను పాతేస్తే అది దారికొస్తది!”.
పెళ్లాం పక్కలోకి రాకపోతే నాట్యగురువుదా తప్పు?!
అప్పుడే చెట్ల చాటునుంచి మరికొందరు సగరులు కావచ్చు.. కపిలేశ పక్కకొచ్చారు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284